థాయ్‌లాండ్‌లో హ్యాండ్లర్‌! | Investigation intensifies in drug case | Sakshi
Sakshi News home page

థాయ్‌లాండ్‌లో హ్యాండ్లర్‌!

Published Thu, May 1 2025 9:50 AM | Last Updated on Thu, May 1 2025 11:52 AM

Investigation intensifies in drug case

ఓజీ కుష్‌ అతడే పండిస్తున్నట్లు అనుమానాలు 

పోలీసు నిఘాకు చిక్కకుండా జరుగుతున్న దందా 

హవాలా ఆపరేటర్లు ఎవరనేది ఆరా తీస్తున్న పోలీసులు 

డ్రగ్స్‌ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన అధికారులు  

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌–న్యూ) అధికారులు మంగళవారం అరెస్టు చేసిన అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠా కేసు దర్యాప్తు ముమ్మరమైంది. ఈ దందాలో కీలక వ్యక్తిగా భావిస్తున్న ‘హెచ్‌హెచ్‌ హ్యాండ్లర్‌’ థాయ్‌లాండ్‌లో ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. హవాలా నెట్‌వర్క్‌ మీద దృష్టి పెట్టిన పోలీసులు సహకరించిన వారి కోసం ఆరా తీస్తున్నారు. తదుపరి విచారణ నిమిత్తం జ్యుడీíÙయల్‌ రిమాండ్‌లో ఉన్న అభిష్‌ క్, హర్షవర్థన్, ధావల్, రాహుల్‌లను పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి అనుమతి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.  

ఓజీ కుష్‌ పండించేదీ అతడేనా..? 
ఓరిజినల్‌ గ్యాంగ్‌స్టర్, మారువానా, హైడ్రాపోనిక్‌ గాంజా, ఓజీ కుష్‌ ఇలా వివిధ పేర్లతో పిలిచే గంజాయితో పాటు మ్యాజిక్‌ మష్రూమ్స్‌ను ‘హెచ్‌హెచ్‌ హ్యాండ్లర్‌’ సరఫరా చేస్తున్నాడు. ఈ గంజాయి థాయ్‌లాండ్‌లోనే ఎక్కువగా పండుతుంది. జబల్‌పూర్‌కు చెందిన హర్షవర్థన్‌కు ఓడల ద్వారా చేరింది కూడా థాయ్‌లాండ్‌ నుంచే. దీన్నిబట్టి ఈ ఓజీ కుష్‌ను హ్యాండ్లరే పండించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌ నుంచి ఈ ఓజీ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతి అవుతోంది. హైడ్రోఫోనిక్‌ టెక్నిక్‌ విధానంలో కృత్రిమ కాంతితో పండిస్తుంటారు. 

ఆన్‌లైన్‌లో విత్తనాలు ఖరీదు చేసి, ఎల్‌ఈడీ లైట్లను ఉపయోగించి గంజాయి మొక్కలను పెంచుతారు. ఏమాత్రం మట్టితో అవసరం లేకుండా ప్రత్యేకంగా తయారు చేసిన కుండీలు, ట్రేల్లో ఇసుక, కంకర లేదా నీటిలో అదనపు పోషకాలతో ఉపయోగించి సాగు చేస్తుంటారు. కొందరు మాత్రం కొబ్బరి పొట్టు నారలు, గులకరాళ్లు కూడా వాడతారు. నేలమీద పండే గంజాయి కంటే ఈ ఓజీ నాణ్యత ఎక్కువగా ఉంటుందని చెప్తుంటారు. ఈ మొక్కలు ఓపెన్‌–రూట్‌ వ్యవస్థ ద్వారా పోషకాలు, ఆక్సిజన్‌ను నేరుగా తీసుకోవడమే దీనికి కారణం.  

వ్యవస్థీకృతంగా సాగుతున్న వ్యాపారం... 
ఈ డ్రగ్స్‌ క్రమవిక్రయాల దందా మొత్తం పక్కా వ్యవస్థీకృతంగా సాగుతోందని పోలీసులు చెప్తున్నారు. ఎన్‌క్రిపె్టడ్‌ యాప్స్‌ ద్వారా ఇండియా నుంచి తనకు వచ్చిన ఆర్డర్ల విషయాన్ని ‘హెచ్‌హెచ్‌ హ్యాండ్లర్‌’ ఆయా యాప్స్‌ ద్వారానే హర్షవర్థన్‌కు చేరవేస్తాడు. ఇతడు జబల్‌పూర్‌లో ఉన్న హవాలా ఏజెంట్‌కు ఆ కస్టమర్‌ వివరాలు పంపిస్తాడు. అతగాడు సదరు కస్టమర్‌ నివసించే ప్రాంతానికి చెందిన మరో హవాలా ఏజెంట్‌కు ఇవి అందిస్తాడు. ఆ వినియోగదారుడిని సంప్రదించే ఈ ఏజెంట్‌ డబ్బు ముట్టిన తర్వాత జబల్‌పూర్‌ ఏజెంట్‌కు బదిలీ చేస్తాడు. అతడి ద్వారా విషయం తెలుసుకునే హర్షవర్థన్‌ విషయాన్ని ‘హెచ్‌హెచ్‌ హ్యాండ్లర్‌’కు చెప్తాడు. 

ఔన్స్‌ (28.34 గ్రాములు) డ్రగ్‌కు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు క్రిప్టో కరెన్సీ రూపంలో అతడికి పంపిస్తాడు. ఆపై డ్రగ్‌ హ్యాండ్లర్‌ నుంచి హర్షవర్థన్‌కు వచి్చ... అక్కడ నుంచి డీటీడీసీ, శ్రీ తిరుపతి, శ్రీ ఆంజనేయులు కొరియర్స్‌లో కస్టమర్‌కు చేరుతుంది. హర్షవర్థన్‌ కూడా పోలీసుల నిఘాకు చిక్కకుండా ఈ పార్శిల్‌ బుక్‌ చేస్తున్నాడు. అక్కడ కస్టమర్‌ చిరునామా, ఫోన్‌ నెంబర్‌ తప్పుగా ఇస్తాడు. దాని ట్రాకింగ్‌ ఐడీని వినియోగదారుడికి పంపిస్తాడు. దీని ద్వారా ట్రాక్‌ చేసే కస్టమర్‌ ఆ పార్శిల్‌ కొరియర్‌ ఆఫీసుకు చేరిందని గుర్తించిన వెంటనే అక్కడకు వెళ్లి తీసుకుంటారు. ఈ హవాలా, కొరియర్‌ నెట్‌వర్క్‌ పైనా హెచ్‌–న్యూ దృష్టి పెట్టింది. ఈ ముఠాలో కీలక పెడ్లర్‌గా ఉన్న హర్షవర్థన్‌కు చెందిన క్రిప్టో వాలెట్‌లో రోజుకు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు విలువైన బిట్‌కాయిన్లు డిపాజిట్‌ అవుతున్నట్లు గుర్తించామని అధికారులు చెప్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement