Visakhapatnam
-
విశాఖ సెంట్రల్ ఖైదీలకు గంజాయి సరఫరా
-
విశాఖపట్నంలో న్యాయ విద్యార్థిపై సామూహిక అత్యాచారం
-
విశాఖలో దారుణం.. లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైంది. విశాఖలో దారుణం జరిగింది. విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. న్యాయ విద్యార్థినిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిని నగ్నంగా వీడియోలు తీసి నిందితులు బెదిరించారు.రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సాక్షితో విశాఖ సీపీ శంకబ్రత బాగ్చి మాట్లాడుతూ, ఈ కేసులో బాధితురాలికి నిందితులలో ఒకరికి రెండు నెలల నుంచి పరిచయం ఉందని.. విచారణ జరుగుతుందని తెలిపారు. -
ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని: సింగర్ సునీత
సంగీత ప్రపంచంలో ఆమె స్వరం మధురం. శ్రోతల హృదయాల్లో ఆమె పాటలు ఎప్పటికీ పదిలం. ఏ పాట పాడినా.. ఏ భావం పలికినా.. స్పష్టమైన ఉచ్ఛారణ ఆమె వరం. భయానకం, కరుణ, వీరత్వం, హాస్యం.. ఇలా సన్నివేశం ఏదైనా సరే దానికి ఆమె గళం తోడైతే ఇక ఆ పాట.. ఆ మాటా ఓ అద్భుతం అనాల్సిందే. పాటల ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకతను, గుర్తింపును సంపాదించుకుంది సునీత ఉపద్రష్ట. విశాఖకు వచ్చిన ఆమె ‘సాక్షి’తో ముచ్చటించారు. సంగీతాన్ని ప్రేమించాలిసంగీతం అనేది భగవదత్తంగా రావాలి. నేర్చుకుంటే జ్ఞానం వస్తుంది. స్వరం మాత్రం జన్మతహా వస్తుంది. సంగీతాన్ని భక్తి గా, శ్రద్ధగా స్వీకరించాలి. సంగీతాన్ని ప్రేమించాలి. నేటి తరం గాయకులకు ఇవే లక్షణాలు ఉండాలన్న నిబంధనలు లేవు. ఎవరు పాడినా తక్కువ సమయంలో పేరుప్రఖ్యాతులు తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి.నేను అదృష్టవంతురాలినిచాలా కాలంగా పాటలు పాడటం వలన అనేక వైవిధ్యమైన పాటలు పాడే అవకాశం కలిగింది. అనేకమంది సంగీత దర్శకులు ఈ ప్రయాణంలో నన్ను ప్రోత్సహించారు. నా ముందుతరం వారు పాడిన కొన్ని పాటలు వింటుంటే కొన్ని సార్లు ఫీలైన సందర్భాలు ఉన్నాయి. ఇంతమంచి పాట నేను పాడలేకపోయాను అనే భావన కలిగింది.విశాఖలో బంధువులున్నారు మా అమ్మవాళ్లది విశాఖ. చిన్న తనం నుంచి అమ్మ ఈ నగరం గురించి చెబుతుంటే విశాఖపట్నం ఇలా ఉంటుందా అని ఊహించుకునే దాన్ని. అమ్మ చిన్నతనం ఇక్కడే సాగింది. అమ్మచెప్పినవి వింటూ ఊహల్లో పెరిగాను. ఆ విధంగా విశాఖ నగరంపై ప్రేమ పెరిగింది. నా ఊహలకంటే ఎంతో అందంగా విశాఖ ఉంది. కై లాసగిరి, రుషికొండ మీద నుంచి నగరాన్ని చూడటం, కొండ పక్కనుంచి వెళ్లే రహదారి చూడటానికి ఎప్పటికీ కొత్తగానే అనిపిస్తాయి. మా పెద్దమ్మ వాళ్లు విశాఖలో ఉండేవారు. ప్రకృతి అంతా ఇక్కడే ఉందని అని అనిపిస్తోంది. విశాఖ ప్రజలు ఎంతైనా అదృష్టవంతులు.పరిధి పెరిగిందినేడు సంగీత ప్రపంచం పరిధి విస్తరించింది, సినిమాల్లో పాత్ర, సంగీత దర్శకుడి ఆసక్తి, పరిస్థితులు ఆధారంగా పాటలు పెట్టడం జరుగుతోంది. సంగీతం నేర్చుకోవడం, గాయకులుగా స్థిరపడటంతో పాటు ఈ రంగంలో స్థానాన్ని నిలుపుకోవడం ఎంతో అవసరం.కాలంతో పాటు మార్పుల్లో భాగంగా ఇండిపెండెంట్ మ్యూజిక్‌కి ఆదరణ, ప్రాముఖ్యత పెరిగింది. నేను కూడా దీనిలో భాగం అవుతున్నాను. సంగీత కార్యక్రమాలకు వచ్చే ప్రేక్షకులు సంఖ్యమాత్రం పెరుగుతూనే వస్తోంది. ఇది చాలా సంతోషాన్నిచ్చే అంశం.ఇండిపెండెంట్ మ్యూజిక్కు ఆదరణనాకు కొండలు, సముద్రం అంటే ఎంతో ఇష్టం, నేనొక ప్రకృతి ప్రేమికురాలిని. నిజంగా చెప్పాలంటే ప్రకృతి మధ్యలో దూర ప్రాంతాలకు ప్రయాణం చేయడానికి కూడా ఎంతో ఇష్టపడతాను. విశాఖకు వచ్చే సమయంలో విమానంలోంచి చూస్తే కొండలు, పక్కనే సముద్రం ఎంతో అందంగా కనిపించాయి. -
జిల్లాల స్థూల ఉత్పత్తిలో విశాఖ టాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జిల్లాల వారీగా స్థూల ఉత్పత్తిలో విశాఖపట్నం జిల్లా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. రెండో స్థానంలో ఎన్టీఆర్ జిల్లా, మూడో స్థానంలో కృష్ణా జిల్లా నిలిచాయి. చివరి స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఉంది. రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను 13 నుంచి 26కు పెంచాక తొలిసారిగా జిల్లాలవారీ స్థూల ఉత్పత్తిని లెక్కించారు. ఈ క్రమంలో 2022–23 ఆర్థిక సంవత్సరానికి ప్రస్తుత ధరల ప్రకారం జిల్లాల వారీగా స్థూల ఉత్పత్తిని డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ తాజాగా వెల్లడించింది. మొత్తం రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో విశాఖపట్నం జిల్లా వాటా 9.15 శాతం ఉండగా ఎన్టీఆర్ జిల్లా వాటా 5.65 శాతం, కృష్ణా జిల్లా వాటా 5.24 శాతం ఉంది. ఇక చివరి స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా 1.16 శాతం వాటాతో నిలిచింది. పారిశ్రామిక, సేవా రంగాల్లోనూ విశాఖ టాప్..కాగా వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఏలూరు జిల్లా 9.87 శాతం వాటాతో మొదటి ర్యాంకులో ఉండగా కృష్ణా జిల్లా 7.56 శాతంతో రెండో ర్యాంకులో నిలిచింది. పశ్చిమ గోదావరి జిల్లా 5.32 శాతం వాటాతో మూడో ర్యాంకు దక్కించుకుంది. పారిశ్రామిక రంగంలో విశాఖపట్నం జిల్లా 18.82 శాతం వాటాతో మొదటి ర్యాంకులో నిలవగా తిరుపతి 7.78 శాతం వాటాతో రెండో ర్యాంకులో నిలిచింది.అనకాపల్లి 7.02 శాతం వాటాతో మూడో ర్యాంకులో ఉంది. అలాగే సేవా రంగంలోనూ విశాఖపట్నం జిల్లా సత్తా చాటింది. 10.22 శాతం వాటాతో మొదటి ర్యాంకు దక్కించుకుంది. ఎన్టీఆర్ జిల్లా 9.45 శాతం వాటాతో రెండో ర్యాంకు, గుంటూరు జిల్లా 6.57 శాతం వాటాతో మూడో ర్యాంకులో నిలిచాయి. -
కూటమి సర్కార్ కక్ష సాధింపు.. కొడాలి నానిపై కేసు
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో కూటమి నేతల ఆగడాలు రోజురోజుకు శృతి మించుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్‌గా కూటమి నేతలు, పోలీసులు ముందుకు సాగుతున్నారు. నిన్నటి వరకు సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు కొనసాగగా.. ఇప్పుడు రాజకీయ నాయకులపై వేధింపులు మొదలయ్యాయి.మాజీ మంత్రి కొడాలి నానిపై లా విద్యార్థినితో కూటమి నేతలు ఫిర్యాదు చేయించారు. కూటమి నేతలు మాత్రమే కాకుండా విద్యార్థులను కూడా రాజకీయ కక్షలకు పావులుగా వాడుకుంటున్నారు. లా విద్యార్థిని ప్రియతో కూటమి నేతలు.. కొడాలి నానిపై త్రీటౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేయించారు. చంద్రబాబుపై కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. దీంతో, పోలీసులు నానిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
‘హామీలు నిలబెట్టుకోలేక.. అప్పులపై చంద్రబాబు తప్పుడు లెక్క’
సాక్షి, విశాఖపట్నం: అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు అబద్ధాలు ఆగలేదంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశారని.. రాష్ట్రం దివాలా తీసిందంటూ దుష్ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘రూ.14 లక్షల కోట్లు అప్పు చేశారని చంద్రబాబు చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలో 6 లక్షల 40 వేల కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోక చంద్రబాబు అప్పులపై తప్పుడు లెక్కలు చెబుతున్నారు’’ అని దుయ్యబట్టారు.వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే సమయానికి 3 లక్షల 13 వేల కోట్లు అప్పు ఉంది. కోవిడ్ పరిస్థితిని తట్టుకొని వైఎస్ జగన్ పాలన చేశారు. కోవిడ్ సమయంలోనూ సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదు. చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు అప్పులు చేస్తున్నారు. చంద్రబాబు మోసాలు బయటపడతాయని వైఎస్సార్సీపీ కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు’’ అని అమర్నాథ్ ఎండగట్టారు.పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడానికి గతంలో ఏ ప్రభుత్వం ఆరు నెలలు సమయం తీసుకోలేదు. పథకాలకు కేటాయింపులు సక్రమంగా జరపలేదు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్నారు. 80 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వారికి రూ. 12,500 వేల కోట్లు ఖర్చు అవుతుంది. బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించారు. 18 ఏళ్లు దాటిన మహిళలు రాష్ట్రంలో కోటి 50 లక్షలు మంది వరకు ఉన్నారు. వారికి ఏడాదికి 26,000 వేల కోట్లు ఖర్చు అవుతుంది. బడ్జెట్లో ఆడబిడ్డ నిధికి బడ్జెట్లో ఒక రూపాయి కేటాయించలేదు. నిరుద్యోగ భృతికి ఒక రూపాయి కేటాయించలేదు. చంద్రబాబు హామీలకు ఏడాదికి లక్ష 20 వేల కోట్లు అవసరం. చంద్రబాబు బడ్జెట్లో 30 వేల కోట్లు ఖర్చు చేశారు...సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టు తర్వాత మమ్మలను అరెస్టు చేస్తారు. మేము దేనికైనా సిద్ధం. మా తాత పేరు మీద ఉన్న ట్రస్ట్‌కు 20 ఏళ్ల క్రితం ఇచ్చిన భూమి పేపర్లు తేవాలని అడుగుతున్నారు. పోలీసులకు భయపడేది లేదు’’ అని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. -
విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం
సాక్షి, విశాఖపట్నం: నగరంలో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. పెదగంట్యాడ బాలచెరువు సమీపంలో యువతిపై ఓ యువకుడు దాడి చేశారు. ఈ ఘటనలో బాధితురాలు మేఘన తీవ్రంగా గాయపడింది. కాగా, మేఘనపై జరిగిన దాడిలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనబడుతోంది. రెండు సార్లు నిందితుడిపై ఫిర్యాదు చేసిన కానీ పోలీసులు పట్టించుకోలేదు.మేఘన తలపై బలంగా ఇనుప రాడ్డుతో నిందితుడు నీరజ్ శర్మ దాడి చేశాడు. మేఘన పై దాడి చేస్తున్న క్రమంలో అడ్డు వచ్చిన మరో ఇద్దరిపై కూడా ప్రేమోన్మాది దాడి చేశాడు. బాధితురాలి తలపై వైద్యులు 30కి పైగా కుట్లు వేశారు. మెరుగైన వైద్యం కోసం బాధితురాలిని కిమ్స్‌కు తరలించారు. -
‘మేమున్నాం మీ వెంట’ అనే భరోసా ఇచ్చేదెవరు?
మహానది–గోదావరి నదుల మధ్య విస్తరించి యున్న భూభాగమే కళింగాంధ్ర. ఈ కళింగాంధ్రలోని అంతర్భాగం ఉత్తరాంధ్ర. ఇది ఇచ్ఛాపురం నుండి పాయకరావుపేట వరకు వ్యాపించి ఉంది. విస్తారమైన కొండకోనలు, అటవీ భూములు గల పచ్చని ప్రాకృతిక ప్రదేశం. ఇక్కడ నివసించే ప్రజలు కష్టపడే తత్వం గలవారు. మైదాన, గిరిజన, మత్స్యకార ప్రజల శ్రమతో సృష్టించబడిన సంపద పెట్టుబడి వర్గాల పరమౌతున్నది. దాంతో ఇక్కడి ప్రజలు అనాదిగా పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ప్రాంతం వెనుకబడినది అనేకంటే, వెనుకకు నెట్టి వేయబడిందన్నమాట సబబుగా ఉంటుంది.ఒక వ్యక్తి కాని, ఒక సమూహం కాని ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి జీవనోపాధి నిమిత్తం కాల పరిమితితో సంబంధం లేకుండా వెళ్లడాన్ని వలస అనొచ్చు. అనాదిగా ఉత్తరాంధ్ర ప్రజలు అనుభవిస్తున్న ప్రధాన సమస్య ‘వలస’. ఇలా వలస వెళ్లినవారు ఆయా ప్రాంతాల్లో అనేక ఇడుములు పడటం చూస్తున్నాం. వీరికి ‘మేమున్నాం మీ వెంట’ అనే భరోసా ఇచ్చేదెవరు? మరో ముఖ్య సమస్య ఈ ప్రాంత భాష–యాస, కట్టు– బొట్టుపై జరుగుతున్న దాడి. నాగరికులుగా తమకు తాము ముద్రవేసుకొన్నవారు ఆటవికంగా ఉత్తరాంధ్ర జనాన్ని అవహేళన చేస్తున్నారు. తెలంగాణ సాంస్కృతిక భాషోద్యమంలాగా, ఉత్తరాంధ్ర సాంస్కృతిక భాషోద్యమం రావాలి. ఈ ప్రాంత వేషం–భాష అధికారికంగా అన్నిటా చలామణి కావాలి. తగువిధంగా గౌరవం పొందాలి. తెలంగాణ సాహితీవేత్తల వలె ఈ ప్రాంత కవులు, రచయితలు, కళాకారులు తమ మాండలిక భాషా సౌరభాలతో సాహిత్యాన్ని నిర్మించాలి.అనాదిగా ఈ ప్రాంతం పారిశ్రామికీకరణకు చాలా దూరంలో ఉంది. ఒక్క విశాఖపట్నం, పైడిభీమవరం తప్పితే ఎక్కడా పరిశ్రమల స్థాపన లేదు. ఉత్తరాంధ్ర అంతటా వ్యవసాయధారిత ఉత్పత్తుల పరిశ్రమల స్థాపన ఎక్కువగా జరగాల్సి ఉంది. అయితే రెడ్ క్యాటగిరీకి చెందిన కాలుష్య కారక పరిశ్రమల స్థాపన మాత్రం జరుగుతోంది. ఇవి ఉత్తరాంధ్ర ప్రజల జీవనానికి, మనుగడకు సవాల్ విసురుతున్నాయి.ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ఇండస్ట్రీని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవాలి. ఉత్తరాంధ్రలో నిర్మించ తలపెట్టిన అనేక నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మాణ దశలోనే ఉన్నాయి. శతశాతం పూర్తయినవి దాదాపుగా లేవు. విశాఖ రైల్వే జోన్ ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉంది. ఉత్తరాంధ్ర అంతట మారుమూల ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రహ దారుల నిర్మాణం పెద్ద యెత్తున జరగాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన ప్రాంతం ఉత్తరాంధ్రలోనే ఎక్కువగా ఉంది. ఇక్కడ అడవి బిడ్డలు పౌష్టికాహార లోపంతో రక్తహీనతకు గురై తీవ్ర అనారోగ్యం పాలౌతున్నారు. ఈ కొండకోనల్లో, అడవుల్లో విలువైన అటవీ సంపద ఉంది. అందువల్ల ఈ భూములపై గిరిజనులకు ప్రత్యేక హక్కులు ఉండాలి. 1/70 చట్టం అమలు సక్రమంగా జరగాలి. ఇక్కడ ఖనిజ సంపద అపారంగా ఉంది. దీనితో వచ్చే ఆదాయం గిరిపుత్రుల సంక్షేమానికే వినియోగించాలి. ఇక్కడ భూగర్భ జలాలలో కాల్షియం, ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంది. కిడ్నీ, ఎముకల వ్యాధులతో తరచూ బాధపడటం చూస్తాం. అందువల్ల ఇక్కడి ప్రజలకు మంచినీరు అందివ్వాలి. నిర్మాణంలో ఉన్న పోర్టులను, హార్బర్లను వేగవంతం చేయాలి.చదవండి: రైతులు అడగాల్సిన ‘మహా’ నమూనాకార్మికులలో 90 శాతానికి పైబడి అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. వీరిలో భవన నిర్మాణ రంగంలోనే అధికంగా ఉన్నారు. వీరి భద్రతకు చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాంత ప్రజల జీవనస్థితిగతులు మెరుగవ్వాలంటే, విభజన చట్టం సెక్షన్ 94(3)లో పేర్కొన్న విధంగా ఉత్తరాంధ్రకు ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలి. అది వెనుకబడిన బుందేల్‌ఖండ్, కోరాపుట్, బోలంగిర్, కలహండి తరహాలో ఉండాలి.చదవండి: మంచి పనిని కించపరుస్తారా?ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద పట్టణం విశాఖపట్నం. ఈ పట్టణం ఇతర ప్రాంతాల పెట్టుబడి వర్గాల గుప్పిట ఉంది. విశాఖను మాత్రమే అభివృద్ధి చేస్తే ఒనగూరే లాభమేమిటి? నిజంగా ఈ ప్రాంత ప్రజల పరిస్థితి మెరుగుపడుతుందా అనేది మాత్రం శేషప్రశ్నే. ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి గతంలో జరిగిన వివిధ వామపక్ష, అస్తిత్వ జీవన పోరాటాల వలె మరికొన్ని ఉద్యమాలు రావాల్సి ఉందేమో!- పిల్లా తిరుపతిరావు తెలుగు ఉపాధ్యాయుడు -
వారమైనా ఆచూకీ లేదు.. రమణారెడ్డి ఎక్కడ?
సాక్షి, విశాఖపట్నం: వారం రోజుల క్రితం సోషల్ మీడియా కార్యకర్త రమణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విశాఖ వచ్చి రమణారెడ్డిని ప్రకాశం జిల్లా పోలీసులు తీసుకెళ్లారని.. రోజుకోక పోలీస్‌స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రమణారెడ్డి వివరాలు అడిగినా పోలీసులు చెప్పడం లేదంటున్నారు. అర్ధరాత్రి వేళ తీసుకెళ్తూ.. ఇంటి సీసీ టీవీ ఫుటేజ్‌ను పోలీసులు డీలీట్ చేశారు.ఇంటికి వచ్చిన వెంటనే రమణారెడ్డి నుంచి మొబైల్‌ను పోలీసులు తీసేసుకున్నారు. బెయిల్ ఇస్తామంటూ ప్రకాశం జిల్లాలోని స్టేషన్లను పోలీసులు తిప్పుతున్నారు. మామ ఆచూకీ కోసం పోలీస్స్టేషన్ల చుట్టూ రమణారెడ్డి అల్లుళ్లు తిరుగుతున్నారు. రమణారెడ్డి ఆచూకీ తెలియక తల్లి,భార్య, కుమార్తెలు తల్లడిల్లిపోతున్నారు. రమణారెడ్డి ఫోన్‌ను పోలీసులు తీసేసుకున్నా ఆయన ఫోన్ నుంచి ఎక్స్‌లో పోస్టులు పెట్టినట్లుగా కనిపిస్తున్నాయని ఆయనకు కుమార్తె తెలిపింది. రమణారెడ్డికి పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని ఆయన కుటుంబసభ్యులు అంటున్నారు. కాగా, కూటమి సర్కార్ తప్పిదాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులను భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టి అక్రమ కేసులు బనాయిస్తోంది. నిన్నటివరకు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి, ఇతర మంత్రులను ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టారని నేరుగా కేసులు పెట్టి వేధించడంపై విమర్శలు రావడం, న్యాయస్థానం సైతం గట్టిగా ప్రశ్నించడంతో సరికొత్త పన్నాగం పన్నింది. ప్రభుత్వ పరంగా నేరుగా కేసులు పెట్టకుండా పచ్చ బ్యాచ్‌ను రంగంలోకి దించింది. ఈ ఫిర్యాదులు అందిందే తడవు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఒక్క బాపట్ల జిల్లాలోనే ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకు (24 గంటల్లో) 29 కేసులు నమోదు చేయించారు. -
24 అడుగుల భారీ కళాకృతి
సాంస్కృతిక ఐక్యత, సమాజ స్ఫూర్తి కలిగేలా విశాఖపట్నంకు చెందిన కళాకారుడు మోకా విజయ్ కుమార్ 24 అడుగుల పొడవైన యాక్రిలిక్ కాన్వాస్ పెయింటింగ్ వేసి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. విశాఖపట్నంలోని డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో ప్రదర్శించిన ఈ కళాకృతి, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని 10 జిల్లాల్లో సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక ఏకీకరణకు దృశ్యంగా నిలిచింది.స్థానిక వారసత్వానికి జీవంస్పష్టమైన రంగులు, క్లిష్టమైన వివరాలతో ఆయా రాష్ట్రాల్లోని కమ్యూనిటీల స్థానిక వారసత్వం, సంప్రదాయాల సారాంశానికి జీవం పోశాడు. కాన్వాస్లోని ప్రతి భాగం ఈ ప్రాంతాలలోని ప్రముఖ ప్రదేశాలు, గిరిజన నృత్యాలు, పండగలు, చేతి పనులు, మార్కెట్లతో పాటు ఈ ప్రాంతాలకు విలక్షణమైన వృక్షజాలం, జంతుజాలం, ప్రకృతి దృశ్యాలను, వాటితో అనుసంధానంగా ఉండే వ్యక్తుల జీవితాలను కళ్లకు కడుతుంది. ఇవే కాదు గనులు, చిత్రకూట్ జలపాతాలు, కోలాబ్ డ్యామ్, విజయనగరం కోట వంటి మూడు రాష్ట్రాల్లోని 53 ప్రసిద్ధ ప్రదేశాలను చూపుతుంది.సామాజిక జీవనానికి అంకితం‘ఈ ఆర్ట్ వర్క్‌ను పూర్తి చేయడానికి మూడు నెలల కంటే ఎక్కువ సమయం పట్టింది. సంప్రదాయాలు, వాణిజ్యం ఒకచోట చేర్చే విలువలను పంచుకునే కమ్యూనిటీల సామరస్యపూర్వక సహజీవనానికి ఈ కళాకృతి అంకితం. ఈ జిల్లాలు, రాష్ట్ర సరిహద్దుల్లో విస్తరించి ఉన్నప్పటికీ, నేను నా పని ద్వారా వాటి ప్రత్యేకతలను తెలియజేయాలని ఆశించాను‘ అని విజయ్ కుమార్ తెలిపారు. డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో ఈ భారీ కళాకృతిని ప్రదర్శించడానికి ఆ శాఖ చొరవ తీసుకోవడం, వారి ప్రాంగణంలో స్థానిక కళ, సంస్కృతిని ప్రోత్సహించే ప్రయత్నానాన్ని అంతా అభినందిస్తున్నారు.(చదవండి: రెండు వేల లీటర్లకు పైగా బ్రెస్ట్ మిల్క్ దానంతో గిన్నిస్ రికార్డు..!) -
తలసరి ఆదాయంలో విశాఖ ‘వన్’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 13 నుంచి 26కు పెంచిన తరువాత తొలిసారిగా 2022–23 ఆర్ధిక సంవత్సరానికి జిల్లాల వారీగా తలసరి ఆదాయం లెక్కలను డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటస్టిక్స్ వెల్లడించింది. ఈ లెక్కల ప్రకారం విశాఖపట్నం జిల్లా నంబర్‌వన్ స్థానంలో ఉండగా, రెండులో కృష్ణా, మూడులో ఏలూరు జిల్లా ఉంది. 2021–22లో ఉమ్మడి జిల్లాల్లో తలసరి ఆదాయంలో కృష్ణాజిల్లా మొదటి స్థానంలో ఉండగా విశాఖపట్నం రెండో స్థానంలో ఉంది. చివరి స్థానంలో విజయనగరం జిల్లా ఉంది. -
ఆగని వేధింపులు.. ఇంటూరి రవికిరణ్‌పై మరో కేసు
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అరాచకం సృష్టిస్తోంది. పోలీసులను వారిపైకి ఉసిగొలుపుతోంది. తప్పుడు కేసులు పెడుతూ.. అక్రమ అరెస్టులు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవి కిరణ్‌పై రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. ప్రస్తుతం.. మహారాణిపేట పోలీసుల అదుపులో ఉన్న ఇంటూరిని రాజమండ్రి తరలించనున్నారు.విశాఖలో సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసుల వేధింపులు కొనసాగుతుండగా, ఈ రోజు కూడా ఇంటూరి రవికిరణ్‌ను ఉదయం 11 గంటలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏడు గంటలుగా స్టేట్మెంట్ పేరుతో కాలయాపన చేశారు. నిన్న(శనివారం) దువ్వాడ పోలీస్‌స్టేషన్‌లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఇంటూరిపై దువ్వాడ, మహారాణిపేట పోలీస్స్టేషన్ల్లో కేసులు నమోదయ్యాయి. కాగా, ఇంటూరిపై ప్రకాశం జిల్లాలోనూ కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఒక కేసుపై తీసుకెళ్లి రెండు,మూడు కేసులను పెడుతున్నారు.కాగా, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని సాక్షాత్తు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బహిరంగ సమావేశంలోనే వ్యాఖ్యలు చేయడం రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపింది. ఆ వ్యాఖ్యలతో ప్రభుత్వ గొంతులో వెలక్కాయ పడినట్లయింది. దీంతో నష్ట నివారణ చర్యలకు దిగిన చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటిలాగే డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీసింది.ఇదీ చదవండి: అక్రమ కేసులు.. నిర్బంధాలు.. చిత్రహింసలు.. అరాచకానికి పరాకాష్టప్రజల దృష్టిని మరల్చడానికి వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీస్ అస్త్రాన్ని ప్రయోగించింది. 2019 నుంచి ఇప్పటివరకు సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల ఆధారంగా ప్రశ్నించే గొంతులను ఖాకీల ద్వారా నొక్కించే ప్రయత్నాలు చేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని హరిస్తూ.. భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తూ.. కక్ష సాధిస్తూ.. అక్రమ కేసులు బనాయిస్తూ.. సోషల్ మీడియా కార్యకర్తలను జైలుకు పంపిస్తోంది. ఇప్పటికే విశాఖ జిల్లాకు చెందిన నలుగురు కార్యకర్తలకు చిత్ర హింసలకు గురిచేసి కటకటాల పాలు చేసింది. మరింత మందిని కూడా జైలు పాటు చేయడానికి కూటమి పార్టీల చోటా నేతల ద్వారా కేసులు పెట్టిస్తోంది. -
దువ్వాడ పీఎస్‌లో ఇంటూరి రవికిరణ్ అక్రమ నిర్బంధం!
విశాఖపట్నం, సాక్షి: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవి కిరణ్‌ను ఇవాళ దువ్వాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఆయన్ని పీఎస్‌కు తరలించారు. స్టేట్మెంట్ రికార్డు పేరుతో ఆయన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు సమాచారం.రవికిరణ్‌ను ఎందుకు తీసుకొచ్చారో తెలియదని ఆయన భార్య మీడియా ఎదుట వాపోయారు. ‘‘పదే పదే పోలీసులు ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. నా భర్తను ఎందుకు అదుపులోకి తీసుకున్నారో తెలియదు. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు’’ అని అన్నారామె.దువ్వాడ పోలీసులు రవికిరణ్, ఆయన భార్యతో దురుసుగా ప్రవర్తించారు. తనిఖీలు చేయాలని చెబుతూ.. ఆమె కారు తాళాలు లాక్కున్నారు. తన భర్తను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ఆమె ప్రశ్నించగా.. ఎలాంటి ఇష్యూ చేయొద్దంటూ ఆమెను బెదిరించారు. ఇద్దరినీ భోజనం కూడా చేయనీయకుండా అడ్డుకున్నారు. తన భర్తకు కనీసం మాత్రలు ఇవ్వాలని ఆమె కోరగా.. పోలీసులు అందుకు అంగీకరించలేదు. ఇబ్బంది పెడతానంటూ సీఐ మల్లేశ్వరరావు బహిరంగంగానే ఆమెకు వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఇంటూరి రవికిరణ్‌ను అరెస్ట్ చేయించారు. అంతేకాదు.. విచారణ పేరుతో పిలిపించుకుని ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. -
విశాఖ నగరంలో గంజాయి కలకలం
విశాఖపట్నం, సాక్షి: శాంతిభద్రతలు క్షీణించడంపై చర్చ నడుస్తున్న వేళ.. నగరంలో మరోవైపు సంచలనం వెలుగు చూసింది. విశాఖలో గంజాయి కలకలం రేగింది. హోం మంత్రి అనిత నివాసానికి సమీపంలోనే ఉండడం గమనార్హం.లేడీస్ హాస్టల్ వెనుక ఉన్న కేజీహెచ్ కొండ ప్రాంతంలో గంజాయి ముఠా గుట్టు రట్టైంది.. ఏజెన్సీ నుంచి తీసుకొచ్చి మరీ ఇక్కడ పండిస్తోంది ఓ ముఠా. తాము సేవించడమే కాకుండా.. మిగతాది నగరంలోని విద్యార్థులకు విక్రయిస్తోంది. ఈ గ్యాంగ్ గురించి పక్కా సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు.. దాడులు జరిపారు. ఐదుగురు ముఠా సభ్యుల గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే.. అందులో ఇద్దరు పారిపోగా.. ముగ్గురు మాత్రం దొరికారు. వీళ్లలో ఒక మైనర్ ఉండడం గమనార్హం. ఈ ప్రాంతం హోం మంత్రి అనిత నివాసానికి కేవలం 3 కి.మీ. లోపే ఉంది. నావికా దళం(నేవీ) ఆధీనంలో ఉండడం, పైగా హోం మంత్రి నివాస సమీపంలోనే గంజాయి సాగు జరగడం ఒక్కసారిగా విశాఖను ఉలిక్కి పడేలా చేసింది. ఈ ముఠా ఎవరెవరకి సప్లయ్ చేసిందనే దానిపై నిందితుల్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. -
గుడ్‌న్యూస్ చెప్పిన పీవీ సింధు.. పునాది పడింది!
భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట సింధు అభిమానులకు శుభవార్త చెప్పింది. తన చిరకాల ఆశయం దిశగా తొలి అడుగు వేసినట్లు తెలిపింది. విశాఖపట్నంలో తన కలల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు గురువారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.సింధు భావోద్వేగంఈ మేరకు.. ‘‘విశాఖపట్నంలో పీవీ సింధు సెంటర్ ఫర్ బ్యాడ్మింటన్ అండ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్‌కు పునాది పడింది. ఇది కేవలం క్రీడాకారులకు ఓ సౌకర్యం మాత్రమే కాదు. భవిష్యత్ తరాల చాంపియన్లను తీర్చిదిద్దేందుకు, భారత క్రీడారంగాన్ని అభివృద్ధి చేసేందుకు తీసుకున్న సాహసోపేత నిర్ణయం.ఇందులో నా భాగస్వాములు, నా టీమ్ అందించిన సహకారం మరువలేనిది. భారత భవిష్య క్రీడాకారులకు స్ఫూర్తిని పంచుతూ.. వారి భవిష్యత్‌కు మార్గం వేసే ఈ గొప్ప అడుగు వేసినందుకు సంతోషంగా ఉంది’’ అని సింధు ఉద్వేగపూరిత పోస్టు పెట్టింది.ఈ క్రమంలో సింధుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా రియో ఒలింపిక్స్ మహిళల సింగిల్స్‌లో రజతం, టోక్యో విశ్వక్రీడల్లో కాంస్యం సాధించిన సింధు.. ప్యారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఇదిలా ఉంటే.. రెండుసార్లు వరుసగా ఒలింపిక్ మెడల్స్ గెలిచిన సింధుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశాఖపట్నంలో అకాడమీ కోసం స్థలం కేటాయించింది. ఇప్పుడు అక్కడే ఆమె తన బ్యాడ్మింటన్ సెంటర్‌కు పునాది వేసింది.వైఎస్ జగన్ ప్రభుత్వం స్థలం కేటాయించింది: సింధుఈ క్రమంలో తోటగరువులో తనకు కేటాయించిన భూమిలో అకాడమీ నిర్మాణానికి పీవీ సింధు, ఆమె కుటుంబ సభ్యులు తాజాగా పూజ చేశారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. ఏడాదిలోపు అకాడమీ పనులు పూర్తయ్యేలా సన్నాహకాలు చేస్తున్నా మని తెలిపింది. గత ప్రభుత్వం తమకు అన్ని అనుమతులతో స్థలం కేటాయించిందని.. మెరికల్లాలాంటి బ్యాడ్మింటన్ ప్లేయర్లను తయారు చేసేందుకు, ఓ మంచి అకాడమీ ఏర్పాటు చేస్తామని పేర్కొంది.చదవండి: IPL 2025 Mega Auction: కోట్లాభిషేకమే! భారత క్రికెటర్లకు జాక్‌పాట్ తగలనుందా? View this post on Instagram A post shared by PV Sindhu (@pvsindhu1) -
తెల్లవారితే కూడు దక్కక.. పొద్దు వాలితే గూడు లేక.. బతకు ‘వ్యర్థ’మేనా?
తెల్లవారితే కూడు దక్కక.. పొద్దు వాలితే గూడు చిక్కక బాధలు మోసే అభాగ్యులకు వ్యర్థాలే జీవనాధారంగా మారుతున్నాయి. పిడికెడు మెతుకుల కోసం పేగులు మెలిపెట్టే దుర్వాసన వెదజల్లుతున్న మురుగునీటిలో వస్తువుల కోసం అన్వేషిస్తున్నఈ వ్యక్తి చిత్రాన్ని విశాఖ కాన్వెంట్ జంక్షన్ వద్ద సాక్షి కెమెరా క్లిక్ మనిపించింది.– పీఎల్ మోహన్‌రావు, సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
‘ఒక్క రన్ కూడా తీయలేదు.. ఇంకెప్పుడు సిక్స్ కొడతావ్ బాబూ?’
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని.. సూపర్ సిక్స్ హామీల అమలు సంగతి మర్చిపోయారంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు నిర్మించిన బిల్డింగ్లు వరదలకు గురయ్యాయి. మా హయాంలో అద్భుత భవనాలు నిర్మిస్తే ఓర్చుకోలేకపోతున్నారన్నారు‘‘రాష్ట్రంలో రుషికొండ టూరిజం ప్రాజెక్టు లాంటి నిర్మాణాలు ఎక్కడా లేవు. రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి అద్భుత భవనాలు లేవు. నిన్న చంద్రబాబు షెడ్యూల్లో కూడా ఏపీ టూరిజం బిల్డింగ్ అని షెడ్యూల్ విడుదల చేశారు. చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా రుషికొండ టూరిజం భవనాలు లాంటివి నిర్మించారా?’’ అంటూ అమర్నాథ్ ప్రశ్నించారు.‘‘రూ.15 వందల కోట్లు పెట్టి చంద్రబాబు తాత్కాలిక సచివాలయం కట్టారు. వర్షం వస్తే మంత్రుల పేషిల్లోకి వరద నీరు వస్తుంది. తాత్కాలిక సచివాలయం పేరుతో పెద్ద ఎత్తున దోచేశారు. రుషికొండ నిర్మాణాలు అద్భుతంగా ఉన్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు.. రుషికొండ టూరిజం భవనాలను మేమే ప్రారంభించాం’’ అని గుడివాడ అమర్నాథ్ చెప్పారు.‘‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం చంద్రబాబు ప్రకటన చేస్తారని ఉత్తరాంధ్ర ప్రజలు ఆశించారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రభుత్వ అసమర్థతను పక్కదారి పట్టించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు’’ అని అమర్నాథ్ ధ్వజమెత్తారు.‘‘ప్రజలకు రుషికొండ భవనాలు చూపిస్తామని చంద్రబాబు అంటున్నారు. అమరావతి తాత్కాలిక సచివాలయం కూడా చూపిస్తే ఎవరి నిర్మాణాలు గొప్పవో ప్రజలే నిర్ణయిస్తారు. ప్రభుత్వానికి అమరావతి తప్పితే వేరే ప్రాంతం అవసరం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత విశాఖే పెద్ద నగరం. అందుకే విశాఖను రాజధాని చేయాలనుకున్నాం. విశాఖ గ్రోత్ ఇంజెన్గా ఉపయోగపడుతుంది. రాష్ట్రపతి, ప్రధాని వంటి పెద్దలు వచ్చినప్పుడు ఈ భవనాలు ఉపయోగపడతాయి.’’ అని అమర్నాథ్ వివరించారు.ఇదీ చదవండి: సిగ్గేస్తున్నది బాబూ!‘‘స్టేట్ గెస్ట్ హౌస్ కట్టాలని మా ప్రభుత్వం భావిస్తే కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారు.. రుషికొండ భవనాలు దేనికి వాడుతారో చెప్పాలి. కేవలం రుషికొండ భవనాలు మాత్రమే కాదు.. ఉద్దానం రీసెర్చ్ సెంటర్, మెడికల్ కాలేజీలు, జీఎంఆర్ ఎయిర్ పోర్ట్ వంటివి కూడా ప్రజలకు చూపించాలి. పోలవరం నిర్మాణం ఎలా జరుగుతుందో చూపించడానికి రూ. 150 కోట్లు వృథా చేశారు. హైదరాబాద్‌లో చంద్రబాబు ఇళ్లు, ఫార్మ్ హౌస్ రెన్నోవేషన్ కోసం కోట్లు ఖర్చు చేశారు.’’ అని అమర్నాథ్ మండిపడ్డారు.‘‘సూపర్ సిక్స్ అన్నారు ఒక్క రన్ కూడా తియ్యలేదు.. ఇంకెప్పుడు సిక్స్ కొడతారు. గ్యాస్ ఇచ్చాం అంటున్నారు.. ముందు ప్రజలు డబ్బులు కడితే ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. మద్యం ధరలు తగ్గింపు అని బోర్డులు పెట్టారు. నిత్యావసర ధరలు తగ్గించకుండా మద్యం ధరలు తగ్గించారు. తల్లికి వందనం లేదు. నాన్నకు ఫుల్లుగా ఇంధనం ఇచ్చారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.రుషికొండ భవనాలు ప్రభుత్వానివి.. ఎలా వాడాలో ఆలోచించండి. గుర్ల డయేరియా బాధితులను చంద్రబాబు ఎందుకు పరామర్శించలేదు. ఆ కుటుంబాలను ఎందుకు పిలిచి మాట్లాడలేదు. గుంతలు సృష్టించి గుంతలు కప్పుతున్నారు. ఉన్న గుంతలను కప్పాలి. బాగున్న రోడ్లు తవ్వేసి కప్పేస్తున్నారు. లేని గోతులను సృష్టిస్తున్నారు. గుంతలు పూడ్చడానికి ఇంత ప్రచారం దేనికి’’ అంటూ అమర్నాథ్ దుయ్యబట్టారు. -
పరవాడ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం.. ముగ్గురికి గాయాలు
సాక్షి,అనకాపల్లి : అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది. మెట్రో కమ్ కంపెనీలో రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. వారిని గాయపడ్డ క్షతగాత్రులను అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటల్ని అదుపులోకి తెచ్చారు. -
స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు శీతకన్ను.. మళ్లీ పాతపాటే!
సాక్షి, విశాఖ: ఏపీ సీఎం చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మరోసారి నిరాశే మిగిల్చారు. విశాఖ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు స్టీల్ ప్లాంట్‌పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అంతేకాకుండా సేయిల్‌కు లాభాలు వచ్చినప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు ఎందుకు రావడం లేదని కార్మికులను ఎదురు ప్రశ్నించడం గమనార్హం.నేడు విశాఖ పర్యటన సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏదైనా స్పష్టత వస్తుందని భావించిన కార్మికులకు మళ్లీ నిరాశే ఎదురైంది. స్టీల్ ప్లాంట్‌పై చంద్రబాబు పాత పాటే పాడారు. సేయిల్ లాభాల బాటలో నడుస్తోంది. సేయిల్‌కు లాభాలు వచ్చినప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు ఎందుకు రావడం లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను లాభాల బాటలో నడిపించాలి. దానిపై ఏం చెయ్యాలో ఆలోచిస్తున్నాం. మంచి మేనేజ్మెంట్ను ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పుకొచ్చారు.మరోవైపు, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉక్కు పోరాట కమిటీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు అపాయింట్మెంట్ కోరారు. అయితే, ఇప్పటి వరకు అపాయింట్మెంట్పై ఎలాంటి స్పష్టత రాలేదు. సీఎం చంద్రబాబు పిలుపు కోసం పోరాట కమిటీ సభ్యులు ఎదురు చూస్తున్నారు. -
విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం
విశాఖపట్నం, సాక్షి: విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జైల్ రోడ్డులోని ఎస్బీఐలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సబ్బంది మంటలు ఆర్పుతున్నారు. -
Vizag: రెండు ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు
భారత్‌కు చెందిన విమానాలకు బాంబు బెదిరింపుల పర్వం ఆగడం లేదు. వరుసగా వస్తున్న ఈ బాంబు బెదిరింపు ఘటనలు అటు విమానయాన అధికారుల్లో, ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 15 రోజుల్లో దాదాపు 200కుపైగా విమానాలకు బెదిరింపులు అందాయి. వీటిపై విమానయాన సంస్థలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఆగడం లేదు.సాక్షి, విశాఖపట్నం: తాజాగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న విమానంతోపాటు చెన్నై నుంచి విశాఖపట్నం వస్తున్న విమానానికి మంగళవారం బెదిరింపులు రావడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. దీంతో వెంటనే భద్రత సిబ్బంది రెండు విమానాల్లోనూ బాంబు స్క్వాడ్ బృందంతో తనిఖీలు చేపట్టారు.కాగా సోమవారం కూడా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం మీదుగా ముంబయికి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్ విమానాశ్రయానికి ఆగంతకుడు ఫోన్ చేసి ముంబయి వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉందని బెదిరించడంతో.. అప్రమత్తమైన విమానాశ్రయ అధికారులు విశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. ఆకాశంలో ఉన్న విమానాన్ని పైలెట్లు వెంటనే వెనక్కి మళ్లించి విశాఖలో ల్యాండ్ చేశారు. 120 మంది ప్రయాణికులను కిందకు దించేయడంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. బాంబు స్క్వాడ్, సీఐఎస్ఎఫ్, ఎయిర్‌పోర్టు అధికారులు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, బాంబు లేదని గుర్తించారు. అనంతరం నాలుగు గంటలు ఆలస్యంగా విమానం ముంబయికి బయలుదేరింది. -
ఆర్టీవో ఆఫీసులో దసరా, దీపావళి దందా..!
సాక్షి,విశాఖపట్నం: విశాఖ ఆర్టీవో కార్యాలయంలో దసరా,దీపావళి దందాకు తెరతీశారు. రెండు నెలల నుంచి వేల సంఖ్యలో టూ వీలర్స్, ఫోర్ వీలర్స్ రిజిస్ట్రేషన్లను అధికారులు పెండింగ్ పెట్టారు. ఉద్దేశ్య పూర్వకంగానే రిజిస్ట్రేషన్లను ఆర్టీఏ అధికారులు పెండింగ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది.రిజిస్ట్రేషన్ల పెండింగ్‌కు ఏదో ఒక సాకు చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ కోసం ఒకటికి పది సార్లు తిప్పించుకుంటున్నారు.రిజిస్ట్రేషన్ జరగాలంటే 500 నుంచి 1000 వరకు చేతులు తపాలని ఆర్టీఏ సిబ్బంది డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పని జరగాలంటే తమ డ్రైవర్లను కలవాలని కొందరు అధికారులు షరతులు పెడుతున్నట్లు చెబుతున్నారు.డ్రైవర్లతో వాట్సాప్ కాల్‌లోనే మాట్లాడాలని ఆ అధికారులు సూచిస్తున్నారు. తమ డ్రైవర్లకు ఎంతోకొంత ముట్టజెప్పిన వారికే రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. డిప్యూటీ రవాణా కమిషనర్(డీటీసీ)కి తెలియకుండా కిందిస్థాయి సిబ్బందే ఈ దందా నడుపుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ వ్యవహారంతో విసిగిపోయిన టూ వీలర్,ఫోర్ వీలర్ వాహనాల డీలర్లు డీటీసీని మంగళవారం(అక్టోబర్ 29) కలవనున్నారు. గంభీరం నుంచి ఇటీవల బదిలీపై వచ్చిన అధికారి,మరో మహిళా అధికారితో కలిసి ఈ వసూళ్ల పర్వానికి తెరతీసినట్లు చెబుతున్నారు. ఆర్టీఏ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇదీ చదవండి: బాంబు బెదిరింపులతో హడల్ -
బాంబు బెదిరింపులతో హడల్
సాక్షి, అమరావతి: బాంబు బెదిరింపులతో యావత్ దేశం హడలిపోతోంది. విమానాలు, హోటళ్లు, విద్యాసంస్థలు.. ఇలా ప్రతిచోటా బాంబులు పెట్టినట్టు ఈమెయిల్, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా బెదిరింపుల వరద ముంచెత్తుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బెదిరింపు రాగానే పోలీసు బృందాలు, బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేయడం.. బాంబు లేదని నిర్ధారించడం ప్రహసనంగా మారింది. ప్రధానంగా దక్షిణ భారతంలోని రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని అత్యధికంగా ఈ ఉత్తుత్తి బాంబు బెదిరింపులు వస్తుండటం గమనార్హం. ‘నాన్నా.. పులి కథ’లా మారకూడదన్న ఉద్దేశంతో భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. రెండు వారాల్లో 400 బెదిరింపులువిమానాల్లో బాంబులు పెట్టినట్టు బెదిరింపు ఈమెయిల్స్ వస్తుండటంతో పౌర విమానయాన శాఖ బెంబేలెత్తుతోంది. రెండు వారాల్లో ఏకంగా 400 బెదిరింపులు రావడం గమనార్హం. శనివారం ఒక్కరోజే 33 బెదిరింపులు రావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. నవంబర్ 1 నుంచి 19 వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని అంతర్జాతీయ ప్రయాణికులను ఖలీస్థానీ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల బెదిరించడం కూడా ఈ ఆందోళనను రెట్టింపు చేస్తోంది. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు తదితర విమానాశ్రయాలకు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఈమెయిల్స్తోపాటు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. దాంతో టేకాఫ్ తీసుకున్న విమానాలను అత్యవసరంగా ల్యాండింగ్ చేయిస్తూ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. దక్షిణ భారతమే ప్రధాన లక్ష్యంగా..బాంబు బెదిరింపులకు పాల్పడుతున్న ఆగంతకులు ప్రధానంగా దక్షిణ భారత రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకున్నారు. తమిళనాడులోని చెన్నైకు బెదిరింపులు వచ్చాయి. అక్కడి విమానాశ్రయం నుంచి బయలుదేరే విమానాల్లోనూ, ఆ నగరంలోని హోటళ్లలోనూ బాంబులు పెట్టినట్టు బెదిరించారు. బెంగళూరు, హైదరాబాద్ కూడా ఈ బెదిరింపుల బెడద బారిన పడ్డాయి. ఆ రెండు నగరాల్లో విమానాలతోపాటు విద్యాసంస్థల్లో బాంబులు పెట్టినట్టు సోషల్ మీడియా వేదికల ద్వారా బెంబేలెత్తించారు. బెదిరింపుల బెడద ఆంధ్రప్రదేశ్‌నూ తాకింది. శ్రీవారి దివ్యక్షేత్రం తిరుపతిని లక్ష్యంగా చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.వారం రోజుల్లో తిరుపతిలోని 17 హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తిరుపతి ఇస్కాన్ ఆలయంలోనూ బాంబు పెట్టినట్టు బెదిరించడం గమనార్హం. కాగా.. విజయవాడలోని ఓ స్టార్ హోటల్‌కు కూడా బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఒకర్ని అరెస్ట్ చేసిన పోలీసులు బెంగళూరు, విజయవాడలోని హోటళ్లలో బాంబులు పెట్టినట్టు బెదిరింపు ఈమెయిల్స్ పంపిన ఓ ఆగంతకుడిని పోలీసులు గుర్తించారు. అస్సాం నుంచి ఆ మెయిల్ వచ్చినట్టు గుర్తించి ఏపీ, కర్ణాటక ఎస్ఐబీ విభాగం అధికారులు ఆ రాష్ట్రంలో సోదాలు నిర్వహించారు. ఈమెయిల్ పంపిన ఆగంతకుడిని గుర్తించి అరెస్ట్ చేసి బెంగళూరు న్యాయస్థానంలో హాజరుపరిచారు. అతను మతిస్థిమితంలేని వ్యక్తి అని పోలీసులు చెబుతున్నారు. విమానాశ్రయాల్లో ‘బీటీసీ’ల మోహరింపుబాంబు బెదిరింపుల నేపథ్యంలో జాతీయ దర్యాప్తు విభాగం(ఎన్ఐఏ) కార్యాచరణను వేగవంతం చేసింది. దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాల్లోనూ థ్రెట్ అసిస్టెంట్ కమిటీ(బీటీసీ)లను మోహరించింది. బెదిరింపు ఈమెయిల్స్, సోషల్ మీడియా పోస్టులను ఈ విభాగం పరిశీలించి దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. ఎక్కడి నుంచి మెయిల్స్ వస్తున్నాయో గుర్తించడం, ఎవరు చేస్తున్నారన్నది దర్యాప్తు చేయడం, తదనుగుణంగా కార్యాచరణ చేపట్టేందుకు భద్రతా దళాలకు సహకరించడంలో బీటీసీ బృందాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.మరో విమానానికి బాంబు బెదిరింపువిశాఖ నుంచి ముంబై బయలుదేరిన విమానాన్ని వెనక్కి రప్పించిన అధికారులుతనిఖీల అనంతరం బాంబు లేదని నిర్ధారణసాక్షి, విశాఖపట్నం: వరుస బాంబుబెదిరింపులు విమానయాన సంస్థలతోపాటు ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. రెండు రోజులుగా వివిధ విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ బెదిరింపు కాల్ సోమవారం విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో అలజడి సృష్టించింది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చిన ఇండిగో విమానంలో బాంబు ఉందని గుర్తుతెలియని వ్యక్తి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఫోన్ చేసి హెచ్చరించాడు. దీంతో అక్కడి అధికారులు విశాఖ విమానాశ్రయ అధికారులకు సమాచారం ఇచ్చారు.అప్పటికే విశాఖ చేరుకుని.. ముంబై బయలుదేరిన ఆ విమానాన్ని అత్యవసరంగా వెనక్కి రప్పించారు. విమానం ల్యాండ్ అయ్యేసరికే బాంబ్ స్క్వాడ్‌ను సిద్ధం చేశారు. ప్రయాణికులను దింపి విమానాన్ని పూర్తిగా తనిఖీ చేసి.. బాంబు లేదని నిర్ధారించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం విశాఖ నుంచి సుమారు 2 గంటలు ఆలస్యంగా సాయంత్రం 5.32 గంటలకు విమానం ముంబైకి బయలుదేరి వెళ్లిందని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ రాజారెడ్డి తెలిపారు. -
వైజాగ్-విజయవాడ: నేటి నుంచి రెండు విమాన సర్వీసులు
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్-విజయవాడ మధ్య ఈ నెల 27వ తేదీ నుంచి కొత్తగా రెండు విమాన సర్వీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఈ నగరాల మధ్య ఇండిగో ఎయిర్‌లైన్స్ ఒక విమానం నడుపుతోంది. ప్రయాణికుల ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఆదివారం నుంచి రెండో విమాన సర్వీస్‌ను ఇండిగో ప్రారంభించనుంది. ఈ విమానం సాయంత్రం 7.30గంటలకు గన్నవరం నుంచి వైజాగ్ వెళ్లి, తిరిగి రాత్రి 9.50 గంటలకు గన్నవరం చేరుకుంటుంది. ఇదేరోజున ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సంస్థ కూడా విశాఖ– విజయవాడ మధ్య కొత్త సర్వీస్‌ను నడపనుంది. దీనికోసం 180 మంది సామర్థ్యం కలిగిన బోయింగ్ 737 విమానాన్ని కేటాయించింది. ఈ విమానం వైజాగ్ నుంచి ఉ.10.35 గంటలకు గన్నవరం చేరుకుని తిరిగి రాత్రి 7.55కు వైజాగ్ బయలు దేరుతుంది. విజయవాడ–వైజాగ్ మధ్య ప్రారంభ టికెట్ ధరను రూ.3,014గా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ నిర్ణయించింది.