
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో కొత్త ఫ్రాంఛైజీ తరఫున ఆడబోతున్నాడు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్. దాదాపు ఏడేళ్ల పాటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)కి ఆడిన ఈ హైదరాబాదీని.. మెగా వేలానికి ముందు ఆ ఫ్రాంఛైజీ వదిలేసింది. ఈ క్రమంలో రూ. 12.25 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సిరాజ్‌ను కొనుగోలు చేసింది.
బౌలర్ల కెప్టెన్
ఇక ఐపీఎల్-2025లో తమ తొలి మ్యాచ్‌లో భాగంగా గుజరాత్ మంగళవారం పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో ‘బోరియా సీజన్ సిక్స్’తో ముచ్చటించిన సిరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘శుబ్‌మన్ గిల్ (Shubman Gill) బౌలర్ల కెప్టెన్. గొప్ప సారథి.
బౌలర్లు ఏది అడిగినా.. కాదనడు. వాళ్లకు కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తాడు. స్వేచ్ఛనిస్తాడు. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. నేను, రిషభ్ పంత్, శుబ్‌మన్, అక్షర్ పటేల్.. కలిసి తరచుగా డిన్నర్లకు వెళ్తూ ఉంటాం. గిల్, నేను ఒకేసారి టెస్టుల్లో అడుగుపెట్టాము. అందుకే మా బంధం ఇంతగా బలపడి ఉంటుంది’’ అని గిల్‌తో తనకున్న స్నేహం గురించి చెప్పుకొచ్చాడు.
ఆయనొక లెజెండ్
ఇక గుజరాత్ కోచ్ ఆశిష్ నెహ్రా గురించి మాట్లాడుతూ.. ‘‘ఆయనొక లెజెండ్. నెహ్రా భాయ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లోనూ సంయమనం కోల్పోకుండా ఎలా ఉండాలో ఆయనను చూసే తెలుసుకున్నా. గతంలో షమీ భాయ్ ఈ ఫ్రాంఛైజీకి ఆడాడు.
నేను కూడా తనలా అద్భుతంగా ఆడి వికెట్లు తీయడం మీద మాత్రమే దృష్టి పెట్టాను. జట్టు విజయాల కోసం నా శాయశక్తులా కృషి చేస్తా’’ అని సిరాజ్ పేర్కొన్నాడు. ఇక ఈ సందర్భంగా చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టులో చోటు దక్కకపోవడం గురించి ప్రస్తావన రాగా.. ఈ హైదరాబాదీ పేసర్ హుందాగా స్పందించాడు.
అస్సలు జీర్ణించుకోలేకపోయా..
‘‘జట్టు గురించి ప్రకటన రాగానే తొలుత ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాను. ఐసీసీ ఈవెంట్ ఆడే జట్టులో నాకు చోటు లేదే అని బాధపడ్డాను. అయితే, జట్టు ప్రయోజనాల గురించే రోహిత్ భాయ్ ఆలోచిస్తాడని నాకు తెలుసు.
దుబాయ్‌లో పేసర్లకు పెద్దగా పని ఉండదని భాయ్‌కు తెలుసు. ఆయన ఎంతో అనుభవజ్ఞుడైన కెప్టెన్. అక్కడి పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటాయని ఆయనకు తెలుసు. అందుకే నన్ను పక్కనపెట్టాలని వాళ్లు నిర్ణయించుకున్నారు’’ అని సిరాజ్ పేర్కొన్నాడు.
విశ్రాంతి దొరికింది
ఏదేమైనా దేశం కోసం ఆడేటప్పుడు ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుందని.. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్ కోరుకుంటాడని సిరాజ్ అన్నాడు. ఇక చాంపియన్స్‌ట్రోఫీ జట్టులో లేనందు వల్ల తనకు చాలాకాలం పాటు విశ్రాంతి లభించిందని.. ఆ సమయాన్ని ఫిట్‌నెస్ మెరుగుపరచుకునేందుకు ఉపయోగించుకున్నానని తెలిపాడు.
కాగా పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆతిథ్యం ఇవ్వగా.. టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడింది. ఇక ఈ మెగా వన్డే టోర్నమెంట్లో గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను ఓడించిన రోహిత్ సేన.. సెమీస్‌లో ఆస్ట్రేలియాపై గెలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడింది.
ఇక సిరాజ్ చివరగా ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్ ఆడాడు. తదుపరి జూన్‌లో ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లే జట్టుకు అతడు ఎంపికయ్యే అవకాశం ఉంది. ఇక మళ్లీ పరిమిత ఓవర్ల జట్టులో తిరిగి స్థానం సంపాదించాలంటే సిరాజ్ మియా.. ఐపీఎల్-2025లో సత్తా చాటాల్సి ఉంటుంది.
చదవండి: ‘గిల్ ఒక్కడే ఏమీ చేయలేడు.. మేమంతా ఉంటేనే ఏదైనా సాధ్యం’
Comments
Please login to add a commentAdd a comment