![కన్నడ మొగ్గు ఎటు? - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/81397587218_625x300.jpg.webp?itok=VVu_cajM)
కన్నడ మొగ్గు ఎటు?
28 లోక్‌సభ స్థానాలకు రేపే పోలింగ్
వి.సురేంద్రన్, సాక్షి-బెంగళూరు: కర్ణాటకలోని 28 లోక్‌సభ స్థానాలకు గురువారం ఒకే దశలో ఎన్నికలు జరుగనున్నాయి. పాలక కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీలకు ప్రతిష్టాత్మంగా మారిన ఈ ఎన్నికల్లో ఎవరిది పైచేయి అవుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 22 నియోజక వర్గాల్లో కాంగ్రెస్, బీజేపీలు ముఖాముఖి తలపడుతున్నాయి. నాలుగు చోట్ల కాంగ్రెస్-జేడీఎస్, బీజేపీ-జేడీఎస్‌ల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. మిగిలిన రెండు నియోజక వర్గాల్లో మూడు పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లు ముక్కోణపు పోటీ నెలకొంది.
2009లో జరిగిన ఎన్నికల్లో 19 స్థానాలను గెలుచుకున్న బీజేపీ, నరేంద్ర మోడీ హవాతో ఈసారి ఒకట్రెండు సీట్లు అదనంగా గెలుచుకుంటామనే విశ్వాసంతో ఉంది. మరోవైపు ఈ పది నెలల కాలంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్‌ను ఒడ్డున పడవేయక పోతాయా అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆశాభావంతో ఉన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉత్తమ ఫలితాలు సాధించకపోతే, ప్రభుత్వ సారథులు తప్పుకోవాల్సి ఉంటుందనే అధిష్టానం హెచ్చరికలు సీఎంకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు తన పాలనపై రెఫరెండం కాబోదని ఆయన ముందుగానే చెప్పుకుంటున్నారు. 2009లో ఆరు స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్, ఈసారి కనీసం 15 స్థానాలనైనా చేజిక్కించుకోవాలని ఆశిస్తోంది. గత ఎన్నికల్లో మూడు స్థానాలను గెలుచుకున్న జేడీఎస్, ఈసారి వాటిని నిలుపుకోవడం గగనంగా కనిపిస్తోంది.
కేంద్ర మంత్రులకు సంకటం
ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కేంద్ర మంత్రులు మల్లికార్జున ఖర్గే(గుల్బర్గా), వీరప్ప మొయిలీ(చిక్‌బళ్లాపురం), కేహెచ్ మునియప్ప (కోలారు)లు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఖర్గే తన నియోజక వర్గానికి అనేక పనులు మంజూరు చేయించినా, ప్రభుత్వ వ్యతిరేకత ఆయనకు శాపంలా పరిణమిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత, స్థానికంగా వ్యక్తమవుతున్న నిరసన మొయిలీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఆయన నియోజక వర్గం ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోనే ఉన్నందున, విభజనపై ఆగ్రహ జ్వాలలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. 1991 నుంచి ఓటమి ఎరుగని మునియప్ప, ఈసారి గట్టి పోటీనే ఎదుర్కొంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరుగురు మాజీ సీఎం(కుమారస్వామి, డీవీ సదానంద గౌడ, బీఎస్ యెడ్యూరప్ప, ధరమ్‌సింగ్, దేవెగౌడ, మొయిలీ)లు పోటీపడుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మాజీ ప్రధాని కూడా అయిన జేడీఎస్ అధినేత దేవెగౌడకు ఇవే చివరి ఎన్నికలు కనుక స్థానిక ఓటర్లు అనుగ్రహిస్తారనే అంచనాలు ఉన్నాయి.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థులు దాదాపుగా అన్ని నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్నా, వారి ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. కాంగ్రెస్ తరఫున రాహుల్, బీజేపీ తరఫున మోడీ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ తరఫున చిరంజీవి చిక్‌బళ్లాపురంలో రోడ్ షో నిర్వహించగా, ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ పక్కనున్న కోలారుతో పాటు రాయచూరు, గుల్బర్గాలో చివరి రోజు బీజేపీ తరఫున సుడిగాలి పర్యటన చేశారు.