సమస్యలు చూసి ‘అయ్యో!’ అనుకునే వాళ్లు కొందరు. సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కార మార్గాలు ఆలోచించేవారు కొందరు. సూరేపల్లి సుజాత రెండో కోవకు చెందిన యాక్టివిస్ట్. ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత ‘శాతవాహన యూనివర్సిటీ’లో సోషియాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్. ప్రాఫెసర్‌గా క్లాసు నాలుగు గోడలకే పరిమితం కాలేదు. పర్యావరణ సమస్యల నుంచి సామాజిక సమానత్వం వరకు ఎన్నో ఉద్యమాలలో భాగం అయింది. తన గళాన్ని గట్టిగా వినిపించింది. ‘సేఫ్’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా మురికివాడల్లోని పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేస్తోంది...
హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో 2021లో ఒక చిన్నారిపై జరిగిన హత్యాచార ఘటనపై నిరసన తెలియజేసేందుకు సుజాత అక్కడి మురికివాడకు వెళ్లింది. ఆ బస్తీలో కనీస సదుపాయాలు లేవు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక అత్యంత దయనీయ స్థితిలో ఉన్న పేదలను చూసి చలించిపోయింది. సాయంత్రమైతే ఆ బస్తీలో గంజాయి, మద్యం, మత్తుపదార్థాల వరద పారుతుంది. ‘ఇలా ఎందుకు?’ అని తెలుసుకోవడానికి ఆరునెలలపాటు అక్కడి సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసింది. తల్లిదండ్రులు వారి పిల్లలను బాల కార్మికులుగా చేస్తున్న తీరును గమనించి స్కూల్ పిల్లల్ని డ్రాపౌట్స్‌గా మారకుండా చూడడంపై దృష్టి పెట్టింది.
మత్తు పదార్థాల ప్రభావం చిన్నారులపై పడకుండా, వారి భవిష్యత్‌ను కాపాడడం కోసం రంగంలోకి దిగిన సుజాత మొదటి అడుగుగా చిన్న స్థలాన్ని చూసి స్టడీ సెంటర్ ఏర్పాటు చేసింది. దీనికి ‘సావిత్రి బాయి పూలే స్టడీ సెంటర్’గా నామకరణం చేసింది. ఒకటితో మొదలైన స్టడీ సెంటర్‌ల సంఖ్య పదిహేనుకు పెరిగింది.
మూడు అంగన్ వాడీ కేంద్రాలు, మూడు ప్రభుత్వ పాఠశాలలో చదివే మూడువందల మందికి పైగా విద్యార్థులు ఈ కేంద్రాల్లో సాయంత్రం చదువుకోవడానికి వస్తారు. ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు పార్ట్‌టైం టీచర్లుగా పనిచేస్తున్నారు. డ్రాపౌట్‌లను తగ్గించడం, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడం, చిన్నారులపై లైంగిక వేధింపులను నిరోధించడం లక్ష్యంగా ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి. పిల్లల మానసిక వికాస అభివృద్ధి, పౌష్టికాహార లోపం అధిగమించడంపై ఈ విద్యాకేంద్రాలు దృష్టి పెట్టాయి.
సింగరేణి కాలనీలో అంతా చెత్త ఏరుకుని బతికే పేదలే. వారి పిల్లలు అంగన్ వాడీ కేంద్రాలకు వెళ్తారు. నాలుగో తరగతి వరకు చదివించి ఆపై ఆపేస్తారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి, పిల్లలు పై చదువులు చదవడానికి ‘సావిత్రిబాయి పూలే సెంటర్’ల ద్వారా విశేష కృషి చేస్తోంది సుజాత.
పదవ తరగతి చదివే పిల్లలకోసం బ్రేక్‌ఫాస్ట్ (డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు) అందించారు. ఇది సత్ఫలితాలను ఇచ్చి ఆ ఏడాది ఉత్తీర్ణతా శాతాన్ని పెంచింది. ఏటా పిల్లల కోసం సమ్మర్ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఆటల నుంచి ఆత్మరక్షణ విద్య, సైన్స్ ప్రాజెక్ట్‌ల వరకు ఈ క్యాంప్‌లో ఎన్నో యాక్టివిటీస్ ఉంటాయి. మత్తు పదార్థాల దుష్ప్రభావంపై అవగాహన కలిగించడం మరో కీలక అంశం.
తొలిసారిగా తాను ఆ మురికివాడలో అడుగు పెట్టినప్పటితో పోల్చితే విద్యార్థుల చదువుకు సంబంధించి ఇప్పుడు ఎంతో మార్పు వచ్చింది. అది రాత్రికి రాత్రి వచ్చిన మార్పు కాదు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎంతో శ్రమిస్తే వచ్చిన మార్పు. ‘తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు తీసుకు వస్తే పిల్లల భవిష్యత్‌కు బంగారుబాట వేయవచ్చు’ అని నిరూపించిన మార్పు. – భాషబోయిన అనిల్ కుమార్, సాక్షి, కరీంనగర్
సమాజంలోని అవలక్షణాలను వదిలించి, మనిషి సన్మార్గంలో నడిచేలా పనిచేయడమే మా లక్ష్యం. – ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత
Comments
Please login to add a commentAdd a comment