vote missing
-
ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
పుణె: ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ ప్రదీప్ వసంత్ నాయక్ సతీమణి ఓటు గల్లంతయింది. ఓటర్ల జాబితా నుంచి తన భార్య మధుబాల పేరు తొలగించడంపై ఎయిర్ చీఫ్ మార్షల్ ప్రదీప్ వసంత్ నాయక్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.సోమవారం ఉదయం పుణెలోని సాప్లింగ్ స్కూల్ బ్యానర్ రోడ్‌లోని పోలింగ్ బూత్ నంబరు26లో ఓటింగ్ ప్రారంభమైన వెంటనే ఏసీఎం నాయక్, తన భార్య, కుమారుడు వినీత్‌తో కలిసి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చారు. అయితే తన భార్య పేరు ఓటరు జాబితాలో కనిపించలేదు. విషయాన్ని అక్కడి అధికారి దృష్టికి తీసుకువెళ్లినప్పుడు, ఆయన నిస్సహాయత వ్యక్తం చేశారని ఏసీఎం నాయక్ పీటీఐకి చెప్పారు.“మేము పోలింగ్ కేంద్రానికి చేరుకున్నప్పుడు స్థానిక కార్పొరేటర్ ఇచ్చిన ఓటరు స్లిప్పులు మా వద్ద ఉన్నాయి. కానీ నా భార్య పేరు జాబితాలో లేదు”అని ఎయిర్స్ ఫోర్స్ మాజీ చీఫ్ వాపోయారు. పుణె సిట్టింగ్ ఎంపీ గిరీష్ బాపట్ మరణం తర్వాత బీజేపీ మాజీ మేయర్ మురళీధర్ మోహోల్‌ను పుణె లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీకి దింపింది. గత ఏడాది జరిగిన కస్బా అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీని ఓడించిన రవీంద్ర ధంగేకర్‌ను కాంగ్రెస్ రంగంలోకి దించింది. -
ఓటు కోసం నిరాహార దీక్ష
గల్లంతైన ఓటు కోసం ఎన్నికల విధుల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగి నిరాహార దీక్ష చేపట్టిన సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC)లో పనిచేసే ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్లో తన పేరు లేకపోవడంతో బెంగళూరులో నిరాహార దీక్ష చేపట్టారు.కేఎస్ఆర్టీసీకి చెందిన కెంగేరి డివిజన్లో అసిస్టెంట్ స్టోర్‌కీపర్‌గా పనిచేసే మల్లికార్జున్ స్వామి బుధవారం బెంగళూరు నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోని జేఎస్ఎస్ పబ్లిక్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు వెళ్లాడు. కానీ ఆయన పేరు ఓటరు జాబితాలో లేకపోవడంతో షాక్‌కు గురయ్యాడు. దీంతో హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోని పోలింగ్ కేంద్రం ఎదుట బైఠాయించి నిరసనకు దిగాడు.సంబంధిత అధికారులను సంప్రదించినా స్పందన లేకపోవడంతో నిరాహార దీక్ష చేపట్టినట్లు మల్లికార్జున్ తెలిపారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దక్షిణ బెంగళూరు లోక్‌సభ నియోజకవర్గంలోని బొమ్మనహళ్లి పోలింగ్ స్టేషన్లో మల్లికార్జున్‌ను అసిస్టెంట్ పోలింగ్ రిటర్నింగ్ ఆఫీసర్‌గా నియమించారు.ఎన్నికల విధులకు కేటాయించిన మరికొంత ఉద్యోగుల పేర్లు కూడా ఓటర్ల జాబితాలో కనిపించలేదని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ యుగంలో కూడా ఓటు హక్కును వినియోగించుకోలేని వ్యవస్థలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని ఆయన మండిపడ్డారు.మల్లికార్జున్ వాస్తవానికి చామరాజనగర్ జిల్లాలోని సోమనాథపుర గ్రామానికి చెందినవాడైనా ఇక్కడ ఓటర్ల జాబితాలో ఆయన పేరు నమోదైంది. కర్ణాటకలోని 14 లోక్‌సభ స్థానాలకు రెండో దశలో శుక్రవారం పోలింగ్ జరుగతోంది. -
రాహుల్ ద్రవిడ్ ఓటు వేయలేడు!
రాహుల్ ద్రవిడ్ ఓటు వేయలేడు!ఓటర్ల జాబితాలో పేరు గల్లంతయిన ప్రముఖుల్లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కూడా చేరారు. బెంగళూరులో ఉంటున్న ద్రవిడ్ ఈ నెల 18న జరిగే రెండో దశ పోలింగులో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో ఓటు వేయాల్సి ఉంది. అయితే, ఓటరు జాబితాలో పేరు లేకపోవడంతో ఆయనకు ఓటు వేసే అవకాశం ఉండదు. కర్ణాటకలో ఎన్నికల సంఘం ప్రచారకర్త అయిన రాహుల్ ద్రవిడ్ పేరే ఓటర్ల లిస్టులో లేకపోవడం విచిత్రం. జరిగిందేమిటని ఆరా తీస్తే, ఇందిరానగర్‌లో ఉండే ద్రవిడ్ దంపతులు ఈ మధ్య అశ్వత్నగర్కు మారారు. దాంతో ఇందిరా నగర్ పరిధిలో వారి ఓట్లు తొలగించాలని కోరుతూ ద్రవిడ్ సోదరుడు విజయ్ స్వయంగా ఎన్నికల సంఘానికి ఫారం 7 ద్వారా దరఖాస్తు చేశారు. క్షేత్ర స్థాయి పరిశీలన జరిపిన ఎన్నికల అధికారులు అక్కడ పేరు తొలగించారు. అయితే, ఆయన అశ్వత్‌నగర్‌లో పేరు నమోదు చేసుకోలేదు. ఓటర్ల జాబితాలో పేరు చేర్చుకోవడానికి మార్చి 16 వరకు గడువు ఉంది. ఆ సమయంలో రాహుల్ విదేశాల్లో ఉండటంతో పేరు నమోదు చేసుకోవడం కుదరలేదు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఓటరు పేరు తొలగించడానికి కుటుంబ సభ్యులు ఎవరైనా ఫారం 7 ద్వారా ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేయవచ్చు. అయితే, పేరు నమోదుకు మాత్రం ఓటరే స్వయంగా ఫారం 6ను సమర్పించాల్సి ఉంటుంది. గడువులోగా రాహుల్ ఫారం 6 సమర్పించకపోవడంతో అశ్వత్‌నగర్‌లో ఆయన పేరు ఓటరు జాబితాలో చేరలేదు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఓటు విలువ గురించి, ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి ప్రచారం చేసిన రాహుల్ తాను మాత్రం ఓటు వేసే అవకాశం కోల్పోయారు. -
శోభన కామినేని ఓటు గల్లంతు
సాక్షి, సిటీబ్యూరో: నాంపల్లి నియోజకవర్గం విజయనగర్‌కాలనీలో నివాసం ఉండే అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్ శోభన కామినేని ఓటు గల్లంతయింది. పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లిన ఆమె ఓటు వేసేందుకు నగరానికి వచ్చారు. తీరా పోలింగ్ కేంద్రానికి వెళ్లాక అక్కడ తన ఓటు తొలగించినట్లు తెలుసుకొని నివ్వెరపోయారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఓటు ఇప్పుడెలా పోయిందంటూ ఎన్నికల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశ పౌరురాలినైన తనకు ఇది ఎంతో విచారకరమైన రోజని ఆవేదన వ్యక్తం చేశారు. తాను దేశ పౌరురాలిని కాదా ? నాకు ఓటు ముఖ్యం కాదా ? అంటూ ప్రశ్నించారు. ఓటు వేశాననే సంతృప్తి కోసం చాలెంజ్ ఓటు వేయవచ్చునని సిబ్బంది చెప్పారని, లెక్కింపునకు నోచుకోని ఓటెందుకని ఆమె ప్రశ్నించారు. బీఎల్ఓపై వేటు.. శోభన కామినేని ఓటు తొలగింపునకు బాధ్యుడైన బీఎల్ఓ (బూత్ లెవెల్ ఆఫీసర్)గా విధులు నిర్వహిస్తున్న హెల్త్ విభాగం ఉద్యోగి ఓం ప్రకాశ్‌ను సస్పెండ్ చేయడంతోపాటు ఔట్సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నరేందర్‌రెడ్డిని సంబంధిత ఏజెన్సీకి సరెండర్ చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. మెహదీపట్న ం సర్కిల్లోని విజయనగర్‌కాలనీ పోలింగ్‌బూత్ 49లో శోభన కామినేనికి చట్టవిరుద్ధంగా రెండు ఓట్లున్నట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. ఈ రెండింటిలో ఒకదాన్ని తొలగించాల్సిందిగా సహాయ ఎన్నికల అధికారి బీఎల్ఓను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సంబంధిత 7ఏ నోటీసులు లిఖితపూర్వకంగా జారీ చేయకుండా శోభనకు చెందిన రెండు ఓట్లను బీఎల్ఓ తొలగించారు. చెక్ చేయకుండానే రెండు ఓట్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడంతో ఈ చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణకు ఎన్నికల ప్రక్రియలో శిక్షణ వ్యవహారాల నోడల్ ఆఫీసర్‌గా ఉన్న జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ డైరెక్టర్ శశికిరణాచారిని నియమించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఉపాసన శోభన ఓటు గల్లంతుపై ఆమె కుమార్తె ప్రము ఖ హీరో రామ్‌చరణ్ తేజ్ భార్య ఉపాసన ట్విట్టర్ వేదికగా స్పందిచారు. పది రోజుల క్రితం ఓటరు జాబితాలో ఉన్న తన తల్లి పేరు ఇప్పుడు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. తన తల్లి కూడా ప్రభుత్వానికి పన్ను కడు తోందని, భారత పౌరురాలిగా ఆమెకు విలువ లేదా? అంటూ ఘాటుగా స్పందించారు. -
ఓటు గల్లంతుపై శోభనా కామినేని ఫైర్
సాక్షి, హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్‌లో ఓట్ల గల్లంతు వ్యవహారం విమర్శలకు తావిస్తోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు విదేశాల నుంచి తిరిగివచ్చిన అపోలో హాస్పిటల్స్ చీఫ్ ప్రతాప్‌పెడ్డి కుమార్తె శోభనా కామినేని తన ఓటు గల్లంతైన విషయం తెలుసుకుని అధికారులపై మండిపడ్డారు. ఓటు వేసేందుకు నగరంలోని సంబంధిత పోలింగ్ కేంద్రానికి వెళ్లగా ఆమె ఓటును తొలగించారని అక్కడున్న సిబ్బంది తెలపడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన పోలింగ్ కేంద్రానికే తాను వెళ్లగా ఓటును తొలగించారని తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత పౌరురాలిగా తనకిది విచారకరమైన రోజని, తాను భారత పౌరురాలిని కాదా, ఈ దేశంలో తన ఓటు ముఖ్యం కాదా అంటూ ప్రశ్నించారు. పౌరురాలిగా తనకు జరిగిన అన్యాయాన్ని సహించనని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్‌లో భాగంగా గురువారం తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ స్ధానాలకు పోలింగ్ జరుగుతోంది. కాగా అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్‌రెడ్డి కుమార్తె, చేవెళ్ల లోక్‌సభ స్ధానం నుంచి బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్ధి కొండా విశ్వేశ్వరరెడ్డికి శోభనా కామినేని సమీప బంధువు కావడం గమనార్హం. -
మాజీ మంత్రి ఓటు తొలగింపుకు కుట్ర
సాక్షి, వైఎస్సార్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతోంది. ప్రజాస్వామ్య బద్దంగా నమోదు చేసుకున్న ఓట్లను వారి అనుమతి లేకుండానే అధికారుల అండతో ప్రభుత్వం తొలగిస్తోంది. అధికారుల, ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా వారిలో మాత్రం మార్పు రావడంలేదు. తాజాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి ఓటును తొలగించాలంటూ తనకు తెలియాకుండానే ఆన్లైన్లో అధికారులకు వినతిపత్రం అందింది. స్వయంగా ఆయనే దరఖాస్తు పెట్టుకున్నట్లు అధికారులకు ఫారం 7 సమర్పించారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో వివేకానంద రెడ్డి అనుమతి లేకుండా ఓటును తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. జిల్లాలోని పది నియోజకవర్గల్లో వైఎస్సార్ సీపీ సానూభూతిపరుల ఓట్లను టార్గెట్‌గా చేసుకుని ఆన్లైన్లోనే ఓట్ల తొలగింపు కార్యాకలపాలకు ప్రభుత్వం పాల్పడుతోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పులివెందులలోని బాకరాపురంలోని 134వ వార్డులో వివేకానంద రెడ్డి కలిగి ఉన్నారు. -
నికార్సయిన ఓటుకు ఏదీ దారి?
పంచాయతీ మొదలుకొని పార్లమెంటు వరకూ జరిగే వివిధ ఎన్నికలు సందేహాస్పదంగా, పరిహా సాస్పదంగా మారడం ప్రజాస్వామ్యానికెంతో చేటు తెస్తుంది. లక్షలాదిమంది నిజమైన ఓటర్ల పేర్లు జాబితాల నుంచి మాయం చేయడం, బోగస్ ఓటర్లను చేర్చడం వగైరా పనులకు పాల్పడుతున్న వారు చేస్తున్నది అదే. ఎన్నికల్లో వ్యక్తం కావలసిన పరిణత జనవాణికి పాతరేయడం, ప్రజాస్వా మ్యాన్ని నేతిబీరలో నెయ్యిగా మార్చడం ఈ దొంగ ఓట్ల సృష్టికర్తల ధ్యేయం. న్యూఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) పెద్దలను గురువారం కలిసిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు, ఇతర నాయ కులు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ప్రమేయంతో బోగస్ ఓట్లు వచ్చిచేరాయని ఫిర్యాదు చేశారు. మొత్తం 13 జిల్లాల్లోని 175 నియోజకవర్గాల్లో మూడు నెలలక్రితం విడుదలైన ఓటర్ల జాబి తాలను పోలింగ్ కేంద్రాలవారీగా అధ్యయనం చేశాక దాదాపు 35 లక్షలమంది నకిలీ ఓటర్లు ఉన్నట్టు ఆ పార్టీ గుర్తించింది. ఈ బోగస్ ఓట్లను వివిధ కేటగిరీల కింద విభజించి, దేనికింద ఎంత మంది ఉన్నారో వివరించింది. గత నెలలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ బోగస్ ఓటర్ల సంఖ్య దాదాపు 53 లక్షలు ఉండొచ్చని ఆరోపించారు. ఒక్క ఓటు తేడా కూడా గెలుపోటముల్ని నిర్ణ యించే వ్యవస్థ అమలవుతున్నచోట ఇలా లక్షలకొద్దీ బోగస్ ఓట్లు చలామణి కావడం ఎంత ప్రమా దకరమో వేరే చెప్పనవసరం లేదు. ఈ వ్యవహారం ఒకరో, ఇద్దరో వ్యక్తుల వల్ల అయ్యేది కాదు. కొన్ని ముఠాలు పనిగట్టుకుని కోట్ల రూపాయలు వెచ్చించి ఒక పథకం ప్రకారం చేయకపోతే ఇదంతా జరగదు. బోగస్ ఓట్ల తీరుతెన్నులు గమనిస్తే దీని వెనకున్న దొంగల సృజనాత్మకత బయటపడుతుంది. ఒకే గుర్తింపు కార్డుతో రెండుమూడు చోట్ల ఓట్లుండటం... పేరు, చిరునామాతోసహా అన్ని వివ రాలూ సక్రమంగా నమోదై ఉన్నా అసలు అలాంటి మనుషుల్లేకపోవడం, వయసు తేడాతో ఒకే పేరుండటం... తండ్రి పేరు/భర్త పేరు వేరుగా ఉండి ఒకే చిరునామా, పేరు ఉండటం... ఓటు నమోదుకు అవసరమైన కనీస వయసు కంటే తక్కువగా లేదా వందేళ్లకంటే ఎక్కువగా ఉండ టం–ఇలా అనేకానేక కేటగిరీల్లో ఈ బోగస్ ఓటర్లున్నారు. కొందరి వయసు చూస్తే వారు ప్రజా స్వామ్య భావనే లేని మొఘల్ కాలంలో పుట్టారా అన్న సందేహం తలెత్తుతుంది. ఒక వివాహిత వయసు అయిదేళ్లుగా నమోదైంది. ఇలా దొంగ ఓట్ల నమోదు మాత్రమే కాదు, నికార్సయిన ఓట ర్లలో తమకు వ్యతిరేకులని నిర్ధారణైనవారి ఓట్లను చడీ చప్పుడూ లేకుండా తొలగిస్తున్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియకు వినియోగించే సిబ్బంది కోసం, జాబితాల, గుర్తింపుకార్డుల ప్రచురణ కోసం ఈసీ కోట్లాది రూపాయలు వ్యయం చేస్తోంది. కానీ అక్రమార్కులు దానితో పోటీ పడి ఆ సిబ్బం దిని ప్రలోభపరిచి మరిన్నిరెట్లు అధికంగా ఖర్చు చేస్తున్నారు. నిజానికిది దేశద్రోహంతో సమా నమైన నేరం. కానీ దురదృష్టమేమంటే... ఈ నేరాన్ని పసిగట్టడానికి అవసరమైన ఉపకరణాలను రూపొందించుకోవడంలో, దొంగలను పట్టుకోవడంలో ఎన్నికల సంఘం పదే పదే విఫలమవు తోంది. ఒక రాజకీయ పార్టీ వివిధ ఉద్యమాల్లో, కార్యక్రమాల్లో తలమునకలవుతూ కూడా తనకున్న పరిమితుల్లో మూడు నెలల వ్యవధిలో ఇన్ని లక్షల నకిలీ ఓటర్లను గమనించి బట్టబయలు చేసిన ప్పుడు ఎన్నికల సంఘం ఇంకెంత చేయాలి? నిజానికి ప్రజాస్వామ్య ప్రక్రియను భ్రష్టు పట్టించడానికి కంకణం కట్టుకున్నవారు చేస్తున్న అనేకానేక పనుల్లో ఓటర్ల జాబితాను ఏమార్చడం ఒక అంశం మాత్రమే. మిగతావన్నీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించాక, కోడ్ అమల్లోకొచ్చాక మొదలవుతాయి. ప్రభుత్వ విభాగాలను విని యోగించుకుని అవసరమైన ప్రాంతాలకు డబ్బు మూటలు తరలించడం...తమ రాజకీయ ప్రత్య ర్థులను అక్రమ కేసులతో బెదిరించటం, భౌతికదాడులకు పూనుకోవటం, వారిపై లేనిపోని వదం తులు సృష్టించటం, ఓటర్లను ప్రలోభపర్చడానికి దొంగ వాగ్దానాలు చేయటం, డబ్బు పంపిణీ– ఇలా అనేకానేక మార్గాల్లో జనాభిప్రాయాన్ని వమ్ము చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దోషరహి తంగా ఓటర్ల జాబితాలను రూపొందించటంలోనే విఫలమవుతున్న ఎన్నికల సంఘం...ఇతర పెడ ధోరణుల్ని సరిచేయడంలోనూ అదే పోకడ కనబరుస్తోంది. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో రూ. 145 కోట్లు పట్టుబడ్డాయి. ఇందులో అత్యధిక భాగం ఆంధ్ర ప్రాంతంనుంచే తరలివచ్చిందని కథనాలు చెబుతున్నాయి. ఏ తనిఖీకీ దొరక్కుండా అంతకు ఎన్నో రెట్ల డబ్బు గమ్యస్థానాలకు చేరిందని అంటున్నారు. దేశంలో ఓటర్ల సంఖ్య 80 కోట్ల పైమాటే. కనుక నకిలీ ఓటర్లను పసిగట్టడం ప్రయాసతో కూడిన పనే కావొచ్చు. కానీ అసాధ్యమైతే కాదు. కావలసిందల్లా సంకల్పం. ఇప్పుడు ఉన్నత స్థాయి సాంకేతికత అందుబాటులోకొచ్చింది. ఐటీలో రూపొందిన కృత్రిమ మేథ ఎన్నో సంక్లిష్టతలను లిప్తపాటులో అధిగమించడానికి తోడ్పడుతోంది. అదీగాక మన దేశంలో ఆధార్ అమల్లోకొచ్చి పదేళ్ల వుతోంది. దాన్ని ఎన్నిటికో తప్పనిసరి చేస్తున్నారు. చాలాసార్లు సంక్షేమ పథకాలను ఎగ్గొట్టడానికి సాకుగా వాడుతున్నారు. కానీ ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలుపంచుకోవడానికి తప్పనిసరైన ఓటరు కార్డుకు మాత్రం ఎందుకు అనుసంధానించరు? ఓటర్ల జాబితాలో అవకతవకలున్నాయని నిర్ధారణ అయ్యాక కారకులపైనా, సూత్రధారులపైనా చర్యలెందుకు తీసుకోలేకపోతున్నారు? అవక తవకల జాబితా ఓటర్ల మొహానకొట్టి దొంగ ఓట్లున్నా, ఓటు మాయమైనా మా బాధ్యత లేదన్నట్టు ప్రవర్తించడం సరైందేనా? ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ చేసిన డిమాండ్ ధర్మబద్ధమైనది. దొంగ నోట్ల–దొంగ ఓట్ల రాజ్యాన్ని స్థాపించి, ఊపిరున్నంతవరకూ సింహాసనాన్ని అంటిపెట్టుకుని ఉండాలనుకునే కుట్రదారుల ఎత్తుల్ని అంతమొందించకపోతే ప్రజాస్వామ్యానికి అర్ధం లేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మేల్కొని సమగ్రమైన చట్టాన్ని రూపొందించటానికి పూనుకోవాలి. -
పొరపాటైంది.. క్షమించండి!
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితాలో పేర్లు కనిపించనందున ఓటు హక్కు వినియోగించుకోలేకపోయిన లక్షల మందికి.. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్ కుమార్ క్షమాపణలు కోరారు. ఓటు కోల్పోయామన్న బాధను చాలా మంది తనకే స్వయంగా ఫోన్ చేసి ఫిర్యాదు చేశారన్నారు. 2015లో నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఐఆర్‌ఈఆర్) కార్యక్రమంలో పొరపాట్లు జరిగాయని, నిబంధనలు పాటించకుండానే ఓట్లను తొలగించడంతో ఈ సమస్య ఉత్పన్నమైందని అంగీకరించారు. శుక్రవారం పోలింగ్ ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ సందర్భంగా పలుమార్లు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించామని, అయితే వీరెవరూ దరఖాస్తు చేసుకోకపోవడంతో ఓటేయలేకపోయారన్నారు. రెండు నెలల్లో 25 లక్షల మంది కొత్త ఓటర్లను జాబితాలో చేర్చామని, జాబితాలో పేరు ఉందో లేదో చూసుకోవాలని ప్రచారోద్యమం సైతం నిర్వహించామన్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఓటు తొలగింపుపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారికి ఆదేశించామన్నారు. వ్యక్తిగతంగా గుత్తా జ్వాలకు క్షమాపణలు తెలియజేశారు. ఓటరు జాబితాలో పేర్లను కోల్పోయిన వారు మళ్లీ ఓటరుగా దరఖాస్తు చేసుకోవాలని, ఈ నెల 26 నుంచి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఈసారి అత్యంత జాగ్రత్తగా ఓటర్ల జాబితా రూపొందిస్తామన్నారు. 2014లో అసెంబ్లీ, పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో 69.5 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈ సారి 67 శాతం వరకు నమోదైందన్నారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు, అవాంతరాలు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. ఎన్నికల్లో దాదాపు 2లక్షల మంది అధికారులు, సిబ్బంది, 50 వేల మంది పోలీసులు విధులు నిర్వహించారన్నారు. ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. రీ–పోలింగ్ ఉండకపోవచ్చు ఎన్నిక సందర్భంగా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు తమ దృష్టికి రానందున.. రీ–పోలింగ్‌కు అవకాశం ఉండకపోవచ్చని రజత్ కుమార్ తెలిపారు. పోలింగ్ అనంతరం ఈవీఎంలను అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య గోదాములకు తరలిస్తున్నామన్నారు. గోదాముల్లో 24గంటల విద్యుత్ సరఫరాతో పాటు సీసీ టీవీ కెమెరాల నిఘా ఉంటుందన్నారు. ఈ ఎన్నికల సందర్భంగా రికార్డు స్థాయిలో నగదు (రూ.117.2కోట్లు, మద్యం (5.4లక్షల లీటర్లు), ఇతర కానుకలు (రూ.9.2కోట్ల విలువైన బంగారం, వెండితోపాటు మాదక ద్రవ్యాలు) పట్టుబడ్డాయన్నారు. దీంతో మొత్తం స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ రూ.138 కోట్లకు చేరిందన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై 4292 ఫిర్యాదులు అందగా వాటన్నింటినీ.. పరిష్కరించామన్నారు. చాలా వరకు మానవ తప్పిదాల వల్లే ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించాయని రజత్‌కుమార్ పేర్కొన్నారు. పనిచేయని ఈవీఎంలు, వీవీ ప్యాట్ యంత్రాలను సాధ్యమైనంత త్వరగా మార్చి కొత్తవి ఏర్పాటు చేయడం ద్వారా పోలింగ్‌ను ప్రారంభించామని రజత్ కుమార్ తెలిపారు. -
ఐఏఎస్ అధికారి రాధా ఫ్యామిలీ ఓట్లు గల్లంతు
హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఓటర్ల జాబితా అస్తవ్యస్థంగా మారింది. ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ వరకూ వెళ్లి అక్కడ ఓటర్ల జాబితాలో పేరు లేకపోవటంతో పలువురు ఓటర్లు నిరాశగా వెనుదిరుగుతున్నారు. సామాన్యులతో పాటు ప్రముఖులు, ఉన్నత అధికారుల ఓట్లు గల్లంతు అయ్యాయి. ఐఏఎస్ అధికారి పి.రాధా కుటుంబ సభ్యుల ఓట్లు గల్లంతు అయ్యాయి. గత ఎన్నికల్లో ఓటు వేసినా ప్రస్తుతం వారి పేర్లు ఓటర్ల జాబితాలో మాయామయ్యాయి. దాంతో ఐఏఎస్ అధికారి పి.రాధా ఓట్ల గల్లంతుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఓటర్ కార్డు ఉన్నా... ఓటర్లు స్లిప్‌లు లేవంటూ ఓటు వేసేందుకు అభ్యంతరం చెప్పటంపై ఓటర్లు మండిపడుతున్నారు. ఓటర్ కార్డులను కూడా అధికారులు పరిగణనలోకి తీసుకోవటం లేదన్నారు. అలాంటప్పుడు కార్డులు ఎందుకు ఇచ్చారని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు.