విశాఖలో యువ దంపతుల ఆత్మహత్య.. ఏం జరిగింది? | Pregnant Woman And Husband Found Dead In Visakhapatnam, Police Probe Multiple Angles | Sakshi
Sakshi News home page

విశాఖలో యువ దంపతుల ఆత్మహత్య.. ఏం జరిగింది?

Nov 3 2025 8:38 AM | Updated on Nov 3 2025 10:26 AM

Visaka Anitha And Vasu Couple Incident

తాటిచెట్లపాలెం (విశాఖ): నగరంలోని అక్కయ్యపాలెంలో యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఫోర్త్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. భార్య అనిత, తల్లితో కలిసి సూరిశెట్టి వాసు అక్కయ్యపాలెం, దాలిరాజు సూపర్‌మార్కెట్‌ సమీపంలో ఉంటున్నారు. ఏడాది క్రితం వీరికి పెళ్లయింది. ప్రస్తుతం అనిత ఏడో నెల గర్భిణి. ఏం జరిగిందో తెలీదుగానీ ఆదివారం వీరిద్దరూ విగతజీవులయ్యారు.

వాసు ఫ్యాన్‌ హుక్‌కు ఉరేసుకుని చనిపోగా, అనిత మంచం మీద చనిపోయి ఉంది. ఉదయం వాసు తల్లి ఫంక్షన్‌ నిమిత్తం బయటకెళ్లి సాయంత్రం తిరిగి వచ్చింది. తలుపు ఎంతసేపు కొట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి, కిటీకిలో నుంచి చూసి నిర్ఘాంతపోయింది. తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇద్దరూ మరణించి కనిపించడంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. స్థానికంగా వాసు, అనితల ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. 

మరోవైపు.. అనిత ఏడు నెలలు గర్భిణి కావడంతో తీవ్ర విషాదం నెలకొంది. అనిత గర్భంలో ఉన్న బిడ్డను బతికించేందకు పోలీసులు మృతురాలిని ఆస్పత్రికి తరలించారు. కేజీహెచ్‌కు తీసుకెళ్లినప్పటికీ గర్భంలో ఉన్న ఆడ శిశువు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు.

పలు కోణాల్లో దర్యాప్తు
వాసు ఉరేసుకొని ఉండగా, అనిత కిందపడి ఉండటంతో ముందు భార్యను చంపి, అతను ఆత్మహత్య చేసుకున్నాడా, లేదా భార్యకు విషమిచ్చి అనంతరం ఉరేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి జరిగినప్పటి నుంచి వీరిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు. వీరి మధ్య ఎటువంటి విభేదాలు లేవని, ఆనందంగా ఉండేవారని తల్లి, బంధువులు పోలీసులకు తెలియజేశారు. చుట్టు పక్కల నివాసితులను విచారణ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement