Elnino effect
-
మేఘసందేశం = ఆగస్టు, సెప్టెంబర్‌లో భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్ : ‘నైరుతి’ నిస్తేజంతో దిగాలుపడుతున్న తెలుగు రాష్ట్రాల రైతులకు వాతావరణ నిపుణులు తీపి కబురు అందించారు. ప్రపంచ వాతావరణంపై ప్రత్యేకించి మన దేశంలో రుతుపవనాల కదలికలపై ప్రతికూల ప్రభా వం చూపుతున్న ఎల్ నినో స్థితి క్రమంగా బలహీనపడుతోందని తాజా అధ్యయనంలో తేల్చారు. ఇది ఒకటి, రెండు నెలల్లో తటస్థ స్థితికి చేరుకుంటుందని, దీని ప్రభావంతో ఆగస్టు, సెప్టెంబర్లలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తు తం నైరుతి రుతుపవనాలు బలహీనంగా మారడంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా లోటు వర్షపాతం నెలకొంది. దీంతో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఫలితంగా దుర్బిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులకు ప్రధానంగా ఎల్‌నినో ప్రభావం, నైరుతి రుతుపవన ద్రోణి హిమాలయాల వైపు తరలిపోవడమే కారణం. నైరుతి రుతుపవనాల ఆగమనం, విస్తరణకు అనేక సందర్భాల్లో అడ్డుగా నిలిచేది ఎల్‌నినో అనేది తెలిసిందే. అదిప్పుడు బలహీన పడుతుండటంతో రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నా యని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు సాధారణంగా దక్షిణాదివైపు రావాల్సిన నైరుతి రుతుపవన ద్రోణి హిమాలయాల వైపు వెళ్లిపోయింది. ఆ రుతుపవన ద్రోణి ఇప్పుడు తిరిగి దక్షిణాది ప్రాంతంపైకి త్వరలో రానుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సాధారణం కంటే భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధి కారి రాజారావు తెలిపారు. ఎల్‌నినో క్రమంగా బలహీన పడుతుండటంతో మున్ముందు మంచి వర్షాలు కురుస్తాయని అమెరికా శాస్త్రవేత్తలు కూడా విశ్లేషించారు. రుతుపవనాలపై దాని ప్రభావం పూర్తిగా తొలగిపోకున్నా క్రమంగా ఆ ప్రభావం తగ్గిపోతుందని అంటున్నారు. అయితే ఎల్‌నినో క్షీణించినా మంచి వర్షాలు పడుతాయని కచ్చితంగా చెప్పలేమని మరికొందరు నిపుణులు అంటున్నారు. ఎల్‌నినో అంటే? పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్యరేఖ దగ్గర జల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 0.5 డిగ్రీలు అధికంగా ఉంటే దాన్ని ఎల్‌నినో అంటారు. అంతకంటే తక్కువగా ఉంటే లానినో అంటారు. ఎల్ నినో ఉంటే వర్షాలు తక్కువగా కురుస్తాయని, లా నినా వల్ల వర్షాలు అధికంగా కురుస్తాయని వాతావరణ అధికారులు చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఎల్ నినో ప్రభావం ఆసియా దేశాలపై పడుతుంది. ఫలితంగా ఇక్కడి సముద్రపు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఈ ఏడాదీ ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపించింది. దీంతో నైరుతి రుతుపవనాలు బలïßహీనం అయ్యాయి. ఈసారి వర్షాకాలం ఆలస్యంగా ప్రారంభం కావడానికి ప్రధాన కారణం ఎల్ నినో అని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఫలితంగా కీలకమైన జూన్ నెలలో లోటు వర్షపాతం నమోదై వ్యవసాయ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. జూన్, జూలైలలో ఇప్పటివరకు సాధారణం కంటే లోటు వర్షపాతం వల్ల భూగర్భ జలాలు అడుగంటి వర్షాభావంతో విలవిలలాడుతున్నాయి. అయితే ఒక్కోసారి ఎల్ నినో, లా నినాలతో సంబంధం లేకుండానే మంచి వర్షాలు కురిసిన సందర్బాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి విశ్లేషించారు. అయితే లా నినో ఏర్పడిన ఎక్కువ సందర్బాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, కొన్ని సందర్భాల్లో అధికంగా కూడా వర్షాలు కురిశాయని ఆయన తెలిపారు. ఎల్ నినో బలంగా ఉంటే వర్షాలు కురవవని అనుకోవడానికి వీల్లేదని ఆయన పేర్కొన్నారు. దారితప్పిన నైరుతి రుతుపవన ద్రోణి... ఎల్ నినోకు తోడు ఈసారి నైరుతి రుతుపవన ద్రోణి మనల్ని ముంచింది. రుతుపవన ద్రోణి హిమాలయాల వైపు వెళ్లిపోవడం ప్రస్తుత పరిస్థితికి మరో కారణంగా వాతావరణ కేంద్రం చెబుతోంది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు ప్రవేశించాక నైరుతి రుతుపవన ద్రోణి ఏర్పడుతుంది. ఇది నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించే సమయంలో రాజస్తాన్‌లోని గంగానగర్ నుంచి అలహాబాద్ మీదుగా ఉత్తర బంగాళాఖాతం వరకు ఏర్పడుతుంది. ఆ సమయంలో నైరుతి రుతుపవన ద్రోణి సాధారణ స్థితి నుంచి గాలుల దిశను బట్టి కిందనున్న దక్షిణం వైపునకు రావాల్సి ఉంటుంది. అప్పుడు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు కురుస్తాయి. అయితే ఈసారి అలా కాకుండా అది సాధారణ స్థితి నుంచి పైకి అంటే ఉత్తరం వైపు నుంచి హిమాలయాలవైపు వెళ్లి పోయింది. రుతుపవనాలు ఎప్పటికప్పుడు దిశ మార్చుకుంటాయి. అవెప్పుడు ఎలా మారుతాయో వాతావరణ పరిస్థితులను బట్టి ఉంటుంది. అవి దిశ మార్చుకోవడానికి గాలుల తీవ్రతే కారణమని, దానివల్ల ఈసారి రుతుపవన ద్రోణి ఉత్తరం వైపు వెళ్లిపోయిందని రాజారావు అంటున్నారు. దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన వర్షాభావం నెలకొంది. ఒక్కోసారి అది దిశ మార్చుకోకుండా సాధారణ స్థితిలోనే ఉంటే అప్పుడు ఉత్తరం వైపునకు, దక్షిణం వైపునకు కాకుండా అక్కడే తటస్థంగా ఉండిపోతుంది. అప్పుడు దేశం మొత్తం ఒకేసారి ఒకేవిధంగా భారీ వర్షాలు కురుస్తాయి. కానీ అదిప్పుడు హిమాలయాలవైపు వెళ్లిపోవడంతో మనకు వర్షాలు తక్కువగా కురిశాయని రాజారావు తెలిపారు. అయితే రుతుపవనాలు దక్షిణాది వైపు రావడం తప్పనిసరిగా జరిగే పరిణామమేనని, కానీ అవెప్పుడు వస్తాయో సాధారణంగా చెప్పలేమన్నారు. కానీ ఈసారి ఈ నెల చివరి నాటికి వస్తాయని అంచనా వేశామన్నారు. ఎల్ నినో ప్రభావం ఎంతో, దానికంటే ఎక్కువగా నైరుతి రుతుపవన ద్రోణి దిశ మార్చుకోవడం వల్ల కూడా వర్షాభావం ఏర్పడిందని అంటున్నారు. ఎల్‌నినో ఏర్పడిన సంవత్సరాలు... దేశంలో ఈ శతాబ్దంలో అంటే 2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఐదు సార్లు ఎల్ నినో పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆయా సంవత్సరాల్లో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో అంతకుముందు సంవత్సరాలతో పోలిస్తే పడాల్సిన దానికన్నా కనిష్టంగా 14 శాతం లోటు వర్షపాతం నమోదైంది. లోటు వర్షపాతానికి, ఎల్ నినోకు దగ్గరి సంబంధం ఉందని పలు శాస్త్రీయ అధ్యయనాలు తేల్చాయి. వాతావరణశాఖ దేశం మొత్తాన్ని 36 సబ్ డివిజన్లుగా విభజించింది. 2000 సంవత్సరం నుంచి పరిశీలిస్తే ఈ మొత్తం డివిజన్లలో 25 శాతం ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదైంది. అయితే ఎల్ నినో ప్రభావం వల్ల 2002, 2009లలో 36 సబ్ డివిజన్లలో 20కి పైగా ప్రాంతాల్లో లోటు వర్షపాతం, క్షామ పరిస్థితులు తలెత్తాయి. ఎల్ నినో ఏర్పడిన ఏడాది దేశమంతా సాధారణ వర్షాలు పడి, కొన్ని ప్రాంతాల్లో మాత్రం అధ్వాన పరిస్థితులు నెలకొన్న ఉదాహరణలూ ఉన్నాయని వాతావరణ కేంద్రం అధికారులు అంటున్నారు. -
ఈసారీ లోటు వర్షపాతమే
న్యూఢిల్లీ: ప్రముఖ ప్రైవేటు వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్ భారత రైతులకు చేదు వార్తను తెలిపింది. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువస్థాయి వర్షపాతం నమోదవుతుందని స్కైమెట్ అంచనా వేసింది. నైరుతీ రుతుపవనాల ప్రభావంతో జూన్–సెప్టెంబర్ మధ్యకాలంలో దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ)లో 93 శాతం వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. పసిఫిక్ మహాసముద్రంలో జలాలు సాధారణం కంటే అధికంగా వేడెక్కిన నేపథ్యంలో ఎల్‌నినో ఏర్పడొచ్చనీ, ఇది నైరుతీ రుతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. 1951 నుంచి 2000 వరకూ కురిసిన వర్షపాతాన్ని ఎల్‌పీఏగా వ్యవహరిస్తారు. ఇది 89 సెం.మీగా ఉంది. భారత్‌లో వ్యవసాయ రంగానికి జీవనాధారమైన నైరుతీ రుతుపవనాలు జూన్ 1న కేరళ తీరాన్ని తాకనున్నాయి. కోస్తాంధ్రలో సాధారణ వర్షమే.. ఒకవేళ ఈ అంచనాలు నిజమైతే వరుసగా రెండో ఏడాది కూడా భారత్‌లో లోటు వర్షపాతం నమోదైనట్లు అవుతుంది. అదే జరిగితే రుతుపవనాల తొలి అర్ధభాగంలో తూర్పు, మధ్య భారత్‌లోని రాష్ట్రాల్లో తీవ్రమైన వర్షపాత లోటు నెలకొంటుందని స్కైమెట్ తెలిపింది. అయితే కోస్తా ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని చాలాప్రాంతాల్లో సీజన్ మొత్తం సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. ఈ విషయమై సంస్థ సీఈవో జతిన్ సింగ్ మాట్లాడుతూ..‘జూన్ నెలలో దీర్ఘకాలిక సగటులో 77 శాతం వర్షపాతం నమోదుకావొచ్చు. అదే జూలైలో కొంచెం పెరిగి 91 శాతానికి చేరుకోవచ్చు. ఇక ఆగస్టులో 102 శాతం, సెప్టెంబర్‌లో 99 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశముంది’ అని పేర్కొన్నారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు 55 శాతం ఉండగా, సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు 30 శాతం ఉన్నాయనీ, సాధారణం కంటే ఎక్కువ–అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు లేవని తేల్చిచెప్పారు. రుతుపవనాలపై ఎల్‌నినో ఎఫెక్ట్.. పసిఫిక్ మహాసముద్రంలోని జలాలు ఈసారి సాధారణం కంటే అధికంగా వేడెక్కాయని స్కైమెట్ సంస్థ తెలిపింది. దీని కారణంగా ఎల్‌నినో ఏర్పడుతుందనీ, ఇది నైరుతీ రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వెల్లడించింది. ఈ విషయమై స్కైమెట్ అధ్యక్షుడు జి.పి. శర్మ మాట్లాడుతూ..‘మా అంచనాల ప్రకారం మార్చి–మే మధ్యకాలంలో ఎల్‌నినో ఏర్పడే అవకాశాలు 80 శాతం ఉన్నాయి. జూన్–ఆగస్టు నాటికి ఈ సగటు 60 శాతానికి పడిపోతుంది. మే–జూన్–జూలై కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఎల్‌నినో ఏర్పడే అవకాశాలు 66 శాతం ఉండగా, స్థిర వాతావరణం కొనసాగే అవకాశం 32 శాతం, లానినా ఏర్పడే అవకాశాలు 2 శాతం ఉన్నాయి. లానినా వల్ల పసిఫిక్‌లో ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఇది నైరుతీ రుతుపవనాలకు మంచిది’ అని పేర్కొన్నారు. హిందూ మహాసముద్రంలోని జలాలు సరైన ఉష్ణోగ్రతతో ఉన్న నేపథ్యంలో ఎల్‌నినో ప్రభావాన్ని కొంతవరకూ అడ్డుకునే అవకాశముందని అభిప్రాయపడ్డారు. -
ఎగువ నిండకుంటే.. దిగువ కన్నీరే!
ఎగువన కర్ణాటకలోని రిజర్వాయర్లన్నీ ఖాళీ అవి నిండితేనే దిగువన జూరాల, శ్రీశైలం, సాగర్లకు నీరు పరిస్థితిని సమీక్షించిన సమీకృత నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ ఖాళీ రిజర్వాయర్లు, ఎల్‌నినో ప్రభావంపై ఆందోళన తాగునీటి అవసరాలకు 80 టీఎంసీల నిల్వ చేశాకే ఖరీఫ్‌కు నీరు! ప్రాజెక్టుల కింది ఆయకట్టుకు తప్పని కటకట? హైదరాబాద్: కృష్ణా పరీవాహక ప్రాంతంలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ ఖాళీ అయ్యాయి. జలకళను కోల్పోయి నిర్జీవంగా మారడం రాష్ట్రాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది. ఎగువన కర్ణాటక ప్రాజెక్టుల్లోనూ నీటి కొరత ఉండటం.. మరోవైపు ఈసారి ఎల్‌నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువగా వర్షాలు పడతాయన్న అంచనాల నేపథ్యంలో రాష్ర్ట వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కర్ణాటక ప్రాజెక్టులు నిండకుంటే రాష్ట్రంలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ఒట్టికుండలుగా మారే ప్రమాదముంది. అదే జరిగితే వాటి కింద ఆయకట్టుకు సకాలంలో నీరివ్వడం గగనమే. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, ఖరీఫ్ సాగు అవసరాలపై సమీక్షించిన రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటీ సైతం ఖాళీ రిజర్వాయర్లు, ఎల్‌నినో ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేసింది. తాగునీటి అవసరాలను తీర్చేలా కనీసం 80 టీఎంసీల నీరు వచ్చేంత వరకు ఖరీఫ్‌కు నీటి విడుదలపై నిర్ణయం తీసుకోరాదని కమిటీ నిర్ణయించినట్లు తెలిసింది. అన్నీ ఖాళీయే.. కృష్ణా, గోదావరి పరిధిలోని ప్రధాన ప్రాజెక్టుల్లో గతేడాదితో పోలిస్తే ఈసారి నీటిమట్టాలు గణనీయంగా పడిపోయాయి. గోదావరి ప్రాజెక్టుల కింద ఈ ఏడాది ఎక్కడా ఖరీఫ్ సరిగా సాగలేదు. కృష్ణా పరిధిలో నీటి లభ్యత ఉన్నా విద్యుదుత్పత్తికి వినియోగించడంతో నిల్వలు తగ్గాయి. దీంతో మూడు ప్రాజెక్టుల పరిధిలోని మొత్తం నీటి నిల్వ 539.80టీఎంసీలకు గాను 175.25 టీఎంసీల నీరు మాత్రమే లభ్యతగా ఉంది. గతేడాది ఇదే సమయానికి 204.59 టీఎంసీల నీటి నిల్వ ఉండగా.. ఈసారి మరో 30టీఎంసీలు తగ్గిపోయింది. మరోవైపు ఎగువన కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వలు పూర్తిగా అడుగంటాయి. ఈ నేపథ్యంలో జూన్‌లో వర్షాలు సకాలంలో కురిసినా.. అక్కడి ప్రాజెక్టులు నిండి దిగువన మన ప్రాజెక్టులకు నీరు వచ్చేందుకు చాలా సమయం పడుతుంది. వర్షాలు సరిగా కురవకుంటే దిగువన మనకు మిగిలేది కన్నీరే. ఎల్‌నినో ఎఫెక్ట్.. ఇప్పటికే రిజర్వాయర్లన్నీ ఖాళీకావడానికి తోడు ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం బలంగా ఉండే అవకాశముందన్న హెచ్చరికలు రాష్ట్రాన్ని కలవరపెడుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో నీటి పరిస్థితి, ఖరీఫ్ అవసరాలపై సమీక్షించిన రాష్ట్ర స్థాయి సమీకృత నీటి నిర్వహణ, ప్రణాళిక స్టాండింగ్ కమిటీ సమావేశం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఎల్‌నినో ప్రభావంతో ఒక్కో చోట భారీగా వర్షాలు కురుస్తాయని, మరికొన్ని చోట్ల అసలే పడవని.. అదే జరిగితే ప్రాజెక్టుల్లో నీరు చేరడం గగనమేనని ఆందోళన వ్యక్తం చేసింది. దీంతో ఖరీఫ్ ఆయకట్టును ముందస్తుగా నిర్ణయించడం సాధ్యం కాదని కమిటీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యమిస్తూ.. ఎస్సారెస్పీలో 15 టీఎంసీలు, శ్రీశైలంలో 15, సాగర్‌లో 50టీఎంసీల మేర నీటి లభ్యత వచ్చాకే ఖరీఫ్ ప్రణాళికను తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇదే జరిగితే సాగర్ కింద 6.3లక్షల ఎకరాలు, జూరాల కింద లక్ష, ఎస్సారెస్పీ కింద మరో లక్ష ఎకరాలకు నీటి కటకట తప్పదు. -
ఖరీఫ్ కలవరం
ఖరీఫ్ సీజన్ రైతులను కలవర పెడుతోంది. సీజన్ ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా.. తొలకరి జిల్లాను ఇంకా పలకరించలేదు. మరోవైపు బ్యాంకులు రుణాలివ్వడం లేదు. ఇప్పటికే దుక్కులు దున్ని.. నార్లు పోసిన రైతులు సాగు చేపట్టేందుకు పెట్టుబడుల కోసం బ్యాంకుల వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. పాత రుణాలు చెల్లిస్తేనే.. కొత్తవాటికి మోక్షమని వారి ఆశలపై బ్యాంకర్లు నీళ్లు చల్లుతున్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తుండడం రైతులను ఆనందపరుస్తున్నా.. ఎప్పుడు అమలు చేస్తారో అంతుబట్టడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌కు పెట్టుబడులు ఎలా సమకూర్చుకోవాలో తెలియక అన్నదాత అయోమయంలో పడ్డాడు. -కరీంనగర్ అగ్రికల్చర్ తొంగిచూడని వరుణుడు ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రోజులు గడుస్తున్నా వరుణుడు జిల్లావైపు తొంగిచూడడం లేదు. వడగాలుల ఉధృతి కూడా ఇంకా తగ్గడం లేదు. ఉరుములు, మెరుపులతో చినుకులు వస్తున్నా.. క్షణాల్లోనే మాయమైపోతున్నాయి. జూన్‌లో సాధారణ వర్షపాతం 130 మిల్లీమీటర్లు కాగా.. శనివారం వరకు 20 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. గతేడాది ఈ పాటికే రెండుసార్లు భారీ వర్షాలు కురిశాయి. ఈసారి కూడా వర్షాలు ముందుగానే వస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొనడంతో రైతులు దుక్కులు సిద్ధం చేసుకున్నారు. కొన్నిచోట్ల నార్లు పోస్తున్నారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు అవసరమైన పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఏడు జిల్లాలో 6,42,819 హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇది గతేడాదితో పోల్చితే 81,764 హెక్టార్లు అదనం. ఈసారి రైతులు అధికంగా పత్తి సాగు వైపు మొగ్గుచూపుతున్నారు. పత్తి 2.70 లక్షల హెక్టార్లలో, వరి 2.15 లక్షల హెక్టార్లు, మొక్కజొన్న 70 వేల హెక్టార్లలో సాగు కానున్నాయి. మిగిలిన హెక్టార్లలో ఇతర పంటలు వేయనున్నారు. లక్షలాది మంది నిరీక్షణ ఏటా ఆరు లక్షల మందికిపైగా రైతులు పంట రుణాలపైనే ఆధారపడి సాగుకు ఉపక్రమిస్తారు. ప్రస్తుతం వీరి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. గత ఆర్థిక సంవత్సరం రూ. రెండు వేల కోట్ల రుణ లక్ష్యానికి రూ.1805.49 కోట్లు అందించారు. ఇందులో జూన్ ఒకటి నుంచి 2014 మే 31 వరకు రూ.1513.82 కోట్లను రూ.లక్షలోపు రుణాలు ఇచ్చారు. వాటిని ప్రభుత్వం మాఫీ చేస్తే 4,77,663 మందికి లబ్ధి చేకూరనుంది. తాజాగా 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.2300 కోట్ల పంట రుణాలిచ్చేందుకు లక్ష్యంగా నిర్దేశించారు. ఖరీఫ్‌లో రూ.1650 కోట్లు, రబీలో రూ.650 కోట్లు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే నిర్దేశించిన లక్ష్యంలో కనీసం 40 శాతం రుణాలు అందించాలి. కానీ జిల్లాలో ఇప్పటివరకు రుణాల జారీ మొదలే కాలేదు. లక్ష్యం భారీగా ఉన్నా.. బ్యాంకర్లు పైసా కూడా విదిల్చలేదు. జిల్లాలోని ఏడు లక్షల మంది రైతులకు పూర్తిగా రుణాలు ఇవ్వాలంటే కనీసం నాలుగైదు నెలల సమయం పట్టే అవకాశముంది. ప్రస్తుతం సర్కారు ఉత్తర్వులు వచ్చి.. పాత రుణాలను మాఫీ చేసి.. కొత్త రుణాలు ఇచ్చేసరికి కనీసం ఆరు నెలలైనా పడుతుంది. అంటే డిసెంబర్ వరకు రుణాలు అందే వీలులేదు. వ్యవసాయ రుణాలపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రాయితీ వర్తించాలంటే జూలై 20లోపే రుణాలు మంజూరు పూర్తి చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర సర్కారు ఉత్తర్వులతో రుణాల మంజూరు చేసేసరికే ఆ గడువు కాస్తా ముగిసే పరిస్థితి రైతులను కలవరపెడుతోంది. ప్రభుత్వం తొందరగా స్పందించి షరతుల్లేకుండా రుణ మాఫీ అందించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. -కరీంనగర్ అగ్రికల్చర్ వెంటాడుతున్న ‘ఎల్‌నినో’ ఎల్‌నినో భయం జిల్లా రైతులను వణికిస్తోంది. ఎల్‌నినో ప్రభావం జిల్లాపై ఉంటుందన్న వాతావరణ నిపుణుల హెచ్చరికల మేరకు అకాలవర్షాలు తప్ప అనుకూల వర్షాలు పడే అవకాశం లేదని తెలుస్తోంది. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన వాతావరణ శాఖ నుంచి ఎలాంటి సంకేతాలూ రావడం లేదు. జూలై వరకు వర్షాలరాక ఆలస్యమైతే దిగుబడులపై ప్రభావం చూపుతుందని రైతుల్లో ఆందోళన నెలకొంది. జూన్‌లో ఇప్పటికే రెండు వారాలు పూర్తయ్యాయి. మరో రెండు వారాల్లో మంచి వర్షాలు కురిస్తే సాగు కష్టాల నుంచి గట్టెక్కే ఆస్కారముంది. అయితే ఎల్‌నినో ప్రభావం జిల్లాపై ఉండకపోవచ్చని, వర్షాలు సమృద్ధిగా పడతాయని జేడీఏ ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పుల కోసం తిప్పలు రైతులు సాగు పనులు మొదలు పెట్టాలంటే ముందుగా కావాల్సింది పెట్టుబడి. బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటేనే ఖరీఫ్ సాగు ముందుకు కదులుతుంది. రుణం కోసం రైతులు బ్యాంకుల గడప తొక్కితే పాత రుణాలు చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తామంటున్నారు. రుణమాఫీపై సర్కారు నుంచి ఆదేశాలు రాకపోవడంతో రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు నిరాకరిస్తున్నారు. సాగుకు ఇప్పటినుంచి పదిరోజులే కీలకం. వర్షాలు పడకముందే రైతులు ఎరువులు, విత్తనాలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. చినుకుపడగానే.. దుక్కులు దున్నేందుకు.. విత్తనాలు వేసేందుకు ట్రాక్టర్లు, కూలీలు అవసరమవుతారు. ఇందుకు చేతిలో తప్పనిసరిగా నగదు ఉంచుకోవాల్సిందే. మరోవైపు మాఫీ నిర్ణయం ఎప్పుడు అమలవుతుందో..? కొత్త రుణాలు ఎప్పుడిస్తారో..? అనే భయం అన్నదాతల్లో నెలకొంది. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తే రైతుల నడ్డి విరగడం ఖాయం. ఫలితంగా అన్నదాతల్లో తీవ్ర మనోవేదన వ్యక్తమవుతోంది.