ఎల్‌నినోను తట్టుకునే సీ4 పంటలు తెలుసా? | El Nino Resilient C4 Crops And Mitigation Strategies Sagubadi | Sakshi
Sakshi News home page

ఎల్‌నినోను తట్టుకునే సీ4 పంటలు తెలుసా?

Jun 19 2026 8:12 AM | Updated on Jun 19 2026 8:45 AM

El Nino Resilient C4 Crops And Mitigation Strategies Sagubadi

సాగుబడి

పంటలు సీ3, సీ4 అని రెండు రకాలు

అధిక వేడిని, నీటి ఎద్దడిని ఎక్కువగా తట్టుకోగలిగేవి సీ4 పంటలే

ఎల్‌నినో కరువు కాలంలో రైతులకు అవగాహనతో కూడిన ప్రణాళిక అవసరం అంటున్న నిపుణులు

ఎల్‌నినో ప్రతికూల ప్రభావం ఈ ఖరీఫ్‌ కాలంలో పంటలను, రైతులను ఎక్కువగానే ఇబ్బంది పెట్టేలా కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా ఉంటాయని, వర్ష΄ాతం తక్కువగా ఉంటుందని భారతీయ వాతావరణ విభాగం తాజా అంచనాలు చెబుతున్నాయి. రుతుపవనాలు ఆలస్యం కావటం, వర్షాల మధ్య 15–25 రోజుల పొడి విరామం, తర్వాత భారీ వర్షాలు రావచ్చు. అందువల్ల రైతులకు ముందస్తు ప్రణాళిక చాలా అవసరం. ఈ వాతావరణ సంక్షోభ పరిస్థితుల్లో సీ3 పంటలకన్నా సీ4 పంటలపై ఆధారపడటమే మేలని సుస్థిర/ప్రకృతి వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకో ఏమిటో ఎలాగో తెలుసుకుందాం.

ప్రపంచవ్యాప్తంగా సాగులో ఉన్న పంట మొక్కల్లో 85–95% సీ3 పంటే. వరి, గోధుమ, సోయాబీన్స్, కంది, పత్తి, బంగాళదుంపలు, కూరగాయలు వంటి ప్రధాన ఆహార పంటలు ఈ కోవకే చెందుతాయి. నీటి ఎద్దడిని, అధిక ఉష్ణోగ్రతను ఇవి అంతగా తట్టుకోలేవు. కరువు పరిస్థితుల్లో, అధిక ఉష్ణోగ్రతల్లోనూ సీ4 పంటలు మెరుగైన ఫలితాలనిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మొక్కజొన్న, చెరకుతో ΄ాటు జొన్న, రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు వంటి చిరుధాన్యపు పంటలు సీ4 కోవలోకి వస్తాయి.

సీ4 పంటల ప్రత్యేకత ఏమిటి?
పంటలు, మొక్కలు, చెట్ల ఆకులు గాలిలోని కార్బన్‌  డయాక్సైడ్, సూర్యరశ్మి సహాయంతో ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఈ ప్రక్రియను కిరణజన్య సంయోగ క్రియ అంటాం. కార్బన్‌ డయాక్సైడ్‌ను 3 కర్బన సమ్మేళనంగా (కాల్విన్‌ చక్రాన్ని ఉపయోగించి) స్థిరీకరించే పంటలను సీ3 పంటలు అంటాం. అందువల్ల ఇవి చల్లని, తేమతో కూడిన వాతావరణాలకు అనువైనవి. కార్బన్‌ డయాక్సైడ్‌ను 4 కర్బన సమ్మేళనంగా (క్రాంజ్‌ అనాటమీ అనే ప్రత్యేక నిర్మాణ అనుసరణను ఉపయోగించి) స్థిరీకరించే పంటలను సీ4 పంటలు అంటాం. ఇవి వేడి, పొడి, ఉష్ణమండల వాతావరణాల్లో సమర్థవంతంగా పెరగడానికి అనువైనవి.


పత్రరంధ్రాలు కీలకం!
వేడి పెరగటం, తేమ అధికం కావటం, వర్ష΄ాతంలో మార్పులు మొక్కలో శరీరధర్మ, జీవరసాయన మార్పులు తెస్తాయి. అప్పుడు బయటకు కనిపించే లక్షణాలు ఇవి.. ఆకులు వాలిపోవటం, పూత రాలిపోవటం, వేర్లు కుళ్లిపోవటం, దిగుబడి తగ్గటం.
పత్ర రంధ్రాలు మొక్క ‘శ్వాస ద్వారాలు’. సీ3 పంటలు 30 డి.సె.ల నుంచి 35 డి.సె.లు దాటితే నీరు కోల్పోతున్నామనే సంకేతంతో శ్వాస ద్వారాలు మూసుకుపోతాయి. కార్బన్‌ డయాక్సైడ్‌ లోపలికి రాకపోతే కిరణజన్య సంయోగక్రియ ఆగిపోతుంది. ఫలితంగా ఆహార పదార్థాల తయారీ ఆగిపోతుంది. అప్పుడు మొక్క తన కాండాన్ని కా΄ాడుకోవటానికి ఆత్మరక్షణ స్థితిలోకి వెళ్లి తనలో నిల్వ ఉన్న శక్తినే వాడుకుంటుంది. సీ4 మొక్కల్లో అయితే 35–40 డి.సె.ల ఉష్ణోగ్రత వరకు కిరణజన్య సంయోగక్రియ అత్యధికంగా జరుగుతుంది. 45 డి.సె.ల తర్వాత మాత్రమే కిరణజన్య సంయోగ క్రియ ఆగిపోతుంది.

సీ3 + సీ4 పంటలు కలిపి వేసుకోవాలి
ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగినప్పుడు కూడా సీ4 పంటల్లో కిరణజన్య సంయోగక్రియ తార స్థాయిలో జరుగుతుంది. కాబట్టి, సీ4 మొక్కలు వేడి ఒత్తిడికి గురికావు. అందువల్ల సీ4 పంటలు అధిక వేడి ఒత్తిడిలో కూడా దిగుబడులను ఇవ్వగలవు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా, వర్షాలు తక్కువగా ఉండబోతున్న ఈ సంవత్సరం రైతులు సీ4 ప్రధాన పంటలుగా సాగు చేసుకోవటం ద్వారా ప్రతికూల పరిస్థితుల్లో కూడా దిగుబడి నష్టం రాకుండా చూసుకోవచ్చు.


అయితే, సీ3 పంటలు సాగు చేసే రైతులు కూడా సీ4 పంటలను అనుబంధ పంటలుగా, జీవవైవిధ్య పంటలుగా, సరిహద్దు పంటలుగా వేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా సీ3 పంటలపై ఎల్‌నినో ఒత్తిడిని తగ్గించటానికి సీ4 పంటలు దోహదం చేస్తాయని అంటున్నారు. తమ నేల రకం, నీటి వసతి తదితర అంశాలపై ఆధారపడి స్థానిక వ్యవసాయ నిపుణులను సంప్రదించి రైతులు తమ పంటల ప్రణాళికను రూపొందించుకోవలసి ఉంటుంది.

జీవామృతం ఎంతవరకూ రక్షిస్తుంది? 
వేడి ఒత్తిడి నుంచి పంటలను రక్షించుకోవటానికి ద్రవ జీవామృతం వంటి జీవ ఉత్ప్రేరకాలు పంటలపై చల్లాలి. వీటిలోని సూక్ష్మజీవులు, మొక్క కణజాలంలో అంతరజీవులు కూడా ఆర్‌ఓఎస్‌ (రియాక్టివ్‌ ఆక్సిజెన్‌ స్పీసీస్‌) ప్రభావం నుంచి రక్షించేందుకు అవే ఎంజైములను ఉత్పత్తి చేసి పంటలను రక్షిస్తాయి.

ఒకవేళ వేడి ఒత్తిడి ఆగలేదంటే పంట ఆత్మరక్షణ స్థితిలోకి వెళ్లి, మొదట ఆబ్సిసిక్‌ ఆమ్లం ఉత్పత్తి చేసి పత్ర రంధ్రాలను మూసివేస్తుంది. తర్వాత ఇథిలిన్‌ ఉత్పత్తి చేసి పూత, పిందెలు, ఆకులు, కొమ్మలు పండి రాలిపోయేలా చేస్తుంది.

ప్రధాన పంటలను అధిక ఉష్ణోగ్రతల నుంచి రక్షించాలంటే.. ప్రధాన పంట కంటే ఎత్తుగా పెరిగే అనుబంధ పంటలు, జీవవైవిధ్య పంటలను ఎంపిక చేసుకోవాలి. అంటే, ప్రధాన పంట పక్కనే సంవత్సరం పొడవునా ఉండేలా కంది, మునగ, ఆముదం మొదలైన పంటలు ఉండేలా ప్రణాళిక వేసుకోవాలి. తద్వారా కొంత నీడ, తేమ లభించటం ద్వారా పంట పొలంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.

ఆచ్ఛాదనతో మేలు
పత్ర రంధ్రాలు ఆకుల కింది భాగంలో ఉంటాయి. కాబట్టి నేలపై ఆచ్ఛాదన చేయకపోతే, సూర్యుని వేడి కాంతి కిరణాలు నేరుగా నేలను తాకి ఆకు కింద భాగంపై పరావర్తనం చెందుతాయి. దీని ఫలితంగా పత్రరంధ్రాలు మూసుకుపోతాయి. కాబట్టి, నేలను కప్పి ఉంచే మంద΄ాటి పంట వ్యర్థాలతో ఆచ్ఛాదన చేస్తే పత్ర రంధ్రాలు తెరిచి ఉండటానికి ఎంతగానో సహాయపడుతుంది.

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement