న్యూఢిల్లీ: అక్రమ వలసదారులపై ఉక్కు పాదం మోపే విషయంలో ట్రంప్ కఠిన వైఖరిని వీడడం లేదు. భారత్‌తో ఎంత దగ్గరి సంబంధాలు ఉన్నా.. ఈ విషయంలో మినహాయింపు లేదని పరోక్షంగా సంకేతాలిచ్చారు కూడా. ఈ క్రమంలో బుధవారం తొలిబ్యాచ్ భారత్‌కు చేరుకోగా.. వాళ్ల పట్ల యూఎస్ ఎంబసీ వ్యవహరించిన తీరు ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది.
అమెరికా నుంచి భారత్‌కు చేరుకునేంత వరకు.. తమ కాళ్లు చేతులకు బంధించే ఉంచారని వాపోయారు వాళ్లు. ‘‘అమెరికాలో మమ్మల్ని ఓ క్యాంప్‌లో ఉంచారు. అక్కడి నుంచి మమ్మల్ని మరో క్యాంప్‌నకు తరలిస్తారని భావించాం. కానీ, అలా జరగలేదు. ఓ పోలీస్ అధికారి వచ్చి ఇండియాకు తిరిగి పంపించేస్తున్నామని చెప్పారు. అయితే విమానం ఎక్కాక చేతులకు సంకెళ్లు వేసి.. కాళ్లను గొలుసులతో కట్టేశారు. అమృత్‌సర్‌లో దిగేంత వరకు మమ్మల్ని అలాగే ఉంచారు’’ అని పంజాబ్‌కు ెందిన 36 ఏళ్ల జస్‌పాల్ సింగ్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.
అయితే.. అలాంటిదేం జరగలేదని, అదంతా తప్పుడు ప్రచారం ఇంతకు ముందు కేంద్రం కొట్టిపారేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫొటోను కూడా ఫ్యాక్ట్ చెక్ ద్వారా అబద్ధంగా తేల్చేసింది. అది గ్వాటెమాలకు సంబంధించిన అక్రమ వలసదారుల చిత్రమని స్పష్టం చేసింది.
అయితే.. తాజాగా వలసదారుల వ్యాఖ్యల నేపథ్యంలో భారతీయులను అవమానకరరీతిలో వెనక్కి పంపించారని కాంగ్రెస్ పార్టీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. 2013లో భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగఢేను ఇలాగే అవమానిస్తే.. అప్పటి యూపీఏ ప్రభుత్వం తీవ్రంగా స్పందించని, దీంతో అమెరికా ప్రభుత్వం దిగివచ్చి విచారం వ్యక్తం చేసిందని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది.
ట్రంప్ అధికారం చేపట్టాక.. అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపిచేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ క్రమంలో తరలింపు కోసం ఎలాంటి సౌకర్యాలు లేని యుద్ధవిమానాలను ఉపయోగించడం, పైగా వాళ్లకు బేడీలు వేసి మరీ లాక్కెళ్తూ అమానుషంగా ప్రవర్తిస్తుండడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ
జస్‌పాల్‌తో పాటు మరికొందరు భారతీయులు జనవరి 24వ తేదీన మెక్సికో సరిహద్దు వద్ద అక్రమంగా అమెరికాలో చొరబడుతున్న టైంలో పట్టుబడ్డారట. ఓ ఏంజెట్ చేసిన మోసం వల్లే తాను ఇలాంటి పరిస్థితిలో ఉన్నానని జస్పాల్ కంటతడి పెట్టాడు. హర్విందర్ అనే యువకుడు మాట్లాడుతూ.. తనను ఏజెంట్ ఖతార్, బ్రెజిల్, పెరూ, కొలంబియా, పనామా, ఇలా.. అంతటా తిప్పి మెక్సికోకు చేర్చాడని, అయితే అక్కడి నుంచి అమెరికా వెళ్లే క్రమంలో తమ బోటు ప్రమాదానికి గురైందని వివరించాడు. ఆ ప్రమాదంలో కొందరు చనిపోగా.. తనతోపాటు కొందరు ప్రాణాలతో బయటపడ్డారని చెప్పుకొచ్చాడు. పంజాబ్‌కే చెందిన మరో వ్యక్తి.. తన బట్టలను ఎవరో దొంలించారని చెబుతున్నాడు. కొండలు దాటి, కిలో మీటర్లు ప్రయాణించి అమెరికాలోకి ప్రవేశించేందుకు వాళ్లు చేసిన ‘డంకీ’ కష్టాల గురించి వాళ్లంతా మీడియాకు వివరించారు. దారి పొడవునా శవాలను దాటుకుంటూ.. అత్యంత కష్టతరమైన పరిస్థితుల నడుమ తాము ప్రయాణించామని చెబుతున్నారు వాళ్లు. వాళ్లను కదిలిస్తే.. ఒక్కొక్కరిది ఒక్కో గాథ. ఆర్థిక సమస్యలతోనే తాము దొడ్డిదారిన అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించామని చెబుతున్నారు.
డంకీ అంటే మరోదేశంలోకి అక్రమంగా చొరబడడం
ఇక.. తొలి బ్యాచ్‌లో 104 అక్రమ వలసదారులు రాగా.. 33 మంది హర్యానా, గుజరాత్ 33, పంజాబ్ 30 మందిని, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ నుంచి ముగ్గురు చొప్పున, ఛండీగఢ్ నుంచి ఇద్దరు ఉన్నారు. అలాగే 19 మంది మహిళలు, 13 మంది మైనర్లు ఉన్నారు. నాగేళ్ల పిల్లాడు, ఐదు..ఏడేళ్ల వయసున్న అమ్మాయిలూ ఉన్నారు. ఇక.. అమృత్‌సర్‌లో దిగిన వలసదారులతో పంజాబ్ మంత్రి కుల్దీప్ మాట్లాడారు. ఎలాంటి కేసులు ఉండబోవని, గుర్తింపులను ధృవీకరించుకున్నాక స్వస్థలాలకు పంపిస్తామని వాళ్లకు ఆయన భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment