ఎన్టీఆర్ బిగ్ బాస్పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు
టాలీవుడ్ బిగ్ బాస్ పై వివాదాలు మొదలవుతున్నాయి. ఎన్టీఆర్ వ్యాఖ్యాత రూపొందుతున్న ఈ షోలో కంటెస్టెంట్ లకు విధించే శిక్షలు అమానవీయం గా ఉన్నాయంటూ సామాజిక కార్యకర్త అచ్యుతరావు రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బిగ్ బాస్ షోపై తనకు అభ్యంతరాలను తెలియజేస్తూ పిటీషన్ దాఖలు చేశారు.
షోలో పాల్గొంటున్న కంటెస్టెంట్స్ చేస్తున్న పనులు యువతను తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. షోలో బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు ఇస్తున్న టాస్క్‌లపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. శిక్షల పేరుతో నోటికి ప్లాస్టర్లు వేయడం, స్విమ్మింగ్ పూల్‌లో 50 సార్లు మునిగి లేవమనడం, రాత్రి సమయాల్లో గార్డెన్‌లో పడుకోమని ఆదేశించటం, గంటల తరబడి ఉల్లిపాయలు కోయమనటం వంటివి అమానవీయ చర్యలని ఆరోపించారు.
ఈ చర్యలు పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని అచ్యుతరావు వాదిస్తున్నారు. ఈ పిటీషన్ పై మానవ హక్కుల సంఘం స్పందించలేదు. ఒకవేళ పిటీషన్ ను హెచ్చార్సీ విచారణకు తీసుకుంటే బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసలు పంపే అవకాశం ఉంది.