
Photo Courtesy: BCCI
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి హవా కొనసాగుతుంది. నిన్న (ఏప్రిల్ 27) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ చేసిన అతను.. లీడింగ్ రన్ స్కోరర్‌గా అవతరించాడు. ఈ సీజన్‌లో విరాట్ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 6 అర్ద సెంచరీల సాయంతో 443 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ద సెంచరీలు ఛేజింగ్‌లో చేసినవే కావడం విశేషం.
ఫార్మాట్ ఏదైనా విరాట్‌కు ఛేజింగ్ మాస్టర్‌గా బిరుదు ఉంది. ఆ బిరుదుకు విరాట్ మరోసారి సార్థకత చేకూర్చాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ ఛేజింగ్‌కు దిగిన నాలుగు సందర్భాల్లో విరాట్ 4 అర్ద సెంచరీలు చేసి తన జట్టును గెలిపించాడు. ఇందులో మూడు సార్లు నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. గతేడాది టీ20 వరల్డ్‌కప్ తర్వాత అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించినా విరాట్‌లో ఇంకా చేవ తగ్గలేదు.
బ్యాటర్‌గా సూపర్ ఫామ్‌లో ఉండటమే కాకుండా తన జట్టును దాదాపు ప్రతి మ్యాచ్‌లో గెలిపిస్తున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో విరాట్ విఫలమైన మ్యాచ్‌ల్లో మాత్రమే ఆర్సీబీ ఓడింది. విరాట్ 30కి పైగా స్కోర్ చేసిన ప్రతి మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచింది. అంతలా విరాట్ ఈ యేడు ఆర్సీబీ విజయాలను ప్రభావితం చేస్తున్నాడు. ప్రస్తుతం విరాట్‌ను చూస్తుంటే కెరీర్‌లో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నాడు.
ఇదే జోరును అతను మరో ఐదారు మ్యాచ్‌లు కొనసాగిస్తే ఆర్సీబీ ఈసారి టైటిల్ గెలవడం ఖాయం. ఆర్సీబీ ఈ సీజన్‌లో గతంలో ఎన్నడూ లేనంత జోష్‌లో కనిపిస్తుంది. జట్టులో అందరూ రాణిస్తున్నారు. కెప్టెన్‌గా పాటిదార్ తన బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తిస్తున్నాడు. కోహ్లి భీకర ఫామ్‌లో ఉన్నాడు. బౌలర్లలో హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్ అత్యుత్తమంగా రాణిస్తున్నారు. కృనాల్ ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్‌లతో అదరగొడుతున్నాడు. పడిక్కల్, టిమ్ డేవిడ్ ఇరగదీస్తున్నారు.
పాటిదార్ బ్యాటర్‌గా ఓ మోస్తరు ప్రదర్శనలతో పర్వాలేదనిపిస్తున్నాడు. జితేశ్ శర్మ, రొమారియో షెపర్డ్‌కు తమను తాము నిరూపించుకునే అవకాశం రాలేదు. యువ స్పిన్నర్ సుయాశ్ శర్మ వికెట్లు తీయలేకపోయినా అత్యంత పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. పేసర్ యశ్ దయాల్ నాట్ బ్యాడ్ అనిపిస్తున్నాడు.
విరాట్ ఓపెనింగ్ పార్ట్‌నర్‌గా ఎవరూ సెట్ కాకపోవడమే ప్రస్తుతం ఆర్సీబీ వేధిస్తున్న ఏకైక సమస్య. సాల్ట్ ఓ మ్యాచ్‌లో మెరిసినా మిగతా అన్ని మ్యాచ్‌ల్లో తేలిపోయాడు. నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో జేకబ్ బేతెల్‌ను ప్రయోగించినా అతను కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ ఒక్క సమస్యను పక్కన పెడితే ఈ సీజన్‌లో ఆర్సీబీ టైటిల్ ఫేవరెట్లలో ముందు వరుసలో ఉంది.
కాగా, నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీని ఆర్సీబీ బౌలర్లు 162 పరుగులకే పరిమితం చేశారు. భువీ 3, హాజిల్‌వుడ్ 2, యశ్ దయాల్, కృనాల్ తలో వికెట్ తీసి ఢిల్లీని స్వల్ప స్కోర్‌కే కట్టడి చేశారు. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ (41), ట్రిస్టన్ స్టబ్స్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
అనంతరం ఛేదనకు దిగిన ఆర్సీబీ పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయినా ఆతర్వాత కోలుకుంది. విరాట్ (47 బంతుల్లో 51; 4 ఫోరు), కృనాల్ (47 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) టైమ్ తీసుకుని ఇన్నింగ్స్‌ను నిర్మించి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు.
టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) ఆఖర్లో వేగంగా ఆడి మ్యాచ్‌ను ముగించాడు. ఆల్‌రౌండ్ షోతో సత్తా చాటిన కృనాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సీజన్‌లో ఆర్సీబీ ఇంకా నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. తదుపరి మ్యాచ్‌లో (మే 3) సీఎస్‌కేతో (బెంగళూరులో) తలపడనుంది.