సాక్షి, హైదరాబాద్: ఓ మహిళ తన ఇంట్లో డ్రగ్స్‌ను ఎలాంటి అనుమతులు లేకుండా దాచిపెట్టి నగరంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్న వ్యవహారాన్ని రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఎక్సైజ్ విభాగం బట్టబయలు చేశాయి. బుధవారం సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్ బజార్‌లో ఉన్న జీవీ సలూజా హాస్పిటల్‌లో ఆకస్మిక తనిఖీలు చేశారు. తనిఖీల సందర్భంగా భారీ స్థాయిలో అక్రమంగా నిల్వ ఉంచిన నార్కోటిక్స్ డ్రగ్స్‌తో పాటు మత్తు కలిగించే మందులను గుర్తించారు.
ఫెంటనైల్, కిటమైన్ హైడ్రోక్లోరైడ్, పెంటజోసైన్ యాసిడ్, మిడజోలం, సక్సినైల్ క్లోరైడ్ ఇంజెక్షన్లను భారీగా పట్టుకున్నారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారించగా.. మౌలాలిలోని ఎంజే కాలనీకి చెందిన నేహా భగవత్ అనే మహిళ తమకు సరఫరా చేస్తుందని వివరాలు అందించారు. దీంతో వెంటనే నేహా ఇంటికి వెళ్లిన అధికారులు అక్కడ భారీ స్థాయిలో నిల్వ ఉంచిన నార్కోటిక్ డ్రగ్స్, మందులను గుర్తించారు.
మార్ఫిన్ ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు, ఫెంటనైల్ సిట్రేట్ ఇంజెక్షన్లు, ఫెంటనైల్ సిట్రేట్ ప్యాకెట్లు, పెంటజోకైన్ ఇంజెక్షన్లను వేరే రాష్ట్రాల నుంచి అక్రమంగా కొనుగోలు చేసి, నగరంలో లైసెన్స్ లేకుండా అక్రమంగా నడుపుతున్న మందుల దుకాణాలకు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ఇప్పటికే నేహాపై ఎన్డీపీఎస్ చట్టం కింద రెండు కేసులు ఉన్నాయని, గత నెలలోనే బెయిల్ పొంది బయటికి వచ్చినట్టు అధికారులు వివరించారు. అధికారులు డ్రగ్స్‌ను సీజ్ చేశారు. నేహా భగవత్, పట్టూరి గోపీనాథ్, సురేందర్‌సింగ్ గుసియాలు పట్టుబడ్డారు. కాగా, నిందితులైన రాజేందర్ సింగ్ సలూజా, అమృత సింగ్ సలూజా, దినేశ్ పరారీలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment