India GDP rate
-
5.5 శాతం నుంచి 6.7 శాతానికి అప్
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2023 క్యాలెండర్ ఇయర్ వృద్ది రేటు 5.5 శాతం అంచనాలను రేటింగ్ దిగ్గజ సంస్థ– మూడీస్ భారీగా 6.7 శాతానికి పెంచింది. ఆర్థిక క్రియాశీలత గణనీయంగా మెరుగుపడ్డం దీనికి కారణమని తన తాజా అంతర్జాతీయ స్థూల ఆర్థిక అవుట్‌లుక్ (ఆగస్టు అప్డేట్)లో తెలిపింది. కాగా 2023 హై బేస్ నేపథ్యంలో 2024లో వృద్ధి రేటును 6.5 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. పటిష్ట సేవల రంగం, మూలధన వ్యయాలు ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో భారత్ వృద్ధి రేటు 7.8 శాతం పెరుగుదలకు కారణంగా పేర్కొంది. 2023 ద్వితీయార్థంలో, 2024 ప్రారంభంలో ఎల్‌నినో పరిస్థితులు బలంగా ఉంటే వ్యవసాయ వస్తువుల ధరలు పెరగవచ్చని మూడీస్ అభిప్రాయపడింది. దేశీయ డిమాండ్ పటిష్టంగా ఉంటుందని, ద్రవ్యోల్బణం దేశంలో తట్టుకునే రీతిలోనే ఉండే అవకాశం ఉందని అంచనావేసిన మూడీస్, ఈ నేపథ్యంలో ఆర్బీఐ రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాత) రేట్ల పెంపు ఉండకపోవచ్చని అంచనా వేసింది. జీ20 వృద్ధి తీరు ఇది... జీ–20 దేశాల వృద్ధి 2023లో 2.5 శాతంగా ఉండవచ్చని, 2024లో 2.1 శాతానికి తగ్గవచ్చని అభిప్రాయపడింది. 2022లో ఈ రేటు 2.7 శాతం. 2024 చైనా వృద్ధి రేటును 4.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించడం గమనార్హం. భారత్‌కు మూడీస్ అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ‘బీఏఏ3’ సావరిన్ రేటింగ్‌ను అందిస్తోంది. 2023–24లో వృద్ధి రేటును 6.1 శాతంగా అంచనావేస్తోంది. 2022–23 7.2 శాతం కన్నా ఇది భారీ తగ్గుదల కావడం గమనార్హం. -
ఈ ఏడాది భారత జీడీపీ వృద్ధిరేటు 7 శాతమే!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7 శాతానికి పరిమితం అవుతుందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) తొలి ముందస్తు అంచనాలు వెల్లడించాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (8.7 శాతం) ఇది 1.7 శాతం తక్కువ కావడం గమనార్హం. తయారీ, మైనింగ్ రంగాల పేలవ పనితీరు వృద్ధి రేటు అంచనా భారీ తగ్గుదలకు కారణమని తొలి అంచనాలు వెలువరించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగంలో అసలు వృద్ధిలేకపోగా 1.6 శాతం క్షీణత నమోదవుతుందని ఎన్ఎస్ఓ అంచనా. 2021–22లో ఈ రంగం 9.9% వృద్ధిని నమోదుచేసింది. మొత్తం ఎకానమీలో పారిశ్రామిక రంగం వెయిటేజ్ దాదాపు 15 శాతంకాగా ఇందులో మెజారిటీ వాటా తయారీ రంగానికి కావడం గమనార్హం. ఇక మైనింగ్‌లో కూడా వృద్ధి రేటు 11.5 శాతం నుంచి 2.4%కి పడిపోతుందని అంచనాలు వెలువడ్డం గమనార్హం. కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 6.8% అంచనాలకన్నా కేంద్రం అంచనాలు 20 బేసిస్ పాయింట్లు అధికంగా ఉండడం గమనార్హం. ఎన్ఎస్ఓ ప్రకటనలో ముఖ్యాంశాలు ఇవీ.. ►జీడీపీలో దాదాపు 15 శాతం వాటా కలిగిన వ్యవసాయ రంగంలో వృద్ధి 3.5 శాతంగా ఉండనుంది. 2021–22లో ఈ రేటు 3%. ►ట్రేడ్, హోటెల్, రవాణా, కమ్యూనికేషన్లు,, బ్రాడ్‌కాస్టింగ్ విభాగానికి సంబంధించిన సర్వీసుల వృద్ధి రేటు 11.1 శాతం నుంచి 13.7 శాతానికి చేరనుంది. ►ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సేవలలో వృద్ధి రేటు 4.2% నుంచి 6.4%కి పెరగనుంది. ►అయితే నిర్మాణ రంగంలో వృద్ధి రేటు 11.5%నుంచి 9.1 శాతానికి తగ్గనుంది. ►పబ్లిక్ అడ్మినిస్టేషన్, రక్షణ, ఇతర సేవల వృద్ధి రేటు కూడా 12.6% నుంచి 7.9%కి పడనుంది. ►స్థూల విలువ జోడింపు (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్– జీవీఏ) ప్రాతిపదికన 2022–23లో వృద్ధి రేటు 8.1% నుంచి 6.7%కి తగ్గనుంది. ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రాంతం, పరిశ్రమ లేదా రంగంలో ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవల విలువే జీవీఏ. ఇంకా చెప్పాలంటే జీడీపీలో ఒక నిర్దిష్ట రంగం ఉత్పత్తి తోడ్పాటును జీవీఏ ప్రతిబింబిస్తుంది. అన్ని రంగాల జీవీఏలను కలిపి, పన్నులు– సబ్సిడీలకు సంబంధించి అవసరమైన సర్దుబాటు చేస్తే ఆర్థిక వ్యవస్థ జీడీపీ విలువ వస్తుంది. ఎన్ఎస్ఓ అంచనా విలువల్లో. 2011–12 స్థిర ధరల ప్రాతిపదికన (ద్రవ్యోల్బణం సర్దుబాటు చేస్తూ) వాస్తవ జీడీపీ విలువ 2021–22లో రూ.147.36 లక్షల కోట్లయితే, ఇది 2022–23లో రూ.157.60 లక్షల కోట్లకు పెరగనుందని ఎన్ఎస్ఓ తాజా అంచనా. అంటే వృద్ధి రేటు 7 శాతం అన్నమాట. -
2022–23లో భారత్ వృద్ధి 6.5 శాతమే!
వాషింగ్టన్: భారత్ ఎకానమీ 2022–23 వృద్ధి అంచనాలకు ప్రపంచబ్యాంక్ ఒక శాతం (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) కోత పెట్టింది. జూన్‌లో వేసిన తొలి అంచనా 7.5 శాతాన్ని తాజాగా 6.5 శాతానికి కుదించింది. అంతర్జాతీయ ప్రతికూల అంశాలను దీనికి కారణంగా చూపింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్ వార్షిక సదస్సు నేపథ్యంలో దక్షిణ ఆసియా ఆర్థిక అంశాలపై విడుదలైన నివేదికలో ఈ అంచనాలను వెలువరించింది. అయితే ప్రపంచంలో ఇతర దేశాలతో పోల్చితే భారత్ ఎకానమీ రికవరీ పటిష్టంగా ఉందని ప్రపంచ బ్యాంక్ అభిప్రాయపడింది. మహమ్మారి సవాళ్ల నుంచి, తీవ్ర క్షీణత నుంచి ఎకానమీ బయటపడిందని ప్రశంసించారు. దక్షిణాసియాకు సంబంధించి ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ హన్స్ టిమ్మర్ నివేదికలోని ముఖ్యాంశాలను వెల్లడించారు. వాటిలో కొన్ని... ►భారీ అంతర్జాతీయ రుణ భారాలు లేవు. అటువైపు నుంచి సవాళ్లు ఏమీ లేవు. పటిష్ట ద్రవ్య పరపతి విధానాన్ని అవలంభిస్తోంది. ►సేవలు, సేవలు రంగాల ఎగుమతులు ఆర్థిక వ్యవస్థకు మంచి మద్దతును ఇస్తున్నాయి. ►అంతర్జాతీయ ప్రతికూల అంశాలే వృద్ధి రేటు తాజా తగ్గింపునకు కారణం. ►ద్రవ్యోల్బణం తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ►డిజిటల్ ఆలోచనలన ఉపయోగించుకుని సామాజిక భద్రతా వ్యవస్థను విస్తరించడంలో మిగిలిన ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలుస్తోంది. ►గోధుమల ఎగుమతిపై నిషేధం, బియ్యం ఎగుమతులపై అధిక టారిఫ్‌ల విధింపు వంటి ప్రభుత్వ చర్యలను సమర్థింలేం. స్వల్పకాలంలో అవి దేశీయంగా ఆహార భద్రతకు దారితీసినా, దీర్ఘకాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి విధానాలు ప్రతికూలతకు దారితీయవచ్చు. ►కార్మిక మార్కెట్, ఎకానమీలో మరింతమంది ప్రజలను భాగస్వాములుగా చేయడం భారత్ తక్షణ అవసరం. -
చెక్కుచెదరని భారత్ వృద్ధి వేగం
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) భారత్ స్థూల దేశీయోత్పత్తి 13.5 శాతంగా నమోదయ్యింది. గడచిన ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో (2021 ఏప్రిల్-జూన్) ఎకానమీ వృద్ధి రేటు 20.1 శాతంకాగా, మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో (జనవరి-మార్చి)లో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు కేవలం 4.09 శాతంగా నమోదయ్యింది. వినియోగం, సేవలుసహా పలు రంగాల్లో దేశీయ డిమాండ్ పటిష్టంగా ఉందని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఇక ఉత్పత్తి స్థాయి వరకూ విలువను పరిశీలనలోకి తీసుకునే గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ)ను తీసుకుంటే మొదటి త్రైమాసి కంలో 12.7 శాతంగా నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వృద్ధి రేటు 17.6%. 13.5 శాతం వృద్ధి అంటే.. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) ప్రకారం, 2021–22లో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ (2011-12 స్థిర ధరల ప్రాతిపదికన) విలువ రూ.32.46 లక్షల కోట్లు. తాజా సమీక్షా త్రైమాసికంలో ఈ విలువ రూ.36.85 లక్షల కోట్లు. వెరసి వృద్ధి రేటు 13.5 శాతంగా ఉంది. ఇక జీవీఏను విలువను తీసుకుంటే, ఇది 12.7 శాతం వృద్ధితో రూ.34.41 లక్షల కోట్లుగా ఉంది. కాగా ద్రవ్యోల్బణం పెరుగుదలతో సర్దుబాటు చేయని నామినల్ జీడీపీ (కరంట్ ప్రైసెస్ వద్ద) విలువ మొదటి త్రైమాసికంలో 26.7 శాతం ఎగసి రూ.51.27 లక్షల కోట్ల నుంచి రూ.64.95 లక్షల కోట్లకు ఎగసిందని ఎన్ఎస్ఓ పేర్కొంది. సవాళ్లు ఉన్నాయ్... రానున్న త్రైమాసికాల్లో వృద్ధి తీరుపై ఆందోళనలు నెలకొన్నాయి. వ్యవస్థపై ద్రవ్యోల్బణం సవాళ్లు, వడ్డీరేట్ల భారం, ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థలకు మాంద్యం భయాలు వంటివి ఇక్కడ ప్రధానమైనవి. మొదటి త్రైమాసికంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలకన్నా తక్కువగా వృద్ధి రేటు నమోదవడం గమనార్హం. 2022-23లో జీడీపీ 7.2 శాతంగా అంచనా. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో 16.2 శాతం, 6.2 శాతం, 4.1 శాతం, 4 శాతం వృద్ధి రేట్లు నమోదవుతాయని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ భావిస్తోంది. సమీక్షా కాలంలో తయారీ రంగం 4.8 శాతంగా నమోదుకావడం ఆందోళన కలిగించే విషయం. ఇక ఎగుమతులకన్నా, దిగుమతుల పరిమాణం ఎక్కువగా ఉండడమూ సమస్యాత్మకమే. దీనికితోడు వర్షపాతం దేశ వ్యాప్తంగా విస్తృత ప్రాతిపదికన తగిన విధంగా లేనందున వ్యవసాయ వృద్ధి, గ్రామీణ డిమాండ్, ద్రవ్యోల్బణంపై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. గడచిన ఆరు నెలలుగా ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ఆరు శాతానికి పైబడి నమోదవుతుండడంతో మే నుంచి ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను 1.40 శాతం పెంచింది. దీనితో ఈ రేటు 5.4 శాతానికి చేరింది. బ్యాంకులు కూడా వడ్డీరేట్ల పెంపు బాటన నడవడం ప్రారంభించాయి. 7-7.5 శాతం శ్రేణిలో ఉండవచ్చు: కేంద్రం భారత్ ఎకానమీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7 నుంచి 7.5 శాతం శ్రేణిలో నమోదుకావచ్చని కేంద్రం భావిస్తోంది. 2021-22లో భారత్ 8.7 శాతం వృద్ధి నమోదుచేసుకుంది. ‘‘మొదటి త్రైమాసిక గణాంకాలు మేము ఆశించిన తీరులోనే ఉన్నాయి. వివిధ రంగాల పనితీరు పూర్తిస్థాయి ఆశాజనకంగా ఉంది. వృద్ధి రేటు 7-7.5 శాతం శ్రేణిలో ఉంటుందని భావిస్తున్నాం. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలుసైతం ఇదే అంచనాలను వెలిబుచ్చుతున్నాయి’’ అని ఫైనాన్స్ కార్యదర్శి టీవీ సోమనాథన్ పేర్కొన్నారు. -
‘ఫిచ్ రేటింగ్స్’: దేశ జీడీపీ భారీగా తగ్గింపు, కరోనా వల్లే
న్యూఢిల్లీ: భారత్ జీడీపీ అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 8.7 శాతానికి తగ్గిస్తూ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ‘ఫిచ్ రేటింగ్స్’ తన నిర్ణయాన్ని ప్రకటించింది. కరోనా రెండో విడత ఎక్కువ కాలం పాటు ఉండడాన్ని తన అంచనాల తగ్గింపునకు దారితీసిన అంశంగా ఫిచ్ తెలిపింది. భారత్ జీడీపీ 10 శాతం మేర ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) వృద్ధిని నమోదు చేయవచ్చని ఈ ఏడాది జూన్‌లో ఫిచ్ అంచనా వేయడం గమనార్హం. అప్పుడు కూడా అంతక్రితం అంచనాలను గణనీయంగా తగ్గించేసింది. అంతకుముందు వేసిన అంచనా 12.8 శాతంగా ఉంది. కరోనా దెబ్బకు 2020–21లో దేశ జీడీపీ మైనస్ 7.3 శాతానికి పడిపోవడం తెలిసిందే. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2019–20)లోనూ వృద్ధి 4 శాతానికి పరిమితం అయింది. ‘‘మా అభిప్రాయం మేరకు.. కరోనా రెండో విడత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం కంటే.. నిదానించేలా చేసింది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాలను ఈ ఏడాది జూన్‌లో వేసిన 8.5 శాతం నుంచి 10 శాతానికి పెంచుతున్నాం’’ అని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. ద్రవ్యలోటు భారీగా.. ద్రవ్యలోటు కూడా ఎక్కువగానే ఉంటుందని ఫిచ్ రేటింగ్స్ భావిస్తోంది. జీడీపీలో 7.2 శాతంగా (పెట్టుబడుల ఉపసంహరణను మినహాయించి చూస్తే) ఉండొచ్చని తన తాజా నివేదికలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్ 28న ఒక ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించడం గమనార్హం. దీని ప్రభావం జీడీపీలో 2.7 శాతం మేర ఉంటుందని ఫిచ్ అంచనా. ‘‘అయినప్పటికీ ఆదాయం మంచిగా పురోగమిస్తే కనుక అధిక వ్యయాల భారాన్ని అధిగమించొచ్చు. అప్పుడు ద్రవ్యలోటు కట్టడి సాధ్యపడుతుంది. ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం ఆర్బీఐ గరిష్ట పరిమిత లక్ష్యం (2–6) స్థాయిలోనే ఉండొచ్చు. అయితే ఇది మోస్తరు స్థాయికి చేరుతుంది. దీంతో ఆర్బీఐ వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు రేట్లను ఇదే స్థాయిలో కొనసాగించొచ్చని అంచనా వేస్తున్నాం’’ అని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. అలా అయితే కష్టం.. ప్రభుత్వం కనుక ద్రవ్యలోటును తగినంత స్థాయిలో కట్టడి చేయలేకపోతే అప్పుడు రుణ భారం/జీడీపీ రేషియో మరింత దిగజారుతుందని.. అది జీడీపీ వృద్ధిని బలహీనం చేయవచ్చని ఫిచ్ అభిప్రాయపడింది. కరోనా మహమ్మారి తర్వాత ప్రభుత్వం సాధారణ రుణ భారాన్ని బీబీబీ స్థాయికి తగ్గించేందుకు.. విశ్వసనీయమైన మధ్యకాలిక ద్రవ్యలోటు విధానాన్ని అమలు చేయడం సానుకూలంగా పేర్కొంది. అదే విధంగా స్థిరమైన అధికస్థాయి పెట్టుబడులు, గరిష్ట వృద్ధి రేటును మధ్యకాలానికి.. ఎటువంటి స్థూల ఆర్థిక అసమానతలు లేకుండా నమోదు చేయడం, నిర్మాణాత్మక సంస్కరణలను విజయవంతంగా అమలు చేయడం కూడా సానుకూలిస్తుందని ఫిచ్ అంచనా వేసింది. ఇతర అంచనాలు.. ఆర్బీఐ సైతం ఈ ఏడాది జూలై నాటి సమీక్షలో దేశ జీడీపీ వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 9.5 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత్ జీడీపీ 9.5 శాతం స్థాయిలో ఉంటుందని అంచనా వేయగా.. మూడిస్ 9.3 శాతంగా పేర్కొంది. ప్రపంచబ్యాంకు కూడా 10.1 శాతం నుంచి 8.3 శాతానికి అంచనాలను సవరించింది. వృద్ధి 9.1%: ఫిక్కీ 2021–22లో దేశ జీడీపీ 9.1% వృద్ధిని సాధిం చొచ్చని ఫిక్కీ ఎకనమిక్ అవుట్‌లుక్ సర్వే తెలిపింది. కరోనా రెండో విడత నుంచి ఆర్థిక వ్యవస్థ మంచిగా పుంజుకుంటుండడం వృద్ధికి మద్దతునిస్తుందని పేర్కొంది. అయితే దీపావళి సమయంలో ప్రజల రాకపోకలు ఎక్కువ అవ్వడం వల్ల కరోనా ఇన్ఫెక్షన్ కేసులు పెరిగిపోవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది జూలైలో నిర్వహించిన ఫిక్కీ సర్వేలో వృద్ధి 9 శాతంగా ఉంటుందన్న అంచనాలు వ్యక్తం కావడం గమనార్హం. నైరుతి సీజన్ చివర్లో వర్షాలు మంచిగా పుం జుకోవడం, ఖరీఫ్‌లో సాగు పెరగడం వృద్ధి అంచనాలకు మద్దతునిస్తాయని ఫిక్కీ తెలిపింది. రెండో త్రైమాసికం జీడీపీ గణాంకాలు, పండుగల సీజన్లో విక్రయాలు ఆర్థిక వ్యవస్థ రికవరీపై స్పష్టతనిస్తాయని పేర్కొంది. -
వృద్ధి క్షీణత 7.3 శాతం : ఎస్బీఐ
ముంబై: భారత్ ఎకానమీ 2020-21 ఆర్థిక సంవత్సరం గణాంకాలు ఈ నెల 31వ తేదీన వెలువడుతున్న నేపథ్యంలో దీనిపై అంచనాలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఎస్బీఐ రిసెర్చ్ నివేదిక ‘ఎకోర్యాప్’ తన తాజా అంచనాలను వెలువరించింది. ఆర్థిక సంవత్సరంలో 7.3% క్షీణత నమోదవుతుందని (క్రితం అంచనా 7.4%) తాజాగా పేర్కొంది. నాల్గవ త్రైమాసికంలో 1.3 శాతం వృద్ధి ఉంటుందని అంచనావేసింది. రేటింగ్ ఏజన్నీ ఇక్రా ఇప్పటికే ఈ అంచనాలను వరుసగా 7.3 శాతం, 2 శాతంగా అంచనావేసిన సంగతి తెలిసిందే. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో దేశ వ్యాప్త కఠిన లాక్డౌన్ అమలు జరిగింది. ఈ పరిస్థితి ఆర్థిక సంవత్సరం మొదటి (-24.4%), రెండు (-7.3%) త్రైమాసికాల్లో ఎకానమీని క్షీణతలోకి తోసింది. అయితే లాక్డౌన్ ఆంక్షలు తొలగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకోవడంతో మూడవ త్రైమాసికంలో 0.4% స్వల్ప వృద్ధి నమోదయ్యింది. ఎస్బీఐ రిసెర్చ్ తాజా అంచనాలు.. స్టేట్ బ్యాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీడర్షిప్, కోల్‌కతా భాగస్వామ్యంతో 41 హై ఫ్రీక్వెన్సీ సూచీ కదలికల అధ్యయనం ప్రాతిపదికన తాజా అంచనాలు వెలువడ్డాయి. ఇందులో సేవలు, పారిశ్రామిక రంగ క్రియాశీలత, గ్లోబల్ ఎకానమీ వంటి అంశాలు ఉన్నాయి. ఇప్పటికే జీడీపీ గణాంకాలను ప్రకటించిన 25 దేశాల లెక్కలను పరిశీలిస్తే, వేగంగా అభివృద్ధి చెందిన దేశాల వరుసలో భారత్ ఐదవ స్థానంలో నిలవనుంది. కఠిన లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో భారత్ నామినల్ జీడీపీ (బేస్ ఇయర్ ప్రాతిపదికన ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేయనిది) 2020-21 మొదటి త్రైమాసికంలో రూ.11 లక్షల కోట్లను నష్టపోయింది. అయితే 2021-22 క్యూ1లో ఈ నష్టం రూ.6 లక్షల కోట్లే ఉంటుందన్నది అంచనా. వృద్ధి 7.7 శాతమే: బార్క్లేస్ భారత్ ఆర్థిక వ్యవస్థ 2021-22 వృద్ధి తొలి అంచనాలకు బ్రిటిష్ బ్రోకరేజ్ సంస్థ- బార్క్లేస్ మంగళవారం కోత పెట్టింది. క్రితం అంచనాలకు 80 బేసిస్ పాయింట్లు తగ్గించి (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) 9.2 శాతానికి కుదించింది. థర్డ్ వేవ్ సంక్షోభం తలెత్తి లాక్డౌన్లు మరో మూడు కొనసాగడం, వ్యాక్సినేషనలో ఆలస్యం వంటి సవాళ్లు తలెత్తితే వృద్ధి రేటు 7.7 శాతానికి పడిపోతుందని కూడా అంచనా వేసింది. తొలుత ఊహించిన దానికన్నా తీవ్రంగా సెకండ్ వేవ్ సవాళ్లు ఉన్నాయని విశ్లేషించింది. ఇప్పటికే పలు రేటింగ్, బ్రోకరేజ్ సంస్థలు 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధికి సంబంధించి తమ తొలి అంచనాలను సవరించాయి. ఇక్రా (10.5 శాతం నుంచి 11 శాతానికి ) కేర్ (10.2 శాతం నుంచి 10.7 శాతానికి) ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (10.1 శాతం నుంచి 10.4 శాతానికి) ఎస్బీఐ రిసెర్చ్ (10.4 శాతం నుంచి 11 శాతానికి) ఆక్స్ఫర్డ్ ఎకానమీస్ (11.8 శాతం నుంచి 10.2 శాతానికి) బ్రిక్‌వర్క్ రేటింగ్స్ (11 శాతం నుంచి 9 శాతానికి) వంటివి ఇందులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బార్క్లేస్ తాజా అంచనాలను పరిశీలిస్తే.. కరోనా సెకండ్‌వేవ్ నేపథ్యంలో స్థానిక లాక్డౌన్లు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారత్ వ్యాక్సినేషన్ కార్యక్రమం చాలా నెమ్మదించింది. వ్యాక్సినేషన్ మరింత విస్తృతం కావాల్సిన అవసరం ఉంది. వృద్ధికి సంబంధించి మధ్యకాలికంగా ప్రభావితం చూపే అంశమిది. ప్రత్యేకించి ఇక్కడ థర్డ్ వేవ్ ఆందోళనలూ తలెత్తుతుండడం గమనార్హం. సరఫరా, రవాణా రంగాలు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. పరిస్థితిని చూస్తుంటే, సెపె్టంబర్ త్రైమాసికంలోనే పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ వరకూ స్థానిక లాక్డౌన్లు కొనసాగితే ఎకానమీకి 38.4 బిలియన్ డాలర్ల నష్టం జరుగుతుంది. -
2021-22 వృద్ధి రేటు అంచనాలను భారీగా కోత
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో భారత్ 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి భారీ వృద్ధి అంచనాలకు భారీగా కోతపెడుతున్న సంస్థల జాబితాలో తాజాగా అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ మూడీస్ చేరింది. ఫిబ్రవరిలో వేసిన 13.7 శాతం వృద్ధి అంచనాలను భారీగా 4.4 శాతం తగ్గించి 9.3 శాతానికి కుదించింది. తాజా పరిస్థితులు ఎకానమీ రికవరీకి తీవ్ర అడ్డంకిగా మారాయని మూడీస్ పేర్కొంది. ఈ ప్రతికూల ప్రభావం దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందనీ హెచ్చరించింది. మూడీస్ ప్రస్తుతం ఇతర రేటింగ్ దిగ్గజ సంస్థలు- ఎస్అండ్పీ, ఫిచ్ తరహాలోనే భారత్‌కు ‘చెత్త’ స్టేటస్‌కు ఒక అంచె ఎక్కువగా ‘నెగటివ్ అవుట్‌లుక్‌తో బీఏఏ3’ రేటింగ్‌ను ఇస్తోంది. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25-ఏప్రిల్ 14, ఏప్రిల్ 15-మే 3, మే 4-మే 17, మే 18-మే 31) దేశ వ్యాప్త కఠిన లాక్డౌన్ అమలు జరిగింది. ఈ పరిస్థితి ఆర్థిక సంవత్సరం మొదటి (-24.4 శాతం), రెండు (-7.3 శాతం) త్రైమాసికాల్లో ఎకానమీని క్షీణతలోకి తోసింది. అయితే లాక్డౌన్ ఆంక్షలు తొలగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకోవడంతో మూడవ త్రైమాసికంలో 0.4 శాతం స్వల్ప వృద్ధి నమోదయ్యింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం వరకూ క్షీణరేటు నమోదయ్యే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. నాల్గవ త్రైమాసికంలో పరిస్థితి కుదుటపడుతున్నట్లు కనిపించినా ఊహించని రీతిలో కరోనా సెకండ్ వేవ్ దేశంలో విజృంభించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో మూడీస్ భారత్ ఆర్థిక వ్యవస్థపై మంగళవారం విడుదల చేసిన నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే.. అధిక రుణ భారం (జీడీపీలో దాదాపు 90 శాతానికి చేరుతుందన్న అంచనా) బలహీన ఫైనాన్షియల్ వ్యవస్థలు సార్వభౌమ క్రెడిట్ ప్రొఫైల్‌పై ఒత్తిడులను తీవ్రతరం చేస్తున్నాయి. సెకండ్ వేవ్‌తో ఉత్పన్నమైన పరిస్థితలు భారత్ ఆరోగ్య వ్యవస్థపై ప్రతికూలను చూపుతున్నాయి. ఆసుపత్రులు క్రిక్కిరిసిపోయిన పరిస్థితి. మెడికల్ సరఫరాల్లో తీవ్ర కొరత ఏర్పడుతోంది. వివిధ రాష్ట్రాల్లో స్థానిక ఆంక్షలు, నైట్ కర్ఫ్యూలు, లాక్డౌన్లు కొనసాగుతున్నప్పటికీ ఆర్థిక వ్యవస్థపై 2020 తరహా తీవ్ర పర్యవసానాలు ఉండబోవు. ఆయా స్థానిక చర్యలు స్వల్పకాలమే కొనసాగే అవకాశం ఉండడం, వ్యాపారాలు, వినియోగదారులు కరోనాతో కలిసి పనిచేయడానికి మార్గాలను అన్వేషిస్తుండటం దీనికి కారణం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాలు 7.9 శాతంగా ఉండే వీలుంది. దీర్ఘకాలంలో 6 శాతంగా ఉండవచ్చు. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనడంలో విధాన నిర్ణయ సంస్థలు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఇక ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2021-22లో 10.8 శాతం ఉంటుందని క్రితం వేసిన అంచనాలు మరింతగా 11.8 శాతానికి పెంపు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 90 శాతంగా ఉండే అవకాశం ఉన్న రుణ భారం 2023లో 92 శాతానికి ఎగసే అవకాశాలు ఉన్నాయి. మరో రెండు దిగ్గజ రేటింగ్ సంస్థలు ఇలా... ఎస్అండ్పీ గ్లోబల్ 2021-22 ఆర్థిక సంవత్సరం 11 శాతం వృద్ధి తొలి (మార్చి) అంచనాలను దిగువముఖంగా సవరిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. కరోనా కొత్త కేసులు మే చివరినాటికి గరిష్టానికి చేరి, అక్కడినుంచీ పెరక్కుండా తగ్గుతూ వస్తే, భారత్ 9.8 శాతం వృద్ధి సాధిస్తుందని తెలిపింది. అయితే జూన్ చివరి వరకూ ఈ పరిస్థితి లేకపోతే 8.2 శాతానికి కూడా వృద్ధి పడిపోయే అవకాశం ఉందని విశ్లేషించింది. భారత్‌కు ఎస్అండ్పీ 13 సంవత్సరాలుగా స్టేబుల్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ-’ రేటింగ్‌ను ఇస్తోంది. రెండేళ్లు ఈ రేటు మార్చబోమని కూడా ఇటీవలే భరోసా ఇచ్చింది. ఇక ఫిచ్ రేటింగ్స్ అంచనా ఇప్పటి వరకూ 2021-22లో 12.8 శాతంగా కొనసాగుతోంది. అయితే 2022-23లో ఇది 5.8 శాతానికి తగ్గుతుందని విశ్లేషించింది. ఫిచ్ దేశానికి నెగటివ్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ–’ అవుట్‌లుక్ ఇస్తోంది. అయితే ఫిచ్ గ్రూప్ సంస్థ- ఫిచ్ సొల్యూషన్ మాత్రం 2020-21 వృద్ధి అంచనాలను ఇప్పటికే 12.8 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గించింది. కోతల బాటనే నోమురా జపాన్ బ్రోకరేజ్ దిగ్గజం- నోమురా కూడా భారత్ 2021-22 వృద్ధి అంచనాలకు భారీ కోత పెట్టింది. తొలి 12.6 శాతం అంచనాలను 10.8 శాతానికి కుదించింది. ఆర్థిక క్రియాశీలతకు సంబంధించి తన ప్రొప్రైటరీ ఇండెక్స్ మే 9వ తేదీతో ముగిసిన వారంలో 64.5 శాతానికి పడిపోయినట్లు తెలిపింది. వారం వారీగా ఇది 5 శాతం పతనమని పేర్కొన్న నోమురా, 2020 జూన్ నాటి పరిస్థితికి ఆర్థిక క్రియాశీలత జారిపోయిందని తెలిపింది. ఇండెక్స్‌లో భాగమైన రవాణా విభాగం 10 శాతం పడిపోయిందనీ, విద్యుత్ డిమాండ్ 4.1 శాతం తగ్గిందని వివరించింది. పలు రాష్ట్రాల్లో లాక్డౌన్లు ఎకానమీ రికవరీకి తీవ్ర విఘాతంగా ఉందని పేర్కొంది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని వివరించింది. తద్వారానే మహమ్మారి వేగాన్ని నియంత్రించవచ్చని సూచించింది. దేశంలో ఆరోగ్య రంగంపై వ్యయాలు మరింత పెంపుపై దృష్టి సారించాల్సిన తక్షణ అవసరాన్ని ప్రస్తుత పరిస్థితి ఉద్ఘాటిస్తోందని తన తాజా నివేదికలో అభిప్రాయపడింది. కేర్ అంచనాలు... నాల్గవసారి! కేర్ రేటింగ్స్ మంగళవారం మరోసారి భారత్ 2021-22 వృద్ధి అంచనాలను సవరించింది. 10.2 శాతం నుంచి 9.2 శాతానికి అంచనాలను తగ్గిస్తున్నట్లు పేర్కొంది. 2021 మార్చి 24న సంస్థ 11 నుంచి 11.2 శాతం అంచనాలను వెలువరించింది. సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏప్రిల్ 5న 10.7 శాతానికి తగ్గించింది. ఏప్రిల్ 21న మరింతగా 10.2 శాతానికి సవరించింది. తీవ్ర జీవనోపాధి సంక్షోభం దిశగా భారత్! భారత్ ‘తీవ్ర జీవనోపాధి సంక్షోభం’ దిశగా పయనించే అవకాశం ఉందని బెల్జియంకు చెందిన ఇండియన్ ఎకనమిస్ట్ ప్రముఖ ఎకనమిస్ట్ జీన్ డ్రెజ్ హెచ్చరించారు. సెకండ్‌వేవ్ తీవ్రత, రాష్ట్రాల స్థానిక ఆంక్షలు, లాక్డౌన్ల నేపథ్యం- శ్రామిక వర్గంపై పిడుగుపాటుగా మారవచ్చని ఒక ఇంటర్వ్యూలో సూచించారు. ఇప్పటికే పలు రాష్ట్రాల ఆంక్షల వల్ల ఏర్పడిన పరిస్థితి ‘దాదాపు జాతీయ లాక్డౌన్’ను తలపిస్తోందని అన్నారు. 2024–25 నాటికి భారత్‌ను ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా నడిపించాలన్న ప్రభుత్వ లక్ష్యం ‘‘సాకారమయ్యే’’ అవకాశమే లేదని అన్నారు. దేశానికి సంబంధించి భారత్‌లో కొన్ని వర్గాల ‘‘సూపర్–పవర్ ఆశయాలు’’ సాధ్యమబోవని అభిప్రాయపడ్డారు. శ్రామిక వర్గం పరిస్థితి 2020కన్నా ప్రస్తుతం భిన్నంగా ఏమీ లేదని అన్నారు. గత యూపీఏ ప్రభుత్వానికి సలహాలను ఇచ్చిన జాతీయ సలహా మండలి (ఎన్ఏసీ)లో జీన్ డ్రెజ్ సభ్యుడు కావడం గమనార్హం. భారత్ కష్టాల్లో ఉంటే ప్రపంచానికీ కష్టమే : నిషా దేశాయ్ బిస్వాల్ వాషింగ్టన్: భారత్ కష్టాల్లో ఉంటే ప్రపంచానికి కూడా కష్టకాలంగానే ఉంటుందని అమెరికా-భారత్ బిజినెస్ కౌన్సిల్ (యూఎస్ఐబీసీ) ప్రెసిడెంట్ నిషా దేశాయ్ బిస్వాల్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే భారత్‌లో కరోనా వైరస్ పరమైన పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని తెలియగానే అమెరికా కార్పొరేట్ సంస్థలు అసాధారణ స్థాయిలో తోడ్పాటు అందించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయని పేర్కొన్నారు. మహమ్మారిపై పోరాటానికి టాప్ 40 కంపెనీల సీఈవోలతో కొత్తగా గ్లోబల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటైనట్లు తెలిపారు. భారత్ మళ్లీ పుంజుకుంటుంది: ఐక్యరాజ్యసమితి ఐక్యరాజ్యసమితి: భారత్ 2022లో తిరిగి ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఐక్యరాజ్యసమితి మంగళవారం ప్రకటించింది. భారత జీడీపీ 10.1 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది. 2021 సంవత్సరానికి మాత్రం భారత వృద్ధి అవకాశాలు చాలా బలహీనంగా ఉన్నట్టు పేర్కొంది. కరోనా మహమ్మారికి నూతన కేంద్రంగా భాతర్ మారడమే ఇందుకు కారణమని తెలిపింది. ఈ మేరకు ప్రపంచ ఆర్థిక స్థితిపై వార్షిక మధ్యంత నివేదికను మంగళవారం విడుదల చేసింది. చదవండి: ఈ మొబైల్ ఫోన్‌పై ఏకంగా రూ. 60 వేలు తగ్గింపు -
వృద్ధి అంచనాలు కట్!!
వాషింగ్టన్: పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీపరమైన ప్రతికూల అంశాల నేపథ్యంలో అంతర్జాతీయ సంస్థలు ఒక్కొక్కటిగా భారత వృద్ధి అంచనాలు తగ్గిస్తున్నాయి. తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు 7 శాతానికే పరిమితం కాగలదని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. గతంలో ఇది 7.2 శాతంగా ఉండొచ్చని అంచనాలున్నాయి. పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్నుల (జీఎస్టీ) విధానం అమలుతో తలెత్తిన సమస్యలు ఇందుకు కారణం కాగలవని కుదిస్తున్నట్లు పేర్కొంది. జీఎస్టీ అమల్లోకి వచ్చాక.. తయారీ, సేవల రంగం కార్యకలాపాలు గణనీయంగా తగ్గిన దాఖలాలు కనిపిస్తున్నట్లు తెలిపింది. ఇక అంతర్గతంగా అడ్డంకుల కారణంగా ప్రైవేట్ పెట్టుబడులు మందగించాయని, ఇది దేశ వృద్ధి అవకాశాలపై మరింతగా ఒత్తిడి పెంచగలదని హెచ్చరించింది. రెండేళ్లకోసారి విడుదల చేసే దక్షిణాసియా ఆర్థిక స్థితిగతుల నివేదికలో ప్రపంచబ్యాంకు ఈ అంశాలు వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధి రేటు మూడేళ్ల కనిష్టమైన 5.7 శాతానికి మందగించిన నేపథ్యంలో తాజా అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సైతం భారత వృద్ధి అంచనాలను 6.7 శాతానికి కుదించిన సంగతి తెలిసిందే. ఇది గతంలోని రెండు అంచనాల కన్నా అర శాతం, చైనా అంచనాలైన 6.8 శాతం కన్నా తక్కువ కావడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు 7.1 శాతంగా నమోదైంది. 2018లో 7.3 శాతం.. పెద్ద నోట్ల రద్దుతో కలిగిన అంతరాయాలు, జీఎస్టీపై అనిశ్చితి మొదలైన అంశాలతో భారత వృద్ధి వేగంపై ప్రతికూల ప్రభావం పడిందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. అయితే, ప్రైవేట్, ప్రభుత్వ వ్యయాల మధ్య సమతౌల్యత ఉండేలా తగు విధానాలు పాటిస్తే 2018లో వృద్ధి కొంత మెరుగుపడి 7.3 శాతం స్థాయికి చేరగలదని ప్రపంచ బ్యాంకు తెలిపింది. నిలకడగా వృద్ధి సాధిస్తుంటే పేదరికం తగ్గుముఖం పడుతుందని, అయితే అసంఘటిత ఎకానమీకి ప్రయోజనం చేకూర్చే చర్యలపై ప్రభుత్వం మరింతగా దృష్టి సారించాల్సి ఉందని పేర్కొంది. దక్షిణాసియాపైనా ప్రభావం.. భారత వృద్ధి రేటు మందగించడం అటు మొత్తం దక్షిణాసియా ప్రాంత వృద్ధి రేటుపైనా ప్రతికూల భావం చూపిందని వరల్డ్ బ్యాంకు తెలిపింది. ఫలితంగా తూర్పు ఆసియా.. పసిఫిక్ తర్వాత రెండో స్థానానికి దక్షిణాసియా పడిపోయిందని వివరించింది. 2015–16లో 8%గా ఉన్న వాస్తవ జీడీపీ గత ఆర్థిక సంవత్సరం 7.1 %కి, అటుపైన ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 5.7%కి తగ్గిందని తెలిపింది. 7వ వేతన సవరణ కమిషన్ సిఫార్సుల అమలు, సాధారణ వర్షపాతంతో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండు మొదలైన వాటి ఊతంతో ప్రభుత్వ, ప్రైవేట్ వినియోగం పెరిగినప్పటికీ.. ప్రభుత్వపరమైన పెట్టుబడులు తగ్గడంతో స్థూలంగా డిమాండ్ మందగించిందని బ్యాంకు వివరించింది. 2018 ప్రారంభంలోనూ జీఎస్టీ వల్ల ఆర్థిక అనిశ్చితి ఉండనున్నప్పటికీ.. వృద్ధి గతి కొంత పుంజుకోగలదని తెలిపింది. మొత్తం మీద 2020 నాటికి వృద్ధి క్రమక్రమంగా మెరుగుపడి 7.4 శాతం స్థాయికి చేరుకోగలదని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఇటీవల ప్రభుత్వ పెట్టుబడుల పెరుగుదల ఊతంతో ప్రైవేట్ పెట్టుబడుల రికవరీ, పెట్టుబడులకు అనువుగా పరిస్థితులు మెరుగుపడటం వంటివి ఇందుకు తోడ్పడగలవని తెలిపింది. జీఎస్టీ, దివాలా కోడ్ అమలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణకు తీసుకునే చర్యలు మొదలైనవి పెట్టుబడులకు అనువైన పరిస్థితుల కల్పనకు దోహదపడగలవని అభిప్రాయపడింది. డౌన్‌గ్రేడ్ స్వల్పకాలికమైనదే: ఐఎంఎఫ్ ఈ ఏడాది భారత వృద్ధి మందగించవచ్చన్న తమ అంచనాలు చాలా స్వల్పకాలికమైనవేనని, స్థూలంగా చూస్తే దీర్ఘకాలికంగా దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి అత్యంత సానుకూలంగానే ఉందని ఐఎంఎఫ్ ఎకనమిక్ కౌన్సిలర్ మారిస్ ఓస్ట్‌ఫెల్డ్ పేర్కొన్నారు. ఆ అంచనాలన్నీ తప్పులతడకలే: రతిన్ రాయ్ న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ భారత వృద్ధి అంచనాలను కుదించడాన్ని ప్రముఖ ఆర్థికవేత్త, ప్రధాని ఆర్థిక సలహా మండలి(ఈఏసీ–పీఎం) సభ్యుడు రతిన్ రాయ్ తోసిపుచ్చారు. ఆయా సంస్థల అంచనాలు అప్పుడప్పుడు ’తప్పు’ కూడా అవుతుంటాయని వ్యాఖ్యానించారు. ‘ఐఎంఎఫ్ వృద్ధి అంచనాలన్నీ సాధారణంగా 80% మేర తప్పవుతుంటాయి. ఇక ప్రపంచ బ్యాంకు అంచనాలు 65% తప్పవుతుంటాయి‘ అని డౌన్గ్రేడ్లపై స్పందిస్తూ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. అయితే, మందగమనానికి కారణాల గురించి మండలి తప్పక పరిశీలిస్తుందని రాయ్ తెలిపారు. -
'అవరోధ రాజకీయాలు వద్దు'
ప్రతిపక్షాలకు అరుణ్‌జైట్లీ విజ్ఞప్తి ఉద్యోగాలు, మౌలికవసతులు, సంక్షేమానికే మరిన్ని విదేశీ పెట్టుబడులు న్యూఢిల్లీ: ఇప్పుడు దేశం వృద్ధి చెందడానికి చారిత్రక అవకాశం ఉందని.. జీడీపీ వృద్ధి రేటు వచ్చే ఏడాది 8 శాతాన్ని మించిపోయి, చైనాను కూడా అధిగమిస్తుందన్న అంచనాలు ఉన్నాయని.. ఈ పరిస్థితుల్లో విపక్షం అవరోధ పాత్ర పోషించరాదని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. భూసేకరణ బిల్లు (సవరణ), బొగ్గు బిల్లు, గనులు, ఖనిజాల బిల్లు వంటి కీలకమైన ఆర్థిక సంస్కరణల బిల్లులు రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉన్న నేపథ్యంలో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ముకుళిత హస్తాలతో విజ్ఞప్తి చేస్తున్నా.. అవరోధవాద రాజకీయాలను తరువాతి దశకు వెళ్లనీయకండి’ అని అన్నారు. మంగళవారం లోక్‌సభలో వినియోగ బిల్లుపై చర్చకు జైట్లీ సమాధానమిచ్చారు. అనంతరం ఈ బిల్లును మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. జైట్లీ ఏమన్నారంటే.. కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి నాలుగేళ్లలో 25 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించటంతో ప్రభుత్వం ధనిక అనుకూల ప్రభుత్వమన్న ఆరోపణలను ఆయన తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని గత యూపీఏ సర్కారులో నాటి ఆర్థికమంత్రి పి.చిదంబరం రూపొందించిన ప్రత్యక్ష పన్నుల నియమావళి నుంచే తీసుకున్నానన్నారు. మరిన్ని రంగాల్లోకి విదేశీ పెట్టుబడులను ఆహ్వానించేందుకు ప్రయత్నాలను సమర్థించుకుంటూ.. ఉద్యోగాల సృష్టి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమానికి చాలా నిధులు అవసరమని పేర్కొన్నారు. రెండేళ్ల బడ్జెట్లలో రూ. 1,70,000 మేర ఆదాయపన్ను చెల్లింపుదారుకు మినహాయింపు ఇచ్చామన, పెన్షన్‌లో రూ. 50,000 వరకూ పెట్టుబడుల పైనా పన్ను మినహాయింపు ఇచ్చామని తెలిపారు. నల్లధనంపై ఈ సమావేశాల్లోనే కొత్త చట్టాన్ని తీసుకువస్తామని చైప్పారు. సభలో 162 మంది మాట్లాడారని అయితే ఎవరూ అవినీతిపై మాట్లాడలేదన్నారు. బొగ్గు గనుల స్కాంలో మన్మోహన్‌సింగ్‌కు ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసిన అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ‘మనం పాఠాలు నేర్చుకోవాలి. మాజీ ప్రధానికి సమన్లు జారీ చేసే పరిస్థితి ఉండకూడద’న్నారు. పొడిగింపుపై నేడు నిర్ణయం కీలక బిల్లుల ఆమోదానికి సమయం లేకపోవడంతో పార్లమెంట్ బడ్జెట్ తొలి విడత సమావేశాలను పొడిగించాలా లేకపోతే షెడ్యూలు ప్రకారం ఈ నెల 20కే ముగించాలా అనే దానిపై పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ నేడు నిర్ణయం తీసుకోనుంది.