narcotics
-
మహిళ ఇంట్లో డ్రగ్స్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: ఓ మహిళ తన ఇంట్లో డ్రగ్స్‌ను ఎలాంటి అనుమతులు లేకుండా దాచిపెట్టి నగరంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్న వ్యవహారాన్ని రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఎక్సైజ్ విభాగం బట్టబయలు చేశాయి. బుధవారం సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్ బజార్లో ఉన్న జీవీ సలూజా హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. తనిఖీల సందర్భంగా భారీ స్థాయిలో అక్రమంగా నిల్వ ఉంచిన నార్కోటిక్స్ డ్రగ్స్‌తో పాటు మత్తు కలిగించే మందులను గుర్తించారు. ఫెంటనైల్, కిటమైన్ హైడ్రోక్లోరైడ్, పెంటజోసైన్ యాసిడ్, మిడజోలం, సక్సినైల్ క్లోరైడ్ ఇంజెక్షన్లను భారీగా పట్టుకున్నారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారించగా.. మౌలాలిలోని ఎంజే కాలనీకి చెందిన నేహా భగవత్ అనే మహిళ తమకు సరఫరా చేస్తుందని వివరాలు అందించారు. దీంతో వెంటనే నేహా ఇంటికి వెళ్లిన అధికారులు అక్కడ భారీ స్థాయిలో నిల్వ ఉంచిన నార్కోటిక్ డ్రగ్స్, మందులను గుర్తించారు. మార్ఫిన్ ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు, ఫెంటనైల్ సిట్రేట్ ఇంజెక్షన్లు, ఫెంటనైల్ సిట్రేట్ ప్యాకెట్లు, పెంటజోకైన్ ఇంజెక్షన్లను వేరే రాష్ట్రాల నుంచి అక్రమంగా కొనుగోలు చేసి, నగరంలో లైసెన్స్ లేకుండా అక్రమంగా నడుపుతున్న మందుల దుకాణాలకు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ఇప్పటికే నేహాపై ఎన్డీపీఎస్ చట్టం కింద రెండు కేసులు ఉన్నాయని, గత నెలలోనే బెయిల్ పొంది బయటికి వచ్చినట్టు అధికారులు వివరించారు. అధికారులు డ్రగ్స్‌ను సీజ్ చేశారు. నేహా భగవత్, పట్టూరి గోపీనాథ్, సురేందర్సింగ్ గుసియాలు పట్టుబడ్డారు. కాగా, నిందితులైన రాజేందర్ సింగ్ సలూజా, అమృత సింగ్ సలూజా, దినేశ్ పరారీలో ఉన్నారు. -
బాల్యం ఇక్కడ సేఫ్
సమస్యలు చూసి ‘అయ్యో!’ అనుకునే వాళ్లు కొందరు. సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కార మార్గాలు ఆలోచించేవారు కొందరు. సూరేపల్లి సుజాత రెండో కోవకు చెందిన యాక్టివిస్ట్. ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత ‘శాతవాహన యూనివర్సిటీ’లో సోషియాలజీ డిపార్ట్మెంట్ హెడ్. ప్రాఫెసర్‌గా క్లాసు నాలుగు గోడలకే పరిమితం కాలేదు. పర్యావరణ సమస్యల నుంచి సామాజిక సమానత్వం వరకు ఎన్నో ఉద్యమాలలో భాగం అయింది. తన గళాన్ని గట్టిగా వినిపించింది. ‘సేఫ్’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా మురికివాడల్లోని పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేస్తోంది...హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో 2021లో ఒక చిన్నారిపై జరిగిన హత్యాచార ఘటనపై నిరసన తెలియజేసేందుకు సుజాత అక్కడి మురికివాడకు వెళ్లింది. ఆ బస్తీలో కనీస సదుపాయాలు లేవు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక అత్యంత దయనీయ స్థితిలో ఉన్న పేదలను చూసి చలించిపోయింది. సాయంత్రమైతే ఆ బస్తీలో గంజాయి, మద్యం, మత్తుపదార్థాల వరద పారుతుంది. ‘ఇలా ఎందుకు?’ అని తెలుసుకోవడానికి ఆరునెలలపాటు అక్కడి సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసింది. తల్లిదండ్రులు వారి పిల్లలను బాల కార్మికులుగా చేస్తున్న తీరును గమనించి స్కూల్ పిల్లల్ని డ్రాపౌట్స్‌గా మారకుండా చూడడంపై దృష్టి పెట్టింది.మత్తు పదార్థాల ప్రభావం చిన్నారులపై పడకుండా, వారి భవిష్యత్‌ను కాపాడడం కోసం రంగంలోకి దిగిన సుజాత మొదటి అడుగుగా చిన్న స్థలాన్ని చూసి స్టడీ సెంటర్ ఏర్పాటు చేసింది. దీనికి ‘సావిత్రి బాయి పూలే స్టడీ సెంటర్’గా నామకరణం చేసింది. ఒకటితో మొదలైన స్టడీ సెంటర్ల సంఖ్య పదిహేనుకు పెరిగింది.మూడు అంగన్ వాడీ కేంద్రాలు, మూడు ప్రభుత్వ పాఠశాలలో చదివే మూడువందల మందికి పైగా విద్యార్థులు ఈ కేంద్రాల్లో సాయంత్రం చదువుకోవడానికి వస్తారు. ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు పార్ట్‌టైం టీచర్లుగా పనిచేస్తున్నారు. డ్రాపౌట్లను తగ్గించడం, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడం, చిన్నారులపై లైంగిక వేధింపులను నిరోధించడం లక్ష్యంగా ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి. పిల్లల మానసిక వికాస అభివృద్ధి, పౌష్టికాహార లోపం అధిగమించడంపై ఈ విద్యాకేంద్రాలు దృష్టి పెట్టాయి.సింగరేణి కాలనీలో అంతా చెత్త ఏరుకుని బతికే పేదలే. వారి పిల్లలు అంగన్ వాడీ కేంద్రాలకు వెళ్తారు. నాలుగో తరగతి వరకు చదివించి ఆపై ఆపేస్తారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి, పిల్లలు పై చదువులు చదవడానికి ‘సావిత్రిబాయి పూలే సెంటర్’ల ద్వారా విశేష కృషి చేస్తోంది సుజాత.పదవ తరగతి చదివే పిల్లలకోసం బ్రేక్‌ఫాస్ట్ (డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు) అందించారు. ఇది సత్ఫలితాలను ఇచ్చి ఆ ఏడాది ఉత్తీర్ణతా శాతాన్ని పెంచింది. ఏటా పిల్లల కోసం సమ్మర్ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఆటల నుంచి ఆత్మరక్షణ విద్య, సైన్స్ ప్రాజెక్ట్‌ల వరకు ఈ క్యాంప్‌లో ఎన్నో యాక్టివిటీస్ ఉంటాయి. మత్తు పదార్థాల దుష్ప్రభావంపై అవగాహన కలిగించడం మరో కీలక అంశం.తొలిసారిగా తాను ఆ మురికివాడలో అడుగు పెట్టినప్పటితో పోల్చితే విద్యార్థుల చదువుకు సంబంధించి ఇప్పుడు ఎంతో మార్పు వచ్చింది. అది రాత్రికి రాత్రి వచ్చిన మార్పు కాదు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎంతో శ్రమిస్తే వచ్చిన మార్పు. ‘తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు తీసుకు వస్తే పిల్లల భవిష్యత్‌కు బంగారుబాట వేయవచ్చు’ అని నిరూపించిన మార్పు. – భాషబోయిన అనిల్ కుమార్, సాక్షి, కరీంనగర్సమాజంలోని అవలక్షణాలను వదిలించి, మనిషి సన్మార్గంలో నడిచేలా పనిచేయడమే మా లక్ష్యం. – ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత -
రూ.1,814 కోట్ల డ్రగ్స్ సీజ్
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఓ ఫ్యాక్టరీ నుంచి రూ.1,814 కోట్ల విలువైన 907 కిలోల మెఫెడ్రిన్‌తోపాటు, ముడి సరుకును, యంత్ర పరికరాలను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్), ఢిల్లీ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)సంయుక్తంగా జరిపిన దాడిలో బగ్రోడా పారిశ్రామిక ఎస్టేట్‌పై శనివారం దాడి జరిపినట్లు అధికారులు తెలిపారు. గుజరాత్ ఏటీఎస్ యూనిట్ సారథ్యంలో ఇంతభారీగా డ్రగ్స్ పట్టుబడిన ఘటన ఇదే. ఫ్యాక్టరీలో రోజుకు 25 కిలోల మెఫెడ్రిన్ తయారవుతోందని చెప్పారు. ఈ సందర్భంగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు 2017లో మహారాష్ట్రలోని అంబోలిలో మెఫెడ్రిన్ పట్టుబడిన కేసులో ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాడని అధికారులు వివరించారు. అమృత్‌సర్‌లో రూ.10 కోట్ల కొకైన్ లభ్యం అమృత్‌సర్‌లో రూ.10 కోట్ల విలువైన కొకైన్‌ను స్వా«దీనం పోలీసులు చేసుకున్నారు. ఇటీవల ఢిల్లీలో రూ.5,620 కోట్ల విలువైన 560 కిలోల కొౖకైన్, 40 కిలోల మారిజువానాను సీజ్ చేయడం తెలిసిందే. ఆ కేసు దర్యాప్తు క్రమంలోనే తాజాగా కొకైన్ పట్టుబడింది. ఈ సందర్భంగా ఒక వ్యక్తితోపాటు అతడి టయోటా కారును స్వా«దీనం చేసుకున్నారు. నిందితుడు విదేశాలకు పరారయ్యేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడని అధికారులు తెలిపారు. -
‘నిఘా’కు నిధులివ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రాష్ట్ర స్థాయి అత్యున్నత నిఘా విభాగాలైన తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధునీకరణకు నిధులు మంజూరు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. గురువారం ఢిల్లీలో అమిత్ షాను ఆయన నివాసంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ కలిశారు. సుమారు గంటపాటు షాతో భేటీ అయ్యారు.డ్రగ్స్ కట్టడి, సైబర్ నేరాల నియంత్రణకు కావాల్సిన ఆధునిక సాంకేతిక పరిజ్జానం, పరికరాల కొనుగోలు కోసం టీజీ న్యాబ్‌కు రూ. 88 కోట్లు, టీజీ సీఎస్‌బీకి రూ.90 కోట్లు కేటాయించాలని అమిత్ షాను కోరారు. ఐదేళ్లకోసారి ఐపీఎస్ క్యాడర్ సమీక్ష చేయడం తప్పనిసరని, తెలంగాణకు సంబంధించి 2016లో తొలిసారి సమీక్ష నిర్వహించారని, నాటి నుంచి సమీక్ష చేయనుందున వెంటనే సమీక్ష చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు 61 ఐపీఎస్ పోస్టులు కేటాయించారని, కొత్త రాష్ట్ర అవసరాలకు ఐపీఎస్‌లు సరిపోనందున.. తెలంగాణకు అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.మరికొన్ని వినతులు⇒ తెలంగాణలో వామపక్ష తీవ్రవాదాన్ని అరికట్టేందుకు ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భద్రతా దళాల క్యాంపులను ఏర్పాటు చేయాలి. ⇒ వామపక్ష తీవ్రవాదం అణచివేత కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండవాయి గ్రామం, ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామ పరిధిలో సీఆరీ్ఫఎఫ్ జేటీఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేయాలి. ⇒ మావోయిస్టుల ఏరివేతకు ఏర్పాటు చేసిన ఎస్పీవోల్లో మాజీ సైనికులు, మాజీ పోలీసులనే చేర్చుకోవాలన్న నిబంధనను సవరించి 1,065 మందిని ఎస్పీవోల్లో చేర్చుకోవడానికి అనుమతించాలి. ⇒ ఎస్పీవోలకు చెల్లించాల్సిన నిధుల్లో నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 60% కేంద్రం వాటా కింద రూ.18.31 కోట్లను వెంటనే విడుదల చేయాలి. ⇒ ఏపీ, తెలంగాణ మధ్య విభజన సమస్యల పరిష్కారానికి సహకరించాలి. షెడ్యూల్–9లోని ప్రభుత్వ భవనాలు, కార్పొరేషన్ల పంపిణీ, షెడ్యూల్–10లోని సంస్థల వివాదం సామరస్యపూర్వకంగా పరిష్కారానికి కృషి చేయాలి. ళీ విభజన చట్టంలో ఎక్కడా ప్రస్తావించని ఆస్తులు, సంస్థలను ఏపీ క్లెయిమ్ చేసుకుంటున్నందున అందులో తెలంగాణకు న్యాయం జరిగేలా చొరవ చూపాలి. -
జైళ్లలో డి అడిక్షన్ సెంటర్లు
ఆరిలోవ (విశాఖ తూర్పు): మత్తు పదార్థాలకు అలవాటుపడి ఖైదు అనుభవిస్తున్నవారి కోసం జైళ్లలో డి అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. విశాఖ కేంద్ర కారాగారాన్ని ఆమె మంగళవారం సందర్శించారు. ఆమెకు జైలు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జైలు సూపరింటెండెంట్ ఎస్.కిశోర్‌కుమార్, అదనపు సూపరింటెండెంట్ ఎం.వెంకటేశ్వరరావు, ఇతర అధికారులతో కలిసి ఆమె జైలు లోపల పర్యవేక్షించారు. ఖైదీలు ఉండే బేరక్లను పరిశీలించారు. అనంతరం జైలు బయట ప్రధాన ద్వారం వద్ద మీడియాతో మాట్లాడారు. జైలు గంజాయి ముద్దాయిలతో నిండిపోయిందన్నారు. వారిలో మంచి మార్పు తీసుకురావడానికి జైళ్లలో 20 నుంచి 30 పడకలతో కూడిన డి అడిక్షన్ సెంటర్లు ఏర్పాటుపై దృష్టి పెడతామని చెప్పారు. అసలైన గంజాయి సరఫరా చేయించిన వారిని వదిలేసి అమాయక గిరిజనులను పోలీసులు పట్టుకుని జైళ్లలో పెట్టారన్నారు. గంజాయి ముద్దాయిలకు బెయిల్ మంజూరులో ఆటంకంగా నిలిచిన షూరిటీ గురించి లీగల్‌గా పరిశీలించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో చర్చిస్తానన్నారు. జైలు సిబ్బంది సమస్యలు కూడా పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. జోనల్ ట్రాన్స్ఫర్లకు బదులుగా రాష్ట్ర వ్యాప్తంగా బదిలీలు జరిగేటట్లు చర్యలు చేపడతామన్నారు. ఖైదీలకు గత ఐదు సంవత్సరాలుగా ఒక్కసారి కూడా క్షమాభిక్ష ఇవ్వలేదని తెలిపారు. ఈ ఏడాది ఖైదీలకు క్షమాభిక్ష కలి్పస్తామన్నారు. ఖైదీల ఆరోగ్యంపై మరింత దృష్టిపెడతామని, ఆరోగ్యశ్రీ సక్రమంగా వర్తించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెట్టిన వారిపైన, ప్రభుత్వ భూములు ఆక్రమించినవారిపైన దర్యాప్తు జరిపిస్తామని తెలిపారు. -
చెన్నై విమానాశ్రయంలో రూ.20 కోట్ల కొకైన్ స్వాధీనం
అన్నానగర్ (చెన్నై): దుబాయ్ నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న రూ.20 కోట్ల విలువైన కొకైన్, రూ.2 కోట్ల విలువ గల మత్తు మాత్రలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతున్న విమానంలో భారీగా మత్తు పదార్థాలు తరలిస్తున్నట్లు చెన్నై జోన్ సెంట్రల్ నార్కోటిక్స్ కంట్రోల్ యూనిట్ డైరెక్టర్ అరవిందన్‌కు శుక్రవారం సమాచారం అందింది. దీంతో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్, యాంటీ నార్కోటిక్స్ విభాగం అధికారులు తనిఖీ చేశారు.బొలీవియాకు చెందిన ఓ యువతి బ్యాగ్‌లో ఉన్ని దుస్తుల లోపల దూది మధ్య డ్రగ్స్‌ను దాచినట్లు గుర్తించారు. ఆమె నుంచి రూ. 20 కోట్ల విలువైన కిలో 800 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. బొలీవియా యువతితోపాటు ముంబైలో నివసిస్తున్న బ్రెజిల్‌కు చెందిన మహిళ సహా మరో ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. అదేవిధంగా నెదర్లాండ్స్ నుంచి బెంగళూరు, పుదుచ్చేరి చిరునామాలతో రెండు పార్సిళ్లు కస్టమ్స్ విభాగానికి చెందిన పోస్టాఫీసుకు వచ్చాయి. ఆ పార్సిళ్లను కస్టమ్స్, నార్కోటిక్స్ కంట్రోల్ యూనిట్ అధికారులు తనిఖీ చేశారు. అందులో రూ.2 కోట్ల విలువైన కిలో 400 గ్రాముల మత్తు మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి బెంగళూరులో ఉంటున్న ఇద్దరు నైజీరియన్ యువకులను అరెస్టు చేశారు. -
ఎవరీ కొత్త హవాలా కొలంబస్?
గత సంవత్సరం బ్రెజిల్ అధ్యక్షునిగా లూల డసిల్వా ఎన్నిక య్యారు. ఆయనకు ట్విట్టర్ వేదికగా వైసీపీ నాయకుడు విజయ సాయిరెడ్డి అభినందనలు తెలియజేశారట! యెల్లో మీడియాఎంతో కష్టపడి శోధించి ఈ విషయాన్ని కనిపెట్టింది. బ్రెజిల్ నుంచి విశాఖపట్నం కోటయ్య చౌదరి కంపెనీకి ఓ కంటెయినర్ పార్సెల్ వచ్చింది. ఇంటర్‌పోల్ సమాచారంతో ఆ కంటెయినర్‌ను తనిఖీ చేసిన సీబీఐ అధికారులు జరిపిన మాదక ద్రవ్యాల పరీక్షలో ‘పాజిటివ్’ ఫలితాలొచ్చాయి. ఆ విషయాన్ని వారు విడుదల చేసిన ఎఫ్ఐఆర్లో ప్రస్తావించారు. కోటయ్య చౌదరి కంపెనీకి (సంధ్యా ఎక్స్‌పోర్ట్స్) రొయ్యలు, చేపలకు సంబంధించిన ఎగుమతుల వ్యాపారం ఉన్నది. రొయ్య విత్తనాన్ని పొదిగే హేచరీ కూడా ఉన్నది. త్వరలో రొయ్యల దాణాను తయారు చేసే మరో కేంద్రాన్ని కూడా తెరవ బోతున్నారు. ఆ దాణా తయారీలో ఉపయోగించడానికి పొడి చేసిన యీస్ట్‌ను తెప్పించుకోవడానికి సంధ్య కంపెనీ బ్రెజిల్లో ఆర్డర్ పెట్టింది. ఈ పదార్థాన్ని చైనా నుంచీ, యూరప్ నుంచీ కూడా దిగుమతి చేసుకోవచ్చు. బ్రెజిల్‌తో పోలిస్తే దూరాభారం కూడా తక్కువ. కానీ బ్రెజిల్‌నే ఎంపిక చేసుకోవడం వెనుక ఆకంపెనీకి తనదైన ప్రత్యేక కారణం ఉండవచ్చు. ‘యీస్ట్’ అనే మాటకు తెలుగు అర్థం కోసం వెతికితే మన నిఘంటువుల్లో సంతృప్తికరమైన సమాధానాలు దొరకలేదు. మధు శిలీంధ్రం, పులియబెట్టినది అనే అర్థాలున్నాయి. పూర్వం మన వంటిళ్లలో అన్నం వార్చే రోజుల్లో కలి, గంజి ఉండేవి. కలో గంజో తాగి బతకాలని సామెత. అందులోని కలిని యీస్ట్గా పరిగణిస్తాము. రకరకాల అవసరాలకు యీస్ట్‌ను ఉపయోగించడం తెలిసిందే. బ్రూవరీలు, వైనరీలు, బేకరీల్లో ప్రధానంగా వాడుతారు. ఆక్వా దాణా కోసం కూడా వాడుతారట. కోటయ్య చౌదరి కంపెనీ తెప్పించిన పొడి యీస్ట్ డబ్బాల్లో డ్రగ్స్ బయటపడ్డాయనే వార్త లోకానికి ఇంకా తెలియకముందే లోకేశ్‌బాబుకు తెలిసిపోయింది. ‘ఎక్స్’ వేదికగా ఆయన ఉలిక్కి పడ్డారు. వైజాగ్‌ను నాశనం చేసేందుకు వైసీపీ వాళ్లు తెప్పించా రని ఆరోపణలు చేశారు. చినబాబు ఉలికిపాటు సరిపోలేదని చంద్రబాబు కూడా మరోసారి గట్టిగా ఉలిక్కిపడ్డారు. తెల్లారి లేచేసరికి ‘ఈనాడు’ పత్రిక మరింత గట్టిగా ఉలిక్కి పడింది. దాంతోపాటు మిగతా యెల్లో మీడియా కూడా! ఈ డ్రగ్స్ సరఫరా వెనుక కచ్చితంగా వైసీపీ హస్తం ఉందని వారు ఏకగ్రీవంగా తీర్మానించి పారేశారు. నెమ్మదిగా అసలు విష యాలు బయటకు రావడం మొదలైంది. కోటయ్య కంపెనీ చుట్టూ అల్లుకున్న తెలుగుదేశం, బీజేపీ నేతల బాంధవ్యాలు బయటపడ్డాయి. సామాజిక బాంధవ్యాలే కాదు, వ్యాపార భాగస్వామ్యాలు కూడా వెల్లడి కావడం మొదలైంది. దాంతో మన యెల్లో మీడియా ఉలికిపాటులోంచి తత్తరపాటులోకి మారింది. ఆ తత్తరపాటులోంచి వచ్చిందే లూల డసిల్వాకు విజయసాయిరెడ్డి అభినందనలు చెప్పారనే మోకాలు – బోడి గుండు సంబంధిత ఆరోపణ. విజయ సాయిరెడ్డి అభినందనలు ట్విట్టర్లో చెప్పారు కనుక కృతజ్ఞతగా బ్రెజిల్ అధ్యక్షుడు దగ్గరుండి డ్రగ్స్‌ను షిప్లో లోడ్ చేయించి ఉంటారని మన జనాల్ని నమ్మించాలనే వెధవా యిత్వం యెల్లో మీడియాలో కనిపించింది. సూర్యుడిపై ఉమ్మేయజూసే మూర్ఖత్వమంటే ఇదే! లూయీ ఇనాసియో లూల డసిల్వా ఒక కార్మికోద్యమనేతగా తన ప్రజా జీవితాన్ని ఆరంభించిన వ్యక్తి. ఒకనాటి చిలీ అధ్యక్షుడు డాక్టర్ సాల్వెడార్ అలెండీ, వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ల వరుసలోని లాటిన్ అమెరికా వామపక్ష యోధుడు. మొదటిసారి అధ్య క్షుడిగా ఎన్నికైనప్పుడు ఆయన అమలుచేసిన బొల్సా ఫామి లియా (పేద కుటుంబాలకు ఆర్థిక సాయం), ఫోమ్ జీరో (ఆకలి నిర్మూలన) పథకాలు కోట్లాది మంది బ్రెజిలియన్లను దారిద్య్రం నుంచి విముక్తం చేశాయి. కోట్లాది పేద కుటుంబాల పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాయి. అమెరికా ఖండంలో అగ్రరాజ్య ప్రయోజనాలకు కంట్లో నలుసుగా డసిల్వా మారాడు కనుక ఆయన అధికారం నుంచి దూరం కావలసి వచ్చింది. అవినీతి ఆరోపణలు మోపి మూడేళ్ల పాటు జైల్లో నిర్బంధించారు. ఆరోపణలన్నీ శుద్ధ అభాండాలేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పి ఆయన్ను జైలు నుంచి విడుదల చేసింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో దేశాధ్యక్షునిగా మూడోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సకల దేశాధి నేతలు, లక్షలాది మంది రాజకీయ ప్రముఖులు, కోట్లాదిమంది అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. అందులో విజయ సాయిరెడ్డి ట్వీట్ ఒకటి. ఒక ప్రముఖ దేశానికి అధ్యక్షునిగా, జి–20 దేశాల కూటమికి ప్రస్తుత అధ్యక్షునిగా ఉన్న వ్యక్తిపైనే బురద చల్లడానికి వెనుకాడలేదంటే యెల్లో మీడియా బరితెగింపు ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నారా అండ్ సన్స్‌తో పాటు యెల్లో మీడియా కూడా ఈ విషయంలో అతిగా స్పందించింది. రాజకీయ ప్రత్యర్థుల తలకు చుట్టడానికి వారు వేగిరిపడ్డారు. సీబీఐ విచారణ పూర్తయ్యే వరకు ఎందుకు ఉగ్గబట్టలేకపోయారో తెలియదు. వారి తొందర పాటుకు తగినట్టుగానే కంపెనీ బాంధవ్యాలు, భాగస్వామ్యాలు తెలుగుదేశం కుటుంబాలనే వేలెత్తి చూపుతున్నాయి. విచారణ పూర్తయితే గానీ జరిగిందేమిటనే సంగతి నిర్ధారణ కాదు. అయితే కొత్త రాజకీయ పొత్తుల నేపథ్యంలో దర్యాప్తు సంస్థపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు ఉండవని విశ్వసించవచ్చునా అనే ప్రశ్న తలెత్తుతున్నది. ఈ ప్రశ్నతో పాటు మరికొన్ని సందేహాలకు కూడా సమాధానాలు రావలసి ఉన్నది. దాణా ఉత్పత్తి ప్రారంభం కాకముందే సంధ్యా సంస్థ 25 వేల కిలోల యీస్ట్‌కు ఎందుకు ఇండెంట్ పెట్టింది? యీస్ట్ దిగుమతికి ప్రత్యామ్నాయాలు అందు బాటులో ఉండగా అది బ్రెజిల్‌నే ఎందుకు ఎంపిక చేసుకున్నది? బ్రెజిల్ నుంచి బయల్దేరిన ఓడ విశాఖ రావడానికి ఎక్కువ సమయం తీసుకున్నదన్న పాయింట్‌ను సీబీఐ ముందు కంపెనీ ప్రతినిధులు ఎందుకు నొక్కి చెబుతున్నారు? మధ్యలో తమకు తెలియకుండా ఎవరో ఈ డ్రగ్స్‌ను బాక్సుల్లో పెట్టిఉంటారని బుకాయించడం కోసమా? అలా మధ్యలో దూర్చడం సాంకేతికంగా సాధ్యమవుతుందా? విచారణ తర్వాత డ్రగ్స్‌ను తెప్పించడం వెనుక బాధ్యత సంధ్య కంపెనీదే అని తేలితే ఆకంపెనీ ఎందుకు ఆ పని చేసినట్టు? స్వయంగా డ్రగ్స్ వ్యాపారంలోకి దిగిందా? లేక ఎవరైనా కమీషన్ మీద ఈ పని అప్పగించారా? రెగ్యులర్‌గా దిగుమతులు చేసుకునే కంపెనీలతో డ్రగ్స్ వ్యాపారులు కమీషన్ ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉన్నది. కానీ, సంధ్యా కంపెనీ దాణా ఉత్పత్తిని ఇంకా ప్రారంభించనే లేదు. అటువంటి ఉత్పత్తిని ప్రారంభించే ప్రయత్నాలు చేస్తు న్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆక్వా అథారిటీకి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం ఇవ్వనేలేదు. అప్పుడే యీస్ట్ దిగుమతికి ఎందుకు తొందరపడినట్టు? డ్రగ్స్ వ్యాపారంలో ఉన్న వారు కాకుండా మరేదో బలమైన శక్తి ప్రోద్భలం మేరకే ఈ కంపెనీ యీస్ట్ దిగుమతికి ఆర్డర్ చేసిందా? బ్రెజిల్ నుంచే దిగుమతి చేసు కోవాలని ఆ శక్తి నిర్దేశించిందా? తెలుగుదేశం, జనసేనలకు బీజేపీతో పొత్తు కుదురుతుందనే నమ్మకం కలిగిన తర్వాత బ్రెజిల్లో బయల్దేరిన ఓడ... పొత్తుకు తుదిరూపం వచ్చిన తర్వాతనే విశాఖ తీరం చేరుకోవడం కాకతాళీయమేనా? డ్రగ్స్ సరఫరా, పంపిణీ వ్యాపారులతో ఒప్పందాలు చేసుకోవడం మనీ లాండరింగ్‌లో కొత్త పద్ధతిగా మారిందా? ఒకేసారి వందలు, వేలకోట్ల రూపాయలను చేతులు మార్చ డంలో సంప్రదాయ హవాలా పద్ధతుల కన్నా ఇది మెరుగైన పద్ధతిగా భావిస్తున్నారా? ఎందుకంటే ఇండియాలో డ్రగ్స్ దందా టర్నోవర్ లక్ష కోట్లు దాటిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2022 జూన్ నుంచి 2023 జూలై 15 వరకు నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో, రాష్ట్రాల బృందాలు కలిసి సుమారు 12 వేల కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యా లను ధ్వంసం చేశాయి. ఇంతకు కనీసం పది రెట్లు ఎక్కువ వినిమయం దేశంలో ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్‌కు ఇదో మార్గంగా పరిగణిస్తూ ఉండవచ్చు. అయితే బలమైన నెట్వర్క్ కలిగి ఉన్నవారే ఈ పద్ధతిని అనుసరించే అవకాశం ఉన్నది. బ్రెజిల్ సరిహద్దు దేశాల్లో కొలంబియా ఒకటి. ప్రపంచంలో అతిపెద్ద మాదక ద్రవ్యాల సరఫరా కేంద్రం ఆ దేశం. అయితే కొలంబియా నుంచి రవాణా అయ్యే సరుకుల కన్సైన్మెంట్లపై దాదాపు అన్ని దేశాల్లో నిఘా తీవ్రంగా ఉంటుంది. నఖశిఖ పర్యంతం పరిశీలిస్తారు. కనుక కొలంబియా డ్రగ్ లార్డ్స్ పక్క దేశాల నుంచి సరుకుల రవాణాలో డ్రగ్స్‌ను కలిపి పంపుతారు. లాటిన్ అమెరికాలో అతిపెద్ద దేశమైన బ్రెజిల్ సహజంగానే వారి ఫస్ట్ ఛాయిస్‌గా ఉంటుంది. అమెజాన్ అడవులు రెండు దేశాల సరిహద్దులను కలిపేస్తుండటంతో డ్రగ్స్‌ను బ్రెజిల్ రేవుల దాకా చేర్చడం వారికి సులువు. అమెరికా,ఇండియాల మధ్య ప్రైవేట్ ఆర్థిక సంబంధాలు చాలా ఎక్కువ. విరాళాల దందాలూ ఎక్కువే. ‘ఏపీ జన్మభూమి’ పేరుతో తెలుగుదేశం అభిమానులు ఓ కొత్త సంస్థను ప్రారంభించి పెద్ద ఎత్తున విరాళాలు వసూలు చేయడం ఈ మధ్య వివాదాస్పదంగా మారింది. వసూలు చేసిన విరాళాలకు సరైన లెక్కలు లేవని విరాళాలిచ్చినవారు వాపోతున్నారు. ఇదేకాకుండా ఎన్ని కల పేరుతోనూ విరాళాలు సేకరించడం ఇక్కడ మామూలే. టెక్సాస్ లోని హ్యూస్టన్ నగరం నుంచి కొలంబియా తీరం 1500 మైళ్ల దూరమే! మనీలాండరింగ్ కోసం మాదక ద్రవ్యాల రూట్‌ను ఎంచు కోవడం నిజమేనని నిర్ధారణ అయితే దేశం ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్టు కంపెనీ చెబుతున్న విషయాలు అనుమానాలను రేకెత్తి స్తున్నాయి. జనవరి 14న బయల్దేరిన కంటెయినర్ చాలా ఆలస్యంగా చేరిందని కంపెనీ ప్రతినిధి కూనం హరికృష్ణ వివరణ ఇచ్చారు. అంటే మధ్యలో ఎవరో ఈ పనిచేసి ఉండొచ్చని బుకా యించడానికి వీలుగా ఆయన ఈ పాయింట్‌ను ముందుకు తోస్తున్నారు. సంధ్యా కంపెనీ బ్రెజిల్ సంస్థ నుంచి పొడి యీస్ట్‌ను ఖరీదు చేసింది. దాన్ని ఆ సంస్థ కంటైనర్‌లో పెట్టి, సీల్ వేసి ఓడలోకి ఎక్కిస్తుంది. ఈ కంటెయినర్ ఎన్ని దేశాలు తిరిగివచ్చినా ఎవరికీ కంటెయినర్ తెరిచే అవకాశం ఉండదు. ఎక్స్పోర్ట్ చేసిన కంపెనీ కంటెయినర్ సీల్ నెంబర్లను ఇంపోర్ట్ చేసుకునే కంపెనీకి పంపిస్తుంది. ఈ నెంబర్లు చూపెడితేనే ఇంపోర్ట్ చేసుకున్న కంపెనీ సరుకును క్లెయిమ్ చేసుకోగలుగు తుంది. ఇది ప్రొటోకాల్. అందుకే సీబీఐ వారు తమంత తాము కంటెయినర్‌ను తెరవలేదు. కంపెనీ ప్రతినిధులను పిలిపించు కొని వారి సమక్షంలోనే తెరిపించారు. కనుక మధ్యలో ఎవరో డ్రగ్స్‌ను సరుకులో కలిపేయడం అబద్ధం. అనుమానాస్పద శాంపుల్స్‌ను పరీక్షకు పంపించారు. అవి మాదకద్రవ్యాలుగా రుజువై బాధ్యులను శిక్షించగలిగితే పెనుప్రమాదాన్ని నివారించి నట్లవుతుంది. రాజకీయ ఒత్తిళ్లు పైచేయి సాధిస్తే భవిత అంధ కారమవుతుంది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఆ టైటిల్ ఏంటి.. ట్రైలర్లో సీన్లేంటి?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (టీఎస్–నాబ్) అధికారులు అవసరమైన సందర్భాల్లో సినిమాల ’సెన్సార్ బోర్డు’బాధ్యతల్నీ చేపడుతున్నారు. ఆయా చిత్రాల్లో మాదకద్రవాల వినియోగాన్ని ప్రేరేపించేలా ఉన్న సీన్లు, టైటిల్స్ మార్చాల్సిందిగా ఆదేశిస్తున్నారు. గతంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వచి్చన ‘బేబీ’చిత్రంపై స్పందించిన అధికారులు తాజాగా సాయి ధరమ్‌తేజ్ కథానాయకుడిగా రూపొందించిన ‘గాంజా శంకర్’ను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సినిమా టైటిల్ మార్చాలని, చిత్రంలోని సన్నివేశాల్లో సైతం గంజాయి పండించడం, విక్రయించడం, వినియోగించడాలను ప్రోత్సహించేవిగా లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ మేరకు టీఎస్ నాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య శనివారం హీరో సాయి ధరమ్‌తేజ్, నిర్మాత ఎస్.నాగవంశీ, దర్శకుడు సంపత్ నందిలకు నోటీసులు జారీ చేశారు. ‘బేబీ’లో వివాదాస్పదమైన ఓ సీన్... మాదాపూర్‌లోని విఠల్‌నగర్‌లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో జరుగుతున్న ఓ డ్రగ్ పార్టీపై టీఎస్ నాబ్ అధికారులు గతేడాది దాడి చేశారు. ఆ ఫ్లాట్‌లో కనిపించిన సీన్‌కు అప్పట్లో విడుదలైన ‘బేబీ’సినిమాలోని సీన్లకు మధ్య సారూప్యత ఉందని అధికారులు తేల్చారు. దాంతో మాదకద్రవ్యాల వినియోగాన్ని ప్రేరేపించేలా ఉన్న ఆ సన్నివేశాలకు సంబంధించి చిత్ర యూనిట్‌కు నోటీసులు ఇచ్చారు. దీంతో అభ్యంతరకరమైన సీన్లు వచి్చనప్పుడు సినిమాలో వారి్నంగ్ నోట్ వచ్చేలా దర్శకుడు చర్యలు తీసుకున్నారు. తాజాగా మరోసారి తెరపైకి వివాదం... గత ఏడాది సెప్టెంబర్ నాటి ‘బేబీ’చిత్రం తర్వాత ఈ వివాదం మళ్లీ తెరపైకి రాలేదు. తాజాగా శుక్రవారం ట్రైలర్ విడుదలైన గాంజా శంకర్ చిత్రం విషయంలో టీఎస్ నాబ్ కలగజేసుకుంది. ఈ సినిమా టైటిల్‌తో పాటు ట్రైలర్లో కనిపించిన సన్నివేశాలు సైతం యువత... ప్రధానంగా విద్యార్థులను గంజాయి వినియోగం, విక్రయం వైపు ఆకర్షించేలా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ చిత్ర కథానాయకుడు గంజాయి వ్యాపారిగా కనిపిస్తున్నాడని, దీని ప్రభావంతో పలువురు ఆ దారిలో వెళ్లే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు టీఎస్ నాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ‘గాంజా శంకర్’ సినిమా హీరోతో పాటు దర్శకనిర్మాతలకు నోటీసులు జారీ చేశారు. సినిమా టైటిల్‌తో పాటు అభ్యంతరకరమైన, గంజాయి, డ్రగ్స్ వైపు యువతను మళ్లించేలా ఉన్న వాటిని మార్చాలని స్పష్టం చేశారు. సినిమా పేరులో ఉన్న గాంజా అనే పదం తీసేయాలని కోరారు. అలా కాని పక్షంలో ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాలీవుడ్ చిత్రాలపై ఎన్సీబీ సహాయంతో... ఈ నోటీసుల ప్రతిని టీఎస్–నాబ్ అధికారులు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, డైరెక్టర్స్ అసోసియేషన్లతో పాటు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు పంపారు. అయితే బాలీవుడ్ చిత్రాల్లో డ్రగ్స్‌కు సంబంధించిన సీన్లు అనేకం ఉంటున్నాయి. ఇప్పటి వరకు వీటి విషయం ఎవరూ పట్టించుకోలేదు. టీఎస్ నాబ్ అధికారులు మాత్రం వీటినీ తీవ్రంగా పరిగణించాలని యోచిస్తున్నారు. బాలీవుడ్ చిత్రాల్లోనూ డ్రగ్స్‌ను ప్రేరేపించేలా సీన్లు లేకుండా చూడాలని, ఉన్న వాటిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ అ«దీనంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను (ఎన్సీబీ) కోరనున్నారు. ఆ విభాగం లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 14 కోట్ల మంది డ్రగ్స్ వినియోగదారులు ఉన్నారు. డ్రగ్స్ ప్రేరేపించే చిత్రాలను సీరియస్‌గా తీసుకోకుంటే భవిష్యత్తరాలు నిర్విర్యమయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. -
ఈశాన్య సరిహద్దుల్లో మత్తు మహమ్మారి
ఇండియా–మయన్మార్ సరిహద్దులను కంచెతో మూసేస్తామని ఇటీవల కేంద్ర హోంమంత్రి ప్రకటించారు. ఇరుదేశాల మధ్య ఉన్న 1,643 కిలోమీటర్ల సరిహద్దు గుండా ఈశాన్య రాష్ట్రాల్లోకి మత్తు పదార్థాలు, ఆయుధాలు సరఫరా అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అఫ్గానిస్తాన్‌ను దాటి మయన్మార్ ప్రపంచంలో అత్యధిక నల్లమందు ఉత్పత్తిదారుగా అవతరించిందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఆ సాగుకు కావాల్సిన నీరు, ఎరువులు, మూలధన పెట్టుబడులు, కొనుగోలుదారులు, మార్కెటింగ్, హవాలా లాంటి కార్యకలాపాలన్నీ ఒక వ్యవస్థీకృత నెట్‌వర్క్‌గా ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవడంతో పాటుగా, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా సమాజాన్ని జాగృతం చేస్తే తప్ప ఈ ప్రమాదాన్ని అరికట్టలేం. కాలాడాన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్ పోర్ట్ ప్రాజెక్ట్‌లో భాగంగా మయన్మార్‌లోని సీత్త్వే పోర్ట్‌ను మిజోరం రాజధాని ఐజ్వాల్‌తో కలిపే ప్రణాళికలో ముఖ్యమైన పాలేత్వా పట్టణాన్ని సాయుధ తిరుగుబాటు గెరిల్లా గ్రూపు ఆరగాన్ ఆర్మీ స్వాధీనం చేసుకుందన్న వార్తలు... ఇండియా –మయన్మార్ సరిహద్దులను కంచెతో మూసేస్తాం అన్న కేంద్ర హోంమంత్రి ప్రకటన... ఈ రెండు కూడా భారతదేశ భద్రతతో ముడిపడిన అంశాలు. అలాగే ఇటీవల మణిపుర్లో చెలరేగిన జాతుల మధ్య ఘర్షణతో కూడా కొంత సంబంధం ఉన్న విషయాలు. 2003 డిసెంబర్లో వెలువడిన ‘యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్’ నివేదిక ప్రకారం, అఫ్గానిస్తాన్‌ను దాటి మయన్మార్ ప్రపంచంలో అత్యధిక నల్లమందు ఉత్పత్తిదారుగా అవతరించింది. అఫ్గానిస్తాన్‌లో నల్లమందు సాగుపై తాలిబన్ ప్రభుత్వం తీసుకొంటున్న కఠిన చర్యల ఫలితంగా అక్కడి ఉత్పత్తిలో గణనీయమైన తరుగుదల కనిపిస్తుండగా, మయన్మార్‌లో పెరుగుతోందన్న వార్తలు సరిహద్దు పంచుకుంటున్న భారత్ లాంటి దేశాలకు కలవరం కలిగించేదే. దశాబ్దాలపాటు మయాన్మార్లో నెలకొన్న రాజకీయ అస్థిరత, సాయుధ తిరుగుబాటు... నల్లమందు (ఓపియం) ఉత్పత్తి పెరగడా నికి కారణమయ్యాయి. పేదరికంతో బాధపడుతున్న రైతులకు నల్ల మందు సాగు పరిస్థితులు మెరుగుపరుచుకునేందుకు ఒకే ఒకమార్గంగా అవతరించింది. కిలోకు సుమారు 23 వేల రూపాయలు ఆర్జిస్తున్నారు. ఒక కోటి పదిలక్షల హెక్టార్ల సాగు చేయదగిన భూమి ఉన్న మయన్మార్‌లో దాదాపు 47,000 హెక్టార్లు అంటే 0.5 శాతం భూమిలో నల్లమందు పండుతోంది. దీనివల్ల గతేడాది 1080 మెట్రిక్ టన్నుల నల్లమందు ప్రపంచ మార్కెట్లోకి విడుదలైంది. ఇది 2022లో ఆ దేశం ఉత్పత్తి చేసిన నల్లమందు కన్నా సుమారు 36 శాతంఅధికం. ఇదే సమయంలో ఎకరానికి సగటు ఉత్పత్తి 19 నుండి 22 కిలోలకు పెరిగింది. సాగులో అధునాతన పద్ధతులు అవలంబిస్తున్నా రనీ, ఆయా ప్రాంతాలను నియంత్రిస్తున్నవారి సహాయం లేకుండా ఇది సాధ్యపడదనీ మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మొత్తం వ్యాపారం విలువ సుమారు రెండు బిలియన్ డాలర్లు. ఈ నల్లమందు ద్వారా ఉత్పత్పయ్యే హెరాయిన్, మార్ఫీన్, కోడెయిన్ వంటి మత్తు పదార్థాల ద్వారా సుమారు పది బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. ఇది మయన్మార్ స్థూల జాతీయోత్పత్తిలో 2–4 శాతం. మయన్మార్‌లో ముఖ్యంగా మూడు రాష్ట్రాలైన షాన్, చిన్, కాచి న్లలో నల్లమందు సాగు నిరాటంకంగా జరుగుతోంది. థాయిలాండ్, లావోస్ దేశాలను ఆనుకుని ఉండే షాన్‌లో 1750ల లోనే నల్లమందు సాగు మొదలైంది. క్రమంగా ఆ ప్రాంతం మొత్తం విస్తరించి, ఇర వయ్యో శతాబ్దం నాటికి గోల్డెన్ ట్రయాంగిల్ రూపంలో అవతరించడమే గాక, ప్రపంచంలో సగం నల్లమందు ఆధారిత మత్తుపదార్థాలు ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగింది. ఈ ఒక్క రాష్ట్రంలోనే సుమారు 80 శాతం ఉత్పత్తి జరుగుతుంటే, భారత్‌ను ఆనుకొని ఉండే చిన్, కాచిన్ రాష్ట్రాలు మిగిలిన ఇరవై శాతం ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ రాష్ట్రాలలోని టాహం, ఫాలం, తుఎంసెంగ్ ప్రాంతాల మీదుగా మయన్మార్‌తో సుమారు 510 కిలోమీటర్ల కంచె లేని సరిహద్దు కలిగి వున్న మిజోరంలోని ఛాంఫై, మణిపుర్‌లోని మొరెహ్, టాము ప్రాంతాల ద్వారా నల్లమందు భారత్‌లోకి చేరుతోంది. మయన్మార్‌తో సుమారు 1,600 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్న భారత్‌పై, ముఖ్యంగా మిజోరం, మణిపుర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలపై దీని ప్రభావం పడుతుందనడంలో సందేహం లేదు. వివిధ జాతులకు చెందిన సాయుధ పోరాట సంస్థలతో పాటు కొన్ని మిలిటరీ విభాగాలు, రాజకీయ నాయకులు తమ అవసరాల కోసం, ఆయుధాల కొనుగోలు కోసం ఈ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో భాగం పంచుకుంటున్నారు. కాచిన్ ప్రాంతంలోని కాచిన్ ఇండిపెండెన్స్ ఆర్మీ, ఆరగాన్ ఆర్మీ, యునైటెడ్ వా స్టేట్ ఆర్మీ వాటిలో కొన్ని మాత్రమే. అలాగే చిన్ రాష్ట్రం నుండి కార్యకలాపాలు సాగిస్తున్న చిన్ నేషనల్ ఆర్మీ, చిన్ నేషనల్ డెమోక్రాటిక్ ఫోర్స్, చిన్ ల్యాండ్ డిఫెన్స్ ఫోర్స్ లాంటి కొన్ని సాయుధ సంస్థలతో పాటు, సరిహ ద్దులకు ఇరువైపులా కార్యకలాపాలు సాగిస్తున్న కుకీ నేషనల్ ఆర్మీ కూడా ఈ వ్యవహారాల్లో భాగం కావడం ఆందోళన కలిగించేదే. సరి హద్దు దేశాలపై తిరుగుబాటు దారులకు వ్యతిరేకంగా ఒత్తిడి తేవ డానికి మయన్మార్ మిలిటరీ జుంటా కూడా ఈ నల్లమందు అక్రమ రవాణాలో భాగం పంచుకుంటోందని ఆ దేశానికి చెందిన ‘నేషనల్ యూనిటీ కన్సల్టేటివ్ కౌన్సిల్’ సభ్యుడు యు మయూన్గ్ మయూన్స్ ఆరోపిస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌లో చైనీస్ డ్రగ్ కార్టెల్స్ పాత్ర చెప్పుకో దగినది. డ్రగ్స్‌ను అటు ఆగ్నేయాసియా మార్కెట్లలోకి తరలిస్తూ, ఇటు థాయిలాండ్ నుంచి మయన్మార్, బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్ మీదుగా ఈశాన్య రాష్ట్రాల్లోకి ఆయుధాల్ని సరఫరా చేస్తున్నాయి. ఈశాన్య ప్రాంతానికి చెందిన సాయుధ వేర్పాటు దళాలుఇంతకు ముందు నిధుల సేకరణకు బ్యాంకు దోపిడీలు, టీ గార్డెన్లు, వ్యాపార సముదాయాల నుండి అక్రమ వసూళ్లు, ప్రజల వద్ద పన్నులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకుల నుండి డబ్బు గుంజడాలు లాంటివి చేస్తుండేవి. ఈ నిధులను మయన్మార్‌లోని కాచిన్ వేర్పాటు వాద వర్గాల నుండి ఆయుధాలు కొనుగోలు కోసం వెచ్చిస్తుండేవి. అవి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పాలుపంచుకునేవి కాదు. కానీ గత కొన్నేళ్లుగా ఈ ధోరణిలో మార్పువస్తోంది. ఈ వ్యవహారాలను పరిశీలిస్తే, నాలుగు విషయాలు గోచరిస్తాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని కొండ, మారుమూల ప్రాంతాల్లో నల్లమందు, గంజాయి సాగు పెరుగుతోంది. హెరాయిన్, యాంఫేట మిన్ లాంటి మత్తు పదార్థాలు చిన్న పరిమాణాల్లో ఈశాన్య రాష్ట్రాలకు వస్తున్నాయి. కొన్ని రకాల ఫార్మాస్యూటికల్స్ ఈశాన్య రాష్ట్రాల నుండి మయన్మార్‌లోకి రవాణా అవుతున్నాయి. యాంఫేటమిన్ లాంటి మత్తు పదార్థాలు ఉత్పత్తి చేయడానికి కావాల్సిన ఫెడ్రిన్, సూడోపె డ్రిన్ లాంటివి మయన్మార్‌కు ఈశాన్య రాష్ట్రాల నుండి వెళ్తున్నాయి. అంటే సరిహద్దులకు ఇరు వైపులా సాగుతున్న వ్యవహారం ఇది! పశ్చిమాన అఫ్గానిస్తాన్, వాయవ్య పాకిస్తాన్, మధ్య ఆసియాతో కూడిన ‘గోల్డెన్ క్రెసెంట్’కూ... తూర్పున మయన్మార్, థాయిలాండ్, లావోస్‌లతో కూడిన ‘గోల్డెన్ ట్రయాంగిల్’కూ మధ్యలో ఉన్న భారత్ మాదక ద్రవ్యాలకు అతిపెద్ద ఆకర్షణీయమైన మార్కెట్. మత్తు పదా ర్థాలను ఏమాత్రం సహించని(జీరో టోలెరెన్స్) విధానాన్ని కేంద్ర ప్రభుత్వ స్వీకరించింది. దీనిలో భాగంగా 2016లో నార్కో కోఆర్డి నేషన్ సెంటర్, కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం2019లో జాయింట్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటైనాయి. ‘నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్’ చట్టం 1985లో భాగంగా బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, అస్సాం రైఫిల్స్‌కు డ్రగ్స్ వ్యతిరేక చర్యలు తీసుకోవడానికి అధికారం కల్పించారు. ఇప్పటివరకూ సుమారు ఒకటిన్నర లక్షల కిలోల మత్తు మందులను స్వాధీనం చేసుకొని ధ్వంసం చేస్తే, అందులో నలభై వేల కిలోలు ఒక్క ఈశాన్య రాష్ట్రాల్లోవే. ప్రభుత్వాలే కాకుండా వివిధ రంగాల ప్రజలు కూడా సమాజాన్ని జాగృతం చేస్తేనే మత్తు మహమ్మారిని అరికట్టగలం. కొన్ని సినిమాల్లో చూపిస్తున్న విధంగా డ్రగ్స్ సేవించడం, సైకోల్లా ప్రవర్తించడమే హీరోయిజంగా యువత భావిస్తే మనం కేవలం నిట్టూర్పు విడవాల్సి వస్తుంది. - వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, దక్షిణాసియా వ్యవహారాల అధ్యయన విభాగం, జేఎన్‌యూ ‘ 79089 33741 - డాక్టర్ గద్దె ఓంప్రసాద్ -
Telangana: ఇక డ్రగ్స్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: మత్తులో జోగుతూ వాహనాలు నడిపేవాళ్ల కట్టడికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తారు. కొత్త ఏడాది నుంచి ఇక తెల్లవారులూ ప్రధాన నగరాల్లో.. పట్టణాల్లో మందు బాబుల భరతం పట్టేందుకు సిద్ధమవుతోంది రాష్ట్ర పోలీస్ శాఖ. ఈ తరుణంలో.. న్యూఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా ప్రయోగాత్మకంగా డ్రగ్స్ డ్రైవ్ నిర్వహణకు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో సిద్ధమైంది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల తరహాలోనే.. డ్రగ్స్ డిటెక్షన్ పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో నిర్ణయించుకుంది. ఇందుకోసం కొత్త కిట్లను రప్పించుకుని పోలీస్ శాఖకు అప్పగించింది. ఇక శాంపిల్స్, ల్యాబ్ టెస్టులు పాత ముచ్చట. ఈ కొత్త కిట్ల ద్వారా మూడు రోజుల తర్వాత కూడా రక్త, మూత్ర పరీక్షల ద్వారా డ్రగ్స్ తీసుకున్న సంగతి బయపడుతుంది. బ్రీత్ అనలైజర్ టెస్ట్ రాగానే అప్పటికప్పుడే డ్రగ్స్ తీసుకుంటే పాజిటివ్ రిపోర్టు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే.. పాజిటివ్ రిపోర్టు రాగానే మరిన్ని పరీక్షల కోసం మూత్ర పరీక్షలు అధికారులు చేస్తారు. రెండింటిలోనూ పాజిటివ్ రిపోర్టు వస్తే సదరు వ్యక్తిని అదుపు తీసుకుంటారు. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వినియోగం అరికట్టడమే లక్ష్యం నార్కోటిక్ బ్యూరో చర్యలు తీసుకుటోంది. ఇప్పటికే కొత్త పరికరాలు ఒక్కో కమిషనరేట్‌కు పాతిక దాకా పంపించారు. డ్రగ్ డిటేక్షన్ పరీక్షలపై పోలీసులకు ఇప్పటికే శిక్షణ పూర్తి అయిందిని అధికారులు తెలిపారు. ట్రై కమిషనరేట్ పరిధిలో జంక్షన్ల వద్ద డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ టెస్టులు ఇచ్చే ఫలితం ఆధారంగా.. వారాంతాల్లో రెగ్యులర్‌గా ఇలాంటి చెకింగ్లు నిర్వహించే యోచనలో ఉంది తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో. మరోవైపు రాష్ట్రంలో డ్రగ్స్ అరికట్టే విషయంలో తెలంగాణ కొత్త సర్కార్ సీరియస్‌గా ఉంది. ఈ క్రమంలోనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని నిర్ణయించుకుంది. కఠిన చర్యలు తప్పవు నయా సాల్ వేడుకల్లో మత్తులో ఊగితే కఠిన చర్యలు తప్పవని నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. పబ్బు, రిసార్ట్ మేనేజర్లకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాం. ఎవరైనా డ్రగ్స్ వాడినట్లయితే వారిపై చర్యలు ఉంటాయి. పబ్బులపైన పూర్తిస్థాయిలో నిఘా పెట్టాం. పబ్బుల్లో.. రిసార్టుల్లో డ్రగ్స్ దొరికితే వారి లైసెన్స్ రద్దు చేస్తాం. భవిష్యత్తులో వారికి లైసెన్స్ రాకుండా చేస్తాం. కొన్ని రంగాల వారికి డ్రగ్స్ అవసరాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం ఉంది. ఆయా ఫీల్డ్ వారిని కూడా హెచ్చరిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ వాడొద్దు అని హెచ్చరించారాయన. అలాగే.. కొత్త సంవత్సర వేడుకలు సందర్భంగా నగరంలో ఆంక్షలు ఉంటాయని తెలిపారు. నగరంలో పలు బ్రిడ్జిలపై రాకపోకలు నిషేధిస్తామని తెలిపారాయన. రాత్రి 10 గంటల నుంచి ‘పీవీ ఎక్స్‌ప్రెస్ వే’ను మూసివేస్తాం. అయితే.. ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారు టికెట్‌ను చూసి పీవీ ఎక్స్‌ప్రెస్ మార్గంలో అనుమతిస్తాం. రాత్రి ఒంటిగంట వరకే వ్యాపారాలను అనుమతిస్తాం. ఒంటి గంట తర్వాత ఎట్టి పరిస్థితిలో వ్యాపారాలు అనుమతించబడవు.. మూసేయాల్సిందే. -
డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం
సాక్షి, హైదరాబాద్: మత్తుపదార్థాల రవాణా, విక్ర య ముఠాలపై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ రవిగుప్తా పునరుద్ఘాటించారు. మత్తుపదార్థాలు అమ్మినా, కొన్నా, వాడినా చట్టప్రకారం కఠిన చర్య లు తప్పవని హెచ్చరించారు. ఎంతటివారున్నా ఈ విషయంలో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. మత్తుపదార్థాల కట్టడి, సైబర్ నేరాల అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా రానున్న ఏడాది ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. 2022తో పోలిస్తే 2023లో రాష్ట్రవ్యాప్తంగా కేసుల నమోదు 8.97 శాతం పెరిగినట్టు వెల్లడించారు. సైబర్ నేరాల నమోదు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషించారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ స్టేట్ పోలీస్ వార్షిక నివేదిక 2023ను డీజీపీ రవిగుప్తా విడుదల చేశారు. కార్యక్రమంలో శాంతిభద్రతల అడిషనల్ డీజీ సంజయ్‌కుమార్ జైన్, హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, సీఐడీ అడిషనల్ డీజీ శిఖాగోయల్, రోడ్డు భద్రత విభాగం అడిషనల్ డీజీ మహేశ్ భగవత్, నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఆపరేషన్స్ అడిషనల్ డీజీ విజయ్‌కుమార్, సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, రాచకొండ సీపీ సుధీర్‌బాబు, ఐజీలు రమేశ్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్ ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రానున్న ఏడాదిలో పోలీస్‌శాఖ భవిష్యత్ కార్యాచరణ అంశాలను డీజీపీ వివరించారు. డీజీపీ పేర్కొన్న కీలక అంశాలు: ♦ మత్తుపదార్థాల విషయంలో అత్యంత కఠిన వైఖరితో ఉంటాం. ఒక్క డ్రగ్స్ కేసు నమోదైనా పీడీయాక్ట్ పెట్టే అవకాశం ఉంటుంది. ♦ పబ్బులు, క్లబ్బులు, ఫాంహౌస్‌లు, బార్లలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా అత్యంత కఠినచర్యలు తప్పవు. ♦ తల్లిదండ్రులు, విద్యా సంస్థలు సైతం మత్తుపదార్థాల కట్టడిలో పోలీస్‌శాఖతో కలిసి రావాలి. విద్యా సంస్థల్లోనూ యాంటీ డ్రగ్స్వాడకంపై దృష్టి పెట్టాలి. ♦ దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేశాం. సైబర్ నేరాలపై ఇప్పటివరకు 90 వేల ఫిర్యాదులు అందాయి. ♦ సైబర్‌నేరాలపై 14,271 ఎఫ్ఐఆర్ల నమోదుతో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ నిలిచింది. ఎస్ఎంఎస్ ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చాం. ♦ రోడ్డు ప్రమాదాలు తగ్గిడంలో ఈ ఏడాది సఫలం అయ్యాం. ♦ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం ఎంతో మెరుగైంది. రాష్ట్రంలో ఇప్పుడు సరాసరి రెస్పాన్స్ టైం 7 నిమిషాలు. ♦ అతి త్వరలోనే 15,750 మంది వివిధ శాఖల్లోని కానిస్టేబుళ్ల ట్రైనింగ్ ప్రారంభిస్తాం. -
తెలంగాణలో డ్రగ్స్ మాట వినపడొద్దు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం పలు కీలక విభాగాలపై సమీక్ష చేపట్టారు. ఉదయం నుంచి ఆయన ఐదు కీలక శాఖలపై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో డ్రగ్స్ మాట వినపడొద్దని అన్నారు. ప్రతినెల నార్కోటిక్ బ్యూరోపై రివ్యూ చేస్తామని తెలిపారు. వ్యవసాయం, నార్కోటిక్ అండ్ డ్రగ్స్, ఎక్సైజ్, టీఎస్పీఎస్సీ, సింగరేణిలపై రేవంత్‌రెడ్డి సుదీర్ఘంగా సమీక్ష చేశారు. మరోసారి టీఎస్పీఎస్సీపై సమీక్ష నిర్వహించినున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. -
సినిమాల్లోని సీన్ల పైనా నజర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (టీఎస్–నాబ్) అధికారులు మాదాపూర్‌లోని విఠల్‌నగర్‌లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో గత నెల 31న జరిగిన ఓ డ్రగ్ పార్టీపై దాడి చేశారు. ఆ ఫ్లాట్‌లో కనిపించిన సీన్... ఇటీవల విడుదలైన ‘బేబీ’ సినిమాలోని సీన్లకు మధ్య సారూప్యత ఉందని హైదరాబాద్ పోలీసు కమిషనర్, టీఎస్ నాబ్ డైరెక్టర్ సీవీ ఆనంద్ అన్నారు. మాదకద్రవ్యాల వినియోగాన్ని ప్రేరేపించేలా ఉన్న ఆ సన్నివేశాలకు సంబంధించి చిత్ర యూనిట్‌కు నోటీసులు ఇచ్చామని, వారు తమ ఎదుట హాజరై వివరణ ఇచ్చారని గురువారం చెప్పారు. అందులో ఉన్న సీన్లపై తాము చెప్పిన తర్వాతే సినిమాలో వార్నింగ్ నోట్ పెట్టారని, అప్పటివరకు అలాంటిది కూడా లేదని అన్నారు. ఇలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలను సినిమాల్లో పెట్టవద్దని ఆనంద్ హితవు పలికారు. వీటి ద్వారా స్ఫూర్తి పొంది అనేక మంది యువకులు మాదకద్రవ్యాలకు బానిసలుగా మారే ప్రమాదం ఉందన్నారు. గతంలోనూ ఇలాంటి సీన్లతో కూడిన సినిమాలు వచ్చాయని, అయితే వాటిని ఎవరూ పట్టించుకోలేదని చెప్పిన ఆనంద్.. ఇకపై ఈ తరహాలో ఉన్న వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘టాలీవుడ్ లింకులు ఉన్న డ్రగ్స్ కేసు’లో పరారీలో ఉన్న సూర్య.. స్నాట్ అనే పేరుతో పబ్ నిర్వహిస్తున్నాడని, కొకైన్ వంటి మాదకద్రవ్యాలను స్నాటింగ్ ప్రక్రియ ద్వారా వినియోగిస్తారని చెప్పారు. దీన్ని బట్టి సూర్య తన వద్ద మాదకద్రవ్యాలు లభిస్తాయని అర్థం వచ్చేలా తన పబ్‌కు పేరు పెట్టాడని భావించాల్సి వస్తోందని ఆనంద్ వ్యాఖ్యానించారు. బాలీవుడ్ చిత్రాల్లోనూ డ్రగ్స్‌ను ప్రేరేపించే సీన్లు లేకుండా చూడాలని, ఉన్న వాటిపై చర్యలు తీసుకోవాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను (ఎన్సీబీ) కోరతామన్నారు. ఎన్సీబీ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది డ్రగ్స్ వినియోగదారులు ఉన్నారని, దీన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని వివరించారు. తాము ఇటీవల కాలంలో 33 మంది నైజీరియన్లను అరెస్టు చేయగా, వారిలో 18 మంది బెంగళూరులో స్థిరపడిన వారిగా తేలిందన్నారు. టీఎస్ నాబ్ సేవల విస్తరణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని హైకోర్టును కోరతామని చెప్పారు. -
డ్రగ్స్ బారి నుంచి యువత, మహిళలకు విముక్తి
సాక్షి, అమరావతి: దేశంలో మాదకద్రవ్యాల బారి నుంచి యువత, మహిళలను విముక్తి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నాయని కేంద్ర హోం శాఖ తాజాగా పేర్కొంది. జాతీయ స్థాయిలో నషా ముక్త్ భారత్ అభియాన్ కింద మాదకద్రవ్యాల వినియోగం నుంచి యువత, మహిళలను దూరం చేయడానికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని వెల్లడించింది. నషా ముక్త్ భారత్ అభియాన్ కింద దేశంలో అత్యధికంగా మాదకద్ర వ్యాలు వినియోగించే 372 జిల్లాల్లో 8 వేల మంది యువ వలంటీర్ల ద్వారా పెద్ద ఎత్తున కమ్యూనిటీ ఔట్రీచ్ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపింది. తద్వారా 3.12 కోట్ల మంది యువతను మాదకద్ర వ్యాల వినియోగం నుంచి దూరం చేసినట్లు వెల్లడించింది. అలాగే 2.06 కోట్ల మంది మహిళలకు కూడా విముక్తి కల్పించినట్టు పేర్కొంది. ఇందుకు కార్యా చరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపింది. మాదకద్రవ్యాలకు బానిస లైన వారి కోసం 340 సమీకృత పునరావాస కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని వివరించింది. చికిత్స అందించడ మే కాకుండా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది. డీఅడిక్షన్ కోసం హెల్ప్‌లైన్ మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక డీఅడిక్షన్ కేంద్రా లకు కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తోందని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 46 డ్రగ్స్ చికిత్సలను అందిస్తున్నట్టు తెలిపింది. అలాగే ప్రాథమిక కౌన్సెలింగ్, తక్షణ సహాయం అందించడానికి డీఅడిక్షన్ కోసం టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ 14446 ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్‌తో పాటు రాష్ట్ర విద్యా శిక్షణ, పరిశోధన సంస్థలు, కేంద్రీయ విద్యా లయాల ద్వారా క్రమం తప్పకుండా మాదకద్రవ్యా ల వినియోగం వల్ల కలిగే నష్టాలు, హానిపై అవ గాహన కల్పిస్తున్నామని తెలిపింది. అలాగే విద్యా ర్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు సెన్సిటైజే షన్ సెషన్లు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. గత మూడేళ్లలో డ్రగ్స్ వినియో గిస్తున్న వారిపై 1,24,891 కేసులను నమోదు చేయ డంతో పాటు 1,30,458 మందిని అరెస్టు చేసినట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. 18 ఏళ్లలోపు డ్రగ్స్ వినియోగిస్తూ అరెస్టు అయిన వారి గణాంకాలను పరిశీలిస్తే.. పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ఉన్నట్లు బాంబుపేల్చింది. గత మూడేళ్లలో 18 ఏళ్లలోపు డ్రగ్స్ వినియోగిస్తున్న 935 మంది పురుషులు అరెస్టు కాగా అదే సమయంలో 9,077 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకు న్నారని పేర్కొంది. 2018 సర్వే ప్రకారం.. దేశంలో 10 నుంచి 17 ఏళ్లలోపు 86 లక్షల మంది పిల్లలు మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు తేలిందని వెల్లడించింది. -
యూఎస్‌ను వణికిస్తున్న జాంబీ డ్రగ్.. ఒళ్లంతా పుండ్లు, అవయవాల తొలగింపు
జైలజీన్. ప్రస్తుతం అమెరికాను వణికిస్తున్న ‘జాంబీ’ డ్రగ్. గుర్రాలు, ఆవులు తదితర జంతువుల్లో నరాలకు విశ్రాంతి ఇచ్చే నిమిత్తం అనుమతించిన ఈ ట్రాంక్విలైజర్ ఇప్పుడక్కడ పెను విలయానికి దారి తీస్తోంది. దీన్ని ఫెంటానిల్ అనే డ్రగ్‌తో కలిపితే అత్యంత హెచ్చు పొటెన్సీతో కూడిన ప్రాణాంతకమైన మత్తుమందుగా మారుతోంది. కారుచౌకగా తయారవుతుండటంతో డ్రగ్ డీలర్లు కొన్నేళ్లుగా దీన్నే విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారు. ట్రాంక్, ట్రాంక్ డోప్, జాంబీ డ్రగ్‌గా పిలిచే ఈ డ్రగ్ ప్రస్తుతం యూఎస్ వీధుల్లో పొంగి పొర్లుతోంది. ఎక్కడ చూసినా డ్రగ్ బానిసలు ట్రాంక్ మత్తులో జోగుతూ కన్పిస్తున్నారు. శరీరంపై దీని దుష్ప్రభావాలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి. ఒంటిపై పుండ్లు పడటం, చర్మం ఊడిపోవడంతో మొదలై చూస్తుండగానే ఒంట్లో శక్తులన్నీ ఉడిగిపోయే పరిస్థితి తలెత్తుతోంది. అడుగు తీసి అడుగేయడమూ కష్టమై బాధితులు నడిచే శవాల్లా మారి అచ్చం జాంబీలను తలపిస్తున్నారు! ఈ ధోరణి కొంతకాలంగా మరీ ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతోంది. కేంద్ర స్థానం ఫిలడెల్పియా ఈ జాంబీ డ్రగ్ ఉత్పాతానికి ఫిలడెల్పియా కేంద్ర స్థానంగా తేలింది. మామూలుగానే ఈ నగరం డ్రగ్స్ డీలర్లకు, బానిసలకు అడ్డా. దాంతో సహజంగానే జాంబీ డ్రగ్ వాడకం కూడా ఇక్కడ విచ్చలవిడిగా పెరిగింది. ఏ వీధిలో చూసినా దీని ప్రభావంతో ఎటూ కదల్లేక ఎక్కడపడితే అక్కడ పడిపోయిన డ్రగ్ బానిసలే కన్పిస్తున్నారు. జాంబీ డ్రగ్ బెడద చూస్తుండగానే అమెరికా అంతటికీ పాకుతోంది. తూర్పున న్యూయార్క్, మసాచుసెట్స్, మైన్, పశ్చిమ తీరంలో కాలిఫోర్నియా, ఓరెగాన్, వాషింగ్టన్, దక్షిణాన టెక్సాస్, లూసియానా, అలబామా... ఇలా 36కు పైగా రాష్ట్రాల్లో వేలాది జాంబీ కేసులు వెలుగు చూడటం అధికారులను ఆందోళన పరుస్తోంది. సమస్య తీవ్రత బయటికి కన్పిస్తున్న దానికంటే చాలా ఎక్కువగా ఉందని అధికారులే అంగీకరిస్తున్నారు. ఫిలడెల్ఫియాలోనే ఏకంగా 90 శాతానికి పైగా డోప్ టెస్ట్ శాంపిళ్లలో జైలజీన్ జాడలు కన్పించాయి. న్యూయార్క్ నగరంలో 25 శాతానికి పైగా శాంపిళ్లలో జైలజీన్ బయటపడింది. సులువుగా దొరికేస్తోంది జైలజీన్ అమెరికాలో అతి సులువుగా దొరుకుతోంది. కేవలం పశువుల డాక్టర్ చీటీ చాలు. పైగా కారుచౌక కూడా. దీంతోపాటు దీని సరఫరాపై పెద్దగా నియంత్రణ కూడా లేదు. ఇది డ్రగ్ మాఫియాకు మరింతగా కలిసొచ్చింది . కరోనా సమయంలో ఫెంటానిల్ వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఆ క్రమంలోనే ట్రాంక్ వాడకం పెచ్చరిల్లింది! మితిమీరిన డ్రగ్స్ వాడకం వల్ల మరణిస్తున్న వారి సంఖ్య అమెరికాలో బాగా పెరుగుతోంది. 2021లో లక్ష మందికి పైగా డ్రగ్స్‌కు బలయ్యారు! వీటిలో 70 వేలకు పైగా కేసుల్లో ఫెంటానిల్ వాడినట్టు తేలింది. వాటిలో చాలావరకు ట్రాంక్ కేసులేనని అనుమానిస్తున్నారు. జాంబీ డ్రగ్ వాడితే... ♦ జైలజీన్ చర్మాన్ని, మాంసాన్ని తినేస్తుంది. ♦ కేంద్ర నాడీ వ్యవస్థపై నేరుగా తీవ్ర ప్రభావం చూపుతుంది. ♦ రక్తనాళాలు పాడవుతాయి. రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది. ♦ దాంతో చర్మం ఊడటంతో పాటు ఒళ్లంతా పుండ్లు పుడతాయి. ♦ పుండ్లు ముదిరి సంబంధిత అవయవాలు కుళ్లిపోతున్నాయి.వాటిని తీసేయాల్సి వస్తోంది. ♦ మతిమరుపు వంటి మరెన్నో భయానక సైడ్ ఎఫెక్టులూ తలెత్తుతాయి. ♦ గుండె, ఊపిరితిత్తుల పనితీరు, కంటిచూపు మందగిస్తాయి. ♦ శ్వాస అందదు. బీపీ పడిపోయి ప్రాణాంతకంగా మారుతుంది. ‘‘జాంబీ డ్రగ్ తమకు మరింతగా లాభాల పంట పండించగలదని ఫిలడెల్పియా డ్రగ్ డీలర్లు తొలుత కనిపెట్టారు. ఇప్పుడిది అమెరికాను దాటి కెనడా దాకా విస్తరించింది’’ – నబురన్ దాస్‌గుప్తా, ఎపిడెమాలజిస్ట్, సీనియర్ సైంటిస్ట్, నార్త్ కరోలినా వర్సిటీ చికిత్స లేదు ఫిలడెల్పియా తదితర చోట్ల స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడిచే ఆస్పత్రులు, క్లినిక్‌లకు జాంబీ డ్రగ్ బాధితులు బారులు తీరుతున్నారు. చాలామందికి కాళ్లు, చేతులు తీసేయాల్సి వస్తోందని వైద్యులు చెబుతున్నారు. తమ వద్దకు వస్తున్న వారికంటే రకరకాల కారణాలతో ముఖం చాటేస్తున్న వారే చాలా ఎక్కువగా ఉంటారని వారంటున్నారు. అయితే జైలజీన్ ఓవర్ డోస్ తాలూకు దుష్ప్రభావాలను తగ్గించేందుకు చికిత్స ఏదీ ఇప్పటిదాకా అందుబాటులో లేకపోవడం మరింత ఆందోళనకు కారణమవుతోంది. ఫెంటానిల్‌తో పాటు ఇతర డ్రగ్స్ తాలూకు లక్షణాలను నెమ్మదింపజేయడానికి వాడే నాలోగ్జోన్ వంటివాటినే ప్రస్తుతానికి వీరికీ వాడుతున్నారు. కాకపోతే జైలజీన్ వాడకంతో తలెత్తున్న శ్వాస, బీపీ సమస్యలకు ఇది పని చేయడం లేదు. జైలజీన్ వాడకం తాలూకు సైడ్ ఎఫెక్టుల గురించి హెచ్చరిస్తూ అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) గత నవంబర్లోనే చాలా రాష్ట్రాల్లోని ఆస్పత్రులు, క్లినిక్‌లకు అలర్ట్ పంపింది. చూడటానికి ఇతర డ్రగ్ ఓవర్ డోస్ కేసుల్లాగే కన్పించడం వల్ల దీన్ని ఆరంభ దశలోనే కనిపెట్టడం కూడా కష్టమే. జైలజీన్ కథా కమామిషు ♦ గుర్రాలు, ఆవులు, గొర్రెలపై వాడేందుకు దీన్ని 1962లో తయారు చేశారు. ♦ అప్పట్లోనే మనుషులపైనా ప్రయోగాలు చేసినా శ్వాస, హృదయ స్పందన, బీపీ తగ్గిపోవడంతో నిలిపేశారు. ♦ 2000 నుంచీ డ్రగ్ బానిసలు దీన్ని హెరాయిన్‌తో కలిపి తీసుకోవడం మొదలైంది. ♦ కొకైన్, ఓపియం వంటివాటితో కలిపినా ఇది ప్రాణాంతకమే. కానీ ఫెంటానిల్ చౌక కావడంతో ఎక్కువగా దాన్నే వాడుతున్నారు. ♦ ఇలా ట్రాంక్గా పిలిచే జైలజీన్–ఫెంటానిల్ మిశ్రమ డ్రగ్ వాడకం 2011లో ప్యూర్టోరికోలో మొదలైంది. ♦ ప్యూర్టోరికో వాసులు ఎక్కువగా ఉండే ఫిలడెల్పియా లోని కెన్సింగ్టన్ తదితర చోట్లకూ పాకింది. ♦ కారుచౌకగా దొరుకుతుండటంతో కరోనా వేళ దీని వాడకం విచ్చలవిడిగా పెరిగింది. ♦ ఇప్పుడు అమెరికాలో కనీసం 30కి పైగా రాష్ట్రాల్లో విస్తరించి వణుకు పుట్టిస్తోంది. ♦ జైలజీన్ కారుచౌక. పైగా కేవలం పశువుల డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే ఎంత పరిమాణంలో అయినా దొరుకుతుంది. ♦ ఇంజక్షన్‌తో పాటు పొడి రూపంలో కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉండటంతో డ్రగ్ డీలర్ల పని మరింత తేలికైంది. ♦ హెరాయిన్ డోసు కనీసం 10 డాలర్లు పెట్టనిదే దొరకదు. కానీ ట్రాంక్ మాత్రం మూడు నాలుగు డాలర్లకే దొరికేస్తోంది. ♦ ఇల్లూ వాకిలీ లేక రోడ్లపై కాలం గడుపుతూ ఏళ్ల తరబడి డ్రగ్స్‌కు బానిసలైన అమెరికన్లంతా ట్రాంక్ బాట పడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నార్కొటిక్స్ రహిత రాష్ట్రంగా ఏపీ మారాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : రాష్ట్రంలో ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) పనితీరు పైన సోమవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. నార్కొటిక్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారాలని ఈ సమావేశంలో ఆయన ఆకాంక్షించారు. ఎక్కడా మాదక ద్రవ్యాలు వినియోగం ఉండొద్దు.. ఆ లక్ష్యంతోనే పని చేయాలంటూ పోలీస్, ఎక్సైజ్ శాఖలు కలిసి పని చేయాలంటూ ఆయన సూచించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన.. పలు కీలక సూచనలు చేశారు. ఎస్ఈబీ సమీక్ష సందర్భంగా.. నార్కొటిక్స్‌తో పాటు అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టడం, మరింత సమన్వయంతో సచివాలయాల్లోని మహిళా పోలీస్‌ల పనితీరును మెరుగుపర్చడం, దిశ చట్టం.. యాప్‌లను మరింత పక్కాగా అమలు చేసేలా చూడడం.. ఈ నాలుగింటిపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే.. రాష్ట్రాన్ని నార్కొటిక్స్ రహిత ప్రాంతంగా తీర్చి దిద్దడంలో ఎక్సైజ్, ఎస్ఈబీ అధికారులతో పోలీస్ శాఖ మరింత సమన్వయంతో పని చేయాలని కోరారు. అదే విధంగా దిశ యాప్ వినియోగం, కాల్స్, వేగంగా స్పందించడం వంటి వాటిపై అన్ని చోట్లా మాక్ డ్రిల్స్ నిర్వహించాలని సీఎం జగన్ సూచించారు. ఇకపై వారంలో రెండు సమావేశాలు మరింత సమర్థవంతంగా పని చేసేందుకు ప్రతి మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు. అక్రమ మద్యం నియంత్రణ దిశలో ఎస్ఈబీ, ఎక్సైజ్ అధికారులు తీసుకున్న చర్యలు, గంజాయిసాగు అరికట్టడంపై సమీక్షించాలన్నారు. అలాగే.. ప్రతి గురువారం పోలీస్ ఉన్నతాధికారులు సమావేశం కావాలన్నారు. జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. నార్కొటిక్స్, అక్రమ మద్యాన్ని అరి కట్టడం, సచివాలయాల మహిళా పోలీసులతో సమన్వయం, దిశ చట్టం, యాప్ ఇంకా సమర్థ వినియోగంపై సమీక్షించాలని, ఇక నుంచి ఇవన్నీ రెగ్యులర్‌గా జరగాలని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. కాలేజీలు, వర్సిటీల్లో ప్రచారం ఎస్ఈబీ టోల్‌ఫ్రీ నెంబర్.. 14500తో పాటు, నార్కొటిక్స్ నియంత్రణపై అన్ని కాలేజీలు, యూనివర్సిటీల వద్ద పెద్ద హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలని, విద్యార్థులు నార్కొటిక్స్ వినియోగించకుండా అరికట్టాలని సీఎం జగన్ కోరారు. వచ్చే మూడు, నాలుగు నెలల్లో నార్కొటిక్స్ రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చి దిద్దాలని ఆయన ఆకాంక్షించారు. అదే లక్ష్యంతో పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులు పని చేయాలని కోరారు. మన యూనివర్సిటీలు, కాలేజీలు.. అన్నీ జీరో నార్కొటిక్స్‌గా ఉండాలి. అదే ఆయా శాఖల లక్ష్యం కావాలి. ఇందు కోసం నెల రోజుల్లో అన్ని కాలేజీలు, వర్సిటీల్లో హోర్డింగ్‌ల ఏర్పాటు పూర్తి కావాలి అని చెప్పారు. పటిష్టం చేయండి మహిళా పోలీసులు, దిశ చట్టం, యాప్‌ను ఇంకా పటిష్టం చేయాలి. మహిళా పోలీసుల పనితీరు ఇంకా మెరుగుపర్చడంపై దృష్టి పెట్టాలి. రాష్ట్రంలో దాదాపు 15 వేల మంది మహిళా పోలీస్‌లు ఉన్నారు. ఇంకా దిశ చట్టాన్ని ఇంకా బాగా అమలు చేయాలి. యాప్ డౌన్లోడ్స్ పెరగాలి అని సీఎం జగన్.. సంబంధిత అధికారులకు తెలిపారు. ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి: గంజాయిసాగుదార్లకు వ్యవసాయం, పాడి వంటి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలి. అప్పుడు వారికి శాశ్వత ఉపాధి కల్పించినట్లు కూడా అవుతుంది. గంజాయి సాగుదార్లను మార్చే విధంగా, ‘ఆపరేషన్ పరివర్తన్’ నిర్వహించాలని సీఎం జగన్ సూచించారు. ఎస్ఈబీ ఇంకా సమర్థంగా.. అక్రమ మద్యం గురించి కానీ, పబ్లిక్ ప్లేసెస్‌లో మద్యపానం కానీ.. ఇసుక ఎక్కువ ధరకు అమ్మడం కానీ.. ఇలా దేనిపై ఫిర్యాదు వచ్చినా ఎస్ఈబీ అధికారులు వెంటనే స్పందించాలి. తగిన చర్య తీసుకోవాలి. ఆ విధంగా ఎస్ఈబీ మరింత సమర్థంగా పని చేయాల్సిన అవసరం ఉంది. ఎస్ఈబీ పరిధి కేవలం లిక్కర్ వరకే కాకుండా నార్కొటిక్స్, గంజాయి, గుట్కాలు.. వంటి వాటి విషయాల్లో కూడా కఠినంగా వ్యవహరించాలి. లోకల్ ఇంటలిజెన్స్‌ను (నిఘా)ను బాగా వినియోగించుకోవాలి. ప్రత్యేక గుర్తింపు రావాలి.. మనం చేసిన పనుల వల్ల అవార్డులు రావాలి. దేశంలో ఎక్కడ మన మాదిరిగా సచివాలయాల్లో మహిళా పోలీసులు లేరు. కాబట్టి వారిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి. దాని వల్ల మంచి ఫలితాలు రాబట్టవచ్చు. దేశమంతా మనవైపు చూసేలా మన చర్యలు ఉండాలి. ఆ స్థాయిలో పనితీరు చూపాలి. ఆర్వోఎఫ్ఆర్ పట్టా భూములు.. రాష్ట్రంలో 1.15 లక్షల కుటుంబాలకు 2.82 లక్షల ఎకరాలకు సంబంధించి ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చామన్న సీఎం, ఆ భూముల అభివృద్ధికి సంబంధించి తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో మద్యం విక్రయాలు, అక్రమ మద్యం నియంత్రణ, ఆ దిశలో తీసుకున్న చర్యలు, గంజాయి సాగు ధ్వంసం, ఆ సాగుదార్లపై తీసుకున్న చర్యలు, కేసుల నమోదు.. వంటి అన్నింటిపై సమీక్షలో అధికారులు వివరించారు. ఎస్ఈబీ సమీక్ష సమావేశానికి.. డిప్యూటీ సీఎం (ఎక్సైజ్) కే. నారాయణ స్వామి, హోంమంత్రి తానేటి వనిత, డీజీపీ కేవి. రాజేంద్రనాథ్ రెడ్డి, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఎక్సైజ్ శాఖ కమిషనర్ వివేక్ యాదవ్, ఎస్ఈబీ కమిషనర్ ఏ.రవిశంకర్, ఎస్ఈబీ డైరెక్టర్ రమేష్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
ముంబై, గుజరాత్ తీరాల్లో రూ.852 కోట్ల డ్రగ్స్ పట్టివేత
ముంబై/అహ్మదాబాద్: వేర్వేరు తీరప్రాంతాల్లో రూ.852 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు అధికారుల చేతికి చిక్కాయి. మహారాష్ట్రలోని నవీ ముంబై పొరుగున ఉండే నహావా షెవా నౌకాశ్రయంలో ఆపిల్ పండ్ల కంటైనర్‌లో యాభై కేజీల అత్యంత నాణ్యమైన కొకైన్ మాదకద్రవ్యాన్ని రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఇటుకల్లా ఒక్కోటి కేజీ బరువుండేలా ప్యాక్చేసిన డ్రగ్స్‌ను గ్రీన్ ఆపిల్స్ మధ్యలో అధికారులు కనుగొన్నారు. సముద్రమార్గ కంటైనర్లలో ఇంతటి భారీ స్థాయిలో డ్రగ్స్ దొరకడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ డ్రగ్స్‌ను దక్షిణాఫ్రికా నుంచి స్మగ్లర్లు భారత్‌కు తరలించారు. మొత్తంగా 50.23 కేజీల బరువున్న ఈ డ్రగ్స్ అంతర్జాతీయ విపణిలో ఏకంగా రూ.502 కోట్ల ధర పలుకుతాయని రెవిన్యూ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు శనివారం చెప్పారు. వశీలో ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి బత్తాయి పండ్ల మాటున 198 కేజీల మెథ్, 9 కేజీల కొకైన్‌ను కంటైనర్‌లో తెప్పించిన దిగుమతిదారు వీటినీ తెప్పించాడు. గత వారం నమోదైన కేసులో ఇప్పటికే ఇతడిని పోలీసులు అరెస్ట్చేయడం తెల్సిందే. గుజరాత్లో మరో 50 కేజీలు పాకిస్తాన్ నుంచి వస్తూ గుజరాత్ తీరానికి దూరంగా సముద్రజలాల్లో అడ్డగించిన ఒక పడవలో రూ.350 కోట్ల విలువైన 50 కేజీల హెరాయిన్‌ను భారత తీర గస్తీ దళం, ఉగ్ర వ్యతిరేక దళాలు స్వాధీనంచేసుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వేళ ఈ ఆపరేషన్ నిర్వహించారు. అల్ సకర్ పడవలో ఉన్న ఆరుగురు పాకిస్తానీయులను అరెస్ట్‌చేసి అధికారులు విచారిస్తున్నారు. ఉత్తరభారతం, పంజాబ్‌కు డ్రగ్స్‌ను సరఫరా చేసే పాకిస్తాన్ డ్రగ్ మాఫియా ఈ సరకును పంపించాడని తెలుస్తోంది. -
అమిత్ షా సమక్షంలో 40,000 కిలోల డ్రగ్స్ ధ్వంసం
గువాహటి: మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో ఆధ్వర్యంలో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 40,000 కిలోల వివిధ రకాల డ్రగ్స్‌ను పట్టుకున్నారు. వాటిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో శనివారం ధ్వంసం చేసినట్లు హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం అస్సాం పర్యటనలో ఉన్న అమిత్ షా గువాహటి నుంచి వర్చువల్‌గా డ్రగ్స్ ధ్వంసం చేసే ప్రక్రియను పర్యవేక్షించినట్లు ట్వీట్ చేసింది. అస్సాంలో 11,000 కిలోలు, అరుణాచల్ ప్రదేశ్‌లో 8,000 కిలోలు, మేఘాలయలో 4,000 కిలోలు, నాగాలాండ్‌లో 1600 కిలోలు, మణిపుర్లో 398 కిలోలు, మిజోరాంలో 1900కిలోలు, త్రిపురలో 13,500 కిలోలు పట్టుకున్నట్లు వెల్లడించింది. అస్సాం పర్యటనలో ఉన్న అమిత్ షా.. డ్రగ్ అక్రమ రవాణా, జాతీయ భద్రత అంశంపై ప్రాంతీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈశాన్య ప్రాంతంలో మత్తు పదార్థాల అక్రమ రవాణా, నియంత్రణపై సమీక్షించారు. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఎన్సీబీ ఆధ్వర్యంలో 75,000 కిలోల డ్రగ్స్‌ను ధ్వంసం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అంతకు రెండింతలు 150,000 కిలోలు ధ్వంసం చేయటం చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా పెద్ద విజయం.’ అని తెలిపారు షా. కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్న ఎన్సీబీ జూన్ 1 నుంచి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి మత్తు పదార్థాలను పట్టుకుంటోంది. దేశాన్ని మత్తు పదార్థాల రహితంగా మారుస్తామన్న మోదీ ప్రభుత్వ ఆశయానికి తగినట్లుగా డ్రగ్స్‌ను ధ్వంసం చేస్తున్నట్లు హోంశాఖ తెలిపింది. గత జులై 30న సుమారు 82వేల కిలోల డ్రగ్స్‌ను ధ్వంసం చేశారు. అదే రోజు ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించిన అమిత్ షా.. 31 వేల కిలోల డ్రగ్స్ ధ్వంసం చేసే ప్రక్రియను వర్చువల్‌గా పర్యవేక్షించారు. #WATCH | Union Home Minister Amit Shah conducts a meeting on Drug Trafficking and National Security in Guwahati in the presence of Assam CM Himanta Biswa Saram and Union Minister G Kishan Reddy. pic.twitter.com/yAvXXDvTsn — ANI (@ANI) October 8, 2022 ఇదీ చదవండి: అధ్యక్ష ఎన్నికల్లో చివరి వరకు కొనసాగుతా: శశిథరూర్ -
రూ.1,476 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
న్యూఢిల్లీ: విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న నారింజ పండ్ల ముసుగులో అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు శనివారం ముంబైలో స్వాధీనం చేసుకున్నారు. 198 కిలోల స్పటిక మెథాంఫెటామైన్, 9 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నామని, ఈ డ్రగ్స్ విలువ రూ.1,476 కోట్లు ఉంటుందని తెలిపారు. ముంబైలోని వసీ ప్రాంతంలో అనుమానంతో వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో నారింజ పండ్ల బాక్సుల్లో భద్రపర్చిన మాదక ద్రవ్యాలు లభ్యమయ్యాయని ప్రకటించారు. అక్రమార్కులు దక్షిణాఫ్రికా నుంచి నారింజ పండ్లను దిగుమతి చేసుకున్నట్లు కస్టమ్స్ అనుమతులు పొందారని అధికారులు గుర్తించారు. డ్రగ్స్‌ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే దానిపై డీఆర్ఐ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. -
ఏజెన్సీ టు ఢిల్లీ.. వయా కందుకూరు
కందుకూరు: రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరు మీదుగా ఢిల్లీకి అక్రమంగా తరలిస్తున్న దాదాపు రూ.10 లక్షల విలువజేసే 105 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఘటనలో పరారీలో ఉన్న ఇద్దరిని కందుకూరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. డీఎస్పీ కండె శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. పల్నాడు జిల్లాకు చెందిన పాములపాటి శ్రీనివాస్ వృత్తిరీత్యా సెకండ్‌హ్యాండ్ కార్ల వ్యాపారం చేస్తుంటాడు. ఈజీగా డబ్బు సంపాదించేందుకు మత్తు పదార్థాలు అక్రమ రవాణా చేసేవాడు. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి తీసుకురావడం.. దేశ రాజధాని ఢిల్లీకి తరలించి అక్కడి ఏజెంట్లకు అప్పజెప్పడం వంటి పనులు చేస్తుండేవాడు. ఈ క్రమంలో 2016లో రాజమండ్రి పోలీసులు అరెస్టు చేయడంతో మూడేళ్ల జైలుశిక్ష అనుభవించాడు. తరువాత 2021లో మరోసారి ఢిల్లీ పోలీసులకు చిక్కి ఇటీవలే జైలు నుంచి విడుదలై బయటకు వచ్చాడు. ఈ నేపథ్యంలో కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన పాల రవితేజ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడటంతో ఇద్దరూ కలిసి మళ్లీ గంజాయి అక్రమ రవాణాకు తెరతీశారు. కాగా, గత నెల 24వ తేదీ కందుకూరు ఓవీ రోడ్డులోని పలుకూరు అడ్డరోడ్డు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో కారులో గంజాయి తరలిస్తున్న వీరిద్దరూ పోలీసులను చూసి కారు వదిలేసి పారిపోయారు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు పరిశీలించి చూడగా.. కారు సీటు కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరలో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. 51 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కందుకూరులోని శ్రీనగర్ కాలనీలో ఉన్న శ్రీనివాస్, రవితేజను సోమవారం అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి మరో 20కేజీల గంజాయిని, రూ.20 లక్షల విలువైన మూడు కార్లను, రూ.20వేల విలువజేసే 8 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. -
మత్తు పదార్థాలు అమ్మే ముగ్గురు వ్యక్తులు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్ జోన్ పరిధిలో మత్తు పదార్థాలు అమ్మే ముగ్గురు వ్యక్తులు ఎస్ఓటీ పోలీసుల చేతికి చిక్కినట్లు రాచకొండ కమిషనరేట్ సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్నం ఏజెన్సీ నుంచి తెలంగాణకు హాషిష్ అయిల్ స్మగ్లింగ్ చేస్తున్నారని తెలిపారు. వారి వద్ద నుంచి ఒక మోటార్ సైకిల్, 3 మొబైల్ ఫోన్లు, రూ.800నగదు, 3 లీటర్ల హాషిష్ ఆయిల్‌ను పోలీసులు సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. చదవండి: అమ్మ ఆరోగ్యం కోసం లడ్డూ చోరీ వాటి మొత్తం విలువ రూ.9,80,800ఉంటుదని తెలిపారు. ఈ గ్యాంగ్‌లో నలుగురు సభ్యులు ఉన్నట్లు పేర్కొన్నారు. మళ్లప్పగరి శ్రీకాంత్‌రెడ్డి(మెదక్), వెంకటేష్(సంగారెడ్డి), కొండలరావు(విశాఖ)లను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. గ్యాంగ్‌లోని మరో సభ్యుడు వెంకట్రాజు(విశాఖ) పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. గతంలో వీరిపై రాజమండ్రిలో కేసు నమోదైనట్లు వెల్లడించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసు నడిపి శిక్ష పడేలా చేస్తామని సీపీ తెలిపారు. -
శోభపై నార్కోటిక్స్ కేసు.. ఊహించని మలుపులతో ఊరట
ప్రముఖ ఎంట్రెప్రెన్యూర్ శోభా విశ్వనాథ్‌పై ఈ జనవరిలో నార్కోటిక్స్ కేసు నమోదు అయ్యింది. ఆమె షోరూంలో గంజాయి దొరకడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో ఆరు నెలల విచారణ జరిపిన పోలీసులు ఎట్టకేలకు అసలు విషయాన్ని బయటపెట్టారు. పెళ్లికి ఒప్పుకోలేదన్న కోపంతో ఆమెను పక్కాగా ఈ కేసులో ఇరికించాడు ఓ వ్యక్తి. వివరాళ్లోకి వెళ్తే.. తిరువనంతపురం: కేరళకు చెందిన ప్రముఖ ఎంట్రెప్రెన్యూర్ శోభా విశ్వనాథ్(34).. పదేళ్ల నుంచి చేనేత రంగంలో రాణిస్తోంది. తిరువనంతపురంలో ఆమెకు ఓ చేనేత పరిశ్రమతో పాటు ఓ క్లోతింగ్ స్టోర్ ఉన్నాయి. ఆమె క్లయింట్స్‌లో పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇక ఆరేళ్లుగా భర్త నుంచి దూరంగా ఉంటున్న ఆమె.. కోర్టులో విడాకుల వాదనలకు హాజరవుతూ వస్తోంది. అయితే జనవరి 21న ఆమె జీవితంలో మరిచిపోలేని ఘటన జరిగింది. కొవలంలో కొత్త బ్రాంచ్ పనుల్లో బిజీగా ఉన్న ఆమెకు తిరువనంతపురం పోలీసుల నుంచి ఓ ఫోన్‌కాల్ వచ్చింది. ఆమె అవుట్‌లెట్‌లో గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వాళ్లు చెప్పడంతో ఆమె షాక్ తింది. సుమారు 400 గ్రాముల గంజాయి.. దొరకడంతో నార్కోటిక్స్ టీం ఆమెను కేసులో బుక్ చేసి ప్రశ్నించింది. అయితే బెయిల్ మీద బయటకు వచ్చినప్పటి నుంచి ఆమె మానసికంగా కుంగిపోయింది. తాను అమాయకురాలినంటూ సీఎంకు, డీజీపీలకు ఆమె లేఖ రాయడం.. హై ప్రొఫైల్ సెలబబ్రిటీ కావడంతో ఈ కేసు తిరువనంతపురం క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు అధికారులు. రెండు నెలల ట్రేస్ తర్వాత.. డీఎస్పీ అమ్మినికుట్టన్ ఆధ్వర్యంలోని బృందం ఈ కేసును దర్యాప్తు చేపట్టింది. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఇంట్లో పనిమనిషి.. స్టోర్‌లోకి వెళ్లడాన్ని గుర్తించింది ఆ టీం. ఆమెను ప్రశ్నించడంతో వివేక్ అనే వ్యక్తి తనకు గంజాయి ప్యాకెట్లు ఇచ్చి.. షాపులో పెట్టమని చెప్పాడని తెలిపింది. వివేక్ ఒకప్పుడు శోభా దగ్గరే పనిచేశాడు. ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలతో అతన్ని పని నుంచి తొలగించింది. హరీష్ హరిదాస్ అనే వ్యక్తితో కుమ్మక్కై వివేక్, శోభపై కుట్ర పన్నాడని ఆ తర్వాతే తేలింది. పెళ్లి కాదందనే.. హరీష్ హరిదాస్ యూకే పౌరసత్వం ఉన్న వ్యక్తి. లార్డ్స్ హాస్పిటల్ సీఈవో డాక్టర్ హరిదాస్ కొడుకు. పైగా డాక్టర్ కూడా. ఏడాది క్రితం శోభకు హరీష్ పెళ్లి ప్రతిపాదన పంపాడు. ఆమె కాదంది.అది మనసులో పెట్టుకునే ఆమె నార్కోటిక్స్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమెపై ఉన్న ఆరోపణలు కొట్టేశారు పోలీసులు. ఎఫ్ఐఆర్ నుంచి ఆమె పేరును తొలగించారు. వివేక్ ను అరెస్ట్ చేయగా.. హరిష్ అరెస్ట్ కోసం ప్రయత్నిస్తున్నారు. -
బ్రేకింగ్: రూ. 3 వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
న్యూఢిల్లీ: భారత నావికా దళం సుమారు 3,000 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. అరేబియా సముద్రంలో చేపలు పట్టే ఓ నౌక నుంచి 300 కిలోగ్రాముల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇండియన్ నేవి న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి వెల్లడించింది. వీటి విలువ సుమారు మూడు వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేసింది. అరేబియా సముద్రంలో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తోన్న ఐఎన్ఎస్ సువర్ణ ఈ డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకుంది. అరేబియా సముద్రంలో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న ఐఎన్ఎస్ సువర్ణ.. చేపలు పట్టే నౌక ఒకటి సముద్రంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండటాన్ని గమనించింది. వెంటనే రంగంలోకి దిగి.. సదరు నౌక సిబ్బందిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయడమే కాక నౌకలో సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో షిప్లో 300 కేజీలకు పైగా డ్రగ్స్ ఉండటం గమనించింది. వెంటనే వాటిని స్వాధీనం చేసుకోవడమే కాక.. విచారణ నిమిత్తం నౌక, దానిలో ఉన్న సిబ్బందిని కేరళ కొచ్చి తీరానికి తరలించింది. ఈ నౌక ఎవరికి సంబంధించింది.. దీనిలో రవాణ చేస్తున్న డ్రగ్స్ ఎవరికి సంబంధించినవి తదితర వివరాలను రాబట్టనుంది. చదవండి: సంచలనం: బెంగళూరు డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖులు -
10 వేల కిలోల డ్రగ్స్ స్వాధీనం
సాక్షి, న్యూఢిల్లీ : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలు.. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకూ పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారీగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పటివరకూ స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలు 10 వేల కిలోలకు పైగానే ఉంటాయని భద్రతా దళాలు చెబుతున్నాయి. వీటి ధర అంతర్జాతీయ మార్కెట్లో 49.44 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మాదక ద్రవ్యాలతో పాటు 1.20 లక్షల రూపాయల దొంగనోట్లను తమ సిబ్బంది పట్టుకున్నట్లు బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కేకే శర్మ తెలిపారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాలను బీఎస్ఎఫ్ బలగాలు బారీగా స్వాధీనం చేసుకున్నాయి. మొత్తంగా 8,807 కిలోల డ్రగ్స్‌ను అధికారులు పట్టుకోవడం జరిగింది. అలాగే పాకిస్తాన్ నుంచి దేశంలోకి అక్రమంగా దిగుమతి అవుతున్న 439.21 కిలోల డ్రగ్స్‌ను సైన్యం స్వాధీనం చేసుకుంది. డ్రగ్స్‌తో పాటు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 1.20 లక్షల రూపాయల దొంగనోట్లను సైతం బీఎస్ఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. -
పిల్లలూ భద్రం.. చాక్లెట్లలో గంజాయి
చెన్నై: మత్తుపదార్థాల మిశ్రమంతో కూడిన చాక్లెట్లు, పీచుమీటాయిలాంటివి చిన్నారులకు విక్రయిస్తున్న ఓ దుకాణాదారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తాండియర్ పేట్ లో చోటుచేసుకుంది. నిందితుడిని పోలీసులు జైలుకు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. గతవారం ఓ పదమూడేళ్ల బాలుడు తాండియర్ పేట్ లోని ఓ దుకాణంలో స్వీట్ కొనుక్కున్నాడు. అది తిన్న తర్వాత తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. దీంతో అతడిని ఆస్పత్రికి తరలించగా తిన్న స్వీట్ లో మత్తుపదార్థాలు ఉన్నాయని వైద్యులు చెప్పడంతో డ్రగ్స్ నివారణ చట్టం కింద సురేశ్ మహోలా అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, ఆ బాలుడికి విక్రయించిన చాక్లెట్స్ ప్యాకెట్లను ఆరింటిని స్వాధీనం చేసుకొని ల్యాబ్ కు పంపించారు. వీటిని పరీక్షంగా వీటిల్లో కూడా గంజాయి ఆకులతో తయారు చేసిన మిశ్రమం ఉన్నట్లు గుర్తించారు. కోల్ కతాలోని వెండోర్ అనే ప్రాంతం నుంచి తాను చాక్లెట్లు, పీచు మిఠాయిలు తీసుకొస్తానని, 40 రూపాయిలకు 40 తెస్తానని, బయట మాత్రం ఒక్కొక్కటి 15 రూపాయలకు అమ్ముతానని చెప్పాడు. ఇతడిది బిహార్.