మాకు వల వేస్తోంది!
సాక్షి, న్యూఢిల్లీ: తమ ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీ ప్రలోభాలకు గురిచేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చని, ఇందుకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలలో కొందరు ఆ పార్టీకి మద్దతు ఇవ్వొచ్చనే ఊహాగానాల నేపథ్యంలో ఆప్ శాసనసభ్యులు బుధవారం సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇస్తామంటూ కొందరు ఆప్ ఎమ్మెల్యేలు తమను సంప్రదిస్తున్నారని ఒకవైపు బీజేపీ అంటుండగా, బీజేపీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి వారిలో చీలికలు తేవడానికి ప్రయత్నిస్తోందని మరోవైపు ఆప్ ఆరోపించింది. బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలను చీల్చడానికి ప్రయత్నిస్తోందని మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
ఫోన్‌ద్వారా, మధ్యవర్తుల ద్వారా బీజేపీ తమను సంప్రదిస్తోందని, పార్టీని వీడిపోయేవిధంగా చేసేందుకు డబ్బుతోపాటు పదవులను ఎరగా చూపుతోందని ఐదుగురు ఆప్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. బీజేపీ తనను పలు మార్లు సంప్రదించిందని, సోమవారం కూడా ఆ పార్టీకి చెందిన మధ్యవర్తి ఒకరు తన దగ్గరికి వచ్చి ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ గానీ, ఆప్ గానీ ఎలాగూ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేవని, ఆప్ నుంచి ఇప్పుడే వీడిపోవడం మేలంటూ సూచించాడని రోహిణీ ఎమ్మెల్యే రాజేష్ గర్గ్ ఆరోపించారు. పార్టీని వీడిరావడానికి ఏవైనా షరతులు విధించినా లేక డబ్బు కావాలన్నా ఏర్పాటుచేస్తానని ఆ వ్యక్తి తనకు చెప్పినట్లు గర్గ్ తెలిపారు. ఈ వ్యవహారాన్ని విడియోలో నమోదు చేశానని, ఫోన్ కాల్స్ రికార్డింగ్‌లు కూడా తన వద్ద ఉన్నాయని ఆయన చెప్పారు.
విశ్వాస పరీక్ష సమయంలో ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరైతే బీజేపీ విశ్వాసరీక్ష నెగ్గి ప్రభుత్వం ఏర్పా టు చేస్తుందని, గైర్హాజరైనా ఎమ్మెల్యేలు ఎలాగూ తమ శాసన సభ్యత్వాన్ని కోల్పోతారని, అప్పుడు టికెట్లు ఇచ్చి మళ్లీ ఎన్నికల్లో నిలబెడుతుందని, ఈ విధంగా మళ్లీ ఎమ్మెల్యేలు కావొచ్చన్న ఆశ చూపించి బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోందని ఆయన ఆరోపించారు. స్థానిక బీజేపీ కార్యకర్తలు పలుమార్లు తనను కలిసి పార్టీ నుంచి బయటికి రావాలంటూ కోరారని త్రిలోక్‌పురి ఎమ్మెల్యే రాజు ధింగన్ ఆరోపించారు. బీజేపీ నేతలు తనను కూడా సంప్రదించినట్లు మాజీ మంత్రి, మాలవీయనగర్ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతి చెప్పారు. అధికారం కోసం బీజేపీ ఏదైనా చేస్తుందని ఆయన ఆరోపించారు. అయితే తమ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరని ఆయన తెలిపారు. ఆవిధంగా చేసినవారు నిజమైన ఆప్ సభ్యులు కాదని ఆయన పేర్కొన్నారు.