రూ.2 కోట్ల విలువైన మత్తు మాత్రలు కూడా..
మొత్తం ఆరుగురి అరెస్టు
అన్నానగర్ (చెన్నై): దుబాయ్ నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న రూ.20 కోట్ల విలువైన కొకైన్, రూ.2 కోట్ల విలువ గల మత్తు మాత్రలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతున్న విమానంలో భారీగా మత్తు పదార్థాలు తరలిస్తున్నట్లు చెన్నై జోన్ సెంట్రల్ నార్కోటిక్స్ కంట్రోల్ యూనిట్ డైరెక్టర్ అరవిందన్‌కు శుక్రవారం సమాచారం అందింది. దీంతో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్, యాంటీ నార్కోటిక్స్ విభాగం అధికారులు తనిఖీ చేశారు.
బొలీవియాకు చెందిన ఓ యువతి బ్యాగ్‌లో ఉన్ని దుస్తుల లోపల దూది మధ్య డ్రగ్స్‌ను దాచినట్లు గుర్తించారు. ఆమె నుంచి రూ. 20 కోట్ల విలువైన కిలో 800 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. బొలీవియా యువతితోపాటు ముంబైలో నివసిస్తున్న బ్రెజిల్‌కు చెందిన మహిళ సహా మరో ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు.
అదేవిధంగా నెదర్లాండ్స్ నుంచి బెంగళూరు, పుదుచ్చేరి చిరునామాలతో రెండు పార్సిళ్లు కస్టమ్స్ విభాగానికి చెందిన పోస్టాఫీసుకు వచ్చాయి. ఆ పార్సిళ్లను కస్టమ్స్, నార్కోటిక్స్ కంట్రోల్ యూనిట్ అధికారులు తనిఖీ చేశారు. అందులో రూ.2 కోట్ల విలువైన కిలో 400 గ్రాముల మత్తు మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి బెంగళూరులో ఉంటున్న ఇద్దరు నైజీరియన్ యువకులను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment