![Big Relief for CM Siddaramaiah In Muda case](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/Siddu.jpg.webp?itok=M8ir_2s4)
బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కర్ణాటక హైకోర్టులో ఊరట లభించింది. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం కేసుకు సంబంధించిన కేసు దర్యాప్తుపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ముడా కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
కర్ణాటకలో ముడా కుంభకోణానికి సంబంధించిన కేసు దర్యాప్తును లోకాయుక్త పోలీసుల నుండి సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ న్యాయవాది స్నేహమయి కృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా ముడా కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేసేందుకు జస్టిస్ ఎం నాగప్రసన్న తిరస్కరించారు. ఈ క్రమంలో కేసు విచారణకు సీబీఐ దర్యాప్తు పరిష్కారం కాదు. లోకాయుత్త దర్యాప్తు చేయగలదు’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక, సిద్దరామయ్య తరఫున సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఇదిలా ఉండగా.. అవినీతి ఆరోపణలతో సిద్ధ రామయ్య తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను సిద్ధరామయ్య ఖండించారు.
ముడా స్కాం ఇదే..
మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ(ముడా) భూముల కేటాయింపుల వివాదంలో.. ఖరీదైన భూములు ఆయన భార్య పార్వతికి దక్కేలా సిద్ధరామయ్య కుట్ర చేశారని సమాచార హక్కు చట్టం కార్యకర్తలు టీజే అబ్రహాం, ఎస్పీ ప్రదీప్, స్నేహమయి కృష్ణ చేసిన అభ్యర్థనపై రాష్ట్ర గవర్నర్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఏకంగా ముఖ్యమంత్రిపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ అనుమతి ఇవ్వటం కర్ణాటక రాజకీయల్లో సంచలనం సృష్టించింది.
కాగా, సిద్ధరామయ్య భార్య పార్వతికి మైసూరులోని కేసరే గ్రామంలో 3 ఎకరాల భూమి ఉంది. దాన్ని ఆమె సోదరుడు మల్లికార్జున్ ఆమెకు బహుమతిగా ఇచ్చారు. అయితే, ఈ భూమిని అభివృద్ధి కోసం ముడా స్వాధీనం చేసుకుంది. పరిహారం కింద 2021లో పార్వతికి దక్షిణ మైసూరులోని ప్రధాన ప్రాంతమైన విజయనగర్‌లో 38,283 చదరపు అడుగుల ప్లాట్‌ను ప్రభుత్వం కేటాయించింది. పరిహారం కింది ఇచ్చిన ప్లాట్ మార్కెట్ విలువ కేసరేలో ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న భూమికంటే ఎక్కువ అని బీజేపీ ఆరోపించింది. దీంతో ముడా కుంభకోణం తెరపైకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment