
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 15) బిగ్ ఫైట్ జరుగనుంది. చండీఘడ్ వేదికగా పంజాబ్, కేకేఆర్ కత్తులు దూసుకోనున్నాయి. ఈ రెండు జట్లు చివరి సారి తలపడినప్పుడు పరుగుల వరద పారింది. 2024 సీజన్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ నిర్దేశించిన 262 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని పంజాబ్ మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే ఛేదించి చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది భారీ ఛేదన.
ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. ఫిల్ సాల్ట్ (37 బంతుల్లో 75; 6 ఫోర్లు, 6 సిక్సర్లు), సునీల్ నరైన్ (32 బంతుల్లో 71; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), వెంకటేశ్ అయ్యర్ (23 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (10 బంతుల్లో 28; ఫోర్, 3 సిక్సర్లు), రసెల్ (12 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసింది.
అనంతరం దాదాపుగా అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్.. జానీ బెయిర్‌స్టో విధ్వంసకర శతకంతో (48 బంతుల్లో 108 నాటౌట్; 8 ఫోర్లు, 9 సిక్సర్లు) విరుచుకుపడటంతో 18.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. పంజాబ్ ఆటగాళ్లలో బెయిర్‌స్టోతో పాటు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (24 బంతుల్లో 54; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), రిలీ రొస్సో (16 బంతుల్లో 26; ఫోర్, 2 సిక్సర్లు), శశాంక్ సింగ్ (28 బంతుల్లో 68 నాటౌట్; 2 ఫోర్లు, 8 సిక్సర్లు) విశ్వరూపం ప్రదర్శించారు.
నేటి మ్యాచ్‌లో అదే తరహాలో పరుగుల వరద పారాలని అభిమానులు ఆశిస్తున్నారు. పంజాబ్‌కు గత మ్యాచ్ తరహాలోనే బీభత్సం సృష్టించే అవకాశం ఉన్నా, కేకేఆర్ కాస్త మెత్తబడినట్లనిపిస్తుంది. ఈ సీజన్‌లోనూ కేకేఆర్‌లో అదే ఆటగాళ్లు (శ్రేయస్ మినహా) కనిపిస్తున్నా, ఎందుకో పంజాబ్ కంటే కాస్త బలహీనంగా కనిపిస్తుంది.
పంజాబ్, కేకేఆర్ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 33 మ్యాచ్‌ల్లో తలపడగా.. కేకేఆర్ 21, పంజాబ్ 12 మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఇటీవలకాలంలో ఈ ఇరు జట్లు తలపడినప్పుడు చెరో సారి విజయం పలకరించింది. చివరిసారి పంజాబ్ గెలవగా, అంతకుముందు కేకేఆర్, దానికి ముందు పంజాబ్ గెలిచాయి.
నేటి మ్యాచ్‌లో పంజాబ్ తమ స్టార్ బౌలర్ ఫెర్గూసన్ సేవలు కోల్పోయింది. గత మ్యాచ్‌లో గాయం కారణంగా ఫెర్గూసన్ సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. ఫెర్గూసన్ లేని కారణంగా పంజాబ్ గత మ్యాచ్‌లో (సన్‌రైజర్స్) 246 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని కూడా డిఫెండ్ చేసుకోలేకపోయింది.
ప్రస్తుత సీజన్‌లో కేకేఆర్ పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. విధ్వంసకర బ్యాటర్లు సునీల్ నరైన్, రసెల్, రింకూ సింగ్, వెంకటేశ్ అయ్యర్ పెద్దగా ఫామ్‌లో లేరు. ఈ సీజన్‌లో కేకేఆర్ బౌలర్ల ప్రదర్శనతో నెట్టుకొస్తుంది. పంజాబ్ విషయానికొస్తే.. ఈ సీజన్‌లో ఆ జట్టు బ్యాటింగ్ విభాగంలో అతి భయానకంగా కనిపిస్తుంది. ఇప్పటికే అన్‌క్యాప్డ్ ప్లేయర్ ప్రియాన్ష్ ఆర్య విధ్వంసకర సెంచరీ బాదగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు.
తుది జట్లు (అంచనా)..
పంజాబ్: ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్‌కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, వైషాక్ విజయ్‌కుమార్
కేకేఆర్: సునీల్ నరైన్, క్వింటన్ డి కాక్ (వికెట్‌కీపర్), అజింక్యా రహానే (కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, స్పెన్సర్ జాన్సన్/మొయిన్ అలీ, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా