
చట్టపరమైన వివాదాలను నివారించడంలో, ఆస్తి లావాదేవీలు సజావుగా జరిగేలా చూడడంలో అసలైన యజమానులు ఎవరో తెలిపే సమగ్ర టైటిట్ సెర్చ్ రిపోర్ట్‌ల ప్రాముఖ్యతను సుప్రీంకోర్టు ఇటీవల నొక్కి చెప్పింది.
బ్యాంకులు రుణం మంజూరు చేసే ముందు టైటిల్ సెర్చ్ రిపోర్టులను సిద్ధం చేయడానికి ప్రామాణికమైన, ఆచరణాత్మక ఫ్రేమ్‌వర్క్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ఇతర వాటాదారులు అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని కోర్టు నొక్కి చెప్పింది. తప్పుడు టైటిల్ సెర్చ్ రిపోర్టు ఆధారంగా రుణాన్ని మంజూరు చేసిన బ్యాంకు అధికారిపై ఎలాంటి చర్యలు ఉండాలన్నది కూడా ఫ్రేమ్‌వర్క్‌లో చేర్చాలని కోర్టు పేర్కొంది.
బ్యాంకులు జాగ్రత్తగా ఉండాలి
"అస్పష్ట టైటిల్ క్లియరెన్స్ రిపోర్ట్‌ల విషయంలో బ్యాంకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. ఇది ప్రజా ధన రక్షణకు, పెద్ద ప్రజా ప్రయోజనానికి సంబంధించినది. అందువల్ల, రుణాలను మంజూరు చేసే ముందు టైటిల్ సెర్చ్ రిపోర్టును సిద్ధం చేయడానికి, ఆమోదించే అధికారి బాధ్యతను (క్రిమినల్ చర్యతో సహా) నిర్ణయించే ఉద్దేశంతో ఒక ప్రామాణిక, ఆచరణాత్మక విధానాన్ని అభివృద్ధి చేయడంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఇతర వాటాదారులు సహకరించడం చాలా అవసరం. అంతే కాకుండా టైటిల్ సెర్చ్ రిపోర్ట్‌లకు సంబంధించిన ఫీజులు, ఖర్చుల కోసం ప్రామాణిక మార్గదర్శకాలు ఉండాలి” అని కోర్టు పేర్కొంది.
వివాదాస్పద తనఖా ఆస్తిపై ఆధారపడి బ్యాంకు మంజూరు చేసిన రుణం, టైటిల్ వివాదాలు ఉన్నట్లు గుర్తించిన సందర్భంలో, అటువంటి ప్రామాణిక ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని జస్టిస్ జెబి పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం నొక్కి చెప్పింది. యాజమాన్యాన్ని ధ్రువీకరించడం, ప్రతికూల క్లెయిమ్‌లు లేవని నిర్ధారించడం, ఆస్తికి సంబంధించిన స్పష్టమైన చట్టపరమైన స్థితిని నిర్ధారించడం ద్వారా బలమైన టైటిల్ సెర్చ్ మోసపూరిత లావాదేవీలను నిరోధించవచ్చని కోర్టు అభిప్రాయపడింది.
బ్యాంకులు రుణం మంజూరు చేసే ముందు టైటిల్ సెర్చ్ రిపోర్ట్‌ను నియంత్రించే స్టాండర్డ్ మెకానిజం అంటూ ఏదీ ఇప్పటి వరకు ఆర్‌బీఐ అభివృద్ధి చేయలేదు. ఎంప్యానెల్ చేసిన న్యాయవాదులు తయారుచేసిన టైటిల్ సెర్చ్ రిపోర్ట్‌పై బ్యాంకులు ఆధారపడుతున్నాయి. టైటిల్ సెర్చ్ రిపోర్ట్ తయారీకి ఎటువంటి ప్రామాణీకరణ లేదు.
Comments
Please login to add a commentAdd a comment