రాహుల్ ద్రవిడ్ ఓటు వేయలేడు!ఓటర్ల జాబితాలో పేరు గల్లంతయిన ప్రముఖుల్లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కూడా చేరారు. బెంగళూరులో ఉంటున్న ద్రవిడ్ ఈ నెల 18న జరిగే రెండో దశ పోలింగులో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో ఓటు వేయాల్సి ఉంది. అయితే, ఓటరు జాబితాలో పేరు లేకపోవడంతో ఆయనకు ఓటు వేసే అవకాశం ఉండదు. కర్ణాటకలో ఎన్నికల సంఘం ప్రచారకర్త అయిన రాహుల్ ద్రవిడ్ పేరే ఓటర్ల లిస్టులో లేకపోవడం విచిత్రం. జరిగిందేమిటని ఆరా తీస్తే, ఇందిరానగర్‌లో ఉండే ద్రవిడ్ దంపతులు ఈ మధ్య అశ్వత్‌నగర్‌కు మారారు. దాంతో ఇందిరా నగర్ పరిధిలో వారి ఓట్లు తొలగించాలని కోరుతూ ద్రవిడ్ సోదరుడు విజయ్ స్వయంగా ఎన్నికల సంఘానికి ఫారం 7 ద్వారా దరఖాస్తు చేశారు.
క్షేత్ర స్థాయి పరిశీలన జరిపిన ఎన్నికల అధికారులు అక్కడ పేరు తొలగించారు. అయితే, ఆయన అశ్వత్‌నగర్‌లో పేరు నమోదు చేసుకోలేదు. ఓటర్ల జాబితాలో పేరు చేర్చుకోవడానికి మార్చి 16 వరకు గడువు ఉంది. ఆ సమయంలో రాహుల్ విదేశాల్లో ఉండటంతో పేరు నమోదు చేసుకోవడం కుదరలేదు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఓటరు పేరు తొలగించడానికి కుటుంబ సభ్యులు ఎవరైనా ఫారం 7 ద్వారా ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేయవచ్చు. అయితే, పేరు నమోదుకు మాత్రం ఓటరే స్వయంగా ఫారం 6ను సమర్పించాల్సి ఉంటుంది. గడువులోగా రాహుల్ ఫారం 6 సమర్పించకపోవడంతో అశ్వత్‌నగర్‌లో ఆయన పేరు ఓటరు జాబితాలో చేరలేదు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఓటు విలువ గురించి, ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి ప్రచారం చేసిన రాహుల్ తాను మాత్రం ఓటు వేసే అవకాశం కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment