నానీ.. ఇక కానీ! | Hero nani big boss special story | Sakshi
Sakshi News home page

నానీ.. ఇక కానీ!

Published Sat, May 19 2018 12:19 AM | Last Updated on Thu, Jul 18 2019 1:53 PM

Hero nani big boss special story  - Sakshi

వీడేమో లోకల్‌. అదేమో బిగ్‌బాస్‌! సీజన్‌ 1లో జూ‘‘ ఎన్టీఆర్‌ కాక పుట్టించిమగాడు అనిపించుకున్నాడు. మరి సీజన్‌ 2 లో.. ‘భలే భలే మగాడివోయ్‌’ అనిపించుకుంటాడా నానీ?! మైడియర్‌ నానీ.. ఇక నువ్‌ కానీ!!

ఏడాదికి మూడే సీజన్లు. ఎండ, వాన, చలి. ఏడాది కిందట తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా నాలుగో సీజన్‌ మొదలైంది! బిగ్‌బాస్‌ సీజన్‌ అది. మనకు అలవాటు లేని సీజన్‌. బ్రిటన్‌ నుంచి బాలీవుడ్‌కి, బాలీవుడ్‌ నుంచి సౌత్‌కి రుతు పవనంలా వ్యాపించింది.   కొత్త రుతువు! తుమ్ములొస్తాయేమో, దగ్గులొస్తాయేమో అనుకున్నారు. అవేం రాలేదు. జూనియర్‌ ఎన్టీఆర్‌ వచ్చాడు. నవ్వించాడు. కవ్వించాడు. కన్నీళ్లు తెప్పించాడు. స్మార్ట్‌ఫోన్‌లు పట్టుకుని ఎవరి గదుల్లో వాళ్లున్న కుటుంబ సభ్యులందర్నీ బయటికి రప్పించి హాల్లో టీవీ ముందు కూర్చోబెట్టాడు.  రాత్రయ్యేసరికి రోజూ ఉరుములతో కూడిన జల్లులే. ఉరుములు హౌస్‌మేట్‌ల ఉద్వేగాలు. జల్లులు షో హోస్ట్‌ సెటైర్‌ల గిలిగింతలు. డెబ్బయ్‌ రోజులపాటు డెయిలీ అడిక్షన్‌. ఒకరోజు లేవలేక వాకింగ్‌ మానేశామేమో. ఒకరోజు మర్చిపోయి మందులు వేసుకోలేదేమో. ఒకరోజు బద్దకించి ఆఫీస్‌కి లేట్‌గా వెళ్లామేమో. ఏరోజూ బిగ్‌బాస్‌ను మిస్‌ కాలేదు. అది టీవీలో వస్తున్న ‘షో’ కాదు. మనింట్లోని జీవన్నాటకం. కోపాలు, ఆవేశాలు, అపార్థాలు, అనుమానాలు, అవమానాలు, ప్రేమలు, స్నేహ పరిమళాలు, ఆత్మీయతలు, ఆలింగనాలు.. అన్నిటినీ బ్యాలెన్స్‌ చేస్తూ ఓ సూత్రధారి.. బిగ్‌బాస్‌. జూనియర్‌ ఎన్టీఆర్‌. హౌస్‌ని ఆయన బ్యాలెన్స్‌ మాత్రమే చేయలేదు. టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి చేశాడు. మటన్‌ బిర్యానీ వండిపెట్టాడు. 

తిరుగులేని పెర్ఫార్మెన్స్‌
తెలుగు బిగ్‌బాస్‌కి జూనియర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌ అనగానే ‘అంతలా చేయగలడా?’ అనే డౌట్‌ కొట్టింది. ‘అంతలా’ అంటే.. అమితాబ్‌ బచ్చన్‌ అంత. సల్మాన్‌ఖాన్‌ అంత. సంజయ్‌దత్‌ అంత! హిందీ బిగ్‌బాస్‌లో వీళ్లంతా హోస్ట్‌లు. పదేళ్లుగా హిందీ బిగ్‌బాస్‌ నడుస్తోంది. తెలుగు బిగ్‌బాగ్‌ కొత్తగా వస్తోంది. వాళ్లంత ఈజ్‌తో ఎన్టీఆర్‌ చెయ్యగలడా? చేశాడు. ఈజీగా చేశాడు. స్క్రిప్టులేని డైలాగులతో అక్కడికక్కడే వన్‌మ్యాన్‌ ఫెర్ఫార్మెన్స్‌ని డెలివరీ చేశాడు. ‘పెర్ఫార్మెన్స్‌’ అంటే ప్రదర్శన అవుతుంది. ఎన్టీఆర్‌ది ప్రదర్శన కాదు. పరకాయ ప్రవేశంలా సందర్భ ప్రవేశం. ఎక్కడ ఏ డైలాగ్‌ పడాలో అతడికే తెలీదు. కానీ పడుతుంది. ఎక్కడ ఏ పంచ్‌ ఇవ్వాలో అతడేం ఆలోచించి పెట్టుకోడు. కానీ ఇస్తాడు. బిగ్‌బాస్‌ హోస్ట్‌గా ‘గ్రేట్‌ సక్సెస్‌’ జూనియర్‌ ఎన్టీఆర్‌ది. 

‘బాస్‌’గా బాలకుమారుడు
మళ్లీ సీజన్‌ మొదలౌతోంది. అయితే హోస్ట్‌గా ఎన్టీఆర్‌ రావడం లేదు. తెలిసిందే. ఆయన ప్లేస్‌లో నానీ వస్తున్నాడు. ఇదీ తెలిసిందే! (ఫస్ట్‌ చెప్పింది ‘సాక్షి’నే). మరి తెలియందేమిటి? నానీ ఎన్టీఆర్‌లా బిగ్‌హౌస్‌ని తన గ్రిప్‌లోకి తీసుకోగలడా? గంభీరమైన గొంతుతో ఆదేశాలు జారీ చెయ్యగలడా? తీర్పులు ఇవ్వగలడా? ఇంటింటినీ అలరించగలడా? అంత  ‘స్పాంటేనియటీ’ నానీకి ఉందా? 
ఇప్పటి వరకు నానీ సినిమాలన్నీ హిట్‌లే. అంతమాత్రాన రియాల్టీ షోలో హిట్‌ కొడతాడా? సినిమాల్లో డైరెక్టర్‌ ఉంటాడు. యాక్షన్‌ చెబుతాడు. ఇక్కడ కంటెస్టెంట్‌లు, హోస్ట్‌ ఎవరికి వారే డైరెక్టర్‌. హౌన్‌ను అదుపుచేసి, దారిలో పెట్టగల స్థితప్రజ్ఞత, ప్రాప్తకాలజ్ఞత నానీకి ఉన్నాయా? హౌస్‌మేట్‌ల మధ్య గొడవలుంటాయి, పితూరీలు ఉంటాయి, కొట్లాటలు, కుమ్ములాటలు, ముఠాలు ఉంటాయి. వాటన్నిటిని నానీ అనే ఈ బాల కుమారుడు పెదరాయుడిలా చక్కబెట్టగలడా?! ‘నేచురల్‌ స్టార్‌’ అని పేరున్నంత మాత్రాన నేచురల్‌గా హౌస్‌ని డీల్‌ చెయ్యగలడా? జూన్‌ రెండో వారంలో నానీ బిగ్‌బాస్‌గా సీజన్‌ 2లోకి ఎంటర్‌ అవుతున్నాడు. నానీ నిలబడతాడా? తడబడతాడా? 

మెయిన్‌ ప్లస్‌ పాయింట్‌
‘సిరివెన్నెల’ సినిమాతో సీతారామశాస్త్రి.. సిరివెన్నెల సీతారామశాస్త్రి అయ్యారు. ‘శుభలేఖ’ సినిమాతో సుధాకర్‌.. శుభలేఖ సుధాకర్‌ అయ్యారు. గంటా నవీవ్‌బాబు ‘నానీ’ అవడానికి అతడి మూవీ లిస్ట్‌లో ‘నానీ’ అనే సినిమా లేదు. నవీన్‌బాబుకి ముద్దు పేరు నానీ. పక్కా లోకల్‌. చెప్పుకున్నాడు కూడా ఓ సినిమాలో ‘నేను లోకల్‌’ అని. ‘ఈగ’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ టైమ్‌లోనే 2012లో వైజాగ్‌ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ‘నిన్ను కోరి’, ‘ఎం.సి.ఎ’ టైమ్‌కి తండ్రి కూడా అయ్యాడు. నానీలోని స్పెషాలిటీ ఇదే. కెరియర్‌ని, గృహస్థు జీవితాన్ని సమంగా, సమాంతరంగా లాగిస్తున్నాడు. బిగ్‌బాస్‌గా రాణించడానికి మెయిన్‌ ప్లస్‌ పాయింట్‌ ఇది. స్ట్రయికింగ్‌ ఎ బ్యాలెన్స్‌! 

పదేళ్లు... ఇరవై సినిమాలు
సరిగ్గా పదేళ్ల క్రితం రొమాంటిక్‌ కామెడీ ‘అష్టాచమ్మా’తో సీన్‌లోకొచ్చాడు నానీ. తర్వాత.. గ్యాప్‌ లేకుండా (ఒక్క 2013 మినహా) రైడ్, స్నేహితుడా, భీమిలీ కబడ్డీ జట్టు, అలా మొదలైంది, పిల్ల జమీందార్, పైసా, ఆహా కల్యాణం, జెండాపై కపిరాజు,  ఎటో వెళ్లిపోయింది మనసు, ఎవడే సుబ్రహ్మణ్యం, భలేభలే మగాడివోయ్, కృష్ణగాడి వీరప్రేమ గాథ, జెంటిల్‌మన్,  మజ్ను, నేను లోకల్, నిన్ను కోరి, ఎం.సి.ఎ. (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి), కృష్ణార్జున యుద్ధం చేశాడు. పదేళ్ల కెరియర్‌లో ఇరవై సినిమాలంటే, ఇరవై సినిమాల్లో పన్నెండుకు పైగా హిట్‌లు, సూపర్‌ హిట్‌లే అంటే, వాటిల్లో ఒకటి బ్లాక్‌ బస్టర్‌ అంటే.. అంతా అంటున్నట్లు.. నానీ ‘నాట్‌ ఎ పక్కింటి అబ్బాయి’. వాడిలో ఏదో మాయ ఉంది. యూత్‌కి కనెక్ట్‌ అవుతున్నాడు. యంగ్‌ గర్ల్స్‌కి కనెక్ట్‌ అవుతున్నాడు. ఇంట్లో అమ్మానాన్నకు, పెద్దవాళ్లకు, చిన్నవాళ్లకు కనెక్ట్‌ అవుతున్నాడు. ఇంత అవుతున్నవాడు బిగ్‌బాస్‌ హౌస్‌కి కనెక్ట్‌ అయి, కరెంట్‌ ఇవ్వలేడా?!  

డీలింగ్‌ టాలెంట్‌
నానీ బ్లాక్‌ బ్లస్టర్‌ ‘భలేభలే మగాడివోయ్‌’. అందులో అతడు మతిమరుపు లవర్‌. లవ్‌లో పడి, తిప్పలు పడుతుంటాడు. కాదు, ఆ పిల్లని తిప్పలు పెడుతుంటాడు. మతిమరుపును కవర్‌ చేసుకోడానికి ఎప్పుడేం మాట్లాడతాడో తెలీదు. కానీ లావణ్యా త్రిపాఠీ అర్థం చేసుకుంటుంది నానీ మీద ఉండే లవ్‌తో. ‘మీలో నాలో అందరిలో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాన్ని పాపంగా చూడకండి. ఆ పాపాన్ని శాపంగా మార్చకండి’ అని నానీ అలవోకగా ఓ కవరింగ్‌ డైలాగ్‌ కొడతాడు. త్రిపాఠీ ఇంప్రెస్‌ అయిపోతుంది. ‘‘మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థంచేసుకోలేం’’ అంటుంది. ఆ సీన్‌కి నానీ బతికిపోతాడు. మళ్లీ ఇంకోచోట మతిమరుపు కవరేజ్‌ ఏరియాలో.. ఇంకో సీన్‌. నానీ అద్దరకొట్టాడు. రికార్డులు బద్దలైపోయాయి. బిగ్‌బాస్‌లో శె‘బాస్‌’ అనిపించుకోడానికి నానీలోని ఈ డీలింగ్‌ టాలెంట్‌ బాగా పనికొస్తుంది. 

అదరగొట్టే యాక్షన్‌ 
నానీ సూపర్‌హిట్‌ మూవీ ‘అలా మొదలైంది’. అప్పటికతడు సినిమాల్లో మూడేళ్ల పిల్లాడు. ఆ సినిమాలో టీవీ రిపోర్టర్‌. విధి ఆడించిన వింత చదరంగంలో ఓ ప్రేమ పావు. నిత్యామీనన్‌ని రెగ్యులర్‌గా ఇంటి దగ్గర డ్రాప్‌ చేస్తుంటాడు నానీ. ఓ రోజు వాళ్లు అలా గేటు బయట డ్రాప్‌ అయినప్పుడు బాల్కనీలోంచి నిత్య అంకుల్‌ చూస్తాడు. ‘‘రోజూ మీ అంకుల్‌కి ఇలా కనిపిస్తుంటే నీకేమైనా ప్రాబ్లమా?’’ అని అడుగుతాడు నానీ. ‘‘ప్రాబ్లమా! నో.. వే’’ అంటుంది నిత్య. ‘అవునా!’ అన్నట్లు చూస్తాడు. ‘‘అవును.. నువ్వు గే అని చెప్పానుగా.. నో ప్రాబ్లమ్‌’’ అంటుంది. నానిగాడి ఫీజులు ఎగిరిపోతాయి. ‘గే’గా తనని తాను ఊహించుకుంటాడు. అప్పుడు చూడాలి వాడి యాక్షన్‌. బిగ్‌బాస్‌లో మన ఫీజుల్ని కలిపి నవ్వుల రవ్వలు పుట్టించడానికి కావలసినంత యాక్షన్‌. 

హీరోయిక్‌ విట్టీనెస్‌
యాక్షన్‌ ఎలాగూ ప్రతి యాక్టర్‌కీ ఉంటుంది. హీరోయిక్‌ విట్టీనెస్‌ ఉంది నానీలో. అది కొందరికే ఉంటుంది. బిగ్‌బాస్‌కి అలాంటి విట్‌ అవసరం. ఎం.సి.ఎ.లో కామెడీనీ, యాక్షన్‌నీ కావడి కుండల్లా మోశాడు నానీ. అది కష్టం. కష్టమైనా తేలిగ్గా చేశాడు. ‘జీవితం మనకెన్నో అవకాశాలను ఇస్తుంది. మనం జీవితానికో అవకాశం ఇద్దాం’ అంటాడు ‘నిన్నుకోరీ’ సినిమాలో. అందులో మెచ్యూరిటీని, రొమాన్స్‌నీ మిక్స్‌ చేశాడు. అందులో సినిమాటిక్‌ ఎమోషన్స్‌ లేవు. ప్యూర్‌ లవ్‌. స్వచ్ఛమైన ప్రేమికుడు. ఎంటర్‌టైన్‌ చేస్తూనే, ‘ఎమోషనల్లీ యువర్స్‌’ అంటాడు. అదుండాలి బిగ్‌బాస్‌కి. అదుందని తెలుస్తూనే ఉంది ఈ లిటిల్‌ బాయ్‌లో. 

వన్‌ మ్యాన్‌ నానీ
ఏ ఇమేజీ లేకపోవడమే నానీ ప్లస్‌ పాయింట్‌. ఏ గ్లాసులో పోసినా, ఆ షేప్‌లో కనిపించే లిక్విడ్‌ సెల్యులాయిడ్‌ ఈ కుర్రాడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో ఫిలాసఫీతో టచ్‌ చేశాడు. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ను సున్నితంగా లాక్కొచ్చాడు. ‘జెంటిల్‌మన్‌’లో అయితే ఇంకో నానీని చూపించాడు. హీరోనా, విలనా తెలియని కన్‌ఫ్యూజన్‌లో పడేశాడు! అంటే ఏదిచ్చినా అది వన్‌ మేన్‌ షోలా చేసేస్తున్నాడు నానీ. ఇప్పుడు బిగ్‌బాస్‌ను కూడా హోస్ట్‌ చేసేస్తాడు. నో డౌట్‌. 

ఇప్పుడు లోకల్‌
బిగ్‌ బాస్‌ సీజన్‌ వన్‌ని గుర్తు చేసుకోండి. హౌస్‌ సెట్‌ను తలుచుకోండి. ఎక్కడో ఊరి చివర ఆ హౌస్‌ ఉన్నట్లుగా అనిపించింది కదూ. ఆ హౌస్‌ ఉన్న లొకేషన్‌ నిర్మానుష్యమైన ప్రాంతంలో చీమలు దూరని చిట్టడవి.. కాకులు దూరని కారడవి.. అంటారే అలా ఉంటుంది. లోనావాలా (ముంబై) దగ్గర్లో ఓ అడవిలో ఆ సెట్‌ వేశారు. అయితే సీజన్‌ 2 సెట్‌  లోకల్‌లోనే ఉంటుంది. నగరం నడిబొడ్డున అన్నమాట. ఫస్ట్‌ సీజన్‌కి ముంబై వేదిక అయితే, సెకండ్‌ సీజన్‌ వేదిక హైదరాబాద్‌. ఇక్కడి ఓ ప్రముఖ స్టూడియోలో బ్రహ్మాండమైన సెట్‌ తయారు చేయిస్తున్నారు. సెట్‌ కళ్లు చెదిరేలా ఉంటుందట. 

70 డేస్‌.. ప్రపంచంతో కట్‌
బిగ్‌ బాస్‌ షోలో పాల్గొనేవాళ్లు 70 రోజులు హౌస్‌లో ఉండిపోవాల్సిందే. బయట ప్రపంచంతో సంబంధాలు కట్‌. నో సెల్‌ఫోన్, నో టీవీ.. టోటల్‌గా నో కమ్యూనికేషన్‌. హౌస్‌లో వీళ్లు ఏం చేస్తున్నారనేది మాత్రం ప్రపంచం చూస్తుంది. ఫస్ట్‌ సీజన్‌ సరదాగా, సీరియస్‌గా, ఎమోషనల్‌గా... ఇలా ఆసక్తికరంగా సాగింది. సెకండ్‌ సీజన్‌ పై బోలెడన్ని అంచనాలున్నాయి. మరి.. ఈసారి హౌస్‌లో కంటెస్టెంట్‌లుగా ఎవరెవరు ఉంటారు? ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తారు? అనేది వేచి చూడాలి. అన్నట్లు... షోకి సంబంధించిన టీజర్, ఫొటోషూట్, యాడ్స్, షో.. వీటన్నింటినీ దాదాపు 60 కెమెరాలతో షూట్‌ చేస్తారని తెలిసిందే. 70రోజులు హౌస్‌ హంగామాతో పాటు మిగతా షూట్‌తో కలుపుకుని మొత్తం 106 రోజులు షూటింగ్‌ డేస్‌ అని సమాచారం. ఇపుడు నానీ ఆ షూటింగ్‌లోనే బిజీ బిజీ. మరి... సీజన్‌ 2 స్మాల్‌ స్క్రీన్‌కి వచ్చేది ఎప్పుడు? వెయిట్‌ అండ్‌ సీ. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement