బెంగళూరు : కర్ణాటక ఎన్నికల ప్రచారకర్త, టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ఈ సారి తన ఓటును వేయలేకపోతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన కల్పించిన ద్రవిడే తన ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నాడు. దీనికి ఓటరు జాబితా నుంచి రాహుల్ ద్రవిడ్ పేరు తొలగించడమే కారణం. ద్రవిడ్ బాధ్యతారహిత్యంగానే తన ఓటును కోల్పోయినట్లు తెలుస్తోంది. ద్రవిడ్ తన అడ్రస్ మార్చడంతో ఫార్మ్-7 ద్వారా ఓటును తీసేశారు. ఈ ఫార్మ్-7ను అతని సోదరుడు ఇచ్చినట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. కానీ ద్రవిడ్ మాత్రం ఫార్మ్-6తో మళ్లీ తనపేరును నమోదు చేసుకోవడంలో అలక్ష్యం వహించాడు. దీంతో ఏప్రిల్ 18న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయలేకపోతున్నాడు. ఈ విషయంపై మీడియా ఆ ప్రాంత ఎన్నికల అధికారులను వివరణ కోరగా.. తమ అధికారులు ద్రవిడ్ కొత్త అడ్రస్‌కు రెండు సార్లు వెళ్లారని, కానీ ద్రవిడ్ కటుంబసభ్యులు ఎవరు అనుమతించలేదని, అతను విదేశాల్లో ఉన్నాడని సమాధానమిచ్చినట్లు తెలిపారు.
ఎన్నికల నిబంధనల ప్రకారం ఫార్మ్-7ను కుటుంబ సభ్యులు ఎవరైనా సబ్‌మిట్ చేసి ఓటు తొలగించవచ్చు. కానీ ఓటు పొందాలంటే మాత్రం ఆ ఓటరే ఫార్మ్-6 అందజేయాలి. అయితే ఈ గడువు అయిపోయిన తర్వాత ద్రవిడ్‌కు ఈ విషయం తెలిసినట్లు సమాచారం. ఈ విషయంపై కర్ణాటక ఎలక్షన్ చీఫ్ సంజీకుమార్ మాట్లాడుతూ.. ‘అడ్రస్ మారడంతో ద్రవిడ్ తన ఓటును స్వచ్ఛందగా తొలిగించుకున్నారు. కానీ మళ్లీ ఓటును పొందే విషయాన్ని మరిచిపోయారు. ఇప్పుడు ఓటరు జాబితాలో అతని పేరును చేర్చడం చట్టపరంగా సాధ్యం కాదు. ఈ విషయంపై ఈసీఐ(కేంద్ర ఎన్నికల సంఘం) రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన చేయనుంది’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment