గల్లంతైన ఓటు కోసం ఎన్నికల విధుల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగి నిరాహార దీక్ష చేపట్టిన సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC)లో పనిచేసే ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్‌లో తన పేరు లేకపోవడంతో బెంగళూరులో నిరాహార దీక్ష చేపట్టారు.
కేఎస్‌ఆర్‌టీసీకి చెందిన కెంగేరి డివిజన్‌లో అసిస్టెంట్ స్టోర్‌కీపర్‌గా పనిచేసే మల్లికార్జున్ స్వామి బుధవారం బెంగళూరు నగరంలోని హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లోని జేఎస్‌ఎస్ పబ్లిక్ స్కూల్ పోలింగ్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు వెళ్లాడు. కానీ ఆయన పేరు ఓటరు జాబితాలో లేకపోవడంతో షాక్‌కు గురయ్యాడు. దీంతో హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్‌లోని పోలింగ్ కేంద్రం ఎదుట బైఠాయించి నిరసనకు దిగాడు.
సంబంధిత అధికారులను సంప్రదించినా స్పందన లేకపోవడంతో నిరాహార దీక్ష చేపట్టినట్లు మల్లికార్జున్ తెలిపారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, దక్షిణ బెంగళూరు లోక్‌సభ నియోజకవర్గంలోని బొమ్మనహళ్లి పోలింగ్ స్టేషన్‌లో మల్లికార్జున్‌ను అసిస్టెంట్ పోలింగ్ రిటర్నింగ్ ఆఫీసర్‌గా నియమించారు.
ఎన్నికల విధులకు కేటాయించిన మరికొంత ఉద్యోగుల పేర్లు కూడా ఓటర్ల జాబితాలో కనిపించలేదని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ యుగంలో కూడా ఓటు హక్కును వినియోగించుకోలేని వ్యవస్థలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని ఆయన మండిపడ్డారు.
మల్లికార్జున్ వాస్తవానికి చామరాజనగర్ జిల్లాలోని సోమనాథపుర గ్రామానికి చెందినవాడైనా ఇక్కడ ఓటర్ల జాబితాలో ఆయన పేరు నమోదైంది. కర్ణాటకలోని 14 లోక్‌సభ స్థానాలకు రెండో దశలో శుక్రవారం పోలింగ్ జరుగతోంది.
Comments
Please login to add a commentAdd a comment