
రంజీట్రోఫీ 2024-25 సీజన్‌లో విదర్భతో సెమీఫైనల్‌కు ముందు ముంబై క్రికెట్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ గాయం కారణంగా సెమీస్‌కు దూరమయ్యాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. జైశ్వాల్ ఎడమ కాలి చీలమండ గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
ప్రాక్టీస్ సమయంలో తన కాలి చీలమండలో నొప్పి వచ్చినట్లు జైశ్వాల్ టీమ్ మెనెజ్‌మెంట్‌కు తెలియజేసినట్లు సమచారం. ఈ క్రమంలోనే అతడిని జట్టు నుంచి తప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడు తన గాయం నుంచి కోలుకునేందుకు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
కాగా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి జైశ్వాల్‌ను బీసీసీఐ రిలీజ్ చేయడంతో.. అతడిని ముంబై క్రికెట్ అసోషియేషన్ విధర్బతో సెమీస్‌కు ఎంపిక చేసింది. అంతలోనే గాయం కారణంగా జైశూ జట్టు నుంచి తప్పుకున్నాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి స్టాండ్ బై జాబితాలో మాత్రం జైశ్వాల్ ఉన్నాడు.
ఇప్పుడు అతడి స్ధానాన్ని మరోక క్రికెటర్‌తో బీసీసీఐ భర్తీ చేయనుంది. అయితే జైశ్వాల్ గాయపడడంతో ఈ ఐసీసీ ఈవెంట్‌లో భారత జట్టు బ్యాకప్ ఓపెనర్ లేకుండానే ఆడనుంది. ఒకవేళ రెగ్యూలర్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ గాయపడితే బీసీసీఐ ఎవరిని జట్టులోకి తీసుకుంటుందో చూడాలి.
కాగా జైశ్వాల్ గాయం తీవ్రతపై బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అప్‌డేట్ రాలేదు. ఇక ముంబై-విదర్భ మధ్య సెమీఫైనల్ మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా సోమవారం నుంచి ప్రారంభం కానుంది. యశస్వీ దూరం కావడంతో ముంబై ఇన్నింగ్స్‌ను ఆయుష్ మాత్రే, ఆకాష్ ఆనంద్ ఆరంభించనున్నారు.
జైశ్వాల్‌కు ఫస్ట్ క్లాస్‌క్రికెట్‌లో అద్బుతమైన రికార్డు ఉంది. 36 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో ఈ ముంబైకర్ 5 సెంచరీలతో సహా 3712 పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన చేయడంతో భారత జట్టులోకి యశస్వి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు భారత టెస్టు జట్టులో జైశ్వాల్ రెగ్యూలర్ ఓపెనర్‌గా కొనసాగుతున్నాడు.
చదవండి: WPL 2025: గెలుపు జోష్‌లో ఉన్న ఆర్సీబీకి బిగ్ షాక్..