ముక్కోణపు పోటీ తప్పదా..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని హైప్రొఫైల్ నియోజకవర్గాలలో ఒకటైన న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారన్నది ఈ లోక్‌సభ ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్, అప్పటి ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ను ఘోరంగా ఓడించిన తీరుతో లోక్‌సభ ఎన్నికలలో ప్రజల తీర్పుపై మరింత ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఏడు స్థానాల్లో, బీజేపీ మూడు స్థానాల్లో గెలిచినందువల్ల ప్రధాన పోటీ ఈ రెండు పార్టీల మధ్యనే ఉంటుందని కొందరు అంటుండగా, ఢిల్లీలో కాంగ్రెస్ గెలిచే అవకాశమున్న సీటు న్యూఢిల్లీ ఒక్కటేనని.. అందువల్ల ఇక్కడ ముక్కోణపు పోటీ జరుగుతుందని మరికొందరు అంటున్నారు.
కాంగ్రెస్ ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీ అజయ్ మాకెన్‌కు టికెట్ ఇచ్చింది. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీజేపీ ప్రత్యర్థులను ఓడించిన మాకెన్‌కు ఈ ఎన్నికల్లో విజయం అంత సులువుగా లభించే సూచనలు కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు లభించిన ఘనవిజయం, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వీస్తోన్న పవనాలతో పాటు సామాన్యులకు అందుబాటులో ఉండని హైప్రొఫైల్ నేత అన్న ముద్ర ఆయనకు మైనస్ పాయింట్లుగా మారాయి.
ఈ నియోజకవర్గం రూపురేఖలు గత పదేళ్లలో గణనీయంగా మారినప్పటికీ ఎన్నికల్లో విజయం సాధించడానికి అభివృద్ధి మంత్రమొక్కటే సరిపోదని ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో షీలాదీక్షిత్ పరాజయం రుజువు చేసింది. ఇదిలా ఉండగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ నియోజకవర్గంలో విజయం నల్లేరుపై నడకలా కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మధ్య తరగతి వర్గీయులకు ఆప్‌పై మక్కువ తగ్గడమే ఇందుకు కారణం.
ఈ నియోజకవర్గ ఓటర్లలో 14.2 శాతం మధ్య తరగతివాసులు ఉన్నారు. ఇక్కడి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ పాత్రికేయుడు ఆశీష్ ఖేతాన్‌ను బరిలోకి దింపింది. స్థానికులను పక్కన బెట్టి బయటివ్యక్తికి టికెట్ ఇవ్వడంపై ఆ పార్టీలో నిరసన వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆయన సన్నిహితుడు అమిత్ షా కలసి ఒక మహిళపై నిఘా పెట్టారని ఆరోపిస్తూ ఆశీష్ ఖేతన్ తన వార్త పోర్టల్ ద్వారా విడుదల చేసిన ఆడియో టేప్ సంచలనం సృష్టించింది. నేరుగా నరేంద్ర మోడీపై ఆరోపణాస్త్రాలు ఎక్కుపెట్టిన ఖేతన్‌కు స్టింగ్ ఆపరేషన్ నిపుణుడిగా పాత్రికేయరంగంలో పేరుంది.
బీజేపీ సుప్రీంకోర్టు న్యాయవాది మీనాక్షీలేఖికి టికెట్ ఇచ్చింది. పార్టీ ప్రతినిధిగా మీడియాలో పార్టీని గట్టిగా సమర్థించే నేతగా ఆమెకు గుర్తింపు ఉంది. అయితే మీనాక్షీ లేఖీకి సొంతంగా ఓట్లు సాధించే సత్తా లేదు. నమో మంత్రం, పార్టీ పేరు మీదనే ఆమెకు ఓట్లు లభిస్తాయి.