
పెరుగుతున్న విమానయాన జోష్
2027 నాటికి 49 కోట్లకు ప్రయాణికులు
ఏటా 9 శాతం వృద్ధి సాధ్యం
రేటింగ్ ఏజెన్సీ కేర్‌ఎడ్జ్ అంచనాలు
ముంబై: పౌర విమానయానం వృద్ధి వేగాన్ని అందుకుంది. విమాన ప్రయాణికుల సంఖ్య 2024 మార్చి నుంచి ఏటా 9 శాతం చొప్పున పెరుగుతూ.. 2027 మార్చి నాటికి వార్షికంగా 48.5 కోట్లకు చేరుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ ‘కేర్ ఎడ్జ్’ ఒక నివేదిక రూపంలో వెల్లడించింది. 2025–26 నుంచి మరింత పెద్ద విమానాలు అందుబాటులోకి వస్తుండడంతో అంతర్జాతీయ విమాన ప్రయాణికుల రద్దీ మరింత వేగాన్ని అందుకుంటుందని పేర్కొంది. అదే సమయంలో దేశీ విమాన ప్రయాణికుల్లో స్థిరమైన వృద్ధి కనిపిస్తుందని తెలిపింది.
కరోనా అనంతరం విమానయాన రంగం ‘వి’ ఆకారపు రికవరీని (పడిపోయినట్టుగానే పెరగడం) చూసిందని.. కరోనా ముందు నాటి ప్రయాణికులతో పోల్చితే 1.10 రెట్లకు రద్దీ చేరుకున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. విమాన ప్రయాణికుల రద్దీ 2025 మార్చి నాటికి 42.5 కోట్లకు చేరుకుంటుందని లోగడ వేసిన అంచనాలను కేర్‌ఎడ్జ్ సవరించింది. విమానాల డెలివరీలో జాప్యం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో 4 శాతం వృద్ధితో 41 కోట్లకు చేరుతుందని పేర్కొంది. మహాకుంభ మేళా సమయంలో (2024–25 జనవరి–మార్చి) విమానయాన ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలంలో తక్కువ వృద్ధిని భర్తీ చేస్తుందని తెలిపింది.
ఏరో, నాన్ ఏరో ఆదాయాల్లో వృద్ధి..
11 విమానాశ్రయాల ఏరో ఆదాయం (విమాన సర్వీసులు, వాటి అనుబంధ సేవలు) 2024 మార్చి నుంచి 2027 మార్చి మధ్య ఏటా 42 శాతం వృద్ధి చెందుతుందని కేర్‌ఎడ్జ్ నివేదిక అంచనా వేసింది. ఇదే కాలంలో నాన్‌ఏరో ఆదాయం ఏటా 12–14 శాతం చొప్పున పెరుగుతుందని పేర్కొంది. డ్యూటీ ఫ్రీ షాపులు, ఫుడ్, బెవరేజెస్ విక్రయాలు, లాంజ్ సేవల రూపంలో ఈ ఆదాయం ఉంటుందని వివరించింది. భారత ఎయిర్‌పోర్టుల్లో ఒక్కో ప్రయాణికుడి నుంచి వచ్చే నాన్ ఏరో ఆదాయం కంటే.. అంతర్జాతీయంగా విమానాశ్రయాలకు రెట్టింపు ఆదాయం వస్తున్నట్టు తెలిపింది. ఈ ప్రకారం చూస్తే భారత విమానాశ్రయాలకు నాన్ ఏరో ఆదాయం వృద్ధికి చక్కని అవకాశాలున్నట్టు పేర్కొంది. కొన్ని ఎయిర్‌పోర్ట్‌ల్లో చార్జీల పెంపు, ప్రయాణికుల సంఖ్య పెరుగుదల రూపంలో ఈ ఆదాయం 2024–25 నుంచి వృద్ధి వేగాన్ని అందుకుంటుందని వెల్లడించింది.
విస్తరణపై భారీ పెట్టుబడులు
‘‘ప్రయాణికుల రద్దీ ఏటా 9 శాతం వృద్ధికి.. విమాన ప్రయాణానికి బలమైన డిమాండ్‌కుతోడు విమానాశ్రయాలు, ఎయిర్‌లైన్స్ సంస్థలు సామర్థ్యాల విస్తరణ మద్దతుగా నిలవనుంది’’అని కేర్‌ఎడ్జ్ డైరెక్టర్ మౌలేష్ దేశాయ్ వివరించారు. దేశీ ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు, ఎయిర్‌పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా కలసి 2020 మార్చి తర్వాత నుంచి 2024 డిసెంబర్ మధ్య రూ.80,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడాన్ని కేర్‌ఎడ్జ్ తన నివేదికలో ప్రస్తావించింది. ఇందులో 42 శాతం పెట్టుబడులను నాలుగు ప్రాంతాల్లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ల కోసం (కొత్తవి) వెచ్చించినట్టు తెలిపింది.
2025–26 నుంచి 2029–30 మధ్యకాలంలో ఈ రంగంలో మరో రూ.30,000 కోట్ల పెట్టుబడులను కేర్‌ఎడ్జ్ అంచనా వేసింది. ప్రధానంగా బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ల (ప్రస్తుత ఎయిర్‌పోర్టులు) విస్తరణపై ఈ పెట్టుబడులను వెచ్చించొచ్చని అంచనా వేసింది. రూ.25,000 కోట్లతో నిర్మించే రెండు గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లు 2025–26లో కార్యకలాపాలు ప్రారంభించొచ్చని తెలిపింది. పెట్టుబడుల్లో 18 శాతాన్ని నాన్‌ఏరోనాటికల్ అభివృద్ధిపై (ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో వాణిజ్య రియల్ ఎస్టేట్) వెచ్చించొచ్చని అంచనా వేసింది. ఈ విషయంలో సింగపూర్ ఛాంగి విమానాశ్రయాన్ని ఉదహరణగా పేర్కొంది. నాన్ ఏరోనాటికల్ సదుపాయాలపై చేస్తున్న పెట్టుబడుల నుంచి వచ్చే ప్రతిఫలం వాటి రుణ పరపతిని నిర్ణయిస్తుందని తెలిపింది.