రుణ డాక్యుమెంట్‌లో ప్రపంచ బ్యాంకు వెల్లడి
ముంపు నివారణకు భారీగా నిధులు వెచ్చించాల్సిందే
కేవలం వరద నివారణకే రూ.8,014.61 కోట్ల వ్యయం
కొండవీటి వాగు, పాల వాగు వెడల్పు చేయాల్సిందే
వరద నియంత్రణ, ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు 20 ప్యాకేజీలతో టెండర్లు
ఇవిగాక మరిన్ని చర్యలు చేపట్టాలని ప్రపంచ బ్యాంకు షరతు
ముక్కున వేలేసుకుంటున్న అధికారులు
ముంపులేని ప్రాంతంలో రాజధాని కడితే సగం ఖర్చు సరిపోతుందంటున్న నిపుణులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతికి ముంపు ముప్పు తప్పదని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. భారీ వర్షాలు, వరదలతో ఆ ప్రాంతమంతా ముంపునకు గురవుతుందని పేర్కొంది. వరద నియంత్రణకు కచ్చితమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఆ ప్రాంతంలో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం ఉన్నప్పటికీ.. కొండవీటి వాగుతోపాటు, పాలవాగు నుంచి వచ్చే వరద నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందేనని తేల్చింది. ఈ నేపథ్యంలో ముంపు నివారణకు భారీ వ్యయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
వరద నివారణ పనులు, ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ఏకంగా రూ.8,014.61 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసినట్టు ప్రపంచ బ్యాంకు రుణ డాక్యుమెంట్‌లో స్పష్టం చేసింది. గతంలోనే చంద్రబాబు ప్రభుత్వం వరద నియంత్రణ పేరుతో కొండవీటి వాగు పంపింగ్ స్టేషన్‌ను రూ.450 కోట్లతో నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి అదనంగా మొత్తం 20 ప్యాకేజీలలో వరద నియంత్రణ, ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులకు టెండర్లు ఆహ్వానించనున్నట్టు ప్రపంచ బ్యాంకు డాక్యుమెంట్‌లో స్పష్టం చేసింది.
విస్తుపోతున్న అధికారులు, నిపుణులు
వరద నివారణకు రూ.8,014.61 కోట్లు ఖర్చవుతుందని తెలిసి.. ఆ పనులు ప్రతిపాదించడం పట్ల అధికార యంత్రాంగం విస్తుపోతోంది. వరద ప్రాంతాల్లో రాజధాని నిర్మాణం చేపట్టాలనే ప్రభుత్వ ఆలోచనే లోపభూయిష్టంగా ఉందని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వరద నియంత్రణకు వెచ్చించే నిధుల్లో సగం ఖర్చుతోనే వరద ముంపులేని ప్రాంతంలో పరిపాలన భవనాలను నిర్మించవచ్చని అధికారులు, నిపుణులు పేర్కొంటున్నారు. రాజధాని పేరుతో అమరావతిలోనే రూ.వేల కోట్లు వెచ్చించేందుకు ప్రభుత్వం నిర్ణయించడం చూస్తుంటే.. మిగతా ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవనే విషయం స్పష్టమవుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
వరద నివారణ ప్రతిపాదనలు ఇలా..
ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు అమరావతి ప్రాంతంలో వరద ముంపును నివారించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ ప్రతిపాదనల్లో ముఖ్యాంశాలు ఇవీ.
⇒ కొండవీటి వాగును (23.60 కి.మీ.) వెడల్పు, లోతు చేయాలి.
⇒పాల వాగు (16.70 కి.మీ.) వెడల్పు, లోతు చేయాలి.
⇒ శాఖమూరు వద్ద 0.03 టీఎంసీ సామర్థ్యంతో 50 ఎకరాల్లో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి.
⇒ కొండవీటి వాగు వరద నీటిని గ్రావిటీ కెనాల్ (7.82 కి.మీ,) నిర్మాణం ద్వారా కృష్ణా నదికి మళ్లించాలి.
⇒ వర్షాకాలంలో అదనపు నీటిని డ్రెయినేజీలకు మళ్లించేందుకు కరకట్ట వద్ద పంపింగ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలి.
⇒ ఉండవల్లి వద్ద 7,500 క్యూసెక్యుల సామర్థ్యంతో వరద పంపింగ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాలి.
⇒ వరద నీటిని నిలుపుదల చేసేందుకు కృష్ణాయపాలెంలో 1.7 మీటర్ల ఎత్తు కట్టతో 90 ఎకరాల్లో 0.1 టీఎంసీ
నిల్వ సామర్థ్యంతో రిటెన్షన్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి.
⇒ శాఖమూరు వద్ద 50 ఎకరాల్లో 0.03 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి.
⇒ నీరుకొండలో 400 ఎకరాల్లో 0.4 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలి.
Comments
Please login to add a commentAdd a comment