
ప్రపంచ బ్యాంక్ ఆదేశాల మేరకు అమరావతిలో వరద ముంపు నివారణ పనులు
ఇందుకోసం రూ.2,750.79 కోట్లతో ప్రణాళిక
కొండవీటి వాగు, పాలవాగు లోతు, వెడల్పు పెంపు
మూడు జలాశయాల నిర్మాణం.. ఉండవల్లి వద్ద వరద పంపింగ్ స్టేషన్
ఫలితంగా 21 గ్రామాల్లోని 5,288 మంది తరలింపు
సాక్షి, అమరావతి: ఎంత మంది నిపుణులు కాదన్నా, ఆ ప్రాంతం రాజధానికి పనికి రాదని పర్యావరణ వేత్తలు చెప్పినా.. రాజకీయ పంతంతో చెవికెక్కించుకోని చంద్రబాబు తీరు వల్ల రాష్ట్ర ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. రాజధానిలో వరద ముంపు తగ్గించేందుకు ఏకంగా 1995 ఎకరాల్లో వరద మౌలిక సదుపాయాల పనులు, పునరావాస ప్రణాళిక అమలు చేయాలని ప్రపంచ బ్యాంకు షరతు విధించింది. ఇందుకు అనుగుణంగా ఏపీ సీఆర్‌డీఏ వరద మౌలిక సదుపాయాల పనుల కోసం పునరావాస కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది.
వరద ముంపు ఉన్న చోటే రాజధాని నిర్మాణం చేపట్టడం, చేయడమే చంద్రబాబు విజనా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. వరద ముంపు నివారణ, పునరావాసం కోసమే వేల కోట్ల రూపాయలు వ్యయం చేయాల్సి వస్తోంది. వరద ప్రమాద తగ్గింపు పనులు చేపట్టేందుకు రూ.2,750.79 కోట్లు వ్యయం చేయనున్నట్లు సీఆర్‌డీఏ పునరావాస కార్యాచరణ ప్రణాళికలో స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను సీఆర్‌డీఏ ప్రపంచ బ్యాంకుకు అందజేసింది.

వరద తగ్గింపు పనులతో సీఆర్‌డీఏ పరిధిలోని 21 గ్రామాల్లోని 5,288 మందిని తరలించాల్సి ఉందని అందులో స్పష్టం చేసింది. వరద నివారణకు కొండవీటి వాగు, పాల వాగు లోతు పెంచడంతో పాటు వెడల్పు చేయనున్నారు. మూడు జలాశయాలను నిర్మించనున్నారు. వాగులకు గ్రీన్ బఫర్‌తో ఉండవల్లి వద్ద వరద పంపింగ్ స్టేషన్‌ను, నీటి శుద్ధి కర్మాగారం నిర్మించడంతోపాటు 15 నీటి పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులన్నీ పూర్తయితేనే అమరావతిలో వరద ముప్పు తగ్గుతుంది.
ప్రపంచ బ్యాంకు విధానాల మేరకే పనులు
ప్రపంచ బ్యాంకు, ఏడీబీ విధానాలకు అనుగుణంగా వరద తగ్గింపు పనులకు టెండర్లు, భూ సేకరణ ఉంటుందని సీఆర్‌డీఏ పేర్కొంది. ఈ పనుల వల్ల గ్రామాల్లోని వారిని ఇతర చోట్లకు తరలించాల్సి ఉందని, వారికి పునరావాస ప్లాట్ల కోసం స్థలాలు గుర్తించడమే కాకుండా పునరావాస లే అవుట్ల అభివృద్ధి, రహదారులు, విద్యుత్ కనెక్షన్లు, తాగునీరు, డ్రైనేజీ తదితర సౌకర్యాలను కల్పించాల్సి ఉందని తెలిపింది.
వరద తగ్గింపు పనుల వల్ల గ్రామాల ఉమ్మడి ఆస్తులైన ఏడు శ్మశాన వాటికలు, ఒక ఆలయ భూమి ప్రభావితం అవుతాయని, వీటి స్థానంలో రాజధాని నగర గ్రామాల అవసరాలను తీర్చడానికి తుళ్లూరు, నవులూరు, మందడంలో మూడు బహుళ–మత అంత్యక్రియల ప్రాంగణాలను నిర్మించాలని సీఆర్‌డీఏ ప్రతిపాదించింది. ఇళ్లు కోల్పోతున్న వారికి, అదే గ్రామాల్లో లేదా ఒకటి నుంచి రెండు కిలోమీటర్ల పరిధిలో పునరావాసం కల్పించనున్నారు. వరద తగ్గింపు పనులు చేపట్టేందుకు పెనుమాక, ఉండవల్లి, వెలగపూడిలో 12.09 ఎకరాలను 165 మందితో సంప్రదింపులు జరపడం ద్వారా సేకరిస్తున్నారు.
ఈ గ్రామాల్లో 70 గృహాలు, రెండు వాణిజ్య సముదాయాలు, 16 ఇతర నిర్మాణాలకు పరిహారం చెల్లించనున్నారు. మరో 100.67 ఎకరాలను 342 మంది రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ స్కీము ద్వారా సేకరిస్తారని సీఆర్‌డీఏ తెలిపింది. ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని పేర్కొంది. కాగా, వరద తగ్గింపు పనుల కోసం ప్రపంచ బ్యాంకు ఇప్పటికే రూ.1,742 కోట్లు విడుదల చేసింది.