
రానున్న 5 రోజులపాటు తేలికపాటి వర్షాలు
ఈ సమయంలో రైతులు దుక్కులు చేసుకోవటం మేలు
మామిడి తోటల్లో సస్యరక్షణకు మంచి సమయం
చాలా జిల్లాల్లో వచ్చే 5 రోజులు తీవ్రమైన ఎండలు
వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం వెల్లడి
సాక్షి స్పెషల్ డెస్క్, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న 5 రోజులు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆయా ప్రాంతాల రైతులు ఈ సమయంలో దుక్కులు దున్నుకోవాలని రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డా.పి.లీలారాణి సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఆమె బులెటిన్ విడుదల చేశారు.
మామిడి పంటలో పండు ఈగ నియంత్రణకు ఇదే మంచి సమయమని తెలిపారు. వాతావరణ పరిస్థితులను బట్టి పంటల సాగులో ఈ నెల 26 (శనివారం) నుంచి 30 వరకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ వాతావరణ పరిశోధన కేంద్రం ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రత్యేక బులెటిన్లను విడుదల చేస్తున్నదని వెల్లడించారు.
రైతులకు సూచనలు 5 రోజులు మండే ఎండలు.. ఈదురుగాలులతో వర్షాలు..
వచ్చే 5 రోజులు పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉందని లీలారాణి తెలిపారు. రాత్రి ఉష్ణోగ్రతలు 24 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావొచ్చని చెప్పారు.
26న ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల (గంటకు 30–40 కి.మీ.)తో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
27 నుంచి 29 తేదీల మధ్య ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి.
బులెటిన్‌లోని ప్రధాన సూచనలు ఇవే..
వేసవి దుక్కుల వల్ల భూమిలో నిద్రావస్థలో ఉన్న చీడపీడలు కలిగించే పురుగులు బయటపడి అధిక ఉష్ణోగ్రతలకు చనిపోతాయి. బయటపడిన ప్యూపాలను, గుడ్లను, పక్షులు తిని నాశనం చేస్తాయి. భూమి గుల్లబారి నీటి నిల్వ శక్తి పెరుగుతుంది. అందువల్ల వేసవి జల్లులను వినియోగించుకొని వేసవి దుక్కులను చేసుకోవాలి.
పండ్ల తోటల్లో వేసవి కాలంలో గుంతలు తీసి ఎండకు ఆరనివ్వాలి. దీనివల్ల నేలలోని పురుగులు వాటి గుడ్లు తెగుళ్లను కలిగించే శిలీంద్రాలు నశిస్తాయి. ఆ తర్వాత పండ్ల మొక్కలు నాటుకోవటం మంచిది.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు చెట్ల క్రింద నిలబడరాదు. పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచరాదు. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, చెరువులు, నీటి కుంటలకు దూరంగా ఉండాలి.
కోసిన పంటలను (వరి, మొక్కజొన్న, శనగ, పెసర, మినుము, జొన్న, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు తదితర పంటలు) వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించాలి. మార్కెట్‌కు తరలించిన ధాన్యం తడవకుండా టార్పాలిన్‌లు కప్పి ఉంచాలి. తాత్కాలికంగా పురుగు మందుల పిచికారీని వాయిదా వేసుకోవాలి. మామిడిలో కాయమచ్చ తెగులు గమనించినట్లయితే 1 గ్రా. కార్బండజిమ్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.