ఖరీఫ్ కలవరం | farmers tentions in karif season | Sakshi
Sakshi News home page

ఖరీఫ్ కలవరం

Published Mon, Jun 16 2014 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 8:51 AM

ఖరీఫ్ కలవరం

ఖరీఫ్ కలవరం

ఖరీఫ్ సీజన్ రైతులను కలవర పెడుతోంది. సీజన్ ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా.. తొలకరి జిల్లాను ఇంకా పలకరించలేదు. మరోవైపు బ్యాంకులు రుణాలివ్వడం లేదు. ఇప్పటికే దుక్కులు దున్ని.. నార్లు పోసిన రైతులు సాగు చేపట్టేందుకు పెట్టుబడుల కోసం బ్యాంకుల వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. పాత రుణాలు చెల్లిస్తేనే.. కొత్తవాటికి మోక్షమని వారి ఆశలపై బ్యాంకర్లు నీళ్లు చల్లుతున్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తుండడం రైతులను ఆనందపరుస్తున్నా.. ఎప్పుడు అమలు చేస్తారో అంతుబట్టడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌కు పెట్టుబడులు ఎలా సమకూర్చుకోవాలో తెలియక అన్నదాత అయోమయంలో పడ్డాడు.
 -కరీంనగర్ అగ్రికల్చర్     
 
తొంగిచూడని వరుణుడు
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రోజులు గడుస్తున్నా వరుణుడు జిల్లావైపు తొంగిచూడడం లేదు. వడగాలుల ఉధృతి కూడా ఇంకా తగ్గడం లేదు. ఉరుములు, మెరుపులతో చినుకులు వస్తున్నా.. క్షణాల్లోనే మాయమైపోతున్నాయి. జూన్‌లో సాధారణ వర్షపాతం 130 మిల్లీమీటర్లు కాగా.. శనివారం వరకు 20 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. గతేడాది ఈ పాటికే రెండుసార్లు భారీ వర్షాలు కురిశాయి. ఈసారి కూడా వర్షాలు ముందుగానే వస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొనడంతో రైతులు దుక్కులు సిద్ధం చేసుకున్నారు.

కొన్నిచోట్ల నార్లు పోస్తున్నారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు అవసరమైన పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఏడు జిల్లాలో 6,42,819 హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇది గతేడాదితో పోల్చితే 81,764 హెక్టార్లు అదనం. ఈసారి రైతులు అధికంగా పత్తి సాగు వైపు మొగ్గుచూపుతున్నారు. పత్తి 2.70 లక్షల హెక్టార్లలో, వరి 2.15 లక్షల హెక్టార్లు, మొక్కజొన్న 70 వేల హెక్టార్లలో సాగు కానున్నాయి. మిగిలిన హెక్టార్లలో ఇతర పంటలు వేయనున్నారు.
 
లక్షలాది మంది నిరీక్షణ
ఏటా ఆరు లక్షల మందికిపైగా రైతులు పంట రుణాలపైనే ఆధారపడి సాగుకు ఉపక్రమిస్తారు. ప్రస్తుతం వీరి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. గత ఆర్థిక సంవత్సరం రూ. రెండు వేల కోట్ల రుణ లక్ష్యానికి రూ.1805.49 కోట్లు అందించారు. ఇందులో జూన్ ఒకటి నుంచి 2014 మే 31 వరకు రూ.1513.82 కోట్లను రూ.లక్షలోపు రుణాలు ఇచ్చారు. వాటిని ప్రభుత్వం మాఫీ చేస్తే 4,77,663 మందికి లబ్ధి చేకూరనుంది. తాజాగా 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.2300 కోట్ల పంట రుణాలిచ్చేందుకు లక్ష్యంగా నిర్దేశించారు. ఖరీఫ్‌లో రూ.1650 కోట్లు, రబీలో రూ.650 కోట్లు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.

ఇప్పటికే నిర్దేశించిన లక్ష్యంలో కనీసం 40 శాతం రుణాలు అందించాలి. కానీ జిల్లాలో ఇప్పటివరకు రుణాల జారీ మొదలే కాలేదు. లక్ష్యం భారీగా ఉన్నా.. బ్యాంకర్లు పైసా కూడా విదిల్చలేదు. జిల్లాలోని ఏడు లక్షల మంది రైతులకు పూర్తిగా రుణాలు ఇవ్వాలంటే కనీసం నాలుగైదు నెలల సమయం పట్టే అవకాశముంది. ప్రస్తుతం సర్కారు ఉత్తర్వులు వచ్చి.. పాత రుణాలను మాఫీ చేసి.. కొత్త రుణాలు ఇచ్చేసరికి కనీసం ఆరు నెలలైనా పడుతుంది. అంటే డిసెంబర్ వరకు రుణాలు అందే వీలులేదు. వ్యవసాయ రుణాలపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రాయితీ వర్తించాలంటే జూలై 20లోపే రుణాలు మంజూరు పూర్తి చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర సర్కారు ఉత్తర్వులతో రుణాల మంజూరు చేసేసరికే ఆ గడువు కాస్తా ముగిసే పరిస్థితి రైతులను కలవరపెడుతోంది. ప్రభుత్వం తొందరగా స్పందించి షరతుల్లేకుండా రుణ మాఫీ అందించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
 -కరీంనగర్ అగ్రికల్చర్

వెంటాడుతున్న ‘ఎల్‌నినో’
ఎల్‌నినో భయం జిల్లా రైతులను వణికిస్తోంది. ఎల్‌నినో ప్రభావం జిల్లాపై ఉంటుందన్న వాతావరణ నిపుణుల హెచ్చరికల మేరకు అకాలవర్షాలు తప్ప అనుకూల వర్షాలు పడే అవకాశం లేదని తెలుస్తోంది. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన వాతావరణ శాఖ నుంచి ఎలాంటి సంకేతాలూ రావడం లేదు. జూలై వరకు వర్షాలరాక ఆలస్యమైతే దిగుబడులపై ప్రభావం చూపుతుందని రైతుల్లో ఆందోళన నెలకొంది. జూన్‌లో ఇప్పటికే రెండు వారాలు పూర్తయ్యాయి. మరో రెండు వారాల్లో మంచి వర్షాలు కురిస్తే సాగు కష్టాల నుంచి గట్టెక్కే ఆస్కారముంది. అయితే ఎల్‌నినో ప్రభావం జిల్లాపై ఉండకపోవచ్చని, వర్షాలు సమృద్ధిగా పడతాయని జేడీఏ ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు.
 
అప్పుల కోసం తిప్పలు
 రైతులు సాగు పనులు మొదలు పెట్టాలంటే ముందుగా కావాల్సింది పెట్టుబడి. బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటేనే ఖరీఫ్ సాగు ముందుకు కదులుతుంది. రుణం కోసం రైతులు బ్యాంకుల గడప తొక్కితే పాత రుణాలు చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తామంటున్నారు. రుణమాఫీపై సర్కారు నుంచి ఆదేశాలు రాకపోవడంతో రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు నిరాకరిస్తున్నారు. సాగుకు ఇప్పటినుంచి పదిరోజులే కీలకం. వర్షాలు పడకముందే రైతులు ఎరువులు, విత్తనాలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది.

చినుకుపడగానే.. దుక్కులు దున్నేందుకు.. విత్తనాలు వేసేందుకు ట్రాక్టర్లు, కూలీలు అవసరమవుతారు. ఇందుకు చేతిలో తప్పనిసరిగా నగదు ఉంచుకోవాల్సిందే. మరోవైపు మాఫీ నిర్ణయం ఎప్పుడు అమలవుతుందో..?     కొత్త రుణాలు ఎప్పుడిస్తారో..? అనే భయం అన్నదాతల్లో నెలకొంది. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తే రైతుల నడ్డి విరగడం ఖాయం.     ఫలితంగా అన్నదాతల్లో తీవ్ర మనోవేదన వ్యక్తమవుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement