
Photo Courtesy: BCCI
ఐపీఎల్‌లో ఇవాళ (ఏప్రిల్ 27) రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కాబోయే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీని ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీ హోం గ్రౌండ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగనుంది. ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకునే విషయంలో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా పరిగణించబడుతుంది.
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ, ఆర్సీబీ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించగా.. ఆర్సీబీ తొమ్మిదింట ఆరు గెలిచి అదే 12 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఇరు జట్ల రన్‌రేట్‌లు కూడా దగ్గరగా ఉన్నాయి. ఢిల్లీ 0.657 రన్‌రేట్‌తో ఆర్సీబీ (0.482) కంటే కాస్త మెరుగ్గా ఉంది.
ఇరు జట్లు ఈ సీజన్‌లో తలపడటం ఇది రెండో సారి. ఏప్రిల్ 10న ఆర్సీబీ ఇలాకా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ (93 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీని ఒంటిచేత్తో గెలిపించాడు. మ్యాచ్ అనంతరం 'ఇది నా అడ్డా' అంటూ రాహుల్ చేసుకున్న సెలబ్రేషన్స్ సోషల్‌మీడియాలో వైరలయ్యాయి.
ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో విప్రాజ్ నిగమ్ (4-0-18-2), కుల్దీప్ యాదవ్ (4-0-17-2), ముకేశ్ కుమార్ (3-1-26-1), మోహిత్ శర్మ (2-0-10-1) అద్భుతంగా బౌలింగ్ చేసి ఆర్సీబీని కట్టడి చేశారు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో సాల్ట్ (37), కోహ్లి (22), రజత్ పాటిదార్ (25), కృనాల్ పాండ్యా (18), టిమ్ డేవిడ్ (37 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఆఖర్లో డేవిడ్ చెలరేగడంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఢిల్లీ కూడా తొలుత తడబడింది. ఆ జట్టు 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రాహుల్, స్టబ్స్ (38 నాటౌట్) ఢిల్లీని ఆదుకుని విజయతీరాలకు చేర్చారు. ఆర్సీబీ బౌలర్లలో భువీ 2, యశ్ దయాల్, సుయాశ్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.
ఈ మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి ఆర్సీబీ నేటి మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. ఆర్సీబీ ప్రత్యర్థుల సొంత మైదానల్లో అపజయమనేదే లేకుండా దూసుకుపోతుంది. నేటి మ్యాచ్ ఢిల్లీ హోం గ్రౌండ్‌లో కావడంతో ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ తప్పక గెలుస్తుందని అంతా అనుకుంటున్నారు.
ఈ సీజన్‌లో ఆర్సీబీ విజయాల్లో ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కీలకపాత్ర పోషిస్తున్నాడు. విరాట్ 30కి పైగా స్కోర్ చేసిన ప్రతి మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచింది. విరాట్ విఫలమైన మూడు మ్యాచ్‌ల్లో (గుజరాత్‌పై 7, ఢిల్లీపై 22, పంజాబ్‌పై 1) ఆర్సీబీ ఓడింది. ఈ లెక్కన చూస్తే నేడు ఢిల్లీతో జరుగబోయే మ్యాచ్‌లో విరాట్ 30కి పైగా స్కోర్ చేస్తే ఆర్సీబీ గెలవడం ఖాయమని సెంటిమెంట్లు చెబుతున్నాయి. ఈ సీజన్‌లో విరాట్ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 5 హాఫ్ సెంచరీల సాయంతో 392 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.