పూర్వాంచల్ మహాకుంభ్ ర్యాలీలో అమిత్ షా
న్యూఢిల్లీ: తమ పార్టీకి మళ్లీ అధికారమిస్తే దేశంలో అక్రమంగా ఉంటున్న వలసదారులను గుర్తిస్తామని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా హామీ ఇచ్చారు. వలసదారులకు అండగా ఉంటూ కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆదివారం పార్టీ ర్యాలీ ‘పూర్వాంచల్ మహాకుంభ్’లో ఆయన మాట్లాడారు. ‘2019లో ప్రభుత్వ ఏర్పాటు అనంతరం దేశంలో అక్రమ వలసదారుల గుర్తింపును మా పార్టీ చేపడుతుంది. అక్రమ వలసదారులు దేశానికి చెద పురుగుల్లా తయారయ్యారు.
వారిపై చర్యలు తీసుకుంటే దేశభక్తులైన వారెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, రాహుల్ బాబా, కేజ్రీవాల్ మాత్రం గగ్గోలు పెడతారు. ఎందుకంటే వారివి ఓటు బ్యాంకు రాజకీయాలు’ అని ఎద్దేవా చేశారు. అక్రమ వలసలపై రాహుల్, కేజ్రీవాల్‌లు తమ అభిప్రాయాన్ని స్పష్టం చేయాలన్నారు. ‘బీజేపీకి వ్యతిరేకంగా ఏకమైన మహా కూటమికి ఒక విధానం లేదు, నేతా లేడు. ఆ కూటమికి నాయకుడు కావాలని రాహుల్ అనుకుంటున్నారు. కానీ, శరద్ పవార్, మాయావతి, మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్ అందుకు ఒప్పుకోరు’ అని అన్నారు. 2019 ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ బీజేపీ చేపట్టాల్సిన నాలుగు భారీ ర్యాలీల్లో పూర్వాంచల్ మహాకుంభ్ ఒకటి.
సీఎంగా పరీకరే కొనసాగుతారు: అమిత్‌షా
గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పరీకరే కొనసాగుతారని అమిత్ షా స్పష్టం చేశారు. త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని వెల్లడించారు. ‘మనోహర్ పరీకరే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. గోవా ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారని ఆ రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సభ్యులకు స్పష్టం చేశాం’ అని తెలిపారు. ఆయనకు మెజారిటీ సభ్యుల మద్దతు కూడా ఉంటుందని తెలిపారు. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన నేపథ్యంలో ఆయన కొనసాగింపుపై అనుమానం వ్యక్తం చేస్తూ పలు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment