గుట్టలు, నదులు, అడవి దాటి అమెరికాలోకి.. ట్రంప్‌ దెబ్బకు ఆకాశ్‌ ఆవేదన | Indian deportee Karnal Akash video from Panama Jungle To Enter US | Sakshi
Sakshi News home page

గుట్టలు, నదులు, అడవి దాటి అమెరికాలోకి.. ట్రంప్‌ దెబ్బకు ఆకాశ్‌ ఆవేదన

Published Fri, Feb 7 2025 7:48 AM | Last Updated on Fri, Feb 7 2025 7:52 AM

Indian deportee Karnal Akash video from Panama Jungle To Enter US

అమెరికాలోకి ప్రవేశించిన అక్రమ వలసదారులపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉక్కుపాదం మోపారు. అక్రమంగా నివసిస్తున్న ఎవరినీ ఉపేక్షించేది లేదని  ట్రంప్‌ చెప్పిన విధంగానే పలువురిని తిరిగి తమ స్వదేశాలకు పంపుతున్నారు. దీంతో, భారతీయులు సైతం తిరిగి స్వదేశం బాట పట్టాల్సి వచ్చింది. ప్రత్యేక విమానంలో 104 మంది వరకూ భారత్‌కు తిరిగి వచ్చారు. ఈ క్రమంలో హర్యానాకు చెందిన ఆకాశ్‌ దీన గాథ చూసి అందరూ ఆవేదన చెందుతున్నారు. అక్రమ మార్గంలో అమెరికా వెళ్లేందుకు అతను ఎన్ని కష్టాలు అనుభవించాడో తన కుటుంబ సభ్యులు వీడియోలో చెప్పుకొచ్చారు. ఈ సందర్బంగా తాము ఎంతో కోల్పోయినట్టు కన్నీటి పర్యంతమయ్యారు.

షేర్‌ చేసిన వీడియో ప్రకారం.. అమెరికా వెళ్లాలనే పిచ్చితో హర్యానాలోని కర్నాల్‌కు  చెందిన ఆకాశ్‌(20) తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు. తనకు ఉన్న 2.5 ఎకరాల భూమి అమ్మి రూ.65 లక్షలతో అక్రమ మార్గంలో అమెరికా చేరుకున్నాడు. ఈ క్రమంలో ఏజెంట్లకు మరో రూ.7లక్షలు చెల్లించాడు. పనామా, మెక్సికో మార్గంలో ఎన్నో కష్టాలు భరించి అక్కడికి వెళ్లాడు. ఈ క్రమంలో కొండలు, గుట్టలు, నదులు, వాగులు, అడవిలో చిత్తడి మట్టిలో నడుచుకుంటూ అక్కడికి చేరుకున్నాడు. అతను 10 నెలల క్రితం భారత్‌ నుండి బయలుదేరి జనవరి 26న మెక్సికో సరిహద్దు గోడను దాటి అమెరికాలోకి ప్రవేశించాడు.

అనంతరం, అతను అమెరికాలోని చెక్‌ పాయింట్ వద్ద పోలీసులకు చిక్కాడు. కొంతకాలం నిర్బంధం తర్వాత ఆకాష్‌ను బాండ్‌పై విడుదల చేశారు. అయితే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్రమ వలసలపై కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో బలవంతంగా బహిష్కరణ పత్రాలపై సంతకం చేయించారు. బహిష్కరణ పత్రాలపై సంతకం చేయకపోతే ఆకాశ్‌కు అమెరికాలో జైలు శిక్ష పడుతుందని చెప్పారని అతని కుటుంబం పేర్కొంది. అక్రమ వలసదారులను ఇంటికి పంపించి వేయడంతో ఆకాశ్‌.. ఫిబ్రవరి ఐదో తేదీన హర్యానాలోకి తన ఇంటికి చేరుకున్నాడు.

దక్షిణ సరిహద్దు నుండి అమెరికాలోకి ప్రవేశించేందుకు రెండు ప్రధాన అక్రమ ప్రవేశ మార్గాలు ఉన్నాయి. ఒకటి నేరుగా మెక్సికో ద్వారా, మరొకటి డంకీ మార్గం అని పిలుస్తారు. ఇందులో భాగంగా పలు దేశాలను దాటడం జరుగుతుంది. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, సముద్రాలు సహా ప్రమాదకరమైన భూభాగాలను నావిగేట్ చేయడం జరుగుతుంది. ఈ మార్గంలో వలసదారులు అమెరికాకు చేరుకునే ముందు విమానాలు, టాక్సీలు, కంటైనర్ ట్రక్కులు, బస్సులు, పడవల ద్వారా వెళ్తారు.

అంతా పోగొట్టుకున్నాం..
ఇదిలా ఉండగా.. కొన్నేళ్ల క్రితమే ఆకాశ్‌ తండ్రి చనిపోయారు. అప్పటి నుంచి వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటోందని ఆకాశ్‌ సోదరుడు శుభమ్ పేర్కొన్నారు. అయితే, ఆకాశ్ తాను అమెరికా వెళ్లాలని పట్టుబట్టడంతో శుభమ్ తన సోదరుడిని యూఎస్‌ పంపాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు. ఆకాష్‌కు మంచి భవిష్యత్తును అందించాలనే ఆశతో శుభమ్.. తమకు ఉన్న 2.5 ఎకరాల భూమిని అమ్మేసినట్టు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కుంటున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ.. సినిమాను తలపించే కథ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement