ఎవరీ కొత్త హవాలా కొలంబస్‌? | Eenadu false writings on Visakhapatnam drug container | Sakshi
Sakshi News home page

ఎవరీ కొత్త హవాలా కొలంబస్‌?

Published Sun, Mar 24 2024 12:33 AM | Last Updated on Sun, Mar 24 2024 12:34 AM

Eenadu false writings on Visakhapatnam drug container - Sakshi

జనతంత్రం
 

గత సంవత్సరం బ్రెజిల్‌ అధ్యక్షునిగా లూల డసిల్వా ఎన్నిక య్యారు. ఆయనకు ట్విట్టర్‌ వేదికగా వైసీపీ నాయకుడు విజయ సాయిరెడ్డి అభినందనలు తెలియజేశారట! యెల్లో మీడియాఎంతో కష్టపడి శోధించి ఈ విషయాన్ని కనిపెట్టింది. బ్రెజిల్‌ నుంచి విశాఖపట్నం కోటయ్య చౌదరి కంపెనీకి ఓ కంటెయినర్‌ పార్సెల్‌ వచ్చింది. ఇంటర్‌పోల్‌ సమాచారంతో ఆ కంటెయినర్‌ను తనిఖీ చేసిన సీబీఐ అధికారులు జరిపిన మాదక ద్రవ్యాల పరీక్షలో ‘పాజిటివ్‌’ ఫలితాలొచ్చాయి. ఆ విషయాన్ని వారు విడుదల చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించారు.

కోటయ్య చౌదరి కంపెనీకి (సంధ్యా ఎక్స్‌పోర్ట్స్‌) రొయ్యలు, చేపలకు సంబంధించిన ఎగుమతుల వ్యాపారం ఉన్నది. రొయ్య విత్తనాన్ని పొదిగే హేచరీ కూడా ఉన్నది. త్వరలో రొయ్యల దాణాను తయారు చేసే మరో కేంద్రాన్ని కూడా తెరవ బోతున్నారు. ఆ దాణా తయారీలో ఉపయోగించడానికి పొడి చేసిన యీస్ట్‌ను తెప్పించుకోవడానికి సంధ్య కంపెనీ బ్రెజిల్‌లో ఆర్డర్‌ పెట్టింది. ఈ పదార్థాన్ని చైనా నుంచీ, యూరప్‌ నుంచీ కూడా దిగుమతి చేసుకోవచ్చు. బ్రెజిల్‌తో పోలిస్తే దూరాభారం కూడా తక్కువ. కానీ బ్రెజిల్‌నే ఎంపిక చేసుకోవడం వెనుక ఆకంపెనీకి తనదైన ప్రత్యేక కారణం ఉండవచ్చు.

‘యీస్ట్‌’ అనే మాటకు తెలుగు అర్థం కోసం వెతికితే మన నిఘంటువుల్లో సంతృప్తికరమైన సమాధానాలు దొరకలేదు. మధు శిలీంధ్రం, పులియబెట్టినది అనే అర్థాలున్నాయి. పూర్వం మన వంటిళ్లలో అన్నం వార్చే రోజుల్లో కలి, గంజి ఉండేవి. కలో గంజో తాగి బతకాలని సామెత. అందులోని కలిని యీస్ట్‌గా పరిగణిస్తాము. రకరకాల అవసరాలకు యీస్ట్‌ను ఉపయోగించడం తెలిసిందే. బ్రూవరీలు, వైనరీలు, బేకరీల్లో ప్రధానంగా వాడుతారు. ఆక్వా దాణా కోసం కూడా వాడుతారట. కోటయ్య చౌదరి కంపెనీ తెప్పించిన పొడి యీస్ట్‌ డబ్బాల్లో డ్రగ్స్‌ బయటపడ్డాయనే వార్త లోకానికి ఇంకా తెలియకముందే లోకేశ్‌బాబుకు తెలిసిపోయింది. ‘ఎక్స్‌’ వేదికగా ఆయన ఉలిక్కి పడ్డారు. వైజాగ్‌ను నాశనం చేసేందుకు వైసీపీ వాళ్లు తెప్పించా రని ఆరోపణలు చేశారు. చినబాబు ఉలికిపాటు సరిపోలేదని చంద్రబాబు కూడా మరోసారి గట్టిగా ఉలిక్కిపడ్డారు.

తెల్లారి లేచేసరికి ‘ఈనాడు’ పత్రిక మరింత గట్టిగా ఉలిక్కి పడింది. దాంతోపాటు మిగతా యెల్లో మీడియా కూడా! ఈ డ్రగ్స్‌ సరఫరా వెనుక కచ్చితంగా వైసీపీ హస్తం ఉందని వారు ఏకగ్రీవంగా తీర్మానించి పారేశారు. నెమ్మదిగా అసలు విష యాలు బయటకు రావడం మొదలైంది. కోటయ్య కంపెనీ చుట్టూ అల్లుకున్న తెలుగుదేశం, బీజేపీ నేతల బాంధవ్యాలు బయటపడ్డాయి. సామాజిక బాంధవ్యాలే కాదు, వ్యాపార భాగస్వామ్యాలు కూడా వెల్లడి కావడం మొదలైంది. దాంతో మన యెల్లో మీడియా ఉలికిపాటులోంచి తత్తరపాటులోకి మారింది. ఆ తత్తరపాటులోంచి వచ్చిందే లూల డసిల్వాకు విజయసాయిరెడ్డి అభినందనలు చెప్పారనే మోకాలు – బోడి గుండు సంబంధిత ఆరోపణ.

విజయ సాయిరెడ్డి అభినందనలు ట్విట్టర్‌లో చెప్పారు కనుక కృతజ్ఞతగా బ్రెజిల్‌ అధ్యక్షుడు దగ్గరుండి డ్రగ్స్‌ను షిప్‌లో లోడ్‌ చేయించి ఉంటారని మన జనాల్ని నమ్మించాలనే వెధవా యిత్వం యెల్లో మీడియాలో కనిపించింది. సూర్యుడిపై ఉమ్మేయజూసే మూర్ఖత్వమంటే ఇదే! లూయీ ఇనాసియో లూల డసిల్వా ఒక కార్మికోద్యమనేతగా తన ప్రజా జీవితాన్ని ఆరంభించిన వ్యక్తి. ఒకనాటి చిలీ అధ్యక్షుడు డాక్టర్‌ సాల్వెడార్‌ అలెండీ, వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్‌ల వరుసలోని లాటిన్‌ అమెరికా వామపక్ష యోధుడు. మొదటిసారి అధ్య క్షుడిగా ఎన్నికైనప్పుడు ఆయన అమలుచేసిన బొల్సా ఫామి లియా (పేద కుటుంబాలకు ఆర్థిక సాయం), ఫోమ్‌ జీరో (ఆకలి నిర్మూలన) పథకాలు కోట్లాది మంది బ్రెజిలియన్లను దారిద్య్రం నుంచి విముక్తం చేశాయి. కోట్లాది పేద కుటుంబాల పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాయి.

అమెరికా ఖండంలో అగ్రరాజ్య ప్రయోజనాలకు కంట్లో నలుసుగా డసిల్వా మారాడు కనుక ఆయన అధికారం నుంచి దూరం కావలసి వచ్చింది. అవినీతి ఆరోపణలు మోపి మూడేళ్ల పాటు జైల్లో నిర్బంధించారు. ఆరోపణలన్నీ శుద్ధ అభాండాలేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పి ఆయన్ను జైలు నుంచి విడుదల చేసింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో దేశాధ్యక్షునిగా మూడోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సకల దేశాధి నేతలు, లక్షలాది మంది రాజకీయ ప్రముఖులు, కోట్లాదిమంది అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. అందులో విజయ సాయిరెడ్డి ట్వీట్‌ ఒకటి.

ఒక ప్రముఖ దేశానికి అధ్యక్షునిగా, జి–20 దేశాల కూటమికి ప్రస్తుత అధ్యక్షునిగా ఉన్న వ్యక్తిపైనే బురద చల్లడానికి వెనుకాడలేదంటే యెల్లో మీడియా బరితెగింపు ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నారా అండ్‌ సన్స్‌తో పాటు యెల్లో మీడియా కూడా ఈ విషయంలో అతిగా స్పందించింది. రాజకీయ ప్రత్యర్థుల తలకు చుట్టడానికి వారు వేగిరిపడ్డారు. సీబీఐ విచారణ పూర్తయ్యే వరకు ఎందుకు ఉగ్గబట్టలేకపోయారో తెలియదు. వారి తొందర పాటుకు తగినట్టుగానే కంపెనీ బాంధవ్యాలు, భాగస్వామ్యాలు తెలుగుదేశం కుటుంబాలనే వేలెత్తి చూపుతున్నాయి. విచారణ పూర్తయితే గానీ జరిగిందేమిటనే సంగతి నిర్ధారణ కాదు. అయితే కొత్త రాజకీయ పొత్తుల నేపథ్యంలో దర్యాప్తు సంస్థపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు ఉండవని విశ్వసించవచ్చునా అనే ప్రశ్న తలెత్తుతున్నది.

ఈ ప్రశ్నతో పాటు మరికొన్ని సందేహాలకు కూడా సమాధానాలు రావలసి ఉన్నది. దాణా ఉత్పత్తి ప్రారంభం కాకముందే సంధ్యా సంస్థ 25 వేల కిలోల యీస్ట్‌కు ఎందుకు ఇండెంట్‌ పెట్టింది? యీస్ట్‌ దిగుమతికి ప్రత్యామ్నాయాలు అందు బాటులో ఉండగా అది బ్రెజిల్‌నే ఎందుకు ఎంపిక చేసుకున్నది? బ్రెజిల్‌ నుంచి బయల్దేరిన ఓడ విశాఖ రావడానికి ఎక్కువ సమయం తీసుకున్నదన్న పాయింట్‌ను సీబీఐ ముందు కంపెనీ ప్రతినిధులు ఎందుకు నొక్కి చెబుతున్నారు? మధ్యలో తమకు తెలియకుండా ఎవరో ఈ డ్రగ్స్‌ను బాక్సుల్లో పెట్టిఉంటారని బుకాయించడం కోసమా? అలా మధ్యలో దూర్చడం సాంకేతికంగా సాధ్యమవుతుందా? విచారణ తర్వాత డ్రగ్స్‌ను తెప్పించడం వెనుక బాధ్యత సంధ్య కంపెనీదే అని తేలితే ఆకంపెనీ ఎందుకు ఆ పని చేసినట్టు? స్వయంగా డ్రగ్స్‌ వ్యాపారంలోకి దిగిందా? లేక ఎవరైనా కమీషన్‌ మీద ఈ పని అప్పగించారా?

రెగ్యులర్‌గా దిగుమతులు చేసుకునే కంపెనీలతో డ్రగ్స్‌ వ్యాపారులు కమీషన్‌ ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉన్నది. కానీ, సంధ్యా కంపెనీ దాణా ఉత్పత్తిని ఇంకా ప్రారంభించనే లేదు. అటువంటి ఉత్పత్తిని ప్రారంభించే ప్రయత్నాలు చేస్తు న్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా అథారిటీకి ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం ఇవ్వనేలేదు. అప్పుడే యీస్ట్‌ దిగుమతికి ఎందుకు తొందరపడినట్టు? డ్రగ్స్‌ వ్యాపారంలో ఉన్న వారు కాకుండా మరేదో బలమైన శక్తి ప్రోద్భలం మేరకే ఈ కంపెనీ యీస్ట్‌ దిగుమతికి ఆర్డర్‌ చేసిందా? బ్రెజిల్‌ నుంచే దిగుమతి చేసు కోవాలని ఆ శక్తి నిర్దేశించిందా? తెలుగుదేశం, జనసేనలకు బీజేపీతో పొత్తు కుదురుతుందనే నమ్మకం కలిగిన తర్వాత బ్రెజిల్‌లో బయల్దేరిన ఓడ... పొత్తుకు తుదిరూపం వచ్చిన తర్వాతనే విశాఖ తీరం చేరుకోవడం కాకతాళీయమేనా?

డ్రగ్స్‌ సరఫరా, పంపిణీ వ్యాపారులతో ఒప్పందాలు చేసుకోవడం మనీ లాండరింగ్‌లో కొత్త పద్ధతిగా మారిందా? ఒకేసారి వందలు, వేలకోట్ల రూపాయలను చేతులు మార్చ డంలో సంప్రదాయ హవాలా పద్ధతుల కన్నా ఇది మెరుగైన పద్ధతిగా భావిస్తున్నారా? ఎందుకంటే ఇండియాలో డ్రగ్స్‌ దందా టర్నోవర్‌ లక్ష కోట్లు దాటిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2022 జూన్‌ నుంచి 2023 జూలై 15 వరకు నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో, రాష్ట్రాల బృందాలు కలిసి సుమారు 12 వేల కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యా లను ధ్వంసం చేశాయి. ఇంతకు కనీసం పది రెట్లు ఎక్కువ వినిమయం దేశంలో ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్‌కు ఇదో మార్గంగా పరిగణిస్తూ ఉండవచ్చు. అయితే బలమైన నెట్‌వర్క్‌ కలిగి ఉన్నవారే ఈ పద్ధతిని అనుసరించే అవకాశం ఉన్నది.

బ్రెజిల్‌ సరిహద్దు దేశాల్లో కొలంబియా ఒకటి. ప్రపంచంలో అతిపెద్ద మాదక ద్రవ్యాల సరఫరా కేంద్రం ఆ దేశం. అయితే కొలంబియా నుంచి రవాణా అయ్యే సరుకుల కన్‌సైన్‌మెంట్లపై దాదాపు అన్ని దేశాల్లో నిఘా తీవ్రంగా ఉంటుంది. నఖశిఖ పర్యంతం పరిశీలిస్తారు. కనుక కొలంబియా డ్రగ్‌ లార్డ్స్‌ పక్క దేశాల నుంచి సరుకుల రవాణాలో డ్రగ్స్‌ను కలిపి పంపుతారు. లాటిన్‌ అమెరికాలో అతిపెద్ద దేశమైన బ్రెజిల్‌ సహజంగానే వారి ఫస్ట్‌ ఛాయిస్‌గా ఉంటుంది. అమెజాన్‌ అడవులు రెండు దేశాల సరిహద్దులను కలిపేస్తుండటంతో డ్రగ్స్‌ను బ్రెజిల్‌ రేవుల దాకా చేర్చడం వారికి సులువు.

అమెరికా,ఇండియాల మధ్య ప్రైవేట్‌ ఆర్థిక సంబంధాలు చాలా ఎక్కువ. విరాళాల దందాలూ ఎక్కువే. ‘ఏపీ జన్మభూమి’ పేరుతో తెలుగుదేశం అభిమానులు ఓ కొత్త సంస్థను ప్రారంభించి పెద్ద ఎత్తున విరాళాలు వసూలు చేయడం ఈ మధ్య వివాదాస్పదంగా మారింది. వసూలు చేసిన విరాళాలకు సరైన లెక్కలు లేవని విరాళాలిచ్చినవారు వాపోతున్నారు. ఇదేకాకుండా ఎన్ని కల పేరుతోనూ విరాళాలు సేకరించడం ఇక్కడ మామూలే. టెక్సాస్‌ లోని హ్యూస్టన్‌ నగరం నుంచి కొలంబియా తీరం 1500 మైళ్ల దూరమే!

మనీలాండరింగ్‌ కోసం మాదక ద్రవ్యాల రూట్‌ను ఎంచు కోవడం నిజమేనని నిర్ధారణ అయితే దేశం ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. సంధ్యా ఆక్వా ఎక్స్‌ పోర్టు కంపెనీ చెబుతున్న విషయాలు అనుమానాలను రేకెత్తి స్తున్నాయి. జనవరి 14న బయల్దేరిన కంటెయినర్‌ చాలా ఆలస్యంగా చేరిందని కంపెనీ ప్రతినిధి కూనం హరికృష్ణ వివరణ ఇచ్చారు. అంటే మధ్యలో ఎవరో ఈ పనిచేసి ఉండొచ్చని బుకా యించడానికి వీలుగా ఆయన ఈ పాయింట్‌ను ముందుకు తోస్తున్నారు. సంధ్యా కంపెనీ బ్రెజిల్‌ సంస్థ నుంచి పొడి యీస్ట్‌ను ఖరీదు చేసింది. దాన్ని ఆ సంస్థ కంటైనర్‌లో పెట్టి, సీల్‌ వేసి ఓడలోకి ఎక్కిస్తుంది. ఈ కంటెయినర్‌ ఎన్ని దేశాలు తిరిగివచ్చినా ఎవరికీ కంటెయినర్‌ తెరిచే అవకాశం ఉండదు.

ఎక్స్‌పోర్ట్‌ చేసిన కంపెనీ కంటెయినర్‌ సీల్‌ నెంబర్లను ఇంపోర్ట్‌ చేసుకునే కంపెనీకి పంపిస్తుంది. ఈ నెంబర్లు చూపెడితేనే ఇంపోర్ట్‌ చేసుకున్న కంపెనీ సరుకును క్లెయిమ్‌ చేసుకోగలుగు తుంది. ఇది ప్రొటోకాల్‌. అందుకే సీబీఐ వారు తమంత తాము కంటెయినర్‌ను తెరవలేదు. కంపెనీ ప్రతినిధులను పిలిపించు కొని వారి సమక్షంలోనే తెరిపించారు. కనుక మధ్యలో ఎవరో డ్రగ్స్‌ను సరుకులో కలిపేయడం అబద్ధం. అనుమానాస్పద శాంపుల్స్‌ను పరీక్షకు పంపించారు. అవి మాదకద్రవ్యాలుగా రుజువై బాధ్యులను శిక్షించగలిగితే పెనుప్రమాదాన్ని నివారించి నట్లవుతుంది. రాజకీయ ఒత్తిళ్లు పైచేయి సాధిస్తే భవిత అంధ కారమవుతుంది.


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement