పీసీసీ చీఫ్‌గా మహేశ్‌కుమార్ గౌడ్, మధుయాష్కీ గౌడ్‌లలో ఒకరికి చాన్స్
ప్రస్తుత రాజకీయ పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని బీసీ వర్గంవైపు మొగ్గు
ఏఐసీసీ నుంచి అధికారిక ప్రకటనే తరువాయి
ఢిల్లీలో ఖర్గే, రాహుల్, కేసీతో సీఎం రేవంత్ సహా రాష్ట్ర ముఖ్యనేతల భేటీ.. సుమారు రెండు గంటలపాటు చర్చలు
మహేశ్‌కుమార్ గౌడ్, మధుయాష్కీ గౌడ్‌ల ఎంపికపై చర్చ
తుది నిర్ణయం తమకు వదిలేయాలన్న అధిష్టానం
పీసీసీ అధ్యక్షుడి ప్రకటన తర్వాతే మంత్రివర్గ విస్తరణ!
మంత్రివర్గ విస్తరణపై అస్పష్టత
రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా ఉత్సుకతతో ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ పెద్దలు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. తాజా భేటీలో మంత్రివర్గ కూర్పుపై అభిప్రాయ సేకరణకు పరిమితమైన అధిష్టానం.. దానిపై మరోమారు చర్చిద్దామంటూ వాయిదా వేసినట్లు తెలిసింది. పీసీసీ అధ్యక్షుడి నియామకమయ్యాక దీనిపై చర్చిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక బీఆర్‌ఎస్ నుంచి పారీ్టలో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య, సంజయ్‌కుమార్, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలకు సంబంధించి కొన్ని డిమాండ్‌లు ఉన్నాయంటూ.. వీరికి కార్పొరేషన్ పదవులు కట్టబెట్టాలనే ప్రతిపాదనను హైకమాండ్ ముందు రాష్ట్ర నేతలు ఉంచినట్లు తెలిసింది. దీనికి హైకమాండ్ అంగీకరించినట్లు సమాచారం.
సాక్షి, న్యూఢిల్లీ: టీపీసీసీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చింది. తెలంగాణ పార్టీ పగ్గాలను బీసీ నేతకు అప్పగించాలనే అభిప్రాయానికి ఢిల్లీ పెద్దలు వచ్చి నట్లు తెలుస్తోంది. రాష్ట్ర నేతలు వెలిబుచ్చిన అభిప్రాయాలు, సామాజిక సమీకరణాలు పరిగణనలోకి తీసుకున్న హైకమాండ్.. బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలైన మహేశ్‌కుమార్ గౌడ్, మధుయాష్కీ గౌడ్‌లలో ఒకరికి పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ పార్టీ ముఖ్యులతో జరిగిన చర్చల్లో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కసరత్తు ఓ కొలిక్కి వచ్చిందని, ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడి నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, జిల్లాల వారీ ప్రాతినిధ్యం, సామాజిక సమీకరణలు, పారీ్టలో పనిచేసిన అనుభవం ఆధారంగా కొత్త మంత్రులపై నిర్ణయం ఉంటుందని సమాచారం.
సుదీర్ఘ చర్చలు..: కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికతో పాటు ప్రభుత్వంలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న కేబినెట్ పదవుల భర్తీపై గత నెల రోజులుగా తీవ్ర కసరత్తు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే పలుమార్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్‌గాం«దీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో చర్చలు జరిపారు. మరోవైపు అధిష్టానం కూడా ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిల అభిప్రాయాన్ని తీసుకుంది.
తాజాగా ఆయా అంశాలపై చర్చించేందుకు శుక్రవారం ఢిల్లీ వచ్చిన రేవంత్‌రెడ్డి, భట్టి, ఉత్తమ్‌లు పార్టీ ప్రధాన కార్యాలయంలో ఖర్గే, రాహుల్‌గాం«దీ, కేసీలతో మరోమారు భేటీ అయ్యారు. సుమారు రెండు గంటల పాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అధిష్టానం ముఖ్య నేతలతో విడివిడిగా కూడా సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకుంది.
చర్చకు వచ్చిన ఆరు పేర్లు
పీసీసీ పదవికి ప్రధానంగా ఆరుగురు నేతల పేర్లపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బీసీ సామాజికవర్గం నుంచి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఎస్సీ సామాజికవర్గం నుంచి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ఎస్టీ సామాజికవర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్, ఓసీ సామాజికవర్గం నుంచి మంత్రి శ్రీధర్‌బాబుల పేర్లను పరిశీలించినట్లు సమాచారం. అయితే రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రతిపక్ష పారీ్టలను ధీటుగా ఎదుర్కోవాల్సిన ఆవశ్యకతతో పాటు సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని బీసీ సామాజికవర్గ నేతలకే పదవి కట్టబెట్టాలనే నిర్ణయానికి వచ్చారు.
ముఖ్యంగా బీసీ నేతలకు కేంద్ర ప్రభుత్వ, పార్టీ పదవుల్లో బీజేపీ మొదటి ప్రాధాన్యత ఇస్తూ వారిని మచ్చిక చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు పరిగణనలోకి తీసుకుని బీసీ వర్గ నేతలవైపే హైకమాండ్ పెద్దలు మొగ్గు చూపినట్లు తెలిసింది. వారిలో పార్టీ కార్యకలాపాల్లో మొదటినుంచీ చురుగ్గా ఉన్న మహేశ్‌గౌడ్ వైపు మెజార్టీ నేతలు మొగ్గు చూపగా, ఆయన ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండటంతో పాటు ఎమ్మెల్సీగా కొనసాగుతున్న దృష్ట్యా, మధుయాష్కీ పేరును పరిశీలించాలని మరికొందరు నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది.
అయితే దీనిపై నిర్ణయాధికారం తమకు అప్పగించాలని, ఎవరి పేరును ప్రకటించినా పార్టీ నేతలంతా కలిసి పనిచేయాలని హైకమాండ్ పెద్దలు సూచించినట్లు తెలిసింది. మరోవైపు ఓసీ, ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గాలకు సైతం ప్రాధాన్యం ఇచ్చేలా ముగ్గురు వైస్ ప్రెసిడెంట్‌లను నియమించాలనే దానిపై భేటీలో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment