మసాలా గ్యారంటీ | Special story to big boss -2 | Sakshi
Sakshi News home page

మసాలా గ్యారంటీ

Published Tue, Jun 12 2018 12:06 AM | Last Updated on Thu, Jul 18 2019 1:53 PM

 Special story to big boss -2 - Sakshi

పోలికల్లేవు... పోలికలు అవసరం లేదనుకున్నాడు... ఎవరి బాస్‌ వాళ్లేజూనియర్‌ బిగ్‌ బాసయితే నానీ మాస్‌ బాస్‌... కుదిరితే మిడిల్‌ క్లాస్‌ బాస్‌ఇంకొంచెం కుదిరితే వెటకారం టకారం టకారం బాస్‌నానీ సూటేశాడు... నేనే నీ నా..నీ.. అన్నాడు... కనబళ్లా సూటూ సెట్టూఏమీ కనబళ్లా... అంతా నీ.. నా... లాంటి నానీ వాళ్లే... బాబాయ్‌ని మసాలా ఎక్స్‌ట్రా అడిగాడు దిట్టంగా మసాలా దట్టించాడు... మసాలా గ్యారంటీ

‘నా.. నీ... టీవీలో ఏం జరుగుతుందో చూసేద్దామా?’ అంటూ నాని బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ టూలో రంగప్రవేశం చేశాడు. బ్లూ కలర్‌ జీన్స్‌ మీద స్ట్రైప్స్‌ ఉన్న తెల్ల జాకెట్‌తో తెల్ల షూస్‌తో నాని స్టేజ్‌ మీద తన స్టయిల్‌ను ఎస్టాబ్లిష్‌ చేసే ప్రయత్నం చేశాడు. గతంలో ఎన్‌.టి.ఆర్‌ వేసిన ముద్రకు సరితూగేలా తన ముద్రను వేసేందుకు ఎపిసోడ్‌ అంతటా ఉత్సాహంగా కదిలాడు. ఇలాంటి షోస్‌లో హోస్ట్‌ ఫార్మల్‌ సూట్‌ తొడుక్కుంటే హుందాగా ఉండటం ఆనవాయితీ. అయితే నాని ఆ సంప్రదాయాన్ని వదిలి ఇన్‌ఫార్మల్‌ అటైర్‌ను స్వీకరించడంతో కొత్త తరహా హోస్ట్‌ను చూసిన భావన ప్రేక్షకులకు కలిగింది.ఏమైనా అట్టహాసంగా కోలాహాలంగా బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ టూ మొదలైందని చెప్పాలి. ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం 16 మంది కంటెస్టెంట్స్‌తో హౌస్‌ ప్రస్తుతానికి కిటకిటలాడుతుంది. వారం రెండు వారాల్లో ఈ సంఖ్య అతి సులువుగా పన్నెండుకు తగ్గుతుంది. ఎందుకంటే ఒకోవారం ఇద్దర్ని కూడా ఎలిమినేట్‌ చేయొచ్చు కాబట్టి.

ఇంతకీ కంటెస్టెంట్‌లు ఎవరు?
సీజన్‌ వన్‌తో పోల్చితే బిగ్‌బాస్‌ సీజన్‌ టూలో లైమ్‌లైట్‌లో ఉన్న తారలు తక్కువే అని చెప్పాలి. గత సీజన్‌లో ముమైత్‌ ఖాన్, అర్చన, శివ బాలాజీ, ధన్‌రాజ్, సమీర్, కల్పన, ఆదర్శ్, సంపూర్ణేశ్‌బాబు వంటి నోన్‌ పర్సనాల్టీస్‌ ఉన్నాయి. ఈసారి లిస్ట్‌ భిన్నంగా ఉంది. షోను బాగా గొడవలతో వాదనలతో నింపడానికి వీలుగా కంటెస్టెంట్‌ల టెంపర్‌ను అంచనా కట్టి లిస్ట్‌ ఫైనలైజ్‌ చేసినట్టుగా తెలుస్తోంది.
ఈ సీజన్‌ లిస్ట్‌లో ఉన్న పదహారు మందిలో సింగర్‌ గీతా మాధురి, హీరో తనిష్, విలన్‌ అమిత్‌ తివారీల లాగా మిగిలినవారు అందరికీ తెలిసే అవకాశం తక్కువ. కానీ పెర్ఫార్మెన్స్‌ వల్ల సీజన్‌ కంప్లీట్‌ అయ్యే సరికి ఎవరెంత పాపులర్‌ అవుతారో ఎవరు చెప్పగలం. టీవీ 9 యాంకర్‌ దీప్తి, ‘ఐస్‌క్రీమ్‌’ సినిమా ఫేమ్‌ తేజస్వి, యూ ట్యూబ్‌ స్టార్‌ దీప్తి సునైనా, నటుడు సామ్రాట్‌ రెడ్డి, నటుడు కిరీటి దామరాజు, యాంకర్‌ శ్యామలా, ర్యాప్‌ సింగర్‌ రోల్‌ రిడా, బుల్లితెర నటుడు కౌశల్, నటి భాను ఈసారి కంటెస్టెంట్స్‌గా ఉన్నారు. కామెడీ రంగం నుంచి ఒక్కరు కూడా పోటీలో లేకపోవడం కొంచెం నిరుత్సాహ పరిచే సంగతే. కమెడియన్‌ వేణు పేరు వినిపించింది కాని ఎపిసోడ్‌లో కనిపించలేదు.

సామాన్యులు ముగ్గురు
బిగ్‌బాస్‌ హౌస్‌లో ముగ్గురు సామాన్యులకు చోటు దక్కింది. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన గణేశ్, మోడలింగ్‌ నుంచి సంజనా, సామాజిక సేవ నుంచి నూతన్‌ నాయుడు ఈ చిట్టాలో ఉన్నారు. సెలబ్రిటీల మధ్య సామాన్యుల మనుగడ ఒక సవాలుగా ఉంటుంది సాధారణంగా. జట్టు కట్టడం మనిషి స్వభావం కనుక సెలబ్రిటీలు ఒక జట్టుగా మారి ఈ ముగ్గురు సామాన్యులను వేరు పెడితే ఆట ఎలా ఉంటుందనేది చూడాలి. ఆశ్చర్యం ఏమిటంటే తొలి రోజు షోలోనే బిగ్‌ బాస్‌ ఆదేశం ప్రకారం హౌస్‌కు పనికి రాని ఇద్దర్ని హౌస్‌మేట్స్‌ అందరూ కూడబలుక్కుని ఎంచమంటే ఈ సామాన్యుల్లోని ఇద్దరు– సంజనా, నూతన్‌ నాయుడు పేర్లు పైకి వచ్చాయి. ప్రస్తుతం వీరిద్దరిని హౌస్‌లోని జైల్లో వేశారు. సామాన్యులకు చేయాల్సిన మర్యాద ఇదేనా అని గొడవ మొదలవడానికి రంగం సిద్ధమైందన్న మాట.

సైకలాజికల్‌ గేమ్‌కు వీలుందా?
బిగ్‌బాస్‌ సీజన్‌1 పూణెలోని సెట్‌లో జరిగింది. హైదరాబాద్‌ నుంచి దూరంగా తీసుకెళ్లి పూనాలో నిర్మానుష్యమైన చోట సెట్‌లో ఉంచడం వల్ల కంటెస్టెంట్‌ మానసిక స్థితి మీద ప్రభావం ఏర్పడి సంపూర్ణేశ్‌ బాబు, మధుప్రియ వంటి వారు హోమ్‌సిక్‌నెస్‌ను, క్లాస్ట్రోఫోబియాను ఫీల్‌ కావడం హౌస్‌ నుంచి త్వరగా బయటపడటం చూశాం. ఈసారి సెట్‌ హైదరాబాద్‌ నడిబొడ్డున ఉండటం వల్ల మానసికంగా ఒక ధైర్యం కలిగి ఇలాంటి ఎపిసోడ్స్‌ చోటు చేసుకునే అవకాశం తగ్గొచ్చు. అయితే రకరకాల నేప«థ్యాల నుంచి ఒక సమూహాన్ని తెచ్చి ఒకచోట పడేయడం వల్ల వచ్చే చికాకులు, గొడవల డ్రామా చాలానే ఉండొచ్చు. ఈ సీజన్‌ ట్యాగ్‌లైన్‌కు తగినట్టుగా  ‘మసాలా’ చాలానే ఉండే అవకాశం ఉంది.

ఎవరు మిగులుతారు?
బిగ్‌బాస్‌ హౌస్‌లో ఫేక్‌ బిహేవియర్‌కు చోటు లేదు. ఎవరు ఎలా ఉన్నారో ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తించే వారికే బిగ్‌బాస్‌ హౌస్‌లో కొనసాగింపు ఉంటుంది. ట్యాప్‌లో ఎర్రనీళ్లు వస్తున్నాయని బిగ్‌బాస్‌ను బూతులు తిట్టినంత పని చేశాడు శివ బాలాజీ ఒక ఎపిసోడ్‌లో. అదంతా టీవీలో చూపించారు. కాని అతణ్ని షో నుంచి తీసేయలేదు. పైగా విజేతను చేశారు. ఎందుకంటే నీళ్లు ఎర్రగా రావడం నిజం. దానికి కోప్పడటం సహజం. ఇలాంటి సహజ ప్రవర్తనతో పాటు సంయమనం పాటించే ప్రవర్తన ఉన్నవాళ్లు చివరి వరకూ నిలబడతారు. ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్‌లో బుల్లితెర నటుడు కౌశల్, వెండి తెర నటుడు సామ్రాట్‌ రెడ్డి, నటుడు కిరీటి దామరాజు కొంత సంయమనంతో ఎక్కువ ఎపిసోడ్లు ఉంటారనిపించింది. బాబు గోగినేనిని ఈ కుర్రవయసు కంటెస్టెంట్‌లు హెడ్‌మాస్టర్‌గా భావించి తొందరలోనే పంపించే ప్రయత్నం చేయవచ్చు. స్త్రీలలో నటి తేజస్వి, యాంకర్‌ దీప్తికి ఎక్కువ ఎపిసోడ్లు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఉన్నతం నుంచి వికృతం వరకు: బిగ్‌బాస్‌ అంటే కేవలం ఒక గేమ్‌ షో కాదు. అది మనిషి ప్రవర్తనలోని ఉన్నతత్వాన్ని వికృతత్వాన్ని కూడా బయటపడేసే ఒక రంగస్థలం. అనుకూలమైన పరిస్థితుల్లో ఎవరైనా మంచిగానే వ్యవహరిస్తారు. ప్రతికూల పరిస్థితుల్లో ముఖ్యంగా ఒకరిని నిర్మూలించడం వల్లే మనం మనుగడ సాగించగలం అని అనిపించినప్పుడు మనిషి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలిపే షో ఇది. కంటెస్టెంట్‌లు 16 మందే అయినా ప్రేక్షకులందరూ కంటెస్టెంట్‌లే. మనల్ని మనం చూసుకునే షో ఇది.రాబోయే వందరోజులు తెలుగు నాట మంచి కాలక్షేపం ఉంటుందనే ఆశిద్దాం.
 

శ్రీరెడ్డి ఏమైంది?
బిగ్‌బాస్‌ సీజన్‌2లో అందరూ ఎదురు చూసిన పేరు శ్రీరెడ్డి. గత ఆరు నెలలుగా ఆమె ఏస్థాయిలో వార్తల్లో నిలిచారో అందరికీ తెలిసిందే. బిగ్‌బాస్‌ హౌస్‌ సాధారణంగా ఇలాంటి న్యూస్‌మేకర్స్‌ను హౌస్‌మేట్స్‌గా తీసుకుంటూ ఉంటుంది. అయితే శ్రీరెడ్డి చివరి వరకూ లిస్ట్‌లో ఉన్నా ‘కొన్ని సాంకేతిక కారణాల’ వల్ల ఆమె హౌస్‌కు రాలేదని వార్తలు వినపడుతున్నాయి.

ప్రతిదానికీ ఓ లిమిట్‌ ఉంటుంది    – నాని
‘‘బిగ్‌బాస్‌ 2’లో నేను కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్‌ చేస్తే షో నుంచి తప్పుకుంటానని బిగ్‌బాస్‌ టీమ్‌ని నాని బెదిరించారు’’ అని శ్రీరెడ్డి ఆరోపించారు. అంతే కాకుండా ‘నాని నాకు అవకాశాలు ఇప్పిస్తానంటూ మోసం చేశాడు’  అని కూడా ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు శ్రీరెడ్డి.  ఈ ఆరోపణలకు హీరో నాని లీగల్‌గా సమాధానం చెప్పదలిచారు. ‘‘ఈ విషయాలపై స్పందించి ఆ రొంపిలోకి నేను వెళ్లను. ఎవరిని పడితే వాళ్లను సాఫ్ట్‌ టార్గెట్‌ చేస్తూ నిజం లేని నాన్‌సెన్స్‌ అంతా స్ప్రెడ్‌ చేయడం నన్ను డిస్ట్రబ్‌ చేసింది. లైక్స్‌ కోసం షేర్స్‌ కోసం ప్రతీ విషయాన్ని రాసేవాళ్లకు కుటుంబాలున్నాయి. సిగ్గు తెచ్చుకోండి. ఇంకోసారి ఈ విషయం మీద స్పందించదలచుకోలేదు. ప్రతిదానికి ఒక లిమిట్‌ ఉంటుంది’’ అని ట్వీట్టర్‌లో రియాక్ట్‌ అయ్యారు నాని. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement