
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 27) మధ్యాహ్నం కీలకమైన మ్యాచ్ జరుగనుంది. పాయింట్ల పట్టికలో వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముంబై సొంత మైదానమైన వాంఖడేలో ఈ మ్యాచ్ జరుగనుంది. ప్లే ఆఫ్స్ రేసులో ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా పరిగణించడుతుంది.
ఈ మ్యాచ్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ అభిమానులకు శుభవార్త తెలిసింది. గాయం కారణంగా ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లకు దూరంగా ఉన్న స్పీడ్ గన్ మయాంక్ యాదవ్.. నేటి మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడని సమాచారం. మయాంక్ రీఎంట్రీపై ఎల్‌ఎస్‌జీ మేనేజ్‌మెంట్ సోషల్‌మీడియా వేదికగా హింట్ ఇచ్చింది. వీడియోను రిలీజ్ చేస్తూ ముంబైతో జరుగబోయే మ్యాచ్‌లో ఓ భయంకరమైన శైలిని చూస్తారని సందేశాన్ని ఇచ్చింది.
Kal dikhega tabadtod andaz 👊💥 pic.twitter.com/xl0YU6vhY2
— Lucknow Super Giants (@LucknowIPL) April 26, 2025
మయాంక్ రాకతో ఎల్‌ఎస్‌జీ పేస్ విభాగం మరింత పటిష్టమవుతుంది. ఇప్పటికే ఆ జట్టు పేస్ విభాగం ఆవేశ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, ఆకాశ్‌దీప్‌లతో స్ట్రాంగ్‌గా ఉంది. మయాంక్ జట్టులో చేరితే మరో పేసర్ ప్రిన్స్ యాదవ్‌పై వేటు పడే అవకాశం ఉంది. వెన్ను గాయం కారణంగా మయాంక్ ఈ సీజన్ తొలి అర్ద భాగానికి దూరంగా ఉన్నాడు. రాజస్థాన్, ఢిల్లీ మ్యాచ్‌లకు ఇంపాక్ట్ ప్లేయర్ల జాబితాలో ఉన్నప్పటికీ బౌలింగ్ చేసే అవకాశం రాలేదు.
మయాంక్ గత ఐపీఎల్ సీజన్‌లో 150 కిమీ పైగా వేగంతో బంతులు సంధించి వెలుగులోకి వచ్చాడు. గత సీజన్ ప్రదర్శనల కారణంగా మయాంక్ టీమిండియాలో సైతం చోటు దక్కించుకున్నాడు. భారత జట్టుకు ఆడుతూ సత్తా చాటిన మయాంక్.. గతేడాది అక్టోబర్‌లో బంగ్లాదేశతో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు.
అప్పటి నుంచి అతను వెన్ను మరియు కాలి బొటన వేలు సమస్యలతో బాధపడుతూ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుత కీలక తరుణంలో మయాంక్ రీఎంట్రీ లక్నో టీమ్‌కు కొండంత బలాన్ని ఇస్తుంది. మయాంక్ తన స్పీడ్‌తో ఫలితాలను తారుమారు చేయగలడు.
ఇదిలా ఉంటే, ఈ సీజన్‌లో లక్నో, ముంబై ఇండియన్స్ తలపడటం ఇది రెండో సారి. ఏప్రిల్ 4న జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబైపై లక్నో 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.
ఓపెనర్లు మిచెల్ మార్ష్ (60), మార్క్రమ్ (53) అర్ద సెంచరీలతో రాణించగా.. బదోని (30), మిల్లర్ (27) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. హార్దిక్ పాండ్యా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.
అనంతరం ఛేదనలో ముంబై గెలుపు దరిదాపుల్లోకి వచ్చి ఓటమిపాలైంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది. దిగ్వేశ్ రాఠీ (4-0-21-1) ముంబైని ఇబ్బంది పెట్టాడు. నమన్ ధీర్ (46), సూర్యకుమార్ యాదవ్ (67) ముంబైని గెలిపించేందుకు విఫలయత్నం చేశారు.
ఆఖర్లో హార్దిక్ తిలక్ వర్మను రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్‌కు పంపాడు. అతని స్థానంలో వచ్చిన సాంట్నర్ ప్రభావం చూపలేకపోయాడు. ఆఖరి ఓవర్‌లో హార్దిక్ ఓవరాక్షన్ చేసి తిలక్‌కు బదులుగా వచ్చిన సాంట్నర్‌కు స్ట్రయిక్ ఇవ్వలేదు. చివరి ఓవర్‌ను ఆవేశ్ ఖాన్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు.