పెళ్లాం ఎలా వండినా నడుస్తది.కంచంలో ఏది పడేసినా జారిపోద్ది.నెయ్యి వేస్కోవాల్సింది పోయిమంచినీళ్లు పోస్కోవచ్చు!పప్పు గరిటెను పెరుగ్గిన్నెలో వెయ్యొచ్చు. పిల్లాడికి పెట్టే ముద్ద.. వాడి ముక్కుకి
అంటించవచ్చు!ఏం చేసినా చెల్లుద్ది. యాక్చువల్లీ ఏం చెయ్యకపోయినా చెల్లుద్ది.జూన్ 10 నుంచి టీవీలో ఎక్స్‌ట్రా మసాలా ఉన్నప్పుడు ఏమైనా మింగేయొచ్చు.
‘‘ఇది వరకు సినిమా వేరు. టీవీ వేరు అని చూసేవారు. ఇప్పుడు ఆ గీతలు చెరిగిపోయాయి. అన్ని మీడియా ప్లాట్‌ఫామ్స్ అంతిమ ఉద్దేశం ప్రేక్షకులకు రీచ్ కావడమే. చిరంజీవిగారు, నాగార్జున గారు టీవీ షోలు చేశారు. దీంతో మనకు ఉన్న చిన్న చిన్న భయాలు తొలిగిపోయాయి. మనం కూడా చేయవచ్చు అనే ధైర్యం వచ్చింది. బిగ్ బాస్ హోస్ట్‌గా చేయడం స్టేటస్‌గా కాదు.. బాధ్యతగా ఫీల్ అవుతున్నాను. బిగ్ బాస్ హోస్ట్‌గా చేయడాన్ని చాలెంజింగ్‌గా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ సీజన్‌లా ముంబైలో కాకుండా బిగ్ బాస్ హౌస్ హైదరాబాద్‌లో ఉండటం నాకు కంఫర్టే. మూడు సినిమాలు చేస్తున్నాను. అటు సినిమాలు ఇటు షో చేసుకోవచ్చు (నవ్వుతూ). అలాగే మా అబ్బాయి జున్నూతో కూడా ఆడుకోవచ్చు. హోస్ట్‌గా అమితాబ్‌గారు నా ఫేవరెట్. బిగ్ బాస్ షో హోస్ట్‌గా ఎన్టీఆర్, సల్మాన్ ఇలా ఎవ్వర్నీ ఫాలో అవ్వను. నాకు అర్థం అయ్యిందేదో నేను కాన్ఫిడెంట్‌గా చేసుకుంటూ వెళ్తాను. ప్రోమోలో నేను చెప్పిన మసాలా ఏంటో షోలో చూపిస్తాం’’ అన్నారు హీరో నాని. తెలుగు బిగ్‌బాస్ షోకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది. ఫస్ట్ సీజన్ హోస్ట్‌గా ఎన్టీఆర్ అదరగొట్టారు. ఇప్పుడు సెకండ్ సీజన్ హోస్ట్‌గా నానీ రెడీగా ఉన్నారు. పదహారు మంది పార్టిస్పెంట్స్‌తో 106 రోజుల పాటు 70 కెమెరాలతో ఈ నెల 10 నుంచి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి బిగ్ బాస్ హౌస్ సిద్ధంగా ఉంది. షో వివరాలను తెలియజేయడానికి నిర్వాహకులు హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ– ‘‘నిజం చెప్తున్నాను. నేను బిగ్ బాస్ షో చూడలేదు. ఇంతకుముందు మా ఇంట్లోవాళ్లు.. చూస్తున్నప్పుడు ఈ షో చూస్తున్నారా? అనేవాణ్ణి. ఇప్పుడు నేనే హోస్ట్‌గా చేయనుండటం న్యూ ఎక్స్‌పీరియన్స్.
హోస్ట్‌గా చేయడానికి నిర్వాహకులు నన్ను అప్రోచ్ అయినప్పుడు.. వెంటనే షో ఇన్‌ఫర్మేషన్ తెలుసుకోవడానికి ట్రై చేశాను. ‘బిగ్ బాస్ షో చూడలేదా?’ అని నా ఫ్రెండ్స్ అందరూ అన్నప్పుడు షాకయ్యాను. షో ఎంత పాపులరో నాకు అర్థం అయ్యింది. నేను ఎక్కడికి వెళ్లినా.. ఫస్ట్ సీజన్‌లో తారక్ (ఎన్టీఆర్) బాగా చేశాడు. నానీ ఎలా చేస్తాడో అని చర్చించుకుంటున్నారు. నాకూ క్లారిటీ లేదు. కొత్త ఎక్స్‌పీరియన్స్. ప్రేక్షకులతో పాటు నేను కూడా జూన్ 10 నుంచే తెలుసుకుంటాను. ఇది వరకు నేను ఎక్కడికి వెళ్లినా ‘నానీ.. నువ్వు మా ఇంట్లో అబ్బాయిలా ఉంటావ్ అనేవారు’. ఇప్పుడు మూడున్నర నెలలు మీ ఇంట్లోనే బిగ్ బాస్ çహోస్ట్‌గా మీతో పాటు కలిసి ఉండబోతున్నాను. ప్రేక్షకులతో కనెక్ట్ అవ్వడానికి ఇంతకన్నా మంచి అవకాశం ఉండదనిపించింది. ఏడాదికి ఎన్ని సినిమాలు చేసినా నా దాహం తీరడం లేదు. బిగ్ బాస్‌తో తీరుతుంది అనుకుంటున్నాను. నేను షో చేయగలనా అని డౌట్ వచ్చిన ప్రతిసారి బిగ్ బాస్ టీమ్‌కు ఉన్న క్లారిటీ చూసి, నాకు ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. ఫస్ట్ సీజన్‌లాగే ప్రేక్షకుల సపోర్ట్ ఈ సీజన్‌కు కూడా లభిస్తుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ఇంకా నాని మాట్లాడుతూ– ‘‘బిగ్ బాస్ 2’ హోస్ట్‌గా నన్ను అప్రోచ్ అయినప్పుడు షోకు ‘నేనే ఎందుకు?’ అనే డౌట్ వచ్చింది. ఇనీషియల్‌గా అల్లు అరవింద్‌గారి నుంచి నాకు కాల్ వచ్చింది. ‘నువ్వే చేయాలి.. నువ్వే చేయగలవు’ అని చెప్పారు. ఆయన అంత స్ట్రాంగ్‌గా చెప్పినప్పుడు.. ఈ షో ద్వారా ప్రేక్షకులతో నా బంధం మరింత బలపడుతుంది అనిపించింది’’ అంటున్న నానీతో ‘ఈ షో వల్ల మీ ఇమేజ్ పెరుగుతుందని నమ్ముతున్నారా?’ అనడిగితే– ‘‘రిజల్ట్ చూసి ఎప్పుడూ సినిమాలు చేయలేదు. షోలు కూడా అంతే. కేవలం మనం నమ్మాం. దిగాం. 100 పర్సెంట్ బెస్ట్ ఇచ్చాం. ఒకవేళ నెక్ట్స్ సీజన్‌కి వేరెవరైనా హోస్ట్‌గా చేస్తే బిగ్ బాస్ సెకండ్ సీజన్‌లో నానీ కూడా బాగా చేసి, ఓ బెంచ్‌మార్క్ సెట్ చేశాడని ప్రేక్షకులు అనుకుంటే హ్యాపీ. నా లైఫ్‌లో ప్రేక్షకులే బిగ్ బాస్’’ అన్నారు.
‘‘గతేడాది బిగ్‌బాస్ షోకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పుడు సెకండ్ సీజన్‌ను మరింత లాంగ్‌గా 106 రోజులు రన్ చేయనుండటం సంతోషంగా ఉంది’’ అని ‘స్టార్ మా’ బిజినెస్ హెడ్ అలోక్ జైన్ అన్నారు. సెకండ్ సీజన్‌కి ఎన్టీఆర్ ఎందుకు హోస్ట్‌గా చేయలేదని అలోక్‌ని అడిగితే – ‘‘ఎన్టీఆర్‌కి డేట్స్ ఇష్యూ వచ్చింది. హోస్ట్‌గా చేయడా నికి అంగీకరించిన నానీకి థ్యాంక్స్. ఆయన ఎక్స్‌ట్రీమ్‌లీ టాలెంటెడ్. ఇందులో టీమ్ వర్క్ ఉంది. అభిషేక్, అన్నపూర్ణ స్టూడియోస్ సుప్రియ బాగా హెల్ప్ చేశారు. సామాన్యులు సెలబ్రిటీలుగా మారే చాన్స్ ఉంది’’ అన్నారు. రాజీవ్ దుబె, నిధి జోష్, అరుణ్ గోబ్స్, చేతన్ చౌహాన్, శరత్ కత్తి పాల్గొన్నారు.
ఆ ఒక్కటీ అడగొద్దు!
బిగ్ బాస్ హౌస్‌మెట్‌గా చాన్స్ దక్కాలని చాలామంది కోరుకుంటారు. కానీ ఆ లక్ కొందరికే దక్కుతుంది. ఈ సెకండ్ సీజన్ హౌస్‌మెట్స్‌ను నిర్వాహకులు ఇలా సార్టౌట్ చేశారు. ముందుగా 125 మంది సెలబ్రిటీలను తీసుకున్నారు. అనేక చర్చల అనంతరం 25 మందిని ఎంపిక చేశారు. వీరిలో నుంచి 12–14 మందిని బిగ్ బాస్ హౌస్‌మెట్స్‌గా సెలక్ట్ చేస్తారు. అంతేకాదు.. సెలకై్టనవారికి కూడా సరిగ్గా షో స్టార్ట్ అయ్యే ఒకట్రెండు రోజుల ముందు మాత్రమే విషయం చెబుతారట. మరి.. వారెవరు అంటే ‘ఆ ఒక్కటీ అడగొద్దు’... జూన్ 10న షో టైమ్‌లో తెలుసుకోండి అంటున్నారు నిర్వాహకులు.
లిస్ట్‌లో ముగ్గురు ఓకే
‘బిగ్ బాస్ 2’లో పాల్గొనేవారి లిస్ట్ ఇదే అంటూ... కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. అవి నిజమా? లేక కేవలం ఊహారాయుళ్ల ఊహా అంటే జూన్ 10 వరకూ వెయిట్ చేయాల్సిందే. నటీనటులు రాశీ, గజాల, చాందినీ చౌదరి, శ్రీ రెడ్డి, ధన్యా బాలకృష్ణ, తరుణ్, ఆర్యన్ రాజేశ్, వరుణ్ సందేశ్, తనీష్, వైవా హర్ష, వేణు, గాయని గీతా మాధురి... ఇలా కొందరు పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్లు కన్ఫార్మ్ అంటూ సోషల్ మీడియాలో ఫొటోలు చెక్కర్లు కొడుతున్నాయి. ఇది ‘ఫేక్ లిస్ట్’ అని చాలామంది ఫిక్స్ అయ్యారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ లిస్ట్‌లో కనీసం ముగ్గురు బిగ్ బాస్ హౌస్‌లో దర్శనమిస్తారట. ఆ ముగ్గురూ ఎవరు అనేది తెలియడానికి ఇంకా ఎన్నాళ్లో లేదు. ఆదివారం అసలు విషయం తెలిసిపోతుంది.
నో సూట్: ప్రశాంతి
ఫస్ట్ సీజన్‌లో ఎన్టీఆర్ ఎక్కువ శాతం సూట్‌లోనే కనిపించిన విషయం తెలిసిందే. కానీ నాని అందుకు భిన్నంగా సెమీ ఫార్మల్స్‌లోనే ఎక్కువ శాతం ఎపిసోడ్స్‌ని హోస్ట్ చేయనున్నారట.
నాని పర్సనాలిటికీ సరిపడేలా డ్రెస్‌లు డిజైన్ చేశాం అంటున్నారు కాస్ట్యూమ్ డిజైనర్ ప్రశాంతి. కాస్ట్యూమ్స్ గురించి ఆమె ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ డిటైల్స్‌లోకి వస్తే..నాని కాస్ట్యూమ్స్‌కి కావల్సిన ఫ్యాబ్రిక్స్ అన్నీ హైదరాబాద్‌లోనే కొన్నాం. ఈ షో కోసం తను వాడబోయే డ్రెస్సుల్లో దాదాపు 80–90% వరకు అన్నీ కుట్టించిన బట్టలే ఉంటాయి. మిగతావి రెడీమేడ్ డ్రెస్సులు కొన్నాం. ‘బిగ్ బాస్ 2’ సీజన్ సుమారు 2–3 నెలలు సాగుతుంది. రానున్న రోజుల్లో కొన్ని పండుగలు కూడా రాబోతున్నాయి. ఆ పండుగలప్పుడు నాని ట్రెడిషనల్ గెటప్స్‌లో కనిపిస్తారు. పండుగ కాస్ట్యూమ్స్ సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటాయి.నాని వాడే డ్రెస్సులను ఎక్కువగా ‘లెనిన్’, ‘ఖాదీ’ ఫ్యాబ్రిక్స్‌తో డిజైన్ చేస్తున్నాం. సెమీ ఫార్మల్ సూట్‌లో ఎక్కుగా కనిపిస్తారు. లెదర్ జాకెట్స్, క్యాజువల్ జాకెట్స్ వాడాం. జస్ట్ కామన్ మ్యాన్‌లా కనిపిస్తారు. ఒక్కో ఎపిసోడ్‌కి నాని వేసుకోబోయే కాస్ట్యూమ్ ధర 30 నుంచి 50 వేల రూపాయలు ఉంటుంది. సల్మాన్ ఖాన్, ఎన్టీఆర్, ఇతర భాషల్లో వేరే హీరోలు చేసిన ‘బిగ్ బాస్’ షోస్ చూశా. అందరూ దాదాపు ఒకే లుక్ మెయింటేన్ చేశారు. కానీ ఈసారి మొత్తం మార్చేద్దాం అనుకున్నాం. ‘నాకు అదే చిన్న చాలెంజ్’. నానీని కొత్తగా ఎలా ప్రజెంట్ చేస్తాం అన్నది చాలెంజ్. ప్రతీ ఎపిసోడ్‌కు వారం ముందే కాస్ట్యూమ్స్ ఫైనలైజ్ చేస్తాం. నాని ప్రస్తుతం చేస్తున్న మూవీ లుక్ డిస్ట్రబ్ కాకుండా హెయిర్‌స్టైల్ డిజైన్ చేయడం కూడా కొంచెం చాలెంజ్‌గా అనిపిస్తోంది.
ఓపెనింగ్ డే స్పెషల్
బిగ్ బాస్ సీజన్ 2 స్టార్టింగ్ ఎపిసోడ్ స్పెషల్‌గా ఉండబోతోంది. తన సినిమాల్లోని కొన్ని హిట్ నంబర్స్‌కి డ్యాన్స్‌తో నాని ఎంట్రీ అదిరిపోతుందట. ప్రస్తుతం దానికి సంబంధించిన రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఈ స్పెషల్ డ్యాన్స్ నంబర్‌తో పాటు వందరోజుల పాటు హౌస్‌లో ఉండబోయే కంటెస్టెంట్స్ అందరినీ నాని ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ చేస్తారన్న సంగతి తెలిసిందే. ‘పక్కింటి అబ్బాయిగా కాదు.. మీ ఇంటి అబ్బాయిగా వచ్చా’ అని నాని షోను స్టార్ట్ చేస్తారని సమాచారం.
‘మహానటి’ ఆడియో ఫంక్షన్‌లో తారక్ (ఎన్టీఆర్)ని కలిశాను. ఆ తర్వాత తారక్ ఇంటికి వెళ్లాను. కాసేపు మాట్లాడుకున్నాం. సినిమాలో ఎలాగూ నటిస్తూ ఉంటాం. షోలో, స్టేజ్ మీద మనం మనలా ఉంటే చాలు అని మాట్లాడుకున్నాం. టిప్స్ అస్సలు ఫాలో అవ్వొద్దన్నది కూడా మా డిస్కషన్‌లో వచ్చిన మరో పాయింట్. తారక్‌కు ప్రామిస్ చేశాను. బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ అన్ని ఎపిసోడ్‌లు చూస్తానని. బిగ్ బాస్ షోలో పార్టిస్పెంట్స్‌కు తారక్ చికెన్ చేశాడు. నాకు ఆమ్లెట్ వేయడం కూడా రాదు. నాకు వంటలు రావు. ఏదో టాలెంట్‌తో రీప్లేస్ చేస్తా.
రెండున్నర నెలలు... మూడు కోట్లు
‘బిగ్ బాస్’ సీజన్ వన్ హౌస్ సెట్‌ను ముంబైలో వేశారు. ఇప్పుడు సెకండ్ సీజన్ కోసం హైదరాబాద్‌లోనే బిగ్ బాస్ హౌస్ సెట్‌ను వేశారు. ఈ సెట్ కోసం దాదాపు మూడు కోట్లు ఖర్చు చేశారు. రెండున్నర నెలల టైమ్ పట్టింది కన్‌స్ట్రక్షన్ కోసం. దాదాపు మూడు వందలమంది కష్టపడ్డారు హౌస్ అవుట్‌పుట్ రావడానికి. ఆర్ట్ డైరెక్టర్ ఒమంగ్ కుమార్ నేతృత్వంలో సెట్ వర్క్ జరిగింది. ఒమంగ్ ఓన్లీ తెలుగుకే అనుకుంటే పొరపాటే. మలయాళం, బెంగాలీ, హిందీ బిగ్ బాస్‌ల ఇళ్ల డిజైనర్ కూడా ఈయనే. విశేషం ఏంటంటే... ఆర్ట్ డైరెక్టర్‌గా పలు హిందీ చిత్రాలకు పని చేసిన ఒమంగ్ ‘మేరీ కామ్’ చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు. ఆ తర్వాత ‘సరబ్‌జిత్’, ‘భూమి’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు ఒమంగ్.
అందుకే కామన్ మ్యాన్
ఫస్ట్ సీజన్ మొత్తం సెలబ్రిటీలతో నిండిపోయిన బిగ్ బాస్ హౌస్ ఈసారి కామన్ మ్యాన్‌ని కూడా ఆహ్వానించింది. సెకండ్ సీజన్ నాని హోస్ట్ చేయడానికి రెడీ అయ్యాక ఈ కామన్ మ్యాన్ ఐడియా తెరమీదకొచ్చిందట. నాని కామన్‌మ్యాన్ నుంచి స్టార్‌గా ఎదిగారు కాబట్టి, హౌస్‌లో కామన్ మ్యాన్ కూడా ఉంటే బావుండు అని కామన్ పీపుల్‌కి కూడా చోటు కల్పించింది బిగ్ బాస్ టీమ్. ఆల్రెడీ వచ్చిన వేల అప్లికేషన్స్‌ను జల్లెడ పట్టి 15 మందిని ఎంపిక చేశారు. వారిలో ముగ్గురు లేక నలుగురు మెంబర్స్‌ను బిగ్ బాస్ హౌస్‌కు పంపుతారట. వారు బిగ్ బాస్ హౌస్‌లో సెలబ్రిటీలతో కలిసి హౌస్‌మెట్స్‌గా ఉంటారు. మరి ఆ లక్కీ పార్టిస్పెంట్స్ ఎవరు అనేది జూన్ 10న.. అదేనండీ.. బిగ్ బాస్ ఓపెనింగ్ రోజు తెలుస్తుంది. సో.. కామన్ పీపుల్ వెర్సస్ సెలబ్రిటీస్... బిగ్ బాస్ సందడి ఓ లెవల్లో ఉంటుందని ఊహించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment