
ఢిల్లీపై ఆర్‌సీబీ ఘన విజయం
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి
కృనాల్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శన
కోహ్లి అర్ధ సెంచరీ
దాదాపు రెండు వారాల క్రితం బెంగళూరు వేదికగా ఢిల్లీ, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్... 163 పరుగులు చేసిన ఆర్‌సీబీ ఓటమి పాలైంది. అద్భుత ప్రదర్శనతో గెలిపించిన ‘లోకల్ ప్లేయర్’ కేఎల్ రాహుల్ మ్యాచ్ ముగిశాక ‘ఇది నా అడ్డా’ అన్నట్లుగా కాంతారా స్టయిల్‌లో సంబరం చేసుకున్నాడు. ఇప్పుడు అవే రెండు జట్ల మధ్య వేదిక ఢిల్లీకి మారింది. మ్యాచ్‌పై చర్చ కూడా కోహ్లి వర్సెస్ రాహుల్‌గానే సాగింది.
ఈసారి ఆర్‌సీబీ విజయలక్ష్యం అదే 163 పరుగులు... 26/3తో బెంగళూరు కష్టాల్లో పడినట్లు కనిపించినా... కోహ్లి, కృనాల్ పాండ్యా శతక భాగస్వామ్యంతో ఆర్‌సీబీ ఘన విజయాన్ని అందుకొని బదులు తీర్చుకుంది. ఈసారి బ్యాటింగ్‌లో పరుగులు చేసేందుకు రాహుల్ తీవ్రంగా ఇబ్బంది పడగా... ‘దిల్లీవాలా’ కోహ్లి చక్కటి ఆటతో బెంగళూరు విజయానికి బాటలు వేశాడు. మ్యాచ్ ముగిశాక ప్రతీకార శైలిలో కోహ్లి విజయనాదం చేశాడు.
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య సమరం 1–1తో సమంగా ముగిసింది. సొంతగడ్డపై గత మ్యాచ్‌లో ఓడిన బెంగళూరు ఈసారి ప్రత్యర్థి మైదానంలో విజయాన్ని అందుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.
కేఎల్ రాహుల్ (39 బంతుల్లో 41; 3 ఫోర్లు), ట్రిస్టన్ స్టబ్స్ (18 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే ఫర్వాలేదనిపించగా, భువనేశ్వర్ 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అనంతరం బెంగళూరు 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 165 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కృనాల్ పాండ్యా (47 బంతుల్లో 73 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (47 బంతుల్లో 51; 4 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 84 బంతుల్లో 119 పరుగులు జోడించి జట్టును గెలిపించారు.
బ్యాటింగ్ తడబాటు...
అభిషేక్ పొరేల్ (11 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టబ్స్ కలిసి 29 బంతుల్లో 62 పరుగులు చేయగా... మిగతా బ్యాటర్లంతా కలిసి 92 బంతుల్లో 96 పరుగులు మాత్రమే సాధించడం ఢిల్లీ బ్యాటింగ్ పరిస్థితిని చూపిస్తోంది. భువనేశ్వర్ ఓవర్లో 2 సిక్స్‌లతో ధాటిని ప్రదర్శించిన పొరేల్ ఎక్కువ సేపు నిలవలేకపోగా, కరుణ్ నాయర్ (4) విఫలమయ్యాడు. పవర్‌ప్లేలో జట్టు 52 పరుగులు చేసింది. అయితే ఆపై ఆర్‌సీబీ స్పిన్నర్లు సుయాశ్, కృనాల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగుల రాక కష్టంగా మారిపోయింది.
ఈ ఇద్దరు బౌలర్లు కలిసి 8 ఓవర్లలో 2 ఫోర్లు, 1 సిక్స్ సహా 50 పరుగులు మాత్రమే ఇచ్చారు. ఒత్తిడిలో డుప్లెసిస్ (22), అక్షర్ పటేల్ (15) వెనుదిరగ్గా... రాహుల్ కూడా షాట్లు ఆడేందుకు బాగా ఇబ్బంది పడ్డాడు. భువీ ఒకే ఓవర్లో రాహుల్, అశుతోష్ (2)లను అవుట్ చేయడంతో ఢిల్లీ 17 ఓవర్లలో 120/6 వద్ద నిలిచింది. అయితే స్టబ్స్ దూకుడుగా ఆడటంతో తర్వాతి రెండు ఓవర్లలో 36 పరుగులు వచ్చి స్కోరు 150 దాటింది.
కీలక భాగస్వామ్యం...
ఛేదనలో బెంగళూరుకు సరైన ఆరంభం లభించలేదు. ఆరు పరుగుల వ్యవధిలో బెథెల్ (12), పడిక్కల్ (0), పాటీదార్ (6) వెనుదిరగడంతో స్కోరు 26/3 వద్ద నిలిచింది. ఈ దశలో కోహ్లి, కృనాల్ కలిసి చక్కటి సమన్వయంతో జట్టును ఆదుకున్నారు. ఆరంభంలో జాగ్రత్తగా ఆడినా... నిలదొక్కుకున్న తర్వాత కృనాల్ ధాటిని పెంచాడు. 8 ఓవర్లలో 85 పరుగులు చేయాల్సిన సమయంలో తర్వాతి 3 ఓవర్లలో బెంగళూరు 36 పరుగులు రాబట్టడంతో పని సులువైంది.
ఈ క్రమంలో సిక్సర్లతో చెలరేగిన కృనాల్ 38 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. 2016 సీజన్‌లో తన ఏకైక హాఫ్ సెంచరీని సాధించిన కృనాల్ ఇన్నేళ్లకు మళ్లీ ఆ మార్క్‌ను దాటడం విశేషం. ఆ తర్వాత కోహ్లి కూడా 45 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. విజయానికి 18 పరుగుల దూరంలో కోహ్లి అవుటైనా... కృనాల్, టిమ్ డేవిడ్ (5 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కలిసి 9 బంతుల ముందే మ్యాచ్‌ను ముగించారు.

స్కోరు వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: పొరేల్ (సి) జితేశ్ శర్మ (బి) హాజల్‌వుడ్ 28; డుప్లెసిస్ (సి) కోహ్లి (బి) కృనాల్ 22; కరుణ్ నాయర్ (సి) భువనేశ్వర్ (బి) దయాళ్ 4; రాహుల్ (సి) బెథెల్ (బి) భువనేశ్వర్ 41; అక్షర్ (బి) హాజల్‌వుడ్ 15; స్టబ్స్ (సి) హాజల్‌వుడ్ (బి) భువనేశ్వర్ 34; అశుతోష్ (బి) భువనేశ్వర్ 2; విప్‌రాజ్ (రనౌట్) 12; స్టార్క్ (నాటౌట్) 0; చమీరా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–33, 2–44, 3–72, 4–102, 5–118, 6–120, 7–158, 8–162. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–33–3, యశ్ దయాళ్ 4–0–42–1, హాజల్‌వుడ్ 4–0–36–2, సుయాశ్ శర్మ 4–0–22–0, కృనాల్ పాండ్యా 4–0–28–1.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: బెథెల్ (సి) నాయర్ (బి) అక్షర్ 12; కోహ్లి (సి) స్టార్క్ (బి) చమీరా 51; పడిక్కల్ (బి) అక్షర్ 0; పాటీదార్ (రనౌట్) 6; కృనాల్ (నాటౌట్) 73; డేవిడ్ (నాటౌట్) 19; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (18.3 ఓవర్లలో 4 వికెట్లకు) 165. వికెట్ల పతనం: 1–20, 2–20, 3–26, 4–145. బౌలింగ్: అక్షర్ పటేల్ 4–0–19–2, స్టార్క్ 3–0–31–0, ముకేశ్ కుమార్ 3.3–0–51–0, విప్‌రాజ్ 1–0–12–0, కుల్దీప్ 4–0–28–0, చమీరా 3–0–24–1.
ఐపీఎల్‌లో నేడు
రాజస్తాన్ X గుజరాత్
వేదిక: జైపూర్
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం