
గత అంచనాల తగ్గింపు
అమెరికా ప్రతీకార సుంకాల రిస్క్
అంతర్జాతీయ సంస్థ మూడీస్ అనలైటిక్స్
న్యూఢిల్లీ: అమెరికా ప్రతీకార సుంకాల నేపథ్యంలో భారత జీడీపీ వృద్ధి అంచనాలను ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మూడీస్ అనలైటిక్స్ 0.3 శాతం తగ్గించింది. 2025లో జీడీపీ 6.4 శాతం వృద్ధి చెందుతుందంటూ ఈ ఏడాది మార్చిలో వేసిన అంచనాను 6.1 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. అమెరికా ప్రతీకార సుంకాల వల్ల పడే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని అంచనాలను సవరించింది. భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో అమెరికాను ఒకటిగా పేర్కొంటూ.. భారత ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్‌లు వాణిజ్యానికి అవరోధాలు కల్పిస్తాయని తెలిపింది.
రత్నాభరణాలు, వైద్య పరికరాలు, టెక్స్‌టైల్స్ పరిశ్రమలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. ఎగుమతులు భారత జీడీపీలో అతి స్వల్ప వాటాను కలిగి ఉన్నందున.. మొత్తం మీద భారత వృద్ధి రేటు వెలుపలి రిస్‌్కలకు పెద్దగా ప్రభావితం కాబోదని. స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్నందున ఆర్‌బీఐ రెపో రేటును మరో పావు శాతం మేర తగ్గించొచ్చని.. ఈ ఏడాది చివరికి ఇది 5.75 శాతానికి చేరుకుంటుందని తెలిపింది. దీనికితోడు బడ్జెట్‌లో ప్రకటించిన పన్ను మినహాయింపులు దేశీ ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలుస్తాయని.. దీంతో మొత్తం మీద వృద్ధిపై సుంకాల ప్రతికూల ప్రభావం తక్కువకు పరిమితం అవుతుందని మూడీస్ అనలైటిక్స్ అంచనా వేసింది.
అనిశ్చితులు కొనసాగుతాయి..
చైనా మినహా భారత్ సహా ఇతర దేశాలపై ప్రతీకార సుంకాల అమలును 90 రోజుల పాటు అమెరికా వాయిదా వేయడం గమనార్హం. అయినప్పటికీ అనిశ్చితి కొనసాగుతుందని, ఈక్విటీల్లో ఆటుపోట్లు కొనసాగొచ్చని మూడీస్ అనలైటిక్స్ తెలిపింది. ‘‘పెరుగుతున్న అనిశి్చతిని తక్కువగా అంచనా వేయరాదు. గృహ, వ్యాపార సెంటిమెంట్ తగ్గిపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే మానిటరీ పాలసీ సులభతరం వల్ల ఒనగూరే ప్రయోజనాల ఫలితం తగ్గొచ్చు. అనిశి్చతుల్లో మరింత ఖర్చుకు గృహస్థులు వెనుకాడొచ్చు. వ్యాపార సంస్థలు సైతం అదనపు పెట్టుబడుల విషయంలో వెనక్కి తగ్గొచ్చు’’అని మూడీస్ అనలైటిక్స్ తన నివేదికలో వివరించింది. టారిఫ్‌లతో వాణిజ్య వ్యయాలు పెరిగిపోతాయని, అది అంతర్జాతీయ వృద్ధిని బలహీనపరుస్తుందని అంచనా వేసింది.