కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ వినతి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రాష్ట్ర స్థాయి అత్యున్నత నిఘా విభాగాలైన తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధునీకరణకు నిధులు మంజూరు చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. గురువారం ఢిల్లీలో అమిత్ షాను ఆయన నివాసంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ కలిశారు. సుమారు గంటపాటు షాతో భేటీ అయ్యారు.
డ్రగ్స్ కట్టడి, సైబర్ నేరాల నియంత్రణకు కావాల్సిన ఆధునిక సాంకేతిక పరిజ్జానం, పరికరాల కొనుగోలు కోసం టీజీ న్యాబ్‌కు రూ. 88 కోట్లు, టీజీ సీఎస్‌బీకి రూ.90 కోట్లు కేటాయించాలని అమిత్ షాను కోరారు. ఐదేళ్లకోసారి ఐపీఎస్ క్యాడర్ సమీక్ష చేయడం తప్పనిసరని, తెలంగాణకు సంబంధించి 2016లో తొలిసారి సమీక్ష నిర్వహించారని, నాటి నుంచి సమీక్ష చేయనుందున వెంటనే సమీక్ష చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు 61 ఐపీఎస్ పోస్టులు కేటాయించారని, కొత్త రాష్ట్ర అవసరాలకు ఐపీఎస్‌లు సరిపోనందున.. తెలంగాణకు అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
మరికొన్ని వినతులు
⇒ తెలంగాణలో వామపక్ష తీవ్రవాదాన్ని అరికట్టేందుకు ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భద్రతా దళాల క్యాంపులను ఏర్పాటు చేయాలి.
⇒ వామపక్ష తీవ్రవాదం అణచివేత కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండవాయి గ్రామం, ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామ పరిధిలో సీఆరీ్ఫఎఫ్ జేటీఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేయాలి.
⇒ మావోయిస్టుల ఏరివేతకు ఏర్పాటు చేసిన ఎస్పీవోల్లో మాజీ సైనికులు, మాజీ పోలీసులనే చేర్చుకోవాలన్న నిబంధనను సవరించి 1,065 మందిని ఎస్పీవోల్లో చేర్చుకోవడానికి అనుమతించాలి.
⇒ ఎస్పీవోలకు చెల్లించాల్సిన నిధుల్లో నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 60% కేంద్రం వాటా కింద రూ.18.31 కోట్లను వెంటనే విడుదల చేయాలి.
⇒ ఏపీ, తెలంగాణ మధ్య విభజన సమస్యల పరిష్కారానికి సహకరించాలి. షెడ్యూల్–9లోని ప్రభుత్వ భవనాలు, కార్పొరేషన్ల పంపిణీ, షెడ్యూల్–10లోని సంస్థల వివాదం సామరస్యపూర్వకంగా పరిష్కారానికి కృషి చేయాలి. ళీ విభజన చట్టంలో ఎక్కడా ప్రస్తావించని ఆస్తులు, సంస్థలను ఏపీ క్లెయిమ్ చేసుకుంటున్నందున అందులో తెలంగాణకు న్యాయం జరిగేలా చొరవ చూపాలి.
Comments
Please login to add a commentAdd a comment