ప్రముఖ ఎంట్రెప్రెన్యూర్ శోభా విశ్వనాథ్‌పై ఈ జనవరిలో నార్కోటిక్స్ కేసు నమోదు అయ్యింది. ఆమె షోరూంలో గంజాయి దొరకడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో ఆరు నెలల విచారణ జరిపిన పోలీసులు ఎట్టకేలకు అసలు విషయాన్ని బయటపెట్టారు. పెళ్లికి ఒప్పుకోలేదన్న కోపంతో ఆమెను పక్కాగా ఈ కేసులో ఇరికించాడు ఓ వ్యక్తి. వివరాళ్లోకి వెళ్తే..
తిరువనంతపురం: కేరళకు చెందిన ప్రముఖ ఎంట్రెప్రెన్యూర్ శోభా విశ్వనాథ్(34).. పదేళ్ల నుంచి చేనేత రంగంలో రాణిస్తోంది. తిరువనంతపురంలో ఆమెకు ఓ చేనేత పరిశ్రమతో పాటు ఓ క్లోతింగ్ స్టోర్ ఉన్నాయి. ఆమె క్లయింట్స్‌లో పలువురు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇక ఆరేళ్లుగా భర్త నుంచి దూరంగా ఉంటున్న ఆమె.. కోర్టులో విడాకుల వాదనలకు హాజరవుతూ వస్తోంది. అయితే జనవరి 21న ఆమె జీవితంలో మరిచిపోలేని ఘటన జరిగింది.
కొవలంలో కొత్త బ్రాంచ్ పనుల్లో బిజీగా ఉన్న ఆమెకు తిరువనంతపురం పోలీసుల నుంచి ఓ ఫోన్‌కాల్ వచ్చింది. ఆమె అవుట్‌లెట్‌లో గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వాళ్లు చెప్పడంతో ఆమె షాక్ తింది. సుమారు 400 గ్రాముల గంజాయి.. దొరకడంతో నార్కోటిక్స్ టీం ఆమెను కేసులో బుక్ చేసి ప్రశ్నించింది. అయితే బెయిల్ మీద బయటకు వచ్చినప్పటి నుంచి ఆమె మానసికంగా కుంగిపోయింది. తాను అమాయకురాలినంటూ సీఎంకు, డీజీపీలకు ఆమె లేఖ రాయడం.. హై ప్రొఫైల్ సెలబబ్రిటీ కావడంతో ఈ కేసు తిరువనంతపురం క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు అధికారులు.
రెండు నెలల ట్రేస్ తర్వాత..
డీఎస్పీ అమ్మినికుట్టన్ ఆధ్వర్యంలోని బృందం ఈ కేసును దర్యాప్తు చేపట్టింది. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఇంట్లో పనిమనిషి.. స్టోర్‌లోకి వెళ్లడాన్ని గుర్తించింది ఆ టీం. ఆమెను ప్రశ్నించడంతో వివేక్ అనే వ్యక్తి తనకు గంజాయి ప్యాకెట్లు ఇచ్చి.. షాపులో పెట్టమని చెప్పాడని తెలిపింది. వివేక్ ఒకప్పుడు శోభా దగ్గరే పనిచేశాడు. ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలతో అతన్ని పని నుంచి తొలగించింది. హరీష్ హరిదాస్ అనే వ్యక్తితో కుమ్మక్కై వివేక్, శోభపై కుట్ర పన్నాడని ఆ తర్వాతే తేలింది.
పెళ్లి కాదందనే..
హరీష్ హరిదాస్ యూకే పౌరసత్వం ఉన్న వ్యక్తి. లార్డ్స్ హాస్పిటల్ సీఈవో డాక్టర్ హరిదాస్ కొడుకు. పైగా డాక్టర్ కూడా. ఏడాది క్రితం శోభకు హరీష్ పెళ్లి ప్రతిపాదన పంపాడు. ఆమె కాదంది.అది మనసులో పెట్టుకునే ఆమె నార్కోటిక్స్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమెపై ఉన్న ఆరోపణలు కొట్టేశారు పోలీసులు. ఎఫ్‌ఐఆర్ నుంచి ఆమె పేరును తొలగించారు. వివేక్ ను అరెస్ట్ చేయగా.. హరిష్ అరెస్ట్ కోసం ప్రయత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment