illegal immigrants
-
అమెరికా ఇక ఎందులో గొప్ప?
డోనాల్డ్ ట్రంప్ తీరు చూసి నోరు వెళ్లబెడు తున్నారా? బహుశా లెక్క పెట్టలేనన్ని సార్లు అయ్యుంటుంది. నాది మాత్రం అదే పరిస్థితి. మీరు అమెరికా అధ్యక్షుడి అభిమాని కావచ్చు, కాకపోవచ్చు; అది సమస్య కాదు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉదారవాద రాజకీ యాలు సంక్షోభంలో పడిపోయాయి, ఉన్నత వర్గాల చర్మం మొద్దుబారింది, మితవాదం జనాదరణ పొందుతోంది... ఎందుకిలా జరుగుతుందో తేల్చడానికి చర్చోపచర్చలు నడుస్తున్నాయి. వాటినీ పక్కన పెడదాం. ట్రంప్ పదవిని అలంకరించి కొన్ని వారాలు గడచి పోయాయి. ఈ స్వల్ప సమయంలోనే అమెరికా బండారం బయట పడింది. అమెరికా అసామాన్యత (అమెరికన్ ఎక్సెప్షనలిజం) అనేది ఒక కట్టుకథ అని తేలిపోయింది. అమెరికన్ ఎక్సెప్షనలిజం అంటే? ‘ఎన్సైక్లోపీడియా బ్రిటానికా’ నిర్వచనం ప్రకారం, ‘చారిత్రక, సైద్ధాంతిక, మత కారణాల రీత్యా అమెరికా ప్రత్యేకమైనది, నైతికంగా ఒక ఉన్నతమైన దేశం అనే భావన.’అమెరికా ప్రతి చర్యలోనూ... కపటమైన సైనిక జోక్యాల్లో,అధికార పీఠాలను కూలదోసే కుట్రల్లో, ఆఖరికి పత్రికా వ్యాసా ల్లోనూ ఈ అహంభావపూరితమైన ఆధిక్యతా భావన కనబడుతుంది. రష్యా – ఉక్రెయిన్ యుద్ధ కాలంలో మాటిమాటికీ ‘విలువల ఆధారిత వ్యవస్థ’ అంటూ అరిగిపోయిన పదాలతో ఊదరగొట్టిన వారు, భారత్ దౌత్య విధానానికి వంక పెట్టిన వారు, ఆ తర్వాత ఏం చేశారు? అదే అమెరికా ఐక్యరాజ్య సమితి తీర్మానంపై ఊహకే అందని విధంగా రష్యాతో చేయి కలిపింది. ఉక్రెయిన్‌కు వ్యతి రేకంగా ఓటేసింది. యుద్ధ సమయంలోనూ ఆచితూచి వ్యవహరించినభారత్ ఓటింగ్‌కు హాజరు కాకుండా తటస్థ వైఖరి అవలం బించింది.హక్కుల గురించి మీరా మాట్లాడేది?విదేశీ దేశీ విధానాలను తలకిందులు చేస్తున్న ట్రంప్ విన్యాసాలు వినోదం కలిగిస్తున్నప్పటికీ, అవి ప్రమాదభరితమైనవి. ఏమైనా, అమెరికా విలువలు, అమెరికా ప్రజాస్వామ్యం, అమెరికా మీడియా, లేదంటే అమెరికా సంపన్నస్వామ్యం (అలిగార్కీ)... ఇవన్నీ ప్రభుత్వ వ్యవస్థల ప్రమేయం లేకుండా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కంటే స్వేచ్ఛగా, ఆరోగ్యదాయకంగా ఉంటాయన్న కట్టుకథ తిరుగులేనివిధంగా పటాపంచలైంది. అమెరికా మేధావులు ఇకమీదట ఎప్పుడన్నా భారత ప్రజాస్వామ్యాన్ని శల్యపరీక్షకు పెడితే నేనేం చేస్తానో తెలుసా? పడిపడి కాకున్నా ముసిముసిగా నవ్వుకుంటాను! యూఎస్ ప్రభుత్వం భారత్‌లో మానవ హక్కుల మీద నివేదిక వెలువరించినా అంతే చేస్తా. భారతీయ అక్రమ వలసదారులను మీరెలా ట్రీట్ చేశారు? వారిని 40 గంటల పాటు ఉక్కు సంకెళ్లు వేసి స్వదేశానికి పంపించడమే కాకుండా ఆ మెటల్ శబ్దాల మ్యూజిక్‌తో వీడియోలు రూపొందిస్తారా? జన్మలో ఇక మీరు మానవ హక్కులంటూ భారతీయులకు ఉపన్యాసాలు ఇవ్వలేరు. ఈ క్షణాన యూఎస్ ప్రభుత్వాన్ని నడుపు తున్న టెస్లా, ఎక్స్ సంస్థల అధిపతి ఎలాన్ మస్క్ సహా అమెరికా కార్పొరేట్ టైటాన్లు ట్రంప్ ప్రమాణస్వీకార ఉత్సవంలో బారులు తీరడం మేము చూడలేదనుకుంటున్నారా? ఇక మీదట మీరు ఏ ముఖం పెట్టుకుని భారత్ మీడియాకు, వ్యాపార సామ్రాజ్యాలకు మధ్య సంబంధాలు ఉన్నాయంటూ విమర్శిస్తారు? ట్రంప్ గెలుపు ఖాయం అనుకోక ముందు నుంచే మస్క్ ఆయన పక్షం నిలిచి ఉన్నారు. కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. మరి మెటా/ఫేస్బుక్ అధిపతి మార్క్ జుకర్‌బర్గ్ వాస్తవ నిర్ధారణ, రాజకీయాలు వంటి అంశాల మీద ఏళ్ల తరబడిగా అవలంబిస్తున్న విధానాలను వాషింగ్టన్ పెద్దలకు అనుకూల రీతిలో రాత్రికి రాత్రే రివర్స్ చేసుకున్నాడంటే ఏమనుకోవాలి? ఇన్ఫ్లుయెన్సర్లకు పీటఒకప్పుడు ఎంతో గౌరవప్రదమైన ‘ద వాషింగ్టన్ పోస్ట్’ సంగతేంటి? నేను కూడా చాలా సంవత్సరాల పాటు ఆ వార్తాపత్రికలో కాలమ్ రాశాను. ఆ పత్రికలో ఇప్పుడేం జరుగుతోందో చూడండి. సంక్షోభాల నడుమ కొట్టుమిట్టాడుతోంది. సంపాదకీయ నాయకత్వంలో వరసగా అనేక ఆకస్మిక మార్పులు చేశారు. యజమాని అయిన ‘అమెజాన్’ అధిపతి జెఫ్ బెజోస్ గందరగోళంగా ఆ పత్రిక దిశను మార్చడంతో అదిప్పుడు అనిశ్చితిలో పడింది. ‘ఒపీనియన్ పేజీ’ ఎడిటర్ డేవిడ్ షిప్లీ ఈ మార్పులకు నిరసనగా వైదొలిగారు. ‘స్వేచ్ఛా విపణులు, వ్యక్తిగత స్వాతంత్య్రం’ ఆదర్శాన్ని పత్రిక ఎలా అనుసరించాలో నిర్దేశిస్తూ బెజోస్ ‘ట్విట్టర్’ వేదికగా చేసిన ప్రకటన (బహుశా మస్క్, ట్రంప్‌ల అనుమతి కోసం) ప్రమోటర్‌కు, ఎడిటర్‌కు మధ్య ఒక గోడ ఉంటుందన్న భ్రమను ఈ ఆదేశం బద్దలు కొట్టింది.దీనికి తోడు, లబ్ధ ప్రతిష్ఠులైన జర్నలిస్టుల స్థానంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను వైట్‌హౌస్ నియమిస్తోంది. వీరు పత్రికా సమావేశాల్లో ప్రభుత్వ అనుకూలురుగా ఉంటారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మీడియా స్వేచ్ఛకు ఈ చర్య అశనిపాతం. అలిగార్క్లు చలాయించే అహంకారపూరిత అధికారం, పత్రికా స్వేచ్ఛకు సవాళ్లు, సమాచారం కోసం సంబంధిత సంస్థలను సంప్ర దించే వీలు తగ్గిపోతూ ఉండటం... ఇవన్నీ సీరియస్ అంశాలు. ప్రపంచంలోని ప్రతిచోటా ఉన్నట్లే భారత్ లోనూ ఈ సమస్యలు ఉంటాయి. కానీ అంత సమర్థంగా వీటిపై పోరాడలేక పోవచ్చు. అయితే, ఈసారి ఏదైనా అమెరికా వార్తాపత్రిక... మసకబారుతున్న ఇండియా మీడియా గురించి సంపాదకీయం రాసినప్పుడు మనం వారిని వేలెత్తి చూపించగలం. అత్యంత హేయమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘టేట్ బ్రదర్స్’ రొమేనియా నుంచి అమెరికాలో ప్రత్యక్షం కావడం ఈవారం కొసమెరుపు. ఆండ్రూ టేట్, ట్రిస్టాన్ టేట్ సోదరులు అత్యాచారం, సెక్సువల్ ట్రాఫికింగ్ కేసుల్లో ఇరుక్కున్నారు. మహిళలందరూ సెక్స్ వర్కర్లనీ, అత్యాచారాలకు వారే బాధ్యత వహించాలనీ... ఇంకా ఇలాంటి దుర్మార్గమైన, అసహ్యకర వ్యాఖ్యలు చేసిన ఈ అన్న దమ్ములు ట్రంప్ ఫాన్స్! వీరు స్వదేశం తిరిగి వచ్చేందుకు అనుమతించాలంటూ ట్రంప్ ప్రభుత్వం రొమేనియాను సంప్రదించినట్లు ‘ద ఫైనాన్షియల్ టైమ్స్’ కథనం ప్రచురించింది. చివరకు, అతివాద రిపబ్లికన్ నేతలు సైతం వారిని ఏవగించుకుంటున్నారు. ట్రంప్ రాజకీయంగా మరింత బలపడవచ్చు. కానీ అమెరికా పతనమౌతోంది. ప్రభుత్వ గందరగోళ విధానాల నేపథ్యంలో అమెరికా అసామాన్యత (అసలు అలాంటిది ఎప్పుడూ లేదని నేనంటాను) చావుదెబ్బ తినబోతోంది!బర్ఖా దత్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
అమెరికా నుంచి భారత్‌కు అక్రమ వలస దారులు.. ఈసారి ఎంతమందంటే?
అమెరికాలో అక్రమ వలసదారుల డిపోర్టేషన్ కొనసాగుతుంది. ఇందులో భాగంగా అమెరికాలో అక్రమంగా ఉంటున్న 12మంది భారతీయుల్ని ట్రంప్ ప్రభుత్వం స్వదేశానికి తరలించినట్లు అధికారులు ప్రకటించారు.అమెరికాలో భారతీయ అక్రమ వలసదారులను ట్రంప్ యంత్రాంగం వెనక్కి పంపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాలో 12మంది భారతీయుల్ని స్వదేశానికి పంపించింది. వారిని ఈ రోజు అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో వలస దారుల్ని ఢిల్లీకి తీసుకువచ్చింది. వారిని పనామా నుంచి భారత్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అక్రమ వలసదారుల్లో పంజాబ్ వాసులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. -
అక్రమ వలసదార్లను ఎప్పుడు తరిమేస్తారు?
ఛత్రపతి శంభాజీ నగర్: దేశంలో ఎన్నికల ప్రక్రియలో అక్రమ వలసదార్లు జోక్యం చేసుకుంటున్నారని, నిర్ణయాత్మక శక్తులుగా మారుతున్నారని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అమెరికా నుంచి అక్రమ వలసదార్లను అక్కడి ప్రభుత్వం బలవంతంగా బయటకు పంపిస్తోందని పరోక్షంగా ప్రస్తావించారు. మన దేశంలో అలాంటి ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో చెప్పాలంటూ ప్రజలంతా ప్రశ్నించాలని సూచించారు. శనివారం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మరఠ్వాడా యూనివర్సిటీ 65వ స్నాతకోత్సవంలో జగదీప్ ధన్‌ఖడ్ ప్రసంగించారు. అక్రమ వలసదార్ల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘మన దేశంలో నివసించే హక్కు లేని కోట్లాది మంది ఇక్కడే చట్టవిరుద్ధంగా నివసిస్తున్నారు. ఇక్కడే బతుకుతున్నారు. మన వనరులపై కన్నేశారు. వాటి కోసం డిమాండ్ చేస్తున్నారు. మన విద్య, ఆరోగ్యం, గృహం.. ఇలా అన్నింటిపైనా వారి దృష్టి పడింది. వారు మరింత ముందుకెళ్తున్నారు. మన ఎన్నికల ప్రక్రియలో సైతం జోక్యం చేసుకుంటున్నారు. అక్రమ వలసదార్ల సమస్యపై అందరికీ అవగాహన కలి్పంచాలి. ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించాలి’’అని పేర్కొన్నారు. జాతీయవాదమే మన మతమని ఉద్ఘాటించారు. జాతీయవాదానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దేశంలో బలవంతపు మత మారి్పళ్లు విచ్చలవిడిగా జరుగుతున్నాయని ధన్‌ఖడ్ ఆరోపించారు. నచి్చన మతాన్ని స్వీకరించే హక్కు పౌరులందరికీ ఉందని చెప్పారు. అయితే, ప్రలోభాలకు గురిచేసి, భయపెట్టి మతం మార్చడం దారుణమని విమర్శించారు. మత మారి్పళ్ల ద్వారా భారతదేశ జనాభా ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసి, దేశంపై ఆధిపత్యం చెలాయించడానికి కొన్ని శక్తులు కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. కొన్ని దేశాల్లో మతమారి్పళ్ల వల్ల మెజార్టీ సమూహాలు మైనారీ్టలుగా మారిపోయాయని గుర్తుచేశారు. దేశం అభివృద్ధి చెందాంటే సామాజిక సామరస్యం అవసరమని ఉద్ఘాటించారు. రాజ్యాంగాన్ని అధ్యయనం చేయాలి మన రాజ్యాంగాన్ని విస్తృతంగా అధ్యయనం చేసి, పూర్తిగా అర్థం చేసుకోవాలని జగదీప్ ధన్‌ఖడ్ సూచించారు. రాజ్యాంగం మనకు ఎంతగా అర్థమైతే మనం జాతీయవాదం వైపు అంతగా మొగ్గుచూపుతామని తెలిపారు. మనకు జాతీయవాదమే అతిపెద్దగా మతంగా భావించాలన్నారు. కొందరు దుషు్టలు విదేశాల నుంచి వస్తున్న నిధులతో మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. -
అక్రమ వలసదార్లలో కన్నీటి వరదే
చండీగఢ్: ఏజెంట్ల మాటలు నమ్మి, రూ.లక్షలు సమర్పించుకొని, అందమైన జీవితాన్ని ఊహించుకుంటూ కోటి కలలతో అమెరికా దారిపట్టిన యువతకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. ఉత్త చేతులతో, అవమానకర రీతితో స్వదేశానికి చేరుకోవాల్సి వచ్చింది. చట్టబద్ధంగా అమెరికాకు తీసుకెళ్తామంటూ ఏజెంట్లు, సబ్ ఏజెంట్లు చెప్పిన కల్లబొల్లి కబుర్లు నమ్మినందుకు అష్టకష్టాలు ఎదుర్కోన్నామని, ప్రత్యక్ష నరకం చూశామని అమెరికా నుంచి తిరిగివచ్చిన భారతీయ అక్రమవలసదార్లు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. తొలి విడతలో భాగంగా 104 మంది అమెరికా సైనిక విమానంలో ఈ నెల 5వ తేదీన , రెండో విడతలో భాగంగా 116 మంది శనివారం రాత్రి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. మూడో విడతలో భాగంగా మరో 112 మంది ఆదివారం రాత్రి అమృత్‌సర్‌లో అడుగుపెట్టారు. ఇప్పటిదాకా మూడు విడతల్లో 332 మంది ఇండియాకు చేరుకున్నారు. పలువురు యువకులు తమ కన్నీటి గాథను మీడియాతో పంచుకున్నారు. సరైన తిండి లేదు, నిద్ర లేదుమన్దీప్ సింగ్(38) కుటుంబం అమృత్‌సర్‌లో నివసిస్తోంది. తన కుటుంబానికి చక్కటి జీవితం అందించడానికి అమెరికా వెళ్లి, ఏదైనా ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇతర యువకుల తరహాలోనే ఏజెంట్ వలలో చిక్కాడు. ఏజెంట్‌కు రెండు విడతల్లో మొత్తం రూ.40 లక్షలు చెల్లించాడు. ఇంకేముంది అమెరికాకు పయనం కావడమే అని ఏజెంట్ ఊరించాడు. అధికారికంగా కాకుండా అడ్డదారిలో(డంకీ రూట్) తీసుకెళ్లాడు. సబ్ ఏజెంట్లకు మణిదీప్‌ను అప్పగించాడు. మన్‌దీప్‌ను మొదట అమృత్సర్ నుంచి విమానంలో ఢిల్లీకి, అక్కడి నుంచి ముంబైకి, తర్వాత ఆఫ్రికాలోని నైరోబీకి, అనంతరం ఆమ్స్టర్డ్యామ్, సురినామ్‌కు చేర్చారు. అక్కడ సబ్ ఏజెంట్లు రూ.20 లక్షలు డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల ద్వారా ఆ డబ్బు చెల్లించక తప్పలేదు. సిక్కు మతస్థుడైన మన్దీప్ గడ్డాన్ని తొలగించారు. మన్‌దీప్‌తోపాటు మరికొందరు వలసదార్లను ఒక వాహనంలో గయనాకు తీసుకెళ్లారు. తర్వాత బొలీవియా, ఈక్వెడార్‌కు చేర్చారు. తర్వాత పనామా అడవుల్లో అడుగుపెట్టారు. విష సర్పాలు, మొసళ్లతో సావాసం చేస్తూ రోజుల తరబడి దట్టమైన అడవిలో నడిపించారు. 13 రోజులపాటు అడవిలోనే నడక సాగించారు. కాలువలు దాటుకుంటూ ముందుకెళ్లారు. సరైన తిండి కూడా లేదు. సగం కాల్చిన రొట్టెలు, నూడుల్స్‌తో కడుపు నింపుకున్నారు. కంటి నిండా నిద్రలేదు. రోజుకు 12 గంటలు నడిచారు. పనామా దాటిన తర్వాత కోస్టారికా, తర్వాత హోండూరస్కు చేరుకున్నారు. అక్కడ వారికి వరి అన్నం లభించింది. చివరకు నికరాగ్వా, గ్యాటెమాలా నుంచి మెక్సికో చేరారు. జనవరి 27వ తేదీన మెక్సికోలోని తిజువానా నుంచి అమెరికా భూభాగంలోకి ప్రవేశిస్తుండగా, యూఎస్ సరిహద్దు పెట్రోలింగ్ దళం అదుపులోకి తీసుకుంది. మణిదీప్‌ను అరెస్టు చేసి, డిటెన్షన్ క్యాంప్‌లో నిర్బంధించి, విచారణ ప్రారంభించారు. అక్రమ మార్గంలో అమెరికాలో అడుగుపెట్టేందుకు ప్రయత్నించినట్లు అభియోగాలు మోపారు. అక్రమ వలసదార్లను వారి స్వదేశాలకు బలవంతంగా తిప్పి పంపిస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో మన్దీప్ స్వదేశానికి చేరుకున్నాడు. ప్రాణాలతో బయటపడతానని అనుకోలేదని మణిదీప్ చెప్పాడు. తలపాగాను చెత్తబుట్టలో పడేశారు అమృత్‌సర్‌కు తిరిగొచ్చిన 23 ఏళ్ల జతీందర్ సింగ్‌ది మరో గాధ. ‘‘స్నేహితులు చెప్పడంతో గత నవంబర్‌లో ఏజెంట్ కలిశా. రూ.50 లక్షలిస్తే అమెరికా పంపిస్తానన్నాడు. మాకున్న 1.3 ఎకరాల భూమి అమ్మి ఏజెంట్‌కు అడ్వాన్స్‌గా రూ.22 లక్షలు కట్టా. పెళ్లయిన నా అక్కచెల్లెళ్లు తమ బంగారు నగలమ్మి మరీ చేతికిచ్చిన డబ్బును ఏజెంట్‌కు ఇచ్చేశా. మూడ్రోజులు పనామా అడువులను దాటాకా మెక్సికోకు విమానంలో తీసుకెళ్తానన్నాడు. మెక్సికో సరిహద్దు నగరం తిజువానా నుంచి అమెరికాలోకి తీసుకెళ్తానన్నాడు. కానీ మధ్యలోనే వదిలేశాడు. పనామా అడవుల్ని దాటడం చాలా కష్టం. మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయిన తోటివారిని చూస్తూనే అతికష్టంమ్మీద అడవుల్ని దాటా. ఎలాగోలా అమెరికా సరిహద్దు దాటితే వెంటనే బోర్డర్ పోలీసులు బంధించి నిర్బంధ కేంద్రంలో పడేశారు. సంప్రదాయ తలపాగాను తీయొద్దని బతిమాలినా వినలేదు. తీసి చెత్తబుట్టలో పడేశారు. సరైన తిండి పెట్టలేదు. ఉదయం, రాత్రి ఒక లేస్ చిప్స్ ప్యాకెట్, ప్రూటీ జ్యూస్ చిన్న బాటిల్ ఇచ్చారు. అదే ఆహారం. గదిలో ఎయిర్ కండీషనర్ ఉష్ణోగ్రత బాగా పెంచి వేడికి చర్మం ఎండిపోయేలాగా చేశారు. భారత్‌కు తిరిగొచ్చేటప్పుడు సైనిక విమానంలో కాళ్లు కట్టేశారు. తినడానికి, బాత్రూమ్కు పోవడానికి కూడా చాలా కష్టమైంది. ఏకధాటిగా 36 గంటలు చేతులకు బేడీలు వేశారు. అమృత్‌సర్‌లో దిగడానికి 10 నిమిషాల ముందు మాత్రమే చేతులకు బేడీలు తీశారు’’అని జతీందర్ సింగ్ చెప్పారు. ఆహారం, నీరు అడిగితే దాడులే పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన లవ్‌ప్రీత్ సింగ్‌ది మరో దీనగాథ. ఏడాది క్రితం ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అమెరికా కలతో ఏజెంట్ల చేతికి చిక్కాడు. పనామా అడవుల గుండా ప్రయాణించి, మెక్సికో నుంచి అమెరికా సరిహద్దు దాటేందుకు ప్రయతి్నస్తుండగా, అక్కడి అధికారులు అరెస్టు చేశారు. పనామా అడవులు చాలా ప్రమాదకరంగా ఉంటాయని, అడుగడుగునా పాములు, క్రూరమృగాలు, మొసళ్లు తారసపడుతుంటాయని చెప్పాడు. వాటి నుంచి తప్పించుకొని ముందుకెళ్లడం నిజంగా సాహసం చేయడమేనని అన్నాడు. ఆహారం, మంచినీరు అడిగితే ఏజెంట్లు దారుణంగా కొట్టారని, దూషించారని ఆవేదన వ్యక్తం చేశాడు. అయినప్పటికీ అన్నీ భరించామని పేర్కొన్నాడు. ఆస్తులు అమ్మేయాల్సి వచ్చింది అమృత్సర్ జిల్లాకు చెందిన జసూ్నర్ సింగ్‌కు అమెరికాలో ఉద్యోగం సంపాదించుకోవాలన్నది ఒక కల. అందుకోసం ఏజెంట్‌కు రూ.55 లక్షలు చెల్లించాడు. అందుకోసం కొన్ని ఆస్తులు, వాహనాలు, ఇంటి స్థలం అమ్మేయాల్సి వచ్చింది. డంకీ రూట్లో అమెరికాకు చేరుకోగానే అక్కడి అధికారులు అరెస్టు చేసి, వెనక్కి పంపించారు. కపుర్తలా జిల్లాకు చెందిన 20 ఏళ్ల నిశాంత్ సింగ్‌కు సైతం ఇలాంటి అనుభవమే ఎదురైంది. దట్టమైన అడవిలో 16 రోజులు నడిచానని అన్నాడు. కేవలం నీరు తాగుతూ ప్రాణాలు నిలబెట్టుకున్నానని పేర్కొన్నాడు. తనను అమెరికా పంపించడానికి తన కుటుంబం రూ.40 లక్షలు ఖర్చు చేసిందని వెల్లడించాడు. -
అవును.. మా మనోభావాలు దెబ్బతిన్నాయ్!
అక్రమ వసలదారుల్ని స్వస్థలాలకు చేర్చే విషయంలో అమెరికా వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కాళ్లకు సంకెళ్లు, చేతులకు బేడీలు వేసి.. కనీస వసతులేవీ కల్పించకుండా యుద్ధ విమానాల్లో తరలించడంపై ఆయా దేశాలు మండిపడుతున్నాయి. అయితే చిరకాల మిత్రుడైన భారత్ విషయంలో అగ్రరాజ్యం ఇందుకు మినహాయింపేం ఇవ్వడం లేదు. ఈ క్రమంలో.. ఇటు రాజకీయంగానూ కేంద్రం తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.తాజాగా.. ఆదివారం 112 మందితో కూడిన అమెరికా యుద్ధ విమానం అమృత్‌సర్‌లో దిగింది. అయితే వాళ్లను తీసుకొచ్చే క్రమంలో అమెరికా ఎంబసీ అధికారులు వ్యవహరించిన తీరు విమర్శలకు కారణమైంది. మతపరమైన మనోభావాలు దెబ్బతిన్నాయని సిక్కు సంఘాలు అమెరికాపై మండిపడుతున్నాయి. దాదాపు వారం పాటు క్యాంపులో ఉంచాక వాళ్లను భారత్‌కు తరలించింది అమెరికా. అయితే.. అమృత్సర్ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక వాళ్లను అక్కడే నేలపై కూర్చోబెట్టారు. వాళ్లలో కొంత మంది సిక్కుల తలకు టర్బన్(దస్తర్) లేకుండా కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ(SPGC) మండిపడుతోంది.అమెరికాలో అక్రమ వలసదారుల పేరిట నిర్బంధించినప్పటి నుంచే వాళ్లలో కొందరి నుంచి తలపాగాలు తొలగించినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన ఎస్పీజీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమృత్సర్ ఎయిర్‌పోర్టుకు ప్రత్యేక బస్సును, అందులో టర్బన్లను పంపించింది. ఈ విషయమై అమెరికా అధికారులతో చర్చిస్తామని ఎస్జీపీసీ ప్రధాన కార్యదర్శి గురుచరణ్ సింగ్ గెర్వాల్ చెబుతున్నారు. మరోవైపు.. శిరోమణి అకాలీదళ్ కూడా ఈ వ్యవహారంపై మండిపడుతోంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని.. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరుతోంది.చెత్త కుప్పలో పడేశారు!‘‘కిందటి ఏడాది నవంబర్ 27వ అక్రమంగా అమెరికా బార్డర్ దాటుతున్న నన్ను.. అధికారులు నిర్బంధించారు. రెండు వారాల కిందట నన్నో క్యాంప్‌నకు తరలించారు. అక్కడ నాతో పాటు మరికొందరిని రకరకాలుగా హింసించారు. సరైన భోజనం కూడా పెట్టలేదు. భారత్‌కు తరలించే ముందు.. టర్బన్ తొలగించాలని ఒత్తిడి తెచ్చారు. అది మతపరమైందని చెప్పినా వినకుండా బలవంతంగా తొలగించి.. చెత్తకుండీలో పడేశారు. వాటితో ఎవరైనా ఉరేసుకుంటే బాధ్యత ఎవరిదంటూ.. మాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే దారిలో విమానంలోనూ సైనికులు మాతో దురుసుగా ప్రవర్తించారు. కాళ్లకు సంకెళ్లు, చేతులకు బేడీలు వేశారు. రెండు పూటలా చిప్స్, ఫ్రూటీలు ఇచ్చారంతే. బాత్రూం వెళ్లడానికి కూడా మేం ఇబ్బందిడ్డాం. నేను నా కుటుంబం కోసం రూ.50 లక్షలు అప్పు చేసి అమెరికా వెళ్లాను. రిస్క్ లేకుండా తీసుకెళ్తానంటూ నాకు తెలిసిన ఏజెంట్ చెప్పాడు. కానీ, పనామా అడవుల(Panama Jungles) గుండా వెళ్తున్నప్పుడు దారిలో.. ఎన్నో మృతదేహాలను చూశాం. వాళ్లు మాలాగే దొడ్డిదారిన అమెరికా వెళ్లే క్రమంలో అలా అయ్యారని తెలిసి భయంతో వణికిపోయాం. చివరకు ఎన్నో కష్టాలు పడి సరిహద్దు వరకు చేరినా పట్టుబడ్డాం అని 23 ఏళ్ల జతిందర్ సింగ్ చెబుతున్నాడు.ఇంతకుముందు గురుద్వారాలోనూ అక్రమ వలసదారుల(Illegal Immigrants) కోసం అధికారులు తనిఖీలు జరిపారు. ఆ టైంలోనూ సిక్కు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉంటే.. ఇప్పటిదాకా మూడు బ్యాచ్‌లుగా.. మూడు విమానాల్లో 332 మంది అక్రమ వలసదారులు అమెరికా నుంచి భారత్‌కు చేరుకున్నారు. -
డిపోర్టేషన్‌కు అమృతసర్నే ఎందుకు?: పంజాబ్ సీఎం మాన్
చండీగఢ్: భారతీయ అక్రమ వలసదారులతో కూడిన రెండో విమానం కూడా అమృత్‌సర్‌లోనే ల్యాండవడంపై పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పవిత్ర నగరాన్ని డిపోర్ట్ సెంటర్‌గా మార్చవద్దని ఆయన కేంద్రాన్ని కోరారు. శనివారం రాత్రి అమెరికా నుంచి 119 మంది వలసదారులను తీసుకుని ప్రత్యేక విమానం రానున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. దేశంలో వైమానిక కేంద్రాలు చాలానే ఉన్నాయని, వలసదారుల విమానాలను అక్కడికి కూడా పంపించ వచ్చని పేర్కొన్నారు. ఇక్కడి వారిని వాటికన్ సిటీకి పంపిస్తామంటే అనుమతిస్తారా? అని ప్రశ్నించారు. మన వాళ్ల కోసం విమానాలను పంపుతామని ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు చెప్పాలని సూచించారు. ఇతన దేశాలు ఇలాగే చేస్తున్నాయన్నారు. -
చొరబాటు ప్రయాణం!
సాక్షి, హైదరాబాద్: మయన్మార్ నుంచి అక్రమ మార్గంలో భారత్‌లోకి చొరబడుతున్న రోహింగ్యాల్లో అనేక మంది నగరంలోనూ ఉంటున్నారా? అనే ప్రశ్నకు ఔననే అంటున్నాయి నిఘా వర్గాలు. వీరిలో అత్యధికులు హైదరాబాద్‌లోని పాతబస్తీతో పాటు శివారు ప్రాంతాల్లో స్థిరపడుతున్నట్లు చెబుతున్నాయి. కోల్‌కతాలోని సాంత్రాగచ్చి రైల్వే స్టేషన్లో అక్కడి రైల్వే పోలీసులు బుధవారం నలుగురు రోహింగ్యాలను పట్టుకున్నారు. వీళ్లు ఏళ్ల క్రితం అక్రమంగా సరిహద్దులు దాటి వచ్చి నగరంలోని పాతబస్తీలో ఉంటున్నారని, తిరిగి బంగ్లాదేశ్ వెళ్లే ప్రయత్నాల్లో అక్కడి పోలీసులకు చిక్కారు. వీరి విచారణలో మయన్మార్ నుంచి భారత్ వరకు సాగుతున్న రోహింగ్యాల ‘ప్రయాణం’ వెలుగులోకి వచ్చింది. అక్కడి అలజడులతో ఇక్కడ దడ... బంగ్లాదేశ్‌తో పాటు మయన్మార్‌లో నెలకొన్న అంతర్గత పరిస్థితులపై ఈ అక్రమ వలసదారుల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. ఆయా దేశాల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తిన ప్రతిసారీ.. అనేక మంది రోహింగ్యాలు వాటిని విడిచిపెడుతున్నారు. వీరిలో అత్యధికులు నేరుగా భారత్‌కు వలస వస్తున్నారు. నగరంలోని పాతబస్తీతో పాటు శివార్లలో స్థిరపడుతున్నారు. తాజాగా మరోసారి బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలు చెలరేగడంతో అక్రమ వలసలు పెరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మాంగ్డో నుంచి టెక్నాఫ్ నగరానికి.. మయన్మార్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన రోహింగ్యాలు అడవుల వెంట కాలిబాటన నడుస్తూ ఆ దేశంలోని మాంగ్డో అనే ప్రాంతానికి చేరుకుంటున్నారు. రాత్రి వేళల్లో చిన్న చిన్న పడవలపై నఫ్ నదిని దాటుతున్న రోహింగ్యాలను బంగ్లాదేశ్‌లో ఉన్న దళారులు రిసీవ్ చేసుకుని, భద్రత బలగాల కంట పడకుండా టెక్నాఫ్ అనే నగరానికి తీసుకువెళ్తున్నారు. అక్కడి నుంచి బస్సుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద రోహింగ్యాల శరణార్థి శిబిరం ఉన్న కాక్స్ బజార్‌కు వీళ్లు వచ్చి చేరుతున్నారు. అక్కడ ఉండగానే అనేక మంది ఐక్యరాజ్య సమితి శరణార్థి కార్డు పొందుతున్నారు. అక్కడ శరణార్థి శిబిరంలో కొన్నాళ్లు తలదాచుకుని బంగ్లాదేశ్ రాజధాని ఢాకా చేరుకుని అక్కడి నుంచి ఇండో–బంగ్లా సరిహద్దుల్లోని భోమ్రా ప్రాంతానికి బస్సుల్లో వస్తున్నారు. భద్రతా బలగాల కళ్లుగప్పి ఇచ్ఛామతి నది దాటి భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులుగా... కాక్స్ టౌన్లో పనులు చేసుకుంటే నెలకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకే సంపాదన ఉంటుందని, అదే హైదరాబాద్ లాంటి నగరాల్లో రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు సంపాదిస్తున్నామని సాంత్రాగచి్చలో చిక్కిన రోహింగ్యాలు మహ్మద్ ఆలం, రియాసుల్ ఇస్లాం, బేగం దిల్బార్, రబీల్ ఇస్లాం పశి్చమ బెంగాల్ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. అందుకే నగరానికి అక్రమ వలసదారుల్లో అనేక మంది జీవనోపాధి కోసమే వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ నుంచి అనేక వైపులకు.. ఇలా రెండు దేశాల్లోని నదులు దాటి పశి్చమ బెంగాల్‌లోని బసిర్హట్ ప్రాంతానికి చేరుకున్న ఈ శరణార్థులు అక్కడ నుంచి హౌరాకు వచ్చి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి స్థిరపడుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌తో పాటు బిహార్, జమ్మూ కశీ్మర్లకు వెళ్తున్నారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఏ ప్రాంతానికి వెళ్లినా తాము పశి్చమ బెంగాల్ వాసులమంటూ ఇంటిని అద్దెకు తీసుకుంటున్నారు. అద్దె ఇంటి కరెంట్ బిల్లు ఆధారంగా, వ్యవస్థాగతంగా ఉన్న లోపాలను వాడుకుంటున్న వీళ్లు మీ సేవ కేంద్రాల నిర్వాహకుల సాయంతో ఓటర్ ఐడీలు పొందుతున్నారు. దీని ఆధారంగా ఆధార్, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్ ఇలా వరుసగా గుర్తింపు కార్డులు తీసుకుంటున్నారు. -
భగ్నస్వప్న గాథ!
సైనిక విమానంలో చేతికి సంకెళ్లతో అమెరికా నుండి భారతీయులను బహిష్కరిస్తున్న చిత్రం మనలో చాలా మందిని తీవ్ర బాధలో ముంచెత్తింది. మెరుగైన జీవితాన్ని ఆశించిన మన తోటి పౌరులు, సోదర సోదరీమణులు ఇటువంటి అవమానకరమైన పరిస్థితులలో స్వదేశానికి తిరిగి రావడం వ్యక్తిగత విషాదం మాత్రమే కాదు; తక్షణ, సమష్టి ప్రతిస్పందన అవసరమైన జాతీయ అవమానం.హై ప్రొఫైల్ సందర్శనలు, ఫోటో ఆప్‌లపై దృష్టి సారించే పర్సనాలిటీ ఆధారితమైన విదేశాంగ విధానం... విదేశాలలో చట్టపరమైన వివాదాలలో చిక్కుకున్న పౌరులను రక్షించడానికి అవసరమైన స్థిరమైన దౌత్యాన్ని పక్కనపెడుతుందనే విషయాన్ని మనం విస్మరించగలమా? నాటకీయ హావభావాలు దృశ్యపరంగా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, కష్టాల్లో ఉన్నవారికి కాన్సులర్ తక్షణ మద్దతు లభించేలా చూసుకోవడంలో రోజువారీ పనిని అవి నిర్లక్ష్యం చేయడానికి దారితీస్తున్నాయి. ప్రపంచంలో వివిధ దేశాలకు వలసవెళ్లిన భారతీయుల కార్యక్రమాలు వ్యక్తిగత బ్రాండింగ్ కోసం విలాసవంతంగా, లీడర్ కేంద్రంగా జరిగే ధోరణిని మనం చూశాం. అయినప్పటికీ, ఈ వలసపోయిన వారిలో అత్యంత దుర్బలమైన సభ్యులు నిర్బంధం, బహిష్కరణను ఎదుర్కొన్నప్పుడు లేదా జీవనోపాధిని కోల్పోయినప్పుడు... వారికి తగినంత ప్రభుత్వ సహాయం లేకుండా పోతోంది.ఈ నేపథ్యంలో మనం ఒక కలతపెట్టే ప్రశ్నను ఎదుర్కోవలసి వస్తుంది: మన ప్రజలు భారతదేశం నుండి వెళ్లిపోవడానికి ఎందుకు ఇంత తీవ్రమైన ప్రమాదాలను సైతం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు? బలవంతంగా తిరిగి వచ్చిన ప్రతి వ్యక్తికీ లోతైన గాయం ఉంది – అది వ్యక్తులు నిరాశతో దేశం నుంచి వెళ్ళిపోయేలా చేసే వ్యవస్థాగత వైఫల్యాల కథ. అందరికీ సహాయం చేయడంలో లేదా దేశంలోని ప్రతి మూలలో ఆశను నింపడంలో మన సమాజ అసమర్థత... తమ ఇష్టానికి వ్యతిరేకంగా భారతదేశానికి తిరిగి వచ్చే వారి దృశ్యాలున్న వీడియోలలో బహిర్గతమవుతోంది. ఒకప్పుడు వారిని ప్రేరేపించిన స్వప్నాలు ఇప్పుడు బహిష్కరణతో భంగమయ్యాయి.దేశంలో నెలకొని ఉన్న నిర్మాణాత్మకమైన అసమానతలను, స్పష్టమైన ఆర్థిక పరిస్థితులను మనం విస్మరించలేము. ఇవి చాలా మంది భారతీయులను ప్రమాదకరమైన ప్రయాణాలను ఎంచుకోవడానికి ప్రేరేపించాయి. దీర్ఘకాలిక నిరుద్యోగం నుండి తక్కువ వేతనాల వరకు; గ్రామీణ దుఃస్థితి నుండి పట్టణ పేదరికం వరకు... ఎన్నో కారకాలు! ఇవి కేవలం దేశం నుంచి ‘బయటపడవేసే కారకాలు’ మాత్రమే కావు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యవస్థాగత నిర్లక్ష్యానికి సంకే తాలు! అయితే ప్రపంచ అసమానతలు మరిన్ని సమస్యలను పెంచుతాయనుకోండి. కానీ ప్రాథమిక సమస్య ఏమిటంటే మన సొంత ఇల్లు (భారత్) అస్తవ్యస్తంగానే ఉంది. భారతదేశంలో యువతీ యువకులకు ఎటువంటి ఆచరణీయమైన మార్గాలూ కనిపించనప్పుడు స్థిరమైన జీవనో పాధి, గౌరవప్రదమైన ఉపాధి లేకపోవడంతో... విదేశాల్లో ఉన్నప్పుడు వీసాలు గడువు ముగిసినా అక్కడే ఉండడానికి ప్రయత్నించడం లేదా సరైన డాక్యుమెంటేషన్ లేకుండా బయటి దేశాలలోకి ప్రవేశించడం... మెరుగైన భవిష్యత్తును పొందేందుకు ఏదైనా మార్గం కోసం ప్రయత్నించడం జరూర్ అవసరంగా మారుతుంది.ఇలాంటి సంక్షుభిత క్షణాల్లో, భారత ప్రభుత్వానికి తన పౌరులను ఎక్కడ ఉన్నా రక్షించాల్సిన రాజ్యాంగబద్ధమైన, నైతిక బాధ్యత ఉందని మనం గుర్తు చేసుకోవాలి. ప్రభుత్వ బాధ్యత మన సరిహద్దుల వద్దే ముగియదు. బహిష్కరణ ప్రక్రియ గౌరవంగా జరుగుతోందని నిర్ధారించడానికి కాన్సులర్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుత అవమా నకరమైన దృశ్యాలు ప్రభుత్వ ప్రమత్తతనే సూచిస్తోంది. ఇప్పుడు చాలా మంది భారతీయులు బహిష్కరణ చర్యలను ఎదుర్కొంటున్నందున, ఈ బాధాకరమైన ప్రక్రియలో తీవ్రమైన బలప్రయోగాన్ని, అవమానకరమైన పరిస్థితులను నివారించ డానికి మన అధికారులు చర్యలు తీసుకోవడం అత్యవసరం.భారత ప్రభుత్వం నిష్క్రియాత్మకంగా, కేవల స్పందనాత్మకంగా ఉండకూడదు. అన్నింటి కంటే ముందు, బహిష్కృతుల సంఖ్య గురించి పారదర్శకత ఉండాలి. బహిష్కరణను ఎదుర్కొంటున్న వారికి చట్టపరమైన, ప్రయాణ పరమైన సహాయంతో సహా భారత కాన్సులేట్ సమగ్ర మద్దతును అందించాలి. చాలామంది బ్యాంకు ఖాతాలు, వాహనాలు, ఇతర ఆస్తులను వదిలివేసి వస్తున్నారు. వాటిని వారు అమెరికాలో ఇప్పటికీ చట్టబద్ధంగా కలిగి ఉన్నారు. భారతదేశం నుండి వీటిని అందుకోవడానికి, నిర్వహించడానికి వారికి సహాయం చేయాలి. వలసలో ఉన్నవారితో, పౌర సమాజంతో కలిసి పనిచేస్తూ, బహిష్క రణకు ముందే... లేదా బహిష్కరణ జరిగిన వెంటనే వారి ఆస్తిని రక్షించడంలో, వెనక్కు తీసుకురావడంలో భారతీయులకు మనం ముందస్తుగా మద్దతు ఇవ్వాలి. అలాంటి చర్యలు లేకుంటే, వ్యక్తులు మరింత ఆర్థిక నష్టానికి గురవుతారు. వారి కష్టాలు మరింత పెరుగుతాయి కూడా!సమీప భవిష్యత్తులో బహిష్కరించబడే వారిలో తోడు లేని మైనర్లు, గర్భిణులు, అత్యవసర వైద్యం లేదా మానసిక అవసరాలు ఉన్న ఇతరులు ఎవరైనా ఉండవచ్చు. ఈ బలవంతపు తొలగింపుల సమయంలో కుటుంబాలు, పిల్లలు, మహిళలు ఎదుర్కొనే చికిత్స గురించి ఆందోళన ఉంది. భారతదేశానికి తిరిగి వచ్చిన బహిష్కృతుల గతి ఏమిటి? వారిలో చాలామందికి ఎటువంటి భరోసా ఉండదు. కొందరికి తమ వలస కారణంగా పేరుకుపోయిన అప్పులు ఇక్కడ ఎదురవుతాయి. మరికొందరు విదేశా లలో స్థిరపడటంలో ‘విఫలమయ్యారు’ అనే ఎగతాళి మాటను ఎదుర్కోవలసి వస్తుంది. విదేశీ తీరాలపై ఆశలను పెట్టుకున్న వ్యక్తుల ‘విధి’ ఇప్పుడు మరింత ప్రమాదంలో ఉంది. మనలో అత్యంత దుర్బలమైన వారితో... అంటే తీవ్రమైన అవసరం కారణంగా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లి, బాధతో తిరిగి వచ్చిన వారితో మనం ఎలా వ్యవహరిస్తాం అనే అంశంలో మన దేశ గౌరవం, నైతిక నిర్మాణం పరీక్షించబడతాయి. భారతదేశం నిజంగా ప్రపంచ శక్తిగా ఎదగాలని కోరుకుంటే, దాని పౌరులు అభివృద్ధి చెందడానికి దేశం నుండి పారిపోవాల్సిన అవసరం లేదని నిర్ధారించుకోవడం ద్వారా ప్రారంభించాలి. అంతర్గతమైన ఆర్థిక అసమానతలను ఎదుర్కోవాలంటే... మరింత సమ్మిళితమైన, గౌరవప్రదమైన మాతృభూమిని సృష్టించాలనే సమష్టి సంకల్పాన్ని చేసుకోవాలి. ఈ బహిష్కరణలు ఈ అవసరాన్నే డిమాండ్ చేస్తున్నాయి.మనోజ్ కుమార్ ఝా వ్యాసకర్త రాజ్యసభ సభ్యుడు (రాష్ట్రీయ జనతా దళ్) -
కరిగిపోయిన అమెరికా కల
చండీగఢ్/హోషియార్పూర్(పంజాబ్): ప్రమాదకరరీతిలో సముద్రంలో పడవ ప్రయాణం, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని కిలోమీటర్ల కొద్దీ నడక, మెక్సికో సరిహద్దులోని చీకటి గదుల్లో బస.. ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికాకు ఎలాగైనా చేరుకునేందుకు భారతీయ అక్రమ వలసదారుల పడిన కష్టాలెన్నో. రహస్యంగా సరిహద్దు దాటించే ఏజెంట్లకు అప్పు చేసి మరీ డబ్బులు కట్టి అమెరికాకు ఎలాగోలా చేరుకుంటే తిరిగి పోలీసులకు దొరికిపోయి సంకెళ్లతో స్వదేశానికి వచ్చిన కొందరు అక్రమ వలసదారులు తమ కన్నీటి కష్టాలను మీడియా ముందు వెళ్లబోసుకున్నారు. తమ అమెరికా కల ఎలా చెదిరిపోయిందో వివరించారు. తీవ్రమైన నేరస్తుల్లా చేతులకు, కాళ్లకు బేడీలు వేసి సైనిక విమానంలో అమెరికా భారత్‌కు పంపింది. ఒకే ఒక టాయిలెట్ ఉన్న సైనిక విమానంలో వందమందికి పైగా అక్రమ వలసదారులను కుక్కి ఏకంగా 24 గంటల పాటు ప్రయాణం చేసి రావడం ఒక ఎత్తయితే అసలు తాము వచ్చేది స్వదేశానికి అన్న విషయం అమృత్సర్ విమానాశ్రయంలో అడుగుపెట్టేదాకా వారికి తెలియకపోవడం మరో విషాదం. అమెరికా నుంచి అమృత్‌సర్‌కు చేరుకున్న సైనిక విమానంలో 105 మంది వలసదారులన్నారు. వీరిలో హరియాణా రాష్ట్రానికి చెందిన వాళ్లు 33 మంది ఉన్నారు. గుజరాత్(33), పంజాబ్(30), మహారాష్ట్ర(3), ఉత్తరప్రదేశ్(3), చండీగఢ్(2) రాష్ట్రాల వాళ్లూ ఉన్నారు. అమెరికా తిరిగి పంపిన వారిలో 19 మంది మహిళలు, నాలుగేళ్ల బాలుడు, ఐదేళ్లు, ఏడేళ్ల వయసున్న బాలికలున్నారు. ఇక్కడికొచ్చాక భారత అధికారులు పోలీసు వాహనాల్లో ఈ వలసదారులను స్వస్థలాలకు తరలించారు. వీరిలో ఒకొక్కరిదీ ఒక్కో గాథ. అందరిదే ఒకటే వ్యథ. చీకటి గదిలో ఉంచారు ‘‘నన్ను డంకీ మార్గం గుండా తీసుకెళ్లారు. మేం వెళ్తుండగా మార్గమధ్యంలో రూ.35 వేల విలువైన దుస్తులు చోరీ అయ్యాయి. మమ్మల్ని మొదట ఇటలీకి, ఆ తర్వాత లాటిన్ అమెరికాకు తీసుకెళ్లారు. 15 గంటల పాటు పడవ ప్రయాణం. తర్వాత దాదాపు 45 కిలో మీటర్లు నడిచాం. దాదాపు 18 కొండలు దాటాం. అంతెత్తు నుంచి జారిపడ్డామంటే బతికే అవకాశమే లేదు. మార్గమధ్యంలో కొన్ని మృతదేహాలను కూడా చూశాం. అమెరికాలోకి ప్రవేశించడానికి సరిహద్దు దాటకముందే మెక్సికోలో నన్ను అరెస్ట్ చేశారు. 14 రోజుల పాటు చీకటి గదిలో ఉంచారు. వేలాది మంది పంజాబీలు, వాళ్ల కుటుంబాలు, వాళ్ల పిల్లలు ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో బతుకీడుస్తున్నారు. మేం వెళ్లి ఎన్నో కష్టాలు పడ్డాం. ఇంకెవరూ ఇలా తప్పుడు మార్గాల్లో విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నించకండి’’ అని పంజాబ్‌లోని జలంధర్ జిల్లా దారాపూర్ గ్రామానికి చెందిన సుఖ్‌పాల్ సింగ్ సలహా ఇచ్చారు. కపుర్తలాలోని తర్ఫ్ బెహ్బల్ బహదూర్ గ్రామానికి చెందిన గుర్ప్రీత్ సింగ్‌ను అతని కుటుంబం ఇంటిని తాకట్టు పెట్టి అప్పు చేసి మరీ అమెరికాకు పంపింది. ఫతేగఢ్ సాహిబ్‌లో జస్వీందర్ సింగ్‌ను విదేశాలకు పంపేందుకు అతని కుటుంబం రూ.50 లక్షలు అప్పు చేసింది. పంజాబ్‌లో ఎన్ఆర్ఐలు ఎక్కువగా ఉండే జలంధర్, హోషియార్పూర్, కపుర్తలా, నవాన్షహర్ జిల్లాల్లో ప్రతి గ్రామంలోనూ ఇలాంటి కథలే ఎప్పుడూ వినిపిస్తుంటాయి. ఇక్కడి నుంచి ఏటా పెద్ద సంఖ్యలో స్థానికులు డాలర్లవేటలో పడి విదేశాలకు అక్రమ మార్గాల్లో వలసలు వెళ్తున్నారు. ఉజ్వల భవిష్యత్తును ఆశిస్తూ అమెరికా వెళ్తున్నారు. ఏజెంట్ల చేతుల్లో మోసపోతున్నారు. ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సంకెళ్లతో ప్రయాణం ‘‘చట్టబద్ధంగానే అమెరికా పంపిస్తానని చెప్పి ట్రావెల్ ఏజెంట్ మోసం చేశాడు. అందుకు రూ.30 లక్షలు తీసుకున్నాడు. గతేడాది జూలైలో విమానంలో బ్రెజిల్‌కు వెళ్లాను. అక్కడి నుంచి అమెరికాకు కూడా విమానంలోనే పంపిస్తామని చెప్పారు. కానీ అందుకు భిన్నంగా జరిగింది. ఆరు నెలలపాటు బ్రెజిల్లో ఉన్న తరువాత.. అక్రమంగా సరిహద్దు దాటించి పంపేందుకు ప్రయత్నించారు. అమెరికా బోర్డర్ పెట్రోలింగ్ పోలీసులు అరెస్టు చేశారు. అక్కడ 11 రోజుల పాటు కస్టడీలో ఉంచి ఆ తర్వాత ఇంటికి పంపించారు. భారత్‌కు పంపించేస్తున్నట్లు నాకు తెలియదు. ఏదో క్యాంప్‌కు తీసుకెళ్తున్నా రని అనుకున్నాం. అమృత్సర్ విమానాశ్రయం వచ్చాక సంకెళ్లను తీసేశారు. బహిష్కరణతో కుంగిపోయా. అమెరికా వెళ్లడానికి అప్పు చేశా ను. కుటుంబానికి మంచి భవిష్యత్ ఇవ్వా లని కలలు కన్నా. ఇప్పుడవన్నీ చెదిరిపోయాయి’’ అని గురుదాస్ పూర్ జిల్లాలోని హర్దోర్వాల్ గ్రామానికి చెందిన జస్పాల్ వాపోయారు.సముద్రంలో, అడవిలో ప్రాణాలు పోయాయి ‘‘గత ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్లా. తొలుత యూరప్‌కు, ఆ తర్వాత మెక్సికోకు తీసుకెళ్తామని ట్రావెల్ ఏజెంట్ హామీ ఇచ్చాడు. రూ.42 లక్షలు చెల్లించాను. కానీ ఖతార్, బ్రెజిల్, పెరూ, కొలంబియా, పనామా, నికరాగ్వా, ఆ తర్వాత మెక్సికో దేశాల గుండా తీసుకెళ్లారు. పర్వత మార్గం గుండా నడుచుకుంటూ వెళ్లాం. మెక్సికో సరిహద్దు వైపు లోతైన సముద్రంలోకి ఒక చిన్న పడవలో పంపారు. నాలుగు గంటల సముద్ర ప్రయాణం. మా పడవ బోల్తా పడింది. మాతో వచ్చిన వలసదారుల్లో ఒకరు నీటిలో పడి జలసమాధి అయ్యారు. మరొకరు పనామా అడవి గుండా వెళ్తుండగా ప్రాణాలు కోల్పోయారు. నేను మాత్రం ప్రాణాలతో బయటపడ్డా. దారిలో కొన్నిసార్లే అన్నం దొరికేది. మంచి భవిష్యత్తుపై ఆశతో అధిక వడ్డీకి అప్పు చేసి ఏజెంట్‌కు చెల్లించాం. కానీ ఏజెంట్ మమ్మల్ని మోసం చేశారు. అమెరికా బహిష్కరించడంతో చివరకు భారీ అప్పుతో సొంతూరకు వచ్చిపడ్డాం’’ అని హోషియార్ పూర్ జిల్లాలోని తహ్లీ గ్రామవాసి హర్విందర్ సింగ్ ఆవేదన వ్యక్తంచేశారు. -
అవమానించినా మొద్దునిద్రేనా?
న్యూఢిల్లీ: అమెరికాలోని భారతీయ అక్రమ వలసదార్లకు బేడీలు వేసి స్వదేశానికి తరలించిన ఘటనపై గురువారం పార్లమెంట్ ఉభయ సభలు అట్టుడికిపోయాయి. భారతీయులను అమెరికా ప్రభుత్వం ఘోరంగా అవమానించినా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదని విపక్ష సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉభయ సభల్లో ఆందోళనకు దిగారు. మోదీ సర్కారు వెంటనే సమాధానం చెప్పాలని నిలదీశారు. లోక్‌సభలో వెల్‌లోకి దూసుకొచ్చి బిగ్గరగా నినాదాలు చేశారు. శాంతించాలని స్పీకర్ కోరినా వారు వినిపించుకోలేదు. దీంతో సభను నాలుగుసార్లు వేయాల్సి వచి్చంది. షెడ్యూల్ ప్రకారం లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై చర్చించాల్సి ఉంది. కానీ, భారతీయులకు జరిగిన అవమానంపై చర్చించడానికి వాయిదా తీర్మానాన్ని కోరుతూ కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్‌తోపాటు పలువురు విపక్ష ఎంపీలు నోటీసులు ఇచ్చారు. సభాపతి అంగీకరించకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంత అవమానం జరుగుతున్నా సర్కారు మొద్దు నిద్ర వీడడం లేదని దుయ్యబట్టారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభ నాలుగు సార్లు వాయిదా పడిన పరిస్థితిలో మార్పు రాలేదు. సాయంత్రం విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ లోక్‌సభలో ఒక ప్రకటన చదివి వినిపించారు. స్వదేశానికి తరలించే భారతీయులను అవమానించకుండా అమెరికా అధికారులతో చర్చిస్తున్నామని చెప్పారు. జైశంకర్ ప్రకటన తర్వాత కూడా విపక్షాల నిరసన కొనసాగింది. సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. రాజ్యసభలోనూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. మనవాళ్ల పట్ల అమెరికా అధికారులు అమర్యాదకరంగా ప్రవర్తిస్తే మోదీ సర్కారు ఎందుకు పట్టించుకోవడం లేదని విపక్ష సభ్యులు ధ్వజమెత్తారు. పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన పార్లమెంట్ సమావేశాల ప్రారంభం కంటే ముందు ప్రతిపక్ష సభ్యులు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్ సభ్యులు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తోపాటు పలువురు విపక్ష ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొందరు ఎంపీలు చేతులకు సంకెళ్లు ధరించారు. ‘ఖైదీలు కాదు... మనుషులు’ అని రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. భారత్‌ను, భారతీయులను అవమానిస్తే సహించబోమని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. గౌరవ మర్యాదలతో వెనక్కి తీసుకురాలేరా? అమెరికా నుంచి భారతీయుల తరలింపుపై మోదీ ప్రభుత్వం సమగ్రమైన ప్రకటన చేయాలని కాంగ్రెస్ అధ్యక్షడు మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్’లో డిమాండ్ చేశారు. భారతీయులను గౌరవ మర్యాదలతో వెనక్కి తీసుకురావడానికి మన విమానాలు ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు. ఆవేదన వెల్లడిస్తున్న భారతీయ వలసదారుడి వీడియోను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఈ బాధితుడి ఆవేదన వినాలని ప్రధాని మోదీకి సూచించారు. భారతీయులకు కావాల్సింది గౌరవం, మానవత్వం తప్ప సంకెళ్లు కాదని తేల్చిచెప్పారు. ప్రధానమంత్రి మోదీ ఇప్పటికైనా నోరు విప్పాలని ప్రియాంక అన్నారు. మనవాళ్లను మనం ఎందుకు తీసుకురాలేకపోయామని అన్నారు మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య మంచి స్నేహం ఉన్నప్పటికీ భారతీయులకు ఈ పరిస్థితి ఎందుకు వచి్చందో చెప్పాలని నిలదీశారు. మన దేశం నుంచి ఎవరినైనా పంపించాల్సి వస్తే ఇలాగే బేడీలు వేసి పంపిస్తారా? అని ప్రశ్నించారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, శివసేన (ఉద్ధవ్) ఎంపీ ప్రియాంక చతుర్వేది, కాంగ్రెస్ ఎంపీలు గౌరవ్ గొగోయ్, శశి థరూర్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్ తదితరులు మోదీ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. -
అమెరికా అమానుషత్వం
సహజ వనరులు పుష్కలంగా ఉన్న దేశాలపై కన్నేసి వాటిని నయానో భయానో ఒప్పించి అక్కడి ప్రాంతాలను దురాక్రమించాలని చూస్తున్న అమెరికా... పొట్టకూటి కోసం తనను ఆశ్రయించినవారి పట్ల మాత్రం అమానుషంగా, హేయంగా ప్రవర్తిస్తున్నదని రుజువైంది. సైనిక విమానంలో అమృత్ సర్ చేరుకున్నవారి కథనాలు వింటుంటే దిగ్భ్రాంతి కలుగుతుంది. చేతులకు సంకెళ్లు వేసి, కాళ్లకు గొలుసులు కట్టి, కూర్చోవటానికి కూడా అసౌకర్యంగా ఉండే సైనిక విమానంలో పశువుల్ని తరలించిన చందాన మనవారిని తీసుకొచ్చారు. ఇందులో 19 మంది మహిళలు, 13 మంది మైనర్లు కూడా ఉన్నారని మీడియా కథనాలు చెబుతున్నాయి. గత నెలలో కొలంబియా, మెక్సికో దేశాలవారిని ఈ పద్ధతిలోనే పంపటానికి ప్రయత్నించినప్పుడు వాటినుంచి నిరసన వ్యక్తమైంది. అమెరికా సైనిక విమానాలకు అనుమతినీయబోమన్నాయి. చివరకు కొలంబియా తలొగ్గినా మెక్సికో మాత్రం తమ విమానాన్ని పంపి వలసదారులను వెనక్కు తెచ్చుకుంది. బ్రెజిల్ సైతం తమవారిపట్ల అమానుషంగా వ్యవహరించటాన్ని ఖండించింది. భారతీయులకు జరిగిన అవమానంపై సహజంగానే పార్లమెంటులో గురువారం ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారిని గుర్తించి వెనక్కు పంపటం ఏ దేశంలోనైనా జరిగేదే. పార్లమెంటులో విదేశాంగమంత్రి జైశంకర్ చెప్పినట్టు అక్రమ వలసదారులను వెళ్లగొట్టడం కొత్తేమీ కాదు. ఏ దేశమూ అలాంటివారిని సమర్థించదు. అక్రమ వలసల్ని ప్రోత్సహించదు. కానీ వెనక్కు పంపే క్రమం మానవీయంగా, నాగరికంగా ఉండాలి. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలి. చట్టబద్ధంగానో, చట్టవిరుద్ధంగానో తమ భాష, తమ ప్రాంతం కానివారు ప్రవేశిస్తే సహజంగానే స్థానికుల్లో అనేక సంశయాలు కలుగుతాయి. తెలియని భయాందోళనలుంటాయి. ప్రభుత్వాలకుండే ఇతరేతర అనుమానాలు సరేసరి. అమెరికాలో రిపబ్లికన్ల ఏలుబడివున్నా, డెమాక్రాట్ల ప్రభుత్వం నడిచినా అక్రమ వలసదారులను కనికరించింది లేదు. కాకపోతే ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో దాన్నొక బూచిగా చూపారు. శ్వేతజాతీయులు ఎదుర్కొంటున్న సకల సమస్యలకూ మూలం వలసదారులేనన్న భ్రమ కలగజేయటంలో, వారికి డెమాక్రటిక్ పార్టీ మద్దతునిస్తున్నదని నమ్మించడంలో విజయం సాధించారు. తాను అధికారంలోకొచ్చాక అలాంటి వారందరినీ గుర్తించి పంపేస్తానని పదే పదే చెప్పారు. ఆ ప్రచారం ఆయనకు గణనీయంగా వోట్లు రాల్చింది. కానీ తమది ప్రపంచంలోనే పురాతన ప్రజా స్వామ్య వ్యవస్థ అని స్వోత్కర్షకు పోయే దేశం వలసదారులను పశువులకన్నా హీనంగా పరిగణించటం, వారి కనీస మానవహక్కులను బేఖాతరు చేయటం సబబేనా? వలసదారులు తిరుగుబాటు చేయడానికి రాలేదు. వారి దగ్గర మారణాయుధాలుండవు. ఏజెంట్లను నమ్మి, వారికి లక్షలకు లక్షలు అర్పించుకుని నిజంగా అమెరికా చాన్సు వచ్చిందేమోనన్న భ్రమలో కొందరు నిర్భాగ్యులు విమానం ఎక్కుతారు. వారిని ఇటలీ, బ్రెజిల్, మెక్సికో, పెరూవంటి దేశాల్లో దించి ‘మీ చావు మీరు చావండ’ని గాలికొదిలేస్తారు. తమ దగ్గరున్న కాగితాలు నిజమైన వేనన్న భ్రమలో ఉన్న వలసదారులకు అప్పుడిక ఏం చేయాలో పాలుపోదు. చివరకు దేవుడిపై భారంవేసి ముందుకు పోవటానికే నిర్ణయించుకుని కొండలూ, గుట్టలూ, నదులూ దాటుకుంటూ తిండీతిప్పలూ లేక నీరసించి అమెరికా సరిహద్దులకు చేరుకుంటారు. అదృష్టం ఉంటే అక్కడి భద్రతా బలగాల కళ్లుగప్పి ఆ దేశంలోకి ప్రవేశిస్తారు. లేదా దొరికిపోయి జైళ్లపాలవుతారు. భ్రమ లన్నీ అడుగంటి, అక్కడ ఉండలేక, వెనక్కొచ్చే దారి దొరక్క జైళ్లలో మగ్గుతారు. సవ్యంగా పంపితే ‘బతుకు జీవుడా’ అనుకుంటూ అక్కడినుంచి నిష్క్రమించటానికే అత్యధికులు సిద్ధంగా ఉంటారు. అలాంటివారిపైనా ట్రంప్ ప్రతాపం! అప్పుడెప్పుడో వియత్నాం మొదలుకొని వర్తమానంలో గాజా వరకూ అమెరికా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేర్వేరు దేశాల్లో సాగించిన అకృత్యాల మాటేమిటి? వాటికి పడాల్సిన శిక్షేమిటి? ఏనాడైనా ఆత్మసమీక్ష చేసుకుందా? ఎడ్వర్డ్ స్నోడెన్, చెల్సియా మానింగ్ వంటివారు బట్టబయలు చేసిన రహస్య పత్రాలను ఒకసారి అమెరికా చదువుకుంటే మంచిది. అక్రమ వలసదారులను సమర్థించాలని ఎవరూ చెప్పరు. కానీ అమెరికా వ్యవహరించిన తీరును మన ప్రభుత్వం ఖండించాల్సిన అవసరం లేదా? గతంలో యూపీఏ హయాంలో అమెరి కాలో మన దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేపై వచ్చిన ఆరోపణలు ఆసరా చేసుకుని ఆమెకు సంకెళ్లు వేసి, వివస్త్రను చేసి తనిఖీ చేసినప్పుడు మన ప్రభుత్వం అప్పటి అమెరికా రాయబారి నాన్సీ పావెల్‌ను పిలిపించి తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. భారత్‌లో పర్యటిస్తున్న అమెరికన్ కాంగ్రెస్ సభ్యుల్ని కలుసుకునేందుకు మన నాయకులు నిరాకరించారు. అమెరికా దౌత్య కార్యాలయ సిబ్బందికిచ్చే అనేక రాయితీలనూ, సౌకర్యాలనూ ఉపసంహరించారు. దౌత్యరంగంలో రెండు దేశాల మధ్యా విడ దీయరాని అనుబంధం ఉండి వుండొచ్చు. అది మనకు మిత్ర దేశమే కావొచ్చు. వలస దారులను సవ్యంగా పంపి వుంటే సమస్యే ఉత్పన్నమయ్యేది కాదు. కానీ జరిగింది అందుకు భిన్నం. ఈ విషయమై పార్లమెంటులో వ్యక్తమైన అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలి. తప్పును తప్పని చెప్పితీరాలి. వలసదారుల విషయంలో ఎలా వ్యవహరించాలో చెప్పే అంతర్జాతీయ ఒడంబడిక లున్నాయి. అగ్రరాజ్యమైనంత మాత్రాన వాటిని బేఖాతరు చేస్తానంటే కుదరదు. మున్ముందు ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకోకూడదనుకుంటే మన నిరసనను తెలియజేయటమే ఉత్తమం. -
‘అవును.. సంకెళ్లు, గొలుసులతో బంధించే తీసుకొచ్చారు!’
న్యూఢిల్లీ: అక్రమ వలసదారులపై ఉక్కు పాదం మోపే విషయంలో ట్రంప్ కఠిన వైఖరిని వీడడం లేదు. భారత్‌తో ఎంత దగ్గరి సంబంధాలు ఉన్నా.. ఈ విషయంలో మినహాయింపు లేదని పరోక్షంగా సంకేతాలిచ్చారు కూడా. ఈ క్రమంలో బుధవారం తొలిబ్యాచ్ భారత్‌కు చేరుకోగా.. వాళ్ల పట్ల యూఎస్ ఎంబసీ వ్యవహరించిన తీరు ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది. అమెరికా నుంచి భారత్‌కు చేరుకునేంత వరకు.. తమ కాళ్లు చేతులకు బంధించే ఉంచారని వాపోయారు వాళ్లు. ‘‘అమెరికాలో మమ్మల్ని ఓ క్యాంప్‌లో ఉంచారు. అక్కడి నుంచి మమ్మల్ని మరో క్యాంప్‌నకు తరలిస్తారని భావించాం. కానీ, అలా జరగలేదు. ఓ పోలీస్ అధికారి వచ్చి ఇండియాకు తిరిగి పంపించేస్తున్నామని చెప్పారు. అయితే విమానం ఎక్కాక చేతులకు సంకెళ్లు వేసి.. కాళ్లను గొలుసులతో కట్టేశారు. అమృత్‌సర్‌లో దిగేంత వరకు మమ్మల్ని అలాగే ఉంచారు’’ అని పంజాబ్‌కు ెందిన 36 ఏళ్ల జస్పాల్ సింగ్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.అయితే.. అలాంటిదేం జరగలేదని, అదంతా తప్పుడు ప్రచారం ఇంతకు ముందు కేంద్రం కొట్టిపారేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఫొటోను కూడా ఫ్యాక్ట్ చెక్ ద్వారా అబద్ధంగా తేల్చేసింది. అది గ్వాటెమాలకు సంబంధించిన అక్రమ వలసదారుల చిత్రమని స్పష్టం చేసింది. అయితే.. తాజాగా వలసదారుల వ్యాఖ్యల నేపథ్యంలో భారతీయులను అవమానకరరీతిలో వెనక్కి పంపించారని కాంగ్రెస్ పార్టీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. 2013లో భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగఢేను ఇలాగే అవమానిస్తే.. అప్పటి యూపీఏ ప్రభుత్వం తీవ్రంగా స్పందించని, దీంతో అమెరికా ప్రభుత్వం దిగివచ్చి విచారం వ్యక్తం చేసిందని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది.ట్రంప్ అధికారం చేపట్టాక.. అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపిచేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ క్రమంలో తరలింపు కోసం ఎలాంటి సౌకర్యాలు లేని యుద్ధవిమానాలను ఉపయోగించడం, పైగా వాళ్లకు బేడీలు వేసి మరీ లాక్కెళ్తూ అమానుషంగా ప్రవర్తిస్తుండడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథజస్పాల్తో పాటు మరికొందరు భారతీయులు జనవరి 24వ తేదీన మెక్సికో సరిహద్దు వద్ద అక్రమంగా అమెరికాలో చొరబడుతున్న టైంలో పట్టుబడ్డారట. ఓ ఏంజెట్ చేసిన మోసం వల్లే తాను ఇలాంటి పరిస్థితిలో ఉన్నానని జస్పాల్ కంటతడి పెట్టాడు. హర్విందర్ అనే యువకుడు మాట్లాడుతూ.. తనను ఏజెంట్ ఖతార్, బ్రెజిల్, పెరూ, కొలంబియా, పనామా, ఇలా.. అంతటా తిప్పి మెక్సికోకు చేర్చాడని, అయితే అక్కడి నుంచి అమెరికా వెళ్లే క్రమంలో తమ బోటు ప్రమాదానికి గురైందని వివరించాడు. ఆ ప్రమాదంలో కొందరు చనిపోగా.. తనతోపాటు కొందరు ప్రాణాలతో బయటపడ్డారని చెప్పుకొచ్చాడు. పంజాబ్‌కే చెందిన మరో వ్యక్తి.. తన బట్టలను ఎవరో దొంలించారని చెబుతున్నాడు. కొండలు దాటి, కిలో మీటర్లు ప్రయాణించి అమెరికాలోకి ప్రవేశించేందుకు వాళ్లు చేసిన ‘డంకీ’ కష్టాల గురించి వాళ్లంతా మీడియాకు వివరించారు. దారి పొడవునా శవాలను దాటుకుంటూ.. అత్యంత కష్టతరమైన పరిస్థితుల నడుమ తాము ప్రయాణించామని చెబుతున్నారు వాళ్లు. వాళ్లను కదిలిస్తే.. ఒక్కొక్కరిది ఒక్కో గాథ. ఆర్థిక సమస్యలతోనే తాము దొడ్డిదారిన అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించామని చెబుతున్నారు.డంకీ అంటే మరోదేశంలోకి అక్రమంగా చొరబడడంఇక.. తొలి బ్యాచ్‌లో 104 అక్రమ వలసదారులు రాగా.. 33 మంది హర్యానా, గుజరాత్ 33, పంజాబ్ 30 మందిని, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ నుంచి ముగ్గురు చొప్పున, ఛండీగఢ్ నుంచి ఇద్దరు ఉన్నారు. అలాగే 19 మంది మహిళలు, 13 మంది మైనర్లు ఉన్నారు. నాగేళ్ల పిల్లాడు, ఐదు..ఏడేళ్ల వయసున్న అమ్మాయిలూ ఉన్నారు. ఇక.. అమృత్‌సర్‌లో దిగిన వలసదారులతో పంజాబ్ మంత్రి కుల్దీప్ మాట్లాడారు. ఎలాంటి కేసులు ఉండబోవని, గుర్తింపులను ధృవీకరించుకున్నాక స్వస్థలాలకు పంపిస్తామని వాళ్లకు ఆయన భరోసా ఇచ్చారు. -
చెదిరిన డాలర్ డ్రీమ్స్
అక్రమ వలసల్ని సహించేది లేదనీ, అక్రమ వలసదారుల్ని అమెరికా నుంచి వెనక్కి పంపేవరకు నిద్రపోయేది లేదనీ చెబుతూ వస్తున్న అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు చేతల్లోకి దిగారు. సరైన పత్రాలు లేకుండా తమ దేశంలో ఉంటున్న భారత్‌కు చెందిన అక్రమ వలసదారుల్లో కొందరిని తొలి విడతగా వెనక్కి పంపేశారు. అమెరికాలోని టెక్సాస్‌లో శాన్ ఆంటోనియో నుంచి బయలు అమెరికన్ యుద్ధవిమానం బుధవారం మధ్యాహ్నం మన అమృత్‌సర్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగడంతో కొత్త అంకం ఆరంభమైంది. ఆ ఖరీదైన సీ–17 అమెరికా యుద్ధ విమానం నుంచి 104 మంది భారతీయ అక్రమ వలసదారులు వెనక్కి వచ్చినట్టు కథనం. వచ్చిన వారి పత్రాలనూ పరిశీలించి, ప్రాథమికంగా ప్రశ్నించి, వైద్యపరీక్షలు సైతం చేసి, ఎలాంటి నేర చరిత్రా లేదని నిర్ధరించుకున్నాక వారిని స్వరాష్ట్రాలకు పంపే పనిలో భారత పాలనా యంత్రాంగం నిమగ్నమైంది. గడచిన బైడెన్ హయాంలో 2024లో అమెరికాతో మన సంబంధాలు కొంత అడుగంటాక, తాజా ట్రంప్ ఏలుబడిలో వాటిని మళ్ళీ బలోపేతం చేసుకోవాలని మోదీ సర్కార్ భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ అక్రమ వలసల అంశం కొంత చీకాకు పరిచేదే అయినా, అనివార్యతల్ని గ్రహించి, సహనంతో సమస్యల్ని చక్కదిద్దుకోవడమే భారత్ ముందున్న మార్గం. పత్రాలు లేకుండా ఉంటున్నవారిని సహించేది లేదని హెచ్చరిస్తూ వచ్చిన ట్రంప్ జనవరి 20న అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అలాంటివారిని ఏరి ఏరి మరీ భారత్‌కు వెనక్కు పంపడం ఇది తొలిసారి. గతంలో, గ్వాటెమలా, పెరూ, హాండూరస్ల నుంచి చట్టవిరుద్ధంగా వలస వచ్చినవారిని తిరుగు టపాలో పంపేందుకు అమెరికా సైనిక విమానాన్ని వినియోగించింది. ఇప్పుడు మన విషయంలోనూ అదే చేసింది. వెనక్కి పంపేందుకు సిద్ధం చేసిన 15 లక్షల మంది జాబితాలో భారతీయులు 18 వేల మంది దాకా ఉన్నారట. అంటే, రానున్న నెలల్లో ఇలాంటి మరిన్ని విమానాల్లో వందల సంఖ్యలో మనవాళ్ళు వెనక్కి రానున్నారన్నది చేదు నిజం. అంటే, ఎంత స్నేహమున్నా అసలు సంగతికొచ్చే సరికి అగ్ర రాజ్యాధినేత భారత్‌తోనూ ముక్కుసూటిగానే ఉంటారన్నది సుస్పష్టం. నిజానికి, మెక్సికో, ఎల్సాల్వడార్ల తర్వాత అమెరికాలో అక్రమ వలసదారుల్లో అధిక సంఖ్యాకులు భారతీయులే. అక్కడ అలాంటి భారతీయుల సంఖ్య దాదాపు 7.25 లక్షలని ఓ లెక్క. తాజాగా వెనక్కివచ్చినవారిలో పంజాబ్ (30 మంది), హరియాణా (33), గుజరాత్ (33), తదితర రాష్ట్రాల వారున్నారు. వీరిలో పిల్లలు, మహిళలు కూడా ఉండడం గమనార్హం. ఆ మాటకొస్తే, అమె రికా ఇలా అక్రమ వలసదారులైన భారతీయుల్ని వెనక్కిపంపడం కొత్తేమీ కాదు. గత అక్టోబర్‌లోనూ వంద మంది పంజాబ్‌కు తిరిగొచ్చారు. 2023 అక్టోబర్ నుంచి నిరుడు సెప్టెంబర్ ఆఖరు వరకు మొత్తం 1100 మంది ఇలా ఇంటి ముఖం పట్టినవారే! అగ్రరాజ్యాన్ని కలలస్వర్గంగా ఊహించుకుంటూ, అక్కడ జీవనం బాగుంటుందనే ఆశతో, డాలర్ల సంపాదనపై ఆకర్షణతో అక్కడకు సక్రమంగానో, అవసరమైతే అక్రమంగానో వెళ్ళి, స్థిరపడాలనే ధోరణి చాలాకాలంగా ఉన్నదే. ఒక లెక్క ప్రకారం ప్రపంచపు పెద్దన్న పంచన చట్టప్రకారమే దాదాపు 50 లక్షల మంది భారత జాతీయు లున్నారంటే మన అమెరికా మోజు ఎంతో అర్థం చేసుకోవచ్చు. దీర్ఘకాలంగా మన భారతీయుల్లో అంతకంతకూ అధికమవుతూ వచ్చిన ఆ మోజు ఫలితమే – అధికసంఖ్యలోని అక్రమ వలసలు. ముఖ్యంగా, పంజాబ్ లాంటి ప్రాంతాల నుంచి అలా వెళ్ళేవారు మరీ ఎక్కువ. స్థానిక పంజాబీ జాతీయంలో చెప్పాలంటే ‘డాంకీ రూట్స్’లో (వాహనాలు మారుతూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతూ) అమెరికా చేరుకుంటారు. విదేశాల్లో బతుకు తెరువుకై తపిస్తున్న వ్యక్తుల ఆశల్ని సొమ్ము చేసుకుంటూ, ట్రావెల్ ఏజెన్సీలు భారీగా లక్షల్లో డబ్బు గుంజి, దొంగ వీసాలతో వారిని ఇలా దేశాల హద్దుల్ని దాటిస్తుంటాయి. సగటున ఏటా 90 వేల పైచిలుకు భారతీయులు ఇలా అక్రమంగా అమెరికాలో ప్రవేశించబోయి, పట్టుబడుతున్నారు. తల తాకట్టుపెట్టి, సరైన పత్రాలు లేకుండానే అందరి కళ్ళుగప్పి అలా హద్దులు దాటి వెళ్ళిన పలువురికి ఇప్పుడు కల చెదిరింది. ట్రంప్ రాకతో వారి కథ మారింది. చాలామందికి కన్నీరే మిగిలింది. తగిన పత్రాలు లేకుండా అమెరికాలోనే కాదు, ఏ దేశంలోనైనా ఏ జాతీయులు నివసించినా అది తప్పే. శిక్షార్హమైన నేరమే. ఇంతకాలం చూసీచూడనట్టు చెల్లిపోయినా, అమెరికాను మళ్ళీ గొప్ప దేశంగా తీర్చిదిద్దుతానంటూ ఇప్పుడు రెండోసారి పగ్గాలు చేపట్టిన ట్రంప్ ఖడ్గప్రహారం చేయడాన్ని తప్పుపట్టలేం. అందుకే, బాధితులు భారతీయులైనా మన దేశం మారుమాట్లాడ లేకపోతోంది. ఆ మాటకొస్తే, వ్యవస్థీకృత నేరాలకు దారి తీస్తున్నట్లు భావిస్తున్న అక్రమ వలసలకు భారత్ వ్యతిరేక మని మన విదేశాంగ శాఖ నొక్కి వక్కాణించాల్సి వచ్చింది. అదే సమయంలో భారతీయుల పునరా గమనానికి వీలు కల్పిస్తామనీ చెప్పాల్సి వచ్చింది. వాణిజ్య సుంకాల విధింపు సహా అనేక విష యాల్లో ట్రంప్ దూకుడు మీదున్న తరుణంలో అమెరికాతో దీర్ఘకాలిక స్నేహసంబంధాలకు ఇబ్బంది కలగకుండా మన దేశం ఆచితూచి వ్యవహరించక తప్పదు. ఆ కోణం నుంచి చూసినప్పుడు భారత్ వైఖరి సమంజసమే కాదు సహజం కూడా! అయితే, ఈ అక్రమ వలసల్ని ఆపాలంటే, అమాయకుల ఆశను సొమ్ము చేసుకొనే అక్రమార్కుల పనిపట్టాలి. అంతకన్నా ముఖ్యంగా, ఆశల పల్లకీలో అగ్రరాజ్యం వైపు ఉరికే మనవాళ్ళకు గౌరవప్రదమైన ఉపాధి, ఉద్యోగావకాశాలిక్కడే కల్పించడంపై పాలకులు దృష్టిపెట్టాలి. చిత్తశుద్ధితో అది చేయనంతకాలం ఈ డాలర్డ్రీవ్స్ు కథలు కంచికి చేరవు! -
భారత్ చేరుకున్న 104 మంది అక్రమ వలసదారులు
-
205 మందిని వెనక్కి పంపిన అమెరికా
వాషింగ్టన్: అక్రమ వలసదారుల(Illegal immigrants)పై డోనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రభుత్వం అణచివేతను ముమ్మరం చేసింది. 205 మంది భారతీయ వలసదారులతో కూడిన అమెరికా సైనిక విమానం సీ–17 స్థానిక కాలమానం ప్రకారం సోమవారం శాన్ ఆంటోనియో నుంచి భారత్‌కు బయలుదేరింది. విమానం 24 గంటల తరువాత పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చేరుకుంటుందని, వెనక్కి పంపే ముందు ప్రతి ఒక్కరినీ పరిశీలించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ విమానం ఇంధనం కోసం జర్మనీలోని రామ్‌స్టీన్‌లో ఆగనుంది. ఈ పరిణామాలను ధ్రువీకరించడానికి యూఎస్ ఎంబసీ నిరాకరించింది. 18వేల మందితో జాబితా.. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్సె్మంట్ (ఐసీఈ) దాదాపు 18,000 మంది డాక్యుమెంట్లు లేని భారతీయ పౌరుల తొలి జాబితాను రూపొందించింది. టెక్సాస్‌లోని ఎల్పాసో, కాలిఫోర్నియాలోని శాన్‌డియాగో నుంచి 5,000 మందికి పైగా వలసదారులను బహిష్కరించాలని నిర్ణయించినట్లు పెంటగాన్ ప్రకటించింది. ప్యూ రీసెర్చ్ సెంటర్ డేటా ప్రకారం, 725,000 మంది భారతీయులు అక్రమంగా అమెరికాలో నివసిస్తున్నారు, మెక్సికో, ఎల్ సాల్వడార్ తరువాత అనధికారిక వలసదారుల జనాభాలో భారత్ మూడోస్థానంలో ఉంది. డాక్యుమెంట్లు లేని భారతీయులను చట్టబద్ధంగా తమ దేశానికి తిరిగి తీసుకురావడానికి భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని గత నెలలో న్యూఢిల్లీ తెలిపింది.దీనికి ఏ దేశం మినహాయింపు కాదని, చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉన్నవారిలో భారతీయులు ఉంటే చట్టబద్ధంగా స్వదేశానికి తీసుకు రావడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని జైశంకర్ తెలిపారు. చట్టవిరుద్ధంగా అమెరికాకు వచ్చిన భారతీయ వలసదారులను వెనక్కి రప్పించే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ సరైనదే చేస్తారని అధ్యక్షుడు ట్రంప్ జనవరిలో ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా సైనిక విమానాలు గ్వాటెమాలా, పెరూ, హోండురాస్ దేశాలకు వలసదారులను తరలించాయి.ఇమ్మిగ్రేషన్‌పై తన ఎమర్జెన్సీ డిక్లరేషన్ లో భాగంగా ట్రంప్ గత వారం మిలటరీ బహిష్కరణ విమానాలను ప్రారంభించారు. ఇప్పటివరకు ఆరు విమానాల్లో వలసదారులను లాటిన్ అమెరికాకు విమానాల్లో పంపారు. అందులో రెండో సి –17 కార్గో విమానాల ల్యాండింగ్‌కు కొలంబియా నిరాకరించింది. దీంతో నాలుగు మాత్రమే గ్వాటెమాలాలో ల్యాండ్ అయ్యాయి. -
ట్రంప్ చర్యలపై నిరసనలు
వాషింగ్టన్: అక్రమ వలసదారులను తిప్పి పంపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేపడుతున్న చర్యలను వేలాది మంది వ్యతిరేకించారు. అక్రమ వలసదారులను నిర్బంధించి మూకుమ్మడిగా సామూహిక బహిష్కరణలు చేపడతానన్న ట్రంప్ నిర్ణయాన్ని నిరసిస్తూ వేలాది మంది ప్రజలు ఆదివారం దక్షిణ కాలిఫోర్నియాలో ర్యాలీ చేపట్టారు. లాస్ ఏంజెలెస్‌లోని డౌన్‌టౌన్‌తో సహా నిరసనకారులు ప్రధాన జాతీయ రహదారిని కొన్ని గంటల పాటు దిగ్బంధించారు. ఇమ్మిగ్రేషన్ సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘ఎవ్వరూ చట్టవిరుద్ధం కాదు’, ‘ఇమ్మిగ్రెంట్స్ అమెరికాను గొప్పగా మార్చారు’వంటి నినాదాలతో కూడిన బ్యానర్లను ప్రదర్శించారు. మధ్యాహ్నానికల్లా యూఎస్ 101లోని అన్ని మార్గాలను దిగ్బంధించడంతో ట్రాఫిక్ స్తంభించింది. కాలిఫోర్నియా హైవే పెట్రోలింగ్ అధికారుల బందోబస్తు నిలవగా నిరసనకారులు వీధుల్లో బైఠాయించారు. ఫ్రీవే పూర్తిగా తెరవడానికి ఐదు గంటలకు పైగా సమయం పట్టింది. తూర్పున రివర్సైడ్ నగరంలో వందలాది మంది నిరసన తెలిపారు. ఓ కూడలి వద్ద జెండాలు ఎగురవేస్తున్న నిరసనకారులకు మద్దతుగా వాహనదారులు ఆపకుండా అంతా ఒకేసారి హారన్ మోగించి తమ మద్దతు తెలిపారు. శాన్‌డియాగో నగరంలోని కన్వెన్షన్ సెంటర్ వద్ద వందలాది మంది ఆదివారం ర్యాలీ నిర్వహించారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అరెస్టులకు నిరసనగా డల్లాస్‌లో నిరసనకారులు ఆదివారం ఆందోళనకు దిగారు. ఐసీఈ దాడులను నిరసిస్తూ ఆర్లింగ్టన్ నగరంలో వందలాది మంది ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిటీ హాల్ వెలుపల జెండాలతో నిరసన తెలిపారు. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలకు వ్యతిరేకంగా టారెంట్ కౌంటీలో నిరసనకారులు ఆందోళనకు దిగారు. -
వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం
-
ట్రంప్ ఆదేశాలు.. అమెరికాలో ఎక్కడికక్కడ అరెస్టులు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై కొరడా ఝులిపిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న అక్రమ వలసదారుల్ని ఎక్కడికక్కడే అరెస్ట్‌లు చేయిస్తున్నారు. ఈ అరెస్ట్‌ల నుంచి తప్పించుకుని సరిహద్దులు దాటే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇందుకోసం సైనిక విమానాల్ని వినియోగిస్తున్నారు. ఈ అరెస్ట్‌లపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పందించారు. యుఎస్ అధికారులు ఇప్పటి వరకు 538 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేశారని, సైనిక విమానాల్ని ఉపయోగించి వందల మందిని బహిష్కరించినట్లు చెప్పారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ సైనిక విమానం ద్వారా వందలాది అక్రమ వలస దారుల్ని బహిష్కరించింది. చరిత్రలో అక్రమ వలస దారుల బహిష్కరణ ఆపరేషన్ విజయవంతంగా కొనసాగుతోంది. అక్రమ వలసదారులపై చర్యలు తీసుకుంటామని ట్రంప్ మాట ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతున్నారని తెలిపారు. -
చట్టసభల్లో ట్రంప్ తొలి విజయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి విజయం సాధించారు. ఆయన ప్రతిష్టాత్మకంగా భావించి తీసుకొచ్చిన ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ బిల్లు అమెరికా కాంగ్రెస్‌లో ఆమోదం పొందింది. దీంతో అక్రమ వలసదారులపై చర్యలకు లైన్ క్లియర్ అయినట్లయ్యింది. అలాగే రెండో దఫా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించగా ఆయన సంతకంతో చట్టం రూపం దాల్చిన తొలి బిల్లు కూడా ఇదే అయ్యింది.లేకెన్ రిలే యాక్ట్ (Laken Riley Act) పేరుతో తీసుకొచ్చిన ఈ చట్టం ప్రకారం.. దొంగతనాలు, దొపిడీలు ఇతరత్రా చిన్నచిన్న నేరాల్లో శిక్ష పడిన, లేదంటే అలాంటి కేసులు ఉన్న అక్రమ వలసదారుల్ని ఇమ్మిగ్రేషన్ & కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ICE) కచ్చితంగా అదుపులోకి తీసుకోవాలి. వీలైతే వాళ్లను తిరిగి వెనక్కి పంపించేయాలి. ఎట్టి పరిస్థితుల్లో అమెరికాలో ఉంచడానికి వీల్లేదు. ఒకవేళ ఈ విషయంలో ఏదైనా పొరపాటు జరిగితే.. ఫెడరల్ ప్రభుత్వంపై దావాలు వేసే హక్కును స్టేట్ అటార్నీ జనరల్‌కు ఉంటుంది. ఈ చట్టాన్ని కిందటి ఏడాది రూపకల్పన చేశారు. తొలి నుంచి రిపబ్లికన్లు ఈ చట్టానికి మద్ధతుగా నిలవగా, డెమోక్రటిక్ పార్టీ మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చింది.ఆ ఏడాది జనవరి 3వ తేదీన 119వ అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్) ప్రారంభమైన సంగతి తెలిసిందే. జనవరి 7వ తేదీన ఈ బిల్లును ప్రవేశపెట్టారు. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్(ప్రతినిధుల సభ)లో ఇది 264-159తో ఆమోదం పొందింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన సభ్యులంతా బిల్లుకు మద్ధుతగా ఓటేయగా, డెమోక్రటిక్(Democrtic Party) సభ్యుల్లో 48 మంది మద్దతు ప్రకటించారు. జనవరి 20వ తేదీన సవరణతో కూడిన బిల్లుకు సెనేట్ ఆమోదం లభించింది. దీనికి 12 మంది రిబ్లికన్లు సైతం మద్దతుగా ఓటేశారు. చివరకు.. జనవరి 22వ తేదీన బిల్లు పాసైనట్లు హౌజ్ ప్రకటించింది.అయితే.. లేకెన్ రిలే యాక్ట్ కిందటి ఏడాది మార్చి 27నే ప్రతినిధుల సభ ఆమోదం పొందింది. కానీ, సెనేట్‌లో డెమోక్రటిక్ సభ్యుల అభ్యంతరాలతో అది ఆచరణకు నోచుకోలేదు.అమెరికా జార్జియా స్టేట్ ఏథెన్లో కిందటి ఏడాది ఫిబ్రవరి 22న 22 ఏళ్ల వైద్య విద్యార్థిని లేకెన్ రిలే(Laken Riley) దారుణంగా హత్యకు గురైంది. వెనిజులా నుంచి అక్రమంగా అమెరికాకు వలస వచ్చిన జోస్ ఆంటోనియా ఇబర్రా(26).. ఉదయం జాగింగ్‌కు వెళ్లిన లేకెన్ను దారుణంగా హతమార్చాడు. ఈ కేసులో దోషిగా తేలిన సదరు అక్రమవలసదారుడికి పెరోల్ లేకుండా జీవితఖైదు విధించింది న్యాయస్థానం. అయితే సదరు వ్యక్తిపై గతంలో ఓ కేసు నమోదు అయినప్పటికీ.. అరెస్ట్ మాత్రం జరగలేదు. ఆనాడు అరెస్ట్ అయ్యి ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదన్న విమర్శలు సర్వత్రా వినిపించాయి. అలాగే నేరాలకు పాల్పడే అక్రమ వలసదారులకు ఇమ్మిగ్రేషన్ చట్టాలు కల్పిస్తున్న రక్షణ ఆ టైంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కేసులో న్యాయం కోరుతూ విద్యార్థులంతా ఆందోళనబాట పట్టడంతో.. ట్రంప్ అప్పటి నుంచి ఈ చట్టానికి మద్దతు చెబుతూ వచ్చారు.ఇదీ చదవండి: ట్రంప్ మీద కోర్టుకెక్కిన 22 రాష్ట్రాలు -
వలసదారుల ఏరివేతకు ‘ఎమర్జెన్సీ’!
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ఊహించినట్లుగానే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అతి కీలకమైన ఎన్నికల అంశంగా మారిన అక్రమ వలసలపై ఆయన తాజాగా కీలక నిర్ణయం వెలువరించారు. సరిహద్దు భద్రతపై జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించే యోచన ఉందని సోమవారం ట్రంప్ ధ్రువీకరించారు. అక్రమ వలసదారులను తిప్పి పంపేందుకు సైన్యాన్ని కూడా రంగంలోకి దించుతామని తన సోషల్ మీడియా హాండిల్ ట్రూత్‌లో ప్రకటించారు! ఈ మేరకు ఓ రిపబ్లికన్ కార్యకర్త చేసిన చేసిన పోస్టును ట్రంప్ రీ పోస్టు చేస్తూ, ‘నిజమే’ అంటూ కామెంట్ జోడించారు. వలసలను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. తనను గెలిపిస్తే కనీసం 10 లక్షల మంది అక్రమ వలసదారులను వెనక్కు పంపుతానని, మెక్సికోతో సరిహద్దులను దుర్భేద్యంగా మారుస్తానని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. అమెరికాలో ఏకంగా కోటీ 10 లక్షల మందికి పైగా అక్రమంగా నివసిస్తున్నట్టు అధికారుల అంచనా. ట్రంప్ భారీ బహిష్కరణ ప్రణాళిక లక్షలాది కుటుంబాలపై నేరుగా ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.ట్రంప్ జనవరి 20న అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనుండటం తెలిసిందే. తన కేబినెట్‌ను ఇప్పటికే అతివాదులు, వలసల వ్యతిరేకులతో నింపేశారు. ముఖ్యంగా కీలకమైన ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ మాజీ చీఫ్ టామ్ హోమన్‌ను బోర్డర్ జార్ పదవికి ఎంపిక చేశారు. ‘అక్రమ వలసదారులారా! సామాన్లు ప్యాక్ చేసుకోవడం మొదలు పెట్టండి. మీ దేశాలకు తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చేసింది’ అని గత జూలైలోనే రిపబ్లికన్ పార్టీ సదస్సులో హోమన్ హెచ్చరికలు చేశారు. తమ విభాగం తొలుత 4.25 లక్షల మంది అక్రమ వలసదారులను బహిష్కరిస్తుందని ఆయన ఇటీవల పేర్కొన్నారు. అధ్యక్షుడు జో బైడెన్ పాలనలో రికార్డు సంఖ్యలో అక్రమ వలసదారులు అమెరికాలోకి ప్రవేశించారని ట్రంప్ పదేపదే ఆరోపించడం తెలిసిందే. వారంతా అమెరికా రక్తాన్ని విషపూరితం చేశారంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారిని తిప్పి పంపేందుకు అవసరమైతే 1798 నాటి ఏలియన్ ఎనిమీస్ చట్టాన్ని కూడా ప్రయోగిస్తామన్నారు. -
అక్రమ వలసలపై ఉక్కుపాదమే: ట్రంప్
న్యూయార్క్: అమెరికాలోని అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపి తీరతానని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. తాను అధ్యక్షుడిని అయితే దేశ చర్రితలోనే అతి పెద్ద ఆపరేషన్ చేపట్టి కనీసం 10 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులదరినీ వెనక్కు పంపించడం ఖాయమని ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శరవేగంగా సమీపిస్తున్న వేళ ఆదివారం న్యూయార్క్‌లోని ప్రసిద్ధ మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో భారీ ర్యాలీలో ట్రంప్ ప్రసంగించారు. ఆయనతో పాటు రిపబ్లికన్ పార్టీ నేతలంతా డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్‌పై తీవ్ర స్థాయిలో వ్యక్తిగత దాడికి పాల్పడ్డారు. ఆమెను అవమానిస్తూ హేళనగా మాట్లాడారు. హారిస్‌ను దెయ్యంగా, ‘రాడికల్ లెఫ్ట్ మార్క్సిస్టు’గా అభివరి్ణంచారు. ‘‘ఆమెకు తెలివి లేదు. దేశ సమస్యలను పరిష్కరించలేరు’’ అంటూ విమర్శించారు. ట్రంప్ అయితే ఉపాధ్యక్షురాలిగా హారిస్ తన అసమర్థ పాలనతో అమెరికాను నాశనం చేశారని ఆరోపించారు. ట్రంప్‌కు మద్దతుగా మాట్లాడిన కమెడియన్ టోనీ హిచ్క్లిఫ్ చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. లాటిన్ అమెరికా వాసులు పిల్లల్ని కనేందుకే ఇష్టపడతారన్న వ్యాఖ్యలపై రిపబ్లికన్లే అసహనం వ్యక్తం చేశారు. పోర్టోరికోను తేలాడే చెత్తదిబ్బగా టోనీ పేర్కొనడాన్నీ రిపబ్లికన్లు ఖండించారు. -
దేశం విడిచి వెళ్లండి
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్ నుంచి పాకిస్థాన్‌కు అక్రమంగా వచ్చిన శరణార్థులు వెంటనే దేశం వీడి వెళ్లాలంటూ పాక్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాలిబన్ల పరిపాలనతో విసిగి వేసారిపోయిన అఫ్గాన్లు లక్షల సంఖ్యలో చట్టవిరుద్ధంగా పాక్‌కు చేరుకున్నారు. అలా వచ్చిన వారు 17 లక్షల మంది ఉంటారని ప్రభుత్వం అంచనా వేసింది. వారందరూ నవంబర్‌లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. రెండు దేశాల సరిహద్దుల్లో ఇటీవల కాలంలో దాడులు పెరిగిపోతున్నాయి. అఫ్గాన్‌లో తాలిబన్ల కనుసన్న ల్లో ఉన్న ఉగ్రవాదులే దాడులకు పాల్పడుతున్నారని పాక్ ఆరోపి స్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నవంబర్ 1లోగా అక్రమంగా వచ్చిన వారంతా వెళ్లకపోతే భద్రతా బలగాలతో వారిని దేశం నుంచి బహిష్కరిస్తామని పాకిస్థాన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. -
ఇటలీ తీరంలో పడవ బోల్తా.. ఇద్దరి మృతి
మిలాన్: ఇటలీ సముద్ర తీరానికి సమీపంలో రెండు పడవలు నీటమునిగాయి. రెండు పడవల్లో ఒకదాంట్లో 48 మంది మరో దాంట్లో 42 మంది వలసదారులు ప్రయాణిస్తున్నారని వారిలో 57 మందిని కాపాడిన ఇటలీ తీరప్రాంత రక్షణ దళాలు ఓ తల్లీ బిడ్డలను మాత్రం కాపాడలేకపోయామని గల్లంతైన మరో 30 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నామని ఇటలీ కోస్ట్ గార్డులు తెలిపారు. వయా ట్యునీషియా.. స్ఫాక్స్ బీచ్ తీరంలో గత వారం 10 మృతదేహాలను కనుగొన్నామని ట్యునీషియా పోర్టు గుండా ఇటలీకి చేరుకోవడం సులభం కాబట్టి అక్రమ వలసదారులు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చెబుతున్నారు స్ఫాక్స్ అధికారులు. తాజాగా ఈ రెండు పడవలు కూడా ట్యునీషియా పోర్టు నుండే ఇటలీ వైపుగా వచ్చాయని అవి లంపెడుసా ద్వీపం దాటగానే ఉరుములు మెరుపులతో సముద్రంలో అలజడి రేగడంతో అలల తాకిడికి అందులో ప్రయాణిస్తున్న 90 మంది వలసదారులతో సహా పడవలు బోల్తా పడ్డాయన్నారు. కోస్ట్ గార్డుల సాహసం.. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఇటలీ తీర రక్షణ దళాలు హుటాహుటిన స్పందించి 57 మందిని రక్షించగలిగామని తెలిపారు స్ఫాక్స్ అధికారులు. కానీ ప్రమాదంలో ఓ తల్లీ బిడ్డలను మాత్రం కాపాడలేకపోయామని. వారి మృతదేహాలు మాత్రం లభ్యమయ్యాయని తెలిపారు. పడవలోని మిగిలిన 30 మంది గల్లంతు కాగా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇలా అయితే ఎలా? ఈ రెండు పడవల్లోని వలసదారులు సహారా-ఆఫ్రికా దేశాలకు చెందిన వారే అయి ఉంటారని, ఎంతగా ప్రయత్నించినా ఆఫ్రికా దేశాల నుండి ఈ అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయలేకున్నామని తెలిపారు ఇటలీ వలసల విచారణాధికారి ఇమ్మానుయేల్ రిసిఫారీ. వారాంతా మెరుగైన జీవితం కోసమే ఇటు వస్తున్నారు. అదేదో చట్టబద్దంగా వస్తే బాగుంటుంది కానీ దొడ్డిదారిన రావడం వల్లనే ఇలా ప్రమాదాల బారిన పడుతున్నారని అన్నారు. డిమాండ్ ఎక్కువ.. ఎందరో వలసదారులు చనిపోతున్నారని సముద్రంలో ప్రమాదాలను నివారించడానికి నౌకలను ఏర్పాటు చేయడం కూడా అక్రమ వలసలను ప్రోత్సహిస్తున్నట్లే ఉంది. పొరుగు దేశానికి వలసలంటే భయపడేవారు కూడా ధైర్యంగా అడుగేసి ఇటు వైపుగా కదులుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ అక్రమ వలసలు రెట్టింపయ్యాయి. 2022లో 42,600 మంది వలస వచ్చినట్లు రికార్డుల్లో నమోదు కాగా ఈ ఏడాది మాత్రం 92,000 మందికిపైగా వలస వచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. Migrants rescued from rough seas off Italy. Reports say dozens could still be missing at sea, while more stranded migrants were airlifted from rocks on the island of Lampedusa. Read more: https://t.co/cJMUPoyyWL pic.twitter.com/lbXo28Rbrd — Sky News (@SkyNews) August 7, 2023 ఇది కూడా చదవండి: మొరాకోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి.. -
సముద్రంలో ఒళ్ళు గగుర్పొడిచే సాహసం.. తలచుకుంటేనే..
రియో డి జనేరియో: నైజీరియాకు చెందిన నలుగురు వలసదారులు 14 రోజులపాటు కార్గో షిప్ అడుగున ముందుభాగంలో ఉండే చుక్కానిపై కూర్చుని అత్యంత సాహసంతో కూడుకున్న యాత్ర చేసి బ్రెజిల్ చేరుకున్నారు. తిండి లేకుండా దీనావస్థలో ఉన్న వారిని ఆగ్నేయ పోర్టులోని బ్రెజిల్ ఫెడరల్ పోలీసులు కనుగొని రక్షించారు. యూరప్ చేరుకోవాలన్న తపనతో నలుగురు నైజీరియా వలసదారులు అక్రమంగా ఒక పెద్ద ఓడ చుక్కానిపైకి ఎక్కి కూర్చున్నారు. అట్లాంటిక్ మహాసముద్రం వైపుగా కదిలిన ఆ ఓడ యూరప్ వెళ్తుందనుకుంటే అదికాస్తా బ్రెజిల్ వైపుగా కదిలింది. నడిసంద్రంలో ఉన్నంతసేపు వారు ఎక్కడికి వెళ్తోంది కూడా వారికి తెలియదు. రేయింబవళ్లు ఆ చిన్న స్థలంలో ఇరుక్కుని అలా కూర్చుండిపోయారు. వారివద్ద తినడానికి కూడా ఏమీ లేదు. అలాగే బిక్కుబిక్కుమంటూ ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణించారు. ఆ ఓడ 14 రోజులపాటు మహాసముద్రంలో 5,600 కిలోమీటర్లు ప్రయాణించి బ్రెజిల్ పోర్టు చేరుకుంది. ఓడ బ్రెజిల్ చేరుకున్నాక దయనీయ స్థితిలో చుక్కానిపై కూర్చుని ఉన్న నలుగురిని అక్కడి అధికారులు జాగ్రత్తగా కిందికి దించారు. వారి పరిస్థితి చూసి వెంటనే వారికి ఆహారమిచ్చి ఆశ్రయమిచ్చారు. మొత్తం నలుగురు వలసదారుల్లో ఇద్దరి అభ్యర్ధన మేరకు వారిని తిరిగి నైజీరియా పంపించగా మరో ఇద్దరు మాత్రం బ్రెజిల్‌లోనే ఉండిపోయారు. వారు తమ అనుభవాలను పంచుకుంటూ చుక్కాని మీద కూర్చుని ప్రయాణించడం చాలా భయంకరమైన అనుభూతి. ఒక్కోసారి పెద్ద పెద్ద తిమింగలాలు మాకు దగ్గరగా వెళ్తూ కనిపించేవి. వాటిని చూస్తేనే భయమేసేది. ఒకపక్క సముద్రం మరోపక్క ఓడ ఇంజిన్ శబ్దం హోరెత్తించడంతో నిద్ర కరువైంది. దాహానికి మాత్రం అపుడప్పుడు వేరే మార్గంలేక సముద్రం నీళ్లనే తాగేవాళ్ళం. ఓడ సిబ్బంది కంటపడితే వారు మమ్మల్ని సముద్రంలోకి పడదోస్తారని భయపడి అలాగే ఉండిపోయాము. ఒక్కోసారి మాలో ఎవరైనా కూడా ఆ పని చేస్తారేమోనని భయపడి కళ్ళు తెరచుకుని ఉండే వాళ్ళమన్నాడు. నైజీరియాలో ఆర్ధిక, రాజకీయ అస్థిరత వల్లనే తాము వలస వెళ్లాలని నిర్ణయించుకున్నామన్నాడు. సావో పాలోలో వారికి ఆశ్రయమిచ్చిన చోట ఒక వ్యక్తి మాట్లాడుతూ మేము చాలా మంది వలసదారుల గాధలు విన్నాం కానీ ఇటువంటి సాహస యాత్రను నేనెన్నడూ చూడలేదని అన్నారు. ఇది కూడా చదవండి: సైనిక తిరుగుబాటుతో ఫ్రాన్స్ దేశస్తులను వెనక్కి రప్పిస్తున్న ఎంబసీ -
మణిపూర్ అల్లర్లకు వారే కారణమా..?
ఇంఫాల్: మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం మయన్మార్ నుండి అక్రమంగా వలస వచ్చిన వారిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వారి బయోమెట్రిక్ డేటాను సేకరించడం మొదలుపెట్టింది. ఈ అల్లర్లకు వారికీ సంబంధం ఉందన్న కోణంలోనే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు చెబుతోంది మణిపూర్ ప్రభుత్వం. మణిపూర్ హోంశాఖ తెలిపిన వివరాల ప్రకారం మయన్మార్ నుండి అక్రమంగా వలసవచ్చిన వారి గణన సెప్టెంబర్ నెలాఖరుకల్లా పూర్తవుతుందని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర అధికారులకు ట్రైనింగ్ ఇచ్చేందుకు హోంశాఖ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్.సి.ఆర్.బి) నుండి కేంద్ర ప్రభుత్వం ఒక బృందాన్ని పంపినాట్లు తెలిపారు జాయింట్ సెక్రెటరీ(హోమ్) పీటర్ సలాం. కూకీలు అత్యధికంగా ఉండే కొండ ప్రాంతమైన చురాచంద్ పూర్ లో ఏడుగురు మయన్మార్ వలసదారులకు బులెట్ గాయాలు తగలడంతో అల్లర్లలో వారి పాత్ర ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేసింది కేంద్రం. ఈ నేపథ్యంలోనే వెంటనే స్పందించి మణిపూర్, మిజోరాం రాష్ట్రాల ప్రభుత్వాలను వెంటనే బయోమెట్రిక్ ఆధారంగా మయన్మార్ అక్రమ వలసదారుల గణన చేపట్టాలని అదేశించింది. మయన్మార్ వలసదారులు ఎక్కువగా అడవులను కొట్టి, గసగసాల సాగు, గంజాయి సాగుకి పాల్పడుతూ ఉంటారని గతంలో ఒకసారి మణిపూర్ సీఎం బైరెన్ సింగ్ కూడా తెలిపారు. ఇది కూడా చదవండి: Manipur Violence: నా కొడుకు, భర్తను చంపేశారు.. కూతురిని నగ్నంగా.. -
బోటుల్లో ఐరోపాకు చేరిన ఆఫ్రికా అక్రమ చొరబాటుదారులు
ఇటలీ: గడిచిన 24 గంటల్లో ఆసియా, ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాల నుండి వేల సంఖ్యలో వలసదారులు బోటుల్లో ఐరోపాలోని ఆయా దేశాలకు చేరుకున్నట్లు తెలిపాయి ఇటలీ ఇమిగ్రేషన్ వర్గాలు. ఇటలీ ఇమిగ్రేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఆఫ్రికా, ఆసియా దేశాలకు చెందిన శరణార్థులు పడవల్లో తమ దేశానికి చేరుకున్నారని తెలిపారు. కిక్కిరిసిన బోటులో ప్రయాణం చేసిన కారణంగా కొంతమంది బోటులోనే చనిపోగా మిగిలినవారు కాలాబ్రియా కోస్తాకు, లంపెడుసా తీరానికి చేరుకున్నారని అన్నారు. Meanwhile, another overloaded boatload of illegal immigrants from North Africa is making its way across the Mediterranean to Europe and the UK. pic.twitter.com/pDOagytGr6 — UK Justice Forum 🇬🇧 Latest Video News Updates! (@Justice_forum) June 29, 2023 ఇటీవలే భారీగా వలసదారులను ఎక్కుంచుకుని ఐరోపా వైపుగా వచ్చిన ఇలాంటి ఒక పడవ బోల్తాపడి నీటమునిగిన విషయం తెలిసిందే. తరచుగా ఈ ప్రమాదాలు జరుగుతున్నా కూడా అక్కడి అధికారులు వలసలను ఆపి ప్రమాదాలను నివారించే ప్రయత్నమైనా చేయడం లేదు. Boats full of African invaders landing straight onto the beach in Italy today. pic.twitter.com/ZaylKNpps6 — Faith (@Sarah77929529) June 28, 2023 ఇది కూడా చదవండి: నాహేల్ మృతి.. కంటిమీద కునుకులేని ఫ్రాన్స్..! వీడియో బయటకు -
Womens empowerment: ఉక్కు దళం
ఇండియా–బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం... పచ్చని అడవి... చల్లని నది ప్రశాంతంగా కనిపిస్తాయి. అయితే చాప కింద నీరులా సంఘవిద్రోహశక్తులు వికటాట్టహాసం చేస్తుంటాయి. తమకు ఎదురు లేదని కొమ్ములు విసురుతుంటాయి. సంఘవిద్రోహశక్తుల అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపడానికి ‘ఓన్లీ ఉమెన్’ దళం రంగంలోకి దిగింది. స్త్రీ సాధికారతకు పట్టం కట్టేలా బీఎస్ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్)లో మరో అడుగు పడింది. తాజాగా ఇండియా–బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ మహిళా జవాన్లు విధులు నిర్వహించనున్నారు. ప్రసిద్ధ సుందర్ బన్ అడవుల్లో కొంత భాగం మన దేశంలో, కొంత భాగం బంగ్లాదేశ్‌లో విస్తరించి ఉంది. సరిహద్దును ఆనుకొని ఉన్న అడవులు, చిన్న దీవులు, నదులు అనేవి సంఘ విద్రోహశక్తులకు అడ్డాగా మారాయి. ఈ నేపథ్యంలో నిరంతర పర్యవేక్షణ అవసరం అయింది. దీనికోసం బీఎస్ఎఫ్ సట్లెజ్, నర్మద, కావేరి, సబర్మతి, క్రిష్ణ, గంగ పేర్లతో బీవోపి (బార్డర్ ఔట్ పోస్ట్) లను ఏర్పాటు చేసింది. ‘బీవోపి’కి చెందిన ‘గంగ’ మహిళా జవానులు తొలిసారిగా సరిహద్దు ప్రాంతానికి సంబంధించిన నిఘా విధులలో భాగం అవుతున్నారు. మనుషుల అక్రమ చొరబాటు, స్మగ్లింగ్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంతోపాటు దొంగల నుంచి, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి జాలర్లను రక్షించే బాధ్యతలు కూడా ‘బీవోపి–గంగ’పై ఉన్నాయి. స్థానిక పోలీసులు, అటవీశాఖ అధికారులు, స్థానిక ప్రజలను సమన్వయం చేసుకుంటూ అటవీ ప్రాంతాలకు నష్టం జరగకుండా చూడాల్సి ఉంటుంది. ‘బీవోపి–గంగ’కు ఉపయోగించే మోటర్ బోట్‌ను కొచ్చిలో తయారుచేశారు. దీనిలో 35 మంది జవాన్లకు చోటు ఉంటుంది. అత్యాధునిక రాడార్, కమ్యూనికేషన్ సదుపాయాలు ఉన్నాయి. ‘బీవోపీ–గంగ తన సత్తా చాటబోతోంది. పోరాట పటిమ ప్రదర్శించబోతోంది. స్మగ్లింగ్ కార్యకలాపాల్లో కొందరు స్త్రీలు కూడా భాగం అవుతున్నారు. ఇకముందు వారిని అదుపులోకి తీసుకోవడం సులభం అవుతుంది’ అంటున్నారు సౌత్ బెంగాల్ ఫ్రంటియర్ బీఎస్ఎఫ్ డిఐజీ అమ్రిష్ ఆర్యా. -
అక్రమ వలసదారులకు ‘ఆధార్’ బంగ్లా ముఠా అరెస్టు
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో ఏటీఎంను దోచుకున్న దుండగుల కోసం గాలిస్తున్న పోలీసులకు అనూహ్యంగా నకిలీ ఆధార్ కార్డులను తయారు చేస్తున్న బంగ్లా దేశీయుల ముఠా చిక్కింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో దుండగులు ఏటీఎం నుంచి రూ.18 లక్షలు లూటీ చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు షేక్ ఇస్మాయిల్ కితాబ్ అలీ అనే బంగ్లాదేశీయుడిని అరెస్ట్ చేశారు. విచారణలో అతడు, దేశంలోకి అక్రమంగా ప్రవేశించి 2011 నుంచి బెంగళూరులో పాత సామాను వ్యాపారం చేస్తున్న సయ్యద్ అకూన్ గురించి వెల్లడించాడు. నకిలీ పత్రాలు సృష్టించి, అక్రమ వలసదారులకు ఆధార్ కార్డులతోపాటు ఇతర పత్రాలను అందజేస్తున్నట్లు విచారణలో అకూన్ అంగీకరించాడు. అకూన్ ఇంట్లో 31 ఆధార్‌కార్డులు, 13, పాన్‌కార్డులు, 90 ఆధార్ నమోదు దరఖాస్తులు లభ్యమయ్యాయి. హవాలా మార్గంలో ఇతడు ఏడాదికి రూ.4 కోట్ల భారత కరెన్సీని బంగ్లాదేశ్ కరెన్సీగా మార్చి సొంత దేశానికి పంపుతున్నట్లు నిర్థారణయింది. ఈ కేసులో మొత్తం 9 మందిని నిందితులుగా గుర్తించారు. -
కువైట్‌లో మనోళ్లకు ఊరట
సాక్షి, హైదరాబాద్/మోర్తాడ్: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో అక్రమ వలసదారులకు కువైట్ ప్రభుత్వం కల్పించిన అత్యవసర క్షమాభిక్షతో 2,500 మంది తెలుగువాళ్లకు ఊరట లభించింది. రెండు విడతల్లో క్షమాభిక్ష కోసం కువైట్ దరఖాస్తులను స్వీకరించగా 10 వేల మంది భారతీయ కార్మికులు ఆమ్నెస్టీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 8 వేల మందికి కువైట్ ఔట్ పాస్పోర్టులిచ్చింది. ఔట్ పాస్‌పోర్టు పొందిన 8 వేల భారతీయుల్లో 2,500 మంది తెలంగాణ, ఏపీ వారని అంచనా. ఔట్ పాస్‌పోర్టులు పొందని మిగతా 2 వేల మంది కార్మికుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఔట్ పాస్‌పోర్టుల జారీలో ఏర్పడిన అంతరాయం వల్ల క్షమాభిక్ష గడువును పొడిగించాలని వలస కార్మికులతోపాటు వారికి అండగా నిలుస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కోరుతున్నారు. మరోవైపు క్షమాభిక్ష పొంది ఔట్ పాస్‌పోర్టులు తీసుకున్న వలస కార్మికుల కోసం కువైట్ ప్రభుత్వం విడిది కేంద్రాలను ఏర్పాటు చేసింది. విమాన సర్వీసులు ప్రారంభమయ్యే వరకు విడిది కేంద్రాల్లో భోజన సదుపాయాలను సమకూర్చనుంది. నౌకలు రెడీ క్షమాభిక్షకు అనుమతి లభించి ప్రత్యేక క్యాంపుల్లో ఉండే భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్రం నౌకలను సిద్ధం చేస్తోంది. ఈ మేరకు కేంద్ర సర్కారు సంకేతాలివ్వడంతో నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ జలాశ్వ సహా రెండు పెద్ద ఓడలు గల్ఫ్ తీరం వెళ్లనున్నాయి. ముందుగా కువైట్ నుంచి వారిని తరలించాలని భావిస్తున్నాయి. నౌకాయానానికి చాలా రోజులు పట్టే అవకాశమున్నందున ఆర్థిక స్థితి బాగుండి విమానాల్లో రావడానికి ఆసక్తి చూపే వారిని విమానాలు పునరుద్ధరించాక విమానాల్లో తీసుకురావాలని యోచిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ విమాన సేవలు ఇప్పట్లో పునరుద్ధరించే అవకాశాలు లేనందున ఒకేసారి వేల మందిని తరలించేందుకు ప్రత్యేక నౌకలు, ఎయిర్ ఇండియా జంబో విమానాలను పంపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మునుపెన్నడూ లేనివిధంగా... లాక్డౌన్ కారణంగా కువైట్‌లోనూ జనజీవనం స్తంభించింది. పరిశ్రమలు, నిర్మాణ రంగ ప్రాజెక్టులు, రిటైల్, చమురు ఉత్పత్తుల కంపెనీ లన్నీ మూతపడ్డాయి. దీంతో వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వలస కార్మికులు ఉపాధి కోల్పో యే పరిస్ధితి ఏర్పడింది. కరోనా మిగిల్చిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కువైట్ సర్కారు వర్క్ పర్మిట్ల గడువు ముగిసిన, అక్రమ నివాసుల (ఖల్లివెళ్లి)ను వారి స్వదేశాలకు పంపాలని నిర్ణయించింది. మునుపెన్నడూ లేనివిధంగా ప్రయాణ ఖర్చులను కూడా భరించనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 16 నుంచి 30 వరకు క్షమాభిక్ష కోసం పేర్ల నమోదుకు అవకాశం కల్పించింది. ఔట్ పాస్‌పోర్టు రానివారు విలవిల.. ఔట్ పాస్‌పోర్టులు పొందని కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకున్నా విదేశాంగ శాఖ సకాలంలో ఔట్ పాస్‌పోర్టులను జారీ చేయలేదని పలువురు రాష్ట్ర కార్మికులు గోడు వెళ్లబోసుకున్నారు. విదేశాంగ శాఖ తప్పిదం వల్ల తాము కువైట్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విడిది కేంద్రాలకు వెళ్లలేకపోతున్నామని వాపోయారు. ఆమ్నెస్టీని వినియోగించుకోని వలస కార్మికులపట్ల కఠినంగా వ్యవహరిస్తామని కువైట్ గతంలోనే హెచ్చరించి ందని... ఇప్పుడు తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిసు న్నారు. విడిది కేంద్రాల్లో ఉంటే తమకు భోజన సదుపాయం దక్కేదని, ఇప్పుడు సొంతంగా భోజన ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. కొన్ని రోజులుగా పని లేకపోవడంతో చేతిలో చిల్లిగవ్వ లేదని, దాతల సహకారం పొందాల్సి వస్తుందని చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన 20 మంది కార్మికులు (ఔట్ పాస్‌పోర్టు పొందని వారు) తమను ఎలాగైనా ఇంటికి తీసుకెళ్లాలంటూ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి లేఖ రాశారు. ఔట్ పాస్‌పోర్టు ఇప్పించాలి... మూడేళ్ల నుంచి కువైట్‌లో ఖల్లివెళ్లి కార్మికుడిగా పని చేస్తున్నా. గతంలో వీసా ఇచ్చిన కంపెనీ సరిగా వేతనం ఇవ్వకపోవడంతో మరో కంపెనీలో చేరా. కరోనా వైరస్ వల్ల ఆమ్నెస్టీ పెట్టారు. ఇంటికి రావడానికి దరఖాస్తు చేసుకున్నా. నాతోపాటు 20 మందికి ఔట్ పాస్‌పోర్టులు ఇవ్వలేదు. మాకు ఎలాగైనా ఔట్ పాస్‌పోర్టులు ఇప్పించాలి. – సంతోష్ లకావత్, డిచ్పల్లి, నిజామాబాద్ జిల్లా -
145 మంది భారతీయులను వెనక్కు పంపిన అమెరికా
న్యూఢిల్లీ: అక్రమ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సరైన అనుమతులు లేకుండా తమ దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్నారన్న నెపంతో 145 మంది భారతీయులను వెనక్కు పంపించింది. నేడు వారంతా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఏజెంట్ల ద్వారా అమెరికాలోకి అక్రమంగా చొరబడ్డవారు, వీసా గడువు పూర్తయినా అమెరికాలోనే నివాసముంటున్న భారతీయులు ఈ లిస్టులో ఉన్నారు. భారతీయులతోపాటు బంగ్లాదేశీయులను, దక్షిణా ఆసియావాసులను కూడా అమెరికా తమ దేశం నుంచి వెళ్లగొట్టింది. ఇదిలా ఉండగా అక్రమ వలసదారుల్లో 20 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నవారే అధికమని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ ఏజెంట్లు అక్రమంగా అమెరికాకు పంపించడానికి ఒక్కో వ్యక్తి దగ్గరనుంచి రూ.10 నుంచి రూ.15 లక్షలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అక్టోబర్‌లో 23న ఇదే తరహాలో అమెరికా 117 మంది భారతీయులను వెనక్కు పంపిన విషయం తెలిసిందే. -
పౌరసత్వ బిల్లులో కీలక మార్పులు
న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లులో కొన్ని మార్పులు చేయాలని కేంద్రం భావిస్తోంది. గత లోక్‌సభ రద్దైన నేపథ్యంలో ఆ బిల్లుకు కూడా కాలం చెల్లిన విషయం తెలిసిందే. దాంతో, కొత్తగా కొన్ని కీలక మార్పులతో ఆ బిల్లును మళ్లీ సభ ముందుకు తేవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా, ‘అక్రమ వలసదారులు’ అనే పదానికి నిర్వచనాన్ని కూడా బిల్లులో చేర్చనున్నారని సోమవారం అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ల్లో మతపరమైన వేధింపులకు తట్టుకోలేక భారత్‌కు వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, క్రిస్టియన్లు, పార్శీలకు.. వారివద్ద సరైన పత్రాలు లేనప్పటికీ.. భారతీయ పౌరసత్వం కల్పించే దిశగా పౌరసత్వ చట్టం, 1955లో సవరణ చేపట్టేందుకు ఉద్దేశించిన బిల్లు అది. ఇది బీజేపీ ప్రచారాస్త్రాల్లో ఒకటి. -
ఇంత భయంకరంగా ఉంటుందని తెలియదు..
న్యూఢిల్లీ: యువత కలల ప్రపంచం అమెరికా. అగ్రరాజ్యం వెళ్లాలి.. డాలర్లు సంపాదించాలి అని మనలో చాలా మంది కలలు కంటుంటారు. అలానే అనుకున్నారు పంజాబ్‌కు చెందిన కొందరు యువకులు. అయితే సక్రమంగా వెళ్తే 15-20లక్షల రూపాయలు కావాలి. అంత స్థోమత లేదు. మరి ఏం చేయాలి. అలాంటి సమయంలో కొన్ని యూట్యూబ్ వీడియోలు వారిని ఆకట్టుకున్నాయి. తక్కువ ఖర్చుతో పాస్‌పోర్టు, వీసాలాంటి గొడవలేం లేకుండా అమెరికాలో ప్రవేశించవచ్చని వారిని ఊదరగొట్టాయి. దాంతో ముందున్న ప్రమాదాన్ని అంచనా వేయలేక నానా అవస్థలు పడి.. మెక్సికో వరకు చేరుకుని.. అక్కడి నుంచి తిరిగి ఇండియాకు పంపించబడ్డారు. ఈ ప్రయాణంలో వారు అనుభవించిన కష్టాలు వర్ణనాతీతం. ఆ వ్యథ వారి మాటల్లోనే.. యూట్యూబ్ వీడియోలు చూసి.. ‘మా స్నేహితులు చాలా మంది అమెరికాలో ఉంటున్నారు. మేం కూడా అమెరికా వెళ్లాలి అనుకున్నాం. కానీ అందుకు 15-20లక్షల రూపాయలు అవసరమవుతాయన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ సమయంలోనే కొన్ని యూట్యూబ్ వీడియోలు మమ్మల్ని ఆకర్షించాయి. చాలా తక్కువ ఖర్చుతో.. రోడ్డు, విమానం, నడక ద్వారా అమెరికా చేరుకున్నట్లు కొందరు ఆ వీడియోల్లో తెలిపారు. దాంతో మేం కూడా అలానే వెళ్లాలని భావించాం. మెక్సికో చేరుకుని అక్కడి నుంచి ఎలా అయినా అమెరికా వెళ్లాలనుకున్నాం. ఈ లోపు మా స్నేహితుల ద్వారా కొందరు ఏజెంట్లు పరిచయం అయ్యారు. వారి సాయంతో సులభంగా అమెరికా చేరవచ్చని తెలిసింది. అలా జూలై 29న పంజాబ్ నుంచి ఢిల్లీ చేరుకుని.. ఇండియాను విడిచి వెళ్లాం’ అన్నారు. ఇంత భయంకరంగా ఉంటుందని తెలియదు.. ‘ఈక్వేడార్ చేరుకున్నాం. ఆ తర్వాత మా స్నేహితులు చెప్పిన ఏజెంట్లు మమ్మల్ని రోడ్డు, విమానం ద్వారా కొలంబియా, బ్రెజిల్, పెరు, పనామా, కొస్టా రికా, నికరాగువా, హోండురాస్, గ్వాటెమాల ద్వారా చివరకు మెక్సికో చేర్చారు. ఈ ప్రయాణంలో ప్రతి ఇమ్మిగ్రేషన్ పాయింట్ వద్ద రోజుల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. ఏజెంట్లు మమ్మల్ని ఉంచిన హోటల్స్‌ని తలచుకుంటే.. ఇప్పటికి వెన్నులోంచి వణుకు పుడుతుంది. పనామా నుంచి మా ప్రయాణం అంత భయంకరంగా ఉంటుందని తెలిస్తే.. అసలు అమెరికా వెళ్లాలనే ఆలోచనే చేసే వాళ్లం కాదు. అక్కడ దట్టమైన అడవిలో మా ప్రయాణం. మాకంటే ముందే వెళ్లిన వారు.. తమ తర్వాత వచ్చే వారు సరైన మార్గంలో పయణించేలా ప్లాస్టిక్ కవర్లను వాడి గుర్తులు పెట్టుకుంటు వెళ్లారు. దాదాపు వారం రోజుల పాటు ఆ అడవి గుండా.. కొండలను ఎక్కుతూ మా ప్రయాణం సాగింది’ అన్నారు. చెమటను పిండుకు తాగి దాహం తీర్చుకున్నాం.. ‘తిండి కాదు కదా.. కనీసం తాగడానికి నీరు కూడా లభించలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మా చొక్కాలకు పట్టిన చెమటను పిండి.. దాని ద్వారా దాహం తీర్చుకున్నాము. ఈ భయంకరమైన ప్రయాణంలో మాలో కొందరు అనారోగ్యంతో కన్నుమూశారు. ఎట్టకేలకు చివరకు మెక్సికో చేరుకున్నాం. గమ్యం చేరామని సంతోషించే లోపలే మమ్మల్ని అరెస్ట్ చేశారు. జైలు కంటే దారుణంగా ఉన్న క్యాంపులో మమ్మల్ని ఉంచారు. ఎప్పుడు పడితే అప్పుడు క్యాంపులో నుంచి బయటకు రానిచ్చేవారు కాదు. రోజుకు రెండు పూటలా మాత్రమే భోజనం పెట్టేవారు. ఆ ఇరుకు వాతావరణంలో మాలో చాలా మంది అనారోగ్యం పాలయ్యారు. మెక్సికో చేరుకున్న తర్వాత కొందరు ఏజెంట్లు 3500 డాలర్లు ఇస్తే పాస్ ఇస్తామని దాని ద్వారా అమెరికాలో అడుగుపెట్టవచ్చని తెలిపారు. దాంతో కొందరు ఆ మొత్తం చెల్లించి పాస్‌లు తీసుకున్నారు. కానీ అవి చెల్లవని తర్వాత తెలిసింది’ అన్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలి.. ‘దాదాపు నాలుగు నెలలు కష్టపడి మెక్సికో చేరాం. అక్కడ 45 రోజుల పాటు క్యాంప్‌లో గడిపాం. చివరకు ఇలా ఇండియా తిరిగి వచ్చేశాం. అమెరికా వెళ్లడానికి మాకున్న కొద్ది పాటి భూములను కూడా అమ్ముకున్నాం. ఇప్పుడు ఏం చేయాలో మాకు పాలు పోవడం లేదు. ప్రభుత్వమే మాకు దారి చూపాలి’ అని వాపోతున్నారు. శుక్రవారం మెక్సికోలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న ఒక మహిళ సహా 310 మందిని చార్టర్ విమానంలో తిప్పి పంపిన సంగతి తెలిసిందే. -
311 మంది భారతీయులను వెనక్కి పంపిన మెక్సికో
మెక్సికో సిటీ: సరైన అనుమతులు లేకుండా తమ దేశంలో ఉంటున్న 311 మంది భారతీయులను మెక్సికో అధికారులు వెనక్కి పంపించారు. ఈ మేరకు తమ దేశంలో ఉండేందుకు సరైన అనుమతులు లేని భారతీయులను టొలుకా విమానాశ్రయం నుంచి ప్రత్యేక బోయింగ్ 747 విమానంలో భారత్‌కు తిప్పి పంపినట్లు మెక్సికన్ జాతీయ వలసల సంస్థ (ఐఎన్ఎమ్) ఓ ప్రకటనలో పేర్కొంది. మెక్సికన్ సరిహద్దుల నుంచి పెరుగుతున్న వలసలను నివారించేందుకు ఆ దేశంపై టారిఫ్‌ల భారం పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించిన నేపథ్యంలో మెక్సికో ఈ చర్యకు పూనుకుంది. సరిహద్దుల వెంబడి నిఘా పెంచడంతోపాటు వలసదారులను దేశంలోకి అనుమతించే పాలసీని సవరించాలని నిర్ణయించింది. అక్రమ వలసదారులను తిప్పి పంపించే విషయంలో భారతీయ దౌత్య కార్యాలయం మంచి సహకారం అందించిందని, కృతజ్ఞతలు తెలిపింది. -
19 లక్షల పేర్లు గల్లంతు
గువాహటి: వివాదాస్పద నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ తుదిజాబితా శనివారం విడుదలైంది. అసోంలోని భారతీయ పౌరులను గుర్తించేందుకు చేపట్టిన ఎన్ఆర్సీ జాబితాలో 19 లక్షల మంది చోటు దక్కించుకోలేకపోయారు. అసోం పౌరులైన తమను ఈ జాబితాలో చేర్చాలని 3.30 కోట్ల మంది దరఖాస్తు చేసుకోగా... పలు మార్పులు, చేర్పులు, సవరణల తరువాత 3.11 కోట్ల మందికి చోటు లభించినట్లు ఎన్ఆర్సీ రాష్ట్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. జాబితాలో చోటు దక్కనివారు 120 రోజుల్లోపు ఫారినర్స్ ట్రైబ్యునళ్లలో అప్పీల్ చేసుకోవచ్చునని తెలిపింది. ఎన్నార్సీకి వ్యతిరేకంగా గువాహటిలో హిందూయువ చాత్ర పరిషత్ సభ్యుల ఆందోళన ట్రిబ్యునళ్లు విదేశీయులుగా ప్రకటించేంత వరకూ జాబితాలో లేని వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్బంధించేది లేదని అసోం ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి ఇక్కడ ప్రస్తావనార్హం. శనివారం ఉదయం పది గంటలకు ఎన్ఆర్సీ తుదిజాబితాను ఆన్లైన్లో ప్రచురించగా ప్రజల సందర్శనార్థం అన్ని ప్రతులను ఎన్ఆర్సీ సేవా కేంద్రాలు, డిప్యూటీ కమిషనర్, సర్కిల్ ఆఫీసుల్లో అందుబాటులో ఉంచారు. తమ పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు శనివారం వందలాది మంది ఈ కార్యాలయాల్లో క్యూ కట్టారు. పేర్లు ఉన్న వాళ్లు విరిసిన ముఖాలతో బయటకు రాగా.. కొందరు నిరాశగా వెనుదిరగడం కనిపించింది. అందరిలోనూ అసంతృప్తి... ఎన్ఆర్సీ తుది జాబితాపై అటు అధికార బీజేపీతోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిం వలసదారులకు జాబితాలో చోటు దక్కిందని, స్థానికులను మాత్రం వదిలేశారని మంగల్దోయి మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేన్ డేకా వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఎన్ఆర్సీ రూపకల్పన జరిగినప్పటికీ అంత నాణ్యంగా ఏమీ జరగలేదని పెదవి విరిచారు. అర్హులైన వారు చాలామందిని జాబితాలోకి చేర్చలేదంటూ బార్పేట కాంగ్రెస్ నేత అబ్దుల్ ఖాలీక్ విమర్శించారు. ఎన్నార్సీపై హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచుకుంటున్న ప్రజలు అక్రమ వలసదారుల బహిష్కరణకు ఆది నుంచి ఉద్యమాలు నడిపిన, ఎన్ఆర్సీ జాబితా సవరణకు సుప్రీంకోర్టుకెక్కిన ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్ నేతలు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘మేము ఏమాత్రం సంతోషంగా లేము. జాబితాను సవరించే క్రమంలో ఎన్నో లోపాలు ఉన్నాయి. ఇది అసంపూర్తి జాబితా మాత్రమే. జరిగిన తప్పులన్నింటినీ సరిచేసేందుకు మళ్లీ సుప్రీంకోర్టుకు వెళతాం’’అని సంస్థ జనరల్ సెక్రటరీ లురిన్జ్యోతి గగోయ్ స్పష్టం చేశారు. గతంలో వేర్వేరు సందర్భాల్లో అక్రమ వలసదారులుగా ప్రకటించిన సంఖ్యకు, అధికారికంగా ప్రకటించిన అంకెకు ఏమాత్రం పొంతన లేదని గగోయ్ శనివారం ఒక విలేకరుల సమావేశంలో ఆరోపించారు. 20 శాతం జాబితానైనా సమీక్షించాలి: హిమంతా ఎన్ఆర్సీ తుది జాబితాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అసోం మంత్రి, నారŠ?త్తస్ట్ డెమొక్రటిక్ అలయన్స్ కన్వీనర్ హిమంతా బిశ్వాస్ శర్మ... జాబితాను పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ సరిహద్దుల వెంబడి ఉన్న జిల్లాల నుంచి ఎన్ఆర్సీలో చోటు దక్కించుకున్న వారిలో కనీసం 20 శాతం మందినైనా మరోసారి పునః పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అనుమతివ్వాలని ఆయన కోరారు. మిగిలిన జిల్లాల్లో 10 శాతం పునః పరిశీలన ద్వారా కచ్చితమైన జాబితా రూపొందించవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘1971 కంటే ముందు బంగ్లాదేశ్ నుంచి శరణార్థులుగా వచ్చిన వారికి ఎన్ఆర్సీ జాబితాలో చోటు దక్కలేదు. శరణార్థిగా ధ్రువీకరించే పత్రాలను అధికారులు అస్సలు పట్టించుకోలేదు. పాత జాబితాల్లో అవకతవకల కారణంగా కొంతమంది ఎన్ఆర్సీలో చోటు దక్కించుకోగలిగారు’’అని హిమంత ఓ ట్వీట్ కూడా చేశారు. ఎన్ఆర్సీ సవరణకు ముందుగా సుప్రీంకోర్టు తలుపుతట్టిన ‘ద అసోం పబ్లిక్ వర్క్స్’’కూడా తుదిజాబితా లోపభూయిష్టమైందని వ్యాఖ్యానించారు. పునః పరిశీలన చేయాలన్న తమ డిమాండ్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చిన కారణంగా తుదిజాబితాలో తప్పులు చోటు చేసుకున్నాయని సంస్థ అధ్యక్షుడు అభిజీత్ శర్మ వ్యాఖ్యానించారు. ఎన్నార్సీ అస్సాంకేనా? అస్సాంలో మాదిరిగానే బంగ్లాదేశీయుల వలసలు ఎక్కువగా ఉన్న ఢిల్లీతోపాటు శ్రీనగర్‌లోనూ ఇలాంటి వివరాలు సేకరించాలని విశ్లేషకులు అంటున్నారు. అంతకంటే ముందుగా ఎన్నార్సీ ప్రక్రియను పశ్చిమబెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశాల్లోనూ మొదలుపెట్టాలని, ఈ ప్రక్రియ ఏ ఒక్క మతానికో లేక వర్గానికో పరిమితం కారాదని అంటున్నారు. అసోంతోపాటు చాలా రాష్ట్రాల్లో అక్రమ వలసదారులున్నందున ఇలాంటి ప్రక్రియను మిగతా రాష్ట్రాల్లోనూ అమలు చేస్తే తప్పేంటని వాదిస్తున్నారు. ఎన్నార్సీ ప్రక్రియలో నిర్దేశిత విధానాలను పాటించాలని సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టం చేసింది. పశ్చిమబెంగాల్ అయినా హిమాచల్ ప్రదేశ్ అయినా ఎన్నార్సీ సమీక్షలో ఆయా రాష్ట్రాలు సహకరించాలి. అయితే, కొన్ని రాజకీయ పార్టీలు తమ అనుకూల వలసవాదులను ఎన్నార్సీ జరగని రాష్ట్రాలకు పారిపోయేలా సహకరిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. జాతి హితం దృష్ట్యా ఈ వివాదంలోకి పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్‌లను లాగకుండా పార్టీలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. అక్రమ వలసదారులు, కాందిశీకులు కానటువంటి నిజమైన భారతీయులను గుర్తించడమే ఎన్నార్సీ లక్ష్యం కావాలంటున్నారు. రొహింగ్యాలను వెనక్కి పంపేందుకు బంగ్లాదేశ్ ప్రయత్నిస్తుండగా కోట్లాది బంగ్లాదేశీయుల్లో పట్టుమని 50 మందిని ప్రభుత్వం వెనక్కి పంపించలేక పోవడం ఏమిటంటున్నారు. ఎన్నార్సీ పూర్వాపరాలివీ.. ► 1951: స్వాతంత్య్రం తరువాత నిర్వహించిన తొలి జనాభా లెక్కల్లో భాగంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్ఆర్సీ) తయారైంది ► 1955: భారతీయ పౌర చట్టం అమల్లోకి వచ్చింది. భారతీయ పౌరులు అయ్యేందుకు కావాల్సిన నిబంధనలన్నీ ఇందులో పొందుపరిచారు. ► 1951 1966: తూర్పు పాకిస్థాన్ (బంగ్లాదేశ్) నుంచి వచ్చిన పలువురు ఈ కాలంలో నిర్బంధంగా అసోం వదిలి వెళ్లాల్సి వచ్చింది. ► 1965: భారత పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో అసోంలోకి మళ్లీ పెరిగిన చొరబాట్లు. ► 1971: మరోసారి వెల్లువలా చొరబాట్లు. ► 1979: అక్రమ చొరబాటుదార్లకు వ్యతిరేకంగా అసోంలో ఉద్యమం మొదలు ► 1983: నైలేలీ మారణకాండ. సుమారు మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అక్రమ వలసదారుల వ్యతిరేక చట్టానికి ఆమోదం. ట్రిబ్యునళ్ల ద్వారా వలసదారుల నిర్ధారణ మొదలు. ► 1985 భారత ప్రభుత్వం, ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్ల మధ్య కుదిరిన ఒప్పందం. మార్చి 25, 1971రి అక్రమ వలసదారుల నిర్ధారణకు కటాఫ్ తేదీగా నిర్ణయం. ► 1997 అనుమానాస్పద ఓటర్లను ఓటర్ల జాబితాలో ‘డీ’అక్షరం ద్వారా గుర్తించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయం ► 2003 పౌర చట్టంలో మార్పులకు ప్రయత్నాలు మొదలు. ► 2005 1983 నాటి అక్రమ వలసదారుల చట్టాన్ని కొట్టివేసిన సుప్రీంకోర్టు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్ల మధ్య త్రైపాక్షిక చర్చలు. 1951 నాటి ఎన్ఆర్సీ సవరణకు సూత్రప్రాయ అంగీకారం. ► 2010 బార్పేటలోని ఛాయాగావ్‌లో ఎన్ఆర్సీ జాబితా సవరణ తాలూకూ పైలట్ ప్రాజెక్టు మొదలు.హింసాత్మక ఘటనల్లో నలుగురి మృతి. ప్రాజెక్టు నిలిపివేత. ► 2016 ఎన్ఆర్సీ సవరణకు సుప్రీంకోర్టు పిలుపు ► 2017 డిసెంబరు 31న ఎన్ఆర్సీ తొలి ముసాయిదా జాబితా విడుదల ► 2019 జూలై 31న ఎన్ఆర్సీ రెండో ముసాయిదా జాబితా విడుదల. సుమారు 41 లక్షల మందికి దక్కని చోటు ► 2019 ఆగస్టు 31. ఎన్ఆర్సీ తుది జాబితా విడుదల. జాబితాలో చోటు దక్కని వారి సంఖ్య 19 లక్షలు. -
అక్రమ వలసదారులను పంపిస్తాం: అమిత్ షా
న్యూఢిల్లీ: అంతర్జాతీయ చట్టాలను అనుసరించి అక్రమ వలసదారులు భారత్‌లో ఎక్కడున్నా, వారిని పంపించివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పష్టంచేశారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఎన్నార్సీలో పౌరుల వివరాలను నమోదు చేస్తున్నామ న్నారు.బుధవారం రాజ్యసభలో సమాజ్‌వాదీ పార్టీ నేత జావేద్ అడిగిన ప్రశ్నకు అమిత్ జవాబిచ్చారు. ప్రతి రాష్ట్రంలోనూ ఇదే పద్ధతి అమలు చేస్తామన్నారు. అక్రమ వలసదారులను పంపించేస్తామన్న బీజేపీ మేనిఫెస్టో హామీ కూడా తాము అధికారంలోకి రావడానికి ఓ కారణమన్నారు. ఎన్నార్సీ సేకరణకు అసోంలో సమయాన్ని పొడిగించాలంటూ 25 లక్షల మంది సంతకాలు చేసి కేంద్రానికి, రాష్ట్రపతికి అందించారని హోంశాఖ సహాయక మంత్రి నిత్యానంద్ రాయ్ అన్నారు. -
ప్రపంచాన్ని కన్నీరు పెట్టిస్తున్న ఫొటో
సరిగ్గా నాలుగేళ్ల క్రితం.. యూరప్‌నకు వలస వెళ్లే క్రమంలో జరిగిన పడవ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకొని... టర్కీ బీచ్‌లోకి కొట్టుకు వచ్చిన మూడేళ్ల చిన్నారి అలన్ కుర్దీ ఫొటో చూసి ప్రపంచమంతా కన్నీరు పెట్టింది. ప్రస్తుతం ఇప్పుడు అలాంటి ఫొటోనే మరోసారి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తన కూతురిని షర్ట్‌కు ముడివేసుకుని నీళ్లలో మునిగి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఓ తండ్రి శవం మానవత్వం ఉన్న ప్రతీ ఒక్కరి మనస్సును ద్రవింపజేస్తోంది. మరణంలోనూ మా బంధం వీడదు అని చెబుతున్నట్లుగా ఉన్న ఆ తండ్రీకూతుళ్ల ఫొటో శరణార్థుల దీనగాథలను మరోసారి కళ్లకు కట్టింది. నిరంతరం గ్యాంగ్ వార్లతో దద్దరిల్లే తన దేశం నుంచి అమెరికాకు వెళ్లి.. అక్కడే స్థిరపడాలనుకున్నాడు ఓ ఓ మధ్యతరగతి తండ్రి. మహిళలకు రక్షణ లేని మాతృదేశంలో ఉంటే తన చిన్నారి కూతురు కూడా రాక్షస మూక అకృత్యాలకు బలవుతుందనే ఆవేదనతో ప్రాణాలకు తెగించైనా సరే అగ్రరాజ్యంలో ప్రవేశించాలనుకున్నాడు. కొంత డబ్బు సంపాదించి తిరిగి ఇంటికి రావొచ్చని భావించాడు. కానీ అదే తన పాలిట శాపమవుతుందని ఊహించలేకపోయాడు . అతడి పేరు ఆస్కార్ ఆల్బెర్టో మార్జినెజ్ రామిరెజ్. ఈఎల్ సాల్వేడార్‌కు చెందిన అతడు అమెరికాలో ఆశ్రయం పొందాలని భావించాడు. ఇందులో భాగంగా పలుమార్లు ఆ దేశ అధికారులకు తన పరిస్థితి గురించి మొరపెట్టుకున్నాడు. అయినప్పటికీ అక్కడి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో మెక్సికో గుండా అమెరికాలో ప్రవేశించాలని భావించాడు. ఈ క్రమంలో ఆదివారం తన భార్యాపిల్లలతో కలిసి అమెరికా- మెక్సికో సరిహద్దులో ఉన్న రియో గ్రాండే నదిని దాటేందుకు సిద్ధమయ్యాడు. తొలుత కూతురిని వీపునకు కట్టుకుని ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేర్చాడు. అనంతరం తన భార్యను కూడా తీసుకువచ్చేందుకు వెనుదిరిగాడు. అయితే తండ్రి తనను విడిచిపెట్టి వెళ్తున్నాడని భావించిన చిన్నారి వాలెరియా.. అతడిని అనుసరించాలని నీళ్లలో దూకింది. దీంతో షాక్‌కు గురైన రోమిరెజ్ వెంటనే వెనక్కి వచ్చి కూతురిని తన షర్టుకు ముడివేసుకున్నాడు. కూతురి చేతులు మెడ చుట్టూ వేసుకుని మళ్లీ ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించాడు. కానీ దురదృష్టవశాత్తూ నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో వారిద్దరు నీళ్లలో మునిగి చనిపోయారు. అనంతరం అలాగే ఒడ్డుకు కొట్టుకువచ్చారు. హృదయవిదారకంగా ఉన్న తండ్రీ కూతుళ్ల ఫొటోను చూసి ప్రతి ఒక్కరు కంటతడి పెడుతున్నారు. మెక్సికోలో నివసించే జర్నలిస్టు జులియా లీ డ్యూక్ ఈ ఫొటోను తీశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో సిరియా శరణార్థి చిన్నారి అలన్ కుర్దీ రూపాన్ని మరోసారి గుర్తుచేసుకుంటూ శరణార్థుల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వద్దని చెప్పినా వినలేదు..! ‘ఇక్కడే ఉందామని ఎంతగానో బతిమిలాడాను. కానీ మార్టినెజ్ వినలేదు. సొంతంగా ఇల్లు కట్టుకోవాలని భావించాడు. అందుకోసం డబ్బు సంపాదించేందుకు అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అలాగే కొన్ని రోజులు ప్రశాంతంగా అక్కడే జీవించవచ్చని చెప్పాడు. వద్దన్నా వినకుండా కూతురితో కలిసి నదిలో ఈదుకుంటూ వెళ్లాడు. ఇప్పుడు వాళ్లిద్దరూ మాకు శాశ్వతంగా దూరమయ్యారు. నన్ను కూడా వాళ్లతో పాటు తీసుకువెళ్తే బాగుండు. చిన్నా నిన్ను ఇంతదూరం తీసుకువచ్చా.. ఇప్పుడు కూడా నీతోనే వస్తా అని బహుశా నా కొడుకు తన కూతురితో చెప్పి ఉంటాడు. అన్నట్లుగానే వెళ్లిపోయాడు’ అని రోమిరెజ్ తల్లి రోసా రోమిరెజ్ ఆవేదన వ్యక్తం చేసింది. దయచేసి ఇక్కడే ఉండండి.. రోమిరెజ్, వాలెరియా ఫొటోలు వైరల్‌గా మారడంతో ఈఐ సాల్వెడార్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి అలెగ్జాండ్రా హిల్ ఈ ఘటనపై స్పందించారు. ‘మా దేశం మరోసారి శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక్కడున్న ప్రతీ కుటుంబాన్ని, తల్లిదండ్రులను వేడుకుంటున్నాను. దయచేసి జీవితాలను పణంగా పెట్టి ఇలాంటి చర్యలకు పాల్పడకండి’ అని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. మెక్సికో అధికారులతో మాట్లాడి మిమ్మల్ని వెనక్కి తీసుకువస్తామని పేర్కొన్నారు. ఇక ఈఐ సాల్వెడార్ అధ్యక్షుడు నయీబ్ బుకేలే బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సిరియా బాలుడు- అలన్ కుర్దీ కాగా గత వారం అమెరికా- మెక్సికో సరిహద్దులో అరిజోనా ఎడారిలో భారతీయ చిన్నారి గుర్ప్రీత్ కౌర్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక అమెరికాలో ఉన్న లక్షలాది మంది అక్రమ వలసదారులను త్వరలోనే వెళ్లగొడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన విషయం విదితమే. ‘అక్రమమార్గాల్లో వచ్చిన వారిని వెళ్లగొట్టేందుకు ఉద్దేశించిన ప్రక్రియను వచ్చే వారం ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ(ఐసీఈ) ప్రారంభించనుంది. ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంతో వాళ్లు వెళ్లిపోతారు’ అని ట్వీట్‌చేశారు. ఈ నేపథ్యంలో సాయం నిలిపి వేస్తామంటూ మెక్సికోను భయపెట్టి మరీ అమెరికా ఒప్పందానికి దిగేలా చేసింది. దాని ప్రకారం వలసదారులను నిలువరించేందుకు అమెరికాతో సరిహద్దుల్లో మెక్సికో అదనంగా 6 వేల మంది గార్డులను నియమించింది. దీంతో వలసదారులు వారి నుంచి తప్పించుకునే క్రమంలో ఇలా ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విషయం ప్రస్తుతం చర్చ నీయాంశమైంది. -
తొందర్లోనే వెళ్లగొడతాం
వాషింగ్టన్: అమెరికాలో ఉన్న లక్షలాది మంది అక్రమ వలసదారులను త్వరలోనే వెళ్లగొడతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. వచ్చే వారమే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. వలసదారుల్ని వెనక్కి తీసుకునేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై సంతకం చేసేందుకు గ్వాటెమాలా అంగీకరించిందన్నారు. ‘అక్రమమార్గాల్లో వచ్చిన వారిని వెళ్లగొట్టేందుకు ఉద్దేశించిన ప్రక్రియను వచ్చే వారం ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ(ఐసీఈ) ప్రారంభించనుంది. ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంతో వాళ్లు వెళ్లిపోతారు’ అని ట్వీట్‌చేశారు. ‘తమ దేశం మీదుగా అమెరికాలో ప్రవేశించిన వారిని వెనక్కి తీసుకునేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై త్వరలోనే గ్వాటెమాలా సంతకం చేయనుంది. ఆ వలసదారులు ఆశ్రయం కోసం ఇకపై అమెరికాకు బదులు గ్వాటెమాలాలోనే దరఖాస్తు చేసుకుంటారు’ అని ట్రంప్ పేర్కొన్నారు. మధ్య అమెరికాలో దేశాల్లో అశాంతి కారణంగా అక్కడి ప్రజలు గ్వాటెమాలాకు, మెక్సికోకు అక్కడి నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల సాయం నిలిపి వేస్తామంటూ మెక్సికోను భయపెట్టి మరీ అమెరికా ఒప్పందానికి దిగేలా చేసింది. దాని ప్రకారం వలసదారులను నిలువరించేందుకు అమెరికాతో సరిహద్దుల్లో మెక్సికో అదనంగా 6వేల మంది గార్డులను నియమించింది. దీంతోపాటు తమ దేశం గుండా ప్రవేశించిన వారిని వెనక్కి తీసుకునేందుకు కూడా అంగీకరించింది. అమెరికా, గ్వాటెమాలా త్వరలో ఇలాంటి ఒప్పందమే కుదుర్చుకోనున్నాయి. దేశంలో అక్రమంగా ఉంటున్న దాదాపు 10లక్షల మందిని వెనక్కి పంపించేయాలన్న కోర్టుల ఉత్తర్వుల్ని అమలు చేసేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. హెచ్–4 వీసా రద్దు మరింత ఆలస్యం అమెరికాలో ఉండే భారత ఐటీ నిపుణుల జీవిత భాగస్వాములు ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్–4 వీసా విధానం మరి కొంతకాలం కొనసాగనుంది. రద్దు ప్రక్రియకు సంబంధించిన చట్ట రూప కల్పన ఇంకా పూర్తి కాలేదని అధికారులు అంటున్నారు. హెచ్–4 సహా ఉద్యోగ ఆధారిత వీసా విధానాలన్నిటిపై సమీక్ష కొనసాగుతోందని యూఎస్ సిటిజన్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) తెలిపింది. పశ్చిమాసియాకు అమెరికా సైనికులు ఇరాన్‌తో అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో మరో వెయ్యి మంది సైనిక సిబ్బందిని పశ్చిమాసియా ప్రాంతానికి పంపేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. గగన, సముద్ర, భూతలంలో ఉన్న ప్రమాదాలను ఎదుర్కొనేందుకు పశ్చిమాసియాకు కొత్తగా వెయ్యి మందిని పంపుతున్నట్లు అమెరికా తాత్కాలిక రక్షణ మంత్రి ప్యాట్రిక్ షనాహన్ చెప్పారు. అణు ఒప్పందంలో నిర్దేశించిన దానికన్నా అధికంగా యూరేనియంను తాము వచ్చే పది రోజుల్లోనే నిల్వచేయనున్నామంటూ ఇరాన్ ప్రకటించిన కొద్దిసేపటికే అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అణు ఒప్పందం నుంచి అమెరికా ఇప్పటికే బయటకు రావడం తెలిసిందే. -
శరణార్థుల ‘సంరక్షణ నగరాలు’!
వాషింగ్టన్/ఫోనిక్స్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయం అక్రమ వలసదారులకు సానుకూలంగా ఉండేలా కనిపిస్తోంది. వలసదారులను సంరక్షణ నగరాలకు (శాంక్చురీ సిటీస్) పంపే యోచనను ట్రంప్ తీవ్రంగా చేస్తున్నారు. ఈ సంరక్షణ నగరాలకు ప్రజలను పంపడం ద్వారా వారు అమెరికాలోనే ఉండేందుకు అవకాశం కలగనుంది. తమపై నమోదైన వలస కేసులకు సంబంధించి మరింత ఎక్కువగా న్యాయ సహాయం పొందే అవకాశం కూడా అక్రమ వలసదారులకు కలుగుతుంది. షికాగో, న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో వంటి నగరాల్లో న్యాయ నిపుణులు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. అయితే ఈ సంరక్షణ నగరాల్లో జీవన వ్యయం ఎక్కువగా ఉండనుండటం అక్రమ వలసదారులకు ప్రతికూలాంశం. అదే సందర్భంలో ఇతర నగరాల్లోని అక్రమ వలసదారులతో పోలిస్తే సంరక్షణ నగరాల్లో నివసించే అక్రమ వలసదారులు అరెస్టయ్యే అవకాశాలు 20 శాతం తక్కువ. శాన్ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ న్యాయవాది జార్జ్ గాస్కన్ మాట్లాడుతూ సంరక్షణ నగరాల్లోని అక్రమ వలసదారులు నేరాలకు పాల్పడేందుకు అవకాశం తక్కువనీ, అయితే ఇది రాజకీయ ప్రేరేపణతో తీసుకున్న, ప్రజల జీవితాలతో ఆడుకునే నిర్ణయమని అన్నారు. మెక్సికో సరిహద్దు నుంచి వలసదారులు అమెరికాలోకి ప్రవేశిస్తుండటం ట్రంప్‌ను తీవ్రంగా కలవరపెడుతుండటం తెలిసిందే. అక్రమవలసదారులను సంరక్షణ నగరాలకు తరలించాలన్న ప్రతిపాదన పాతదే. ఇప్పటికే రెండుసార్లు ట్రంప్ యంత్రాంగం దీనిని తిరస్కరించింది. అయితే ట్రంప్ శుక్రవారం ఓ ట్వీట్ చేస్తూ ఈ ప్రతిపాదన ఇంకా తమ పరిశీలనలో ఉందని వెల్లడించడం గమనార్హం. మరోవైపు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ మాట్లాడుతూ అక్రమ వలసదారుల విషయంలో తమ ముందు ఉన్న అనేక మార్గాల్లో ఈ సంరక్షణ నగరాలు ఒకటి మాత్రమే పేర్కొన్నారు. ఏమిటీ సంరక్షణ నగరాలు? సంరక్షణ నగరాలకు ప్రత్యేకంగా నిర్వచనమేదీ లేదు. ఒక్కమాటలో స్థూలంగా చెప్పాలంటే కొన్ని అంశాల్లో, ప్రత్యేకించి అక్రమ వలసల విషయాల్లో స్థానిక పోలీసులు అమెరికా కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరించలేరు. దీనిపై పరిమితులుంటాయి. అక్రమవలసదారులను నిర్బంధించాలని అమెరికా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కోరినా దాదాపు 200 పట్టణాలు ఆ ఆదేశాలను పట్టించుకోలేదు. అంటే అవి సంరక్షణ పట్టణాల కిందకు వచ్చినట్లే. న్యూయార్క్, షికాగో, లాస్ ఏంజిలస్, శాన్ఫ్రాన్సిస్కో వంటి నగరాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. -
అంతా మోసాల ప్రపంచమే
వాషింగ్టన్: అధ్యక్ష పదవి, అధికారం అంటే అబద్ధాలతో నిండిపోయిన, మోసపూరిత, ప్రమాదకర ప్రపంచమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాను స్థిరాస్తి వ్యాపార రంగంలో ఉన్నప్పుడు మన్హట్టన్లో అదే రంగంలో పనిచేసే మనుషులు ఘటికులని అనుకునే వాడిననీ, కానీ రాజకీయ నాయకుల ముందు వారు పసిపిల్లల వంటి వారని ట్రంప్ అన్నారు. అధ్యక్ష భవనం శ్వేతసౌధానికి వచ్చి 20 నెలలు పూర్తయిన సందర్భంగా సీబీఎస్ న్యూస్ చానల్‌కు ట్రంప్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మీడియాకు అస్సలు నిజాయితీ ఉండదన్న విషయం అధ్యక్షుడినయ్యాకే తెల్సుకున్నానన్నా రు. ‘గతంలో ఎవ్వరూ చేయని పనులను నేను చేయగలుగుతున్నా. పన్నుల విషయంలో కావచ్చు, నిబంధనలు కావచ్చు, ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం కావచ్చు. నాలా ఎవ్వరూ చేయలేదు’ అని అన్నారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో వివిధ వర్గాలుగా విడిపోయిన వారిని ఇప్పుడు అమెరికా ఆర్థిక వ్యవస్థ దగ్గర చేస్తోందన్నారు. యూఎస్ సుప్రీంకోర్టు జడ్జిగా కేవనాను నియమించడంతో మొదలైన వివాదం.. వచ్చే నెలలో మధ్యంతర ఎన్నికలపై ప్రభావం చూపొచ్చని అంచనా వేశారు. తన పాలనలో అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడ్డాయన్నవి నకిలీ వార్తలేనని ఆయన చెప్పారు. వైట్‌హౌస్‌లోని అందరినీ నమ్మననీ, ఈ పదవిలో ఉండటం కష్టమైన పనని చెప్పారు. వలస చట్టాలన్నీ మార్చాలి.. అమెరికాలోని ప్రస్తుత వలస చట్టాలను చూసి ప్రపంచం నవ్వుతోందనీ, ఈ చట్టాలన్నింటినీ మార్చాలన్నారు. ప్రతిభ ఉన్న వారిని అమెరికాలోకి అనుమతించే విధానం తెస్తామని ట్రంప్ శనివారం కూడా చెప్పారు. ఇటీవల సరిహద్దుల్లోనే అక్రమ వలసదారులను పట్టుకుని పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరుచేయడం తెలిసిందే. ఈ విధానాన్ని మళ్లీ అమలు చేస్తారా అని ప్రశ్నించగా, అన్ని వలస చట్టాలనూ తాను మారుస్తానని ట్రంప్ వెల్లడించారు. అక్రమ వలసదారులు అమెరికాలో అన్ని సౌకర్యాలు పొందేలా చేసే ఓ విధానాన్ని డెమొక్రాట్లు సమర్థిస్తున్నారని ఆరోపించారు. అక్రమ వలసదారుల వల్లే దేశంలో నేర ముఠాలు పెరిగిపోతున్నాయన్నారు. పర్యావరణ మార్పు అనేది ఓ మిథ్య అని గతంలో అన్న ట్రంప్ తాజాగా తన మాటమార్చారు. పర్యావరణం వేడెక్కుతుండటం నిజమే కానీ, వాతావరణ మార్పు శాస్త్రవేత్తలకు రాజకీయ ఎజెండాగా ఉందని ఆరోపణలు చేశారు. మధ్యంతర ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ ‘రష్యా వాళ్ల జోక్యం ఉంది. కానీ చైనా జోక్యమూ ఉందని నాకనిపిస్తోంది. చైనా మరో పెద్ద సమస్య’ అని అన్నారు. కాగా, దక్షిణాఫ్రికాకు చెందిన కమెడియన్, ‘ద డైలీ షో’ యాంకర్ ట్రెవొర్ నోవా ట్రంప్‌ను కేన్సర్ జబ్బుతో పోల్చారు. -
అక్రమ వలసదారులను గుర్తిస్తాం
న్యూఢిల్లీ: తమ పార్టీకి మళ్లీ అధికారమిస్తే దేశంలో అక్రమంగా ఉంటున్న వలసదారులను గుర్తిస్తామని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా హామీ ఇచ్చారు. వలసదారులకు అండగా ఉంటూ కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం పార్టీ ర్యాలీ ‘పూర్వాంచల్ మహాకుంభ్’లో ఆయన మాట్లాడారు. ‘2019లో ప్రభుత్వ ఏర్పాటు అనంతరం దేశంలో అక్రమ వలసదారుల గుర్తింపును మా పార్టీ చేపడుతుంది. అక్రమ వలసదారులు దేశానికి చెద పురుగుల్లా తయారయ్యారు. వారిపై చర్యలు తీసుకుంటే దేశభక్తులైన వారెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, రాహుల్ బాబా, కేజ్రీవాల్ మాత్రం గగ్గోలు పెడతారు. ఎందుకంటే వారివి ఓటు బ్యాంకు రాజకీయాలు’ అని ఎద్దేవా చేశారు. అక్రమ వలసలపై రాహుల్, కేజ్రీవాల్‌లు తమ అభిప్రాయాన్ని స్పష్టం చేయాలన్నారు. ‘బీజేపీకి వ్యతిరేకంగా ఏకమైన మహా కూటమికి ఒక విధానం లేదు, నేతా లేడు. ఆ కూటమికి నాయకుడు కావాలని రాహుల్ అనుకుంటున్నారు. కానీ, శరద్ పవార్, మాయావతి, మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్ అందుకు ఒప్పుకోరు’ అని అన్నారు. 2019 ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ బీజేపీ చేపట్టాల్సిన నాలుగు భారీ ర్యాలీల్లో పూర్వాంచల్ మహాకుంభ్ ఒకటి. సీఎంగా పరీకరే కొనసాగుతారు: అమిత్‌షా గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పరీకరే కొనసాగుతారని అమిత్ షా స్పష్టం చేశారు. త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని వెల్లడించారు. ‘మనోహర్ పరీకరే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. గోవా ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారని ఆ రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సభ్యులకు స్పష్టం చేశాం’ అని తెలిపారు. ఆయనకు మెజారిటీ సభ్యుల మద్దతు కూడా ఉంటుందని తెలిపారు. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన నేపథ్యంలో ఆయన కొనసాగింపుపై అనుమానం వ్యక్తం చేస్తూ పలు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. -
అస్సాంలో దీదీకి ఊహించని షాక్
కోల్‌కతా/డిస్పూర్ : అస్సాంలో అక్రమ వలసదారులను గుర్తించేందుకు విడుదల చేసిన నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ) ముసాయిదా జాబితా అస్సాం, పశ్చిమ బెంగాల్‌లతో పాటు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీలో చిచ్చురేపుతోంది. ఇదివరకే అస్సాంలో ఎన్ఆర్సీ ముసాయిదా కారణంగా 40 లక్షల మంది పౌరసత్వం కోల్పోయారు. తదుపరి బెంగాల్లోనే ఎన్ఆర్సీ ప్రక్రియను కేంద్రం చేపట్టనుందన్న వాదన తెరపైకి వచ్చింది. దీనిపై పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. మా రాష్ట్రంలో ఎన్ఆర్సీ ప్రక్రియ ఎలా చేపడతారో వారి సంగతి చూస్తామన్నారు. అసలు బెంగాల్లో పౌరసత్వాల గురించి తనిఖీ చేయాలన్న సందేహాలు ఎందుకు తలెత్తుతున్నాయో తనకు అర్థం కావడం లేదన్నారు. ఎన్ఆర్సీలో చోటు దక్కని వారు నిజంగానే విదేశీ అక్రమ వలసదారులు కాదని, భారతీయులే వీటి వల్ల అధికంగా నష్టపోతున్నారని మమత అభిప్రాయపడ్డారు. అస్సాం నుంచి బెంగాళీయులను తరిమి కొట్టేందుకు ఇలాంటి ముసాయిదాలను కేంద్ర చేపట్టిందని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అస్సాం నుంచి బెంగాలీలను పంపిచేందుకు ఎన్ఆర్సీ ముసాయిదా అని పేర్కొన్న మమత వ్యాఖ్యలను అస్సాం టీఎంసీ చీఫ్ ద్విపెన్ పాఠక్ ఖండించారు. మమత చేస్తున్న విమర్శలు అర్థరహితమని, ఆమె వ్యాఖ్యల వల్ల అస్సాంలో అల్లర్లు జరిగే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మమత వ్యాఖ్యలను నిరసిస్తూ అస్సాం టీఎంసీ చీఫ్ పదవికి ఆయన గురువారం రాజీనామా చేశారు. టీఎంసీ అధినేత్రి చేసిన వ్యాఖ్యల దుష్ప్రభావం, దుష్పరిణామాలను పరోక్షంగా అస్సాంలో తాను ఎదుర్కోవాల్సి వస్తుందన్న నేపథ్యంలో ఆ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. -
‘ఎన్నార్సీ’పై మాటల యుద్ధం
న్యూఢిల్లీ: అస్సాంలో అక్రమ వలసదారులను గుర్తించేందుకు విడుదలచేసిన నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్(ఎన్నార్సీ) ముసాయిదా జాబితాపై రాజకీయ రభస కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఈ అంశంపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో అధికార పార్టీ తరఫున బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వివరణ ఇస్తూ.. అక్రమ వలసదారులను గుర్తించే సాహసాన్ని కాంగ్రెస్ చేయలేకపోయిందన్నారు. నిజమైన భారతీయుల పేర్లను జాబితా నుంచి తొలగించబోమని హామీ ఇచ్చారు. అస్సాంలో అక్రమంగా నివసిస్తున్న వలసదారుల వివరాలేవీ ప్రభుత్వం వద్ద లేవని, ఎన్నార్సీలో చోటుదక్కని వారంతా విదేశీయులు కారని కాంగ్రెస్ పేర్కొంది. మానవతా దృక్పథాన్ని అవలంబించాలని, భారతీయులకు జాబితాలో చోటు నిరాకరించొద్దని సూచించింది. వివాదాస్పద ఎన్ఆర్సీ జాబితాతో దేశంలో సివిల్ వార్, రక్తపాతం జరుగుతాయని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ హెచ్చరించారు. అక్రమ వలసదారులను కాపాడతారా?: షా ప్రశ్నోత్తరాలను రద్దుచేసి ఎన్నార్సీపై చర్చ నిర్వహించేందుకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు అంగీకరించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ.. అక్రమ వలసదారులను గుర్తించి భారతీయుల జాబితాను తయారుచేసేందుకే ఎన్ఆర్సీ కసరత్తు చేపట్టామన్నారు. 1985, ఆగస్టు 14న అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ సంతకంచేసిన అస్సాం ఒప్పందం ప్రకారమే ఎన్నార్సీ జాబితాను రూపొందించాల్సిందని, కానీ ఆ పనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోయిందని మండిపడ్డారు. అక్రమ వలసదారులను గుర్తించే ధైర్యం ఆ పార్టీకి లేకపోయిందని ఆరోపించారు. అక్రమంగా వలసొచ్చిన బంగ్లాదేశీయులను కాపాడటానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందా? అని ప్రశ్నించారు. ‘సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఎన్ఆర్సీ రూపుదిద్దుకుంటోంది. 40 లక్షల మందికి ముసాయిదా జాబితాలో చోటుదక్కలేదు. ఎవరిని కాపాడాలనుకుంటున్నారు? బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వారినా?’ అని అసహనం వ్యక్తం చేశారు. నిజమైన భారతీయులెవరూ ఆందోళనచెందనక్కర్లేదని, వారి పేర్లను ఎన్ఆర్సీ నుంచి తొలగింబోచమని హామీ ఇచ్చారు. షా వ్యాఖ్యలపై కాంగ్రెస్, తృణమూల్, ఇతర విపక్షాలు నిరసన వ్యక్తం చేయడంతో తొలుత పది నిమిషాలు, తరువాత రోజంతటికీ సభ వాయిదాపడింది. అంతర్జాతీయంగా ప్రభావం: కాంగ్రెస్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ రాజ్యసభలో చర్చను ప్రారంభిస్తూ.. ఎన్నార్సీ మానవతా సమస్య అని, పలానా కులం, మతానికి సంబంధించినది కాదని పేర్కొన్నారు. ‘ఎవరినీ దేశం నుంచి తరిమికొట్టాలని మేము కోరుకోవడం లేదు. ఇది కేవలం 40 లక్షల మందికి సంబంధించిన సమస్య కాదు. వారి కుటుంబం, పిల్లలను కూడా కలుపుకుంటే ఆ సంఖ్య 1.5 కోట్లకు చేరుతుంది. ఎన్నార్సీతో అంతర్జాతీయంగా, ముఖ్యంగా బంగ్లాదేశ్‌పై, ప్రభావం పడుతుంది. పౌరసత్వాన్ని నిరూపించుకునే బాధ్యత కేవలం పౌరులపైనే కాకుండా ప్రభుత్వంపై కూడా ఉండాలి’ అని ఆజాద్ అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు రామ్‌గోపాల్ యాదవ్ స్పందిస్తూ ఎన్ఆర్సీ జాబితాలో చోటుదక్కనివారిలో హిందువులు, ముస్లింలు, బిహార్, యూపీ ప్రజలు కూడా ఉన్నారని అన్నారు. మాజీ రాష్ట్రపతి కుటుంబీకులకు చోటేదీ? ఎన్నార్సీ జాబితాలో దివంగత మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సోదరుడు లెఫ్టినెంట్ ఎక్రముద్దీన్ అలీ అహ్మద్ కుటుంబ సభ్యులకు చోటు దక్కలేదు. ఆ కుటుంబం అస్సాంలోని కామరూప్ జిల్లా రాంగియా పట్టణంలో నివసిస్తోంది. ‘నేను ఫక్రుద్దీన్ సోదరుడి కుమారుడిని. మా నాన్న పేరు వారసత్వ డేటాలో లేకపోవడంతో మాకు ఎన్ఆర్సీ జాబితాలో చోటు దక్కలేదు. ఈ విషయంలో మాకు చాలా ఆందోళనగా ఉంది‘ అని జియా ఉద్దీన్ అంటున్నారు. పూర్వీకులకు సంబంధించిన స్థానికత పత్రాలు సమర్పించలేకపోయిన వారెవరికీ ఈ జాబితాలో చోటు దక్కలేదు. జాబితాలో 40 లక్షల మందికి చోటు కల్పించకపోవడానికి గల కారణాలపై ప్రభుత్వం గోప్యత పాటిస్తోంది. ఎన్నికల సంఘం అనుమానాస్పద ఓటర్లుగా గుర్తించిన వారిని, పౌరసత్వంపై ఇప్పటికే విదేశీ ట్రిబ్యునల్స్‌లో సవాల్ చేసిన వారిని జాబితాలో చేర్చలేదు. తదుపరి బెంగాల్లోనా? అస్సాం మాదిరిగానే పశ్చిమబెంగాల్లోనూ ఎన్నార్సీ జాబితా ను రూపొందించే ఉద్దేశం ఉందా? అని ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ నుంచి స్పష్టత కోరారు. మంగళవారం ఆమె రాజ్‌నాథ్‌ను కలసిన తరువాత విలేకర్లతో మాట్లాడుతూ..‘అస్సాం ఎన్నార్సీ గురించి మాట్లాడటానికే ఢిల్లీ వచ్చా. జాబితాలో చోటుదక్కని 40 లక్షల మంది వివరాలు సమర్పించాను. తదుపరి ఎన్ఆర్సీ బెంగాల్లోనే అని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రకటనలను ఆయన దృష్టికి తీసుకెళ్లా. అలాంటి ప్రకటనలు చేసే అధికారం వారికి ఎవరు ఇచ్చారు?’ అని మమత అన్నారు. బెంగాల్లో అక్రమ వలసదారులు కోట్లలో ఉంటారని, తదుపరి ఎన్నార్సీ బెంగాల్లో చేపట్టే అవకాశాలున్నాయని బీజేపీ నేత కైలాశ్ చెప్పారు. ఇప్పుడే చర్యలు వద్దు: సుప్రీం ఎన్నార్సీ జాబితాను ఆధారంగా చేసుకుని ఎలాంటి బలవంతపు చర్యలకు దిగొద్దని కేంద్రం, అస్సాం ప్రభుత్వాల్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇది కేవలం ముసాయిదా జాబితానే అంది. అభ్యంతరాలు, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రామాణిక అమలు విధానాన్ని(ఎస్ఓపీ) రూపొందించాలని కేంద్రానికి సూచించింది. పేర్ల తొలగింపును సవాలుచేసేందుకు బాధితులకు న్యాయబద్ధ అవకాశం కల్పిస్తూ ఎస్ఓపీని ఆగస్టు 16 నాటికి తమ ముందు ఉంచాలని జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్‌ల బెంచ్ ఆదేశించింది. జాబితాలో చోటుదక్కని 40 లక్షల మంది తప్పు డు పత్రాలతో ఇతర రాష్ట్రాలకెళ్లకుండా వారి బయోమెట్రిక్ వివరాలు సేకరించాలనుకుంటున్నట్లు కేంద్రం కోర్టుకు తెలిపింది. అలాంటి వారు తమ రాష్ట్రంలోకి ప్రవేశిస్తారని పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాలు ఆందోళనచెందుతున్నాయంది. మోరీగావ్‌లో తుది జాబితాలో తమ పేరు చెక్‌చేసుకునేందుకు క్యూలో నిల్చున్న జనం -
మనం ట్రంప్ కన్నా తక్కువ తిన్నామా!
సాక్షి, న్యూఢిల్లీ : ఎదురుగా ఎత్తయిన పది అడుగుల గోడ. గోడ మీద ఎర్రటి రంగుతో హృదయాకారం. గోడ అంచు మీద ఇనుప కంచె. ఎవరికైనా అది జైలు కాబోలని అనిపిస్తుంది. నిజంగా అక్కడి జీవితం జైలే. ఎవరు పారిపోకుండానే ఆ గోడకు అంత ఎత్తున ఆ ఇనుప కంచె. అయితే దాన్ని జైలు అని పిలవరు. షెల్టర్ అని లేదా శిబిరం అని పిలుస్తారు. ఆ గోడ వెలుపలి నుంచి అప్పుడప్పుడు అటుగా పోతున్నవారి నవ్వులు, అమ్మాయిల అరుపులు వినిపిస్తుంటాయి. అమ్మాయిల అరుపులు వినిపించినప్పుడల్లా వారేమి మాట్లాడుకుంటున్నారో వినేందుకేమో గోడకు ఇటువైపున్న అమ్మాయిలు మౌనంగా ఉంటారు. గోడ లోపలున్న ఈ అమ్మాయిలంతా బంగ్లాదేశీయులు. వారంతా సరైన డాక్యుమెంట్లు లేకుండా సరిహద్దులు దాటి భారత దేశానికి వచ్చి భద్రతా దళాల చేతుల్లో అరెస్ట్ అయిన వారే. వారిలో ఆరేళ్లప్పుడు ఈ శిబిరానికి వచ్చి పెళ్లీడు వచ్చినా ఇప్పటికీ శిబిరంలోనే తలదాచుకుంటున్న వారూ ఉన్నారు. వారి తల్లిదండ్రులను బంగ్లాదేశ్ అధికారులు గుర్తించి వారిని తీసుకెళ్లే వరకు ఆ అమ్మాయిలకు ఈ నిర్బంధ జీవితం తప్పదు. వారిలో కొందరిది మరింత దౌర్భాగ్య పరిస్థితి. తల్లిదండ్రులో, తల్లో లేదా తండ్రో భారత దేశంలోనే ఎక్కడో, ఏదో జైలులో మగ్గుతూ ఉంటారు. ఒకరినొకరు చూసుకునే అవకాశమే ఉండదు. వారికి ఆశ్రయం కల్పిస్తున్న ఈ షెల్టర్ పేరు ‘స్నేహ’. శాన్లాప్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఇలాంటి షెల్టర్లు పశ్చిమ బెంగాల్లో మగ పిల్లలకు వేరుగా, ఆడ పిల్లలకు వేరుగా 80 షెల్టర్లు ఉన్నాయి. బంగ్లాదేశ్ నుంచి వీసా, పాస్‌పోర్టు లాంటి సరైన డాక్యుమెంట్లు లేకుండా సరిహద్దులు దాటి భారత్‌కు వచ్చిన లేదా వచ్చి భారత్‌లో రహస్యంగా స్థిరపడిన బంగ్లాదేశీయులను భారత్ అధికారులు అరెస్ట్ చేశారు. వారికి 1946, విదేశీయుల చట్టంలోని సెక్షన్ 14 ఏ కింద రెండేళ్లు నుంచి గరిష్టంగా ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. వారిలో ఆరేళ్ల పైబడిన పిల్లలుంటే వారిని శిశు సంక్షేమ కమిటీ ముందుకు, జువెనైల్ జస్టిస్ బోర్డుకు పంపుతారు. అక్కడ వారికి ఎలాంటి శిక్షలు విధించరుగని ప్రభుత్వ, స్వచ్ఛంద వసతి గృహాలకు పంపిస్తారు. సరైన డాక్యుమెంట్లతో వారి తల్లిదండ్రులు లేదా బంగ్లాదేశ్ అధికారులు వచ్చే వరకు ఆ పిల్లలకు శిబిరాల్లో నిర్బంధం తప్పదు. ఇక అక్రమంగా వచ్చి జైలు శిక్ష పడిన పెద్దవాళ్లను వారి శిక్ష పూర్తయినప్పటికీ విడుదల చేయరు. కాకపోతే జైళ్లలో ఉన్నవారిని షెల్టర్లలోకి మారుస్తారు. ఇలాంటి షెల్టర్లు ప్రభుత్వం ఆధీనంలోను ఉన్నాయి. స్వచ్చంద సంస్థల ఆధీనంలోనూ ఉన్నాయి. బంగ్లాదేశ్ అధికారులు వచ్చి వారిని తీసుకెళ్లాలి. అందుకు ముందుగా వారు వారిని తమ దేశ పౌరులుగా అంగీకరించాలి. అప్పుడే వారికి జైలు నుంచి, దేశం నుంచి విముక్తి లభిస్తుంది. బంగ్లాదేశ్ అధికారులు రాకపోయినా, వచ్చి వారు తమ దేశీయులు కాదన్నా వారు జీవితాంతం జైల్లో మగ్గిపోవాల్సిందే. గతంలో వారు తమ దేశీయులు కాదన్న ఉదంతాలు కూడా ఉన్నాయి. పిల్లలతో అక్రమంగా వలసవచ్చి అరెస్టై, ఒకరినొకరు చూసుకోకుండా పిల్లలు, తల్లిదండ్రులు వేర్వేరుగా శిక్ష అనుభవించిన, అనుభవిస్తున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ‘మహానిర్మాణ్ కోల్‌కతా రీసర్చ్ గ్రూప్’నకు చెందిన సుచరిత సేన్ గుప్తా అలాంటి వారిపై 2015లో ఓ అధ్యయనం జరిపారు. రాజకీయ సంక్షోభం కారణంగా బంగ్లాదేశ్ వదిలిపెట్టి ఓ కొడుకు, కూతురుతో భారత్‌కు వచ్చిన బహదూరిబాలా అనే 40 ఏళ్ల యువతికి భారత్‌లో ఏడేళ్లు జైలు శిక్ష పడింది. ఆమెను బెహ్రాంపూర్‌లోని సెంట్రల్ కరెక్షనల్ హోమ్‌కు పంపించగా, ఇద్దరు పిల్లలను జువెనైల్ హోమ్స్‌కు పంపించారు. ఆమె నాలుగేళ్ల వరకు తన పిల్లలనే చూడలేదట. ఓ న్యాయవాది కారణంగా వారిని చూడ గలిగింది. ఈ విషయాలు సుచరిత సేన్ గుప్తా అధ్యయనంతో వెలుగులోకి వచ్చాయి. మెక్సికో నుంచి అమెరికాకు అక్రమంగా వలసవచ్చిన ప్రజల నుంచి రెండు వేల మంది పిల్లలను అన్యాయంగా వేరు చేశారంటూ ఇటీవల ప్రపంచమంతా గళమెత్తి ఘోషించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను దుమ్మెత్తి పోసింది. అందులో భారత ప్రభుత్వం కూడా ఉంది. మరి బంగ్లాదేశీయుల విషయంలో భారత్‌లో జరుగుతున్నదేమిటీ? బంగ్లాదేశ్ తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరు చేసి నిర్బంధించడం లేదా! పిల్లల హక్కులపై ఐక్యరాజ్యసమతి చేసిన అంతర్జాతీయ ఒప్పందాన్ని ఉల్లంఘించడం లేదా! ఆ ఒప్పందంలో భారత్ కూడా భాగస్వామే. ఆ ఒప్పందంలోని 9వ అధికరణం ప్రకారం పిల్లలను కొడుతూ తిడుతూ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే తప్ప తల్లిదండ్రుల నుంచి పిల్లలను వేరుచేయరాదు. తల్లిదండ్రుల్లో ఎవరికి శిక్షపడినా, నిర్బంధంలో ఉన్న, జైల్లో ఉన్నా వారి పిల్లల క్షేమసమారాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలి. శిక్ష పడిని వారి పిల్లలను చూసుకునేందుకు బంధు మిత్రులు ఎవరూ లేకుంటే ఆ బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. బంగ్లాదేశ్ నుంచి వలసలు ఎందుకు? బంగ్లాదేశ్‌తో భారత్‌కు 4,097 కిలోమీటర్ల పొడవున సరిహద్దు ఉంది. అందులో సగానికిపైగా అంటే, 2, 217 కిలోమీటర్ల సరిహద్దు పశ్చిమ బెంగాల్లోనే ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం 2016, ఏప్రిల్ నాటికి పశ్చిమ బెంగాల్లో బంగ్లాకు చెందిన 3,647 మంది పెద్దలు, 142 మంది పిల్లలు నిర్బంధంలో ఉన్నారు. కొన్ని బంగ్లాదేశ్ కుటుంబాలు భారత్‌లోని తమ బంధువులను కలుసుకునేందుకు సరిహద్దులు దాటి వస్తాయి. కొన్ని కుటుంబాలు దళారులు లేదా ఏజెంట్ల మోసం కారణంగా ఇక్కడికి వచ్చి దొరికిపోతాయి. కొందరు బంగ్లా రాజకీయ సంక్షోభం కారణంగా, మతపరమైన వేధింపుల కారణంగా వస్తారు. భారత్‌లో వైద్యం కోసం కూడా కొందరు సరిహద్దులు దాటి వస్తారు. వారు ఏ కారణంగా వచ్చినా సరైన డాక్యుమెంట్లు లేకపోతే జైలు లేదా కరెక్షనల్ సెంటర్లలో గడపాల్సిందే. బెంగాల్లో కరెక్షనల్ సెంటర్లకు జైళ్లకన్నా మంచి పేరే ఉంది. చదవండి: ‘వలస పిల్లల’ను వేరుచేయం వెనక్కి తగ్గిన ట్రంప్.. అమెరికాను కదిలిస్తున్న చిన్నారి సంభాషణ! జీరో టాలరెన్స్ బాధితుల్లో భారతీయురాలు -
‘వలస పిల్లల’ను వేరుచేయం
వాషింగ్టన్: అక్రమ వలసదారుల కుటుంబాల నుంచి పిల్లలను వేరుగా నిర్బంధించటానికి సంబంధించిన ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు. కుటుంబాలను, వారి పిల్లలను కలిపి ఒకేచోట నిర్బంధంలో ఉంచుతామని చెప్పారు. మెక్సికో సరిహద్దుల గుండా దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారి పిల్లలను, తల్లిదండ్రుల నుంచి వేరు చేయటంపై సర్వత్రా నిరసనలు వ్యక్తం కావటంతో గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం అధ్యక్ష భవనం వెలుపల ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ..‘ఈ సమస్య ఇకపై ఉండదు. కుటుంబాల నుంచి వారి పిల్లలను వేరు చేయబోం. కుటుంబాలతోనే కలిపి ఉంచుతాం. ఇదే సమయంలో మా సరిహద్దుల్లో మరింత కట్టుదిట్టం చేస్తాం. అక్రమంగా దేశంలోకి ప్రవేశించే వారిపై విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటాం’ అని హెచ్చరించారు. ఆశ్రయం కోరిన వారిని నిర్బంధిస్తారా? అక్రమ వలసదారుల పిల్లలను, కుటుంబాలతో కలిపి ఉంచుతున్నప్పటికీ వారిని కనీస సౌకర్యాలు లేని డిటెన్షన్ సెంటర్లలో ఉంచడంపై భారతీయ అమెరికన్ ప్రజాప్రతినిధులు, హక్కుల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. విచారణ పేరుతో పిల్లలను, వారి కుటుంబాలను నెలల తరబడి నిర్బంధంలో ఉంచడం ‘అమానవీయం, క్రూరం’ అని కాంగ్రెస్ సభ్యులు ప్రమీలా జయపాల్, కమలా హ్యారిస్ వ్యాఖ్యానించారు. ఆశ్రయం కోరుతూ వచ్చిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టి పిల్లలతో సహా నిర్బంధించడాన్ని కోర్టులో సవాల్ చేస్తామన్నారు. పిల్లలను వేరుగా ఉంచడం ద్వారా ఉత్పన్నమైన సమస్యకు కుటుంబాన్నంతటినీ కలిపి నిర్బంధించడం పరిష్కారం కాదని సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ సంస్థ అధ్యక్షురాలు నీరా టాండెన్ అన్నారు. ట్రంప్ తాజా ఉత్తర్వు ఈ సమస్యకు పరిష్కారం కాదనీ, ఆయన ఇంకా ఎంతో చేయాల్సి ఉందని కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా అన్నారు. పిల్లలను వేరు చేసి ఉంచే సమస్య పరిష్కారానికి, కుటుంబ సభ్యులందరినీ ఒకే చోట నిర్బంధిస్తామనటం ద్వారా ఇంకో సమస్యను సృష్టించారని చెప్పారు. ఈ ఏడాది మార్చి–మే మధ్య కాలంలో మెక్సికో సరిహద్దుల గుండా అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన దాదాపు 50వేల మందిని అధికారులు నిర్బంధించారు. -
సరిహద్దు రక్షణ గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తాం
కోల్‌కతా: రోహింగ్యాలు సహా దేశంలోకి వచ్చే అక్రమ వలసదారుల్ని అడ్డుకోవడానికి భారత్–బంగ్లాదేశ్‌ల మధ్య త్వరలోనే ఏకీకృత కమాండ్ నేతృత్వంలో ‘సరిహద్దు రక్షణ గ్రిడ్’ను ఏర్పాటు చేస్తామని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. సరిహద్దు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, అస్సాం, మిజోరాం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోంమంత్రులతో రాజ్‌నాథ్ గురువారం నాడిక్కడ భేటీ అయ్యారు. కంచెలు, నిఘా వ్యవస్థ, ఇంటెలిజెన్స్ సంస్థలు, రాష్ట్ర పోలీసులు, బీఎస్ఎఫ్, ఇతర కేంద్ర, రాష్ట్ర బలగాలతో 4,036 కి.మీ మేర ‘సరిహద్దు రక్షణ గ్రిడ్’ను ఏర్పాటు చేస్తామన్నారు. ఏకీకృత కమాండ్‌లో ఆర్మీ, పారామిలటరీ బలగాలు, రాష్ట్ర పోలీసులు భాగస్వాములుగా ఉంటారన్నారు. -
మీకు ఇక్కడ స్థానం లేదు?!
సాక్షి, గువాహటి : అక్రమ బంగ్లాదేశీయులకు మా గ్రామంలో స్థానం లేదు.. ఎవరూ ఇటు రాకండి అంటూ నాగాలండ్‌లోని ఒక గ్రామం శుక్రవారం తీర్మానం చేసింది. ఇప్పటికే నాగాలాండ్‌లోని పలు ప్రాంతాల్లో అక్రమ బంగ్లాదేశీ వలసదారులు పెరిగిపోవడం.. వాళ్లు చేసే వికృత చేష్టలను సహించలేక.. చుమ్కేడిమా గ్రామం ఈ విధంగా తీర్మానం చేసింది. తీర్మానం చేయడమేకాకుండా స్థానిక ప్రజల్లో అవగాహన పెంచే ఉద్దేశంతో గ్రామంలో ర్యాలీని సైతం నిర్వహించారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే గ్రామంలో స్థిరపడ్డ వారిలో.. నాగాలాండ్ వాసులు కాని వారిని గుర్తించేందుకు ఈ నెల 9 నుంచి 31 వరకూ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అక్రమ బంగ్లాదేశీ వలసదారులు బయటపడితే.. వారిని స్థానిక రాయబార కార్యాలయానికి అప్పగిస్తామని ప్రకటించారు. -
అక్రమ వలసదారులపై యూఎస్ కొరడా
వాషింగ్టన్: సరైన అనుమతి పత్రాల్లేకుండా నివసిస్తున్న అక్రమ వలసదారులపై కఠిన చర్యలకు అమెరికా సిద్ధమైంది. ఈ మేరకు ఇమ్మిగ్రేషన్ అధికారులకు ట్రంప్ సర్కారు తాజా ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా సిలీకాన్ వ్యాలీలోని భారతీయ సాఫ్ట్వేర్ ఉద్యోగులు, మధ్య అమెరికాలోని వలస కార్మికులే లక్ష్యంగా తనిఖీలు జరపవచ్చని భావిస్తున్నారు. ఇందుకోసం ఇమ్మిగ్రేషన్‌కు చెందిన అధికారులను ఇప్పటికే రంగంలోకి దింపారు. ఈ కేసుల్ని త్వరితగతిన విచారించేందుకు మరింత మంది న్యాయమూర్తుల్ని నియమించనున్నారు. తక్షణం తనిఖీలను ప్రారంభించాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా బాలల ర్యాలీ -
105 పింఛన్లు అనర్హమైనవే
అధికారుల తనిఖీల్లో బయటపడిన బండారం 105 పింఛన్లు రద్దు ... పంపిణీ నిలిపివేత పాత పింఛన్లపైనా దృష్టి ... దరఖాస్తుల పరిశీలన అడుగడుగునా అడ్డుపడుతున్న కౌన్సిలర్లు పిఠాపురం : ‘సాక్షి’ చెప్పిందే నిజమైంది. పిఠాపురం ము న్సిపాలిటీలో భార్యలు బతికుండగానే వితంతువులుగా మార్చేసి ప్రతి నెలా రూ.1000 స్వాహా చేస్తున్న తీరుపై ‘సాక్షి’ వరుస కథనాలు ఇవ్వడంతో జిల్లా కలెక్టర్ గత నెలలోనే దర్యాప్తునకు ఆదేశించారు. ఇప్పటికే మున్సిపల్ అధికా రులు ఒకసారి రెవెన్యూ అధికారులు ఒకసారి విచారణ నిర్వహించగా ముచ్చట గా మూడోసారి మళ్లీ మున్సిపల్ అధికా రులు విచారణ చేపట్టి 105 మంది పింఛ ¯ŒSదారులు అనర్హులని నిర్ధారించారు. దీం తో వాటిని రద్దు చేయాలంటూ స్థానిక మున్సిపల్ అధికారులు ఉన్నతాధికారుల కు నివేదికలు పంపడంతోపాటు వాటిని ఆ¯ŒSలై¯ŒSలోంచి తొలగించి పంపిణీని నిలిపివేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్న అధికారులు పాత పింఛన్లపైనా దృష్టి కేంద్రీకరించారు. అన్ని దరఖాస్తులనూ పరిశీలిస్తున్న అధికారులు ఇంకా అనర్హులున్నారా అనే దిశగా విచారణ కొనసాగిస్తున్నారు. ఎప్పుడో ఇచ్చిన పింఛన్లపై ఇప్పుడు పరిశీలనలు ఏమిటని కొంతమంది కౌన్సిలర్లు అడ్డుతగులుతున్నారు. ఈమేరకు శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ అత్యవసర సమావేశంలో పలువురు కౌన్సిలర్లు ఈ విషయంపై అధికారులను ప్రశ్నించగా అనర్హులను గుర్తించడానికే పాతవి పరిశీలిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ సమాధానమిచ్చారు. తొక్కిపెట్టేసిన నివేదికపై పెన్నుపోటు... ‘సాక్షి’ ఇచ్చిన కథనాలపై కొనసాగిన దర్యాప్తు నివేదికలను జిల్లా కలెక్టరుకు గత నెలలోనే అందజేశారు. కానీ వాటిపై చర్యలు మాత్రం తీసుకోలేదు. ఇంతలో మార్చి నెల పింఛన్లు వచ్చేయగా తిరిగి మళ్లీ అక్రమార్కులకే పంపిణీ చేయడానికి సిద్ధపడ్డారు. ఈ విషయాన్ని ‘సాక్షి’లో ‘పింఛన్లపై విచారణ అంతా వంచన’ అనే శీర్షికన మార్చి ఒకటో తేదీన కథనం వెలువడడంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు ఇటీవల కొత్తగా మంజూరైన పింఛన్లు 321 పంపిణీని నిలిపి వేయాలని ఆదేశించారు. మున్సిపల్ సిబ్బందితో పునర్విచారణ జరిపించాలని కలెక్టర్ ఆదేశించడంతో మున్సిపల్ కమిషనర్ ఎం.రామ్మోహ¯ŒS మున్సిపల్ డీఈ మాధవి, టీపీఎస్ శేషగిరి, ఆర్వో రూబే¯ŒS, ఏఈఈ వంశీ అభిషక్లను విచారణాధికారులుగా నియమించగా 30 వార్డుల్లో విచారణ చేపట్టారు. అర్హులకు అవకాశం... ఈ విచారణ పూర్తయ్యాక 321 పింఛన్లలో 105 తొలగించారు. వాటి స్థానంలోఅర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. మున్సిపాలిటీలో 30 వార్డుల్లోను సుమారు 200 మంది అర్హులైన అబ్ధిదారులు ఇప్పటికే దరఖాస్తులు చేసుకోగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అర్హులకు కొత్త పింఛన్లు అందనున్నాయి. అయితే రద్దు చేసిన పింఛన్లు కొత్త వారికి ఇస్తారా లేదా అనేది సందిగ్ధంగా ఉంది. పింఛ¯ŒS అక్రమాలపై విచారణ కొంకుదురు(బిక్కవోలు): కొంకుదురు గ్రామంలో సామాజిక పింఛన్ల అక్రమాలపై ఈ నెల7వ తేదీన ‘బొట్టు చెదరకున్నా’ భరోసా శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం ఎంపీడీవో పోకల విజయభాస్కర్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 40మందిపై విచారణ నిర్వహించాల్సి ఉండగా 37 మంది లబ్థిదారులు హాజరయ్యారు వారి వివరాలు నమోదు చేసిన విజయభాస్కర్ నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పిస్తామని తెలిపారు. ఉప సర్పంచి కొవ్వూరి వేణుగోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రద్దు చేసింది నిజమే... ఇటీవల కొత్తగా పంపిణీ చేసిన పింఛన్లలో 105 అనర్హమైనవిగా గుర్తించి రద్దు చేశాం. ఇప్పటికే వారి పేర్లను ఆ¯ŒSలై¯ŒSలోంచి తొలగించడంతోపాటు మార్చి నెల సొమ్ము పంపిణీని నిలిపివేశాం. అనర్హుల వివరాలను ఉన్నతాధికారులకు పంపించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. – ఎం.రామ్మోహ¯ŒS, మున్సిపల్ కమిషనర్, పిఠాపురం -
ట్రంప్ వేట మొదలైంది..
వాషింగ్టన్: ఎన్నికల ప్రచారంలో అమెరికన్లకు ఇచ్చిన ప్రధాన హామీ ‘అక్రమ వలసదారులపై వేటు’పై వెనకడుగు వేయబోనని కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. అమెరికాలో కోటి మందికిపైగా అక్రమ వలసదారులు ఉన్నారని, వారిలో క్రిమినల్ రికార్డులున్న 30 లక్షల మందిని దేశం నుంచి వెళ్లగొట్టేందుకు అవసరమైన చర్యలు త్వరితగతిన పూర్తిచేస్తామని ఆయన చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అక్రమ వలసదారులపై చర్యలు తప్పవని తెలిపారు. డోనాల్డ్ ట్రంప్ శనివారం కొలంబియన్ బ్రాడ్ కాస్టింగ్ సిస్టమ్(సీబీఎస్) చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. అమెరికాలో ఆదివారం రాత్రి ప్రసారంకానున్న ఆ కార్యక్రమంలో సరిహద్దు భద్రతపైనా ట్రంప్ కీలక అంశాలను వెల్లడించారు. ‘యూఎస్ లో అక్రమంగా నివసిస్తోన్న వారిలో చాలామంది డ్రగ్స్ డీలర్లు, క్రిమినల్స్, గ్యాంగ్స్ నడిపేవారున్నారు. అలాంటివాళ్లు కనీసం 20 నుంచి 30 లక్షల మంది ఉంటారని అంచనా. వాళ్లందరినీ దేశం నుంచి తరిమేస్తాం. అంతర్గత భద్రతను పటిష్టం చేసుకుంటూనే దేశసరిహద్దుల్లోనూ అవసరమైన మేరకు రక్షణ ఏర్పాటుచేస్తాం. వలసదారులను వెళ్లగొట్టడం ఒక సవాలైతే, అలాంటి వాళ్లు తిరిగి అమెరికాలోకి రాకుండా సరిహద్దుల వద్ద నిఘాను పెంచాల్సిన అవసరం ఉంది. అందుకే ముందుగా సరిహద్దు భద్రతను పెంచి, తర్వాత వలసదారు వేట కొనసాగిస్తాం’అని ట్రంప్ చెప్పారు. ట్రంప్ మొట్టమొదటి అధికారిక నియామకాలు కాబోయే అధ్యక్షుడి హోదాలో డోనాల్డ్ ట్రంప్ మొట్టమొదటి అధికారిక నియామకాన్ని చేపట్టారు. అధ్యక్ష భవనం వైట్ హౌస్ ముఖ్య అధికారిగా రెయిన్స్ ప్రైబస్ ను ఎంపికచేశారు. కీలకమైన వ్యూహాత్మక విభాగం అధిపతిగా స్టీవ్ బనూన్ ను నియమించారు. దేశాన్ని ముందుకు నడిపించడంలో విజయవంతమైన బృందాన్ని ఏర్పాటు చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ట్రంప్ పేర్కొన్నారు. -
అక్రమ వలసదారులపై నజర్..!
♦ నసీర్తో పాటు మరో ముగ్గురి అరెస్టుతో అప్రమత్తమైన పోలీసులు ♦ నగరంలోని పలు ప్రాంతాలపై ముమ్మర నిఘా సాక్షి, సిటీబ్యూరో : నగరంలో ఉంటున్న అక్రమ వలసదారులపై నగర పోలీసులు దృష్టి సారించారు. వాళ్లు ఆశ్రయం పొందుతున్న ప్రాంతాలను గుర్తించి పాస్‌పోర్టు, వీసాలు లేకుండా ఎంత మంది ఉన్నారని గుర్తించే దిశగా ముందుకెళుతున్నారు. హర్కత్ ఉల్ జిహదీ అల్ ఇస్లామీ (హుజీ)తో సంబంధమున్న పాకిస్థానీ మహమ్మద్ నసీర్తో పాటు ఫైజల్ మహమ్మద్ (బంగ్లాదేశ్), జోయ్నల్ అబెదిన్ (బంగ్లాదేశ్), జియా ఉర్ రెహమన్ (మయన్మార్)ల అరెస్టు నేపథ్యంలో నగరంలో అక్రమంగా వలస ఉంటున్న వారి అంశం చర్చకు వచ్చింది. అరెస్టయిన వారందరూ అక్రమ వలసదారులే కావడం పోలీసుల్లో ఆందోళన కలిగిస్తోంది. సోమాలియా, ఈథియోపియా, ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, మయన్మార్ దేశాల్లో జరిగిన యుద్ధాల్లో ఆప్తులను కోల్పోయి...ఇక్కడ ఉంటున్న శరణార్థుల వివరాలను కూడా సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. చెంచల్గూడతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో విదేశీయులు కనబడితే చాలు వారి పాస్‌పోర్టు, వీసాలు ఉన్నాయా? లేవా? అని చెక్ చేసే పనిలో పడ్డారు. ఉగ్రవాద దాడులు జరగవచ్చన్న ఐబీ హెచ్చరికల నేపథ్యంలో అక్రమ వలసదారులపై కన్నేసి ఉంచామని, ఇందులో భాగంగానే నసీర్ తమకు చిక్కాడని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. సైబరాబాద్‌లోనూ.. సైబరాబాద్ పరిధిలోని బాలాపూర్, బాబానగర్, బార్కస్, షహీన నగర్, శాస్త్రీపురం, కిషన్‌బాగ్ ప్రాంతాల్లో 1,725 మంది శరణార్థులు ఎటువంటి వీసాలు, పాస్‌పోర్టులు లేకుండా అక్రమంగా ఉంటున్నారనే విషయాన్ని గుర్తించిన సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్...ఇటీవల నగరానికి వచ్చిన యూఎన్‌హెచ్‌సీఆర్ మిషన్ చీఫ్ విలియమ్ టాల్ దృష్టికి తీసుకెళ్లారు. వీరి వద్ద ఎటువంటి గుర్తింపు కార్డులు లేకపోవడంతో ఎవరూ ఏమి చేస్తున్నారనే విషయం కూడా తెలియడం లేదని చెప్పడంతో... వారికి రెండేళ్ల కాలపరిమితి గల రెఫ్యూజీ సర్టిఫికెట్‌ను జారీ చేస్తామని అంగీకరించారు. ఇప్పటికే దీనిపై సైబరాబాద్ పోలీసులు దృష్టి కేంద్రీకరించి శరణార్థుల కదలికలపై నిఘా వేశారు. వయా దుబాయ్ టూ పాకిస్థాన్ ఇప్పటికే చెంచల్‌గూడకు చెందిన మహమ్మద్ మసూద్ ఆలీ ఖాన్ సహకారంతో ఓటరు గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులు పొందడమే కాకుండా 15 మందికి భారత పాస్‌పోర్టులు ఇప్పించి విదేశాలకు పంపించడంపైనా పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. అయితే వీరిని దుబాయ్ మీదుగా పాకిస్థాన్‌కు పంపించారన్న విషయం పోలీసుల విచారణలో నిందితుడు వెల్లడించినట్టు సమాచారం. ఇదే నిజమైతే వారిని పాకిస్థాన్‌కు పంపించడానికి కారణమేంటి? ఉగ్రవాదులుగా శిక్షణ తీసుకునేందుకు వారిని పంపించారా? ఉద్యోగాల పేరుతో నమ్మించి ఉగ్రవాద చర్యల్లో భాగస్వామ్యులను చేసేందుకు అక్కడికి పంపించి ఉంటారా అన్న దిశగా పోలీసులు విచారణ సాగుతున్నట్టు తెలుస్తోంది. పాస్‌పోర్టు తనిఖీకి వచ్చిన కానిస్టేబుళ్లను కూడా పోలీసులు పిలిపించి మాట్లాడినట్టు సమాచారం.