Uttam Kumar Reddy N
-
స్మార్ట్ చిప్‌తో తెల్లరేషన్ కార్డులు: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి తరువాత కొత్త తెల్లరేషన్ కార్డులు మంజూరు చేస్తామని పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. దాదాపు 10 లక్షల కొత్త రేషన్‌కార్డులను జారీ చేస్తామని, తద్వారా 31 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. దీంతో ఏటా రూ.956 కోట్ల మేరకు ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని చెప్పారు. రేషన్‌కార్డులు ఎప్పటి నుంచి ఇస్తారని సోమవారం శాసనమండలిలో సభ్యులు కోదండరాం, మీర్జా రియాజుల్ హసన్ అడిగిన ప్రశ్నకు మంత్రి పైవిధంగా బదులిచ్చారు. కొత్త కార్డులకు ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేను కూడా ఆధారంగా చేసుకుంటామని చెప్పారు. తెల్ల రేషన్‌కార్డులకు చిప్‌ను జోడిస్తామని తద్వారా స్మార్ట్‌కార్డులను జారీచేయబోతున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో అదనపు పేర్ల నమోదుకు మీ సేవ కేంద్రం ద్వారా గత పదేళ్లుగా వచ్చిన 18 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. మంత్రివర్గ ఉపసంఘాన్ని తన నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియమించిన విషయాన్ని మంత్రి వివరించారు. ఉపసంఘం పలుమార్లు సమావేశమై చర్చించిందన్నారు. కార్డుల మంజూరు ప్రక్రియలో సుప్రీంకోర్టుకు సక్సేనా కమిటీ సమర్పించిన సిఫారసులను పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు. అలాగే రేషన్‌కార్డుల జారీ ప్రక్రియలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల నుంచి సేకరించిన సూచనలను కూడా ఉప సంఘం పరిగణనలోకి తీసుకున్నట్లు ఉత్తమ్ తెలిపారు. వీటన్నింటినీ అధ్యయనం చేసిన ఉపసంఘం కొత్త రేషన్ కార్డుల మంజూరీకి అర్హతా ప్రమాణాలు నిర్ణయిస్తూ కేబినెట్‌కు నివేదిక సమర్పిస్తుందని చెప్పారు. దొడ్డుబియ్యం పక్కదారి నిజమే.. రేషన్‌షాపుల్లో ఇస్తున్న దొడ్డుబియ్యం పక్కదారి పడుతున్న మాట వాస్తవమేనని మంత్రి ఉత్తమ్‌కుమార్ అంగీకరించారు. ప్రజలెవ్వరూ దొడ్డుబియ్యం వినియోగించడం లేదని, దాంతో పక్కదారి పడుతోంన్నారు. అందుకే ఇకపై సన్నబియ్యం మాత్రమే సరఫరా చేస్తామని ప్రకటించారు. నిత్యావసర వస్తువుల పంపిణీ ఆలోచన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న చౌక ధరల దుకాణాల డీలర్ల భర్తీ ప్రక్రియను త్వరలోనే చేపడతామన్నారు. 2.46 లక్షల కార్డులు రద్దు... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలో 91,68,231 రేషన్ కార్డులు ఉండేవని, మొత్తం లబ్ధిదారుల సంఖ్య 3.38 కోట్లని ఉత్తమ్‌కుమార్ సభకు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత ఇక్కడి నుంచి ఏపీకి చెందిన వారు తమ ప్రాంతాలకు వెళ్లడంతో 2,46,324 కార్డులు రద్దయ్యాయని చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డాక మొత్తం 89,21,907 తెల్ల కార్డులు ఉన్నాయని, 2.7 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో 2016 నుంచి 2023 వరకు కొత్తగా 20.69 లక్షల మంది లబ్ధిదారులకు 6,47,479 ఆహార భద్రతా కార్డులు మంజూరు చేశారని, అదే సమయంలో 5,98,000 ఆహార భద్రతా కార్డులు తొలగించారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత పదేళ్లలో మంజూరు చేసిన తెల్ల రేషన్ కార్డులు 49 వేలు మాత్రమేనని, వీటి లబ్ధిదారులు 86 వేల మంది ఉన్నారని ఉత్తమ్ చెప్పారు. -
వేసవిలో ప్రాణహిత శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్లు, డ్రాయింగ్లతోపాటు అంచనాలను సవరించి వచ్చే వేసవిలో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తామని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఎన్నికల హామీ మేరకు ఈ టర్మ్‌లోనే ప్రాజెక్టును పూర్తిచేస్తామని చెప్పారు. గోదావరిపై తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించే అంశాన్ని పునఃపరిశీలిస్తున్నామని.. నిపుణుల సలహా మేరకు ముందుకెళ్తామని అన్నారు. గత డిజైన్లు, నీటి లభ్యతను పునఃసమీక్షించి బరాజ్‌ను తప్పనిసరిగా కడతామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేపటితో (డిసెంబర్ 7) ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మంత్రి ఉత్తమ్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఏడాది కాలంలో సాధించిన ప్రగతి, పాలనా విశేషాలను పంచుకున్నారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ‘కాళేశ్వరాన్ని’ సాధ్యమైనంత వరకు వాడుకుంటాం... తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగానే ఉండాలనే రాజకీయ దురుద్దేశాలు మాకు లేవు. ప్రాజెక్టును ఏ మేరకు ఉపయోగంలోకి తీసుకురాగలమో అంతవరకు తీసుకొస్తాం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదిక కోసం నిరీక్షిస్తున్నాం. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సూచనల మేరకు బరాజ్‌లను రక్షించుకోవడానికి గ్రౌటింగ్ పనులను అధికారులు చేయడంపై ఎన్డీఎస్ఏ అభ్యంతరం తెలపడం వాస్తవమే.మేడిగడ్డ బరాజ్ కుంగినందున అన్నారం, సుందిళ్ల బరాజ్లనైనా వాడుకోవచ్చా? అని ఎన్డీఎస్ఏ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌ను అడిగా. మూడు బరాజ్‌లకు సికెంట్ పైల్స్ వాడటంతో వాటి భద్రతపై అనుమానాలున్నాయని.. క్లియరెన్స్ ఇవ్వలేమని ఆయన బదులిచ్చారు. దీనిపై డిసెంబర్ ఆఖరిలోగా పరిశీలించి చెప్తామన్నారు. ‘కాళేశ్వరం’లేకున్నా రికార్డుస్థాయి దిగుబడి.. కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌లలో చుక్క నీళ్లు నిల్వ చేయకపోయినా గత వానాకాలంలో 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండటం దేశంలోనే రికార్డు. ధాన్యం అమ్మకాలతో రైతులు రూ. 35–40 వేల కోట్లు ఆర్జించారు. సన్నాలకు పరిమితి లేకుండా రూ. 500 చొప్పున 1,87,532 మంది రైతులకు బోనస్ ఇచ్చాం. యాసంగిలో సన్నాలకు బోనస్ కొనసాగిస్తాం. దొడ్డు వడ్లనూ కొంటాం. పాత, కొత్త ప్రాజెక్టులను పూర్తి చేస్తాం.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక కమీషన్లు వచ్చే పనులకే ప్రాధ్యాతనిచి్చంది. మేము సాగునీటి ప్రాజెక్టులను ఏ, బీ కేటగిరీలుగా విభజించి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సత్వరమే సాగునీరు ఇచ్చే పనులను చేస్తున్నాం. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, డిండి, దేవాదుల, గౌరవెల్లి, ఎస్సారెస్పీ, అచ్చంపేట లిఫ్టుతోపాటు కొత్తగా చేపట్టిన కొడంగల్–నారాయణపేట ప్రాజెక్టులను ఈ టర్మ్‌లోనే పూర్తిచేస్తాం. నా ప్రధాన బాధ్యతగా ఎస్ఎల్బీసీ సొరంగం పనులను రెండేళ్లలో పూర్తిచేస్తా. జాతీయ విధానం ఆధారంగా లోయర్ మానేరు, మిడ్‌మానేరు ప్రాజెక్టుల్లో పూడిక తొలగింపు పనులను ప్రయోగాత్మకంగా చేపట్టబోతున్నాం. తర్వాత అన్ని ప్రాజెక్టుల్లో చేపడతాం. సీఎం, డిప్యూటీ సీఎం రాష్ట్రాభివృద్ధికి నిధులు సమీకరిస్తారని నమ్ముతున్నా.. బడ్జెట్లో నీటిపారుదల శాఖకు రూ. 22,160 కోట్లు కేటాయిస్తే అందులో రుణాలు, వడ్డీల చెల్లింపులు పోగా మిగిలిన రూ. 11 వేల కోట్లను ప్రాజెక్టులపై ఖర్చు చేస్తున్నాం. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాజెక్టులకు, రాష్ట్రాభివృద్ధికి సరిపడా నిధులు సమీకరిస్తారని నమ్మకం ఉంది. అన్ని జిల్లాలూ సమానమే.. ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ప్రాజెక్టులకే ప్రాధ్యాత ఇస్తున్నామన్న ఆరోపణలు అవాస్తవం. కరీంనగర్లో గౌరవెల్లి ప్రాజెక్టుకి రూ. 500 కోట్లు ఇచ్చాం. చిన్నకాళేశ్వరం పూర్తి చేస్తున్నాం. పెద్దపల్లిలో పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తున్నాం. మాకు అన్ని జిల్లాలు సమానమే. గత సర్కారు చుక్క నీటినీ సాధించలేదు.. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నీటి వాటాలపై రాజీ ప్రసక్తే లేదు. కృష్ణా జలాల్లో 811 టీఎంసీల ఉమ్మడి ఏపీ వాటాలో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల కేటాయింపులను అంగీకరిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి లిఖితపూర్వకంగా సమ్మతి తెలిపింది. తాజాగా అందుకు అంగీకరించబోమని.. 70 శాతం పరీవాహక ప్రాంతంగల తెలంగాణకే 70 శాతం జలాలను కేటాయించాలని కేంద్రంతో కోట్లాడుతున్నాం. పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, సమ్మక్క–సారక్క ప్రాజెక్టులకు చుక్క నీటి కేటాయింపులను కూడా గత సర్కారు సాధించలేదు. మా ప్రయత్నాలతో సీతారామకు 67 టీఎంసీల కేటాయింపులు తుది దశకు చేరాయి. శ్రీశైలంపై 10 రోజుల్లో సుప్రీంకు... (బాక్స్ ఐటెమ్) శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు, ఇతర మార్గాల ద్వారా ఏపీ అక్రమంగా నీళ్లు తరలిస్తుండడంపై వారం 10 రోజుల్లో సుప్రీం కోర్టులో కేసు వేయబోతున్నాం. సీఎం రేవంత్‌రెడ్డి వైఫల్యంతోనే నాగార్జునసాగర్‌పై నియంత్రణ సీఆర్పీఎఫ్ చేతుల్లోకి వెళ్లిందని ఎమ్మెల్సీ కె.కవిత చేసిన ఆరోపణలు అర్థరహితం. సాగర్‌ను తిరిగి కైవసం చేసుకోవడానికి చట్టప్రకారం అన్నీ చేస్తాం. ఇంజనీర్ల పదోన్నతులపై హైకోర్టులో స్టే తొలగిన వెంటనే నీటిపారుదల శాఖను పునర్వ్యవస్థీకరిస్తాం. నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల్లో భారీ సంస్కరణలు తీసుకొస్తున్నాం. జనవరి లేదా ఫిబ్రవరిలో రేషన్‌కార్డులకు సన్న బియ్యం.. రైతులు సన్నాలను అధిక ధరకు ధాన్యం వ్యాపారులకు అమ్ముకోవడం సంతోషకరం. రేషన్‌కు కొరత లేకుండా అవసరమైన సన్న బియ్యాన్ని సమీకరిస్తాం. మేము అధికారంలోకి వచ్చేసరికి సివిల్ సప్లై కార్పొరేషన్ అప్పులు రూ. 58,623 కోట్లు ఉండగా 10 నెలల్లో రూ. 11,600 కోట్లను కట్టేశాం. సంస్కరణల్లో భాగంగా మరో రెండు పంటల నాటికి మిల్లర్ల నుంచి 100 శాతం బ్యాంకు గ్యారంటీ అడుగుతాం. డిఫాల్టర్ల నుంచి చట్టపరమైన చర్యలతో రికవరీ చేస్తాం. రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు పూర్తయ్యాక రేషన్‌కార్డుల జారీకి మళ్లీ కసరత్తు ప్రారంభిస్తాం. రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీని జనవరి లేదా ఫిబ్రవరిలో మొదలుపెట్టే అంశంపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుంది. 24 గంటలూ ప్రజలకు అందుబాటులో... తెలంగాణ ప్రజాకాంక్షలకు విరుద్ధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. వన్ మ్యాన్ షో.. వన్ ఫ్యామిలీ షో అన్నట్లుగా పాలన సాగింది. నిలువెల్లా అహంకారం, నియంత్రతృత్వ ధోరణి, అవినీతితో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ నాటి సర్కార్ నీరుగార్చింది. మేము ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి శాసనసభ గౌరవాన్ని పెంపొందించాం. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. సమర్థంగా శాఖలను పరుగెత్తిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రులకు గౌరవం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఉంటుంది. బీఆర్ఎస్ అతిచేస్తోంది.. మేము అధికారంలోకి వచ్చి ఏడాది కాలేదు. ఇదైపోయింది... అదైపోయిందని బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం సరికాదు. మూసీ ప్రాజెక్టులో ఒక్క రూపాయి ఖర్చు పెట్టకపోయినా కుంభకోణం అనడం అతి. బీజేపీ, బీఆర్ఎస్ ఉద్యోగ, ఉపాధి కల్పనలో పదేళ్లు విఫలమయ్యారు. 10 నెలల్లోనే 55 వేల ఉద్యోగాలిచ్చాం. నిన్న ఇంకా 9 వేల ఉద్యోగాలు భర్తీ చేసినా ఏడుపే. పదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టునూ భర్తీ చేయలేదు. మేము 11 వేల మంది టీచర్లను నియమించాం. నీటిపారుదల శాఖలో 687 మంది ఏఈఈలను భర్తీ చేశాం. -
రైతు సంక్షేమానికే పెద్దపీట
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా.. ప్రభుత్వం పూర్తిగా రైతు పక్ష పాతి అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి కానున్న సందర్భంగా.. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో రైతు పండుగ సదస్సును మూడు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విష యం తెలిసిందే. శుక్రవారం జరిగిన రెండో రోజు ఈ సదస్సుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి రైతులు పోటెత్తారు. మరో మంత్రి తుమ్మలతో కలిసి రైతు పండుగ స్టాళ్లను పరిశీలించారు.అనంతరం రైతు అవగాహన సదస్సులో ఉత్తమ్ మాట్లా డుతూ ప్రస్తు త కాంగ్రెస్ ప్రభుత్వం రూ.18 వేల కోట్లతో 21 లక్షల మంది రైతులకు సంబంధించిన రుణమాఫీ చేసినట్టు గుర్తు చేశారు. మిగిలిన కొంత మంది రైతుల రుణమాఫీపై నేటి బహిరంగసభలో సీఎం రేవంత్‌రెడ్డి ఓ ప్రకటన చేస్తారన్నారు. దేశంలోనే అత్యధికంగా వరి సాగు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని.. అందుకే రైతు లు పండుగ చేసుకుంటున్నారని ఉత్తమ్ అన్నారు. రైతు పండుగ ఏర్పాట్లు, స్టాళ్లు చాలాఅద్భుతంగా ఉన్నాయని.. వ్యవసాయశాఖ మంత్రి అనుభవం, వారి దక్షతే ఇందుకు కారణమని కొనియాడారు. ఏది మంచిదో రైతులే చెప్పాలి: తుమ్మల రైతులకు అండగా ఉంటామని,అయితే ఏది మంచిదో రైతులే చెప్పాలని, మీ సలహాలు, సూచనలు వినడానికే ఈ రైతు సదస్సు ఏర్పాటు చేసినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతుబంధు కంటే బోనస్ బాగుంటుందని రైతులే అంటున్నారని.. రైతుల అభిప్రాయం మేరకు వారికి మేలు చేసే పథకాలనే కొనసాగిస్తామని తెలిపా రు. ఎండాకాలం పంటకు సంబంధించి మార్చి లోపల కోతలు ప్రారంభిస్తేనే నూకలు తక్కువ అవుతాయన్నారు. ఎండాకాలం పంటకు నీరు ఎప్పుడు విడు దల చేస్తారో త్వరగా నిర్ణయం తీసుకొని.. ఇరిగేషన్ ప్లాన్ ను అమలు చేయాలని ఉత్తమ్‌ను కోరారు. ఇందుకనుగుణంగా పంట ఎలా సాగు చేయాలనే దానిపై రైతులకు వ్యవసాయశాఖ తగు సూచనలిస్తుందన్నారు.ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, రాష్ట్ర రైతు సంఘాల అధ్యక్షుడు కోదండరెడ్డి, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు, కమిషనర్ గోపి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్.చౌహాన్, కలెక్టర్ విజయేందిర బోయి, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నా రు. ఆ తర్వాత శనివారం జరగనున్న సీఎం బహి రంగ సభ ఏర్పాట్లను మంత్రులు పరిశీలించారు. అనంతరం మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌కు చేరుకొని ధాన్యం కొనుగోళ్లపై ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్షించారు.మందులు పిచికారీకి బ్లేయర్ Ü ఈ మిషన్ పేరు గోదావరి బ్లేయర్. దీని విలువ రూ.లక్ష. దానిమ్మ, ద్రాక్ష, ఇతర పందిరి తోటల సాగులో ఈ యంత్రం రైతులకు అనువుగా ఉంటుంది. మందులు పిచికారీ చేసేందుకు దీనిని ఉపయోగిస్తారు. పందిరిలో రెండు వైపులా సాళ్లలో కప్పుకున్న తోటకు మంచు మాదిరిగా మందులు పిచికారీ చేస్తుంది. ఎక్కడా గ్యాప్ లేకుండా పిచికారీ చేయడం దీని ప్రత్యేకత. ఈ యంత్రం 6 హెచ్‌పీ పంపుసెట్తో 300 లీటర్ల సామర్థ్యం గల ట్యాంకు కలిగి ఉంటుంది. ఒకసారి ట్యాంకు నింపితే 18 నిమిషాల్లో ఎకరన్నర పొలంలో మందులు పిచికారీ చేయొచ్చు. ఈ యంత్రాన్ని ఉపయోగించడం ద్వారా రైతు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఆర్జించొచ్చు. కలుపు తీసేందుకు టిల్లర్ Ü ఈ యంత్రం పేరు టిల్లర్. దీనిని ఉపయోగించి పంటలో కలుపు తీయొచ్చు. దీని ధర రూ.58 వేలు. ఫోర్ స్ట్రోక్ సామర్థ్యం కలిగిన ఈ యంత్రం లీటర్ పెట్రోల్‌కు 1.5 ఎకరాలో కలుపు తీయడానికి సహాయ పడుతుంది. దీనిని రైతులు సులువుగా నడిపించొచ్చు. చేతిలో పట్టుకొని కలుపు ఉన్న సాళ్ల మధ్య తిప్పితే సరిపోతుంది. కూలీల కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులు తక్కువ ఖర్చుతో ఈ టిల్లర్ మిషన్ ద్వారా పంటలో సులభంగా కలుపు తీయొచ్చు. ఎంత మోతాదులో కలుపు తీయొచ్చో అందుకు తగినట్టుగా సర్దుబాటు చేసుకోవచ్చు. -
ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం సేకరణను త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లతో పాటు పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. రైతుల నుంచి ధాన్యం సేకరణ సజావుగా సాగేలా పర్యవేక్షించేందుకు జిల్లాల వారీగా నియమితులైన ఇన్చార్జి మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం..మంగళవారం పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ నుంచి మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు, చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. సన్న, దొడ్డు రకాలను వేరువేరుగా సేకరించాలని, ధాన్యం విక్రయించిన రైతుకు చెల్లింపులు వెంటనే పూర్తి చేయాలని, సన్న రకాలకు బోనస్ కూడా త్వరగా చెల్లించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్నిరకాల మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఉమ్మడి జిల్లాల వారీగా ప్రతిరోజూ నివేదిక సమరి్పంచాలని ఆదేశించారు. అక్రమాలకు పాల్పడే మిల్లర్లను ఉపేక్షించొద్దు అక్రమాలకు పాల్పడే మిల్లర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని, కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు రవాణా సమస్యలు తలెత్తకుండా తగినన్ని లారీలు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. సన్నాలకు బోనస్‌గా క్వింటాల్‌కు రూ.500 చెల్లిస్తుండడంపై రైతులు ఆనందంతో ఉన్నారని సీఎం వ్యాఖ్యానించారు. ’రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల్లో ధాన్యం పండించారు. ఇంకా 20 లక్షల ఎకరాల్లో పంట కోయాల్సి ఉంది. సరిహద్దు జిల్లాల్లో నుంచి బోనస్ కోసం ధాన్యం రాష్ట్రంలోకి వస్తోంది. ఆ ధాన్యం విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. 30న మహబూబ్‌నగర్‌లో రైతు పండగను జరుపబోతున్నాం. దీన్ని కలెక్టర్లు విజయవంతం చేయాలి’ అని సీఎం కోరారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అందిస్తున్న సౌకర్యాలపై ప్రజల్లో ప్రచారం చేయాలని సూచించారు. -
21.73 ఎల్ఎంటీల ధాన్యం కొనుగోలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: గత సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 20.6 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం కొనుగోలు చేయగా, ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి ఇప్పటికే 21.73 ఎల్ఎంటీల ధాన్యం కొనుగోలు చేసినట్లు రాష్ట్ర పౌర సరపరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయని ఇప్పటివరకు రూ.5,040.01 కోట్ల విలువైన వడ్లు కొనుగోలు చేశామని చెప్పారు. ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లు, పౌర సరఫరాల అధికారులతో ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నుంచి ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 8 వేల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. గతంలో కంటే 2,447 కేంద్రాలను అధికంగా ప్రారంభించామన్నారు. మొత్తం 16.06 ఎల్ఎంటీల దొడ్డు, 5.67 ఎల్ఎంటీల సన్నాలు కొనుగోలు చేసినట్లు చెప్పారు. సన్నాలకు సంబంధించి రూ.283.25 కోట్ల బోనస్ ఇవ్వాల్సి ఉండగా.. రూ.8.17 కోట్లు చెల్లించామని తెలిపారు. చెల్లింపుల్లో గత ప్రభుత్వం కంటే ముందంజలో ఉన్నామని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వంలో వానాకాలం సీజన్లో రూ.2,414.23 కోట్లు చెల్లిస్తే.. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు తాము రూ.2,760.22 కోట్లు చెల్లించామన్నారు. రికార్డు స్థాయిలో దిగుబడి ఉమ్మడి ఏపీలో కూడా రాని దిగుబడి ఈ సారి తెలంగాణలో వచ్చిందని ఉత్తమ్చెప్పారు. 66.07 లక్షల ఎకరాల్లో 40 లక్షల మంది రైతులు 153 ఎల్ఎంటీల ధాన్యాన్ని పండించారని, ఇది భారతదేశంలోనే రికార్డు సృష్టిస్తుందని అన్నారు. కాళేశ్వరం కింద మూడు బరాజ్‌లు పని చేయకున్నా.. రికార్డు స్థాయిలో ఉత్పత్తి రావడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణమన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, జనవరి 10వ తేదీ వరకు కొనుగోళ్లు సాగుతాయని మంత్రి చెప్పారు. రైతులు తొందరపడి దళారులకు అమ్ముకోవద్దని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి మూడు రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందన్నారు. ధాన్యం ఎప్పటికప్పుడు తరలించాలిఅధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం హుజూర్నగర్ రూరల్: కొనుగోలుకేంద్రాల్లో కాంటా వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని వేపలసింగారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. యంత్రం ద్వారా ధాన్యం తేమను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కాంటా వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో జాప్యం జరుగుతోందని, లారీలు సకా లంలో రావడం లేదని రైతులు చెప్పారు. దీంతో మంత్రి వెంటనే అధికారులతో మాట్లాడి రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
చిన్న కాళేశ్వరానికి రూ. 571 కోట్లు
సాక్షి, హైదరాబాద్: చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మిగులు పనుల పూర్తికి ప్రభుత్వం రూ.571 కోట్లతో పాలనాపర అనుమతులు జారీ చేసిందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. మంథని నియోజకవర్గం పరిధిలోని 63 గ్రామాలను సస్యశ్యామలం చేయడానికి 2007లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టుకి సంబంధించిన 75 శాతం పనులు పూర్తయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టును ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలో చేర్చి సత్వరం పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. శ్రీధర్‌బాబు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శనివారం జలసౌధలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసి 45 వేల ఎకరాలకు సాగునీరు, 0.5 టీఎంసీలను తాగునీటి అవసరాలకు అందిస్తామన్నారు. గోదావరి నుంచి అప్రోచ్ కాల్వ ద్వారా నీళ్లను కన్నెపల్లి వద్ద ఒకటో పంప్‌హౌస్‌కి తరలించి అక్కడి నుంచి మందిరం చెరువు, ఎర్ర చెరువుకు, ఆ తర్వా త రెండో పంప్‌హౌస్‌కి ఎత్తిపోస్తారు. మొత్తం 4.2 టీఎంసీలను రెండో పంప్‌హౌస్‌కు పంప్‌చేస్తారు. కాగా, వరదకు తెగిపోయిన రుద్రారం చెరువు పునరుద్ధరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. శ్రీరాంసాగర్ నీటితో 28 వేల ఎకరాల ఆయకట్టు మంథని నియోజకవర్గంలో శ్రీరాంసాగర్ కింద 28,800 ఎకరాల ఆయకట్టు ఉంది. డీ–83 డిస్ట్రిబ్యూటరీ కెనాల్ ద్వారా గుండారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలు చేరుకోవాలి. అక్కడి నుంచి 24 మైనర్ కాల్వల ద్వారా మొత్తం 28,800 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. కాలక్రమేణా కాల్వల్లో పూడిక చేరడంతో నిర్దేశిత ఆయకట్టుకు నీరు అందడం లేదు. గుండారం చెరువు నుంచి చివరి వరకు మరమ్మతులు చేసినీటి సామర్థ్యాన్ని పెంచాలని శ్రీధర్ బాబు ఆదేశించారు. -
పూడికతీతకు పచ్చజెండా
సాక్షి, హైదరాబాద్: జలాశయాల్లో పూడిక తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన జాతీయ విధానాన్ని రాష్ట్రంలో అమలు పరచడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచి్చంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ఆ మేరకు చేసిన సిఫారసుల ఆధారంగా ఒక జలాశయంలో పైలట్ ప్రాజెక్టుగా పూడిక తొలగింపును చేపట్టడానికి అనుమతిస్తూ రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పూడికతీత కోసం రాజస్థాన్, మహారాష్ట్రల తరహాలో ఆదాయ అర్జన విధానంలో భారీ యంత్రాలతో తవ్వకాలు (మెకానికల్ డ్రెడ్జింగ్) నిర్వహించాలని కేబినెట్ సబ్ కమిటీ సిఫారసు చేసింది.అంటే దీనికోసం ప్రభుత్వం ఖర్చు చేయదు..పైగా ప్రభుత్వానికే ఆదాయం రానుంది. తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) త్వరలో ఏదైనా ఒక జలాశయంలో పూడికతీతకు టెండర్లను ఆహా్వనించి అత్యధిక ధరను కోట్ చేసిన బిడ్డర్‌కు పూడికతీత పనులను అప్పగించే అవకాశం ఉంది. బిడ్డర్ పన్నులు, సెస్, జీఎస్టీ, రాయలీ్టని చెల్లించి తవి్వన మట్టి, ఇసుకను విక్రయించుకోవచ్చు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే ఇతర జలాశయాల్లో సైతం పూడిక తొలగింపునకు ఇదే మోడల్‌ను అనుసరించడానికి రాష్ట్ర ప్రభుత్వం తదుపరిగా అనుమతి ఇవ్వనుంది. సగానికి పైగా జలాశయాల్లో భారీగా పూడిక ⇒ రాష్ట్రంలో మొత్తం 929 టీఎంసీల సామర్థ్యం కలిగిన 159 భారీ జలాశయాలున్నాయి. సగానికి పైగా జలాశయాలు 25 ఏళ్లకు పైబడినవే కావడంతో భారీగా పూడిక పేరుకుపోయింది. ⇒ జలాశయాల్లో పూడిక పెరగడంతో క్రమంగా అవి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. తద్వారా ఆయకట్టుకు అవసరమైన సాగునీటికి, అలాగే తాగునీటి సరఫరాలో సైతం లోటు ఏర్పడుతోంది. పర్యావరణ సమస్యలూ తలెత్తుతున్నాయి. ⇒ నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టులో భాగంగా 220 టీఎంసీల సామర్థ్యం కలిగిన 14 ప్రాజెక్టులపై అధ్యయనం జరపగా, పూడికతో అవి 35 టీఎంసీల (16 శాతం) నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయినట్టు తేలింది. ⇒ దేశంలో పీఎం కిసాన్ సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) మార్గదర్శకాల ప్రకారం ఒక టీఎంసీ సామర్థ్యం కలిగిన కొత్త జలాశయాన్ని నిర్మించాలంటే రూ.162 కోట్లు కావాల్సి ఉంటుంది. సిఫారసులు ఇలా.. ⇒ జలాశయాలు, డ్యామ్‌లు, ఆనకట్టలు, బరాజ్‌లు, నదులు, కాల్వల్లో పూడికతీత పనులకు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. కేంద్రం ఈ మేరకు మినహాయింపు ఇచి్చంది. పూడికతీత ద్వారా వాటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించాలి. ⇒ ్శనీటిపారుదల, గనుల శాఖలు సమావేశమై ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే పూడికతీత చేపట్టిన రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలి. ⇒ సాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పూడికతీత జరగాలి. వాటి రక్షణ విషయంలో రాజీపడరాదు. ⇒ పూడికతీతలో సారవంతమైన మట్టిని వెలికి తీస్తే రైతాంగానికి ఉచితంగా సరఫరా చేయాలి. రవాణా చార్జీలు రైతులే భరించాలి. -
ప్రతి గింజా కొంటాం
సాక్షి, హైదరాబాద్: రైతు పండించిన ప్రతి గింజకు మా ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుంది. 7,750 ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచాం. ఇది గత ప్రభుత్వం కంటే చాలాఎక్కువ. కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి శిక్షణ ఇచ్చి అన్ని సదుపాయాలు కల్పించాం. ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన నిధులు కూడా సమీకరించాం. రూ.30 వేల కోట్ల వరకు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 70–75 శాతం మిల్లర్లు ధాన్యం కొనుగోళ్లకు సహకరిస్తున్నారు. వారు సహకరించని ప్రాంతాల్లో పౌరసరఫరాల సంస్థ ద్వారా మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తాం. రైతులెవరూ ఆందోళన పడొద్దు’అని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై ఆదివారం ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రశ్న: కొన్ని ప్రాంతాల్లో మిల్లర్లు సహకరించక రైతులు ఇబ్బంది పడుతున్నారు కదా ? ఉత్తమ్: ధాన్యం కొనుగోళ్లకు సహకరించాలని మిల్లర్లకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. రైతులకు మద్దతు ధరకన్నా, తక్కువ చెల్లింపులు చేస్తే కఠిన చర్యలు తప్పవు. మిల్లర్లు సహకరించని ప్రాంతాల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా పౌరసరఫరాల సంస్థ ద్వారా కొనుగోళ్లు చేసి గోదాముల్లో నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేశాం. ఎక్కడా మేజర్ సమస్యల్లేవు. ప్రశ్న: బ్యాంకు గ్యారంటీ నిబంధన ఉపసంహరించాలని మిల్లర్లు కోరుకుంటున్నారు కదా? ఉత్తమ్: గత ప్రభుత్వం మిల్లర్ల వద్ద స్టాక్ ఉంచి ఏ సెక్యూరిటీ తీసుకోలేదు. ఏపీలో 100 శాతం సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించి మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. మన దగ్గర సైతం ప్రారంభ దశలో మిల్లర్ల ట్రాక్ రికార్డు ఆధారంగా స్టాక్ విలువలో 10 శాతం, 20 శాతం, 25 శాతాన్ని సెక్యూరిటీ డిపాజిట్‌గా తీసుకోవాలని నిర్ణయించాం. రాష్ట్ర మిల్లర్ల సంఘం ఒప్పుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. బాండ్ పేపర్‌పై పూచీకత్తు రాసిచ్చి కూడా ధాన్యం కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించాం. ప్రశ్న: మిల్లర్లకు ఏమైనా వెసులుబాటు కల్పిస్తారా? ఉత్తమ్: ఏపీతో పోలి్చతే రాష్ట్రంలో బ్యాంకు గ్యారంటీలు చాలా తక్కువే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మిల్లర్లకు టన్నుకు రూ.10 చొప్పున మిల్లింగ్ చార్జీలు చెల్లించగా, ఇప్పుడు మేము దొడ్డు రకానికి రూ.40, సన్న రకానికి రూ.50 చొప్పున పెంచాం. ఏపీలో డిఫాల్ట్ అయిన మిల్లర్ల నుంచి 150 శాతం జరిమానా వసూలు చేస్తే, మన దగ్గర 120 శాతమే వసూలు చేస్తున్నాం.గతంలో మిల్లర్లకు సీఎంఆర్ ధాన్యం కేటాయింపుల్లో చాలా అవినీతి జరిగేది. ఇప్పుడు శాస్త్రీయ సిద్ధాంతం ఆధారంగా ఏ మిల్లర్‌కు ఎంత ఇవ్వాలో నిర్ణయించి ఇస్తున్నాం. ప్రశ్న: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కూడా రైతులు ఇబ్బంది పడుతున్నట్టు వార్తలొచ్చాయి ? ఉత్తమ్: ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో సజావుగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఒకరిద్దరు మినహా స్థానిక మిల్లర్లందరూ సహకరిస్తున్నారు. (మంత్రి ఉత్తమ్ సూర్యాపేట, నల్లగొండ, భువనగిరి జిల్లాల కలెక్టర్లకు అప్పటికప్పుడు ఫోన్ చేసి పరిస్థితిని ఆరా తీశారు. కలెక్టర్ల నుంచి మంచి ఫీడ్‌బ్యాక్ ఉందని చెప్పారు.) ప్రశ్న: ఈ సారి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచి్చంది.ఎలాంటి ఏర్పాట్లు చేశారు ? ఉత్తమ్: గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో ఈసారి రికార్డు స్థాయిలో 66.7లక్షల ఎకరాల్లో 40 లక్షల మంది రైతులు 155 మెట్రిక్ టన్నుల ధాన్యం పండించారు. ధాన్యం కొనుగోలు చేసిన మూడు నాలుగు రోజుల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే రాష్ట్రంలో వరి ధాన్యం పెరిగిందని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకున్నదంతా అబద్ధమని ఈసారి తేటతెల్లమైంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నుంచి చుక్కనీరు సరఫరా చేయకపోయినా ఈ ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో ధాన్యం పండింది. ప్రశ్న: సన్నాలకు రూ.500 బోనస్ చెల్లిస్తామన్నా, రైతులు వ్యాపారులు, మిల్లర్లకు నేరుగా అమ్ముకుంటున్నారు కదా ? ఉత్తమ్: కేంద్రం ప్రకటించిన మద్దతు ధరతో దొడ్డు రకం ధాన్యం, దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో రూ.500 బోనస్ చెల్లించి సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నది. కొనుగోలు కేంద్రాలకు సన్న రకం ధాన్యం ఎంత వచ్చినా బోనస్ చెల్లించి కొనుగోలు చేస్తాం. పండించిన ధాన్యం అమ్ముకునే విషయంలో రైతులపై ఆంక్షలు లేవు. సన్నాలకు మద్దతు ధర రూ.2320కు బోనస్ రూ.500 కలిపితే వచ్చే ధర కంటే అధిక ధరతో అమ్ముకునే అవకాశం వస్తే రైతులకు, ఆర్థిక వ్యవస్థకు, రాష్ట్రానికి మంచిది. ప్రశ్న: రైతులు సన్నాలను ప్రభుత్వానికి అమ్మకపోతే వచ్చే సంక్రాంతి నుంచి రేషన్‌షాపుల్లో సన్న బియ్యం పంపిణీ ఎలా చేస్తారు ? ఉత్తమ్: రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీకి ఇబ్బంది లేకుండా అవసరమైన సరుకు సమీకరణ చేస్తాం. ఇబ్బందులేమీ రావు. ప్రశ్న: ధాన్యం సేకరణలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్, బీజేపీ ఆరోపణలు చేస్తున్నాయి ? ఉత్తమ్: నల్లగొండ జిల్లాలో రైతులు రోడ్లపై ఆరబోసుకున్న ధాన్యం వీడియోలు తీసి రైతులు రోడ్లపై పారబోశారని బీఆర్ఎస్ వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 17శాతం, ఆలోపే తేమ ఉండాలని కేంద్రమే నిర్దేశించింది. మద్దతు ధర సైతం కేంద్రమే నిర్ణయించింది. దాని ప్రకారమే ధాన్యం కొనుగోళ్లు చేస్తుంటే బీజేపీ నేతలు కేంద్రాలకు వెళ్లి ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది. -
పంట దిగుబడిలో దేశంలోనే తెలంగాణ టాప్
సాక్షి, హైదరాబాద్: పంట దిగుబడిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టిస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయ న తన క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సహచర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. రాష్ట్రంలో ఈసారి 60.80 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారని, 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుందన్నారు. దీంట్లో 91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ఆస్కారముందని చెప్పారు. ఖరీఫ్ నుంచి సన్నాలకు బోనస్‌గా క్వింటాల్‌కు రూ.500 ప్రకటించిన నేపథ్యంలో రైతులు సన్నాల వైపు మొగ్గుచూపినట్టు తెలిపారు. ఈ మొత్తం ధాన్యం సేకరణకు రూ.30 వేల కోట్లు ఖర్చు అవుతుందని, అందులో ఇప్పటికే రూ.20 వేల కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. 10 నెలల వ్యవధిలోనే పౌరసరఫరాల సంస్థకు ఉన్న రుణంలో రూ.11,537.40 కోట్ల భారాన్ని తగ్గించుకున్నట్టు ఆయన వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో 7,572 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ బియ్యానికి బిహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో డిమాండ్ ఉందని, ఇతర దేశాలు కూడా తెలంగాణ బియ్యాన్ని దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎలాంటి అవాంతరాలు సంభవించినా, అధిగమించేందుకు అధికారులను సన్నద్ధం చేయాలని పౌర సరఫరాలశాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్.చౌహాన్‌ను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో రైస్‌మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. నిబంధనల మేరకే బ్యాంకు గ్యారంటీలను తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. -
తక్షణమే సెలవుపై వెళ్లండి!
సాక్షి, హైదరాబాద్: పరిపాలనపరమైన అనుమతుల్లే కుండానే సీతారామ ఎత్తిపోతల పథకం డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, అనుబంధ పనులకు టెండర్ల నిర్వహణలో జరిగిన తప్పిదాలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సీతారామ ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్న కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్ ఎ.శ్రీనివాస్‌రెడ్డిని తక్షణమే సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించినట్టు సమాచారం. అలాగే నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి. అనిల్‌కుమార్‌కు సంజాయిషీ నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆ శాఖ కార్యదర్శిని కోరినట్టు తెలిసింది. సీతారామ ప్రాజెక్టుపై ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో కలిసి శనివారం జలసౌధలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా మంత్రి వారిపై మండిపడినట్టు తెలిసింది. డిస్ట్రిబ్యూటరీలు, ఇతర పనులకు పరిపాలనపరమైన అనుమతుల కోసం ప్రతిపాదనలు సమర్పించినా సహకరించడం లేదని ఈఎన్సీపై సీఈ శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించగా, అసలు ఇప్పటివరకు తనకు డిటైల్డ్ ఎస్టిమేట్లు (సవివర అంచనాలు) సమర్పించలేదని ఈఎన్సీ అనిల్‌కుమార్ బదులిచ్చినట్టు తెలిసింది. డిటైల్డ్ ఎస్టిమేట్లు లేకుండా అనుమతులిచ్చేస్తే తర్వాత పనుల అంచనాలు భారీగా పెరిగే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇద్దరు అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంత్రుల ఆదేశాల మేరకే..!వాస్తవానికి డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు పాలనాపరమైన అనుమతులు జారీ చేయాలని కోరుతూ కొత్తగూడెం సీఈ గత నెలలో నీటిపారుదల శాఖకు ప్రతిపాదనలు పంపించారు. అయితే డిటైల్డ్ ఎస్టిమేట్లతో పాటు డిజైన్లు, డ్రాయింగ్లు కూడా లేకపోవడంతో వాటిని సమర్పించాలని కోరుతూ ఈఎన్సీ ఆ ప్రతిపాదనలను తిప్పి పంపించారు. ఇప్పటివరకు డిటైల్డ్ ఎస్టిమేట్లతో పాటు డిజైన్లు, డ్రాయింగ్స్‌ను సమర్పించలేదు. మరోవైపు గత నెలలో నిర్వహించిన ఓ సమీక్షలో మంత్రులు ఆదేశించడంతో ప్రాజెక్టు అధికారులు తొందరపడి టెండర్లను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అయితే తక్షణమే టెండర్లు నిర్వహించాలని మంత్రులు ఆదేశించిట్టు మీటింగ్ మినట్స్‌లో సైతం ఉందని, అందుకే ఆహ్వానించట్టు బాధ్యులైన అధికారులు పేర్కొంటున్నారని సమాచారం. కాగా పాలనాపరమైన అనుమతులే కాకుండా ఆర్థిక శాఖ ఆమోదం కూడా లేకుండా టెండర్లను ఆహ్వానించడం నిబంధనల తీవ్ర ఉల్లంఘనే అని నీటిపారుదల శాఖలో చర్చ జరుగుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నాగార్జునసాగర్ కాల్వకు గండ్లుపడగా, పాలనాపరమైన అనుమతుల జారీ తర్వాతే అత్యవసర మరమ్మతులు చేపట్టారని, అనుమతుల విషయంలో మినహాయింపు ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. అనుమతుల్లేకుండా బిడ్లను ఎలా తెరుస్తారు ?డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు సంబంధించిన ఆరు టెండర్లకు ఈ నెల 8తో, ఒక టెండర్‌కు ఈ నెల 4తో బిడ్ల దాఖలు గడువు ముగియనుంది. కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ (సీఓటీ)లోని చీఫ్ ఇంజనీర్ల కమిటీ బిడ్లను పరిశీలించి ఎల్–1 బిడ్డర్‌ను ఖరారు చేయాల్సి ఉంటుంది. అయితే సంబంధిత పనులకు పాలనాపరమైన అనుమతులు, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా బిడ్లను తెరిచి పరిశీలించడానికి నిబంధనలు ఒప్పుకోవని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నారో పరిశీలించి ముందుకు వెళ్లాల్సి ఉంటుందని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు.టెండర్లపై రాజకీయ రగడ– ఇప్పుడు మీపై ఏ కమిషన్ వేయాలి?: కేటీఆర్పాలనాపరమైన అనుమతుల్లేండానే సీతారామ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీలు, ఇతర పనులకు అధికారులు టెండర్లను ఆహ్వానించినట్టు వెలుగులోకి రావడంతో రాజకీయ రగడ ప్రారంభమైంది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 మధ్య ఏడు పనులకు రూ. 1,842 కోట్ల అంచనాతో నీటిపారుదల శాఖ టెండర్లను ఆహ్వానించగా, అందులో రూ. 1,074 కోట్ల పనులకు పాలనాపరమైన అనుమతుల్లేవంటూ ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. వార్తా కథనాన్ని షేర్ చేస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుల మీద పగబట్టి హాహాకారాలు చేస్తూ బురదజల్లిన వారు..అనుమతి లేకుండానే రూ.1,074 కోట్ల పనులకు టెండర్లు ఎలా పిలుస్తారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజాపాలన అని రోజుకు పదిమార్లు ప్రగల్భాలు పలికేటోళ్లు ఇలా ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఒక సమావేశంలో త్వరగా టెండర్లు పిలవాలని ఆదేశించి, మరో సమావేశంలో ఇదేంటి అంటూ నంగనాచి మాటలు మాట్లాడడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టు పూర్తయ్యి కోటి ఎకరాలకు జీవం పోస్తున్న కాళేశ్వరంపై కమిషన్ వేసి విచారణ జరిపిస్తున్న మీపై.. ఇప్పుడు ఏ కమిషన్ వేయాలని ప్రశ్నించారు. ఢిల్లీ నేస్తం..అవినీతి హస్తంకాళేశ్వరంపై కక్షగట్టి రైతుల పొట్టగొట్టారని, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల మీద పగబట్టి మళ్లీ వలసలకు పచ్చజెండా ఊపారని కేటీఆర్ మండిపడ్డారు. ఢిల్లీ నేస్తం–అవినీతి హస్తం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ.7,926.14 కోట్ల అంచనాతో 2016 ఫిబ్రవరి 18న పాలనాపరమైన అనుమతులివ్వగా, ఆ తర్వాత 2018 ఆగస్టులో అప్పటి ప్రభుత్వం రూ.13,057 కోట్లకు అంచనాలను సవరించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దీనిని తప్పుబడుతూ రాష్ట్ర మంత్రులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదే విషయాన్ని ఇప్పుడు గుర్తుచేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. -
అనుమతి లేకున్నా రూ. వెయ్యి కోట్ల ‘సీతారామ’ టెండర్లు!
సాక్షి, హైదరాబాద్: సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా పరిపాలనా అనుమతుల్లేకుండానే సుమారు రూ. 1,074 కోట్ల అంచనా వ్యయంతో డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు ప్రాజెక్టు అధికారులు టెండర్లను ఆహ్వానించడం నీటిపారుదల శాఖలో వివాదస్పదంగా మారింది. సెపె్టంబర్ 28 నుంచి అక్టోబర్ 5 మధ్య ఏడు పనులకు రూ. 1,842 కోట్ల అంచనాతో నీటిపారుదల శాఖ టెండర్లను ఆహ్వానించింది. అయితే వాటిలో సుమారు రూ. 768 కోట్లు విలువ చేసే పనులకే ఆర్థిక శాఖ ఆమోదం తెలపగా ఆ మేరకు నీటిపారుదల శాఖ పరిపాలనా అనుమతులు జారీ చేసింది. మిగిలిన రూ. 1,074 కోట్ల పనులకు ఆమోదం తెలపడంపై నిర్ణయాన్ని ఆర్థిక శాఖ పెండింగ్‌లో ఉంచింది. అయినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఈ పనులకు ప్రాజెక్టు అధికారులు టెండర్లను ఆహ్వానించారు. ఈ ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శనివారం చేపట్టిన సమీక్షలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. పరిపాలనా అనుమతుల్లేకుండానే టెండర్లు పిలిచి ప్రభుత్వాన్ని తప్పుదోవపట్టించారని సంబంధిత చీఫ్ ఇంజనీర్‌పై మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. గతంలో మంత్రులు నిర్వహించిన ఓ సమీక్షలో వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించగా.. ప్రాజెక్టు అధికారులు అనుమతులు పొందకుండానే తొందరపాటుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. ప్రభుత్వం సత్వరమే టెండర్లు పిలవాలని ఆదేశిస్తే దానర్థం అనుమతుల్లేకుండానే టెండర్లు ఆహ్వానించాలని కాదని, అనుమతులన్నీ తీసుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదేనని ఉన్నతాధికారులు అంటున్నారు. అనుమతులు రాకుంటే ఏం చేస్తారు? అన్ని ప్రభుత్వ ఇంజనీరింగ్ శాఖల ఈఎన్సీలు/చీఫ్ ఇంజనీర్లతో కూడిన కమిషనరేట్ ఆఫ్ టెండర్స్ (సీఓటీ) కమిటీ ఆమోదించాకే రూ. 10 కోట్లు, ఆపై విలువగల పనుల టెండర్లను ఖరారు చేయాల్సి ఉంటుంది. పనులకు అన్ని రకాల అనుమతులు ఉంటేనే సీఓటీ కమిటీ టెండర్లను ఆమోదిస్తుంది. అనుమతుల ఉత్తర్వుల్లో పేర్కొన్న పదాల్లో స్వల్ప తేడాలున్నా మళ్లీ కొత్త ఉత్తర్వులతో వస్తేనే ఆమోదముద్ర వేస్తుంది. ప్రస్తుతం సీతారామ ప్రాజెక్టు డి్రస్టిబ్యూటరీలకు సంబంధించిన ఆరు టెండర్లకు బిడ్ల దాఖలు గడువు ఈ నెల 8తో ముగియనుండగా మరో టెండర్ గడువు 4తో ముగియనుంది. ఆ తర్వాత ఈ బిడ్లను సీఓటీ కమిటీ పరిశీలించి ఆమోదించాల్సి ఉంది. అయితే అనుమతుల్లేకుండానే టెండర్లు జారీ కావడంతో సీఓటీ కమిటీ నుంచి వాటికి ఆమోదం లభించే అవకాశం లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ అనుమతులు లభించకపోతే టెండర్లను రద్దు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. కాగా, టెండర్లను ఆహ్వానించిన తర్వాత అనుమతుల్లేని పనులకు ర్యాటిఫికేషన్ (క్రమబద్ధీకరణ అనుమతులు) జారీ చేయాలని కోరుతూ నీటిపారుదల శాఖకు ప్రాజెక్టు అధికారులు విజ్ఞప్తి చేయగా అంచనాలను సమర్పించాలని నీటిపారుదల శాఖ ఆదేశించింది. ఇప్పటికే సీతారామపై వివాదాలు... సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ. 7,926.14 కోట్ల అంచనాతో 2016 ఫిబ్రవరి 18న ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చిoది. ఆ తర్వాత 2018 ఆగస్టులో రూ. 13,057 కోట్లకు అంచనాలను పెంచింది. ఈ ప్రాజెక్టు కింద 3,28,853 ఎకరాల కొత్త ఆయకట్టుతోపాటు 3,45,534 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే పంప్‌హౌస్‌ల పనులు పూర్తవగా డిస్ట్రిబ్యూటరీలు, ఇతర పనులు జరగాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఈ పనుల అంచనాలను భారీగా పెంచారని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇదే సమయంలో పరిపాలనా అనుమతుల్లేకుండానే అధికారులు టెండర్లను నిర్వహిస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఉన్నతాధికారులు అంటున్నారు. ఈ అంశంపై ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌ను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదు. -
ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా సాగాలి
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకొచ్చే విధంగా వ్యవహరించవద్దని ఆయన అధికారులకు సూచించారు. ధాన్యం కొను గోళ్ల విషయంలో రాష్ట్రం దేశానికే మార్గదర్శకంగా ఉండేలా చూడాలని ఉద్బోధించారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగో ళ్లపై పౌరసరఫరాల కార్యాలయం నుంచి మంత్రి శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి కోటి న్నర మెట్రిక్ టన్నుల మేర ధాన్యం కొనుగోళ్లు ఉండొచ్చని ప్రభుత్వం అంచనా వేసిందని తెలిపారు. ఇందుకోసం రూ.30 వేల కోట్లు అవసరమ వుతాయని ఆయన తెలిపా రు. ఇప్పటికే రాష్ట్ర ప్ర భుత్వం రూ.20 వేల కోట్లు ధాన్యం కొనుగోళ్ల కోసం కేటా యించిందని, అవసరమైతే అదనపు నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు సృష్టించవద్దని చెప్పారు. ప్రభుత్వం, రైస్ మిల్లర్లు పరస్పరం తోడ్పాటు అందించుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. ధాన్యం కొను గోళ్లలో మిల్లర్ల సహకారం తప్పనిసరిగా ఉండాల న్నారు. మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలపై ఆందోళన చెందాల్సి న అవసరం లేదని, ధాన్యాన్ని మిల్లింగ్ చేసి సీఎంఆర్ అప్పగించిన వెంటనే బ్యాంక్ గ్యారంటీలను వాపస్ చేయ నున్నట్లు చెప్పారు. మిల్లర్ల కోరిక మేరకు ధాన్యం మిల్లింగ్ చార్జీలు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు. సన్నాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ అందిస్తుందని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అకాల వర్షాలతో రైతులు నష్ట పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కలెక్టర్లు ఎప్పటి కప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలని ఆయన సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డి.యస్ చౌహాన్, కమిషనర్, జాయింట్ సెక్రటరీ ప్రియాంకా అలా, మార్కెటింగ్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలిభూదాన్పోచంపల్లిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుల ధర్నా భూదాన్‌పోచంపల్లి: ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నివారిస్తూ ఆ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ...రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి నెల రోజులు గడిచినా తూకం వేయడం లేదన్నారు. కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యం వల్ల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంటా వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని, రైతులకు సకాలంలో బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూదాన్‌పోచంపల్లి పీఏసీఎస్ చైర్మన్ కందాడి భూపాల్‌రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ పాక వెంకటేశ్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పాటి సుధాకర్‌రెడ్డి, నాయకులు, రైతులు రావుల శేఖర్‌రెడ్డి, సామ రవీందర్‌రెడ్డి, బత్తుల శ్రీశైలంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త లిఫ్టులతో 62 వేల ఎకరాలకు సాగునీరు
సాక్షి, హైదరాబాద్: దేవరకొండ, మిర్యాలగూడ నియోజక వర్గాల్లోని కొత్త ఎత్తిపోతల పథకాలతో మొత్తం 62,742 ఎక రాలకు సాగునీరు అందుతుందని సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కృష్ణా, మూసీ నుండి నీళ్లను తరలించడం ద్వారా కొత్త ఆయకట్టు సృష్టించడంతో పాటు ఉన్న ఆయకట్టు స్థిరీకరణకు ఈ ప్రాజెక్టులు దోహదప డతాయని చెప్పారు. ఈ నియోజకవర్గాల్లోని సాగునీటి ప్రాజెక్టులపై బుధవారం ఆయన జలసౌధలో సమీక్ష నిర్వ హించారు. కొత్త ఎత్తిపోతల జాబితాలో దేవర కొండలోని పొగిళ్ల, కంబాలపల్లి, అంబభవాని, ఏకేబీఆర్, పెద్దగట్టు లిఫ్టులు, మిర్యాలగూడలో దున్నపోతులగండి– బాల్నేపల్లి – చంప్లతండా, టోపుచెర్ల, వీర్లపాలెం, కేశవాపూర్ – కొండ్రాపూర్ ఉన్నాయని మంత్రి తెలిపారు. వీటితో 47,708 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు లభిస్తుందని చెప్పారు. 2026 నాటికి ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేయాలిశ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం పనుల ను 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఉత్తమ్ ఆదేశించారు. 30 టీఎంసీలను తరలించడానికి వీలుగా సొరంగం పనులను వేగవంతం చేయాలన్నారు. మొత్తం 44 కి.మీ సొరంగంలో 9.55 కి.మీలు ఇంకా పెండింగ్‌లో ఉందని, టన్నెల్ బోర్ మిషన్‌కు అవసరమైన విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటామని నిర్మాణ సంస్థ జేపీ అసోసియేట్స్ ప్రతినిధులు ఈ సందర్భంగా మంత్రికి తెలి పారు. ఉత్తమ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే మధ్యవర్తిత్వ పర్యవేక్షణ లేకుండా నిర్మించిన అతిపెద్ద సాగునీటి సొరంగంగా ఇది మారుతుందని చెప్పారు. ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూ.4,637 కోట్లతో సవరించిన అంచనాలకు పరిపాలన అనుమతి జారీ చేశామని చెప్పారు. ఈ ప్రాజెక్టుతో ఫ్లోరైడ్ ప్రభావిత నల్లగొండ జిల్లాకు మేలు జరుగుతుందన్నారు. చెక్‌డ్యామ్‌ల కుంభకోణంపై విచారణగత ప్రభుత్వంలో చెక్‌డ్యామ్‌ల నిర్మాణంలో అవకతవకతలు జరిగాయని, పెద్ద సంఖ్యలో చెక్‌డ్యామ్‌లు దెబ్బతిన్నాయని వచ్చిన ఆరోపణలపై విచారణకు మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. నీటి లభ్యత, సామర్థ్యంపై సరైన అంచనా లేకుండా చెక్‌డ్యామ్‌లు నిర్మించడంతో అవి దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. కాగా సాగర్ ఎడమ కాల్వ మరమ్మతులను పూర్తి చేసి పటిష్టం చేయాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు బాలునాయక్, బి.లక్ష్మారెడ్డి, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ అనిల్ కుమార్ పాల్గొన్నారు. -
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు.. కాంగ్రెస్ పరిశీలకులుగా తెలంగాణ మంత్రులు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకులను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురికి చోటు కల్పించింది.మహారాష్ట్రలోని 5 డివిజన్లకు 11 మందిని నియమించగా.. వీరిలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క ఉన్నారు. ఝార్ఖండ్‌కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు తారిక్ అన్వర్, అధిర్ రంజన్ చౌదరిని నియమించారు.కాగా మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. మహారాష్ట్రకు ఒకే దశలో, జార్ఖండ్‌కు రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 20న మహారాష్ట్రకు, నవంబర్ 13న, 20న జార్ఖండ్‌కు ఎన్నికలు జరగనున్నాయి. -
వాటిల్లో నీటి నిల్వ ప్రమాదకరం
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడి గడ్డ సహా అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల్లో ఇప్పటికిప్పుడు నీటిని నిల్వ చేయడం ప్రమాదకర మని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) రాష్ట్రానికి స్పష్టం చేసింది. ఈ మూడు బరా జ్‌ల్లోనూ సికెంట్ ఫైల్ ఫౌండేషన్ నిర్మాణం జరిగినందున నీటిని ఏమాత్రం నిలువచేసినా బరాజ్‌ల మనుగడకే ముప్పని వెల్లడించింది. ప్రస్తుతం దెబ్బతిన్న మేడిగడ్డ బరాజ్‌లో వినియోగించిన సాంకేతికతనే మిగతా బరాజ్‌ల్లో నూ వినియోగించినందున ప్రమాదాలకు ఆ స్కారం ఉందని వివరించింది. రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో పాటు ఈఎన్సీలు అనిల్, నాగేందర్రావు, సుధాకర్ రె డ్డిలు శుక్రవారం ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ తో పాటు చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీతో సమావేశమయ్యా రు. బరాజ్‌లకు సంబంధించి ఎన్డీఎస్ఏ సమర్పించాల్సిన తుది నివేదికలపై చర్చించారు. ప్రత్యామ్నాయ మార్గాలు సూచించండి: మంత్రి ఉత్తమ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డ బరాజ్ నుంచి నీటి ఎత్తిపోసే అవకాశం లేనందున, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మేడిగడ్డ మినహా ఇతర బరాజ్‌ల నుంచి ఎల్లంపల్లి, మిడ్ మానేరుకు నీటి ఎత్తిపోతలపై ప్రత్యామ్నాయ మార్గాలు సూచించాలని కోరారు. దీనిపై ఎన్డీఎస్ఏ అధికారులు స్పందిస్తూ.. మిగతా బరాజ్‌ల్లోనూ సికెంట్ ఫైల్ ఫౌండేషన్ సాంకేతికతనే వినియోగించినందున ప్రమాదాలకు అవకా శం ఉందని, దిగువన ఉన్న సమ్మక్క సారక్క బరాజ్ సహా భద్రాచలం ఆలయం వరకు పెను ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసినట్టు తెలిసింది.దీనిపై అన్ని అంశాలను విశ్లేíÙంచి డిసెంబర్ లోగా తుది నివేదికను సమరి్పస్తామని, అప్పటిలోగా ఎలాంటి నీటి నిల్వ చేయొద్దని సూచించినట్టు సమాచారం. దీంతో తుది నివేదిక సత్వరమే వచ్చేలా చూడాలని ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు. మధ్యంతర నివేదికలో చేసిన సిఫారసుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బరాజ్‌లకు తాత్కాలిక మరమ్మతులు చేసిందని చెప్పారు. ప్రభుత్వ చిత్తశుద్ధి భేష్: ఎన్డీఎస్ఏ తాత్కాలికంగా కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద చిన్న తరహా నిర్మాణాన్ని చేసుకుని రాష్ట్ర రబీ, తాగునీటి అవసరాలకు అక్కడి నుంచి నీటిని తరలించుకునే అవకాశాలు సూచించాలని మంత్రి ఉత్తమ్‌తో పాటు రాష్ట్ర అధికారులు కోరినట్టు తెలిసింది. లక్ష కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని మంత్రి చెప్పినట్లు సమాచారం. దీనిపై ఎన్డీఎస్ఏ స్పందిస్తూ.. గతంలో బరాజ్ నిర్మాణ సంస్థతో పాటు ప్రభుత్వం ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కారణంగానే బరాజ్‌లను వినియోగించుకునే పరిస్థితి లేకుండా పోయిందని, తాము తుది అభిప్రాయం వెల్లడించే వరకు ఆగాల్సిందేనని స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రాజెక్టును వీలైనంత త్వరగా వినియోగంలోకి తెచ్చే విషయంలో మంత్రి, ప్రభుత్వ చిత్తశుద్ధిని అభినందించినట్లు సమాచారం. -
‘మేడిగడ్డ’పై తుది నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల శాశ్వత పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేస్తూ తుది నివేదికను వెంటనే అందించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ)కి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేయనున్నారు. ఈ నెల 11న ఢిల్లీకి వెళ్లనున్న ఆయన... ఎన్డీఎస్ఏ చైర్మన్ అనీల్ జైన్, ఇతర అధికారులతో భేటీ కానున్నారు. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ గతంలో అందించిన మధ్యంతర నివేదికలో చేసిన సిఫారసుల ఆధారంగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బరాజ్‌లకు తాత్కాలిక మరమ్మతులు నిర్వహించింది.అయితే ప్రభుత్వం వివిధ సాంకేతిక పరీక్షలు నిర్వహించి తమకు నివేదికలు సమర్పించాకే తుది నివేదిక ఇస్తామని ఎన్డీఎస్ఏ గతంలో స్పష్టం చేసింది. శాశ్వత పునరుద్ధరణ పనులు నిర్వహించే వరకు నీళ్లను నిల్వ చేయరాదని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ కోరడంతో ప్రస్తుతానికి మూడు బరాజ్‌లు ఉపయోగంలోకి లేవు. మరోవైపు వర్షాలతో గోదావరిలో వరద ఉధృతి పెరగడం వల్ల కొన్ని పరీక్షలను మాత్రమే నీటిపారుదల శాఖ పూర్తి చేయగలిగింది. వాటికి సంబంధించిన నివేదికలను అధికారులు ఢిల్లీకి వెళ్లి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీకి అందజేశారు.సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ మేడిగడ్డ బరాజ్ కు పరీక్షలు నిర్వహించి అందించిన నివేదికను సైతం ఎన్డీఎస్ఏకు ఇటీవల అప్పగించారు. శాశ్వత పునరుద్ధరణ చర్యలపై తుది నివేదికను అందజేయాలని రాష్ట్ర అధికారులు కోరగా, మిగిలిన పరీక్షలను సైతం పూర్తి చేసి నివేదికలు సమరి్పస్తేనే తుది నివేదిక ఇస్తామని ఎన్డీఎస్ఏ అధికారులు తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల విజ్ఞప్తుల కు ఎన్డీఎస్ఏ యంత్రాంగం స్పందించకపోవడంతో స్వయంగా ఢిల్లీ వెళ్లాలని మంత్రి ఉత్తమ్ నిర్ణయించారు. మంగళవారం సచివాలయంలో ఆయన నీటిపారుదల శాఖ ఈఎన్సీలు అనిల్‌కుమార్, నాగేంద్రరావు, హరిరామ్‌లతో సమావేశమయ్యారు. మేడిగడ్డకు ప్రత్యామ్నాయాలు.. గోదావరికి ఉపనది అయిన వార్దాపై బరాజ్‌తోపాటు ప్రాణహితపై తమ్మిడిహట్టికి దిగువన రబ్బర్ డ్యామ్ కట్టాలన్న ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ రెండింటి నీళ్లను గ్రావిటీ ద్వారా సుందిళ్ల బరాజ్‌కు తరలించి అక్కడి నుంచి ఎల్లంపల్లి బరాజ్‌లోకి పంపింగ్ చేయాలని యోచిస్తోంది. మేడిగడ్డ బరాజ్‌కు ప్రత్యామ్నాయంగా ఈ రెండు బరాజ్‌లు ఉపయోగపడనున్నాయి. మేడిగడ్డకు వెంటనే శాశ్వత మరమ్మతులు సాధ్యం కాకుంటే ప్రత్యామ్నాయాలుగా వాటిని నిర్మించే అంశంపై ఎన్డీఎస్ఏతో సమావేశం అనంతరం ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. మూసీ కాల్వలకు సత్వర అనుమతులు.. నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన బునాదిగాని కాలువ, ధర్మారెడ్డి కాలువ, పిల్లాయిపల్లి కాలువ పనులకు పరిపాలనా అనుమతులు పొందాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, డిండి, దేవాదుల తదితర ఎత్తిపోతల పథకాల పెండింగ్ భూసేకరణను వేగంగా పూర్తి చేయాలన్నారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) పరిధిలోని సాంకేతిక సలహా మండలి పరిశీలనలో ఉన్న సీతమ్మసాగర్ ప్రాజెక్టు డీపీఆర్‌కు వెంటనే ఆమోదం లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమ్మక్కసాగర్ బరాజ్ నిర్మాణం విషయంలో ఛత్తీస్‌గఢ్‌తో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించుకొని ఎన్ఓసీ పొందడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.త్వరగా ఇంజనీర్లకు పదోన్నతులునీటిపారుదల శాఖలో ఇంజనీర్ల పదోన్నతులపై మంత్రి ఉత్తమ్ అధికారులతో చర్చించారు. పదోన్నతులపై హైకోర్టులో కేసు సోమవారం కొలిక్కి వచ్చే అవకాశముందని అధికారులు ఆయనకు వివరించారు. ఆ వెంటనే ఇంజనీర్లకు పదోన్నతులు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
ఎస్సీ వర్గీకరణకు వన్‌మ్యాన్ జ్యుడీషియల్ కమిషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గీకరణ ప్రక్రియను అధ్యయనం చేసేందుకు వన్‌మ్యాన్ జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని వర్గీకరణ కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం (కేబినెట్ సబ్ కమిటీ) నిర్ణయించింది. చట్ట సంబంధ చిక్కుల్లేకుండా అత్యంత పారదర్శ కంగా కమిషన్ అధ్యయనం చేయాలని కమిటీ తీర్మానించింది. కమిషన్‌కు చైర్మన్‌గా సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించాలని నిర్ణయం తీసుకుంది. కమిషన్ ఏర్పాటుకు ఇప్పటికే అడ్వొకేట్ జనరల్ (ఏజీ) నుంచి మంత్రివర్గ ఉపసంఘానికి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ముసా యిదా సైతం అందింది. ఈ నేపథ్యంలో పలు సిఫారసులను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ కోసం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు కావడం తెలిసిందే. ఈ కమిటీ మంగళవారం సచివాలయంలో భేటీ అయింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, దనసరి అనసూయ సీతక్క, పార్లమెంటు సభ్యులు మల్లు రవితోపాటు సీఎస్ శాంతికుమారి, ఏజీ సుదర్శన్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఆర్థిక శాఖ నుంచి 30%సమాచారం: ఉత్తమ్ రాష్ట్రంలో వర్గీకరణ ప్రక్రియను 2011 జనగణన ఆధారంగా చేపట్టాలని కమిటీ దాదాపు నిర్ణయించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో పాటు రాష్ట్రంలోని ఉద్యోగ నియామక బోర్డుల నుంచి ఎస్సీ ఉపకులాలవారీగా నియామకాల సమాచారాన్ని స్వీకరించామని, ఆర్థిక శాఖ నుంచి 30 శాతం సమాచారం వచ్చిందని మంత్రి ఉత్తమ్ వివరించారు. గత నెల 30 నుంచి విజ్ఞాపనల స్వీకరణ ప్రారంభించగా ఇప్పటివరకు 1,082 సూచనలు వచ్చినట్లు చెప్పారు. ఆ రెండు రాష్ట్రాల్లో వన్‌మెన్ కమిషన్.. ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్న పంజాబ్, తమిళనాడులలో అధికారుల బృందం అధ్యయనం చేసిందని, ఎన్నికల కోడ్ నేపథ్యంలో హరియాణాలో అధ్యయనం చేయలేదన్నారు. పంజాబ్‌లో ఎస్సీ కేటగిరీలో రెండు గ్రూపులుగా వర్గీకరణ చేశారని, తమిళనాడులో విద్య, ఉపాధిలో ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, ఆ రాష్ట్రంలో 76 ఎస్సీ ఉపకులాలు ఉన్నట్లు ఉత్తమ్ వివరించారు. ఆ రెండు రాష్ట్రాల్లో వర్గీకరణ ప్రక్రియ చట్టపరమైన చిక్కుల్లేకుండా అమలు చేసేందుకు వన్‌మెన్ కమిషన్ ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. వర్గీకరణ అధ్యయనాన్ని సకాలంలో పూర్తి చేయడానికి కమిషన్‌కు కాలపరిమితి విధించాలని మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు. జిల్లాలవారీగా పర్యటించి ఎస్సీ వర్గాల అభిప్రాయాలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. దీంతో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ వర్గీకరణపై ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ఉపసంఘం సభ్యులు త్వరలో జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు. వర్గీకరణ ప్రక్రియలో సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్(సెస్) వంటి ప్రసిద్ధ ప్రభుత్వ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. -
ఫిలిప్పీన్స్‌కు మన బియ్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉత్పత్తి అయిన బియ్యాన్ని ఫిలిప్పీన్స్ దేశానికి పంపించే ప్రక్రియకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తొలి అడుగు వేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి ఏటా సగటున 70 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో రాష్ట్ర అవసరాలకు 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వినియోగించుకొంటుండగా, మిగతా మొత్తాన్ని ఎఫ్‌సీఐకి లెవీ కింద పెడుతున్నారు. కాగా ఈ ఏడాది నుంచి రాష్ట్రంలో నాణ్యమైన సన్నబియ్యం ఉత్పత్తి పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో నేరుగా విదేశీ ఎగుమతులపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ దృష్టి పెట్టింది. నాణ్యతా కారణాల వల్ల ఫిలిప్పియన్లు గత కొన్నేళ్లుగా భారతదేశం నుంచి బియ్యాన్ని దిగుమతి చేసుకోవడం నిలిపివేశారు. ఈ నేపథ్యంలో శనివారం మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతులపై ఆ దేశ వ్యవసాయ మంత్రి రోజేర్స్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఫిలిప్పీన్‌లకు ప్రతి సీజన్లో 3 టన్నుల వరకు బియ్యం ఎగుమతి చేసే అవకాశాలపై చర్చించారు. ఇద్దరు మంత్రుల చర్చలు స్నేహపూర్వక, సానుకూల వాతావరణంలో సాగాయి. తెలంగాణ రాష్ట్రంలో బియ్యం నాణ్యత గణనీయంగా మెరుగుపడినందున ఎగుమతి కోసం ప్రాథమికంగా చర్చలు జరిపినట్లు మంత్రి ఉత్తమ్‘సాక్షి’కి తెలిపారు. త్వరలో ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తానని, అనంతరం ఫిలిప్పీన్స్ వెళ్లి నేరుగా ఆ దేశంతో చర్చలు జరుపనున్నట్లు చెప్పారు. అది కార్యరూపం దాల్చితే తెలంగాణ పౌర సరఫరాల శాఖకు ఇది మరో మంచి అవకాశం కానుంది. -
హోం మంత్రి పదవి ఇవ్వాలని..!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: దసరాకు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చర్చ జరుగుతున్న నేపథ్యంలో జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఖాయమని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న చర్చ బయటకు రావడంతో రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి వస్తుందన్న ప్రచారం జోరుగా సాగింది. అప్పుడు విస్తరణ జరగలేదు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ వెళ్లిన సందర్భంలోనూ మంత్రివర్గ విస్తరణపైనే అధిష్టానంతో చర్చించారని వార్తలు వచ్చాయి. అప్పటికప్పుడు నిర్ణయం వెలువడకపోయినా దసరాకు ముందు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ వర్గాల్లో ఊగాహానాలు జోరందుకున్నాయి. దీంతో మంత్రి వర్గంలో రాజగోపాల్‌రెడ్డికి బెర్త్ ఖాయమనే చర్చ మళ్లీ మొదలైంది.ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి..మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మంత్రి పదవి వస్తుందని భావిస్తూ వస్తున్నారు. కానీ, మొదట్లో ఉమ్మడి జిల్లా నుంచి తన సోదరుడైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మంత్రి పదవులు వచ్చాయి. ఆ తర్వాత మంత్రి వర్గ విస్తరణలో రాజగోపాల్‌రెడ్డికి తప్పకుండా అవకాశం దక్కుతుందని జోరుగా చర్చ సాగింది. అయితే పది నెలలు అవుతున్నా మంత్రివర్గ విస్తరణ జరగనే లేదు. మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారి రాజగోపాల్‌రెడ్డి పేరు ప్రస్తావనకు వస్తోంది.ఎంపీ ఎన్నికల సందర్భంలో అధిష్టానం హామీపార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఢిల్లీ, రాష్ట్ర అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా రాజగోపాల్‌రెడ్డి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. రాహుల్‌గాంధీ ప్రధాని కావాలంటే రాష్ట్రం నుంచి ఎక్కువ మంది ఎంపీలను గెలిపించాలని అధిష్టానం, రాష్ట్ర పార్టీ నేతలు, ముఖ్యమంత్రి కలిసి నిర్ణయించారు. అభ్యర్థుల ఎంపికతోపాటు వారి గెలుపు బాధ్యతలను జిల్లాల్లోని ముఖ్య నేతలకు అప్పగించారు. అందులో భాగంగా భువనగిరి ఎంపీగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపించే బాధ్యతను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి అప్పగించారు. ఆ సమయంలో ఎంపీని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లుగా చర్చ జరిగింది. మొత్తానికి భువనగిరి ఎంపీగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని దగ్గరుండీ గెలిపించారు. అప్పటి నుంచి మంత్రి పదవి కచ్చితంగా వస్తుందని రాజగోపాల్‌రెడ్డి భావించినా ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ మాత్రం జరగలేదు. అయితే, దసరాకు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ నేపధ్యంలో అధిష్టానం హామీ మేరకు రాజగోపాల్‌రెడ్డికి బెర్త్ దక్కుతుందా అన్న చర్చ మళ్లీ జోరందుకుంది.హోం మంత్రి పదవి ఇవ్వాలని..!ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు ప్రతిపక్ష, అటు అధికార పక్షాల మధ్య పోటాపోటీగా అసెంబ్లీలో చర్చలు జరిగాయి. ఆ తర్వాత ప్రభుత్వ వేదికలతోపాటు రాజకీయ వేదికల్లోనూ పెద్ద ఎత్తున అధికార, ప్రతిపక్షాలు పోటా పోటీగా విమర్శలు చేసుకున్నాయి. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అధికార పక్షం, పాలన చేత కాక గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుందని ప్రతిపక్షం విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తనకు హోంమంత్రి పదవి ఇవ్వాలని, తాను హోంమంత్రి అయితేనే కేసీఆర్‌ను సమర్థంగా ఎదుర్కొంటానని రాజగోపాల్‌రెడ్డి పలు సమావేశాల్లోనూ చెప్పుకొచ్చారు.ఎస్టీ కోటాలో బాలునాయక్‌కు!ఎస్టీ లంబాడా కోటాలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌కు మంత్రి పదవి వస్తుందని చర్చ సాగుతోంది. రాష్ట్రంలో ఆదివాసీ గిరిజన కోటాలో సీతక్కకు అధిష్టానం అవకాశం కల్పించింది. లంబాడా కోటాలో మరొక మంత్రి పదవి ఇస్తారన్న చర్చ సాగుతోంది. -
ఈ టర్మ్‌లోనే అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘దశాబ్దాల తరబడి కరువు, వలసల జిల్లాగా ఖ్యాతికెక్కిన ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీడు భూములకు సాగు నీరందించి సస్యశ్యామలం చేస్తాం. ఇదే శాసనసభ కాలంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుతోపాటు జిల్లాలోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను సంపూర్ణంగా పూర్తిచేసి సాగు నీరందిస్తాం’అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలమూరు–రంగారెడ్డితోపాటు పలు ప్రాజెక్టులను మరో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి బుధవారం ఆయన సందర్శించారు. పనుల పురోగతిని పరిశీలించిన అనంతరం నాగర్‌కర్నూల్‌లోని కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని భావించినట్టు తెలిపారు. బీఆర్ఎస్ పెద్ద మనిషి ఇటీవల పాలమూరు ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేశామని గొప్పలు చెప్పడం హాస్యాస్పదమన్నారు. రూ.27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరాకూ సాగు నీరివ్వలేక పోయారన్నారు. ఈ ప్రాజెక్టును నూటికి నూరు శాతం పూర్తి చేసి 12 లక్షల ఎకరాలకు సాగు నీరందించే విధంగా చిత్తశుద్ధితో ముందుకెళుతున్నామని చెప్పారు. రెండు నెలలకోసారి ప్రాజెక్టు పనులపై సమీక్షిస్తామని, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు.కృష్ణా నీటిని ఇప్పటికీ వినియోగించుకోలేకపోతున్నాం..: జూపల్లికృష్ణా నీటి కేటాయింపులున్నా, వాటిని ఇప్పటికీ వినియోగించుకోలేక పోతున్నట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. 18 టీఎంసీల కృష్ణా నీటిని వాడుకోవాల్సి ఉండగా, ఇప్పటిదాకా కేవలం ఆరు టీఎంసీల నీటిని మాత్రమే వాడుకుంటున్నట్టు వివరించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కాగా తమ సమస్యలను విన్నవించుకునేందుకు వస్తే.. తమకు అవకాశం ఇవ్వలేదంటూ ఉదండాపూర్ నిర్వాసితులతోపాటు కానాయపల్లి నిర్వాసితులు మంత్రులు వెళ్లిన తర్వాత అసంతృప్తి వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు. -
ఆ ఇద్దరు మంత్రులు దద్దమ్మలు: జగదీష్‌రెడ్డి
సాక్షి,నల్లగొండజిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు దద్దమ్మ మంత్రులున్నారని మాజీ మంత్రి,బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. సాగర్ జలాలపై ఈ మంత్రులకు అవగాహన లేకపోవడంతో ఆయకట్టు పొలాలు ఎండిపోతున్నాయన్నారు. సూర్యాపేటలో మంగళవారం(సెప్టెంబర్24) నిర్వహించిన మీడియా సమావేశంలో జగదీష్‌రెడ్డి మాట్లాడారు.ఖమ్మం జిల్లాకు సాగర్ నీళ్లు అధికంగా తరలించడం వల్లనే ఎడమ కాల్వకు గండి పడిందని ఆరోపించారు. జిల్లాలో ఉన్న మంత్రుల మాటలు విని పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రెండు లక్షల రుణమాఫీ ఇంకా 30 శాతం కూడా పూర్తిచేయలేదని విమర్శించారు. రైతు భరోసా వెంటనే ఇవ్వాలని జగదీష్‌రెడ్డి డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: సాగర్‌కాలువ గండి పూడ్చడం చేతకాదా..? -
36.80 లక్షల ఎకరాల్లో సన్నరకాల సాగు
సాక్షి, హైదరాబాద్: వచ్చే జనవరి నుంచి రాష్ట్రంలో రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం ఇవ్వనున్న నేపథ్యంలో.. ఖరీఫ్‌లో రైతుల నుంచి సన్న వడ్లు కొనుగోలు చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్‌లో రైతులు ఎన్నడూ లేనివిధంగా 36.80 లక్షల ఎకరాల్లో సన్న వడ్లను సాగు చేశారని.. సుమారు 88.09 లక్షల టన్నుల సన్న వడ్ల దిగుబడి ఉంటుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చే సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వనున్నట్టు తెలిపారు. సోమవారం ఉదయం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో 2024–25 ఖరీఫ్ పంట కొనుగోళ్లపై జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సీజన్లో రాష్ట్రంలో 7,139 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి ఉత్తమ్ చెప్పారు. సన్న, దొడ్డు వడ్లు కలిపి ఖరీఫ్‌లో 60.39 లక్షల ఎకరాల్లో సాగయ్యాయని, మొత్తంగా 1.46 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామని వివరించారు. ఇందులో 91.28 లక్షల టన్నులు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సన్నాలు, దొడ్డు వడ్లను వేర్వేరు కేంద్రాల్లో కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.డిఫాల్ట్ మిల్లర్లకు ధాన్యం ఇచ్చేది లేదుగతంలో అవకతవకలకు పాల్పడిన మిల్లర్లకు ఇకపై ధాన్యం ఇచ్చేది లేదని మంత్రి ఉత్తమ్ చెప్పారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్టోబర్ తొలివారంలో మొదలయ్యే ధాన్యం కొనుగోళ్లు జనవరి చివరి వరకు కొనసాగుతాయన్నారు. మొట్టమొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వం 40 లక్షల టన్నుల ధాన్యం నిల్వకు వీలుగా గోదాములను సిద్ధం చేసిందని చెప్పారు. ఖరీఫ్‌లో సేకరించిన సన్నాలను జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో అందిస్తామని తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ధాన్యం కొనుగోలు లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. -
‘సాగునీటి’ అప్పులపై వడ్డీని తగ్గించేలా చూడండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల కోసం గత ప్రభుత్వం చేసిన అప్పులు ఆర్థికంగా భారంగా మారాయని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయా అప్పులపై వడ్డీని పూర్తిగా లేదా పాక్షికంగా తగ్గించేలా కేంద్ర ప్రభుత్వరంగ ద్రవ్య సంస్థలను ఒప్పించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలోని భారత మండపంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న 8వ అంతర్జాతీయ నీటి వారం సదస్సు– 2024కు ఉత్తమ్ హాజరయ్యారు.రాష్ట్ర పతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించిన ఈ సదస్సు 4 రోజులపాటు కొనసాగనుంది. తొలిరోజు కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి ఉత్తమ్.. తెలంగాణలో ఈ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రా ధాన్యతను వివరించారు. ప్రతి ఏటా సుమారు ఆరు లక్షల ఎకరాల మేర కొత్త ఆయకట్టును సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో రూ.29 వేల కోట్లను ఈ రంగానికి కేటాయించిందని చెప్పా రు. రాష్ట్ర ప్రభుత్వ కృషికి తోడుగా కేంద్రం నుంచి తగిన సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.నిధుల రూపంలో సాయం అందించడంతో పాటు వివిధ రకాల క్లియరెన్సులను కూడా త్వరితగతిన ఇచ్చేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సమ్మక్క–సారలమ్మ ప్రాజెక్టుకు అన్ని రకాల క్లియరెన్సులు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలావుండగా మంత్రి.. పలు సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన రుణాలపై ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో 40 దేశాలకు చెందిన ప్రతినిధులతో పాటు మన దేశంలోని 20 రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ మంత్రులు, ఎన్జీవో సంస్థల ప్రతినిధులు, నిపుణులు పాల్గొన్నారు. -
వచ్చే నెల నుంచి కొత్త రేషన్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డుల కోసం అక్టోబర్ నుంచి దరఖాస్తులు స్వీకరించి, వేగంగా జారీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రేషన్‌కార్డులను విభజించి స్మార్ట్ రేషన్ కార్డులు, స్మార్ట్ హెల్త్ కార్డులను వేర్వేరుగా జారీ చేస్తామన్నారు. రేషన్ బియ్యం అవసరం లేకున్నా ఆరోగ్యశ్రీ వంటి ప్రయోజనాల కోసం తెల్లరేషన్ కార్డులున్న వారి కోసం ప్రత్యేకంగా స్మార్ట్ హెల్త్ కార్డులను జారీ చేస్తామని వెల్లడించారు. కొత్త రేషన్‌కార్డులు, హెల్త్ కార్డుల జారీపై మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సోమవారం హైదరాబాద్‌లోని జలసౌధలో నాలుగోసారి సమావేశమై చర్చించింది. ప్రభుత్వానికి కొన్ని మధ్యంతర సిఫార్సులు చేసింది. అనంతరం మంత్రులు ఉత్తమ్, పొంగులేటి మీడియాతో మాట్లాడారు. అర్హతలపై పునః సమీక్ష చేస్తున్నాం.. తెల్ల రేషన్‌కార్డు లబ్ధిదారుల అర్హతలను పునఃసమీక్షిస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఈ నెల 21న ఇంకోసారి సమావేశమై కొత్త విధివిధానాలను ఖరారు చేస్తామని చెప్పారు. అర్హులైన అందరికీ రేషన్‌కార్డులు జారీ చేయాలని నిర్ణయించామన్నారు. తెలంగాణ ఏర్పాటైన నాటికి 91,68,231 రేషన్‌కార్డులు, 3,38,07,794 మంది లబ్ధిదారులు ఉంటే.. గత ప్రభుత్వం పాత రేషన్‌కార్డులన్నీ రద్దు చేసి కొత్తగా దరఖాస్తులు స్వీకరించిందని చెప్పారు. అప్పట్లో 89,21,907 కొత్త రేషన్‌కార్డులను జారీ చేయగా.. 2,70,36,250 మంది లబ్ధిదారులు ఉన్నారని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89.6 లక్షల కార్డులు, 2.81 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం లబ్ధిదారుల వార్షికాదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షల్లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షల్లోపు ఉండాలని.. 3.5 ఎకరాలు/ఆ లోపు తడి, 7.5 ఎకరాలు/ఆ లోపు మెట్ట భూములు ఉండాలని చెప్పారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌లలో అమలు చేస్తున్న ఆదాయ పరిమితులను పరిశీలించామని.. రాష్ట్రంలో లబ్ధిదారుల ఆదాయ పరిమితిని పెంచాలా? తగ్గించాలా? ప్రస్తుత నిబంధనలనే కొనసాగించాలా? అన్న అంశాలపై తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కొత్త రేషన్‌కార్డుల జారీ విషయంలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలు కోరుతూ లేఖలు రాయగా.. ఇప్పటివరకు 16 మంది నుంచి స్పందన వచ్చిందన్నారు. మిగతావారు ఈ నెల 19లోగా అభిప్రాయాలను పంపితే.. పరిశీలిస్తామని చెప్పారు. జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ.. తెల్ల రేషన్‌కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీని జనవరి నుంచి ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. నిరుపేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పులకు ఈ పథకం దోహదపడుతుందని చెప్పారు. దొడ్డు బియ్యం బ్లాక్ మార్కెటింగ్, రిసైక్లింగ్‌కు దారితీస్తోందని.. సన్న బియ్యంతో ఈ సమస్య ఉండదని వివరించారు. వానాకాలంలో పండించిన సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ అందిస్తామని తెలిపారు. ఉప ఎన్నికలుంటేనే రేషన్ కార్డులిచ్చారు: పొంగులేటి గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి కొత్త రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఆసరా పెన్షన్లు ఇచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. 2016–2024 మధ్య కాలంలో 6,47,479 కొత్తకార్డులు జారీ చేయగా.. 5,98,000 కార్డులను తొలగించిందని చెప్పారు. అంటే ఇచ్చినది 49,476 కార్డులేనని పేర్కొన్నారు. తాము పారదర్శకత కోసం ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సేకరిస్తున్నామని, వారు విలువైన సలహాలిస్తే భేషజాలకు పోకుండా పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం మధ్యంతర సిఫారసులివీ.. – క్యూఆర్ కోడ్/ మైక్రో చిప్/ బార్ కోడ్‌తో కూడిన స్మార్ట్ కార్డులను జారీ చేయాలి. – ప్రస్తుత అర్హతలను కొనసాగించాలి. – ‘పరిమితికి లోబడి భూమి ఉండడం ఒక్కటే అర్హత కాదు. భూమి ద్వారా వచ్చే ఆదాయం సైతం ఆదాయ పరిమితికి లోబడి ఉండాలి’అనే నిబంధనను తొలగించాలి. గందరగోళానికి గురిచేసే ఈ నిబంధన అనవసరం. – సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సక్సేనా కమిటీ సిఫారసులను పరిశీలించాలి. -
కొత్త రేషన్‌కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
సాక్షి,హైదరాబాద్: అక్టోబర్‌లో కొత్త రేషన్ కార్డులు,హెల్త్ కార్డులు జారీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.సోమవారం(సెప్టెంబర్16) జలసౌధలో మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు.‘పదేళ్లలో నామమాత్రంగా రేషన్ కార్డులిచ్చారు. ఖరీఫ్ నుంచిన వడ్లకు క్విటాలుకు 500 అదనంగా ఇవ్వబోతున్నాం జనవరి నుంచిన్ కార్డు దారులకు సన్న బియ్యం ఇస్తాం. పారదర్శకంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలనుకుంటున్నాం. గత ప్రభుత్వ హయాంలో 49476 రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చారు. అవి కూడా బై ఎలక్షన్ ఉన్న నియోజక వర్గాల్లో మాత్రమే ఇచ్చారు. పద్ధతి ప్రకారం ఎక్కడా ఇవ్వలేదు. మా ప్రభుత్వ హయాంలో అర్హులైన అందరికి రేషన్‌కార్డులిస్తాం’అని తెలిపారు. ఇదీ చదవండి.. నిమజ్జనానికి అంతా రెడీ.. జీహెచ్ఎంసీ మేయర్