సాక్షి, హైదరాబాద్: మత్తులో జోగుతూ వాహనాలు నడిపేవాళ్ల కట్టడికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తారు. కొత్త ఏడాది నుంచి ఇక తెల్లవారులూ ప్రధాన నగరాల్లో.. పట్టణాల్లో మందు బాబుల భరతం పట్టేందుకు సిద్ధమవుతోంది రాష్ట్ర పోలీస్ శాఖ. ఈ తరుణంలో.. న్యూఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ప్రయోగాత్మకంగా డ్రగ్స్ డ్రైవ్ నిర్వహణకు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో సిద్ధమైంది.
డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల తరహాలోనే.. డ్రగ్స్ డిటెక్షన్ పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో నిర్ణయించుకుంది. ఇందుకోసం కొత్త కిట్‌లను రప్పించుకుని పోలీస్ శాఖకు అప్పగించింది. ఇక శాంపిల్స్, ల్యాబ్ టెస్టులు పాత ముచ్చట. ఈ కొత్త కిట్‌ల ద్వారా మూడు రోజుల తర్వాత కూడా రక్త, మూత్ర పరీక్షల ద్వారా డ్రగ్స్ తీసుకున్న సంగతి బయపడుతుంది.
బ్రీత్ అనలైజర్ టెస్ట్ రాగానే అప్పటికప్పుడే డ్రగ్స్ తీసుకుంటే పాజిటివ్ రిపోర్టు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే.. పాజిటివ్ రిపోర్టు రాగానే మరిన్ని పరీక్షల కోసం మూత్ర పరీక్షలు అధికారులు చేస్తారు. రెండింటిలోనూ పాజిటివ్ రిపోర్టు వస్తే సదరు వ్యక్తిని అదుపు తీసుకుంటారు. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వినియోగం అరికట్టడమే లక్ష్యం నార్కోటిక్ బ్యూరో చర్యలు తీసుకుటోంది.
ఇప్పటికే కొత్త పరికరాలు ఒక్కో కమిషనరేట్‌కు పాతిక దాకా పంపించారు. డ్రగ్ డిటేక్షన్ పరీక్షలపై పోలీసులకు ఇప్పటికే శిక్షణ పూర్తి అయిందిని అధికారులు తెలిపారు. ట్రై కమిషనరేట్ పరిధిలో జంక్షన్ల వద్ద డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ టెస్టులు ఇచ్చే ఫలితం ఆధారంగా.. వారాంతాల్లో రెగ్యులర్‌గా ఇలాంటి చెకింగ్‌లు నిర్వహించే యోచనలో ఉంది తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో.
మరోవైపు రాష్ట్రంలో డ్రగ్స్ అరికట్టే విషయంలో తెలంగాణ కొత్త సర్కార్ సీరియస్‌గా ఉంది. ఈ క్రమంలోనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని నిర్ణయించుకుంది.
కఠిన చర్యలు తప్పవు
నయా సాల్ వేడుకల్లో మత్తులో ఊగితే కఠిన చర్యలు తప్పవని నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. పబ్బు, రిసార్ట్ మేనేజర్లకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాం. ఎవరైనా డ్రగ్స్ వాడినట్లయితే వారిపై చర్యలు ఉంటాయి. పబ్బులపైన పూర్తిస్థాయిలో నిఘా పెట్టాం. పబ్బుల్లో.. రిసార్టుల్లో డ్రగ్స్ దొరికితే వారి లైసెన్స్ రద్దు చేస్తాం. భవిష్యత్తులో వారికి లైసెన్స్ రాకుండా చేస్తాం. కొన్ని రంగాల వారికి డ్రగ్స్ అవసరాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం ఉంది. ఆయా ఫీల్డ్ వారిని కూడా హెచ్చరిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ వాడొద్దు అని హెచ్చరించారాయన.
అలాగే.. కొత్త సంవత్సర వేడుకలు సందర్భంగా నగరంలో ఆంక్షలు ఉంటాయని తెలిపారు. నగరంలో పలు బ్రిడ్జిలపై రాకపోకలు నిషేధిస్తామని తెలిపారాయన. రాత్రి 10 గంటల నుంచి ‘పీవీ ఎక్స్‌ప్రెస్ వే’ను మూసివేస్తాం. అయితే.. ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారు టికెట్‌ను చూసి పీవీ ఎక్స్‌ప్రెస్ మార్గంలో అనుమతిస్తాం. రాత్రి ఒంటిగంట వరకే వ్యాపారాలను అనుమతిస్తాం. ఒంటి గంట తర్వాత ఎట్టి పరిస్థితిలో వ్యాపారాలు అనుమతించబడవు.. మూసేయాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment