triangular contest
-
Lok Sabha Election 2024: డమ్ డమ్‌లో... విజయఢంకా మోగించేదెవరో!
డమ్ డమ్ లోక్‌సభ స్థానం. పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్‌తో కలిసి లెఫ్ట్ విజయం సాధించగలిగే సీట్లలో ఒకటి. ఒకప్పుడు సీపీఎం కంచుకోట. దాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని సీపీఎం పోరాడుతోంది. ఇది తృణమూల్ సిట్టింగ్ స్థానం. ఇక్కడ తమ ఓటు బ్యాంకుకు గండి పడకుండా కాపాడుకోవడానికి టీఎంసీ తిప్పలు పడుతోంది. ఒకసారి గెలుపొందిన ఈ స్థానంలో మళ్లీ పాగా వేయాలని బీజేపీ ప్రయతి్నస్తోంది. దాంతో డమ్ డమ్‌లో త్రిముఖ పోటీ నెలకొంది... కోల్‌కతా సమీపంలో ఉండే డమ్ డమ్ లోక్‌సభ స్థానానికి పశి్చమ బెంగాల్లో చారిత్రక ప్రాధాన్యముంది. 1783లో బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడ సైనిక కంటోన్మెంట్, మిలిటరీ బ్యారక్‌లు నిర్మించింది. 1846లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ స్థాపించింది. 1857 సిపాయిల తిరుగుబాటు సందర్భంగా బ్రిటిష్ సైన్యంపై తిరుగుబాటు చేసిన మంగళ్ పాండేకు మరణశిక్ష విధించింది కూడా డమ్ డమ్ కంటోన్మెంట్‌లోనే. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని డమ్ డమ్ బంగ్లాదేశ్‌కు దగ్గరగా ఉంటుంది. స్వాతంత్య్రం వచ్చినప్పుడు, బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో హిందూ శరణార్థులు ఇక్కడ భారీగా స్థిరపడ్డారు. పట్టణ జనాభా అధికం... డమ్ డమ్ లోక్‌సభ స్థానానికి 1977లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. 20 ఏళ్ల పాటు ఈ స్థానం సీపీఎం గుప్పెట్లోనే కొనసాగింది. 1998లో తొలిసారిగా బీజేపీకి చెందిన తపన్ సిక్దర్ విజయం సాధించారు. 1999లో ఈ స్థానాన్ని నిలుపుకున్నారు. అనంతరం మూడుసార్లు టీఎంసీ నుంచి సౌగతా రాయ్ విజయం సాధించారు. డమ్ డమ్ లోక్‌సభ నియోజకవర్గం మొత్తం జనాభా 21,84,460. ఇందులో 98.43 శాతం పట్టణ జనాభాయే. దీని పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలూ టీఎంసీ ఖాతాలోనే ఉండటం ఆ పారీ్టకి కలిసొచ్చే అంశం.ప్రతి ఐదు ఓట్లలో ఒకటి... డమ్ డమ్‌లో తృణమూల్ నుంచి సిట్టింగ్ ఎంపీ సౌగతా రాయ్, సీపీఎం నుంచి సుజన్ చక్రవర్తి, బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే శిల్పద్రా దత్తా బరిలో ఉన్నారు. శిల్పద్రా 2020లో తృణమూల్‌కు రాజీనామా చేసి కాషాయ పారీ్టలో చేరారు. మమతా వ్యతిరేక ఓటర్లు వామపక్షాల వైపు మొగ్గితే కాంగ్రెస్ మద్దతుతో సుజన్ గెలవడం సాధ్యమని విశ్లేషకులు అంటున్నారు. అయితే సీపీఎం కేవలం బీజేపీకి ఓట్లను ఆకర్షించగలదే తప్ప తమనేమీ చేయలేదని టీఎంసీ ధీమాతో ఉంది. సీపీఎం ఓట్లు గతం కంటే పెరిగే అవకాశముందని, ఇది బీజేపీ అవకాశాలను దెబ్బతీస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.‘వలస’ ఓట్లపై సీఏఏ ప్రభావం... బంగ్లాదేశ్ నుంచి వలస వచి్చన వారు డమ్ డమ్‌లో అధిక సంఖ్యలో ఉంటున్నారు. పౌరసత్వ (సవరణ) చట్టం అమలు వివాదం వారిపై ప్రభావం చూపేలా ఉంది. ‘‘దీంతోపాటు అయోధ్య రామమందిర నిర్మాణం కూడా హిందూ ఓట్లను ఏకీకృతం చేస్తుంది. కనుక బీజేపీ గెలుపు ఖాయం’’ అని శిల్పద్రా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రంలో ప్రధానంగా కని్పంచే డమ్ డమ్ ఇప్పుడు ఆ ప్రత్యేకతను కోల్పోయిందని స్థానికులు వాపోతున్నారు. తాగునీటి సంక్షోభం అధికార తృణమూల్‌కు నష్టం చేయడం ఖాయమని చెబుతున్నారు. ఇక్కడ జూన్ 1న ఏడో విడతలో పోలింగ్ జరగనుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: తోటల నగరంలో ఓట్ల వేట!
శ్రీనగర్. తోటల నగరం. నిషాత్ బాగ్, షాలిమార్ గార్డెన్స్, చషే్మషాహీ గార్డెన్, నెహ్రూ బొటానికల్ గార్డెన్, ఇందిరాగాంధీ తులిప్ గార్డెన్ వంటి అత్యంత అందమైన పూదోటలకు, ప్రఖ్యాత దాల్ సరస్సుకు నిలయం. జమ్మూ కశీ్మర్లోని ఐదు లోక్‌సభ స్థానాల్లో ఒకటైన శ్రీనగర్‌లో సోమవారం పోలింగ్ జరగనుంది. ముక్కోణపు పోటీలో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.... శ్రీనగర్‌లో ముక్కోణపు పోరు అబ్దుల్లాలదే ఆధిపత్యం జమ్మూ కశీ్మర్‌కు రాష్ట్ర హోదా, ఆర్టికల్ 370 రద్దయ్యాక జరుగుతున్న తొలి ఎన్నికలివి. రాష్ట్రంలో ఆరు లోక్‌సభ స్థానాలుండేవి. జమ్మూ కశీ్మర్, లద్దాక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా మారాక ఐదు జమ్మూ కశీ్మర్ పరిధిలోకి, ఒకటి లద్దాఖ్ కిందకు వెళ్లాయి. శ్రీనగర్‌లో విజయం నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూ కశీ్మర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (జేకేపీడీపీ) మధ్యే చేతులు మారుతుంటుంది. 2017 ఉప ఎన్నికలు, 2019 ఎన్నికల్లో ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా విజయం సాధించారు. అంతకుముందు 2014లో ఆయనపై పీడీపీ నేత తారిక్ హమీద్ కర్రా నెగ్గారు. 2009లో ఫరూక్ అబ్దుల్లా, 2004లో ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా విజయం సాధించారు. ఈసారి ఎన్సీ నుంచి ఆగా సయ్యద్ రుహుల్లా మెహెదీ, పీడీపీ నుంచి వహీదుర్ రెహమాన్ పర్రా, జమ్మూ కశ్మీర్ ఆప్నీ పార్టీ నేత మహమ్మద్ అష్రఫ్ మిర్ బరిలో ఉన్నారు. డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ అజాద్ పార్టీ, జమ్మూ కశ్మీర్ పాంథర్స్ పార్టీ, లోక్తాంత్రిక్ పారీ్టతో పాటు 18 మంది స్వతంత్రులు కూడా పోటీలో ఉన్నారు. శ్రీనగర్ లోక్‌సభ స్థానంలో ఆది నుంచీ ఎన్‌సీదే ఆధిపత్యం. 13సార్లు ఎన్నికలు జరిగితే 10సార్లు ఆ పారీ్టయే విజయం సాధించింది. ఓటర్లలో నిరుత్సాహం... శ్రీనగర్ లోక్‌సభ స్థానంలో 2009 లోక్‌సభ ఎన్నికల్లో 25.5 శాతం, 2014లో 25.86 శాతం పోలింగే నమోదైంది. ఇక 2019 ఎన్నికల్లో మరీ 14.43 శాతానికి పడిపోయింది! ఈసారి కూడా శ్రీనగర్ వాసుల్లో ఓటింగ్ పట్ల నిరుత్సాహమే కనిపిస్తోంది. వలసదారులకు ఉన్నచోటే ఓటు! జమ్మూ కశీ్మర్లోని శ్రీనగర్, బారాముల్లా, అనంతనాగ్ లోక్‌సభ స్థానాల పరిధిలో 1.13 లక్షల కశీ్మరీ వలసదారులు ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 52,100 మంది శ్రీనగర్ లోక్‌సభ స్థానంలో సోమవారం ఓటేయనున్నారు. వీరి కోసం జమ్మూలో 21, ఢిల్లీలో 4, ఉధంపూర్‌లో ఒకటి చొప్పున మొత్తం 26 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం విశేషం. అంతేగాక ఓటర్లను ఇంటి నుంచి పోలింగ్ కేంద్రాల వరకు తీసుకెళ్లి తిరిగి ఇంటి వద్ద దిగబెట్టే ఏర్పాట్లు కూడా చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తూర్పు విదర్భలో హోరాహోరీ!
మహారాష్ట్రలో లోకసభ ఎన్నికల వేడి మరింత రాజుకుంటోంది. బరిలోకి దిగిన పార్టీలు తమ సత్తాను చాటేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలోని తూర్పు విదర్భలో ఎన్నికల పోరు ఆసక్తికరంగామారింది. ఇక్కడి ఐదు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ, శివసేన, బీఎస్పీతో సహా గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థుల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని భావిస్తున్నారు. రామ్‌టెక్ నియోజకవర్గంలో గుర్తింపు పొందిన పార్టీల నుండి ముగ్గురు అభ్యర్థులు రాజు పర్వే (శివసేన), శ్యాంకుమార్ బార్వే (కాంగ్రెస్), సందీప్ మెష్రామ్ (బీఎస్పీ) ఉన్నారు. అయితే అంతగా గుర్తింపు లేని పార్టీల నుండి 13 మంది, 12 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. రామ్‌టెక్‌లో కాంగ్రెస్ తన అభ్యర్థిగా రష్మీ బార్వేని నిలబెట్టింది. అయితే ఆమె కుల ధృవీకరణ పత్రం చెల్లదు. దీంతో ఆమె భర్త ఎన్నికల రంగంలో నిలిచారు. నాగ్‌పూర్ విషయానికొస్తే బీజేపీ నుంచి నితిన్ గడ్కరీ, వికాస్ థాకరే (కాంగ్రెస్), యోగేష్ లాంజేవార్ (బీఎస్పీ) గుర్తింపు పొందిన పార్టీల నుండి 13 మంది, 10 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. భండారా-గోండియా నియోజకవర్గంలోని 18 మంది అభ్యర్థులలో, సునీల్ మెంధే (బీజేపీ), ప్రశాంత్ పడోలే (కాంగ్రెస్), సంజయ్ కుంభాల్కర్ (బీఎస్పీ) గుర్తింపు పొందిన పార్టీలకు చెందినవారు కాగా, నలుగురు గుర్తింపు పొందనివారున్నారు. 11 మంది స్వతంత్రులు కూడా బరిలో నిలిచారు. అశోక్ నేతే (బీజేపీ), కర్సన్ నామ్‌దేవ్ (కాంగ్రెస్), యోగేష్ హొన్నాడే (బీఎస్పీ) మధ్య త్రిముఖ పోటీ ఉండనుందని భావిస్తున్నారు. చంద్రాపూర్‌లో 15 మంది అభ్యర్థుల్లో ప్రతిభా ధనోర్కర్ (కాంగ్రెస్), సుధీర్ ముంగంటివార్ (బీజేపీ), రాజేంద్ర రామ్టేకే (బీఎస్పీ) గుర్తింపు పొందిన పార్టీల నుంచి, 9 మంది గుర్తింపు లేని అభ్యర్థులు, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎస్. చొక్కలింగం తెలిపారు. ఈ నియోజకవర్గాల్లోని 10,652 పోలింగ్ కేంద్రాల ద్వారా 95,54,667 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. -
మూడోసారి.. మూడో తేదీ... ముక్కోణం!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత మూడోసారి జరుగుతున్న ఎన్నికల ఫలితాలు మూడో తేదీనే రావడం.. అందునా ఈసారి ముక్కోణపు పోరు జరుగుతుండటం ‘ప్రత్యేకత’ను సంతరించుకుంటోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పటి నుంచి చూసినా ముక్కోణ పోటీలు మనకు తక్కువే. 1978, 2009లలో మినహా మూడు పార్టీల మధ్య ఎన్నికల పోరాటం జరగలేదు. కాంగ్రెస్–జనతా పార్టీ, కాంగ్రెస్–కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్–తెలుగుదేశం పార్టీల మధ్యనే ఎన్నికల్లో పోటీ ఉండేది. అప్పుడో పార్టీ, ఇప్పుడో పార్టీ పోటీలోకి వచ్చినా ద్విముఖ పోటీలో చొరబడేంత స్థాయిలో ప్రభావం చూపకపోయేది. 1978లో మాత్రం ఇందిరా కాంగ్రెస్, రెడ్డి కాంగ్రెస్, జనతా పార్టీల మధ్య హోరాహోరీగా ముక్కోణపు పోటీ జరిగింది. నిరుపేద వర్గాలు అండగా నిలవడంతో ఆ ఎన్నికల్లో ఇందిరమ్మ పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇక 2009లో ప్రజారాజ్యం పార్టీ మూడో పక్షంగా నిలబడి 18 శాతం ఓట్లను తెచ్చుకున్నది. తెలంగాణ ప్రాంతంలో అయితే అంతకంటే తక్కువే వచ్చాయి. సరిగ్గా అలాంటి ముక్కోణం పోటీ మళ్లీ ఇప్పుడు జరగబోతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ప్రజల ‘మూడ్’ ఏమిటో? ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల నడుమ ఆసక్తికర పోటీ జరగనుంది. గత రెండు ఎన్నికల్లోనూ గట్టిగానే తలపడిన బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు తోడు ఈసారి బీజేపీ వచ్చిచేరింది. ఇప్పటికే పదేళ్లు అధికారంలో ఉన్నందున బీఆర్ఎస్పై ప్రజావ్యతిరేకత ఉందనేది ఒక అభిప్రాయం. అయితే ప్రభుత్వాన్ని ఓడించి తీరాలన్నంత వ్యతిరేకత మాత్రం కనిపించడం లేదన్నది క్షేత్రస్థాయి అంచనా. ఐదేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, కేసీఆర్ నాయకత్వం, రేసు గుర్రాల్లాంటి కేటీఆర్, హరీశ్‌రావుల ప్రచార తోడ్పాటు వెరసి ముచ్చటగా మూడోసారీ తామే అధికారంలోకి వస్తామని గులాబీ దళం గట్టిగా నమ్ముతోంది. ఇక కాంగ్రెస్ బలం పుంజుకుంటున్నట్లు కొందరు పరిశీలకులు అంచనా వేస్తుండగా ఆ పార్టీలోని వర్గ విభేదాలు, ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన చరిత్ర, కేసీఆర్‌కు దీటైన నేత లేకపోవడం బలహీనతలుగా కనిపిస్తున్నాయి. కానీ బీఆర్ఎస్పై వ్యతిరేకత ఉపయోగçపడుతుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా తమకు ఈసారి ప్రజలు పట్టం కడతారనే విశ్వాసంతో ముందుకెళుతున్నారు. ‘మూడో’పార్టీనే కీలకమా? కొంతకాలం కింద బలపడినట్లు కనిపించిన బీజేపీ ఇప్పుడు బలహీనపడిందని, ప్రధాన పోటీదారు కాకపోవచ్చని సర్వే రాయుళ్లు చెబుతున్నారు. కానీ సంచలనాలకు మారుపేరైన బీజేపీ... తెలంగాణలో ఒక ‘ప్రత్యేక’వ్యూహంతో 35 స్థానాలపై బలంగా గురిపెట్టబోతున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషించే లక్ష్యంతో ఆ పార్టీ పావులు కదుపుతోంది. కమలనాథుల ప్రయత్నాలు సఫలమైతే కచ్చితంగా త్రిశంకు సభ (హంగ్) ఏర్పడుతుంది. అప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ వరుసగా మూడు స్థానాల్లో ఉండవచ్చు. ఈ పరిస్థితి తెలంగాణలో ఆసక్తికర రాజకీయాలకు తెరతీయవచ్చు. కానీ చారిత్రకంగా స్పష్టమైన తీర్పులనే ఇచ్చే సంప్రదాయం తెలుగు ప్రజలకున్నది. ఈ నేపథ్యంలో ఈ మూడు పార్టీల్లో ప్రజలు ఎవరివైపు మొగ్గు చూపుతున్నారది ఇప్పుడు మిలియన్ డాలర్ల క్వశ్చన్. ఈ మూడు పార్టీలు పోను ఉభయ కమ్యూనిస్టులు, టీజేఎస్, వైఎస్సార్టీపీ, బీఎస్పీ లాంటి పార్టీలు తెచ్చుకొనే ఓట్లు చాలా తక్కువ చోట్ల అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయొచ్చని అంచనా. నంబర్ గేమ్‌ను కొంచెం అటుఇటుగా మార్చవచ్చనే అంచనాలున్నా ఫైనల్‌గా బీజేపీ సాధించే ఓట్లు, సీట్లు ఎన్నికల తుది ఫలితాలను శాసించవచ్చన్నది రాజకీయ వర్గాల అభిప్రాయంగా కనిపిస్తోంది. ఇందిరా.. ఎన్టీఆర్.. మీటింగ్‌ల మిద్దె.. ఈ ఇంటిని చూశారా! సూర్యాపేట జిల్లా కోదాడ నయానగర్‌లోని వెంకట్రామయ్య నివాసం ఇది. పాతతరం నాయకులందరికీ సుపరిచితమైన ఇల్లు. పట్టణ నడి»ొడ్డున ఉన్న ఈ ఇంటి పరిసరాలన్నీ ఆ సమయంలో వ్యవసాయ భూములుగా ఉండేవి. 1980 ప్రాంతంలో కోదాడలో ఏ పార్టీ మీటింగ్ జరిగినా సభావేదికగా ఈ ఇంటినే ఎంచుకునేవారు. ఎన్టీ రామారావు 1982లో తొలిసారి కోదాడకు వచ్చినప్పుడు ఈ ఇంటి మీద నుంచే ప్రసంగించారు. ఆ తర్వాత నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన చింతా చంద్రారెడ్డి.. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాందీతో మీటింగ్ ఏర్పాటు చేయగా ఆమె కూడా ఇక్కడి నుంచే మాట్లాడారు. మాజీ ఉపప్రధాని దేవీలాల్ ఈ ఇంటినే వేదికగా చేసుకుని మీటింగ్‌లలో పాల్గొన్నారు. – కోదాడ గాసిప్టైమ్ తండ్రి కోసం కొడుకు త్యాగం కొడుకు భవిష్యత్తు కోసం తండ్రి త్యాగం చేయడం కామన్... కానీ ఈసారి రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో తండ్రి కోసం కొడుకు త్యాగం చేయాల్సి వస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు చేసే ఓ మాజీ ఎంపీ ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలనుకున్నారు. రాజధాని నడి»ొడ్డున ఉండే ఓ నియోజకవర్గాన్ని కూడా ఎంచుకున్నారు. అయితే, అక్కడ గత ఎన్నికల్లో ఆ మాజీ ఎంపీ కుమారుడు పోటీ చేశారు. ఇప్పుడు ఆ టికెట్ కోసమే తండ్రి, కొడుకులు దరఖాస్తు చేసుకున్నారు కూడా. అయితే, ఇద్దరిలో ఎవరికి అన్నప్పుడు పాపం కొడుకే తండ్రి కోసం త్యాగం చేసేందుకు సిద్ధమయ్యాడట. నువ్వు పోటీ చేస్తే నేనొద్దంటానా? అని తాను పోటీ నుంచి తప్పుకున్నాడంట. తండ్రి కోసం కొడుకు త్యాగం వృ««థా కాబోదనే అంచనాతోనే ఆయన పోటీ నుంచి విరమించుకున్నాడనే చర్చ జరుగుతోంది. తండ్రి గెలిచి పుసుక్కున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బలహీన వర్గాల కోటాలో తండ్రి మంత్రి అవుతాడనే నమ్మకంతోనే ఆయన విరమించుకున్నాడని, భవిష్యత్తు మీద గట్టి అంచనాతోనే స్వామికార్యం స్వకార్యం నెరవేర్చుకుంటున్నాడని గాం«దీభవన్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. బంగారు కడియాలు తెచ్చా.. సార్ అసెంబ్లీ టికెట్ అంటే ఈ సీజన్లో మామూలు ముచ్చట కాదు. టికెట్ వస్తే చాలు... అది కూడా ప్రధాన పార్టీ టికెట్ అంటే హాట్ కేకే. టికెట్ వచ్చిందంటేనే సగం ఎమ్మెల్యే అయినంత హ్యాపీ. మరి ఆ టికెట్ ఇచ్చేవాళ్లను ఏదో రకంగా ప్రసన్నం చేసుకోవాలనుకునే వారు లేకుండా ఉంటారా? అలాంటి వారుంటేనే కదా టికెట్ల కేటాయింపు సీజన్లో మాల్మసాలా వార్తలు బయటకు వచ్చేది. ఏం జరిగినా జరగకపోయినా రాజకీయ నాయకులు తమ మీద పడిన బురద కడుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ప్రసన్నం చేసుకునే పాట్లలోనే ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మహిళా కాంగ్రెస్ ఆశావహురాలు కంగు తిన్నారట. తనకు టికెట్ కచ్చితంగా వస్తుందన్న అంచనాతోనే విదేశాల నుంచి తెచ్చిన రెండు బంగారు కడియాలను ఢిల్లీలోని ఓ పెద్ద నాయకుడికి ఇవ్వబోయారట. ఇదేంటమ్మా.. అంటే ‘ఏదో నా తృప్తి సార్.. ఫలానా ఆయనకు ఇచ్చా.. ఇంకో ఆయనకు కూడా ఇచ్చాను’అంటూ ఇద్దరి ముగ్గురి పేర్లు చెప్పిందంట. అంతా విన్న ఆ ఢిల్లీ పెద్ద నాయకుడు ‘ఇలాంటివి పెట్టుకోకమ్మా... నీ ‘బంగారు’భవిష్యత్తుకు దెబ్బ పడుతుంది’అని చెప్పి పంపించేశాడట. మూడు సీట్ల ‘మహరాజ్’! వామపక్షాలతో పొత్తు ఓ నాయకుడికి అరుదైన ఖ్యాతిని తెచ్చిపెట్టబోతోందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. వామపక్షాలు, కాంగ్రెస్ పొత్తు ఖరారైతే రాష్ట్ర సరిహద్దులో ఉన్న ఓ నియోజకవర్గాన్ని పెద్ద కమ్యూనిస్టు పార్టీకి ఇవ్వాల్సి వస్తుందని, అప్పుడు అక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేను పక్కనే ఉన్న మరో చోటకు పంపిస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అలా పంపిస్తే మాత్రం ఆయన ‘మూడు సీట్ల మహరాజ్’అనే కీర్తిని మూటగట్టుకోబోతున్నారనే టాక్ కూడా నడుస్తోంది. గతంలోనే పొరుగు జిల్లా నుంచి ప్రస్తుతమున్న సీట్లోకి వచ్చిన ఆయన ఇప్పుడు పొత్తు ముచ్చటలో మళ్లీ పక్కకు జరుగుతారని, అలా జరిగితే మాత్రం రికార్డేనని అంటున్నారు. గతంలో రెండు చోట్ల గెలిచిన ఆయన ఇక్కడ కూడా గెలిస్తే ఒకే పార్టీ తరఫున మూడు చోట్ల చట్టసభలకు ఎన్నికైన నేతగా జాతీయ స్థాయి గుర్తింపు దక్కించుకున్నా ఆశ్చర్యం లేదని గాం«దీభవన్‌లో టాక్. మరి ఏమవుతుందో... ఆ మూడు సీట్ల మహరాజ్‌కు విజయమో... ‘వీర’ని్రష్కమణమో... చూద్దాం.! ఈ నెలాఖరు వరకు ఓటరు నమోదుకు అవకాశం ‘‘దేవాన్ష్ కు అక్టోబరు 15వ తేదీతో 18 ఏళ్లు నిండుతాయి. కానీ, ఓటు నమోదు ప్రక్రియ సెపె్టంబరులోనే ముగిసింది. దీంతో అతను ఓటేయాలంటే మరో ఐదేళ్లు ఆగాల్సిందేనా? అంటే అవసరం లేదని అంటోంది ఎన్నికల సంఘం.’’సెపె్టంబరులో ఓటు దరఖాస్తు చేసుకోలేని వారందరికీ ఇంకా నమోదుకు అవకాశం ఉందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో నవంబర్ 30న శాసనసభ ఎన్నికలు జరగనుండగా ఓటరు నమోదుకు అక్టోబరు 31వరకు మరో అవకాశం చేసుకునే వెసులుబాటు కల్పించింది. తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఓటరుగా నమోదు కావాలనుకునేవారు తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫారం–6 తీసుకుని అందులో వివరాలను పొందుపరిచి అక్కడే కార్యాలయంలో సమర్పించాలి. ఆధార్ కార్డు, ఇంటి చిరునామాను సూచించే కరెంట్ బిల్లు, ఇతరత్రా ఏదేనీ ఆధారాన్ని జత చేయాల్సి ఉంటుంది. బీఎల్వోలు క్షేత్రస్థాయిలో విచారించి ఓటరుగా నమోదు చేస్తారు. ఓటరు నమోదుకు వివిధ మార్గాలు క్యాంపెయిన్‌కు వెళ్లలేనివారు అరచేతిలోనే ఓటరుగా నమోదు కావచ్చు.http:///voters.eci.gov.in (హెచ్‌టీటీపీ://వీవోటీఈఆర్ఎస్.ఈసీఐ.జీవోవీ.ఐఎన్) వెబ్సైట్లోకి వెళ్లాలి. సర్వీస్ పోర్టల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. అందులో మొబైల్ నంబర్‌తో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అనంతరం లాగిన్ అవ్వాలి. ఆన్లైన్లో కొత్త ఓటుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. యాప్‌తో కూడా బీఎల్వో వద్దకు వెళ్లలేని వారు.. వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోలేని పరిస్థితుల్లో మీ వద్ద ఉన్న మొబైల్లో ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. దానిపై క్లిక్ చేయగానే పోర్టల్ ఓపెన్ అవుతుంది. కొత్తగా ఓటు నమోదు చేసుకోవచ్చు. జాబితాలో పేరుందా.. లేదా చూసుకునే అవకాశం కూడా కల్పించారు. – సాక్షిప్రతినిధి, కరీంనగర్ -
ఆలయనగరిలో... ఎవరిపైనో దేవుడి దయ
శ్రీకృష్ణుడి జన్మస్థలంగా హిందువులు భావించే, ‘టెంపుల్ టౌన్’గా పేరొందిన ఉత్తరప్రదేశ్‌లోని మథుర పార్లమెంటు నియోజకవర్గంలో ఈసారి త్రిముఖ పోటీ ఉంటుందని భావిస్తున్నారు. బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న మథురలో ఈసారి బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ హేమమాలిని పోటీ చేస్తుంటే, ఆర్ఎల్డీ నుంచి కున్వర్ నరేంద్రసింగ్, కాంగ్రెస్ నుంచి మహేష్ పట్నాయక్ బరిలోకి దిగారు. జాట్ ఓటర్లకు బాగా పట్టున్న ఈ స్థానంలో రెండోసారి ఎంపీ సీటు దక్కించుకోవడానికి సినీ నటి హేమమాలిని గత ఎన్నికల్లో ‘జాట్ బహూ’గా ఈ నియోజకవర్గం ప్రజల మనసు గెలుచుకున్నారు. ఈసారి సైతం గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. గత ఎన్నికల్లో 2014 మోదీ వేవ్‌లో బీజేపీ నుంచి మథుర లోక్‌సభకు పోటీ చేసి, అప్పటి ఆర్ఎల్డీ సిట్టింగ్ అభ్యర్థి జయంత్ చౌధరిని ఓడించి హేమమాలిని విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఇక్కడి గెలుపు ఓటములను ప్రభావితం చేయగల జాట్ సామాజిక వర్గం సెంటిమెంట్‌ని గత ఎన్నికల్లో హేమమాలిని వాడుకున్నారు. ‘జాట్ బహూ’ (జాట్ సామాజికవర్గం కోడలు)గా మీ ముందుకొస్తున్నాను. ఆదరించండం’టూ జోరుగా ప్రచారం చేసి విజయాన్ని సాధించగలిగినా ఇప్పుడా సెంటిమెంటు ఓట్లు రాలుస్తుందా లేదా అన్నది అన్ని వర్గాల్లో చర్చనీయాంశమైంది. గెలుపు అంత ఈజీ కాదు.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో యావత్ దేశాన్నీ బీజేపీ స్వీప్ చేసిన సందర్భంలో హేమమాలిని గెలుపు సులువైంది. కానీ ఈసారి ఈ స్థానంలో విజయాన్ని చేజిక్కించుకోవడం నల్లేరు మీద నడక మాత్రం కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఐదేళ్ల పాలనలో బీజేపీపై జాట్ సామాజిక వర్గంలో నెలకొన్న వ్యతిరేక ప్రవాహానికి ఎదురీదడం అంత తేలికేం కాదన్నది స్థానిక పరిశీలకుల అభిప్రాయం. అందుకే హేమమాలిని ఓటర్లను ఆకట్టుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. మథురలో జాట్ ఓటర్లు 4.5 లక్షల మంది ఉన్నారు. ఈ లోక్‌సభ స్థానంలో గెలుపును ప్రభావితం చేయగలిగిన ఈ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకే అన్ని పార్టీలూ తీవ్రంగా కృషి చేస్తున్నాయి. 20 శాతం మందిగా ఉన్న జాట్ సామాజిక వర్గం ఇక్కడి గెలుపోటములను ప్రభావితం చేసే స్థితిలో ఉంది. మథుర పార్లమెంటు పరిధిలో 70 శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారే. ఠాకూర్లు, బ్రాహ్మణులు, షెడ్యూల్డ్ కులాలు ప్రధాన సామాజిక వర్గాలు. కొంత వరకు ముస్లింలు, వైశ్యులు కూడా ఉన్నారు. ప్రముఖ జాట్ నాయకుడు చౌధరీ చరణ్‌సింగ్ ఈ ప్రాంతం వారే కావడం విశేషం. చౌధరి చరణ్‌సింగ్ భార్య గాయత్రీదేవి 1984 ఎన్నికల్లో మథురలో ఓడిపోయారు. ఆయన కుమార్తె గ్యానవతి 2004లో ఓటమి పాలయ్యారు. ఈ రెండు సందర్భాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి మన్వీర్సింగ్ ఈ స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే 2009 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం చరణ్‌సింగ్ మనవడు జయంత్ చౌధరి మథుర నుంచి పార్లమెంటుకి సారథ్యం వహించారు. 2014 ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ జయంత్ చౌధరీని ఓడించి హేమమాలిని గెలిచారు. ఆమె గెలుపునకు అనేక కారణాలున్నాయనీ, ‘జాట్ బహూ’ సెంటిమెంట్‌తో హేమమాలిని ఎమోషన్ అందుకు బాగా ఉపయోగపడిందనీ జాట్ సామాజిక వర్గానికే చెందిన స్థానికుడు ముఖేష్ చౌధరి అన్నారు. దీనికి తోడు మోదీ ఛరిష్మాకంటే «భర్త ధర్మేంద్రతో బంధం కూడా గత ఎన్నికల్లో పని చేసిందనీ, అయితే ఈసారి అది పనిచేస్తుందో లేదో దేవుడికే తెలియాలని గోవర్ధన్‌లో నివసించే జాట్ సామాజిక వర్గానికి చెందిన ప్రతిమా సింగ్ అభిప్రాయపడ్డారు. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకంలో భాగంగా 2014లో మథురలోని రావాల్ గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పటికీ ఆ గ్రామానికి హేమమాలిని ఒరగబెట్టిందేమీ లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికీ ఆ గ్రామంలో రోడ్లు అధ్వానంగా ఉంటాయనీ, హేమమాలిని ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ కూడా పని చేయడం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పంజాబ్‌లో గెలుపెవరిది?
సాక్షి నాలెడ్జ్ సెంటర్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి త్రిముఖ పోటీకి రంగం సిద్ధమైంది. మొత్తం 117 సీట్లకు వచ్చే నెల 4న పోలింగ్ జరుగుతుంది. శిరోమణి అకాలీదళ్–బీజేపీ సంకీర్ణ సర్కారు నేతగా ప్రకాశ్ బాదల్ గత పదేళ్లుగా సీఎం పదవిలో కొనసాగుతున్నారు. పంజాబ్ 1980 నుంచి 15 ఏళ్లు మతతత్వం – ఉగ్రవాదంతో ఇబ్బందులు పడిం ది. ఆ తర్వాత 20 ఏళ్లు రాజకీయ సుస్థిరత సాధ్యమైంది. అయితే రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక, సామాజిక సంక్షోభాలు చుట్టుముట్టాయి. దాదాపు 58% సిక్కులు, 38% హిందువులున్న పంజాబ్ ‘కల్చర్’(సంస్కృతి) అగ్రికల్చర్–అనే రీతిలో వ్యవసాయాభివృద్ధి సాధించింది. సాగునీటి సమస్య, పెరిగిన సాగు వ్యయం, అప్పుల బాధలతో రాష్ట్ర రైతాంగానికి ఆత్మహత్యలే దిక్కయ్యాయి. యువతలో నిరుద్యోగ సమస్య, మాదక ద్రవ్యాల వాడకం ఎక్కువైంది. ఈ పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 13 సీట్లలో పోటీ చేసి 4 గెలుచుకుంది. అకాలీ–బీజేపీ కూటమి, ప్రతిపక్షాలకు మరో ప్రత్యామ్నాయంగా కనిపించింది. మేలుకున్న కాంగ్రెస్ తమిళనాడులా ఇక్కడా ప్రతి ఐదేళ్లకు పాలకపక్షాన్ని జనం మారుస్తారనే అతి విశ్వాసంతో ఉన్న కాంగ్రెస్ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. అప్పుడు అకాలీదళ్ బలం 48 నుంచి 56 సీట్లకు పెరిగింది. కాంగ్రెస్ బలం 48 నుంచి 46కు తగ్గింది. డిప్యూటీ సీఎం సుఖ్బీర్సింగ్ ప్రచార వ్యూహం ఫలించింది. గణనీయ సంఖ్యలో ఎస్సీల్లోని చమార్(చర్మకారులు)లు అకాలీ–బీజేపీ కూటమికి ఓటేశారు. పటియాలా మాజీ సంస్థానాధీశుని కుమారుడైన కాంగ్రెస్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్‌కు ఇలా అనుకోని పరాజయం ఎదురైంది. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు ‘కెప్టెన్’ కొత్త ఎత్తుగడలతో సాగుతున్నారు. బీజేపీ మాజీ ఎంపీ నవజోత్‌సింగ్ సిద్ధూను కాంగ్రెస్‌కు చేరువ చేస్తున్నారు. ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిశోర్ మాటలను అనుసరిస్తున్నారు. బాదల్ కుటుంబంపై అవినీతి మచ్చ 1997 నుంచి అధికారంలో ఉన్నప్పుడల్లా సీఎం బాదల్ కుటుంబం అక్రమ మార్గాల్లో అడ్డగోలుగా సంపాదిస్తోందనే ఆరోపణలొస్తున్నాయి. మాదకద్రవ్యాల వ్యాపారం ఈ కుటుంబం మద్దతుతో సాగుతోందని ఆప్ నేత కేజ్రీవాల్ నిందిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రైవేటు బస్సుల్లో 60 శాతం బాదల్ కుటుంబ సభ్యుల ట్రాన్స్ పోర్ట్ కంపెనీలవే. ఇంకా మద్యం, మీడియా, హోటల్స్, ఇంధన రంగాల్లో ఈ కుటుంబానికి వ్యాపారాలున్నాయి. కాంగ్రెస్‌కు 62 సీట్లు! ఇండియాటుడే–యాక్సిస్ తాజా సర్వే.. పంజాబ్‌లో కాంగ్రెస్‌కు 56–62, ఆప్‌కు 36–41 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అకాలీ–బీజేపీ కూటమి 18–22 సీట్లతో కుదేలవుతుందని పేర్కొంది. రెండున్నరేళ్ల క్రితం రాష్ట్రంలో 3, దేశంలో 44 లోక్‌సభ సీట్లే సాధించి పరువు కోల్పోయిన కాంగ్రెస్ పంజాబ్‌లో గెలిస్తే పార్టీ పునరుత్తేజానికి దారులు పడతాయి. -
సాంగ్లీ జిల్లాలో రసవత్తరంగా ఎన్నికలపోరు
పింప్రి, న్యూస్‌లైన్: సాంగ్లీ జిల్లాలో మొత్తం ఎనిమిది నియోజక వర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలలో ఈసారి అన్ని పార్టీలు ఎన్నికల బరిలోకి దిగడంతో ఎవరి సత్తా ఎంటో తెలిసే అవకాశం ఉంది. జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్-ఎన్సీపీ-బీజేపీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. ఖానాపూర్...: ఇక్కడి నుంచి కాంగ్రెస్‌కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే సదాశివరావు పాటిల్ తిరిగి ఎన్నికల్లో పోటీ చేస్తుండగా, ఎన్సీపీ అభ్యర్థిగా అమర్ సిన్హా దేశ్‌ముఖ్, బీజేపీ నుంచి గోపీచంద్ పడల్కర్ బరిలోకి దిగగా ఎన్సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అనిల్ బాబర్‌ను శివసేన ఎన్నికల్లో పోటీకి నిలిపి పోటీని రసవత్తరంగా మార్చింది. ఈసారి సదాశివ్రావు గెలుపు అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాస్గావ్ (కవఠే మహాంకాళ్)...: ఇది ఎన్సీపీ స్టార్, ప్రచాకర్త, ఆర్ఆర్ పాటిల్ నియోజక వర్గం. ఇక్కడ ఆర్ఆర్ పాటిల్‌కు కార్యకర్తల అండ, నియోజక వర్గంలో బలమైన సామాజిక వర్గం అనుకూలాంశాలుగా ఉన్నాయి. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో కొంత కాలంగా ఇంటింటి ప్రచారంలో స్వతంత్ర అభ్యర్థి సంజయ్ కాకా తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. బీజేపీ కూడా ఆర్ఆర్ పాటిల్ ప్రతిష్టను తగ్గించేందుకు ఎన్సీపీకి చెందిన అజిత్ ఘోర్పడేకు టికెట్ ఇచ్చి బరిలోకి దింపగా, కాంగ్రెస్ పార్టీ సురేష్ శేండగేను నిలిపి పోటీని కొత్తపుంతలు తొక్కించింది. ఈసారి ఆర్ఆర్ పాటిల్ గెలుపు నల్లేరుపై నడక కాకపోవచ్చునని విశ్లేషకులు చెబుతున్నారు. పలుస్-కడేగావ్..: ముఖ్యమంత్రి కావాలని ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పతంగ్ రావు కదమ్ నియోజక వర్గం ఇది. పతంగ్రావును ప్రతిసారి ఎన్నికల్లో ఎదుర్కొంటు వస్తున్న పృథ్వీరాజ్ దేశ్‌ముఖ్ ఈసారి ఎన్నికల్లో గెలవాలని బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్సీపీ నుంచి శ్రామిక్ ముక్తి దళ్‌కు చెందిన మోహన్ యాదవ్ పోటీ చేస్తుండగా బీజేపీ-కాంగ్రెస్‌ల మధ్య గట్టిపోటీ నెలకొంది. సాంగ్లీ..: సాంగ్లీ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సంభాజీ పవార్‌కు కాకుండా ప్రముఖ నగల వ్యాపారి సుధీర్ గాడ్గిల్‌కు ఈసారి టిక్కెట్ ఇచ్చి ఎన్నికల్లో నిలపగా, శివసేన అభ్యర్థిగా పృథ్వీరాజ్ పవార్, కాంగ్రెస్ నుంచి మదన్ పాటిల్ బరిలో ఉన్నారు. ఈసారి బీజేపీ తన స్థానాన్ని నిలుపు కొంటుందో లేదో చెప్పడం కష్టంగా ఉంది. అన్ని ప్రధాన పార్టీలు పోటీని సవాలుగా తీసుకుంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మీరజ్...: మీరజ్ నుంచి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే సురేష్ ఖాడేకు బీజేపీ తిరిగి టిక్కెట్ ఇచ్చి ఎన్నికల్లో నిలిపింది. ఈసారి మీరజ్‌ను గెలుచుకోవాలని కాంగ్రెస్..ప్రొఫెసర్ సిద్ధార్థ్ జాదవ్‌ను నిలబెట్టగా కాంగ్రెస్ పార్టీకి చెందిన బాలాసాహెబ్ వాన్మోరేకు ఎన్సీపీ టిక్కెట్ ఇచ్చింది. శివసేన నుంచి తానాజీ సాత్పుతే, కాంగ్రెస్ రెబల్‌గా సీఆర్ సాంగలీకర్ స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు అన్ని వైపులా తలనొప్పులు మోదలయ్యాయి. బుజ్జగింపులతో నాయకులను ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. శిరాళా...: సిట్టింగ్ ఎమ్మెల్యే మాన్సింగ్రావు నాయిక్కు ఎన్సీపీ టిక్కెట్ ఇవ్వగా, బీజేపీ శివాజీరావు నాయిక్‌ను ఎన్నికల బరిలో దింపింది. కాంగ్రెస్‌పార్టీ సత్యజిత్ దేశ్‌ముఖ్‌ను నిలబెట్టింది. ఎన్సీపీ-బీజేపీల మధ్యనే పోటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి మాన్సింగ్ రావు ఓట్లను ఎంతవరకు చీల్చితే బీజేపీకి అంత లాభం అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక జయంత్ పాటిల్ ఎన్సీపీకి సపోర్ట్ చేస్తాడా, లేకపోతే బావమరిది అయిన సత్యజిత్‌కు సపోర్టు చేస్తాడా వేచి చూడాలి. జయంత్ పాటిల్ ఎవరికి అనుకూలంగా ప్రచారం చేస్తే వారికి విజయవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఇస్లాంపూర్...: ఇస్లాంపూర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జయంత్ పాటిల్ తిరిగి ఎన్సీపీ నుంచి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ జితేంద్ర పాటిల్‌ను నిలబెట్టి గట్టి పోటీ ఇవ్వాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే స్వతంత్య్ర అభ్యర్థిగా నానాసాహెబ్, శివసేన అభ్యర్థిగా భీంరావు మానే పోటీలో ఉన్నారు. జితేంద్ర పాటిల్ ఒక్కడే పోటీలో ఉన్నట్లయితే జయంత్ మరో నియోజకవర్గంలో ప్రచారం చేయడం కష్టమయ్యేది. ఇప్పుడు మిగిలిన నియోజకవర్గాలలో ప్రచారానికి సులువైంది. జత్...: ఆఖరు వరకు బీజేపీ అభ్యర్థిని ప్రకటించకుండా సస్పెన్స్ థ్రిల్లర్‌లా నడిచిన జత్ నుంచి ఎన్సీపీకి చెందిన విలాస్‌రావు జగతాప్‌కు బీజేపీ టికెట్ లభించింది. దీంతో ప్రస్తుత బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్ శేండగే మనస్థాపం చెంది ఎన్సీపీలోకి చేరి ఎన్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా విక్రమ్ సిన్హా సావంత్, శివసేన నుంచి సంగమేశ్వర్ తేలి పోటీలో ఉన్నారు. ఈ నియోజక వర్గంలో బీజేపీ-ఎన్సీపీల మధ్య గట్టిపోటీ నెలకొంది. సాంగ్లీ జిల్లా నుంచి మహా మహులు పోటీలో ఉన్నారు. అందులో ప్రస్తుత మంత్రులు హోం మంత్రి ఆర్ఆర్ పాటిల్, అటవీ, పునరావాస శాఖ మంత్రి పతంగ్‌రావు కదమ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జయంత్ పాటిల్‌తోపాటు విలాస్‌రావు జగతాప్లాంటి మహా నాయకులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. -
కన్నడ మొగ్గు ఎటు?
28 లోక్‌సభ స్థానాలకు రేపే పోలింగ్ వి.సురేంద్రన్, సాక్షి-బెంగళూరు: కర్ణాటకలోని 28 లోక్‌సభ స్థానాలకు గురువారం ఒకే దశలో ఎన్నికలు జరుగనున్నాయి. పాలక కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలకు ప్రతిష్టాత్మంగా మారిన ఈ ఎన్నికల్లో ఎవరిది పైచేయి అవుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 22 నియోజక వర్గాల్లో కాంగ్రెస్, బీజేపీలు ముఖాముఖి తలపడుతున్నాయి. నాలుగు చోట్ల కాంగ్రెస్-జేడీఎస్, బీజేపీ-జేడీఎస్‌ల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. మిగిలిన రెండు నియోజక వర్గాల్లో మూడు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లు ముక్కోణపు పోటీ నెలకొంది. 2009లో జరిగిన ఎన్నికల్లో 19 స్థానాలను గెలుచుకున్న బీజేపీ, నరేంద్ర మోడీ హవాతో ఈసారి ఒకట్రెండు సీట్లు అదనంగా గెలుచుకుంటామనే విశ్వాసంతో ఉంది. మరోవైపు ఈ పది నెలల కాలంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్‌ను ఒడ్డున పడవేయక పోతాయా అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆశాభావంతో ఉన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉత్తమ ఫలితాలు సాధించకపోతే, ప్రభుత్వ సారథులు తప్పుకోవాల్సి ఉంటుందనే అధిష్టానం హెచ్చరికలు సీఎంకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు తన పాలనపై రెఫరెండం కాబోదని ఆయన ముందుగానే చెప్పుకుంటున్నారు. 2009లో ఆరు స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్, ఈసారి కనీసం 15 స్థానాలనైనా చేజిక్కించుకోవాలని ఆశిస్తోంది. గత ఎన్నికల్లో మూడు స్థానాలను గెలుచుకున్న జేడీఎస్, ఈసారి వాటిని నిలుపుకోవడం గగనంగా కనిపిస్తోంది. కేంద్ర మంత్రులకు సంకటం ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కేంద్ర మంత్రులు మల్లికార్జున ఖర్గే(గుల్బర్గా), వీరప్ప మొయిలీ(చిక్బళ్లాపురం), కేహెచ్ మునియప్ప (కోలారు)లు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఖర్గే తన నియోజక వర్గానికి అనేక పనులు మంజూరు చేయించినా, ప్రభుత్వ వ్యతిరేకత ఆయనకు శాపంలా పరిణమిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత, స్థానికంగా వ్యక్తమవుతున్న నిరసన మొయిలీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఆయన నియోజక వర్గం ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోనే ఉన్నందున, విభజనపై ఆగ్రహ జ్వాలలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. 1991 నుంచి ఓటమి ఎరుగని మునియప్ప, ఈసారి గట్టి పోటీనే ఎదుర్కొంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరుగురు మాజీ సీఎం(కుమారస్వామి, డీవీ సదానంద గౌడ, బీఎస్ యెడ్యూరప్ప, ధరమ్‌సింగ్, దేవెగౌడ, మొయిలీ)లు పోటీపడుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మాజీ ప్రధాని కూడా అయిన జేడీఎస్ అధినేత దేవెగౌడకు ఇవే చివరి ఎన్నికలు కనుక స్థానిక ఓటర్లు అనుగ్రహిస్తారనే అంచనాలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థులు దాదాపుగా అన్ని నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్నా, వారి ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. కాంగ్రెస్ తరఫున రాహుల్, బీజేపీ తరఫున మోడీ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ తరఫున చిరంజీవి చిక్‌బళ్లాపురంలో రోడ్ షో నిర్వహించగా, ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ పక్కనున్న కోలారుతో పాటు రాయచూరు, గుల్బర్గాలో చివరి రోజు బీజేపీ తరఫున సుడిగాలి పర్యటన చేశారు. -
సీన్ మారింది!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: గతంలో మారిదిగా కంచుకోటలు లేవు.. సాలిడ్‌గా ఒక్కరికే ఓట్లు పడే పరిస్థితీ లేదు.. కానీ ఎన్నడూ లేనంత పోటీ మాత్రం ఉంది. ఎవరు ఏ పార్టీ తరఫున బరిలో ఉన్నారన్న విషయం కూడా ఇంకా జనంలోకి పోలే దు. ఈ సారి జంపింగ్‌లు కూడా అధికమే. మొత్తంగా చూసే జిల్లా రాజకీయ చిత్రం అస్పష్టంగా ఉంది. ఒక్కో అసెంబ్లీ స్థానం నుంచి రికార్డు సంఖ్యలో అభ్యర్థులు పోటీపడుతున్నారు. ప్రధాన పార్టీలు నువ్వానేనా అన్నట్టు తలపడుతున్నాయి. ఇక అదే స్థాయిలో స్వతంత్రులు కూడా అధిక సంఖ్యలోనే బరిలో ఉన్నారు. ఏ స్థానం చూసుకున్నా పోటీ హోరాహోరీగానే ఉంది. జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలకు కలిపి 2009లో 219 మంది అభ్యర్థులు పోటీ పడితే ఈ సారి 284 బరిలో నిలిచారు. పార్టీల బలాబలాలు సైతం తారుమారయ్యాయి. రాజకీయ విశ్లేషకులకు కూడా ఫలితం ఊహకందడం లేదు. అయితే ఏ పార్టీ అభ్య ర్థి గట్టెక్కినా నామమాత్రపు మెజార్టీలతోనే. గతంలో జిల్లాలో కాంగ్రెస్, టీడీపీల మధ్యే పోరు జరిగేది. 2009 ఎన్నికల్లో బీజేపీ, ప్రజారాజ్యం పార్టీలు కొన్ని స్థానాల్లో చెప్పుకోదగ్గ ఓట్లను సంపాదించాయి. కొన్ని స్థానాల్లో స్వతంత్రులు బరిలోకి దిగానా వారికి పోలైన ఓట్లు వందల్లోనే. కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నం. గత ఎన్నికలతో ఏ మాత్రం పోల్చుకునే పరిస్థితి. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీల మధ్య చతుర్ముఖ పోటీ ఉంది. కొన్ని స్థానాల్లో తిరుగుబాటుదారులు, స్వతంత్రులు ప్రధాన పార్టీల అభ్యర్థుల తలరాతలు మార్చేలా కనిపిస్తున్నారు. మరికొన్ని స్థానాల్లో పొత్తులు పొసగక కత్తులు నూరుకుంటున్నారు. గతంలో ఏక ఛత్రాధిపత్యం ప్రదర్శించిన పార్టీలు చతికిలపడ్డాయి. కొత్తగా తెరమీదకు వచ్చిన పార్టీలు రోజురోజుకూ పుంజుకుంటున్నాయి. సెంటిమెంటుదే అగ్రస్థానం తెలంగాణలోని మిగిలిన జిల్లాలతో పోల్చితే రంగారెడ్డిలో తెలంగాణ సెంటిమెంటు అంతగా లేనప్పటికీ గ్రామీణ నియోజకవర్గల్లో కాస్త కన్పిస్తోంది. అయితే వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్ల, మహేశ్వరం, మేడ్చల్ స్థానాల్లో ప్రాంతీయాభిమానమే ప్రధానాంశంగా ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వ వ్యతి రేకత, ధరల పెరుగుదల, అభివృద్ధి వంటి విషయాలు కూడా చెప్పుకోదగ్గ ప్రభావం చూపవచ్చు. ఇక రాజధాని నగ రం, పరిసరాల్లోని నియోజకవర్గాల్లో తెల ంగాణ సెంటిమెంటు ప్రభావం స్వల్పం. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్, ఎల్బీనగర్, మల్కాజిగిరి స్థానాల్లో సెంటిమెంటు ఏ మాత్రం వర్కవుటయ్యే పరిస్థితి లేదు. స్థానికేతర ఓటర్లు అధిక సంఖ్యలో నివసిస్తుండడమే ఇందుకు కారణం. రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నంలో కాస్త ప్రభావం చూపొచ్చు. ప్రతి ఓటూ విలువైనదే శాసనసభ ఎన్నికల్లో నెలకొన్న రసవత్తర పోరు దృష్ట్యా అన్ని పార్టీలూ అందుకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నాయి. ఏ ఒక్క విషయంలోనూ ప్రత్యర్థి కంటే తగ్గకూడదన్న ధోరణితో వ్యవహరిస్తున్నాయి. పోటీదారులు అధిక సంఖ్య లో ఉండడంతో ప్రతి ఓటూ విలువైనదేనన్న తరహాలో పార్టీ శ్రేణులకు అభ్యర్థులు దిశానిర్దేశం చేస్తున్నారు. -
ముక్కోణపు పోటీ తప్పదా..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని హైప్రొఫైల్ నియోజకవర్గాలలో ఒకటైన న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారన్నది ఈ లోక్‌సభ ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్, అప్పటి ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ను ఘోరంగా ఓడించిన తీరుతో లోక్‌సభ ఎన్నికలలో ప్రజల తీర్పుపై మరింత ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఏడు స్థానాల్లో, బీజేపీ మూడు స్థానాల్లో గెలిచినందువల్ల ప్రధాన పోటీ ఈ రెండు పార్టీల మధ్యనే ఉంటుందని కొందరు అంటుండగా, ఢిల్లీలో కాంగ్రెస్ గెలిచే అవకాశమున్న సీటు న్యూఢిల్లీ ఒక్కటేనని.. అందువల్ల ఇక్కడ ముక్కోణపు పోటీ జరుగుతుందని మరికొందరు అంటున్నారు. కాంగ్రెస్ ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీ అజయ్ మాకెన్‌కు టికెట్ ఇచ్చింది. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీజేపీ ప్రత్యర్థులను ఓడించిన మాకెన్‌కు ఈ ఎన్నికల్లో విజయం అంత సులువుగా లభించే సూచనలు కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు లభించిన ఘనవిజయం, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వీస్తోన్న పవనాలతో పాటు సామాన్యులకు అందుబాటులో ఉండని హైప్రొఫైల్ నేత అన్న ముద్ర ఆయనకు మైనస్ పాయింట్లుగా మారాయి. ఈ నియోజకవర్గం రూపురేఖలు గత పదేళ్లలో గణనీయంగా మారినప్పటికీ ఎన్నికల్లో విజయం సాధించడానికి అభివృద్ధి మంత్రమొక్కటే సరిపోదని ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో షీలాదీక్షిత్ పరాజయం రుజువు చేసింది. ఇదిలా ఉండగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ నియోజకవర్గంలో విజయం నల్లేరుపై నడకలా కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మధ్య తరగతి వర్గీయులకు ఆప్‌పై మక్కువ తగ్గడమే ఇందుకు కారణం. ఈ నియోజకవర్గ ఓటర్లలో 14.2 శాతం మధ్య తరగతివాసులు ఉన్నారు. ఇక్కడి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ పాత్రికేయుడు ఆశీష్ ఖేతాన్‌ను బరిలోకి దింపింది. స్థానికులను పక్కన బెట్టి బయటివ్యక్తికి టికెట్ ఇవ్వడంపై ఆ పార్టీలో నిరసన వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆయన సన్నిహితుడు అమిత్ షా కలసి ఒక మహిళపై నిఘా పెట్టారని ఆరోపిస్తూ ఆశీష్ ఖేతన్ తన వార్త పోర్టల్ ద్వారా విడుదల చేసిన ఆడియో టేప్ సంచలనం సృష్టించింది. నేరుగా నరేంద్ర మోడీపై ఆరోపణాస్త్రాలు ఎక్కుపెట్టిన ఖేతన్‌కు స్టింగ్ ఆపరేషన్ నిపుణుడిగా పాత్రికేయరంగంలో పేరుంది. బీజేపీ సుప్రీంకోర్టు న్యాయవాది మీనాక్షీలేఖికి టికెట్ ఇచ్చింది. పార్టీ ప్రతినిధిగా మీడియాలో పార్టీని గట్టిగా సమర్థించే నేతగా ఆమెకు గుర్తింపు ఉంది. అయితే మీనాక్షీ లేఖీకి సొంతంగా ఓట్లు సాధించే సత్తా లేదు. నమో మంత్రం, పార్టీ పేరు మీదనే ఆమెకు ఓట్లు లభిస్తాయి. -
మున్సిపల్ బరిలో 525 మంది
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : మున్సిపల్ ఎన్నికల బరిలో కీలకఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన మంగళవారం వివిధ పార్టీల అభ్యర్థులు పెద్ద ఎత్తున తమ నామినేషన్లు ఉపసహరించుకున్నారు. దీంతో జిల్లాలోని రెండు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీల్లో ఈనెల 30న 97 వార్డులకు జరగనున్న ఎన్నికల్లో మొత్తం 525 మంది బరిలో మిగిలారు. ఇల్లెందులో 24 వార్డులకు గాను 175 మంది, కొత్తగూడెంలో 33 వార్డులకు గాను 190 మంది, సత్తుపల్లిలో 20 వార్డులకు గాను 74 మంది, మధిరలో 20 వార్డులకు 86 మంది పోటీలో నిలిచారు. ఈ ఎన్నికలలో వైఎస్సార్సీపీ-సీపీఎం, కాంగ్రెస్-సీపీఐలు పొత్తు కుదుర్చుకోగా టీడీపీ స్వతంత్రంగానే బరిలో ఉంది. కొత్తగూడెంలో మాత్రం కాంగ్రెస్ ఒంటరిపోరు చేస్తుండగా, సీపీఐ-టీఆర్ఎస్లు అవగాహనకు వచ్చాయి. మొత్తంమీద నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన అనంతరం చాలా వార్డుల్లో త్రిముఖ పోటీ నెలకొంది. కొన్ని చోట్ల వివిధ పార్టీల రెబల్ అభ్యర్థులతో పాటు ఇతరులు కూడా బరిలో ఉండడంతో బహుముఖ పోటీ కూడా నెలకొంది. రెబల్స్‌కు సంబంధించి అధికార పార్టీలో ఎక్కువ మంది బరిలో ఉన్నారు. ఒక్క ఇల్లెందు మున్సిపాలిటీలోనే ఆ పార్టీ తరఫున 34 మంది రెబల్స్ బరిలో ఉన్నారని లెక్కలు చెపుతున్నాయి. మిగిలిన పార్టీలకు కూడా అక్కడక్కడా తిరుగుబాటు తలనొప్పి మిగిలింది. ‘బరి’ గీశారిలా.... నామినేషన్ల ఉపసంహరణ విషయానికి వస్తే కొత్తగూడెంలో అత్యధికంగా 105 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇక్కడ మొత్తం 309 నామినేషన్లు దాఖలైతే14 తిరస్కరణకు గురికాగా, ఉపసంహ రణలు పోను 190 మంది బరిలో ఉన్నారు. ఇల్లెందులో 255 మంది నామినేషన్లు దాఖలు చేయగా, తొమ్మిది తిరస్కరించారు. 71 మంది ఉపసంహరించుకుంటే 175 మంది బరిలో ఉన్నారు. మధిరలో 115 నామినేషన్లలో ఏడు తిరస్కరణకు గురయ్యాయి. 22 మంది ఉపసంహరించుకోగా 86 మంది పోటీలో ఉన్నారు. సత్తుపల్లి విషయానికొస్తే మొత్తం 109 నామినేషన్లు దాఖలయ్యాయి. 35 మంది ఉపసంహరించుకుంటే 74 మంది బరిలో నిలిచారు. ఇక్కడ ఒక్క నామినేషన్‌ను కూడా తిరస్కరించలేదు. ఇక తమ పార్టీల తరఫున రంగంలో దిగిన రెబల్స్‌ను బుజ్జగించేందుకు రాజకీయ పార్టీలు నానా తంటాలు పడ్డాయి. ఉపసంహరణలకు చివరిరోజు కావడంతో మంగళవారమంతా అన్ని పార్టీల నేతలు తమ అభ్యర్థులను బతిమిలాడే పనిలో బిజీగా గడిపారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు అనేక ఆర్థిక, రాజకీయ ఆఫర్లను కూడా ఇచ్చి తాత్కాలికంగా గండం నుంచి గట్టెక్కారు.