సాక్షి, న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల నేపథ్యంలో పలు నియోజకవర్గాల్లో పోటీ ఆసక్తికరంగా మారింది. ముందుగా ఊహించినట్టుగానే న్యూఢిల్లీ నియోజక వర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ప్రధానంగా ఇద్దరు మహిళలతో పోటీపడనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు వ్యతిరేకంగా మాజీ మంత్రి కిరణ్ వాలియాను బరిలోకి దింపగా, డూసూ మాజీ అధ్యక్షురాలు నుపుర్ శర్మకు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఈ నియోజకవర్గం నుంచి షాజియా ఇల్మీని గానీ కిరణ్‌బేడీనిగానీ బీజేపీ నిలబెట్టవచ్చనే ఊహాగానాలు తొలుత వినిపించాయి.
అయితే కొత్తగా చేరిన షాజియాకు టికెట్ ఇవ్వకపోగా కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా స్థానిక యువనేతను నిలబెట్టింది.నుపుర్‌శర్మ 2008లో ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘానికి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమె వృత్తిరీత్యా న్యాయవాది. బీజేపీ యువ మోర్చా మీడియా ఇన్‌చార్జిగా పనిచేస్తున్నారు. గత విధానసభ ఎన్నికలలోనూ ఆమె న్యూఢిల్లీ టికెట్ ఆశించారు. అయితే పార్టీ అప్పట్లో విజేందర్ గుప్తాను బరిలోకి దింపింది. ఈసారి విజేందర్ గుప్తా రోహిణీ. ఆయన సతీమణి రేఖా గుప్తా... షాలిమార్ బాగ్ స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారని అంతా భావించినప్పటికీ ఆయన పేరు అభ్యర్థుల జాబితాలో కనిపించలేదు.
కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా పోటీచేస్తానని గతంలో ప్రకటించిన వినోద్‌కుమార్ బిన్నీని బీజేపీ ప్రస్తుతం ఆప్ నేత మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా పడ్పడ్‌గంజ్ నుంచి బరిలోకి దింపనుంది. గత విధానసభ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బిన్నీ... లక్ష్మీనగర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఏకేవాలియాను ఓడించారు. అయితే ఆ తరువాత తిరుగుబాటు జెండా ఎగరువేసి పార్టీ నుంచి సస్పెండయ్యారు. ఇటీవల ఆయన బీజేపీ చేరారు. కృష్ణానగర్... మరోమారు బీజేపీ మఖ్యమంత్రి అభ్యర్థి నియోజకవర్గం కానుంది. డా. హర్షవర్ధన్ కంచుకోటగా ముద్రపడిన ఈ నియోజకవర్గం నుంచి ఈసారి మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ పోటీ చేయనున్నారు. గత విధానసభ ఎన్నికల్లో కూడా హర్షవర్ధన్ ఇక్కడ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికల్లో చాందినీచౌక్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన తరువాత ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆప్‌ను వీడి బీజేపీలో చేరిన మాజీ స్పీకర్ ఎం.ఎస్.ధీర్‌కుఎ మళీ జంగ్‌పురా స్థానం నుంచి పోటీ చేసే అవకాశం లభించింది.
ఇక కిరణ్ బేడీ పార్టీలో చేరేంతవరకు ముఖ్యమంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్న బీజేపీ సీనియర్ నాయకుడు జగ్‌దీశ్‌ముఖి మరోమారు జనక్‌పురి స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గత విధానసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ విజయం సాధించిన సంగతి విదితమే. అదేవిధంగా ఆయనకు ఈసారి కాంగ్రెస్ నుంచి కూడా గట్టి పోటీ ఎదురుకానుంది. కాంగ్రెస్ పార్టీ జగ్‌దీశ్ ముఖి అల్లుడికే టికెట్ ఇవ్వడంతో ఈ నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా మారింది. ఎవరూ ఉహించని రీతిలో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన కృష్ణతీరథ్... పటేల్ నగర్ రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ ఎన్నికల ఇన్‌చార్జ్ అజయ్ మాకెన్ పోటీ చేస్తున్న సదర్‌బజార్ నుంచి ప్రవీణ్ జైన్‌కు బీజేపీ టికెట్ ఇచ్చింది.
పలు నియోజక వర్గాలలో ఆసక్తికరమైన పోటీ
Published Tue, Jan 20 2015 11:04 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement