సాక్షి, న్యూఢిల్లీ: న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆమ్‌ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ప్రధాన పార్టీలు మహిళలనే పోటీలో నిలబెట్టనుండటం విశేషం. ఈ నియోజకవర్గం అభ్యర్థిగా మాజీమంత్రి కిరణ్ వాలియా పేరును కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించగా, బీజేపీ సైతం అదే బాటలో నడుస్తోంది. ఆ పార్టీ నుంచి కిరణ్ బేడీ, షాజియా ఇల్మీలలో ఎవరు బరిలో ఉంటారనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు కేజ్రీవాల్‌తో కలిసి పనిచేసిన ఈ మహిళలిద్దరూ ఒక రోజు తేడాతో బీజేపీలో చేరడంతో వీరిద్దరిలో ఎవరినైనా ఒకరిని కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా పార్టీ నిలబెడ్తుందని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో పోటీచేయాలనుకోవడం లేదని షాజియా ఇల్మీ అంటుండగా, పార్టీ ఎక్కడ టికెట్ ఇస్తే అక్కడి నుంచి పోటీచేస్తానని కిరణ్ బేడీ చెప్పారు.
అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా కూడా పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆమె ప్రకటించారు. ఇదిలా ఉండగా, కిరణ్ బేడీ ఎన్నికల్లో పోటీ చేస్తారని పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది మాత్రం పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందన్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీ జనవరి 19న సమావేశమవనున్నాయి. ఈ సమావేశం అనంతరం బీజేపీ అభ్యర్థుల జాబితా వెలువడుతుందని అంటున్నారు. కాగా, పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ నేతృత్వం కిరణ్ బేడీకి అప్పగించవచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నియామకం జరిగినట్లయితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా కిరణ్ బేడీ పేరు ఖరారైనట్లేనని అంటున్నారు.
కాగా, న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి వీరిద్దరిలో బీజేపీ ఎవరికి టికెట్ ఇచ్చినా, కేజ్రీవాల్ ప్రధాన ప్రత్యర్థులు మహిళలే కానున్నారు. కాంగ్రెస్ తరఫున ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మాజీ మంత్రి కిరణ్ వాలియా పోటీచేయనున్న సంగతి తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికలో కేజ్రీవాల్ కావాలని షీలాదీక్షిత్ ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూఢిల్లీ నియోజకవర్గాన్ని ఎంచుకోగా, ఈసారి కాంగ్రెస్, బీజేపీలు ఆయనకు వ్యతిరేకంగా మహిళకు టికెట్టు ఇవ్వాలనుకోవడం గమనార్హం.
మహిళలే కేజ్రీవాల్‌కు ప్రధాన ప్రత్యర్థులు
Published Fri, Jan 16 2015 10:29 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement