![Telangana CM Revanth Reddy and PCC chief Mahesh Goud meet AICC president Kharge](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/TELANAGAN-CM-REVENTH-REDDY-.jpg.webp?itok=Ycu_Ve-U)
శుక్రవారం పార్లమెంటులో ఖర్గేతో భేటీ అనంతరం పార్టీ ఎంపీలతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్. చిత్రంలో బలరాం నాయక్, చామల కిరణ్‌కుమార్, అనిల్‌కుమార్ యాదవ్, మల్లు రవి
కులగణన ఆధారంగానే స్థానిక సంస్థల్లో సీట్లు, పార్టీ పదవుల పంపకాలు
ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ భేటీలో నిర్ణయం
ఈ అంశంలో తెలంగాణ దేశానికే నమూనాగా నిలవాలన్న ఖర్గే, వేణుగోపాల్
ఎమ్మెల్యేల్లో అసంతృప్తి రానివ్వొద్దని.. వారికి సమయం ఇవ్వాలని సూచన
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చూపాలని స్పష్టికరణ.. గజ్వేల్ సభకు వచ్చేందుకు ఖర్గే ఓకేæ..
పీసీసీకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు.. 20 మందికిపైగా వైస్ ప్రెసిడెంట్లు..
కార్యవర్గం ఏర్పాటుపై స్పష్టత.. నేడో రేపో ప్రకటించే అవకాశం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వంలోగానీ, పార్టీలోగానీ ఇకముందు తీసుకునే విధానపర నిర్ణయాలన్నింటికీ కులగణనే(caste census) ప్రాతిపదికగా ఉండాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(mallikarjun kharge)తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు జరిపిన భేటీలో నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం అమలు చేసే పథకాలు, నిధుల కేటాయింపుల్లో కులగణన లెక్కలను కొలమానంగా తీసుకుని ముందుకెళ్లాలని.. స్థానిక సంస్థల ఎన్నికలు మొదలు నామినేటెడ్ పోస్టులు, పీసీసీ పదవుల భర్తీ దాకా ఇదే ఫార్ములాను అనుసరించాలని నిశ్చయానికి వచ్చినట్టు తెలిపాయి.
రాష్ట్రంలో కులగణన, ఎస్సీ వర్గీకరణతో పాటు పలు రాజకీయ అంశాలపై చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ తదితరులు శుక్రవారం ఖర్గేతో భేటీ అయ్యారు. పార్లమెంట్‌లోని ఖర్గే కార్యాలయంలో సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై కూలంకషంగా చర్చించారు. అనంతరం పీసీసీ కూర్పుపై కేసీ వేణుగోపాల్‌తోనూ నేతలు విడివిడిగా భేటీ అయి తమ అభిప్రాయాలను వెల్లడించారు.
కులగణన దేశానికి నమూనా కావాలి
రాష్ట్రంలో కులగణన, ఎస్సీ వర్గీకరణలకు అసెంబ్లీ ఆమోదం తెలిపిన అంశాన్ని రాష్ట్ర నేతలు ఖర్గేకు వివరించారు. దీనిపై రాష్ట్రంలోని నిమ్న వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఈ అంశాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి మూడు, నాలుగు జిల్లాలకు కలిపి ఒక సభను ఏర్పాటు చేస్తామని.. ఆ సభలకు హాజరుకావాలని ఖర్గేను కోరారు. ఇందులో ఎస్సీ వర్గీకరణ అంశంపై గజ్వేల్‌లో నిర్వహించే సభకు వచ్చేందుకు ఖర్గే ఒకే చెప్పినట్టు తెలిసింది.
‘‘జనాభా ప్రాతిపదికన అందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నది నాతోపాటు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ప్రధాన ఉద్దేశం. కులగణనతో ఆయా వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని మేం విశ్వసిస్తున్నాం. విద్య, ఉద్యోగం, ఉపాధి, నిధుల కేటాయింపులలో ఓబీసీ, గిరిజన, దళితులు, మైనార్టీలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు ఉండాలి...’’అని ఖర్గే సూచించారని సమాచారం.
తెలంగాణలో కులగణన, దాని ఆధారంగా అమలు చేసే అంశాలు దేశానికే దిక్సూచిగా నిలవాలని పేర్కొన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సైతం ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వర్గీకరణను పూర్తి చేసిన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర నేతలకు ఖర్గే సూచించినట్టు తెలిసింది.
ఎమ్మెల్యేల్లో అసంతృప్తి రానివ్వొద్దు..
ఇటీవల కొందరు ఎమ్మెల్యేల ప్రత్యేక భేటీ అంశం కూడా ఖర్గే వద్ద ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. ఒకరిద్దరు మంత్రుల తీరు నచ్చక జరిగిన ఈ భేటీతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ దీన్ని ప్రజల్లో తీవ్రస్థాయిలో చర్చకు పెట్టిందని నేతలు ప్రస్తావించారని సమాచారం. అయితే దీనిపై ఇప్పటికే ఎమ్మెల్యేలతో మాట్లాడామని... ఏ విషయమైనా నేరుగా తమతోగానీ, అధిష్టానం పెద్దలతోగానీ మాట్లాడొచ్చని సూచించామని దీపాదాస్ మున్షీ, రేవంత్‌రెడ్డి వివరించినట్టు తెలిసింది.
ఈ క్రమంలో ఎమ్మెల్యేల్లో అసంతృప్తి రానివ్వొద్దని, వారితో ఎప్పటికప్పుడు చర్చించుకోవాలని, రెండు, మూడు నెలలకోసారి సీఎల్పీ భేటీలు నిర్వహించుకోవాలని ఖర్గే సూచించారని సమాచారం. బీఆర్‌ఎస్ బలంగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి వదంతులు, తప్పుడు సంకేతాలకు ఆస్కారం ఇవ్వకూడదని స్పష్టం చేసినట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు పాలనకు పరీక్ష అని.. ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఖర్గే పేర్కొన్నట్టు తెలిసింది.
నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు.. 20మందికిపైగా వైస్ ప్రెసిడెంట్లు..
పీసీసీ కార్యవర్గ కూర్పుపై ఖర్గే, కేసీ వేణుగోపాల్‌లతో రాష్ట్ర నేతలు జరిపిన భేటీలలో కొంతమేర స్పష్టత వచ్చినట్లు తెలిసింది. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను, 20 నుంచి 25 మంది వరకు వైస్ ప్రెసిడెంట్లను నియమించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. వర్కింగ్ ప్రెసిడెంట్లలో బీసీ, రెడ్డి, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారు ఉండాలనే భావనకు వచ్చినట్టు సమాచారం. ఇక జిల్లా నేతల ఆమోదం ఉన్న చోట్ల డీసీసీ అధ్యక్షులను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment